నిస్సహాయిని

(నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

– ప్రసాదరావు రామాయణం

నేను
రెప్పలు లేని నేత్రిని
గుప్పున గాలి వీచి
చప్పున నిందాధూళి అక్షిలో పడినా
కన్ను గాయమైనా
గుండె ఏడ్చినా
కాచుకోలేని నిస్సహాయిని !

నేను
రెక్కలు రాలిన పక్షిని
నక్కజాతి మగాళ్ళు
నన్ను కౌగలించినా
వేటమృగాడు వెంటాడినా
ఎగిరిపోలేని నిస్సహాయిని !

నేను
తలుపులు లేని గుడిశను
మృచ్చిలిగాడు తచ్చాడినా
నా శీలపు గోడకు కన్నం వేసినా
గుండెను పెకలించి తస్కరించినా
అండలేని నిస్సహాయిని !

నేను
ఓ అభాగ్య వృక్షాన్ని
పత్ర పుష్ప ఫల శాఖలనిచ్చినా
దేహాన్నే త్యాగం చేసినా
సానుభూతికైనా నోచుకోని
నిస్సహాయిని !

నేను
కలం లేని కవయిత్రిని
గళం నొక్కబడిన రచయిత్రిని
తూరీగల్లా భావాలు రేగినా
గుండెన మండిన నిప్పురవ్వలు ఎగసినా
వెలువరించలేని నిస్సహాయిని !

నేను
తీగలు తెగిన కచ్ఛపిని
తంత్రులను సవరించి
మంత్రముగ్ధను చేయగల
వాద్యకారుని కొనలేని నిస్సహాయిని !

నేను
రక్షకుడు లేని నా రాజ్యంలో
భక్షకుల నుండి కాపాడుకోలేని
నిర్భాగ్యురాలను !
నిస్సహాయిని !!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.