దేవి చౌధురాణి

(మొదటి భాగం)

మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ

తెనుగు సేత – విద్యార్థి

          అక్కడ ఫూల్మణి బందిపోట్ల భయంతో పులి వెంటాడుతున్న లేడిలాగా వేగంగా పరిగెత్తసాగింది. ఫూల్మణికి ముందు దుర్లబ్ అంతకంటే వేగంగా పరిగెడుతున్నాడు. ఫూల్మణిదుర్లబ్ నాకోసం ఆగు, నన్ను వదిలి వెళ్ళమాకుఅంటూ కేకలు పెట్టటం మొదలు పెట్టింది. దుర్లబ్అమ్మో నన్ను బందిపోట్లు పట్టుకుంటారుఅని గొణు క్కుంటూ, ధోతీ వదులై పోతుంటే, ఎగలాక్కుంటూ పరిగెత్తుతున్నాడు. ఒక చెప్పు వూడిపోయింది, అయినా ఆగకుండా, ముళ్ళుగుచ్చుకుంటున్నా బురద గుంటల దగ్గర కాళ్ళు జారుతున్నా ఆగకుండా పరిగెత్తాడు. ఫూల్మణి ఇంక పరిగెత్తలేక, “ఒరే నీచుడా, ఒక ఆడదాన్ని అడివిలోకి తీసుకువచ్చి, సిగ్గులేకుండా వదిలేసి పారిపోతావాఅంటూ తిట్ల దండకం మొదలుపెట్టింది. దుర్లబ్, “హమ్మయ్యా, దీన్ని బందిపోట్లు పట్టుకున్నారులే, ఇంక నా వెంట అంత తొందరగా రారుఅనుకుంటూ పారిపోయాడు.

          ఫూల్మణి ఏడుస్తూ దుర్లబ్ తల్లిదండ్రులనీ, తాత ముత్తాతలని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి తిట్టి అలసిపోయింది. ఇంతలో తన దగ్గరకు ఎవరూ బందిపోటులు రాలేదని అర్థమయ్యింది. ఏడుపు ఆపి, దారి వెతుక్కుని అడవి నుండి బయటపడి తన ఇంటి దారి పట్టింది.

          ఫూల్మణి ఇంటికి చేరుకునేటప్పటికి, వాళ్ళ అక్క అలోక్మణి స్నానం చేస్తున్నది. ఫూల్మణి చప్పుడు చేయకుండా ఒక మంచం మీదకు చేరుకుని నిద్రపోయింది. అలోక్మణి స్నానం ముగించుకుని కాసేపటికి నిద్రపోతున్న ఫూల్మణిని చూసి, నిద్ర లేపి, “ఏమయ్యావే, కనబడలేదూ, ఎక్కడకి పోయావ్అన్నది.

          “ఎక్కడికి పోతాను, ఇక్కడే వున్నానుగాఅంటూ బొంకింది ఫూల్మణి.

          “ బ్రాహ్మల ఇంటిలో రాత్రి పూటడుకుని, తెల్లవారు ఝాముకి ఇంటికి వచ్చే దానివి కదా, ఉదయం కనబడలేదు. ఇవ్వాళ ఏమైంది?” అని అడిగింది.

          “నేను తెల్లవారే రావటం చూడలేదాఅన్నది ఫుల్మణి.

          “లేదు, ఎక్కడా. నాకే భయమేసి బ్రాహ్మల ఇంటికి వెళ్ళి వచ్చా. ఎవరూ లేరు ఎక్కడాఅన్నది అలోక్మణి.

          “ష్, అక్కా, అక్కడ అసలు ఏం జరిగుతున్నదో ఏమో, అర్థం కావటం లేదుఅన్నది ఫూల్మణి

          “అసలేమయ్యిందే?”

          “ష్, ష్, అక్కా, మనమా మాములు మనుష్యలం, బ్రాహ్మల ఇళ్ళలో ఏం జరుగు తాయో మనకేం తెలుస్తాయి? దెయ్యాలకీ దేవుళ్ళకీ పూజలు చేసేది వాళ్ళే కదాఅన్నది ఫుల్మణి.

          “ఓరి దేముడో, ప్రఫుల్ల ఏం చేసిందే?”

          “ప్రఫుల్ల వెళ్ళిపోయింది.” 

          “అమ్మోయ్, ప్రఫుల్ల ఎంత పని చేసింది?” అన్నది అలోక్మణి.

          “ప్చ్, అసలు ప్రఫుల్ల ఇంకా బ్రతికే వుందా లేదా అనేది అర్థం కావటంలేదుఅన్నది ఫూల్మణి.

          “అసలేమంటున్నావే నువ్వూ?”

          “ఫూల్మణిని వాళ్ళ అమ్మ దెయ్యమై తీసుకుపోయింది కదా!” 

          “అసలేం జరిగిందో చెప్పవే.”

          “‌ష్ష్, అక్కా, ఎవరితోనూ అనమాకే, అసలేం జరిగిందంటే, అర్థరాత్రి ఉన్నట్టుండి పెద్ద గాలి, తలుపులు కొట్టుకుంటున్నాయి. నాకు మెలుకువ వచ్చి చూస్తే, ప్రఫుల్ల తల్లి వచ్చి ప్రఫుల్ల మంచం ప్రక్కన కూర్చునుంది. నెమ్మదిగా ప్రఫుల్లను ఎత్తుకు వెళ్ళి పోయింది. ప్రఫుల్ల తల్లి దెయ్యమో, దేవతో అయ్యి వచ్చిందా అనిపించింది. నాకేమో దెయ్యాలంటే భయం కదా, అందుకని పారిపోయి వచ్చి ఇక్కడ పడుకున్నా.” అని గొప్ప కథ అల్లి చెప్పింది ఫూల్మణి. చివరకు ఎవరితోనూ చెప్పవద్దని వాళ్ళక్కను హెచ్చ రించిది

          ఇంత మంచి కథను అలోక్మణి దాచుకుంటుందా! ఎవరితోనూ చెప్పవద్దని ఇంకో ఇద్దరు ఆడవాళ్ళకి గుసగుసలాడింది. వాళ్ళు ఇంకో  నలుగురికీ చెప్పారు. కొంత సేపటికి ఊరంతా విషయం పాకి ఎవరకి తోచిన విధంగా వాళ్ళు ప్రఫుల్లని వాళ్ళ అమ్మ వచ్చి ఎత్తుకుపోయిన కథను చెప్పుకున్నారు.  

***

          ఆ తరువాత రోజు తెల్లవారు ఝామున ప్రఫుల్లకు మెలుకువ వచ్చి ఆలోచనలో పడింది. “ఇప్పుడు ఏమి చెయ్యటం? ఎక్కడకి వెళ్ళటం? ఇక్కడే ఉందామంటే, అడివి పూర్తిగా నిర్మానుష్యం, ఎలా వుండాలి? సరే ఇంటికి వెళ్ళితే? అక్కడ కూడా ఒంటరిదాన్నే కదా, మళ్ళీ ఎత్తుకుపోటానికి దుండగులు రారనేమిటి? నిధిని ఎలా తీసుకువెళ్ళటం? కూలీలను పెట్టుకుని నిధి మోయించుకు వెళ్ళితే, కూలీలలో ఎవరో ఒకరు దొంగల ముఠాలతో కుమ్మక్కవ్వరనేమిటి? అసలు ఎవరిని నమ్మాలి? నిధి కోసం తనను చంపరనేమిటీ?” 

          ప్రఫుల్ల చివరకు ఏదైతే అదే అయ్యింది, అడివిలోనే ఉండటానికి నిశ్చయించు కుంది. అయినా తన చుట్టూ మనుష్యులున్న గ్రామం దుర్గాపూరు నుంచే తనని ఎత్తుకు పోయినప్పుడు, అక్కడ మాత్రం భద్రత ఎక్కడ? ఇక్కడ అడవి అయినా అంతే. అయితే పేదరికంతో జీవించడం మాత్రం కాదనకుంది

          అడవిలోని పాడుబడ్డ భవంతిలోనే ఉందామనుకుని నిశ్చయించుకున్న తరువాత ప్రఫుల్ల మనసు కొంత కుదటబడింది. ఒక గది శుభ్రం చేసింది. గోశాల కూడా శుభ్రం చేసి ఆవు, దూడలకి కొంత గడ్డి వేసింది. వచ్చి వంట చేద్దామని మొదలుబెడితే బియ్యం కానీ కూరగాయలు కాని ఏమీ కనబడలేదు. ఒక బంగారు మొహరీ తీసుకుని సంతకు వెళ్ళి వెచ్చాలు తెచ్చుకోవటానికి నిశ్చయించుకుంది.  

          ఏ దారిలో వెళ్ళాలి? అసలు సంత ఎక్కడ వుందో తెలవదు. అంతకు ముందు కనబడిన కాలిబాటలో వెళ్ళసాగింది. దట్టమైన అడవి, సన్నని కాలిబాట. కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక బ్రాహ్మడు కనిపించాడు. యువకుడే, మంచి ఛాయ, గుండు మీద పిలక, మెళ్ళో రుద్రాక్షలు, నుదుట పంగనామాలు. ఆశ్చర్యంగా ప్రఫుల్లను చూస్తూమాతా, ఎక్కడికి వెళ్తున్నావు?” అన్నాడు.

          “సంతకు

          “సంతకు వెళ్ళటానికి దారి తీసుకున్నావా?”

          “మరి దారి తీసుకోవాలి?”

          “ఎక్కడి నుంచి వస్తున్నావు?”

          “అడవిలో నుండి

          “నీ నివాసం అక్కడేనా

          “అవును

          “మరి ఇక్కడ అడవిలో నివాసం అయితే, సంతకు దారి తెలువదా?”

          “నేను ఇక్కడకు కొత్తగా వచ్చాను

          “ మధ్య కాలంలో అడవిలో కొత్తగా నివాసానికి వచ్చిన వారెవరూ నాకు తెలువదే! ఎవరు తీసుకువచ్చారు నిన్ను ఇక్కడికి?”

          “సంతకు దారి చెపుతారా

          “సంత ఇక్కడకు ఒక పూట నడక దూరంలో వుంది. వెళ్ళి రావటానికి ఒక రోజు పడుతుంది. దారి కూడా విపత్కరమైనది. నీతో తోడు రావటానికి ఎవరన్నా వున్నారా?”

          “ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే

          ఆ బ్రాహ్మడు ప్రఫుల్లను పరిశీలనగా చూసి, అమ్మాయి ధైర్యం కలదీ, తెలివైనది లాగా కనబడుతున్నది. కానీ, ఏదో విషయం వుంది, తరువాత తెలుసుకోవచ్చు అనుకుని, “మాతా, ఇప్పుడు సంతకు బయలుదేరితే, అడవి దారిలో ఆపదలకు చిక్కుకుంటావు. ఇక్కడకి దగ్గరలోనే నాకు ఒక చిన్న దుకాణం వుంది. నీకు ఇష్టమైతే అక్కడే పప్పులూ బియ్యం కొనుక్కుని వెళ్దువు కానీఅన్నాడు.

          ప్రఫుల్లఅలాగే, కానీ మీరు చూడబోతే బ్రాహ్మణుడి లాగా వున్నారు, దుకాణం అంటున్నారు?” అన్నది.

          “మాతా, బ్రాహ్మణులలో కూడా రకాలు ఉంటారు కదాఅన్నాడు.

          ప్రఫుల్ల అడవి దారిలో బ్రాహ్మణుడి వెంట నడవసాగింది. భయమేసింది, వెంటనే అసలు అడవి అంటే ఎందుకు భయపడాలని అనుకున్నది.

          ఆ బ్రాహ్మణుడి కుటీరం దగ్గరలోనే వుంది. బ్రాహ్మణుడు తాళం తీసి తలుపు తెరిస్తే అక్కడ దుకాణం ఏమీ కనబడలేదు. కానీ అక్కడ ఉన్న పెద్ద పెద్ద పాత్రలలో బియ్యం, పప్పూ ఉప్పులూ, నూనె ఉన్నాయి. “మాతా నీకు కావల్సినవి తీసుకో అన్నాడు“. ప్రఫుల్ల కొన్ని సరుకులు తీసుకునిఎంతఅని అడిగింది

          “ఒక అణా

          “ఒక అణా నా దగ్గర లేదేఅన్నది ప్రఫుల్ల.

          “రూపాయి ఉంటే ఇవ్వు చిల్లర ఇస్తాఅన్నాడు బ్రాహ్మణుడు.

          “రూపాయి కూడా లేదు

          “మరి సంతకు దేనితో వెళదామనుకున్నావు?”

          “నా దగ్గర మొహిరీ వుంది

          “అవునా! ఏది చూపించు

          ప్రఫుల్ల బంగారు మొహిరీ చూపించింది. బ్రాహ్మణుడు మొహిరీని పరిశీలించి, “తల్లీ మొహిరీకి సరిపడా చిల్లర చెల్లించడానికి నా దగ్గర సరిపడా డబ్బు లేదు. పద, నీతో పాటు నీ ఇంటికి వస్తా, అక్కడ ఒక అణా ఇద్దువు కానీఅన్నాడు.

          “ఇంటి దగ్గర కూడా చిల్లర లేదుఅన్నది ప్రఫుల్ల.

          “అయితే నీ దగ్గర అన్నీ బంగారు మొహిరీలే ఉన్నాయనమాట. సరే పద, వచ్చి మీ ఇంటి దగ్గర దిగబెడతాను. నీ దగ్గర చిల్లర ఉన్నప్పుడు ఇద్దువుగానీలే”.

          ‘అయితే నీ దగ్గర అన్నీ బంగారు మొహిరీలే ఉన్నాయనమాటఅని బ్రాహ్మడు అనటం ప్రఫుల్లకు వెంటనే అనుమానం రేకెత్తించింది. బ్రాహ్మడు తను ఎక్కడ వుంటున్నాడో కనుక్కుని మొహరీలు దొంగలించటానికి పన్నాగం పన్నుతున్నాడు అనుకున్నది. తను తీసుకున్న పచారీలన్నీ అక్కడే పెట్టేసినేను సంతకే వెళ్దామని నిశ్చయించుకున్నాను, బట్టలు కూడా కొనుక్కోవాలిఅన్నది ప్రఫుల్ల

          బ్రాహ్మడు గట్టిగా నవ్వి, “నీ ఇల్లు ఎక్కడో తెలుసుకుని నీ బంగారం ఎత్తుకుపోతానని అనుకుంటున్నావా? నువ్వు సంతకు వెళ్ళితే మాత్రం నీ ఇల్లు ఎక్కడుందో కనిపెట్ట లేననుకుంటున్నావా?” అని అడిగాడు.

          ప్రఫుల్ల వొళ్ళు జలదరించింది.

          బ్రాహ్మడు మళ్ళీ సరే, నీతో ఏమరుపు మాటలు మాట్లాడను. నేను బందిపోటుల నాయకుడను. నా పేరు భవానీ పాఠక్అన్నాడు.

          ఆ పేరు వినగానే ప్రఫుల్లకి ఊపిరి ఆగినంత పని అయ్యింది. నోట మాట రాలేదు. ఒక శిలా విగ్రహంలాగా నిలబడిపోయింది. భవానీ పాఠక్ పేరు తన ఊరు దుర్గాపూరంలో కూడా మారు మ్రోగుతున్నది. పేరు వినబడగానే బరేంద్ర భూమి మొత్తం భయంతో కంపించుతుంది.

          “నమ్మకం లేకపోతే ఇది చూడుఅంటూ ఒక చిన్న నగారా (డప్పు) తీసుకుని లయగా మోగించాడు. ఉన్నట్టుండి జమాజేట్టీలు వంటి ఒక యాభై మంది యువకులు ప్రత్యక్షమైసర్దార్, ఎందుకు పిలిచావు? ఆజ్ఞాపించుఅన్నారు.

          “ అమ్మాయిని చూసి సరిగ్గా గుర్తు పెట్టుకోండి. నేను ఈవిడనుమాతాఅని సంబోధించాను. మీరు కూడా మాతా అని సంబోధించండి. మీ స్వంత తల్లి లాగానే పరిగణించండి, అలానే ప్రవర్తించండి. ఇక వెళ్ళండిఅన్నాడు. బందిపోట్లు ఎలా ప్రత్యక్షమయ్యారో, అడవిలోకి అలాగే అంతర్ధానమయ్యారు

          ప్రఫుల్ల ఆశ్చర్యంతో అలాగే చూస్తూ నిలబడింది. ఇక వీళ్ళను నమ్మటం తప్ప తను చెయ్యగలిగిందేమీ లేదని అర్థమయ్యింది. క్రింద పెట్టిన వెచ్చాల మూటలు పట్టుకుని, “పదండి, నా నివాసం చూపెడతానుఅన్నది

          తను ముందు నడుస్తుంటే భవానీ పాఠక్ వెంట నడిచాడు. పాడుబడ్డ భవంతి చేరుకున్నాక ప్రఫుల్ల సరుకుల మూటలు క్రిందకు బెట్టి భవానీ పాఠక్‌ను కూర్చోబెట్టింది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.