యాత్రాగీతం

హవాయి దీవులు – మావీ ద్వీపం -హాలేకలా నేషనల్ పార్కు (భాగం-2)
రోజు -2

-డా||కె.గీత

          హవాయీ దీవుల్లోకెల్లా బిగ్ ఐలాండ్ తరువాత రెండవ అతి పెద్ద ద్వీపం మావీ. దాదాపు 730 మైళ్ళ విస్తీర్ణం కలిగినది. మావీ నిజానికి అయిదు ద్వీపాల సమూహం. అవి మావీ, మలోకై, లానై, కహోలవే, మలోకినీ (Maui, Molokaʻi, Lānaʻi, Kahoʻolawe, Molokini) ద్వీపాలు. హవాయీ జానపద గాథల్లోని ప్రఖ్యాత వీరుడైన “మావీ” పేరు మీదుగా ఈ ద్వీపానికి ఈ పేరు పెట్టారని ప్రతీతి.

          ఈ ద్వీపానికి తూర్పు నించి పశ్చిమానికి ఒకవైపు విస్తరించి ఉండి, సముద్ర మట్టానికి పదివేల అడుగుల ఎత్తున ఉన్న హాలేకలా అగ్నిపర్వతంతో బాటూ తీరాన విస్తరించి ఉన్న పశ్చిమ కనుమలు, మరొక వైపు మావీ సమ్మిట్ తో బాటూ, లహైనా, కానాపలి, కపాలువా (Lahaina, Kaanapali, Kapalua) తీరప్రాంతపు ఊళ్ళు, దక్షిణాన కీహై, వాలియా, మాకేనా (Kihei, Wailea, and Makena) ఊళ్ళు, ఉత్తరాన పయా, హైకూ (Paia, Haiku) ప్రాంతాలు ఉన్నాయి.

          మొత్తానికి ద్వీపంలోని భిన్న ప్రాంతాల్లో విభిన్నమైన నేలలు కలిగి ఉండి, రకరకాల వాతావరణం పరిస్థితులు ఉంటాయి.

          ఇక మేం రెండో రోజు ఉదయం పూట కూడా సముద్ర తీరంలో ఈత కోసమే ఖాళీ పెట్టుకున్నాం. పొద్దుటే రిసార్టులో ఉన్న స్టార్ బక్స్ లో బ్రేక్ ఫాస్టులు కొని తెచ్చుకుని మళ్ళీ చెట్ల కింద ఉయ్యాళ్లలోకి చేరేం. అక్కడే కాఫీలు కానిచ్చి రిసార్టంతా ఓ చుట్టు చుట్టాం.

ఉలువా బీచ్: రిసార్టు నించి ప్రఖ్యాత సముద్రతీరమైన ఉలువా బీచ్ (Ulua beach) కి వెళదామని ఎక్కడుందో గూగుల్ లో చూసేం. మా రిసార్టుని ఆనుకునే ఉన్నట్టు మేప్ లో కనబడేసరికి అటుగా అడుగులు వేసేం. అయితే మేప్ లో ఉన్నదానికంటే చాలా దగ్గిరగా ఉంది ఆ తీరం. రిసార్ట్ దాటి తీరంలోనే పదడుగులు వేసేమో, లేదో వచ్చేసింది. ఆ తీరంలో అప్పటికే ఓ వంద మంది వరకూ గొడుగుల కింద కుర్చీలు వేసుకుని కూర్చుని ఉన్నారు. కొందరు తీరంలోని ఇసుకలో తువ్వాళ్లు పరుచుకుని పడుకుని, మరి కొందరు నీళ్లలోకి దిగి ఆడుతూ కనిపించారు.

          మేమూ కాస్సేపు నీళ్ళలోకి దిగి వెచ్చని సముద్ర స్నానాన్ని ఆస్వాదించేం. మరి కాస్సేపు అలలు పెద్దగా లేని ఆ తీరంలో పిల్లల్తో బాటూ ఇసుకలో ఆడుకున్నాం. పదకొండు గంటల ప్రాంతంలో రిసార్టుకి తిరిగి వచ్చాము. దార్లో మా రిసార్టు తీరంలో చక్కని సైకత శిల్పాలు చెక్కేరు.

          కాస్త ముందుకు రాగానే పచ్చని లాన్ మధ్యనున్న పెద్ద రాతి మీద ఏవో అక్షరాలుం టే చదువుదామని ఆగేను. అది 1982 నవంబరులో అర్ధరాత్రి పూట విరుచుకు పడ్డ తీవ్ర హరికేన్ ప్రభావానికి కొట్టుకొచ్చిన రాయి అట. దాన్ని అప్పట్నుంచి కదల్చకుండా అక్కడే ఉంచేరు. అదృష్టం కొద్దీ ఆ చుట్టుపక్కల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదట. కానీ హవాయిలో ఇతర దీవుల్లో ఎంతో నష్టం కలిగిందట. అది చదివి లోపలికి వెళ్లి పోదామని త్వరపెడుతున్న నన్ను ‘అదుగో హరికేన్’ అంటూ ఆటపట్టించాడు సత్య.

          తీరం నించి రిసార్టు లోపలికి వస్తూనే పిల్లలకి ఉద్దేశించిన స్విమ్మింగ్ పూల్ లో కాస్సేపు, పెద్దవాళ్ళు జారుతూ ఆడే వాటర్ స్పోర్ట్స్ ప్రాంతాల్లో మరి కొంతసేపు గడిపేం.

          మిట్టమధ్యాహ్నం నకనకలాడుతుండగా రిసార్టులోని రెస్టారెంటులో సూప్స్ , బ్రెడ్లు, చికెన్, ప్రాన్స్ వంటివి ఆర్డరు చేసుకుని స్థిమితంగా తిన్నాం.

హాలేకలా నేషనల్ పార్కు: రూములకి తిరిగొచ్చి స్నానాలు కానిచ్చి మూడు గంటల కల్లా బయలుదేరి హాలేకలా (Haleakala National Park) నేషనల్ పార్కుకి అయిదున్నర గంటల ప్రాంతంలో చేరేం. హాలేకలా మావీ ద్వీపంలోకెల్లా ఎత్తైన ప్రదేశం. అక్కణ్ణించి మబ్బుల్ని చీల్చుకుంటూ, పర్వతాన్ని అధిరోహిస్తూ కారుని ముందుకు పోనిచ్చాం. మరో అరగంటలో తొమ్మిది వేల అడుగుల ఎత్తున ఉన్న కారు పార్కింగు స్థలానికి చేరుకు న్నాం. ఇక్కడ సూర్యోదయాన్ని గానీ, సంధ్యా సమయాన్ని గానీ వీక్షించడానికి కారు పార్కింగుని ముందుగా ఆన్ లైనులో బుక్ చేసుకోవాలి.

          “హాలేకలా” ప్రపంచంలో కెల్లా అతిపెద్ద అంతర్జ్వలన అగ్నిపర్వతం. చివరిసారి 1786లో ఈ అగ్నిపర్వత ప్రేలుడు సంభవించిందట. కానీ అగ్నిపర్వత కొన భాగాన్నించి కాకుండా నైరుతి భాగం నించి లావా ప్రవహించడంతో మావీ ద్వీప దక్షిణ భాగంలోని లా పేరోజ్ (La Perouse Bay) తీరంలో ఇప్పటికీ లావా ఆనవాళ్లను చూడొచ్చు.

          కనుచూపుమేర నల్లని రాతి పొడి చల్లినట్టున్న అతిపెద్ద అగ్ని పర్వతం. కొసల్లో పర్వతం ఆకాశంలో తేలియాడుతున్నట్టు దిగువన విమానంలో నించి చూసినట్టు
పాల మబ్బుల దొంతరలు. ఆ పైన సుదూరంగా ఆకాశంలో కళ్ళు మిరుమిట్లు గొల్పే సూర్యుడు. ఎక్కడా వృక్ష జాడలేని ఆ ప్రదేశంలో ఏదో గ్రహాంతరాళాన ఉన్న అనుభూతి కలగసాగింది. అయితే అంతలోనే ద్వీపంలో ఉన్న వెచ్చదనమంతా మాయమై గొప్ప చలి ముంచుకొచ్చింది.

          అక్కణ్ణించి మరో వెయ్యి అడుగులు ఎగువకి కారు దిగి పర్వతాన్ని నడిచి అధిరోహిం చాల్సి ఉంది. రహదారి ఉన్నా పైన ఖాళీ లేక వాహనాల్ని అనుమతించడం లేదు. సిరి బాగా పేచీ పెట్టడంతో మిగతా పిల్లలు కూడా కారులో ఉండిపోయారు. ఇక చేసేదేం లేక మేమిద్దరమే నడక మొదలుపెట్టేం. మొత్తం నిలువుగా ఉన్న ఆ రోడ్డులో అరగంట పాటు నడిచి పదివేల అడుగుల ఎత్తున ఉన్న శిఖరానికి చేరుకున్నాం. శిఖరానికి చేరుకునే సరికి అవతలి వైపున్న దృశ్యమే వేరు. అగ్నిపర్వత కనుమలు చుట్టూ పేర్చినట్టు ఉండి, ఒళ్ళు గగుర్పొడిచే లోయలు ఉన్నాయి. అక్కడికి పొద్దుటెప్పుడో నడిచి వెళ్లి చూసొస్తున్న వాళ్లు వెనక్కి వస్తూ కనిపించారు.

          శిఖరాగ్రం మీద కనుచూపుమేరలో పెద్ద పెద్ద టెలిస్కోపులతో నక్షత్రశాలలు కూడా ఉన్నాయి. కానీ ఎవరికీ లోనికి అనుమతి లేదు. కొండ మీద పైకి మెట్లతో దారి ఉంది. దాన్ని అధిరోహిస్తే ఉన్న చిన్న కట్టడం మీద “10023 అడుగుల ఎత్తున ఉన్నాం” అన్న బోర్డు కనబడింది.

          అక్కడ సూర్యాస్తమయాన్ని వీక్షించే చోటంతా ఉధృతంగా చలిగాలి వీచసాగింది. అయినా కొండరాళ్ళ మధ్య కాస్త చోటు చేసుకుని అక్కడక్కడా కూచున్న మనుషుల మధ్య మేమూ కూర్చున్నాం. సెల్ ఫోనుల్లో ఫోటోలు తీసుకున్నన్ని తీసుకుని, వీడియో కోసం ఓ రాతి మీద ఫోనుని ఆన్ చేసి పెట్టేసి నిశ్శబ్దంగా సూర్యాస్తమయాన్ని చూస్తూ కూర్చున్నాం.

          ఎన్నిసార్లు ఎక్కణ్ణించి చూసినా సూర్యాస్తమయ దృశ్యం అబ్బురమైందే. ఈ చోట మబ్బుల దూది పింజల మధ్య జలకాలాడి నారింజ రంగు దుప్పటీ పరుచుకుని ఆకాశం లోకి దూకి కవ్వించి మాయమవుతున్న సూర్యబింబాన్ని చూస్తూ ఉంటే అంత చలిలోనూ దృశ్య పారవశ్యానికో ఏమో బుగ్గ మీంచి కన్నీటి చుక్క ఒకటి జాలువారింది.

          అద్భుతమైన సాయం సమయం మాయమవ్వగానే అలరిస్తూ ఆ వెనకే వెన్నెల చంద్రుడు దర్శనమిచ్చాడు. స్పష్టంగా, దట్టమైన చుక్కల మధ్య ముచ్చటగా మెరిసి పోతున్న చందమామ. చలిలేకుండా ఉండి ఉంటే అక్కడే ఆరుబయట విశ్రమించాలని అనిపించింది. ఆ కోరిక కూడా తీరేందుకన్నట్టు కొండ రెండు మలుపులు దిగగానే ఒక వైపు రహదారిని మూసివేసి ఉంచారు. తారు రోడ్డు మీద వెల్లకిలా పడుకుని నక్షత్రాల్ని చూస్తున్నారు అందరూ. అప్పటికే పిల్లలు కారు తీసుకుని వచ్చి మమ్మల్ని కలిశారు. ఇక మేమూ అందరిలా రోడ్డున అడ్డంగా పడుకుని కాస్సేపు హాయిగా వీక్షించాం.

          ఎనిమిది గంటలవేళ తిరిగి రాలేక రాలేక బయలుదేరాం. రాత్రి భోజనాలకి ఆ పైన ఏవీ దొరకవని ముందే ఆన్ లైనులో చదివినందున వచ్చే దార్లో చివరగా కనబడ్డ ఊళ్ళో కార్లోనే తినేందుకు వీలుగా పీజా, సాండ్ విచ్ లు కొని తెచ్చుకున్నాం. పిల్లలు అవి తినేసి కార్లోనే నిద్రకుపక్రమించారు. మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటూ మెల్లగా డ్రెవ్ చేసాం. ఆ సాయంకాలపు అద్భుత దృశ్యాన్ని ఒడిసి పట్టుకుని తిరిగి రిసార్టుకి అర్థరాత్రి వేళ చేరుకున్నాం. ఇప్పటికీ సజీవంగా ఉన్న ఆ అనుభూతి మనసున రాలిపడ్డ నక్షత్రమై మెరుస్తూనే ఉంది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.