“ది మెమరీ పోలీస్”- జపాను రచయిత్రి “యోకో ఒగావా” నవలపై సమీక్ష

-సునీత పొత్తూరి

         

          జపాన్, దక్షిణ కొరియా వంటి తూర్పు ఆసియా దేశాల సాహిత్యం పట్ల ఈ మధ్య ఎక్కువగా యూత్ ప్రభావితం అవుతున్నారని తోస్తోంది. జపనీస్, కొరియన్ భాషలు నేర్చుకోవడం, ఇంక అక్కడి సంగీతం అయితే మరీను – యూత్ అంతా అమితంగా ఇష్ట పడుతున్నారు.

          ఈ పుస్తకం నాకు చదవమని ఇచ్చినది అండర్ గ్రాడ్యుయేషన్ లో ఉన్న నా మేనకోడలు. తను జపనీస్ కూడా నేర్చుకుంది.

          ఈ పుస్తక విషయానికి వస్తే, జపాను దేశపు రచయిత్రి “యోకో ఒగావా”- రాసిన నవల The Memory Police. జపాన్ లో అత్యుత్తమ సాహితీ పురస్కారం పొందిన నవల. ఈ పుస్తకాన్ని Stephen Snyder 2019 లో ఆంగ్లభాషలోకి అనువదించాక, అంతర్జాతీయంగా అనేక ప్రశంశలు లభించడంతో బాటు, Booker Prize కి షార్ట్ లిస్ట్ అయిందిట. అనువాదం చాలా బాగుంది. పదును గా వుండి చకచకా చదివింప చేస్తుంది.

          “Long ago, before you were born, there were many more things here,” my mother used to tell me when I was still a child. “Transparent things, fragrant things… fluttery ones, bright ones… wonderful things you can’t possibly imagine.

          “It’s a shame that the people who live here haven’t been able to hold such marvelous things in their hearts and minds, but that’s just the way it is on this island.

          “Things go on disappearing. one by one. It won’t be long now,” she added. “You’ll see for your self. Something will disappear from your life.”

          “Is it scary?” I asked her, suddenly anxious.

          “No, don’t worry. It doesn’t hurt, and you won’t even be particularly sad. One morning you’ll simply wake up and it will be over, before you’ve even realized. Lying still, eyes closed, ears pricked, trying to sense the flow of the morning air, you’ll feel that something has changed from the night before, and you’ll know that you’ve lost something, that something has been dis- appeared from the island.”

          ఇది ప్రొటగనిస్టు అయిన రచయిత్రికి, శిల్ప కళాకారిణి అయిన ఆమె తల్లికీ మధ్య జరిగిన సంభాషణ. రచయిత్రి అయిన ఈ నవలా కథానాయిక- ఫస్ట్ పర్సన్ లో చెప్పుకొచ్చిన కథ ఇది.

          అది ఒక పేరు లేని ద్వీపం(island). అక్కడ నివసించే వారంతా మూకుమ్మడిగా చిత్ర విచిత్రమైన పరిస్థితులలో తమ ముందే చాలా వస్తువులు మాయమవడం చూసి విభ్రమ చెందుతారు. కథారంభంలోనే మాయమైన వస్తువులు ఏమిటో.. వాటి రంగు, రూపం వాసనలను కూడా మరచి పోయిన సంగతి ఆమె తలచుకుంటుంది.

          పక్షులు, పూలతో పాటు, కొన్ని సువాసనలు మాయం అవుతాయి- వాటితో పాటు పుస్తకాలు, టోపీలు వంటివి కూడా అదృశ్యం అవుతాయి- ఇంకా వాటికి సంబంధించి జ్ఞాపకాలూ మాయమవడం ఓ వింత అనుభవం. వీటి అమలుకు నిఘా పోలీసు ఉంటారు. ఆర్వెల్ 1984 నవలలో Thought Police లా. ఈ మెమరీ పోలీస్ అదృశ్యం అయిన వాటి జ్ఞాపకాలు ఏమన్నా మిగిలి ఉంటే వెతికి స్వాధీనం చేసుకుని ధ్వంసం చేస్తూంటారు.

          రచయిత్రి తండ్రి ornithologist- తల్లి శిల్ప కళాకారిణి. ఆమె తండ్రి చనిపోతాడు. తల్లి నిఘా పోలీస్ కి చిక్కకుండా ఎటో వెళ్ళిపోతుంది. ఆమెలాగే ఆ దీవిలో మేథావులంతా కనిపించకుండా రహస్య జీవితం గడుపుతూ ఉంటారు. అయాన్ రాండ్ రాసిన Atals Shrugged లో మేథావుల అదృశ్యం కావడం గుర్తుకొచ్చింది.

          ఈ పరిస్థితులలో రచయిత్రి అయిన కథానాయిక( ప్రొటగోనిస్ట్) తన పుస్తకాల ఎడిటర్, పబ్లిషర్ అయిన ‘R’ ని మెమరీ పోలీస్ కంటపడకుండా తన ఇంట్లో రహస్యంగా దాస్తుంది. ఇందుకు ఒక ముసలి అతను తోడ్పడతాడు. అతను ఒకప్పుడు ఆ ద్వీపం నుండి బయట రాకపోకల కోసం ఫెర్రీ నడిపేవాడు. ఇప్పుడు అయిలాండ్ నుంచి బయటకు వెళ్ళడం నిషేధించిన కారణంగా అది మూతపడింది. అలా అతను జీవనోపాధిని పోగుట్టుకున్నా.. ఎలాగో జీవితం వెళ్ళబుచ్చుతూ అంతో ఇంతో మానసిక దృఢత్వం నిలుపుకున్నవాడు.

          అలా.. కాలం గడ్డుగా గడుస్తుండగా.. వాతావరణం కూడా మంచు గడ్డకట్టినట్టు, చలికాలం అంతం అవడం అనేదే ఉండదు. జనాలు కూడా అలా అలవాటు పడిపో యారు. పుస్తకాల మీద కూడా నిషేధం. మెమరీ పోలిస్ పర్యవేక్షణలో పుస్తకాలను పోగుపెట్టి నగరం నడి మధ్యలో తగల పెడతారు..రచయిత్రి, ముసలి అతను కలసి తమ వంతుగా ఓ చిన్న బండిలో పుస్తకాలను వేసుకుని వెళ్ళి తగలబెట్టే కార్యక్రమంలో పాలు పంచుకుంటారు.. అదీ, మెమరి పోలీస్ కి అనుమానం రాకుండా కొన్నిటిని దాచాకే. ఉన్నట్టుండి సునామీ- భూకంపం వస్తుంది. చాలా ఇళ్ళు కూలిపోతాయి. కొద్దిపాటి డామేజ్ తో రచయిత్రి ఇల్లు నిలుస్తుంది. ముసలి అతను కూడా ఇక్కడకే వచ్చి తలదాచు కుంటాడు. కాని ఓనాడు అకస్మాత్తుగా మరణిస్తాడు.

          ఈ నేపథ్యంలో రచయిత్రి ఒక నవలను రాస్తూ ఉంటుంది. టైప్ రైటర్ – కీ లోనే రచయిత్రి తన ‘గొంతు’ (voice) వినిపించగలదు. టైప్ రైటర్ కి రిపేర్ వస్తుంది. దాంతో బాటూ రచయిత్రి గొంతూ మూతపడినట్లే. అలా ప్రతీకాత్మకంగా నిర్వీర్యం అయిన సృజన గురించి రాస్తుంది.

          ఇక్కడ అదృశ్యం అయే వాటిలో మనుషుల శరీర భాగాలూ వుంటాయి- గొంతు మాత్రమే వినిపిస్తూ దేహాలు మాయం అవడం.. ఆఖరికి ఆ గొంతూ పోతూండగా, ఇక ‘R’ వంటి మేథావులంతా స్వేచ్ఛగా బయటకు రావచ్చనీ చెబుతుంది రచయిత్రి.
అవాస్తవికంగానూ, అసంబద్దంగాను అనిపించే ఈ నవల అంతా ఒకలాటి బిగుతైన విషాద వాతావరణంలో నడుస్తుంది- -Kafkaesque సిట్యుయేషన్ అంటారు అలా.

          డిస్టోపియా నవలలు, సినిమాలు మనకు కొత్త కాదు. రాజకీయ, సామాజిక, వైజ్ఞానిక అంశాల పైన వ్యంగ్యాత్మకంగాను, ముందస్తు హెచ్చరికగాను ఉంటాయీ రచనలు.
జార్జి ఆర్వెల్ రాసిన 1984 నవల అందుకు ఒక ఉదాహరణ. ఈ నవల కూడా అదే కోవకు చెందుతుంది. ఎటువంటి పరిణామాలను ఆర్వెల్ ఊహించి రాశారూ అని- 1949 లో రాసిన 1984 నవలను నేను చాలామంది లా 1984 ప్రాంతాలలో చదివాను. అప్పట్లోనే రష్యన్లు చదివి ఇక్కడి పరిస్థితులు చూసినట్లు ఎలా రాయగలిగాడో రచయిత అని అశ్చర్య పడ్డారట. ఇదిగో మళ్ళీ ఇప్పుడీ పుస్తకాన్ని చదువుతుంటే అదే గుర్తుకు వచ్చింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.