నా అంతరంగ తరంగాలు-21

-మన్నెం శారద

          మా నాన్నగారు నర్సరావుపేట లో జాబ్ చేస్తున్న రోజుల్లో మాకు వినుకొండ దగ్గర వున్న నకిరికల్ లో ఒక స్నేహితురాలు ఉండేది. తను అప్పుడప్పుడూ మా ఇంటికి వస్తుండేది. వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఒకసారి నకిరికల్ పంపమని అమ్మని బ్రతిమి లాడుతుండేది. మాకూ వెళ్ళాలని మహా సరదాగా ఉండేది కానీ అమ్మ ససేమిరా ఒప్పుకునేది కాదు. “నువ్వు చూసావుగా, మళ్ళీ వాళ్లేందుకు అక్కడకి?”అని తీసి పారేసేది.

          అమ్మ ఎదుట మాకేం ఫ్రీ ఉంటుంది. అక్కడకి వెళ్తే బాగా జోక్స్ వేసుకుని నవ్వు కోవచ్చు కదా అని మా ఆశ!

          చివరికి ఓ రోజు మా పుణ్యం పుచ్చి అమ్మ ఎలాగో ఒప్పుకుంది. అయితే తిరిగి సాయంత్రం అయిదు కల్లా ఇల్లు చేరాలనే కండిషన్ తో. అలా బయటపడటమే చాలన్న సంబరం తో మేము తలలాడించి బస్సెక్కాం. వెళ్ళేటప్పుడు బస్ సరిగ్గా టైం కే వెళ్ళింది. మా ఫ్రెండ్ మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళింది. ఇక ఆఁ వయసులో మాటలకి , ఆటలకి నవ్వులకి లో్టేముంటుంది… రెచ్చిపోయాం.

          నాలుగవుతుండగానే టెన్షన్ స్టార్ట్ అయ్యింది.

          ఇక ‘వెళ్తాం, వెళ్తాం ‘ అని పోరితే మా ఫ్రెండ్ బస్ ఆగే చోటుకి తీసుకొచ్చింది. అక్కడేం ప్రత్యేకమైన స్టాప్ ఏమీ లేదు. ఒక పూరింటి ముందు ఆగుతుందట. ఆరు వరకూ చూసినా బస్ రాలేదు. ఏడు గంటలవరకూ చూసి మా ఫ్రెండ్ వెళ్ళిపోయింది. మాకు కాళ్ళలో వణుకు, గుండెలో దడా మొదలయ్యేయి. మా అమ్మగారు భీకరంగా గర్జిస్తూ 70mm లో కళ్ళలో కనిపించ సాగారు. అలాగే దిగులుగా నిలబడ్డాం.

          ఇంతలో ‘అమ్మాయిలూ ‘అని ఎవరో పిలిచినట్లయి వెనక్కు తిరిగి చూసాం. ఒక ఏభయ్యేళ్ళ పెద్దాయన తెల్ల పంచె, చొక్కా , పైన గళ్ళ తువాలు వేసుకుని చిరునవ్వుతో నిలబడి “రండి ఇట్టా వచ్చి కూర్చోండి. బస్సు మనింటికాడే ఆగుద్ది.”అన్నారు.

          “ఫర్వాలేదండి “అన్నాం మొగమాటంగా.

          “అయ్యో పిల్లలూ, మీకు తెల్వదు, ఆటికో టైము పాడు వుండదు. వస్తే నేనాపుతాగా. రాండి తల్లులూ “అన్నారాయన అనునయంగా.

          ఇంతలో ఆయన శ్రీమతి వచ్చి నులకమంచం వాల్చి దానిమీద ఉతికిన దుప్పటి పరచింది.

          వెళ్ళి కూర్చున్నాం.

          ఆఁ రోజు పౌర్ణమి ఏమో వెన్నెల పుచ్చ పువ్వులా కాస్తున్నది. అప్పుడా యింటిని పరికించి చూసాను. కాంపౌండ్ చుట్టూ కంది కంపతో దట్టంగా గోడలా నిర్మించుకున్నారు. నేలంతా పేడ కళ్ళాపి జల్లడం వలన ఆకుపచ్చని గచ్చులా మెరుస్తున్నది. దానిమీద వేసిన ముగ్గు చెదరిపోకుండా ముత్యాలతో వేసినట్లు అందంగా వుంది.

          ” ఆ బస్సెప్పుడొచ్చి చస్తదో ఏవోగానీ పిల్లకాయలకింత అన్నం పెట్టవే ” అన్నారాయన భార్యతో.

          మేము కంగారుగా ” వద్దండి ” అన్నాం.

          ఆవిడేం వినిపించుకోలేదు. నాలుగు స్టీలు కంచాల్లో వేడి వేడి అన్నం, ఘుమఘుమ లాడుతున్న టమాటో పండుమిరపకాయ పచ్చడి, ఏదో ఆకు కూరతో చేసిన పప్పు, వెన్న కాచిన నెయ్యి, గడ్డ పెరుగుతో భోజనం పెట్టేసింది.

          ఆఁ వెన్నెలలో ఆఁ విందు ఎన్నేళ్ళయినా మరచిపోలేనిది. దాని నిండా వారి ప్రేమా, ఆప్యాయత రంగరించి వున్నాయి మరి! అమ్మ భయం లేకపోతే మేము ఇంకా ఎంతగానో ఆస్వాదించే వాళ్ళం. భోజనాలవ్వగానే బస్సు వచ్చింది.

          ఆయన పరిగెత్తుకెళ్ళి బస్సాపి మమ్మల్ని ఎక్కించారు.

          “ఎవయ్యో, కండ ట్రూ, అంతా ఆడపిల్లకాయలయ్యా, పేట్లో దిగుతారు, జాగ్రత్తగా దింపు ” అని హెచ్చరించి బయ్యం లేదులేమ్మా, డైవరు మనోడే !”అని సాగనంపారు.

          ఇన్ని సంవత్సరాలు జరిగిపోయినా నేను ఈ సంఘటనని కొంచెం కూడా మరచిపోలేదు. విశ్వాసం, కృతజ్ఞతలే కదా మనల్ని మనుషులుగా నిరూపించి చూపించేవి! ఆయన మంచితనం గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ నా కళ్ళు చెమరుస్తాయి.
గుళ్లో వెలసిన దేవుళ్ళకన్నా ఇలా మనుషుల్లో వున్న దేవుళ్ళే మహోన్నతులు కదా!
ఈ రోజు అక్కరలేని అనేక అడ్డుగోడలు కట్టుకుని సంకుచితమై విడిపోతున్న మనమంతా విశాల దృక్పధంతో ఆలోచించాలి

*****

(సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.