నిన్నటి సుమాన్ని నేను! (YESTERDAY’S FLOWER ఆంగ్ల గీతానికి అనువాదం)

-వి.విజయకుమార్

నిన్నటి సుమాన్ని నేను
మ్రోవితో కడపటి తుషారాన్ని గ్రోలి వేచివున్నాను
పుష్పలావికలు నా మృత్యు గీతాన్నాలపించడానికి రానే వచ్చారు
కడపటి హేమంత తుషారపు మృత్యు నీడ పరచుకుంది చల్లగా
శరత్ చంద్రుడి వీక్షణం దోబూచులాడుతోంది మెల్ల మెల్లగా

నిన్నటి సుమసౌరభాలింకా నాలో సజీవంగా
రేపటి సుగంధాలకది అవస్యమై ఉండగా
నా మరణ గీతిక పల్లవిని పాడుకుంటూ విచ్చేసిన విరికన్నియలు
ఇంకా ఆగమించే మగువలకోసం స్వాగత గీతిక పాడుతున్నట్టుగా

గతించిన ఘడియల పరిమళాలను మోస్తూ
నేను గుబాళిస్తున్నాను వారి ఆత్మల్లాగే
రేపటి కిటుగా వచ్చే ఆ పూబాలల తలపుల్లో నేను
ఒకనాటి వెల్లివిరిసిన సుమాన్ని కాలేను
ఎందుకంటే అరవిరిసిన కొంగ్రొత్త పువ్వులే చూస్తారు వారు
పరిమళభరితమైన నా ఆత్మ మధురోహగా మారి
మగువల మరచిన జ్ఞాపకంగా ప్రతిఫలిస్తుంది రేపటి రోజు
అప్పుడు నా మృత్యు గీతాన్ని ఆలపించినందుకు
వారు కించిత్ పశ్చాత్తాపవదనులవుతారు
భ్రమరాలు విషాదగ్రస్తమవుతాయి
సంధ్యా కాంతుల జ్ఞాపకాలని వదిలి
వసంతుడి చిరు రవళిని వీడి
నాలో నేనే లయించిపోతానిక
చిన్నారి పొన్నారి చిరుప్రాయపు వాక్కుల్లా
మధురిమతో ఉప్పొంగే నిశ్వాసం నేనౌతా
అవనీ మాత ఫలవంతమైన అనంత మధురాల్ని గ్రోలి
మరణానంతర జీవితాన్ని పరిమళభరితం చేసుకుని
పునరుత్థానం పొందిన సుమ నౌతా

(YESTERDAY’S FLOWER ఆంగ్ల గీతానికి అనువాదం)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.