‘నేనూ – నా దేశం’ దరిశి చెంచయ్య గారి ఆత్మకథ
(11-02-24 న కాకినాడ జిల్లా ‘జగన్నాధగిరి గ్రామంలో జరిగిన ‘నేనూ – నా దేశం’పుస్తకావిష్కరణ సందర్భంగా చేసిన పుస్తక పరిచయ ప్రసంగం)
-పి. యస్. ప్రకాశరావు
గదర్ పార్టీ కోసం ఉత్సాహం, నాయక లక్షణాలు గల సైనికులు కావలెను.
పనిచేయు స్థలం – భారతదేశం
వేతనం – మరణం
బహుమానం- అమరత్వం
పెన్షన్ – స్వాతంత్రం.
గదర్ పార్టీ పత్రిక ‘హిందూస్తాన్ గదర్’ లోని ప్రకటన ఇది. ఈ ప్రకటన చూసి 1914-18 సంవత్సరాలలో 12 వేల మంది సభ్యులుగా చేరారు. “ బ్రిటిష్ వాళ్ళపై సాయుధ తిరుగుబాటు సాగించడానికి ఏర్పడినదే గదర్ పార్టీ. రహస్యం వెల్లడై ప్రభుత్వం అశ్విక దళసభ్యుల్నీ, ఇతర నాయకుల్నీ, కార్యకర్తలనూ కలిపి 91 మందిని ఉరితీసింది. 167 మందికి పైగా జీవిత ఖైదు విధించారు. తిరుగుబాటు విఫలమైంది” (పే. 246 బిపిన్ చంద్రపాల్, ఆధునిక భారత చరిత్ర) .
భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళపై విప్లవ సమరం సాగించడానికి కాలిఫోర్నియా యూనివర్సిటీలో కొంతమంది భారతీయ విద్యార్ధులు 1913 లో గదర్ పార్టీ స్థాపించారు.(‘గదర్’ అంటే సైనికులు తిరుగుబాటు చేసి, నూతన ప్రభుత్వ స్థాపనకై సాయుధ పోరాటాన్ని సాగించడమని అర్ధం.) 1914 లో మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభం కాగానే భారతీయ సైనికుల, స్థానిక విప్లవకారుల సహాయంతో తిరుగుబాటు లేవదీయడానికి ఆయుధాలనూ, మనుషులనూ పంపారు. వాళ్ళ ఖర్చుల కోసం వేలాది డాలర్లు విరాళాలుగా ముట్టాయి. 1915 ఫిబ్రవరి 15న పంజాబులో సాయుధ తిరుగుబాటు చెయ్యడా నికి నిశ్చయించారు. దురదృష్ట వశాత్తూ రహస్యం వెల్లడైంది. ప్రభుత్వం మేల్కొని తిరుగుబాటుకు సిద్ధమైన సేనలను రద్దుచేసింది. అశ్వికదళంలో 12 మందిని ఉరి తీశారు. నాయకుల్నీ కార్యకర్తల్నీ పెద్ద ఎత్తున అరెస్ట్ చేశారు. 42 మందిని ఉరి తీశారు. 114 మందికి యావజ్జీవ ఖైదు 93 మందికి దీర్ఘ కారాగార శిక్షలు విధించారు. తిరుగుబాటు విఫలమైంది (పే.246. బిపిన్ చంద్రపాల్. ఆధునిక భారత చరిత్ర)
ఆ గదర్ పార్టీ స్థాపకుల్లో ఒకరైన దర్శి చెంచయ్య గారు 1890లో నెల్లూరు జిల్లాలోని కనిగిరి అనే గ్రామంలో ఓ వైశ్య కుటుంబంలో పుట్టారు. రంగారావు అనే ఓ దుర్మార్గ తహసీల్దారుకి బ్రాహ్మణులు కూడా సలాములు కొట్టడం చూసి తానూ ఇంగ్లిష్ చదువుకుని అలాంటి ఉద్యోగం చేయాలనుకున్నారు. చదువుకునేటప్పుడే ఛాందస భావాలను ప్రశ్నించారు. తెలుగు పండితులు దేవీ పూజ చేసి కుంకుమ తెచ్చి “ దేవీ ప్రసాదం. నీ నొసటన పెట్టుకో! మెట్రిక్యులేషన్ ప్యాసవుతావు” అని బ్రతిమిలాడితే ‘భయపడేవాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. నాకు భయం లేదు. నా నమ్మకమే నన్ను పాసయ్యేలా చేస్తుంది’ అని నిరాకరించారు. చిత్రంగా 64 మంది పరీక్ష రాస్తే చెంచయ్యగారు మాత్రమే ఉత్తీర్ణుల వడంతో ఆయనకు స్వశక్తిపై నమ్మకం ఏర్పడింది. మెట్రిక్ పాసయ్యాక తండ్రి చని పోయారు. సముద్రుడిని దైవంగా భావించడం వల్ల ఆ రోజుల్లో విదేశీయానం అనగానే హిందువులు భయపడేవారు. తెగించి దేశం దాటి వెళ్ళిన వాళ్ళను కులం నుంచి వెలివేసేవారు. విదేశాల్లో చదవాలనే కోర్కెను బంధువులు వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందంటే మార్గమధ్యంలో చెంచయ్యగారి కాళ్ళు విరగ్గొట్టి ఆయన ప్రయాణాన్ని ఆపాలనుకున్నారు. కానీ వేమన చెప్పినట్టు ‘పట్టు విడుట కంటె పడి చచ్చుటే మేలు.. అనుకున్నారేమో! ఆయన పట్టుదల నెగ్గించుకుని 1912 లో అమెరికా చేరారు.
ప్రయాణంలో ఓడలో ఎదురైన అనుభవాలు ఆయనను ఆశ్చర్యానికి గురిచేశాయి. సీమ ప్రయాణంలో జపాను నావికులు నగ్నంగా డెక్కు మీద పచార్లు చేయడం, ఉక్కబో స్తుంటే జపాను స్త్రీలు బొడ్డుకు పైగా ఉన్న బట్టలన్నీ పూర్తిగా తీసేసి పురుషులతో మాట్లాడటం, వింతగా కనిపించింది గానీ ‘అమెరికాలో ఉన్నప్పుడు జిమ్ లో కసరత్తు చేసి వందలాది మంది ఒకేసారి నగ్నంగా షవర్ బాత్’ చేసేవాళ్ళం అంటారాయన. జపాన్ మీదుగా ప్రయాణిస్తూ అక్కడి స్త్రీల దుస్థితిని వివరించారు. జపానులో వేశ్యలు మాత్రమే ఉండే ‘యొషావరా ‘ అనే నగరభాగం ఉందనీ అక్కడప్రభుత్వమే ఇళ్ళు కట్టి వేశ్యలకు అద్దెకిస్తుందనీ, భర్త తన అప్పులు తీర్చుకోడానికి భార్యను కొంతకాలం యొషావరాకు అమ్మివేయడం , తండ్రులే కూతుళ్ళను పెళ్ళికి కట్నం సంపాదించుకోడానికి అక్కడికి పంపించడం వంటి ఆచారాలను వివరించారు. ‘అతిథి ఇంటికివస్తే భర్త ఇంటి ఆడదానిని అతనితో జతకట్టడానికి పంపించేవాడు’అని తాపీధర్మారావుగారు ” పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు ” లో చెప్పిన ఆచారం ఆ రోజుల్లో జపాన్ లో ఉందట. భాగ్యవంతుడైన అతిధి వచ్చినపుడు గృహస్థు తనభార్యను ఆ రాత్రికి అతిథి దగ్గరకు పంపే సంప్రదాయం ఉందని చెప్పారు. ముందు ముందు స్త్రీల పడుపువృత్తి నిర్మూలనకు కృషి చేయడానికి ఈ అనుభవం ఆయనకు ఉపయోగపడి ఉంటుంది.
కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఉన్న భారతీయ విద్యార్ధులతో కలిసి 1913లో భారతీయ విప్లవకారుడు హరదయాళ్ నాయకత్వంలో గదర్ పార్టీ, ప్రజానీకం మాట్లాడే భాషల్లో గదర్ పత్రిక స్థాపించారు. 1914 లో మొదటి ప్రప్రంచయుద్ధం ప్రారంభమయ్యాక రంగంలోకి దిగారు. విప్లవ శిక్షణలో భాగంగా’ టెరరిజం’ పద్ధతినీ, గొరిల్లా యుద్ధవిధానం, కత్తిసాము, కుస్తీ, బాక్సింగ్,తుపాకీలు కాల్చడం, తూటాలు చేయడం నేర్చుకున్నారు. గదరు పార్టీలో పనిచేసే రోజుల్లో పోలీసులు, మిలిటరీ, సీ ఐ డీలు, జైలు అధికారులు ఆయన్ని చిత్ర హింసలు పెట్టినపుడు ఈ యుద్ధవిద్యలు ఆ హింసను తట్టుకోడానికి పనికొచ్చాయి. చెంచయ్యగారు జైలర్ల మీద తిరగబడేవారు. బెంగాల్ జైల్లో “ మా రికార్డు అట్టల మీద ‘ చాలా దౌర్జన్యం చేస్తాడు’ అని ఎర్ర సిరాతో పెద్ద అక్షరాలతో వ్రాశారు” అన్నారాయన. ఏ జైలుకెళ్ళినా అధికార్లు భయపడేవాళ్ళు . కన్ననూరులో ఖైదీగా ఉన్నప్పుడు వాళ్ళు చేసే అవమానాలను భరించలేక జైలరును ‘కాలితో నడుం మీద తన్నారు. కుక్కిన పేనులా పడి ఉంటాడనుకున్న వాడు గోడకు కొట్టిన బంతిలా ఎదురు తిరిగేసరికి జైలు అధికారులు సహించలేకపోయారు . ప్రతీకారంగా వార్దర్లు ‘చెంచయ్య చచ్చిపోయాడేమో?’ అనుకునేంతగా చావబాదారు. వివస్త్రుడిని చేసి ఒక రోజు తాగు నీరు లేకుండా చేశారు.
పనిష్మెంట్ లో భాగంగా తరచూ ఆయన్ని జైళ్ళకు మార్చేవారు.అయినా కించిత్ కూడా చలించలేదాయన “ ఒక జైలు నుంచి మరొక జైలుకు మార్చడం నాకు చాలా ఇష్టం. ఇండియా అంతా చూడవచ్చు” (పే.155) అన్నారు. బ్యాంకాక్, సింగపూర్ , కలకత్తాలాహోర్ఢిల్లీ, కన్ననూర్, కోయంబత్తూర్ జైళ్ళలో శిక్ష అనుభవించారు. ఏ జైలుకి వెళ్ళినా ‘జైలరుని తన్నింది నువ్వేనా? ‘ అని అడిగి అక్కడి జైలు అధికారులు కాస్త మర్యాదగా ప్రవర్తించేవారు. సూపర్నెంట్ పది పదిహేను అడుగుల దూరంలో నిలబడే వాడు . లాఠీ దెబ్బలూ బూట్ల తాపులూ సర్వసాధారణం.సింగపూరు మిలిటరీ జైలులో ఆరునెలల ఏకాంతవాసం (సాలిటరీ ఇంప్రిజన్మెంట్ ) కారణంగా ‘మ్యూకస్ కోలైటిస్’ అనే నరాల వ్యాధి వచ్చి క్రానిక్ అయింది.అనారోగ్యం పాలయ్యారు.ఆ సమస్యలు ఆయన్ని జీవితాంతం వెంటాడాయి. “ భోజనానికి కూర్చున్నపుడు మూడు నాలుగు రకాల మాత్రలు వేసుకున్నారు “ అని శతజయంతి స్మృతులలో ఆయన సన్నిహితుడు గుర్తు చేసుకు న్నాడు. జైలు శిక్షలు అనుభవిస్తూనే పంజాబీ ,ఉరుదూ ,అరబ్బీ , తమిళం ,కన్నడం , మలయాళం భాషలు నేర్చుకున్నారు.. చివరకు ‘ మా గదర్పార్టీ వారి ఆలోచనలో చాలా లోపాలున్నాయి ‘( పే.187) అన్నారు. సాయుధ విప్లవంలో నమ్మకంగల దేశభక్తులు కూడా గాంధీ మార్గాన్ని అనుసరించడంతో తన అభిప్రాయాలకనువైన వాతావరణం లేకపోవడంతో రాజకీయాలకు దూరమయ్యారు. 1919 డిసెంబర్ లో విడుదలై కుట్రలూ హింసలూ దౌర్జన్యాలూ చంపుకోవడాలూ సాయుధ పోరాటాలూ ఉరిశిక్షలూ అండమాన్లతో కూడిన గదర్ పార్టీ ప్రపంచం నుంచి గాంధీ మార్గంలోకి అడుగు పెట్టారు. కానీ బ్రిటిష్ సామ్రాజ్యంతో సంబంధం లేని పూర్ణ స్వరాజ్యమా? లేక బ్రిటిష్ సామ్రాజ్యంలో అదివరకే ఉన్న అధినివేశరాజ్యాల్లాగా (dominion status) అసంపూర్ణ స్వరాజ్యమా ? అనే సందిగ్ధ పరిస్థితిలో గాంధీజీ రెండోదాన్నే సమర్ధించినపుడు చాలా కలవరపడ్డారు.
1920 – 1935 మధ్య రాజకీయంగా పనిచేయకపోవడంతో చెంచయ్య గారిలో నిరాశా నిస్పృహలు ఆవరించినా 1935 లో ఆయన జీవితం మలుపు తిరిగింది. ఆయన కుటుంబ సభ్యులందరికీ కాంగ్రెస్ ఉద్యమంతో సంబంధాలేర్పడ్డాయి.
కొన్నాళ్ళపాటు స్వదేశంలో ఆయనకు ఉదరపోషణ ఓ గడ్డు సమస్య అయింది. ఒక రొట్టె, కుళాయి నీళ్ళతో కొన్నాళ్ళు గడిపారు. మద్రాసులో ‘న్యూ ఇండియా’ దినపత్రికలో వచ్చిన ఉద్యోగానికి ‘అనీబిసెంట్ గాంధీజీని విమర్శిస్తున్న కారణంగా స్వస్తి చెప్పారు. ఆర్ధిక బాధలు తట్టుకోలేక బ్రిటిష్ వారి ‘ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ’ లో ఉద్యోగంలో విదేశీ వస్తు బహిష్కరణ జరిగేటప్పుడు ఆ కంపెనీలో ఉద్యోగం సమంజసం కాదని రాజీనామా చేశారు. ఆ విధంగా బ్రతుకు తెరువుకోసం 1920 నుంచి 1940 ల మధ్య ఏడు ఉద్యోగాలుచేసి ఆ పరిస్థితులతో రాజీ పడలేక రాజీనామాలు చేశారు. కొంచం నిలదొక్కుకున్నాక మద్రాస్ లో ‘బీడీ కార్మికసంఘం’ చుట్టల కార్మిక సంఘం స్థాపించారు. మద్రాస్ లోని స్పెన్సర్ కంపెనీ కార్మికుల సమ్మెలోనూ పారిశుధ్య కార్మికుల సమ్మెలోనూ క్రియాశీలక పాత్ర పోషించారు.ప్రకాశంగారి ‘స్వరాజ్య’ పత్రిక కష్టాలలో ఉంటే చెంచయ్య గారు ఆర్ధికంగా సాయపడ్డారు.
కమ్యూనిస్టుల ప్రభావం, మార్క్సిస్టు సాహిత్యం చెంచయ్య గారిని కమ్యూనిస్టుగా తీర్చి దిద్దాయి “ ఉమ్మడిగా కమ్యూనిస్టులు జీవించడమనేది నన్ను బాగా ఆకర్షించింది” ( పే.360) అన్నారు. జైలులో ఉండగా సైబీరియా నుంచి తప్పించుకు వచ్చిన ట్రాట్ స్కీ అనే రష్యన్ విప్లవకారుడి ఉపన్యాసం, ఇటలీ స్వాతంత్రోద్యమ నాయకుడు మాజినీ రాసిన ‘మానవుని బాధ్యతలు’ ఆయనకు స్ఫూర్తినిచ్చాయి. “జైలులో కాంగ్రెస్ నాయకులు రాజకీయ గ్రంధాలను చదవరు.” … “ కమ్యూనిస్టులు క్లాసులు పెట్టుకుని, రాజకీయాలను చక్కగా చదువుతూ చర్చించుకుంటుండేవారు” (పే.359 ) అన్నారు. ప్రొఫెసర్ రంగాగారు జైలుకు రాగానే మార్క్స్ కాపిటల్ బోధించమని అడిగితే తాను మార్క్స్ అభిప్రాయాలతో ఆయన ఏకీభవించలేనన్నారు. డా. కే.బీ. కృష్ణగారు జైలుకి వచ్చినపుడు కాపిటల్ బోధిస్తుంటే అదే రంగాగారు విద్యార్ధిగా చేరడం విశేషం. ‘జైలులో కాంగ్రెస్ నాయకులు కొంత మంది కమ్యూనిస్టులుగా మారిపోసాగారు’ అన్నారు. 1935లో డాక్టర్ షెర్ వుడ్ యడ్డీ సోవియట్ రష్యా గురించి రాసిన గ్రంధం చదివి ‘సొంత ఆస్తి పోతే తప్ప సంఘం బాగుపడదనే’ నిర్ణయానికి వచ్చారు. 1936 లో విశాఖపట్నంలో ఉండగా, కాశీ విశ్వ విద్యాలయం వదిలిపెట్టి విశాఖలో మెడికల్ కాలేజీ విద్యార్ధిగా చేరిన చండ్ర రాజేశ్వరరావు గారి దగ్గర ఫ్రెడరిక్ ఎంగెల్స్ రచన ‘యాంటీ డహరింగ్’ పాఠాలను విన్నారు.“రష్యాలో మాదిరి సోషలిస్టు ప్రభుత్వం మనదేశంలో కూడా ఏర్పడినప్పుడే మన ప్రజానీకం సుఖంగానూ, సంస్కరంతోనూ జీవించగలుగుతారు” అని భావించారు.( పే.338) 1940లో తనూ తనభార్యా భారత కమ్యూనిస్టు పార్టీలో చేరారు.“ వారు( చెంచయ్య) గదరు ఉద్యమ విప్లవానుభావాలతో మమ్మలనందరినీ ఎంతో ఉత్సాహ పరిచేవారు” అన్నారు ప్రముఖ కమ్యూనిస్టు యోధులు చండ్ర రాజేశ్వరరావుగారు.
వాడుక భాషను వ్యతిరేకించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ కట్టమంచి రామలింగారెడ్డిగారు కమ్యూనిస్టు సాహిత్యాన్ని తనబంగాళాలోని బీరువాలో పెట్టేసి తాళం వేసేశారు. సన్నికల్లు దాచేస్తే పెళ్ళి ఆగిపోదుకదా! చెంచయ్యగారి అధ్యయనానికి ఆటంకం ఏర్పడలేదు. నాటి కమ్యూనిస్టు డా.కొమర్రాజు అచ్చమాంబ గారు నిషేధ సాహిత్యాన్ని చెంచయ్యగారి ఇంట్లోనే భద్రపరిచేవారు. అది ఈయనకు ఉపకరించి ఉంటుంది. మద్రాసులో కార్మిక సంఘాలతో పనిచేసేటప్పుడు కమ్యూనిస్టు నాయకుడు ఘాటే’ బ్రిటిష్ ప్రభుత్వంతో మనకు పోరాటం, అరెస్టులు, జైళ్ళూ తప్పవు. నువ్వేం చేయదలిచావు? అని ప్రశ్నిస్తే ‘ నా భార్య ఇంటిని చూసుకోవాలి. నేను పార్టీ పనులు చేయ డానికి సిద్ధం’ అన్నారు. డిటెన్షన్ క్యాంపులో నిరాహార దీక్ష జరిగినపుడు చెంచయ్యగారి వయసు రీత్యా ఆయన్ని మినహాయిస్తే ‘ తాను చనిపోతే వీరమరణం ‘ అవుతుందని వాదించి బలవంతంగా దీక్షలో పాల్గొన్నారు.1946-47 సం.లో అభ్యుదయ రచయితల మహా సభ చెంచయ్య గారి ఇంట్లోనే జరిగింది. కమ్యూనిస్టులపై ప్రజలలో సదభిప్రాయం ఏర్పడింది. ఆంధ్రస్త్రీల మహా సభలో ‘ కూతుళ్ళను కమ్యూనిస్టు యువకులకిచ్చి వివాహం చేయడం వాస్తవమేనా? అనే తమాషా ప్రశ్న తలెత్తినపుడు “ అనుభవంలో కమ్యూనిస్టు యువకులే మంచి అల్లుళ్ళుగా ప్రవర్తించుతున్నరండీ!” అని జవాబిచ్చిం దట ఓ వృద్ధురాలు. చెంచయ్యగారు మా భూమి సీతారామరాజు బుర్రకతలను ప్రశంసిం చారు. “గాంధీగారి హత్య జరిగినపుడు ఆర్.ఎస్.ఎస్. వాలంటీర్లలో ఎంతమాత్రం అలజడి కనిపించలేదు”(పే.435) అనడం గమనించదగిన విషయం. “ విశేషమేమంటేవ్యక్తి ఎంత గొప్పవాడైనా, కమ్యూనిస్టు పార్టీలో జయాపజయాలు, కార్యసాధన ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండవు” (పే. 453) అనేది ఆయన అనుభవాన్ని తెలియజేస్తోంది.
చెంచయ్యగారు కందుకూరి వీరేశలింగంగారి పుస్తకాల ప్రభావంతో సంఘ సంస్కర్తగా మారారు.హేతువాద భావాలు బలపడ్డాయి. విదేశీ ప్రయాణం చేసినందుకు బంధుమిత్రులు ప్రాయశ్చిత్తం చేయించాలని ప్రయత్నిస్తే తిరస్కరించి నన్ను కులంలో చేర్చుకోనక్కర్లేదని నిర్ద్వంద్వంగా చెప్పారు. హరిజనోద్దరణ, పడుపువృత్తి నిర్మూలన, రజస్వలానంతర వివాహాలూ, వితంతు వివాహాలూ చేయించడం, అనాధ శిశుసంరక్షణ శాల నిర్వహణ, స్త్రీ విద్య, ఉచిత పఠన మందిరాలు.. ఇలా సంఘసంస్కరణోద్యమంలో ఆయన చేపట్టని రంగం లేదని చెప్పవచ్చు. స్త్రీ విద్య విషయంలో చెంచయ్యగారు ముందు ఇంటగెలిచాక రచ్చ గెలవాలనుకున్నారు.1925 లోనే తన చెల్లెలు సుబ్బమ్మను ఉన్నత విద్యవరకూ చదివించారు. భార్యతో కలిసి హరిజనుల దేవాలయ ప్రవేశోద్యమం, సహపంక్తి భోజనం కార్యక్రమాల్లో పాల్గొన్నారు.బ్రహ్మసమాజంలో సభ్యులయ్యారు. హరిజనులతో సహపంక్తిభోజనాల ఏర్పాటుకి కృషిచేశారు. ఆ భోజనాల గురించి ఉన్నవ లక్ష్మీనారాయణ గారు చెప్పిన విషయాన్ని ఆయన ఉటంకించారు. “ హిందూ సంఘంలో కులాల మధ్య భోజన విషయంలో ఉన్నంత పట్టింపు కామానికి కూడా లేదనీ, ఒక కులం వారు మరొక కులం వారితో కలసి బిడ్డలను కన్నప్పుడు కూడా రహస్యంగానైనా భోజనాలు కలిసి చేయ్యలేదనీ, సహపంక్తి భోజనాలు ప్రజామోదమైనప్పుడు వర్ణాంతర వివాహాలు కూడా జరుగుతాయనీ, ఆ తరువాత కులాలు నశించి పోతాయనీ చెప్పారు” (పే.24)
మద్రాస్ లో వితంతు శరణాలయాన్ని స్థాపించారు. గర్భవతులైన వితంతువులు శిశువులనుకని పారేస్తున్నారని తెలుసుకుని అలాంటి స్త్రీలు రహస్యంగా ప్రసవించే ఏర్పాటు చేసి శిశువులను సంతానం లేనివారికి ఇచ్చేవారు. ఒక వితంతు వివాహం అడ్డుకోవాలని వరుణ్ణి దాచిపెట్టిన వైశ్యకుల పెద్దను “ నాలుగున్నర సంవత్సరాలపాటు ఏడు జైళ్ళలో గడిపాను. జైలరునే తన్నాను. … ఆలోచించుకో” అని బెదిరించి అతన్ని దారికి తెచ్చి ఆ పెళ్ళి చేశారు. ఆయన గుంటూరు బ్రాడీపేటలో ఉన్నరోజుల్లో ఆయన ఇంటి గోడమీద” వెధవ ముండల పెళ్ళిళ్ళు చేయించే దరిశి చెంచయ్య గారి ఇల్లు ఇదే ” అని రాశారంటే ఆయన ఉద్యమ కార్యకలాపాల గురించి అర్ధం చేసుకోవచ్చు. 1948 లో వీరేశలింగం గారి శతవార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మ సామాజికులలో ఉత్సాహం కనిపించలేదని నొచ్చుకున్నారు. ఆయన శిష్యులలో నియోగి వైదిక తగాదాలు, బ్రాహ్మణ అబ్రాహ్మణ విబేధాలు చూసి విచారించారు. 1951లో మద్రాసులో ‘ఇంటింటి విజ్ఞానమాల’ అనే సంస్థను స్థాపించారు. ఆడపిల్లల చదువు పెళ్ళిళ్ళ విషయంలో ఆనాడే ఆయన ఉన్నతంగా ఆలోచించేవారు. “ ఆడపిల్లల్ని చదువుకోమంటాము. కోరి ఇష్టం వచ్చిన వాడిని పెళ్ళి చేసుకోమంటాము. కానీ, చివరకు మనమే ప్రేమించి, వాడిని పెళ్ళి చేసుకో మంటే ఎలాగయ్యా” అనేవారు. ‘ మనం ప్రేమించి, పిల్లలకు పెళ్ళి చెయ్యడం’ అనే పదబంధం నాకెంతో నచ్చింది. దానిని ఏదో నవలలో వాడుకున్నా..’ అన్నారు అభ్యుదయ రచయిత మహీధర.
తన మిత్రుడు నంబూరి శ్రీనివాసరావు జైల్లో ఉంటేచెంచయ్యగారు అతని సోదరి పరిపూర్ణను తన ఇంట్లో ఉంచుకుని చదివించారు. “ఆమె అసాధారణ శక్తి గల వ్యక్తి” అని ప్రశంసించారు. (ఇది ముమ్మాటికీ నిజం. పరిపూర్ణగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. నాటక, చలనచిత్ర నటి, ప్లే బాక్ సింగర్, వామపక్ష భావజాలం గల రచయిత్రి. ఈ ఏడాది [2022] ఆగష్టు 27న ఆమె ఆత్మకథ ‘ ఒకదీపం వేయి వెలుగులు’ ప్రచురితమైంది) “మా ఇంట్లో వివిధ కులాల వాళ్లం వున్నాం. నాదొక కులం. నా భార్యది మరొకటి. నా బిడ్డలు కులమతా లతో సంబంధం లేకుండా పెరిగారు. వంటకత్తెది మరొక కులం అని వివరించి ‘నా భార్య పినతల్లిగారిది వైదిక బ్రాహ్మణ కులం. ఆమె మా ఇంటికి వచ్చినపుడు నా భార్య సుభద్రమ్మ తన పినతల్లితో, “ఈ పరిపూర్ణ నా బిడ్డ. మిగతా బిడ్డలెలాగో ఈ బిడ్డ కూడా నాకు అలాగే. ఈ బిడ్డతో కలసి భోంచేయటానికి ఒప్పుకోవాలి లేదా హోటలు నుంచి తెప్పించుతాను. వేరే భోంచెయ్యా, ”లని కచ్చితంగా చెప్పింది.( పే.321)
వేశ్యవృత్తి నవలంబించిన వారిని ఆ రోజుల్లో ‘భోగం వాళ్ళు’ అని సంబోధించేవారు. చెంచయ్యగారు వారికి ‘కళావంతులు’ అనే పేరుపెట్టి ఓ సంఘం స్థాపించి వివాహాలు చెయ్యాలనుకున్నారు. (పే.12,గదర్ వీరుడు దరిశిచెంచయ్య శతజయంతి ప్రత్యేక సంచిక) “కళావంతులకు వివాహాలు చేయించడం సులభమనుకుంటిరా!”అనే విమర్శలను పెడచెవిని పెట్టారు. ‘ఈ ఉద్యమంలో సంగీత సాహిత్యాలలో ప్రవీణురాలైన శ్రీమతి యామినీ పూర్ణతిలకగారి సహకారం అద్వితీయమైనది’ అని ఆమెపేరుతో రాసిన ప్రత్యేక వ్యాసంలో ఆమెను ప్రశంసించారు. (‘శ్రీమతి యామినీ పూర్ణ తిలక’ అనే వ్యాసం) ఈ ఉద్యమంలో చెంచయ్య గారు ఒక చేదు అనుభవం గురించి చెప్పారు. బెజవాడ రామతిలకం అనే సినీతారకు యుక్తవయసు వచ్చాక ఆమె పెళ్ళి చేయమని కోరింది. తల్లిదండ్రులు ఆమెను వ్యభిచార వృత్తిలోకి దింపాలని చేసే ప్రయత్నాలను చెంచయ్య గారు అడ్డుకున్నారు. ఆమె తల్లి “ తల్లిదండ్రులము ముసలివాళ్ళమైనాము. ఇక రామతిలకమే మమ్ములను పోషించాలి. లేదా ఆమెను పెళ్ళి చేసుకున్నవారైనా మాకు నెలకు 30 రూపాయలు మనో వర్తి ఇవ్వాలని చెప్పింది” (పే.221). చెంచయ్యగారికి ఓటమి తప్పలేదు.ఈ అనుభవంతోనే ” సోషలిజం ఏర్పడిన సంఘంలో మాత్రమే స్త్రీ తనదేహాన్నీ మానాన్నీ అమ్ముకుని జీవించాల్సినపరిస్థితులు తొలగిపోతాయంటారు. ఎంత వరకూ అవకాశాలున్నాయో అంతవరకూ స్త్రీలను చదివించాలి. వారు ఆర్ధికంగా తమ స్వార్జితం మీద ఆధారపడాలి ‘ అంటారు. “స్త్రీలు పురుషులతో సమాన హక్కులు కలిగి సుఖించే అవకాశం సోవియట్ రష్యాలో మాత్రమే ఉన్నట్టు చదివి, తెలుసుకోవడమే నేను కమ్యూనిస్టుగా మారిపోవుటకు ముఖ్య కారణమనుకుంటాను” అన్నారు. ( పే.300)
సంఘసంస్కరణలో చెంచయ్యగారి కుటుంబ సభ్యుల పాత్ర తక్కువేమీ కాదు. ఇంటిల్లిపాదీ ఖద్దరు వస్త్రాలనే ధరించారు. ఆయన కాకినాడ కాంగ్రెస్ మహా సభ(1923-24 )లో పాల్గొంటే ఆయన మొదటి భార్య అన్నపూర్ణమ్మ వాలంటీర్ గా పనిచేసింది. ఆమె 1931లో మరణిస్తే “ మరపురాని అన్నపూర్ణ’ అనే పుస్తకం రాశారు .తరువాత సుభద్రమ్మ గారిని రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకూడా సంఘసంస్కరణలో పాలు పంచు కుంది. ‘ నా సుభద్రను గురించి రాయక తప్పదు’ అనడం ఆయన తన భార్యకిచ్చిన స్థానాన్ని తెలుపుతోంది. సుభద్రమగారు , బాల వితంతువైన ఎనిమిదేళ్ళ తన పినతల్లికి జుట్టు తీయించాలని పెద్దలు చేసిన ప్రయత్నాలను విద్యార్ధిదశలోనే అడ్డుకున్నారు. హైదరాబాదులో బాలికల కోసం ఎలిమెంటరీ స్కూల్ స్థాపనకు కృషిచేశారు. పాతికేళ్ళ వయసులోనే మద్రాసులో అఖిల భారత మహిళా మహాసభలో కార్యనిర్వాహక సభ్యురాలిగా బాధ్యత నిర్వహించారు. బహుభార్యల నిషేధం, విడాకుల హక్కు వంటి విషయాలపై ప్రచారం చేశారు. ‘లేడీ వెల్లింగ్టన్ కాలేజీలో లెక్చరర్ గా చేరమని ప్రిన్సిపాల్ కోరితే ‘ మా గాంధీజీని నిర్బంధించిన ప్రభుత్వం క్రింద నౌకరీ చేయనని’(శతజయంతి సంచిక నుండి) తిరస్కరించారు. తొలితరం వైద్యురాలైన డా.ముత్తులక్ష్మీరెడ్డిగారితో కలిసి మాంటిసోరీ స్కూళ్ళ స్థాపనకు పాటుపడ్డారు. మాతా శిశువుల ఆరోగ్యం గురించి దుర్గాబాయి దేశ్ ముఖ్ నిర్వహించే ‘ఆంద్రమహిళ’ మాస పత్రికలో రెండేళ్ళ పాటు వ్యాసాలు రాశారు. అవి 1956 లో ‘తల్లి – బిడ్డ’ అనే పేరుతో పుస్తకరూపంలో వెలువడ్డాయి. “మధ్యయుగంనాటి ఆచారవ్యవహారాలు, అజ్ఞానం, అవిద్య ఇంకనూ అంతమొంద లేదు. అందువల్ల నే విద్యావిజ్ఞానాల్లోఏవిధంగా మనదేశం వెనకబడివున్నదో అదేరీతిగా ప్రసూతిపద్దతిలో కూడా వెనకబడివున్నది.” ( పే.15. ‘తల్లి- బిడ్డ) అన్నారు. ఫ్రెడరిక్ ఎంగెల్స్ రాసిన Socialism Utopian and Scientific పుస్తకాన్ని అనువదిస్తే మహీధర రామమోహనరావుగారు విశ్వసాహిత్యమాల తరుపున ప్రచురించారు. అలాగే ‘యాంటీ డూరింగ్’ గ్రంధంలోని “ సోషలిజము- చారిత్రకము- శాస్త్రీయమూ’ అనే భాగాలను తెలుగులోకి అనువదించారు. దీన్ని ప్రభుత్వం నిషేధించింది.
సకల మానవాళి విముక్తీ సోషలిజంలోనే ఉందని నమ్మిన చెంచయ్యగారు తన వైశ్య కులాన్ని ఉద్ధరించాలని, ‘ వైశ్యకులంలో జయించితే క్రమంగా కమ్మ, రెడ్డి, కంసాలి, నాయుడు, బ్రాహ్మణ మొదలైన కుటుంబాల్లో జయించడం సులభం’ అని భావించడం మనకు కొంత విడ్డూరంగానే కనిపిస్తుంది కానీ దానికి ఆయన చెప్పిన కారణాలు సమంజ సంగానే కనిపిస్తాయి. “ఇండియాలో అన్ని కులాల్లాగే వైశ్య కులంకూడా వైదిక బ్రాహ్మణు ల ఆధిపత్యం కింద అణగిమణగి ఉండేది”( పే.225) “ఇతర కులాలన్నింటికి వైశ్యులే కొంచెం లోకువగా ఉండేవారు”“బ్రాహ్మణులు, కాపులు, ముసల్మానులు, కొంచెం ధైర్యశాలురు. వైశ్యులు మాత్రం ఎక్కువ భయస్తులు” అనే నమ్మకం ప్రబలంగా ఉండేది. ఈ కారణంగా చెంచయ్య గారిని చిన్న చూపు చూసేవారు. చివరకు గదర్ పార్టీ సభ్యుడే చెంచయ్య గురించి “ వాడు కోమటి. అంతకంటే పిరికిజాతి ఇండియాలోనే కాదు. పృథ్విలోనే లేదోయ్” ( పే.81) అని హేళన చేశాడు. సింగపూరు జైల్లో ఒక ఆఫీసరు “ నీవు కోమటివి కదా! ప్రపంచమంతటిలోకీ పిరికి సన్నాసులు. తెల్లవాళ్ళను చంపడమే! ” అంటాడు వెకిలిగా.( పే.121) “ కొల్లాయి గట్టితేనేమి/ మా గాంధి కోమటై పుట్టితేనేమి” అనే పాటలోని నీచత్వం తట్టని ప్రజలకి గాంధీగారి మీది అభిమానం మీద ఎవరికీ గౌరవం ఉంటుంది? “ అని చలంగారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు.(పే. 386మ్యూజింగ్స్) ఆటంకాలెదురైనా, కులం నుంచి వెలివేస్తామని బెదిరించినా చెంచయ్యగారు వైశ్యులలో సంఘసంస్కరణకు పూనుకున్నారు. వితంతువివాహాలు జరిపించారు. మొదట రాళ్ళు విసిరిన సాంప్రదాయ కులస్తులే చివరకు ఆయనపై పూలు విసిరారు. ‘కోమటి పిరికి’ అనే సామెత నిజం కాదని నిరూపించడానికి తాలింఖానా స్థాపించారు.
” నేను కమ్యూనిస్టు పార్టీలో సుమారు పది సంవత్సరాలున్నా వాస్తవంగా కమ్యూనిస్టుని కాలేకపోయాను. కమ్యూనిస్టు అనదగినవాడువర్గపోరాటాన్ని నమ్మడమే కాక నిత్యజీవితంలో కార్యరూపేణా ఆ తత్వం కనబర్చాలి.నాలో జాలి, దయ, దాక్షిణ్యాలు ఉన్నవేగానీ పెట్టుబడిదారీ వర్గాన్ని నాశనం చేయడానికి అవసరమైనంత ద్వేషం మాత్రం కలగలేదు ” అని ఆత్మపరిశీలన చేసుకున్నారు .
చెంచయ్య గారి ఆత్మకథ 478 పేజీలు కావడానికి కారణం లేకపోలేదు. ఆయన బాల్యం నాటి సాంఘిక విషయాలను కట్టె కొట్టె తెచ్చె అన్నట్టు తేల్చేసి గదర్ వీరుల గురించి చెప్పే సందర్భంలో వ్యక్తుల గురించి చెప్పి ఊరుకోకుండా వారి పుట్టుపూర్వోత్తరా లాన్నీ అలవాట్లనూఏకరువు పెడతారు. ఉదాహరణకు ‘గదర్ పార్టీ స్థాపనలో హరదయాళ్ ది ప్రముఖ పాత్ర’ అని ఊరుకోకుండా ఆయనగురించి, ఆయనకు స్ఫూర్తినిచ్చిన శ్యాంజీ కృష్ణవర్మ జితేంద్రనాధ లాహిరి వంటి ఉద్యమకారుల గురించి, జైలు అనుభవాలనూ సుదీర్ఘంగానే చెప్పారు. ఈ పుస్తకం పీఠికలో నార్ల అన్నట్టు ‘ అనవసరంగా పెంచి రాశారు’.
చివరిగా చెంచయ్యగారు తన పరిస్థితిని వివరించారు. ‘వ్యాధులు తీవ్రమయ్యాయి. ఆర్ధికంగా కష్టాలు వచ్చాయి. మా కూతుళ్ళ చదువులు క్షీణించాయి. “1948 అక్టోబరు 19 వ తేదీన కమ్యూనిస్టు పార్టీనుండి, రాజకీయాలనుండి విరమించుకోవలసి వచ్చింది.’ అన్నారు.( పే.452) “ ప్రపంచ వాంగ్మయం నుండి ఒక వంద ఉత్కృష్ట గ్రంధాలు తెలుగు లోకి తర్జుమా చేయించాలని కలలు గన్నారు.‘నేను కోరిన ప్రజా ప్రభుత్వం ఇంకా ఏర్పడ లేదు కానీ నా జీవితకాలంలో ఏర్పడుతుందనే నమ్మకం నాకు ఇప్పటికీ దృఢంగానే ఉంది’ అనే ఆశాభావంతో చెంచయ్యగారు 1951 సెప్టెంబరు 30వ తేదీన తన ఆత్మకథను ముగించారు. గదర్ పార్టీలో తనకు యుద్ధవిద్య నేర్పి, ఎంతోమందిపై వచ్చిన ఆరోపణలను తనమీద వేసుకుని వారిని కాపాడి ధైర్యంగా ఉరికంబం ఎక్కిన బలవంత సింగ్ కి ఈ ఆత్మకథను అంకితమిచ్చిన చెంచయ్యగారు 1964 లో తన74వ ఏట మరణిం చారు. సమాజం బాగుపడాలని చిత్తశుద్ధిగా నమ్మినవాళ్ళంతా చదవాల్సిన పుస్తకం దర్శి చెంచయ్యగారి ‘నేనూ – నా దేశం ‘
***
రిఫరెన్స్ :
1. ఆధునిక భారత చరిత్ర , బిపిన్ చంద్ర.
2. గదర్ వీరుడు దరిశి చెంచయ్య ‘శతజయంత్యుత్సవ ప్రత్యెక సంచిక 1990
3. ‘తల్లి – బిడ్డ’ దరిశి సుభద్రమ్మ . ఆడర్శమండలి, విజయవాడ.
4. యామినీ పూర్వ తిలక వ్యాసం. దరిశి చెంచయ్య . అక్షర. అభినందన. నవంబర్ 2005
*****
పి యస్ ప్రకాశరావు రిటైర్డ్ టీచర్, కాకినాడ.
M. phil : దాశరధి రంగాచారయ నవల ‘ మోదుగు పూలు – ఒక పరిశీలన ’.
P.hd : ‘నూరేళ్ళ పంట’ (వందమంది రచయిత్రుల కథా సంకలనం)
రచనలు :
1. లేడీ డాక్టర్ (కవితారావు గారి ఇంగ్లీష్ పుస్తకానికి పరిచయం) డా. చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ
రామచంద్రపురం ప్రచురణ
2. గురజాడమాట – ప్రగతికి బాట JVV కాకినాడ ప్రచురణ
3. తొలి పార్లమెంట్ లో డా. చెలికాని రామారావు ( వేరొకరితో కలిసి ఇంగ్లిష్ నుంచి అనువాదం)
4. డా. చెలికాని రామరావు జీవన రేఖలు ( వేరొకరితో కలిసి రచన )
ప్రజాసాహితి, విశాలాంధ్ర, ఆంధ్రజ్యోతి, తెలుగు వెలుగు (మాసపత్రిక), దారిదీపం పత్రికలలో వ్యాసాలు,
సోషల్ మీడియాలో :
మక్సిం గోర్కీ, ఎంగెల్స్, ఆర్వీయార్, రంగనాయకమ్మ, రావిశాస్త్రి, ఆవంత్స సోమసుందర్, వీరేశ లింగం ఆరుద్ర, రాంభట్ల, శ్రీ శ్రీ రావు కృష్ణారావు, రారా, తిరుమల రామచంద్ర, మహీధర నళినీ మోహన్, కొ. కు, గిడుగు, శ్రీపాద, దర్శి చెంచయ్య అబ్రహం కోవూర్, తాపీ ధర్మారావు, సుందరయ్య, ఆలూరి భుజంగరావు, జవహర్లాల్
నెహ్రూ, పెరుమాళ్ మురుగన్, గాంధీ, అప్పలనాయుడు , డి. ఆర్ ఇంద్ర, అబే దుబాయ్ ‘ హిందూ మేనర్స్ అండ్ కస్టమ్స్’ (పుస్తకం నుండి కొన్ని వ్యాసాల అనువాదం) టాల్ స్టాయ్ మొదలైన రచయిత్ల పుస్తకాల పై సమీక్షలు.