నడక దారిలో-47

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ:-
       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజు గారికి కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం. మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, మా బాబు అనారోగ్యంతో చనిపోయాడు. ఆంధ్రమహిళాసభలో బియ్యీడీ కాలేజి పూర్తిచేసి, ఆర్టీసి హైస్కూల్ లో చేరాను. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ చేసారు. కొంత అనారోగ్యం. విజయవంతంగా నా ఎమ్మెస్సీ పూర్తిచేసాను. అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్ జరగటం, Y2K సంచలనం. కవయిత్రుల సంకలనం ‘ముద్ర ‘ సంపాదకత్వం. పల్లవికి పాప జన్మించటంతో  అమెరికా వెళ్ళి వచ్చాము. తర్వాత—)

***

          స్కూల్ తెరిచిన రోజు యథావిధిగా స్కూలుకు వెళ్ళాను. అప్పట్లో లేండ్ లైన్లు ఫోన్లే కనుక కబుర్లన్నీ స్కూల్స్ తెరిచినప్పుడే. బాగా ఆత్మీయ మిత్రులు మాత్రమే అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం.
 
          వచ్చిన రోజే మా హెచ్చెమ్ ” సుభద్రా నీకు ఇన్కమ్ టాక్స్ అయిదువేల పైన పడింది. నేను కట్టేసాను. నువ్వు నాకు ఇవ్వాలి” అంది. నాకు వచ్చే జీతం కనీసం పదిహేను వేలు కూడా లేదు. ఎప్పుడు టాక్స్ బ్రాకెట్ లోకి రానిది ఈ సారి రావటమేంటి . ఆశ్చర్యం వేసింది అదే అడిగాను. అంతే కాక ఎల్ ఐసీ కట్టిన రసీదులు కూడా ఇచ్చాను కదా. అని అన్నాను.
 
          ” అమెరికా వెళ్ళొచ్చావు కదా. విదేశాలకు వెళ్ళిన వాళ్ళకి పడుతుంది” వెటకారం పెదాలు చివర మెరుస్తుంది. కంఠంలో అసూయ కూడా కదిలింది. ఆమె తప్ప మరెవ్వరూ వెళ్ళటం భరించలేనితనానికి ఆశ్చర్యం కాదు అసహ్యం కలిగింది. నేనేమీ మాట్లాడ కుండా వెళ్ళిపోయాను.
 
          మాటిమాటికీ తాను కట్టిన ఇన్కమ్ టాక్స్ గుర్తు చేస్తుండటంతో అయిదు వేలు తీసుకెళ్ళి ఆమెకు ఇచ్చేసి బ్రాహ్మణికి దానం చేసాను అనుకున్నాను. నాకు బదులుగా నేను స్కూల్లో చేర్చిన కల్పనని నేనే జీతం ఇస్తూ మరికొన్నాళ్ళు కంటిన్యూ చేసాను.
మూడేళ్ళ క్రితం చనిపోయిన పెద్ద మరిది రెండవ కూతురు మళయాళీనాయర్ల అబ్బాయిని ప్రేమించానని చెప్పటంతో పెళ్ళి ఏర్పాట్లు మొదలయ్యాయి. అమ్మాయికి పెళ్ళి బట్టలు, కొద్దిపాటి బంగారం,పెళ్ళి భోజనాల ఖర్చు మేము భరించేలా నిర్ణయించు కున్నాము. మళయాళీ పద్ధతిలోనే పెళ్ళి జరిగింది. నా తరపున పెద్దక్క వాళ్ళూ వచ్చారు. ఒక బాధ్యత తీరినట్లే. సర్వే ఆఫ్ ఇండియాలో పెద్దమ్మాయికి ఇంకా వాళ్ళ నాన్న వుద్యోగం సేంక్షన్ కాలేదు. మూడో అమ్మాయిని మల్కాజిగిరిలోని కస్తూర్బా కాలేజీలో బీకాంలో నేనే దగ్గరుండి చేర్పించాను.
 
          వీర్రాజు గారు వచన కవిత్వంలో రాస్తున్న ఆత్మకథను పూర్తిచేసి “పడుగు పేకల మధ్య జీవితం ” పేరుతో పుస్తకం వేసారు. డా.భార్గవీరావు, ఆమె సహోద్యోగి డా.పోపూరి జయలక్ష్మి గారూ ఇద్దరూ కలిసి నా ” యుద్ధం ఒక గుండె కోత” ను ఇంగ్లీష్ లోకి అనువదించడానికి పూనుకున్నారు. ఏవైనా సందేహాలు వేస్తే ఫోన్ లో నివృత్తి చేసుకొని మరీ చేయటం మొదలెట్టారు.
 
          పల్లవి మామగారికి ఆంజియో ప్లాష్టీ ఆపరేషన్ చేయించుకొవాలని హైదరాబాద్ వచ్చారు. భార్యాభర్తలు ఇద్దరూ మా ఇంట్లోనే దిగారు. ఆయన చెల్లెలు ఏ.ఎస్ రావు నగర్లో వుంటుంది. కానీ నిమ్స్ కి వెళ్ళటానికి మా ఇల్లైతే వీలుగా వుంటుందని వచ్చారు. ముందు చెకప్ కోసం వాళ్ళిద్దరితో వీర్రాజు గారు వెళ్ళారు. మర్నాడు నిమ్స్ లో జాయిన్ అవుతే అన్ని టెస్టులకు చేయాలన్నారు. వాళ్ళిద్దర్నీ వీర్రాజు గారు చేర్పించి వచ్చారు. ఆపరేషన్ రోజు నేను కూడా స్కూల్ కి సెలవు పెట్టి వెళ్ళాను.
 
          తర్వాత వారంరోజులు. హాస్పిటల్ లోనే వున్నారు. రోజూ సాయంత్రం వీర్రాజు గారితో పాటూ నేనూ వెళ్ళే దాన్ని. అప్పట్లో హాస్పిటల్ లో రోగికి గానీ, సహాయకులకు గానీ భోజనం సదుపాయాలు వుండేవి కాదు. అందువలన ఉదయం కూడా వీర్రాజు గారు టిఫిన్ తీసుకుని వెళ్ళేవారు. తర్వాత వారానికి రివ్యూ చెకప్ కి రమ్మనటంతో మళ్ళీ మా ఇంటికే వచ్చి చెకప్ అయ్యాక చెల్లెలింటికి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుని విజయనగరం వెళ్ళిపోయారు. దాంతో వాళ్ళు ఉన్నన్ని రోజులూ తీరిక లేనట్లు అయ్యింది.
 
          అప్పట్లోనే పల్లవి వాళ్ళు ఇక్కడ ఫ్లాట్ కొనబోతున్నట్లు తెలిసి ఇక్కడెందుకు కొనటం అని విసుక్కున్నారు. అది గమనించి వీర్రాజుగారు కూడా మనమే ఇక్కడ కొనిపించుతున్నామని పల్లవి మామగారు భావిస్తున్నారు ఏమో అని బాధ పడ్డారు. నా ప్రమోషన్ పేపర్లు పంపారు కానీ ఫైల్ సమగ్రంగా లేదనో ఏవో ఆటంకాలు కలిగిస్తున్నట్లు తెలిసింది. స్కూల్లో కూడా నాకు పోటీగా కొత్తగా జాయిన్ అయిన సోషల్ సార్ నీ, నా స్నేహితురాలు ఉమారాణీని ఆ పోష్టు తమకు రావాలని నాపైకి ఎగసిన తోయడానికి మా హెచ్చెమ్ ప్రయత్నం చేస్తూనే వుంది‌. కాని నేను అందులో తలదూర్చకుండా నా పనేదో నేను మౌనంగా చేసుకుంటూ పోయేదాన్ని.
 
          వీర్రాజు గారూ, బాలాజీ ప్రెస్ బాల ప్రసాద్ పల్లవి వాళ్ళ కోసం సరూర్ నగర్ లో కొన్న అపార్ట్మెంట్ లో పాలరాతి ఫ్లోరింగ్ వుడ్ వర్క్ దగ్గరుండి పర్యవేక్షించే వారు. మెయిన్ ద్వారం తలుపును తీసేసి మా ఇంటికి చేసిన సిద్ధిరాములుతో కార్వింగ్ చేయించడానికి ఇచ్చారు. అక్కడ తీసేసినా తలుపును కూడా ఆ తర్వాత కార్వింగ్ చేయించి పల్లవి మామగారికి పంపించారు.
 
          ఒక రోజు పేపర్ చదువుతుంటే ఒక వార్త ఆకర్షించింది. ఒక ఎన్నారై తన తండ్రి స్థిరఆస్తి డిస్ప్యూట్ లోకి వెళ్ళటంతో న్యాయ బద్ధంగా ప్రయత్నాలు చేసినా పని జరగలేదు. దాంతో ఒత్తిడికి గురై డైరెక్ట్ గా సి.ఎమ్ పేషీకి మెయిల్ చేసాడట. తన సమస్య పరిష్కరించ బడిందని చెప్తూ టెక్నో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడుని అభివర్ణిస్తూ ధన్యవాదాలు చెప్పాడు. అంతే కాదు ఆ వార్తలో సి.ఎమ్ పేషీ మెయిల్ ఐడి కూడా వుంది. వెంటనే అది నోట్ చేసుకున్నాను.
 
          ఆ రాత్రి కంప్యూటర్ తెరిచి నేను గత ఏడాదిగా ప్రతీ మూడునెలలకూ మా స్కూల్ కరెస్పాండెంట్ దగ్గర నుండి విద్యాశాఖాధికారులందరికీ రిజిస్టర్ పోష్టులో పంపించే ఉత్తరాన్ని జాగ్రత్తగా టైప్ చేసి, అంతకు ముందు ఎవరెవరికి పంపించే దాన్నో వారి వివరాలు కూడా త్రూప్రోపర్ ఛానల్ గా (ఆ ఆఫీస్ మెయిల్ ఐడీ లు తెలియదు కనుక)ఆ ఉత్తరం కింద రాసి సి.ఎం పేషీ మెయిల్ ఐడీకి పంపించాను. ఈ విషయం వీర్రాజుగారికి మాత్రమే చెప్పాను.
 
          ఆ మర్నాడు స్కూల్ నుంచి వచ్చాక పల్లవికి ఎప్పటిలా ఒక మెయిల్ రాయాలని నా మెయిల్ బాక్స్ తెరిచాను. ఆశ్చర్యం!! సి.ఎం.పేషీ నుండి నా మెయిల్ ను త్రూ ప్రోపర్ ఛానల్ అని నేను క్రింద ఇచ్చిన వాళ్ళు అందరికీ నా మెయిల్ ఫార్వర్డ్ చేసామని సమాధానం నాకు వచ్చింది. వీర్రాజుగారికి చెప్తే ఆయన కూడా ఆశ్చర్యపోయారు. పదిపన్నెండేళ్ళ క్రితమే వీర్రాజు గారు రిటైర్ అయిపోయారు. ప్రభుత్వాలు రెండుసార్లు మారాయి.పేషీలో ఎవరితోటి పరిచయాలు పెంచుకునే తత్వంలేని వీర్రాజుగారికి తెలిసిన వాళ్ళూ లేరు. అటువంటిది ఇంత తక్షణ స్పందన ఆశ్చర్యం కలిగించింది.
తర్వాత వారం లోపునే నాకు స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ చేసినట్లు ఆర్డర్లు వచ్చాయి. అవి చూసి మా హెచ్చెమ్ ముఖం మాడిపోయింది. మొత్తంమీద నా మౌనపోరాటంతో ఇరవై ఏళ్ళ తర్వాత స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోట్ అయ్యాను. నా సర్వీస్ బుక్ లో నమోదుచేసి మళ్ళా అప్రూవల్ కి పంపాల్సి వుంది.
 
          నాకు ప్రమోషన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఒక వారం రోజులకీ అనుకుంటాను. నేను స్కూల్ కి వచ్చేసరికి మా హెచ్చెమ్, మా క్లర్క్ ఇద్దరూ రూమ్ లో చర్చలో వున్నారు‌. సాధారణంగా ఆఫీస్ స్టాప్ కొంచెం ఆలస్యంగా వస్తారు. ఈరోజు తొందరగా వచ్చాడేమిటి అనుకున్నాను. ఎటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసి ప్రార్థనకి అసెంబ్లీలో పిల్లలు వెనుక నిలబడ్డాను.
 
          హెచ్చెమ్ నా పక్కనే నిలబడి నాతో గుసగుసగా ” ఇప్పుడు విద్యాశాఖ, సి.ఎం.పేషీ నుండి ఎవరో వస్తున్నారట. బహుశా సోషల్ అసిస్టెంట్ పోష్టులో మేథ్స్ అసిస్టెంట్ గా ఎందుకు ప్రమోట్ చేసారని ఇంటరాగేషన్ కి చేస్తున్నారేమో ? ” నాతో అని సర్కాస్టిక్ గా నవ్వింది. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మాట్లాడటం ఎందుకని నేను మౌనంగా వూరుకుని ప్రేయర్ కాగానే రిజిస్టర్ తీసుకుని పదోతరగతి క్లాసులోకి ఎప్పటిలాగే వెళ్ళి పోయాను.
 
          పాఠం చెప్తుంటే నన్ను అర్జంట్ గా రమ్మని ఆయా వచ్చింది. చెప్తున్న పాఠం తొందరగా ముగించి అభ్యాసంలో లెక్క చేయమని చెప్పి హెచ్చెమ్ రూమ్ వైపు వెళ్ళాను. ఒక ఆయన అప్పుడే అందులోంచి బయటకు వచ్చి గేటు వైపు వెళ్ళిపోయాడు.
 
          నేను లోపల అడుగు పెట్టేసరికి మాహెచ్చెమ్ ముఖం ఏడ్చినట్లు జేవురించి వుంది. క్లర్క్ ” సుభద్రా టీచర్ వచ్చారు మేడం అడగండి” అన్నాడు. కందగడ్డ లాంటి ముఖంతో నావైపు చూడకుండానే జీరబోయిన గొంతుకతో “మీరే అడగండి ” అంది.
 
          నేను ప్రశ్నార్థకంగా చూసాను.
 
          మా క్లర్క్ ” మీకు స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోట్ చేయలేదని మీరు సి.ఎం. పేషీకి కంప్లైంట్ ఇచ్చారా?”అని అడిగాడు.
 
          అవునన్నాను.
 
          “మీకు ప్రమోషన్ వచ్చిందికదా ఎందుకు కంప్లైంట్ చేసారు” అని తిరిగి అడిగాడు..
 
          “ఎప్పటి నుండో నాకు రావలసిన పోష్టు కావాలని పెండింగ్ పెట్టారు. ప్రమోషన్ రాకముందే నాకు బాధ కలిగి పేషీకి మెయిల్ రాసాను”అన్నాను. నేను ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోకుండానే.
 
          ” పోష్టుకి మిమ్మల్ని ప్రమోట్ చేసారా లేదో తెలుసుకోవడానికి సి.ఎం పేషీ నుండి ఇందాక వచ్చారు.” అన్నాడాయన.
 
          ” మీకు ప్రమోషన్ ఆర్డరు వచ్చినట్లు లెటర్ రాసి ఇవ్వండి ” అని నా చేత రాయించుకుని తీసుకున్నాడు.. అంతసేపూ మా హెచ్చెమ్ కందగడ్డలా జేవురించిన ముఖంతో నావైపు కొర కొరా చూస్తూనేవుంది. రూమ్ లోంచి బయటకు వచ్చిన నాకు హాయిగా పాడుకుంటూ గాలిలో తేలిపోయినట్లుంది. ఇదంతా కలానిజమా అనుకు న్నాను. నిజంగా సి.ఎం.పేషీలో పనులు ఇంత ఆఘమేఘాల మీద జరుగుతాయా?
 
          ఎక్కడో మారుమూల ఒక టీచర్ మెయిల్ చేయడంతోనే సమస్య తీర్చారా? అది జరిగిందోలేదో అని చెకింగ్ కి కూడా రావటం ఏమిటీ? నా విషయంలో జరిగిన విధానం చూస్తె నిజంగా ఈయన టెక్ ముఖ్యమంత్రి అని నమ్మకం కలిగింది. ఈ విషయం ఇంటికి వెళ్ళాక వీర్రాజు గారితో చెప్తే ఆయనకి కూడా ఆశ్చర్యపోయారు. అయితే అంతటితో నాకు స్కూల్ లో సమస్య తీరిందనుకోటానికి లేదు. నేను ఎవరితోనైనా మాట్లాడుతోంటే ఆ వైపుగా మా హెచ్చెమ్ వస్తే ” జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే సుభద్ర సి.ఎం.పేషీకి కంప్లైంట్ ఇచ్చేస్తుంది” అని ఎత్తు పొడవటం కూడా ఎక్కువైంది.
 
          దానికి తోడూ రెడ్డీ ఫౌండేషన్ వారి పెత్తనం స్కూలులో ఎక్కువైపోయింది. వాళ్ళ ఎదురుగా తనను గొప్పగా ప్రదర్శించు కోవటం, నాలాంటి కొందరు టీచర్లను చులకన చేసి మాట్లాడటం చేస్తుండేది హెచ్చెమ్. మా అందరికీ కోపం వచ్చేది. ఈమె హెచ్చెమ్ అయ్యాక డీయీవో ఆఫీసులలోనూ, రెడ్డీ ఫౌండేషన్ వంటి స్వచ్ఛంధ సంస్థలవారి దగ్గరా స్కూలునీ, స్కూల్ టీచర్లునీ గౌరవించకపోతే వాళ్ళందరి దగ్గరా చులకన అయిపోవటమే కాక మరింత కాళ్ళకింద తొక్కేసే ప్రమాదం ఉంటుందనే ఇంగిత జ్ఞానం లేక పోతే ఎట్లా?
దాంతో నేను ఎక్కువగా ఎవరితోనూ కల్పించుకొని మాట్లాడకుండా నా పనేదో చేసుకో వటం చేసేదాన్ని. ఇంటికి వచ్చాక కూడా ఇవేవీ వీర్రాజుగారితో కూడా చెప్పడం మానేయ టం వలన ఇంట్లో పనులు పూర్తి అయ్యాక చదువుకోవటంలో, రాసుకోవటమో చేసుకునే దాన్ని. అప్పట్లో రాసిన నా కవితలలో కూడా ఆ ప్రభావం వుందేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఏకాంత సమూహాలూ, అంతర్ముఖీన నది మొదలైన కవితలు అటువంటివే.
కవితలన్నీ ఫెయిర్ చేసి పుస్తకం చేసుకోవటానికి వీలుగా పొందుపరిచాను. చదువుకోవటం రాసుకోవటంలోనే నాకు మానసికంగా విశ్రాంతి దొరుకుతుంది.
 
          పాపని తీసుకుని వచ్చి ఓ మూడు నెలలు ఉంటాననీ, పాప రెండవ పుట్టిన రోజు ఇక్కడే చేయాలనుకుంటున్నామని అప్పటికి అజయ్ వస్తాడనీ తర్వాత కలిసి తిరిగి వెళ్తామనీ పల్లవి ఫోన్ చేసింది. ఎట్లాగూ వీళ్ళు వచ్చినప్పుడు పల్లవి వాళ్ళు కొనుక్కున్న ఇల్లు గృహప్రవేశం కూడా చేసుకుంటే బాగుంటుంది అని మేము అనుకున్నాము. ఇల్లు కూడా దాదాపు తయారైపోయింది. పల్లవి వాళ్ళు వచ్చినప్పుడు, గృహప్రవేశానికి అవసరమౌతాయని సెలవులు పెట్టకుండా జాగ్రత్తగా వాడుకోసాగాను.
 
          పల్లవీ, పాపాయి ఆషీ వచ్చేసరికి మళ్ళా ఇల్లు సందడిగా మారింది. చంటిపాప కేరింతలు ఇంట్లో సీతాకోకల్లా ఎగిరాయి. బుడిబుడి అడుగులతో కాలి మువ్వలు కిలకిల్లాడాయి. ఇల్లంతా వెలుగులు నిండాయి. బంధువులు , స్నేహితులు పిల్లల్ని చూడటానికి రావటంతో తీరిక లేకుండా అయింది.
 
          పల్లవి వున్నప్పుడే నా “ఏకాంత సమూహాలు” కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం కూడా అనుకున్నందున పుస్తకప్రచురణ పనిలో వీర్రాజుగారు మునిగిపో యారు. మృణాలినిచే నా పుస్తకాన్ని పరిచయం చేసేటట్లుగా నిర్ణయించి పుస్తకావిష్కరణ నిర్వహించాము. ఆ పుస్తకాన్ని పల్లవికి, అనుపల్లవైన ఆశ్లేషకూ అంకితం చేసాను.
 
          నవంబర్లో కార్తీక పౌర్ణమి రోజు గృహప్రవేశం అనుకోవటం వలన ఆరోజు బంధువు లూ, దగ్గరి మిత్రులతో కానిచ్చేసి, మర్నాడు ఆషి రెండవ పుట్టినరోజున అందరికీ పార్టీ ఏర్పాటు చేసాము. పల్లవి అత్తగారూ, మామగారూ, వారి బంధువులు కూడా వచ్చారు. వచ్చిన దగ్గర నుండి వాళ్ళు కొడుకు సంపాదన అంతా మేము ఖర్చుపెట్టించేస్తున్నామనే మో చాలా సీరియస్ గా వున్నారు. అది మమ్మల్ని బాధ పెట్టింది. ఈ కార్యక్రమం అయిన మర్నాడు వాళ్ళు ఏ.ఎస్.రావు నగర్ లోని చెల్లెలింటికి వెళ్ళిపోయారు.
 
          మరో రెండు రోజులు తర్వాత పల్లవీ అజయ్ కూడా వాళ్ళింటికి వెళ్ళి అక్కడి నుండే తిరుపతికి వెళ్ళి, విజయనగరం వెళ్తామని చెప్పారు. తిరిగి నాలుగైదు రోజులకు వచ్చి హైదరాబాద్ నుండే ఫ్లైట్ కి వెళ్తామన్నారు.
 
          విజయనగరం వెళ్ళేరోజు వాళ్ళందరికీ టిఫిన్ చేసి స్టేషనుకు తీసుకు వస్తానని చెప్పాను. తీరా ఆ రోజు నవంబర్ 14.బాలలదినోత్సవం. నేను సెలవు పెట్టాలనుకుంటే మా హెచ్చెమ్ తనకి ఒంట్లో బాగాలేదని అసిస్టెంట్ హెచ్చెమ్ విజయలక్ష్మీ మీరూ సెలబ్రేషన్స్ చేయమని ఫోన్ చేసింది. నేనూ సెలవు పెట్టాలనుకుంటున్నానని చెప్తే విజయలక్ష్మికి అప్పగించి మీరు తొందరగా వెళ్ళిపోండి. అంది. ఇక తప్పదని స్కూల్ కి వెళ్ళాను. తీరా విజయలక్ష్మి కూడా సెలవులో వుందని ముందురోజు ప్లాన్ వేసుకొని నన్ను ఇరికించారని తెలిసింది.
 
          హెచ్చెమ్ రూమ్ తాళాలు లేవు. అటెండర్ ని హెచ్చెమ్ ఇంటికి పంపించి ప్రోగ్రాం మొదలుపెట్టే సరికి ఆలస్యం అయింది. డాన్సులు నేర్చుకొని వచ్చిన పిల్లల్ని నిరుత్సాహ పరచలేను. నేను ఇక్కడ మధ్యలో వదిలి వెళ్ళలేను. ప్రోగ్రాం పూర్తి చేసాం ఇంటికి వెళ్ళి టిఫిన్స్ తయారుచేసి స్టేషన్ కి వెళ్ళాలి. ఒక వైపు హెచ్చెమ్ చేసిన కుట్ర వీటితో నాకు టెన్షన్ పెరిగిపోయింది. పిల్లల్నీ, టీచర్లను పంపి గదులకు తాళాలు వేసుకొని ఆటో తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి రెండు దాటింది. గబగబా భోజనం చేసి చపాతీలు, కూరా చేసి పేక్ చేసుకుని ఇద్దరం స్టేషన్కు బయలుదేరి పల్లవి వాళ్ళకు అందించాము.
 
          ఆ రోజంతా శారీరకంగా, మానసికంగా అలసి పోయానేమో రాత్రి తొందరగా పడుకున్నాను.
*****
Please follow and like us:

One thought on “నడక దారిలో(భాగం-47)”

  1. మీ న్యాయపోరాటం బాగుంది. ఆనాటి మరియు నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిజంగానే టెక్నికల్ గా యువతకు మార్గదర్శి వంటివారు. అయినా సి.యం. పేషీ నుండి ఒక్కరోజు లో మెయిల్ కి రిప్లై రావడం ఆశ్చర్యకరమే. అంటే మీ పోరాటం వెనుక న్యాయం, ధర్మం ఉందని తెలుస్తోంది. వర్క్ ప్లేస్ లో పురుషులు వేధింపులు ఉంటాయని అంటారు కానీ , స్త్రీలు కూడా సతాయిస్తారని మీ అనుభవం తెలియజేస్తోంది. అంతటి ఒత్తిడి లో కూడా మీరు చదువుకోవడం, రాసుకోవడం, ముఖ్యంగా కవితా సంపుటి ప్రచురించడం అభినందనీయం.

Leave a Reply

Your email address will not be published.