మహాకాళి మాత్రమే పది కాళ్ళు, పది చేతులతో చిత్రించబడింది. మరి ఈ ఫోటోలో ఉన్నామె ఎవరు? ఆమె చేతులు ఎన్ని కనిపిస్తున్నాయి? ఏమిటి ఈ మాయాజాలం?
ఈ అద్భుతాన్ని చూపిస్తున్న డాన్స్ ఫోటోగ్రాఫర్ లోయిస్ గ్రీన్ ఫీల్డ్ dance photographer గా సుప్రసిద్ధులు.
సహజ సిద్ధమైన కదలికలను నిశ్చలన ప్రతిబింబాలుగా పట్టుకోవడంలో ఆమె నైపుణ్యం అపారం. నాట్యకారుల అద్భుతమైన నృత్య భంగిమల క్షణాలను తన కెమెరా ఫిల్మ్ లో బంధించ గలదు, ఆ కళాకారుల సృజనాత్మకతకు దీటైన సృజనాత్మకతను కనబరచగలదు. ‘ప్రతిబింబించు క్షణాలు ‘ అంటూ తాను తీసిన ప్రయోగాత్మక ఫోటోలను ఉన్నత స్తాయికి తీసుకొని వెళ్ళింది,
అలా రూపొందించిన వాటిలో వినూత్న ప్రయోగంలా ఎన్నో అద్దాలను వాడింది. ఆ అద్దాలు మన కర్షణీయంగా కనబడటమే కాకుండా, నేపథ్యంగా అవి మనల్ని సమ్మోహన పరుస్తాయి. ఆమె ఎంపికచేసిన మోడల్స్ అటూ ఇటూ కదులుతున్నప్పుడు, వాళ్ళ శరీరాలు వాటి ప్రతిబింబాలు కలిసి పోతూ, ఏది ఎక్కడ మొదలైందో ఏది ఎక్కడ ముగుస్తుందో తెలియనీయవు. అది ఆమె ఫోటోలకు ఒక అధివాస్తవికతను కల్పిస్తుంది.
‘నేను దేన్నీ ఉన్నదున్నట్లు చూపించాలని అనుకోను, నాది కవితాత్మకమైన దృశ్య భాష, నేను తీసే ఫోటోలు ఏ తర్కానికి లొంగవు. నా స్టుడియోలో నాట్యకత్తెల కదలికలను ఆశుకవిత్వంతో నేను తీసిన ఫోటోలలో చెబుతుంటాను. ముందుగా ఏమీ అనుకోను, ఒక ప్లాన్ వేసుకొని పని ప్రారంభించను. నేను తీసే ఫోటో ఎలా వుంటుందో ముందుగా నాకు తెలిసిపోతే, దాని ప్రయోజనం ఏముంది? అలాటి దాన్ని నేను తీయడం ఎందుకు? అది నా ఊహకు అందనిదై ఉండాలి, ఆ క్షణంలోని మిస్టరీని ఒడిసిపట్టాలి. అద్దాలు ప్రతిబింబించే రూపాలు అనేక కోణాలను కనబరుస్తాయి, అవి నా అధీనంలో వుండవు. అవో స్వాప్నిక లోకాన్ని సృష్టిస్తాయి, నా ఫోటోలలో కాలం ఆగిపోతుంది, వస్తువు శిలా రూపం దాల్చుతుంది, అలా బంధించే క్షణాలను మన మనోనేత్రంతో చూడాలి,’ అని అంటుందామె.
నిజమే! ఇలాటి ఫోటోలు నిస్సందేహంగా వైవిధ్యభరితంగా కనిపిస్తాయి, ఒక స్ప్లిట్ సెకండ్ వీటిలో శాశ్వతం పొందుతుంది , అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది, ఊహకు అతీతమైన అద్భుతాన్ని అందిస్తుంది.
*****