పౌరాణిక గాథలు -23
-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి
వ్యసనము – నలమహారాజు కథ
రుచిగా వంట చేసేవాళ్ళ పేర్లు చెప్పమంటే నలుడు, భీముడు అని వెంటనే సమాధానం చెప్పేస్తాం. నలుడు చేసిన పాకాన్ని (వంటని) నలపాకం అంటారు. ఇప్పటి వరకు ఆయన వంట గురించి చెప్పుకుంటున్నాము అంటే అంత రుచిని తెప్పించే కిటుకులేవో ఆయన దగ్గర ఉండే ఉంటాయి.
నలమహారాజుకి కొన్ని శక్తులు ఉన్నాయి. కొంచెం గడ్డిని చేత్తో తీసుకుని విసిరితే చాలు నిప్పు పుట్టేదిట. కట్టెలు అవసరం లేకుండా… ఇంక వంట పూర్తయింది చాలు అనేవరకు అది మండుతూనే ఉండేదిట. అలాగే ఏ పాత్రలోకి నీళ్ళు కావాలో ఆ పాత్రవైపు చూసి “దీనిలోకి నీళ్ళు కావాలి!” అనుకుంటే చాలు ఆ పాత్ర నీళ్ళతో నిండి పోయేదిట. చప్పట్లు కొట్టగానే వంటకి సరిపడిన సామాను మొత్తం వచ్చేసేది. ఆయన దగ్గర అన్ని కిటుకులు ఉన్నాయి కనుకనే పదార్ధాల్లో అంత ఘుమఘుమలు.
మనం చెప్పుకుంటున్న ఈ నలమహారాజు నిషధ దేశాన్ని పాలించేవాడు. ఆయన తండ్రి పేరు వీరసేనుడు. ఒకరోజు నలమహారాజు ఉద్యానవనంలో విరగపూసిన చెట్ల అందాల్ని చూస్తూ విహరిస్తున్నాడు. ఆ సమయంలో అందాలు చిందే హంస ఒకటి ఆయన దగ్గర వాలింది. దాన్ని చూసి ముగ్ధుడై చేత్తో పట్టుకున్నాడు రాజు. ““మహారాజా! నన్ను విడిచిపెట్టండి!”” అని మనిషి భాషలో అంది హంస. నలుడు దాన్ని విడిచిపెట్ట లేదు.
““మహారాజా! మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను”” అంది హంస.
““ఆలస్యమెందుకు చెప్పు!”” అన్నాడు రాజు.
““మీకు రాజకుమారి దమయంతి అంటే చాలా ఇష్టం కదా? మీ గురించి రాజకుమార్తెకి వివరంగా చెప్తాను. మీ గుణగణాలు విని దమయంతి మిమ్మల్నే పెళ్ళి చేసుకునేట్టు చేస్తాను నన్ను వదలండి”” అంది. మహారాజు దాన్ని సంతోషంగా వదిలేశాడు.
అది రివ్వున అకాశంలోకి ఎగిరిపోయింది. రాజుకిచ్చిన మాట ప్రకారం ఉద్యానవనంలో తిరుగుతూ విరబూసిన పువ్వుల అందాల్ని చూస్తున్న దమయంతి దగ్గర వాలింది. అక్కడ వాలిన హంసని దమయంతి ఆనందంగా పట్టుకుంది. హంస మనిషి భాషలో ““రాజకుమారీ!”” అని పిలిచింది.
ఆశ్చర్యంగా చూసింది దమయంతి. ““నీ అందచందాలకి తగిన వరుణ్ని చూసి వచ్చాను. అతడంటే నీకు కూడా ఇష్టమే అని తెలుసులే! నిన్ను తప్ప ఇంకెవర్నీ పెళ్ళి చేసుకోనని భీష్మించుకుని కూర్చున్నాడు. నీ దగ్గరికి వెళ్ళి అతడి గురించి చెప్పమన్నాడు”” అంది హంస.
“ “ఆ రాజకుమారుడు ఎవరు?”” అని అడిగింది దమయంతి.
“ “నిషధదేశపు రాజు, వీరసేనమహారాజు కొడుకు నలమహారాజు”” అని చెప్పింది హంస.
ఆ పేరు వినగానే అనందంతో సిగ్గు పడింది దమయంతి. ““నాకంతా అర్థమయి పోయిందిలే! నేను వచ్చిన పని కూడా పూర్తయి పోయింది”” అంటూ ఆకాశంలోకి ఎగిరి పోయింది హంస. దీన్నే ‘’హంస రాయబారం’’ అంటారు.
దమయంతి తండ్రి స్వయంవరం ప్రకటించాడు. ఆమె అందచందాలు విని చాలా మంది రాజకుమారులు స్వయంవరానికి వచ్చారు. అందులో నలమహారాజు కూడా ఉన్నాడు. నలుగురు దిక్పాలకులు కూడా స్వయంవరానికి వచ్చారు. వాళ్ళు నలమహా రాజుని కలిసి “ “రాజా! మా నలుగురికీ దమయంతి అంటే చాలా ఇష్టం. మాలో ఒకళ్ళని వరించమని చెప్పు”” అన్నారు.
నలుడికి ఏం చెయ్యాలో తోచలేదు. తనేమో దమయంతిని పెళ్ళి చేసుకోవాలని స్వయంవరానికి వచ్చాడు. వీళ్ళేమో తమని చేసుకునేలా సహాయ పడమని అడుగు తున్నారు. దిక్పాలకులు అడిగినప్పుడు చెయ్యాలి కదా? అనుకుని ’’‘సరే’’ అన్నాడు.
దిక్పాలకులు ఎవరికీ కనిపించకుండా అంత:పురంలోకి వెళ్ళగలిగే శక్తిని నలుడికి ఇచ్చారు. ఆ శక్తితో దమయంతి దగ్గరకి వెళ్ళి ““దమయంతీ! దిక్పాలకులు నలుగురూ స్వయంవరానికి వచ్చారు. వాళ్ళల్లో ఒకళ్ళని వరించు!”” అని చెప్పాడు.
““నేను నలమహారాజుని తప్ప వేరేవాళ్ళేవర్నీ వరించను”” అని గట్టిగా చెప్పింది దమయంతి.
నలుడు దిక్పాలకుల దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు. దమయంతి నలుణ్ని ఎలా వరిస్తుందో మేమూ చూస్తాం అనుకుని వాళ్ళు నలుగురూ నలమహారాజు రూపంలో స్వయంవరానికి హజరయ్యారు.
చేతిలో పూలమాలతో వచ్చిన దమయంతి రాజకుమారులందరి వైపు చూసి నలమహారాజు కోసం వెతికింది. ఆమెకు అయిదుగురు నలమహారాజులు కనిపించారు. కొంచెంసేపు మౌనంగా తలవంచుకుని నిలబడింది. తరువాత తలయెత్తి వాళ్ళవైపు చూసి “ “అయ్యా! నేను నలమహారాజుని వరించాలని అనుకున్నాను. మీ అయిదుగురిలో అసలైన నలమహారాజు ఎవరో పోల్చుకోలేక పోతున్నాను. మీరు నా మీద దయ తలిస్తే ఆయన్ని వరిస్తాను”” అని ప్రార్ధించింది.
దిక్పాలకులు ఆమె ప్రార్ధన విని తమ తమ రూపాల్లోకి వచ్చేశారు. నలదమయంతు ల పెళ్ళి వైభవంగా జరిగింది. నలుడు దమయంతిని తీసుకుని తన రాజ్యానికి వెళ్ళి పోయాడు. కలి కూడా దమయంతిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. దమయంతి ఇష్టపడిన నలమహారాజు మీద ఈర్ష్య కలిగింది. ఏమయినా సరే అతణ్ని నాశనం చెయ్యాలని అనుకున్నాడు. ఈర్ష్య ఎంత భయంకరమైందో మనకు తెలుసు కదా!
నలదమయంతులకి ఇద్దరు పిల్లలు కలిగారు. కొడుకు ఇంద్రసేనుడు, కూతురు ఇంద్రసేన. సమయం కోసం ఎదురు చూస్తున్న కలి ఒకరోజు నలమహారాజు అపవిత్రంగా ఉన్న సమయం చూసుకుని అతనిలో ప్రవేశించాడు.
కలి తన పినతండ్రి పుష్కరుడి దగ్గరికి వెళ్ళి నలమహారాజు జూదమాడడంలో సిద్ధహస్తుడని, అతణ్ని పిలిచి జూదమాడమని చెప్పాడు. తనతో జూదమాడడానికి రమ్మని పుష్కరుడు నలమహారాజుకి కబురు చేశాడు. నలదమయంతుల్ని విడదీయా లన్న ఉద్దేశ్యంతో తను కూడా బ్రాహ్మణ వేషంలో అక్కడే కూర్చున్నాడు కలి.
పుష్కరుడితో జూదమాడుతున్న నలుడు ఓడిపోతున్నాడు. దమయంతి హెచ్చరి స్తూనే ఉంది. కాని, జూదం మీద ఉన్న వ్యామోహంతో ఆమె మాటని లక్ష్యపెట్టలేదు నలుడు. చివరికి రాజ్యాన్ని కూడా ఓడిపోయాడు.
నలుడు రాజ్యాన్ని పుష్కరుడికి అప్పగించి కట్టుబట్టలతో అడవులకి బయలు దేరాడు. దమయంతి కూడా పిల్లల్ని తన తల్లితండ్రులకి అప్పగించి భర్త వెంట వెళ్ళిం ది. అడవిలో తిరుగుతూ తిరుగుతూ అకలికి తట్టుకోలేక నలుడు తను కట్టుకున్న బట్టని తీసి ఎగురుతున్న పక్షుల మీదకి విసిరాడు. పక్షులు కిందపడలేదు కాని, ఆ బట్టని కూడా తమతో తీసుకుని వెళ్ళిపోయాయి. ఏమీ చెయ్యలేక దమయంతి చీరలో సగం భాగాన్ని చింపుకుని కట్టుకున్నాడు.
ఒకరోజు రాత్రి అడవిలో ఇద్దరూ నిద్రపోతున్న సమయంలో నలుడికి మెళుకువ వచ్చి దమయంతి వైపు చూశాడు. “” ‘దమయంతి గారాబంగా పెరిగింది, సుకుమార మైంది, అందమైంది. ఈమెను పెళ్ళి చేసుకుని బాధపెడుతున్నాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తను ఒక్కత్తే ఉండలేక తల్లితండ్రుల దగ్గరికి వెళ్ళిపొతుంది’” అని ఆలోచించాడు. రాత్రికి రాత్రే ఆమెని అడవిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు.
గమ్యం లేకుండ తిరుగుతున్న అతడికి మంటల్లో చిక్కుకున్న ఒక పాము కన్పించింది. దాన్ని కాలిపోకుండా రక్షించాడు. పాము క్రూర జంతువు కదా… దాని స్వభావం ప్రకారం అది నలుణ్ని కరిచింది. తనను రక్షించాడన్న కృతజ్ఞత లేకుండా నలుణ్ని కరిచింది అని అనుకోకండి… అది కరవగానే అందమైన నలుడి ఆకారం వికృతంగా మారింది.
తన రూపాన్ని చూసుకుని బాధపడుతున్న నలుణ్ని చూసి “ “రాజా! నా పేరు కర్కోటకుడు. ఎంత కర్కోటకుణ్నయినా నువ్వు చేసిన ఉపకారాన్ని మర్చిపోయేంత క్రూర స్వభావం కలవాణ్ని మాత్రం కాదు. ఈ రూపం మిమ్మల్ని ఎవరూ గుర్తించకుండా ఉంచి కాపాడుతుంది. ప్రజల్లోకి వెళ్ళి స్వేచ్ఛగా జీవించండి. ’ఋతుపర్ణుడు’ అనే మహారాజుకి వంటవాడి అవసరం ఉంది. మీకు ఆ విద్య తెలుసు కనుక ఆయన దగ్గర వంటవాడిగా చేరండి. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ రూపం మీకు వచ్చేస్తుంది. మీకు తెలిసిన ’అశ్వహృదయం’ అనే విద్యని ఋతుపర్ణ మహారాజుకి నేర్పించి ఆయనకు తెలిసిన ’అక్షహృదయం” అనే విద్యని మీరు నేర్చుకోండి. మీకు అంతా మంచే జరుగుతుంది”” అని చెప్పి కర్కోటకుడు వెళ్ళిపోయాడు.
కర్కోటకుడు చెప్పినట్టే నలుడు ఋతుపర్ణుడి దగ్గర ’బాహుకుడు’ అనే పేరుతో వంటవాడుగా చేరి అక్కడే ఉండిపోయాడు. బహుకుడే నలమహరాజని తెలుసుకున్న దమయంతి తండ్రి అతణ్ని ఎలా రప్పించాలా అని ఆలోచించాడు. దమయంతితో సంప్రదించాడు. ఆమె ఆలోచన ప్రకారం దమయంతికి స్వయంవరం ప్రకటించామని… వెంటనే బయలుదేరి రమ్మని ఋతుపర్ణుడికి కబురు పంపించాడు. స్వయంవరానికి ఒక్క రోజే సమయం ఉంది. ఒక్క రోజులో రథం నడిపి స్వయంవరానికి చేర్చగలిగినవాడు ఒక్క నలమహారాజే. అంత వేగంగా రథం నడిపించుకుని ఋతుపర్ణుడు స్వయంవరానికి రాగలిగితే ఆ రథ సారథి ఖచ్చితంగా నలుడే!
ఋతుపర్ణుడు బాహుకుణ్ని సారథిగా చేసుకుని విదర్భకి ప్రయాణమయ్యాడు. దారిలో కనిపించిన తాటి చెట్లని చూసి దానికి ఎన్ని కాయలు ఉన్నాయో, ఎన్ని ఆకులు ఉన్నాయో లెక్కపెట్టకుండ చెప్పాడు. బాహుకుడు చెట్టుకున్న కాయలు ఆకులు లెక్కపెట్టుకుని ఋతుపర్ణుడు సరిగానే చెప్పాడని అనుకున్నాడు. ఋతుపర్ణుడికి అక్షహృదయం అనే విద్య తెలుసునని అతడికి అర్థమయింది. ఒక్క రోజులో విదర్భకు చేర్చగలిగిన బాహుకుడికి ’అశ్వహృదయం’ తెలుసునని ఋతుపర్ణుడు గ్రహించి ఆ విద్యని తనకి నేర్పమన్నాడు. బాహుకుడు ఋతుపర్ణుడికి అశ్వహృదయం నేర్పించి తను అక్షహృదయం నేర్చుకున్నాడు.
స్వయంవర సమయానికి విదర్భ చేరారు కాని, అక్కడ రాజులెవరూ కనపడలేదు. ఋతుపర్ణుడు తను సరిగా విన్నాడో లేదో… స్వయంవరానికే కదా తనను పిలిచారు. రాజులెవరూ కనబడట్లేదే” అని అలోచిస్తున్నాడు.
దమయంతి బహుకుణ్ని చూసి ఆకారంలో వికారంగా కనిపిస్తున్నా రాజలక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనుకుంది. చెలికత్తెని పిలిచి రథ సారథి బాహుకుడు ఎక్కడ వంట చేసుకుంటున్నాడో చూసి పలకరించి రమ్మంది.
చెలికత్తె బాహుకుడితో మాటలు కలిపి ఆ విషయాలు తెలుసుకుని దమయంతికి చెప్పింది. బాహుకుడు నలుడేనన్న నమ్మకం కుదిరింది. దమయంతి పిల్లలిద్దర్నీఅతడి దగ్గరికి పంపించింది. పిల్లల్ని చూసిన ఆనందంతో నలుడు వాళ్ళకి ఎదురెళ్ళి ఎత్తుకుని ముద్దు చేశాడు.
జరిగిన విషయం దమయంతి తండ్రికి చెప్పింది. దమయంతి తండ్రి నలమహా రాజుని ఇంటికి పిలిచి అతడితో మాట్లాడమని దమయంతికి చెప్పాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోడం వింటున్న వాయుదేవుడు ““నలమహారాజా! ఇందులో దమయంతి తప్పు లేదు. నిన్ను గురించి తెలుసుకోడం కోసమే స్వయంవరం ప్రకటించింది. నీ కంటే వేగంగా రథం నడిపేవాళ్ళు ఇంకెవరూ లేరు కదా…!”” అన్నాడు.
నలుడు కర్కోటకుణ్ని తలుచుకుని తన పూర్వపు రూపాన్ని పొందాడు. అక్ష హృదయం నేర్చుకోగానే అతడిలో ఉన్న కలి బయటకి వెళ్ళిపోయాడు. బాహుకుడే నలమహారాజని తెలుసుకుని ఋతుపర్ణుడు ఆశ్చర్యపోయాడు. ““మహారాజా! మీరు నలమహారాజని తెలియక మీతో ఎన్నో పనులు చేయించుకున్నాను నన్ను క్షమించండి”” అన్నాడు ఋతుపర్ణుడు. దమయంతి తండ్రి రాజు ఋతుపర్ణుణ్ని అనేక కానుకలతో సత్కరించి పంపించాడు.
నలమహారాజు తనకు కష్టాలు కలిగించిన కలిని శపించబోయాడు. తనని క్షమించమని నలుణ్ని ప్రాధేయ పడ్డాడు కలి. శరణు అని వేడిన వాళ్ళని క్షమించడం మన భారతదేశ సంస్కృతి. ఆ సంస్కృతిని నిలబెడుతూ కలిని క్షమించాడు నలుడు.
నలదమయంతుల కథ చదివిన వాళ్ళకి, విన్నవాళ్ళకి కలిదోషం లేకుండా చేస్తానని వరమిచ్చాడు కలి.
దమయంతి తండ్రి ఋతుపర్ణుణ్ని క్షమించమని అడిగి అతణ్ని అనేక కానుకలతో సత్కరించి పంపించాడు. నలమహారాజు కొంతకాలం భార్యా పిల్లలతో విదర్భలో ఉండి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు.
అక్కడ తన రాజ్యం ఆక్రమించిన పుష్కరుణ్ని కలుసుకుని “నాతో యుద్ధం చేసి ఓడిపోతావా…జూదమాడి ఓడిపోతావా? అని అడిగాడు.
పుష్కరుడు జూదంలో దిట్ట కనుక జూదమే ఆడతానన్నాడు. నలుడు అక్ష హృదయం సహాయంతో పుష్కరుణ్ని జూదంలో ఓడించి తన రాజ్యాన్ని తను తీసుకు న్నాడు.
తరువాత నలమహారాజు భార్యా పిల్లల్తో సుఖంగా జీవిస్తూ అనేక వేల సంవత్సరాలు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాడు.
బలహీనతే మనిషిని వ్యసనాలపాలు చేస్తుంది. వ్యసనాలు వదలకపోతే కష్టాలు తప్పవు. చూశారుగా! జూదమనే వ్యసనం అంత గొప్ప మహారాజుని ఎన్ని ముప్పతిప్పలు పెట్టిందో!
మనిషి వ్యసనాలకి దూరంగా ఉండాలి!
*****
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుందరి పేరుతో బాల సాహితీవేత్తగా అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరించిన ముంగిటిముత్యాలు బాలల గేయ కావ్యం తెలుగుభాషోద్యమ కోణంలోంచి చేసిన ప్రసిధ్ధ రచన. ఇప్పటి వరకూ 116 మహర్షుల చరిత్రలు, అవతారాల కథలు, అనే పరిశోధనాత్మక రచనలు, యోగి వేమన జీవిత చరిత్ర, బంగారుకలలు, కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లా రచయితల సంఘం ద్వారా అనేక జాతీయ సదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను. తానా, అమెరికా వారి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో తెలుగువారి పండుగలపైన నా పరిశోధనాపత్రం ప్రశంసలు పొందింది. 2010లో వంగూరు ఫౌండేషన్ వారి అంతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,. శ్రీ శ్రీ బాలసాహిత్యం వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశంసలు పొందాయి. బందరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవం సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసంగం చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామంగా వస్తున్నాయి. కనకదుర్గ ప్రభ, భక్తిసుధ, చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉంటాయి. ఉయ్యూరు సరసభారతి వారు, కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అందించి గౌరవించారు. విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరించారు. వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.