నా జీవన యానంలో- రెండవభాగం- 47
-కె.వరలక్ష్మి
అక్టోబర్ 13న నేనూ, మా అబ్బాయి కుటుంబం రాత్రి 8 గంటలకి కాచిగూడా స్టేషన్లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కేం. ఉదయం 9.30 కి చిత్తూరులో దిగేం. అక్కడి నుంచి టేక్సీ లో రాయవేలూరు చేరుకున్నాం. మా అబ్బాయి ముందుగా బుక్ చేసి ఉండడం వల్ల కొత్తబస్టాండ్ దగ్గర్లో ఉన్న సెల్లి అమ్మన్ రెసిడెన్సీలో దిగేం. అప్పటికే అక్కడ కేరళటూర్ నుంచి వచ్చని మూడు జంటలు మా పెద్ద ఆడపడుచువాళ్ళూ, మా కోడలు అమ్మానాన్నా, పిన్నీ బాబాయ్ తయారై రెడీగా ఉన్నారు. మేం కూడా రిఫ్రెష్షై, దగ్గర్లోని ఆనందభవన్ లో లంచ్ చేసి వేలూరు సందర్శనకు వెళ్ళేం. వేలూరు కోట అక్కడ చూడదగినది, కోట అంటూ ప్రత్యేకంగా ప్రస్తుతం ఏమీలేదు. ఆ బురుజుల లోపల వాయులింగేశ్వరాలయం చెప్పుకోదగిన పెద్ద ఆలయం. కోటలోపలే ఉన్న మ్యూజియం, కోర్టు, చర్చి, రకరకాల గవర్నమెంట్ ఆఫీసులు – బ్రిటిషర్స్ టైంలోనే కోట భవనాలు అలా మార్చబడ్డాయి. మా మనవరాళ్ళు ప్రవల్లిక, సవర్ణిక అక్కడున్న గుర్రం ఎక్కి కాస్సేపు అలా తిరిగి ఎంజాయ్ చేసారు. సాయంత్రం 5.30 కి అంతా బైటికి వచ్చేసి మినీ ఆటో బస్సులో అరగంట ప్రయాణంలో ఉన్న శ్రీపురం వెళ్ళేం. మేం కాంపౌండులోకి అడుగుపెట్టగానే అనుకోని భారీ వర్షం మొదలైంది. షెల్టరుతో నక్షత్రాకారంలో నిర్మించిన మార్గంలో నడుస్తూ అందమైన గార్డెన్ ని, శిల్పాల్ని చూస్తూ దీపాలు పెట్టేవేళకు బంగారంతో నిర్మించిన లక్ష్మీ ఆలయాన్ని చేరుకున్నాం. బంగారు స్తంభాలు, బంగారు విగ్రహాలు చుట్టూ ఉన్న నీటి మడుగులో ప్రతిబింబిస్తూ… రెండు కళ్ళూ చాలని అద్భుతమైన దృశ్యం అది. అద్భుతమైన సౌందర్యాన్ని చూసిన అలౌకికమైన ఆనందం. భక్తి భావన కాదు. ఇస్కాన్ టెంపుల్స్ లో లాగానే అన్నీ అమ్ముతున్నారక్కడ. తిరిగి వచ్చేటప్పుడు గేటుకి దగ్గర్లో ఉచిత ప్రసాదం తిని రాత్రి 9.30 కి తిరిగి వేలూరులోని రూంకి చేరుకున్నాం. 15 ఉదయం 4.30 కే లేచేసాం. ఫ్రెష్షై పక్కనే ఉన్న సెల్వి అమ్మన్ గుడిలో అమ్మవారి దర్శనం చేసు కున్నాం. ఆ గుళ్ళో నేతి పొంగలి, చక్కెర పొంగలి రుచి ఇప్పటికింకా నాలుక మీద ఉన్నట్టుంది. తర్వాత బస్సులో తమిళనాడు పొలాలు, కొండల మధ్య ప్రయాణం. అందరూ నిద్రపోయారు. నేను మాత్రం మేల్కొని ఆ ప్రాంతాన్ని అవలోకిస్తూ ఉండి పోయాను. బస్సు వెనకసీట్లో ఒకాయన ఎవరో భగవద్గీత శ్లోకాల్ని చదువుతూ తమిళంలో వాటి అర్థాన్ని వివరించాడు దారిపొడవునా. 11 గంటలకి అరుణాచలం (తిరువణ్ణామలై) చేరుకున్నాం. బస్టాండు అంతా చెత్తతోనూ, యూరిన్ దుర్గంధంతోనూ నిండి ఉంది. ముక్కు మూసుకుని త్వరత్వరగా రోడ్డు మీదికి నడిచేం. వీధుల్ని చూస్తూ నడుస్తూండగా రోడ్డు పక్కన తోపుడుబళ్ళ మీద పెద్ద పెద్ద కుండల్తోనూ, పక్కనే కారం కలిపిన పచ్చి మామిడికాయ ముక్కలు, నిమ్మకాయ పచ్చడి లాంటివి పెట్టి అమ్ముతున్నారు. నేను పని గట్టుకుని వెళ్ళి అదేమిటని అడిగేను. అంబలి అట. చోడిపిండి, నూకలతో గరిటజారుగా ఉన్న అంబలిని గరిటతో తీసి చూపించింది అమ్మే అమ్మాయి. అలా ఊరుచూస్తూ నడిచి ఆలయ దక్షిణ ప్రాకార ద్వారాన్ని చేరుకున్నాం.
మెడనొప్పి పెట్టేంత ఎత్తైన ప్రాకారం. అలాంటి ఐదు ప్రాకారాల బృహదాలయం అది. అరుణలింగేశ్వరుడు, అపీత కుచాంబిక ఉన్న ముఖ్య ఆలయం; కుమారస్వామి, వినాయక, వీరభద్ర, కాలభైరవ, నందీశ్వరాల యాల సముదాయమది, ముఖ్య ఆలయం వెనుక వైపు సూర్యకాంతిలో మెరుస్తున్న అరుణాచలం కొండ, సరిగ్గా మేం వెళ్ళేసరికి అమ్మవారికి, స్వామికి జరుగుతున్న అర్చన కార్యక్రమంలో బుట్టలకొద్దీ తరలివస్తున్న గులాబీల పరిమళం. ఒక అవ్యక్త అతీత భావమేదో అలముకుంది నన్ను. అందుకే రమణమహర్షి తపస్సు కోసం ఈ ఆలయాన్ని ఎన్నుకుని ఉండచ్చు. ఆయన తపస్సు చేసిన గుహను కూడా చూసి, ప్రాంగణంలోని ఒక మంటపంలో కాస్సేపు కూచుని అరుణాచల ప్రదక్షిణానికి బయలుదేరాం. దారిలో రమణమహర్షి ఆశ్రమం, ఆయన ఫోటోలు, చివరి రోజుల్లో ఆయన గడిపిన గది వగైరాలు చూసాం. నేను ఆశ్రమంలోనూ, బైటా చలంగారి ఇల్లు కోసం ఎంక్వైరీ చేసాను. ఎవరికీ తెలీదన్నారు. ఆశ్రమం గేటు కెదురుగా కొంత దూరంలో రోడ్డు పక్కన రాళ్ళూడిపోయిన ఒక గట్టులాంటిది చెత్తా చెదారంతో నిండి ఉంది. అది చలంగారి సమాధి అని తర్వాత ఎవరో చెప్తే తెలిసింది.
అలా 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకూ చోళరాజులు నిర్మించిన ప్రపంచం లోనే పెద్దదైన శివాలయం అరుణాచలాలయాన్ని చుట్టి వచ్చి మరోసారి నమస్కరించు కున్నాం. తిరిగి ఇంటికి వచ్చాక ‘అన్వేషణ’ కథ రాసాను ఆ స్ఫూర్తితో.
అక్కడే హోటల్లో భోజనాలు కానిచ్చి మళ్ళీ బస్సెక్కి సాయంకాలం వరకూ అడవిదారుల్లో సుదీర్ఘ ప్రయాణం చేసి తిరువత్తూరు చేరుకుని, అక్కడ మరో బస్సెక్కి యాలగిరి హిల్ స్టేషనుకి బయలుదేరాం. బస్సు ఘాట్ రోడ్ చేరిన కొద్దిసేపటికే చీకటి పడిపోయింది. కొండకింద దీపతోరణాల్ని, విద్యుత్ కాంతుల్ని చూస్తూ ఆనందించాం, ‘ఆకాశంలోంచి నక్షత్రమండలం కిందికి దిగి వచ్చిందా?’ అన్పించింది. కొండపైన హిల్ స్టేషనుకి చేరుకున్నాక బోట్ క్లబ్ చూడ్డానికి బయలుదేరాం. అప్పటికే అది క్లోజ్ చేసెయ్య డం వలన లైట్లు ఆపేసారు. చిమ్మచీకటిగా ఉంది. చీకట్లో దేన్నో తన్నుకుని మా ఆడపడుచు ముందుకు తూలి పడిపోయింది. అంతే, ఇంకెవరూ ముందుకు నడవం అన్నారు. వెనక్కి తిరిగి కిందికొచ్చే చివరి బస్సెక్కి, కొండకింద వూర్లో మరో బస్సెక్కి వేలూరు చేరుకున్నాం.
16న తొందరేం లేదు అన్నారని కొంచెం స్థిమితంగా తయారవుతున్నాం. ఆ రూంలో ప్రవల్లిక, నేనూ ఉన్నాం. టి.వి. ఆన్చేసి తమిళ పాటలు వింటూ రెడీ అవుతున్నాం. మా కోడలు వాళ్ళమ్మ వచ్చి తొంగిచూసి వెళ్ళిపోయింది. వెంటనే మా కోడలు వచ్చి ‘‘ఆ టీవీ కట్టు’’ అని అరిచింది. అరుపులు ‘కేకల్తో ప్రవల్లికని కొట్టినంత పనిచేసింది. ఆ అరుపులు’ కేకలు నా మీద కూడానని నాకర్థమైంది. వీళ్ళు తరచుగా దేశంలోనూ, సింగపూర్ లాంటి బైట దేశాల్లోనూ వాళ్లమ్మావాళ్ళను తీసుకుని వెళ్ళితిరుగుతారు. ఇప్పుడు నన్ను మా అబ్బాయి పిలవడం తనకి ఇష్టంలేదని మొదటిరోజు నుంచీ నాకు అర్థమౌతూనే ఉంది. ఏం చెయ్యగలను? మాటల్తో ఎదుర్కునే అలవాటు మొదటి నుంచీ లేదు. గొప్ప నిస్సహాయత! ఒంటరితనం. ఎంత లోకువ! ఎంతనోరు! పరాయిగా చూస్తూదాన్ని నాకు అర్థమయ్యేలా చెయ్యడం. ఎవరితో చెప్పుకోను? బాత్ రూంలోకి పోయి కళ్ళు కడుక్కుని వచ్చాను.
ఉదయం 10 కి బస్సెక్కి చిత్తూరు చేరి, అక్కడి నుంచి మరో బస్సులో కాణిపాకం వెళ్ళి వినాయక దర్శనం చేసుకుని – నేను ఆ పక్కనే ఉన్న మాధవాలయాన్ని కూడా చూసి వచ్చాను, భోజనాల తర్వాత మినీ వేన్ లో అర్థగిరి (అరకొండ) ఆంజనేయ స్వామిని దర్శించుకుని తిరిగి చిత్తూరు చేరుకున్నాం. స్టేషనుకి ఎదురుగా ఉన్న విష్ణు హోటల్లో రుచికరమైన టిఫిన్లు స్పాంజ్ ఇడ్లీతో సహా తిని సాయంత్రం 5.30 కి తిరిగి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కాం. మర్నాడు ఉదయం 10 కి ఇంటికి చేరుకున్నాం. నాలుగు రోజుల తర్వాత ఒకరోజు మా అబ్బాయి తన కారులో కొన్ని తెలంగాణా ఊళ్ళు చూపిస్తానని తీసుకెళ్ళేడు. మేడ్చల్, తూఫ్రాన్ మీదుగా భూంపల్లి దగ్గర్లో ఉన్న ‘కూడవెల్లి’ వెళ్ళేం.
అక్కడ మానేరుకు ఉపనది ఒకటి ప్రవహిస్తోంది, ఆ ప్రవాహం పక్కన ప్రాచీన ఆలయాల సముదాయం ఉంది, ఒక విష్ణాలయం, శివాలయం పక్కపక్కనే ఉన్నాయి. తెలంగాణా శైలిలో చిన్న గుమ్మాల లోపల చిన్న గర్భాలయాలు. చిన్న విగ్రహాలు, అక్కడి నుంచి మద్దికుంట వెళ్ళి ‘గడీ’ చూసాం బైటి నుంచే. దొరగడీ పాడుపడిపోయి ఉంది. గడీ చుట్టూ నిర్మించిన ఎప్పటిదో చిన్న ఊరు. ఆ వీధుల్లో నడిచాం. కరీంనగర్ జిల్లాలో ప్రవేశించగానే ఇటునుంచి మొదటి ఊరు అది. దారిలో కన్పించిన చిన్న చిన్న ఊళ్ళు, పొలాలు చూసుకుంటూ తిరిగి వచ్చాం.
ఆ సంవత్సరం నవంబర్ 15, 16 తేదీల్లో ‘మనలోమనం’ (ఇప్పటి ప్రరవే) సమావే శాలు నాగార్జున యూనివర్సిటీలో జరుగుతాయని ఆహ్వానం వచ్చింది. నవంబరు 14 ఉదయం నేను రాజమండ్రిలోని వెంకటేశ్వర అపార్ట్ మెంట్స్ లో ఉన్న ధూళిపాళ అన్నపూర్ణగారి ఇంటికి వెళ్ళేను. ముందే అనుకున్నట్టుగానే కాకినాడ నుంచి వీరలక్ష్మి, వాళ్ళబ్బాయి రాజా వచ్చేరు. అన్నపూర్ణగారింట్లో లంచ్ తర్వాత తన ఆల్టోకారు రాజా డ్రైవ్ చేయగా నల్గురం సాయంకాలానికి విజయవాడలోని ఆహ్వానం లక్ష్మిగారింటికి చేరుకున్నాం, మేం వెళ్ళేసరికి అక్కడ వావిలాల సుబ్బారావు గారు, గురుప్రసాద్ గారు, మరో ఇద్దరెవరో ఉన్నారు. చలంగారి పైన ఒక మేగజైన్ తేవడం గురించి మాట్లాడుకున్నా రు. ఈలోగా లక్ష్మిగారి భర్త రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రామారావుగారు కూడా వచ్చి అందర్నీ పలకరించారు. లక్ష్మిగారి ఇల్లు ప్రాచీనకాలంలో రాళ్ళతో నిర్మించిన బ్రిటిష్ కట్టడం లాగా ఉంది. సింపుల్ గా చక్కగా అలంకరించారు. రాత్రి లక్ష్మిగార్ని కూడా తీసుకుని గుంటూరు వెళ్ళేం. హోటల్లో డిన్నర్ చేసి, లక్ష్మిగార్ని వాళ్ళ చుట్టాలింట్లో వదిలేసి వీరలక్ష్మి గారి ఫ్రెండ్ లలితా శేఖర్ గారింటికెళ్ళేం. ఆవిడ వీరలక్ష్మి గారి ఫ్రెండ్ అట. నాకదే మొదటి పరిచయం, లలితగారు, ఆమె భర్త, వారబ్బాయి ఎదురొచ్చి ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. రాత్రికి వాళింట్లో నిద్రపోయాం.
15 ఉదయాన్నే లేచి తయారై 9 గంటలకి నాగార్జున యూనివర్సిటీ చేరుకున్నాం. ప్రారంభ సమావేశంలో వీరలక్ష్మి మాట్లాడింది. రెండవ సెషన్ బిసి మహిళా రచయిత్రుల సదస్సుకి నేను అధ్యక్షత వహించాను. కథ మీద త్రివేణి, నవల మీద రజిత, పొయెట్రీ మీద మందరపు హైమావతి, వ్యాసరచన మీద సుజనారామం పత్రసమర్పణ చేసారు.
అందరూ నా రచనల గురించి విస్తృతంగా మాట్లాడేరు. సాయంకాలం ఆఖరి సెషన్ ముగిసే సరికి జన చైతన్య వేదిక లాయర్ అండ్ రచయిత చంద్రశేఖర్ నన్ను పలకరించి నా కథలంటే తనకి ఎంత ఇష్టమో చెప్తూ కొన్ని కథల గురించి మాట్లాడేడు. తన కారులో నన్ను తీసుకెళ్ళి జైన ఆలయం, పెదకాకాని శివాలయం, గుంటూరులోని అతని ఆఫీసు చూపించాడు. ఈ మధ్య వచ్చిన తన వ్యాసాల జెరాక్స్ తీయించి, తను ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువదించిన శాక్సో అండ్ వాంజెట్టీ తో బాటు ఇచ్చాడు, తిరుపతిలో ఫ్రెండ్ అయ్యి ఆ సభలకు వచ్చిన పుష్పాంజలి వాళ్ళ వియ్యాలవారింట్లో ఉంది. నన్ను రమ్మని ఆహ్వానించింది. చంద్రశేఖర్ నన్ను వారింట్లో దించి వెళ్ళేడు. వత్సల కూడా వచ్చి ఉంది. రాత్రి వారింట్లో భోంచేసి పన్నెండు వరకూ కబుర్లు చెప్పుకొని నిద్రపోయాం. పుష్పాంజలి గారి చుట్టాలకి మంచి హోటల్ ఉందట. రాత్రి భోజనాలు, ఉదయం టిఫిన్స్ చాలా బావున్నాయి. 16 ఉదయం 9 కి నేనూ, పుష్పాంజలి యూనివర్సి టికీ చేరుకున్నాం. ఆ రోజు సెషన్స్ లో కూడా మంచి ఉపన్యాసాలు జరిగాయి. క్రైస్తవ సెషన్ లో ఝాన్సీ కె.వి.కుమారి అలిగి స్టేజి దిగిపోయింది. సాయంకాలం వైస్ ఛాన్సలర్ వచ్చి మాట్లాడేరు. ఫోటోల సెషన్, డిస్కషన్స్ ముగిసిన వెంటనే తిరుగు ప్రయాణంలో మల్లీశ్వరి తన కారులో నన్నూ, వి. రామలక్ష్మిని ఎక్కించుకుంది. వాళ్ళ ప్రయాణం హైవేలో ఉన్న మా ఊరి మీదుగానే కాబట్టి రాత్రి 12 కి నన్ను ఇంటిదగ్గర దించి వెళ్ళేరు.
18న సోమసుందర్ గారి పుట్టిన రోజు, బద్ధకించి మానేయడానికి లేకుండా ఆయన దబాయించి పిలుస్తారు. ఒంటరిగా ఇంట్లో ఉండే కన్నా నలుగురిలోకి వెళ్ళడం బావుంటుంది. అందరూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో పలకరించడం, ఆత్మయత, గౌరవం చూపడం ఆనందాన్ని ఇస్తుంది. నాలో ఒక పెద్దరికం వచ్చినట్టు అన్పించసాగింది, ఆ రోజు సోమసుందర్ అవార్డులు అందుకున్న దేవీ ప్రియ, ననుమాసస్వామి, వేదగిరి రాంబాబు, శ్రీకాకుళం ఛాయారాజ్, వాళ్ళతో వచ్చిన నాళేశ్వరం శంకరం అందరూ నన్ను ఎంతో ఆత్మీయంగా ప్రత్యేకగౌరవంతో పలకరించేరు. డా. సీతారామస్వామి గారు, ఆయన భార్య డా. అనూరాధగారు నా కథల్ని మరీ మరీ మెచ్చుకున్నారు.
ననుమాసస్వామి నా కథలు పంపితే పరిశోధన చేయిస్తానని అన్నాడు. ఆలూరి విజయలక్ష్మిగారు నన్ను తన కారులో పిఠాపురం బస్టాండులో దిగబెట్టేరు. తిరిగి వచ్చే టప్పటికి సాయంత్రం 5 దాటింది. ఆకాశం నిండా రకరకాల ఆకారాల్తో నల్లని, తెల్లని మబ్బులు. పడమటి ఆకాశంలో సంధ్యవాలిన తర్వాత చాలాసేపు తెల్లని తెలుపు నిలిచి ఉంది. మనసంతా ఆహ్లాదంతో నిండిపోయింది.
ఆ నవంబరు 25 న నా చిన్నప్పుడు హైస్కూల్ లో హిందీ నేర్పిన టీచర్ విమలాదేవి గారు కాలం చేసారు. అప్పటికి ఆరేళ్ళుగా మంచంపట్టిన ఆవిడకు సేవలు చేసిన ఆవిడ భర్త శివాజీగారు పదిరోజుల ముందే మరణించారు.
నవంబర్ 29న ప్రత్యేక తెలంగాణా కోసం కె.సి.ఆర్. నిరాహారదీక్ష పూనాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తీసుకెళ్ళేరు. అంతే, తెలంగాణా విద్యార్థి సంఘాల అల్లర్లతో బస్సులు, కార్లు, ఆఫీసులు తగలబడ్డాయి. ముగ్గురు ఆత్మాహుతి చేసుకున్నారట. ఆ తర్వాత రెండు సార్లు ఎన్నికల్లో నెగ్గి ముఖ్యమంత్రిగా పాలన సాగించిన కె.సి.ఆర్ ని ఓడించి ఈ సంవత్సరం కాంగ్రెస్ గద్దెనెక్కింది. చరిత్రలో ఇలాంటి సంఘటనలు ఎన్నో! హఠాత్తుగా 9వ తేదీన (9-12-09న) కేంద్ర హోమ్ మినిస్టర్ చిదంబరం ప్రత్యేక తెలంగాణా ఇస్తున్నట్టు ఎనౌన్స్ చేసాడు. యం.ఎల్.ఏ. లంతా రాజీనామాలు ప్రారంభించారు. ఆంధ్రప్రాంతపు విద్యార్థులంతా సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు ప్రారంభించేరు. స్వతంత్రం వచ్చిన కొద్ది రోజులకే మద్రాస్ నుంచి విడివడి ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు భాగాలౌతుందంటే కొందరికి బాధగానూ కొందరికి ఆనందంగానూ అన్పించసాగింది.
2009వ సంవత్సరం అలా ముగిసింది.
*****
కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 140 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన వెన్నో సంకలనాలు. చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్లి, విమలా శాంతి పురస్కారం, సహృదయ సాహితీ, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా పురస్కారాలు, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం , రంజని, పులికంటి, ఆర్.ఎస్ కృష్ణమూర్తి అవార్డులు, అప్పాజోస్యుల- విష్ణుభొట్ల పురస్కారం, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం, ఆటా, తానా పురస్కారాలు మొ.నవి కథలకు అవార్డులు. శ్రీ శ్రీ, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి అవార్డు మొ.నవి కవితలకు అవార్డులు. శాస్త్రీయ సంగీతం, గజల్స్ వినడం, మంచి సాహిత్యం చదవడం అభిరుచులు.