పేషంట్ చెప్పే కథలు – 32
వస్తువు
–ఆలూరి విజయలక్ష్మి
పేషేంట్స్ వెయిటింగ్ హాల్ లో ఉన్న మ్యూజిక్ ఛానెల్ లో ఏం. ఎస్. సుబ్బలక్ష్మి కంఠం త్యాగరాయ కృతుల్ని వినిపిస్తూంది. అక్కడ డాక్టర్ శృతిచేత పరీక్ష చేయించు కోవడం కోసం వేచివున్న వారిలో కొంతమందికి ఆ సంగీతం ఏంతో ప్రశాంతతను కలిగి స్తూంటే, సినిమా పాటలంటే చెవికోసుకునే కొందరికి విసుగును కలిగిస్తూంది. విపరీత మైన టెన్షన్ తో శృతి రాక కోసం ఎదురుచూస్తున్న సీతారత్నం చెవుల్లోకి ఆ సంగీత తరంగాలు ప్రవేశించడం లేదు.
ఆపరేషన్ చేసి ఛాంబర్ లోకి హడావిడిగా వచ్చిన శృతిని చూడగానే సీతారత్నం గుండె కొంచెం కుదుటపడింది. మళ్ళీ అంతలోనే ఆందోళన. పరీక్ష చేసాక ఏం చెపుతుం దోననే భయం, “మీకు గర్భమేనమ్మా! మూడోనెల” అంది గ్లోవ్స్ తీసేస్తూ శృతి. పరీక్ష బల్లదిగి ప్రక్కన నుంచుని నేలచూపులు చూస్తూంది సీతారత్నం. “ముగ్గురు పిల్లలుండగా యింకా ఎందుకు ఆపరేషన్ చేయించుకోలేదు మీరు? ఆపరేషన్ చేయించుకోకుండా ఇప్పుడు దిగులుపడితే ఏం లాభం?” ప్రతిరోజూ ఇలాంటి పరిస్థితిలో వచ్చే స్త్రీలను చూసి చూసి ఎప్పటికి మారతారు వీళ్ళు? కాదు కాదు ఎప్పటికి మారానిస్తారు వీళ్ళను? ఎప్పటికి ఈ పిల్లల్ని కనే యంత్రాలకు నిర్ణయాధికారం లభిస్తుంది? అనుకుంది శృతి.
“అమ్మగారూ! బైటోచ్చేయడానికి మందులివ్వండి” కళ్ళెత్తి భయంగా చూస్తూ అడిగింది సీతారత్నం.
“గర్భం వచ్చాక మందులతో బహిష్టు రాదు. చిన్న ఆపరేషన్ చేసి గర్భాన్ని తీసేయాలి”. అంది శృతి… తప్పదు. అక్కర్లేని ప్రసవాల బాదేకాదు, నివారించగలిగిన గర్భస్రావాలు బాధకూడా ఈ పిల్లల్ని కనే యంత్రాలకు తప్పదు. రోజూ చూసే సంఘట నలే అయినా ఎప్పటికప్పుడు శృతి మనసులో కలత.
“రెండు నెలలే కదమ్మగారూ! తొందరగా వస్తే మందులతో పోతుందని యింత తొందరగా వచ్చాను. మంచి మందేదన్నా రాసివ్వండి” బ్రతిమాలుతున్నట్లుగా అడిగింది సీతారత్నం.
“చెప్పాను కదమ్మా! మందులవల్ల గర్భం పోదు… సరోజా! ఈవిడను బయటకు తీసుకెళ్ళి మళ్ళీ ఓ సారి వివరంగా చెప్పు” అంటూ నర్స్ ని చెప్పమని పురమాయించి మరో పేషెంట్ ని పిలవమని చెప్పబోతున్న శృతికి అడ్డొచ్చింది సీతారత్నం.
“అమ్మగారూ! కొంచెం ఈ నర్సుగారిని బయటికి పంపి నేను చెప్పేది వినండి” అతి దీనంగా ఉన్న ఆమె స్వరం విని పరిశీలనగా ఆమె ముఖం వంక చూసింది శృతి. నీళ్ళు నిండిన కళ్ళు, ఆందోళనతో అదురుతున్న పెదాలు, స్పష్టంగా కనిపిస్తున్న ఆమె శరీరంలోని వణుకు, ఆమె పరిస్థితిని గమనించకుండా ఆమె మనసు విప్పి చెప్పుకోవ డానికి అవకాశమివ్వనందుకు శృతి బాధపడింది. నర్సుని బయటకు వెళ్ళమని చెప్పి సీతారత్నంని కూర్చోమని సైగ చేసింది. “ఎందుకంత భయపడుతున్నావు? ఏమీ నొప్పి తెల్వకుండా చేస్తాను. ఎంతోసేపు పట్టదు. ధైర్యంగా ఉండు”. శృతి ఓదార్పు స్వాంతనను కలిగిస్తున్నప్పటికీ కడుపులో నుండి తన్నుకు వస్తున్నా భయాందోళనలు సీతారాత్నాన్ని నిలవనివ్వడంలేదు.
“నువ్వు వచ్చేప్పుడు మీ ఆయనను కూడా తీసుకురా, అతనికి వాసెక్టమీ ఆపరేషన్ చేయించేస్తాను”. సీతారత్నం శృతి మాటలు విని ఏడుపు మొదలు పెట్టింది. భర్త ఒప్పుకోడనే భయంతో ఆమె ఏడుస్తోందని అనుకుంది శృతి.
పిచ్చిదానిలా ఏమిటా ఏడుపు? మీ ఆయన చేయించుకోవడానికి ఒప్పుకోకపోతే ఎబార్షన్ తో పాటే నీకు ట్యూబెక్టమీ చేసేస్తాను” అంది శృతి. సీతారత్నం ఏడుపు ఇంకా ఎక్కువ యింది.
“అంత భయంగా ఉంటె పోనీ గర్భాన్ని ఉంచేసుకుని డెలివరీ అయ్యాక ట్యూబెక్టమీ చేయించుకో”. శృతి చెప్పిందివిని సీతారత్నం కళ్ళు భయముతో వెడల్పుగా అయ్యాయి.
“ఆమ్మో! ఉంచుకోవడమే! ఇంకేమన్నా ఉందా?” గుండెమీద చెయ్యేసుకుని అంటున్న సీతారత్నం భయంలోని తీవ్రతను గమనించి శృతి ఏంచెయ్యాలో పాలుపో లేదు.
మరయితే ఏం చేస్తావు? గర్భం ఉంచేసుకోమంటే ఆమ్మో ఉంచేసుకోవడమే అంటావు పోనీ తీసేస్తాను అంటే ఏడుపు మొదలు పెడుతున్నావు. నీతో ఎలా? పోనీ ఇంటికి వెళ్ళి మీ ఆయనతో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకో” సామాన్యంగా అతని నిర్ణయాన్ని ఆమె శిరసా వహించడమే తప్ప కలిసి ఆలోచించుకుని నిర్ణయించుకోవడానికి అవకాశం ఉండదని శృతికి తెలుసు. కానీ సందిగ్ధంలో ఉన్న సీతారత్నానికి అంతకు మించి సలహా ఇవ్వలేకపోయింది.
“మా ఆయనతో చెప్పలేను. నాకు గర్భమని తెలిస్తే నన్ను చంపి కాకులకూ, గెద్దలకూ వేస్తాడమ్మా!’ వధ్యశిల నెక్కబోతున్న దానిలా వజవజ వణికిపోతూందామె.
“అదేంటి? ఎందుకలా చేస్తాడు?” విస్తుపోతూ అడిగింది శృతి.
“మా ఆయన ఆపరేషన్ చేయించుకుని అప్పుడే మూడేళ్ళు దాటిందమ్మా!” ఆందోళనతో అల్లల్లాడిపోతూంది సీతారత్నం. ఆశ్చర్యంగా ఆమె వంక చూస్తున్న శృతి అంతలోనే తమాయించుకుంది.
“ఒకోసారి వాసెక్టమీ ఆపరేషన్ విఫలం కావచ్చు. అలాంటప్పుడు గర్భం రావచ్చు” సీతారత్నానికి ధైర్యం చెప్పడం కోసం అలా చెప్పింది కానీ భర్త వాసెక్టమీ చేయించు కున్నాక భార్యకు గర్భం రావడానికి కారణం సామాన్యంగా ఆపరేషన్ ఫెయిల్ అవడం కాదని శృతికి తెలుసు. కానీ కాపురాలు విచ్చిన్నతకు దారితీసే ‘స్త్రీ శీలం’ అనే అంశానికి సంబంధించిన వాటిని తనంతట తానూ ప్రస్తావించదు.
అణుచుకోలేని అలజడితో వణికిపోతూంది సీతారత్నం. ఎబార్షన్ చేయించు కోవడానికి యెంత ఖర్చువుతుందో! ఆయనకు తెలియకుండా ఎలా డబ్బు తీసుకు రావడం?… హాయిగా కాకపోయినా పెద్ద ఒడిదుడుకులేమీ లేకుండా గడిచిపోతున్న కాపురంలో తానే చేజేతులా నిప్పులు పోసుకుంది. ఇల్లు, భర్త, పిల్లలు తప్ప వేరే ప్రపంచం తెలియని తననీ ఉచ్చులోకి లాగింది ప్రక్కింటి హైమ.
అప్పుడప్పుడు పూజకు తమ పెరట్లోని పువ్వులకు వచ్చే హైమ తనను పనిచేసుకో నివ్వకుండా గంటలు గంటలు పట్నం కబుర్లు చెబుతూ కూర్చునేది. పట్నం మనుషుల కబుర్లు, సినిమాల కబుర్లు, సినిమాల నటుల కబుర్లు, మార్కెట్ లోకి వస్తున్నా రకరకాల అధునాతన వస్తువుల గురించి ఆ వస్తువులు యిచ్చే సౌఖ్యాలు, సంతోషాల గురించి విరామం లేకుండా ఆకర్షణీయంగా చెప్పేది. ముందు మొహమాటానికి, తరువాత విసుగుతో, ఎప్పుడీ వాగుడుకాయ వెళ్ళిపోతుందా ఎప్పుడు పనిచేసుకుందామా అని ఎదురు చూచే తాను ఎప్పుడు ఆవిడ మాటల్ని ఆసక్తితో వినడం మొదలు పెట్టిందో గుర్తులేదు.
“ఏంటి సీతా? చివరకు గుడిసెల్లో వుండేవాళ్ళు కూడా టేప్ రికార్డర్, టి.వి. కొనుక్కో కుండా లేరు. పెంకుటింట్లో ఉండేదానిని నీకవి లేకపోవడమేమిటి? చక్కగా ఒక ‘మిక్సీ’ కొనుక్కుంటే చేతులు పడిపోయేలాగా రుబ్బుల్లు, దంపుల్లు ఉండవు గదా!” ఒకరోజు హైమ చెప్పిన మాటలు విని నవ్వేసింది తను. ఉన్న నాలుగెకరాల కొండ్ర తుఫాను దెబ్బతగల కుండా ఉంటె తమకు సంవత్సరానికి సరిపడా ఆధారం కల్పిస్తుంది. చాలీ చాలనిడబ్బు, ఎప్పుడూ యేవో అవసరాలు ఎదురు చూస్తూ ఉండడం వల్ల ఉన్నకాస్తా డబ్బును చూచి చూచి అతిపొదుపుగా ఖర్చుపెట్టడం అలవాటయిపోయింది. అసలు అస్తమానం ఏదో ఒక పనితో, ఇంటిపని, గొడ్లపని, కోళ్ళ పనితో తనకు వేరే వాటిని గురించి ఆలోచించడానికి తీరికవుండదు.
“చాల్లే! ఏపూటకాపూట ఇంట్లో అందరికీ అయిదు వేళ్ళు నోట్లోకి వెల్లడమెలాగా అని నేనేడుస్తూంటే ఇంకా కలర్ టి.వి. మిక్సీలు కూడానా నా మొఖానికి! పెట్టిపుట్టిన వాళ్ళు కొనుక్కోగలరు అవన్నీ, మాకెందుకు లేమ్మా ఆ భోగాలన్నీ”అంది తను.
“భోగాలేమిటి? ఇవి కూడా భోగాలేనా? ఇవేమన్న ఏ.సి.కార్లా, అందమైన భవంతుల? ఇవి కొనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. కోరుకుంటే కోటీదార్లు” హైమ కబుర్లు ఒత్తి డబ్బా కబుర్లులాగా అనిపించాయి తనకు.
“ఏమోనమ్మా! నాకే దార్లూ తెలీవు. నాకేమీ గొంతెమ్మ కోర్కెలూ లేవు. ఓపికున్నంత వరకు చాకిరీ చెయ్యడం, కలిగింది తినడం, అంటే నా బ్రతుకు” అంది ముక్తసరిగా తాను. కానీ… తనకు శనిదేవత నెత్తిమీదుంది తరువాత తరువాత హైమ మాయమాటల్లో పడి పోయింది. కోరిన వస్తువుల్ని కొనుక్కోవడానికి డబ్బు సంపాదించే దారి సంగతి ఆమె చెప్పింది విని తన మతి పోయింది. గుండె దడ దడలాడిపోయింది.
‘ఛీ! ఇదా నువ్వు నాకు చెప్పేదారి? ఎన్నడూ మా ఇంటా వంటా లేవిలాంటి దరిద్రపు పనులు’ అంటూ హైమ మీద విరుచుకు పడింది తాను. అప్పుడు తెలిసింది తనకు ఆమె కంటే తక్కువ పొలం ఉన్న హైమ ఇంట్లోకి అన్ని కొత్తకొత్త వస్తువులెలా వస్తున్నాయో? అంత దగుల్బాజీ పని తనెన్నటికీ చెయ్యదు. తమ వంశం ఎలాంటిది? నిప్పులాంటి వంశం. ఇంత వరకు తమ వంశంలోని వాళ్ళెవరూ ఇతరులచేత వ్రేలెత్తి చూపించుకోలేదు.
కానీ హైమ తాను చెప్పిందివిని ఎద్దేవా చేసింది. “మీ వంశమంతా నిప్పుకాదు. మీ వంశంలోని ఆడవాళ్ళు మాత్రమే నిప్పులు. మీ ఆయన, మీ అన్నదమ్ములు అందరూ గ్రంథసాంగులే” అంది. “మీ ఆయన చేస్తే తప్పుకానిది నువ్వు చేస్తే తప్పు అవుతుందా?” అని నిలదీసింది. ఇంకేవేవో చెప్పి, వాదించి, తన బుర్రపాడుచేసి ఏ రొష్టూలేకుండా బ్రతుకుతున్న తననీ ఊబిలోకి దింపింది.
“ఎమ్మా! ఏం చేస్తావు?” శృతి ప్రశ్నతో సీతారత్నం హృదయంలోని న్యూనత, పత్సాత్తాపం, దుఃఖం ఒక్కసారి వెల్లువలా పొంగి బయటికి దుమికింది. చటుక్కున మంగళ సూత్రాలు కాక తన ఒంటి మీదవున్న ఒకే ఒక బంగారు వస్తువు వ్రేలి ఉంగరాన్ని తీసి శృతి టేబుల్ మీదపెట్టి ఆమె కాళ్ళమీద పడింది.
“అమ్మగారూ! ఇది తీసుకుని నా కడుపులోని పాపాన్ని తీసేయండి. ఒక దరిద్రపు గొట్టుదాని మాటల్ని విని నా బుద్ధి చెడిపోయింది. పట్నంలో లాడ్జింగ్ కి తీసుకెళ్ళి ఎవడో మగాడికి నన్ను అప్పగించింది. అప్పుడుగాని నా ఒళ్ళు నాకు తెలియలేదు. నేను చేసింది యెంత తప్పుడు పనో నాకు తెలిసొచ్చేసరికి జరగాల్సిన ఘోరం జరిగి పోయిం దమ్మా!” అని వెక్కి వెక్కి ఏడుస్తూన్న సీతారత్నాన్నేలా ఓదార్చాలో శృతికి తెలియలేదు. తన కాళ్ళను విడిపించుకుని ఆమెను లేపి స్టూల్ మీదకూర్చొబెట్టింది. ప్రేమచేతనో, ఆకర్షణ చేతనో, సెక్స్ పరమైన వాంఛలు తీరే అవకాశంలేకో, తనని, తన బిడ్డల్ని ఆకలి చావుకు గురవకుండా బ్రతికించుకోవడానికో కాదీమె వివాహేతర లైంగిక సంబంధాన్ని పెట్టుకుంది. వస్తువ్యామోహంతో అజ్ఞానంతో తన శరీరాన్ని అమ్ముకున్న ఆమెను చూసి జాలిపడాలో, కోపం తెచ్చుకోవాలో అర్థంకాలేదు శృతికి.
“మైకం విడిపోయి నా పొరపాటు నాకు తెల్వగానే యింత విషం మింగి చావాలని పించింది. చెడిపోయినదాన్ని! ఆ ఇంట్లో నా పిల్లలతో, భర్తతో ఏమీ జరగనట్లు మునుప టిలా ఎట్లాబ్రతకగలననిపించింది. కానీ.. చేజేతులా బ్రతుకుని పాడుజేసుకున్న నాకు చావడానికి దైర్యం చాలడం లేదు”. అంటూ కుమిలి కుమిలి ఏడుస్తూ ఆగి, ఆగి చెబుతోంది సీతారత్నం.
‘తర తరాల భావజాలంలో బంధింపబడిన ఈమె వివాహం, పాతివ్రత్య్రం, శీలం, నీతి, అవినీతులను గురించి ఆ భావజాలపు పరిధిలోనే ఆలోచించడం సహజం’ అనుకుంది శృతి.
“ఎవరికీ చెప్పుకోలేని ఈ సమస్యతో నా బుర్రనిండా నింపిన గందరగోళంలో నా కళ్ళకు పొరలు కమ్మాయి. హైమచెప్పిన వస్తువుల మీద కోరికో, లేక ఎవరెవరితోనో తిరుగు తున్నా మా ఆయన మీద కోపంతోనో ఆమె మాటల ఉచ్చులో పడిన నాకు బురదలోపడిన వాళ్ళను బయటకులాగే ప్రయత్నం చెయ్యాలె తప్ప మనమూ బురదలోకి జారకూడదనే ఇంగితం లేకపోయింది” పస్చాత్తాపంతో దగ్ధమవుతున్న సీతారత్నం వంక జాలిగా చూసింది శృతి. మ్యూజిక్ చానెల్లో వయోలిన్ నాదం విషాదంగా వినిపిస్తూంది.
*****
డా.ఆలూరి విజయలక్ష్మి ప్రముఖ రచయిత్రి, వైద్యులు, సంఘసేవకులు. దాదాపు 150 కథలు, 5 కథా సంపుటాలు, 4 నవలలు, 3 వైద్య సంబంధ గ్రంథాలు రచించారు. అనువాదాలు కూడా చేసారు. వీరి రచనలు వివిధ వార, పక్ష, మాస, దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు ఆకాశవాణి విశాఖ పట్టణం, విజయవాడ కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి. వనిత మాసపత్రికలో ‘ఆరోగ్య విజయాలు’ అనే శీర్షికను నిర్వహించారు.