పరామర్శ
मातमपुर्सी
హిందీ మూలం – – సూరజ్ ప్రకాష్
తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు
ఈసారి కూడా ఇంటికి చేరుకునేందుకు ముందే నాన్నగారు నా కోసం నేను కలుసుకోవలసిన వాళ్ళ పెద్ద లిస్టు తయారుచేసి ఉంచారు. ఈ లిస్టులో కొన్ని పేర్లకి ఎదురుగా ఆయన ప్రత్యేకంగా గుర్తు పెట్టివుంచారు. దాని అర్థం వాళ్ళని తప్పకుండా కలుసుకోవాలని.
ఈ వూరిని శాశ్వతంగా విడిచిపెట్టిన తరువాత ఇప్పుడు ఇక్కడితో నా సంబంధం కేవలం సంవత్సరానికో, ఆరునెల్లకో వారం-పదిరోజులు సెలవు పెట్టుకుని అతిథుల్లాగా వస్తూ వుండటం, నా ముఖ్యమైన స్నేహితులని కలుసుకుని లేదా తల్లిదండ్రులతో బాగా సమయం గడిపి తిరిగి వెళ్ళిపోవడం వరకే ఉంది. చుట్టాలదగ్గరికి వెళ్ళడం ఎప్పుడోకాని జరగదు. ఈసారి వచ్చినప్పుడు అందరినీ కలుసుకుందామని, అందరికీ ఉన్న కోపాన్ని పోగొడదామని అనుకొని ప్రతిసారి వస్తున్నాను. కాని, ఆ విధంగా ఎప్పుడూ సాధ్యపడలేదు. ప్రతిసారి, నా మీద కోపగించుకునే మిత్రుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రతిసారి టైము లేదనే వంకతో తిరిగి వెళ్ళిపోతున్నాను.
కాని, నాన్నగారు తయారుచేసిన ఈ లిస్టులో అందరికన్నా ముందు ఉన్న పేరు చూసి నేను ఉలిక్కిపడ్డాను. దానిమీద డబుల్ గుర్తు పెట్టివుంది. నేను ఆయనవంక ప్రశ్నార్థకంగా చూశాను. ఆయన నెమ్మదిగా అన్నారు- “నేను నీకు ఉత్తరంలో రాశాను కూడా. మెహతా వైఫ్ కాలం చేసిందని. దుఃఖం వ్యక్తపరుస్తూ ఉత్తరం రాయమని కూడా రాశాను. పాపం అతను భార్య పోయిన దుఃఖం నుండి ఇంకా తేరుకోకుండానే ఇప్పుడు నెల కిందటనే సందీప్ కూడా వెళ్ళిపోయాడు.” నేను అవాక్కయ్యాను –“అరే… సందీప్… ఏమయిందతనికి? అతను శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నాడు. పైగా అతని పెళ్ళి ఒక సంవత్సరం కిందటనే అయింది. అతనికి నేను కార్డు కూడా పంపించాను.”
తరువాత మాట అమ్మ పూర్తి చేసింది –“పాపం శాంతి జీవితమంతా కష్టపడుతూనే వుంది. తను ఒక్కతే పిల్లలని చదివించుకుంటూ వుంది. మీ అంకుల్ ఉద్యోగం పేరు చెప్పి ఎప్పుడూ టూర్ల మీదనే ఉండేవాడు. అదే పిల్లలకి చదువు చెప్పించుకుంది. ఇంక విశ్రాంతి తీసుకునే సమయం వచ్చేసరికి క్యాన్సర్ రోగం పట్టుకుని దాన్ని తినేసింది.” అమ్మ గొంతుక అవరుద్ధమయింది. అమ్మ వివరంగా చెప్పింది. సందీప్ కాన్పూర్ నుంచి ఒక మ్యాచ్ ఆడి తిరిగి వస్తున్నాడు. దారిలో ఏదో బస్సు స్టాండులో ఏం తిన్నాడో ఏమో. దాంతో ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఇక్కడికి చేరుకునేంతలోనే అతని పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అక్కడే బస్సుస్టాండులో వున్న వాళ్ళెవరో అతన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్ళారు. ఈ కబురు ఇంటికి చేరేలోగానే అతని జీవనలీల సమాప్తమైపోయింది. అతను ఏ ఊళ్ళో ఏ బస్సుస్టాండులో అలా తిన్నాడో తెలియలేదు. పాపం ఇంకా శాంతి బూడిద కూడా చల్లారకుండానే….
నా ముందు రెండు రకాల అసమంజస స్థితి ఉంది. నేను సందీప్ భార్యను మొదటి సారి, అందునా ఎటువంటి దుఃఖపూరిత పరిస్థితిలో కలుసుకుంటున్నాను. సందీప్ భార్య చాలా అందంగా ఉంటుందని, అంతేకాక స్మార్ట్ గా ఉంటుందని అనుకుంటూవుంటే తెలిసింది. శాంతి ఆంటీ, అంకుల్ కూడా ఎప్పుడూ ఆమెని ప్రశంసిస్తూ ఉండేవారు.ఇంత చక్కని అమ్మాయి పెళ్ళి అయ్యాక కేవలం సంవత్సరంలోపునే వితంతువు కావలసి వచ్చిందని నేను నమ్మలేకపోతున్నాను. ముందుగా అత్తగారు వెళ్ళిపోయారు, ఇప్పుడు తన పసుపుకుంకుమలు కూడా గంగలో కలిసిపోయిన ఈ పరిస్థితిలో తను కూడా ఏం ఆలోచించగలుగుతుంది, ఎలా ఆలోచించగలుగుతుంది.
నాకున్న ఇబ్బంది ఏమిటంటే, ఇటువంటి సమయాల్లో నేను చాలా ఎక్కువగా నెర్వస్ అయిపోతాను. పరామర్శ కోసం నా నోట్లోంచి ఒక్క మాట కూడా బయటికి రాదు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలన్నది నాకు అర్థం కావడంలేదు. వాళ్ళ ముఖం ఎలా చూడగలుగుతానని కంగారు పడుతున్నాను. ఒకపక్క అంకుల్ కి నేనంటే బాగా అభిమానం. ఈ రెండు నెలల్లోనే భార్యని, వయస్సులో ఉన్న కొడుకునీ పోగొట్టుకున్నారు. మరోపక్క సందీప్ భార్యని నేను మొదటిసారిగా కలుసుకోబోతున్నాను.
నేను వంగి అంకుల్ కి పాదాభివందనం చేసేందుకు ముందే అంకుల్ నన్ను ఆపుజేసి నన్ను కౌగలించుకున్నారు. నేను ఇన్నిసార్లు ఇక్కడికి వచ్చినా, ఇంటికి ఒక్కసారి కూడా రాలేదని ఆయన నిష్ఠూరం వేస్తున్నారు. దీనికి నా దగ్గర ఏమీ జవాబు లేదు. నేను తెల్లముఖం వేసి ఒక అర్థం లేని నవ్వు నవ్వి ఊరుకున్నాను. ఈ మధ్య ఆయన ముందుకన్నా చాలా బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తున్నారు. ఏమయినా, ఇద్దరుఆత్మీయులని పోగొట్టుకున్న బాధని తట్టుకోవడం సామాన్యమైన విషయమేమీ కాదు. నేను సందీప్ గురించి, ఆంటీ గురించి ఏదో అడగబోయేసరికి ఆయన బొంబాయిలో ఎలా వుందని, పిల్లలు ఎలా వున్నారని అడుగుతున్నారు. నేను ఒక ప్రశ్నకి జవాబు ఇచ్చేలోగానే ఆయన మరోప్రశ్న విసురుతున్నారు. నేను ఏదోవిధంగా సంభాషణ వైఖరిని మారుద్దామని అనుకుంటున్నాను. అప్పుడే బాధ గురించిన రెండు ముక్కలు చెప్ప గలుగుతాను. నాన్నగారు ఒకటి-రెండుసార్లు మాట మార్చడానికి ప్రయత్నం కూడా చేశారు. కాని మెహతా అంకుల్ నవ్వుతూ సంబంధం లేని విషయాలు చెబుతున్నారు. పగలబడి నవ్వుతున్నారు. అప్పుడే పారుల్ మంచినీళ్ళు ట్రేలో పట్టుకొచ్చింది. నేను లేచి ఆమెతో హలో అన్నాను. ఆమె నెమ్మదిగా జవాబిచ్చింది. చాలా సౌమ్యత వున్న అందమైన అమ్మాయి. ముఖంలో అద్భుతమైన ఆత్మవిశ్వాసం. కాని కొద్దిరోజుల కిందనే మనస్సుకి తగిలిన రెండు దెబ్బలతో ఆమె ముఖంలోని కళాకాంతులు మాయమై పోయాయి. పెళ్ళి అయిన సంవత్సరంలోగానే ఆమె జీవితం ఎంత అధ్వాన్నమై పోయింది. ఇంతమాత్రం సమయంలో భార్యాభర్తలు ఒకరినొకరు సరిగా అర్థం కూడా చేసుకోలేరు. అంతేకాక….
సంభాషణ ఎలా మొదలుపెట్టాలో నిర్ధారించుకోలేకపోతున్నాను. మరో సందర్భం ఏదయినా అయితే ఏదో ఒక తేలికగా ఉండే విషయాన్ని చెప్పవచ్చు. కాని ఈ సందర్భంలో….
అప్పుడే అంకుల్ ఒక ఆర్డరు జారీ చేశారు –“ఏమర్రా, దీపక్ కి ఏదయినా కాఫీ-టిఫిన్ ఇచ్చే సంగతి చూడండి. కొన్ని ఏళ్ళ తర్వాత మన ఇంటికి వచ్చాడు.” ఆయన ఒక పాట కూడా పాడటం మొదలుపెట్టారు – బొంబాయి సే ఆయా మేరా దోస్త్… పారుల్ కాఫీ పెట్టే ప్రయత్నం చెయ్యడానికి వెళ్ళింది. అంకుల్ సంభాషణ మరో వైపుకు మరల్చారు. ఆయన ఏదో పాత సంఘటన చెప్పడం మొదలుపెట్టారు. నేను మళ్ళీ సందీప్ గురించి మాట్లాడబోయేసరికి పారుల్ కాఫీ పట్టుకువచ్చింది. నా మాట అర్ధోక్తిలో ఉండిపోయింది.
పారుల్ కాఫీ స్వయంగానే కలిపి అందరికీ ఇచ్చింది. ఉన్నట్టుండి అందరూ మౌనం వహించారు. కొంతసేపు కేవలం కాఫీ సిప్ చేసే చప్పుడు మాత్రమే వచ్చింది. కాఫీ తాగడం అయిపోయేసరికి పారుల్ నుంచి మరో ఆదేశం వినిపించింది –“మీరంతా భోజనం చేసిన తర్వాతే వెళ్ళండి.”పారుల్ ఎంత ఆత్మీయతతో, అధికారంతో ఈ మాట అన్నదో, అందులో ఇంక వద్దనే ప్రశ్న ఏదీ లేదు.
పారుల్ వెళ్ళిన తరువాత కూడా నేను చాలాసేపు మాట్లాడటానికి ఏదయినా ఆధారం దొరుకుతుందేమోనని వెతికాను. ఏదయినా వంకతోనైనా కనీసం రెండు మాటలు బాధపడుతున్నట్లుగా చెప్పాలని. ఒకటి-రెండు సార్లు ఆంటీ గురించి, సందీప్ గురించి మాట అయితే వచ్చింది కాని సంభాషణ ఎలాగో పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు ఆంటీ, సందీప్ గతించి ఒక్క నెల మాత్రమే అయింది, అయినా అంకుల్ వాళ్ళని తన జ్ఞాపకాలలోంచి కూడా తీసిపారేయడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇప్పుడు నాన్నగారూ మెహతా అంకుల్ మాట్లాడుకునేదంతా ఎప్పటిలాగే తన పాతపద్ధతిలోనే నడవసాగింది. అందులో నేనెక్కడా లేను. అవకాశం చూసి నేను గదిలోంచి బయటికి వచ్చాను. కొంచెం ఆలోచించి వంటింట్లోకి నడిచాను. అక్కడ పారుల్ వంట చేసే ప్రయత్నంలో ఉంది. నన్ను చూసి పారుల్ దిగులుతో కూడిన మందహాసం తో నన్ను స్వాగతించింది. నేను ఇక్కడ కూడా సంభాషణ మొదలుపెట్టడానికి ఆధారం వెతుకుతున్నాను. మేమిద్దరం మౌనంగానే ఉన్నాము. నన్ను పారులే ఆస్థితి నుండి బయట పడేసింది –
“బొంబాయి నుంచి ఎప్పుడు వచ్చారు మీరు?”
“ఇవాళ పొద్దున్నే. రాగానే సందీప్ గురించి తెలిసి…’
నేను నా మాట అర్ధోక్తిలో విడిచిపెట్టాను. పారుల్ కూడా మౌనంగా ఉంది. సంభాషణ క్రమాన్ని నేనే ముందుకి తీసుకువెళ్ళాను –“నిజానికి, నేను మీ పెళ్ళికి రాలేకపోయాను. అందువల్లనే మిమ్మల్ని కలుసుకోలేకపోయాను. కాని సందీప్, నేను చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. నేను మిమ్మల్ని కలుసుకుంటున్నది కూడా ఈ పరిస్థితిలో.” నా గొంతుక బరువెక్కింది.
పారుల్ కళ్ళు నీళ్ళతో నిండాయి. కొంచెం సేపట్లో తనే సంభాషణ కొనసాగించింది –“నేను మిమ్మల్ని మొదటిసారి కలుసుకుంటున్నాను. అయినా మీ గురించి నాకు చాలా తెలుసు. మామయ్యగారు, సందీప్ తరచు మీ గురించి చెబుతూఉండేవారు.” పారుల్ బహుశా కావాలనే మాట మార్చేసింది.
నేను కూడా మాటను మరో దిశగా మరల్చాలనే ఉద్దేశంతో అన్నాను –“ నేనేమయినా సహాయం చెయ్యనా?” ఆమెతో మాట్లాడుతూ ఇంకా మరికొంచెం సేపు అక్కడే సమయం గడపాలని నాకనిపించింది.
– “వద్దు. అంతా తయారైపోయింది.”
– “మీరు ఊరికేనే శ్రమ తీసుకున్నారు.”
– “ఇందులో శ్రమ తీసుకోవడం ఏముంది, నేనయితే వంట ఎలాగూ చేసుకోవాలి. రెండోది మీరు నా యింటికి మొదటిసారి వచ్చారు. సందీప్ ఉన్నాకూడా మీరు భోజనం చేసేవారు.” ఆమె కంఠస్వరం గద్గదమైంది.
– “అబ్బే, అదేం లేదు. నిజానికి ….”
– ఆమె ఏమీ జవాబివ్వలేదు.
– “ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు?” నేను సంభాషణని భవిష్యత్తువైపు మరల్చాను.
– “ఇంట్లోనే ఉండి కమర్షియల్ ఆర్ట్ కి సంబంధించిన నాకు తెలిసిన నా పాతపనిని మొదలు పెడదామనుకుంటున్నాను. సందీప్ ఎప్పటి నుంచో అంటూ ఉండేవారు రోజంతా ఇంట్లోనే కూర్చుంటావు, ఏదయినా పని చేసుకో అని. మొదట్లో అత్తయ్యగారు అనారోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు తగిలిన ఈ రెండు దెబ్బలు. నేను ఒక్కసారిగా ఒంటరిదాన్నయిపోయాను. సందీప్ చెప్పినట్లుగా చెయ్యవచ్చేసరికి ఆయనే ఉండరని నాకేం తెలుసు……”
– “నేనేదైనా సాయం చెయ్యగలిగితే చెప్పండి.”
– “చెప్తాను. ప్రస్తుతం మీరిక్కడ ఎప్పటివరకు ఉంటారు?”
– “పదిరోజులైతే తప్పకుండా ఉంటాను. మళ్ళీ కలుసుకునేందుకు వస్తాను. మీరు అటువైపుకి వచ్చే మాటయితే…..”
– “ఇంట్లోంచి బయటికి రావడమే కుదరటం లేదు. అయినా వస్తాను ఏదోరోజున.”
అప్పుడే అంకుల్ మాట వినిపించింది. –“ఇదిగో, ఇక్కడకూడా మీకోసం ఎదురు చూస్తున్న వాళ్ళున్నారు. కాస్త మాక్కూడా కంపెనీ ఇస్తే బాగుంటుంది.” నేను పారుల్ ని అక్కడే విడిచిపెట్టి డ్రాయింగ్ రూంలోకి తిరిగి వచ్చాను.
నేను చూసింది – అంకుల్ ఒక బాటిల్, మూడు గ్లాసులు అమర్చి పెట్టారు. నన్ను చూడగానే ఆయన అడిగారు –“ఇప్పుడు కూడా మీ నాన్నకి తెలియకుండానే తాగుతావా లేకపోతే ఆయనతో కూడానే కలిసి తాగటం మొదలుపెట్టావా?” అలా అని ఆయన గట్టిగా పగలబడి నవ్వారు.
– “రావోయ్, నువ్వు ఇప్పుడు వచ్చిన ఈ విజిట్ ని సెలబ్రేట్ చేసుకుందాం.”
అరవైఅయిదేళ్ళ ఈవయోవృద్ధుడు, బలహీనంగా ఉన్న ఈ పెద్దాయన రెండు చావుల దుఃఖం నుంచి నిజంగా తేరుకున్నాడా లేకపోతే ఈ అట్టహాసాలకి, వేళాకోళాలకి, ఈ సారాగ్లాసులకి వెనకాల తన బాధని, దుఃఖాన్ని బలవంతంగా మానుంచి దాస్తున్నాడా అన్నది నాకు అర్థం కావడంలేదు. నాన్నగారు ఇప్పుడు కిటికీలోంచి బయటికి చూస్తున్నారు.
***
సూరజ్ ప్రకాష్ – పరిచయం
14 మార్చి 1952 న దెహరాదూన్, ఉత్తరాఖండ్ లో జన్మించిన శ్రీ సూరజ్ ప్రకాష్ సాహిత్యం విస్తృతమైనది. ఇప్పటి వరకు ఆయన 9 కథాసంకలనాలు, నాలుగు నవలలు ప్రచురితమయ్యాయి. చార్లీచాప్లిన్ ఆత్మకథ అనువాదంతో సహా ఇంగ్లీషు నుంచి అయిదు పుస్తకాలు, మహాత్మాగాంధీ ఆత్మకథ అనువాదంతో సహా గుజరాతీ నుంచి ఎనిమిది పుస్తకాల అనువాదం ప్రచురితమయింది. రెండు వ్యంగ్య సంకలనాలు, పది సంపాదకత్వం వహించిన పుస్తకాలు ఆయనకు చెందినవి. ఆయన గుజరాత్ సాహిత్య అకాడమీ, మహారాష్ట్ర సాహిత్య అకాడమీల ద్వారా సన్మానం పొందారు. రిజర్వ్ బ్యాంక్ లో డిప్యూటీ జనరల్ మానేజరుగా రిటైర్ అయిన తరువాత శ్రీ సూరజ్ ప్రకాష్ ప్రస్తుతం గురుగ్రామ్ వాస్తవ్యులు.
బహుభాషావిదులైన డా. రావు (1948) గారి చాలా స్వీయ, అనువాదిత కథలు, వ్యాసాలు, కవితలు తెలుగు, హిందీలలో ప్రచురితమయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషుల మధ్య అనువాదంలో సుదీర్ఘ అనుభవంతో ఒక నవల, 200కి పైగా కథలు, కవితలు అనువదించారు. త్రిభాషా నిఘంటువులో సహసంపాదకత్వం చేశారు. వేరువేరు సమయాల్లో రిజర్వ్ బ్యాంక్ కి చెందిన కొన్ని పత్రికలకు సంపాదకునిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ద్వారా పండిత్ శివసేవక్ తివారీ స్మృతి పతకంతోనూ, అరసం గుంటూరు జిల్లా యూనిట్ ద్వారా శారదాంకిత స్వర్ణపతకంతోనూ సన్మానితులు. రష్యన్ కవితల అనువాదానికి ముంబయిలోని రష్యన్ ఎంబసీ ద్వారా ప్రశంసించ బడ్డారు. తెలుగు కవితలకు వేరువేరు సంస్థల ద్వారా సన్మానం పొందారు. రిజర్వ్ బ్యాంక్ లో జనరల్ మేనేజరు స్థాయిలో రిటైర్ అయ్యాక ముంబయిలో ఉంటున్నారు.