యాదోంకి బారాత్-23
-వారాల ఆనంద్
సంతోషం అగ్గిపుల్లలా సర్రున వెలిగి ఆరిపోతుంది
దుఃఖం ఆగరొత్తీలా కాల్తూ మనల్నీ మన పరిసరాల్నీ
చాలాసేపు అంటిపెట్టుకునే వుంటుంది.
***
దుఃఖ వ్యక్తీకరణ మాధ్యమం కేవలం కన్నీళ్ళు కాదు, నా మట్టుకు నాకు కవిత్వం కూడా. అందుకే 2013-2014 సంవత్సరాల సంక్షోభ కాలంలో కవిత్వం నాకు పెద్ద అవుట్ లెట్ అయింది.
చికిత్స విజయవంతమయి నిలకడయిన ఆరోగ్య స్థితిలో కరీంనగర్ చేరుకున్న నేను యధావిధిగా కాలేజీ బాధ్యతలు కొనసాగించసాగాను. ఆ స్థితిలో మా ఎస్.ఆర్.ఆర్. కాలేజీ మిత్రులు చూపిన అభిమానం అందించిన సహకారం గొప్పది. అప్పుడే నేను ఆగస్ట్ 2014 లో ‘మానేరు గల గల’, ‘బంగారు తెలంగాణాలో చలన చిత్రం’ పుస్తకాల్ని తెచ్చాను.
దాని తర్వాత వెంటనే కవిత్వ పుస్తకమూ తేవాలనిపించింది. ఆ విషయం చెప్పగానే మిత్రుడు అనంతాచార్య ఇంత వెంటనేనా సార్ అన్నాడు “సమయం లేదు మిత్రమా” అని సినిమా ఫక్కీలో సమాధానం ఇచ్చాను ఇద్దరమూ బిగ్గరగా నవ్వుకున్నాం.
ఇంకేముంది రాసిన కవితల్ని ఒక చోట చేర్చి అమర్ కిచ్చాను డీటీపీ చేయమని. మరో వైపు ఆత్మీయ మిత్రుడు ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్యను ముందు మాట రాయండి సార్ అని కోరాను. ఆయన మరోక్షణం ఆలోచించకుండా నేను రాయకుంటే ఎట్లా అన్నాడు. ఆయనతో నా తొలి పరిచయం 1998 నాటిది. తాను కరీంనగర్ ఆంధ్రా బ్యాంక్ లో చేరినప్పటిది. అప్పటినుండీ మా రెండు కుటుంబాలూ స్నేహంగా ఆత్మీయంగా కలిసిపోయాయి. 1998లో నేను నా ‘మానేరు తీరం’ ప్రచురిం చాను. దాని ఆవిష్కరణ సభ కరీంనగర్ నెహ్రూ యువ కేంద్ర హాలులో జరిగింది. సమైఖ్య సాహితి సంస్థ ఆధ్వర్యంలో కె.ఎస్.అనంతాచార్య, మాడిశెట్టి గోపాల్ నిర్వహించారు. ఆనాటి సభలో మిత్రులు నలిమెల భాస్కర్ అధ్యక్షులు, దర్భశయనం ముఖ్య అతిథి. నా రచన మీద ఆ రోజు దర్భశయనం చాలా గొప్పగా స్నేహంగా సాధికారికంగా మాట్లాడారు. వివరంగా విశ్లేషణాత్మకంగా ఆయన చేసిన ప్రసంగం నాకో పెద్ద ప్రేరణ. సభ తర్వాత హాలు చిన్నదయిపోయింది సర్ అని అనంతా చార్య అంటే జీవగడ్డ విజయకుమార్ ‘చారీ నిర్వాహకులుగా మీరు ఆనంద్ ను తక్కువ అంచనా వేశారు’ అన్నాడు. అంతా నవ్వుకు న్నాం. ఆ తర్వాత ‘నవ్యచిత్ర వైతాళికులు’, ‘సినీ సుమాలు’, ‘24 ఫ్రేమ్స్’ ఇట్లా నా సమాంతర సినిమా పుస్తకాల మీద జరిగిన సభలల్లో దర్భశయనం విశ్లేషణాత్మక ప్రసంగా లు చేశారు. మా ఇద్దరి నడుమా అంతటి దగ్గరితనం అభిమానం పెనవేసుకున్నాయి.
ఆ చనువుతో అడగ్గానే ’మనిషి లోపల’ కవిత్వానికి మనిషిలోపలి చింతన పేరుతో ముందు మాట రాశారు. రాయడమంటే అట్లా ఇట్లాకాదు. నన్నూ, అప్పటి నా స్థితినీ, నా కవిత్వాన్నీ కలగలిపి వడబోసి ఆవిష్కరిస్తూ రాశారాయన.
“ఒక సంక్లిష్ట సందర్భానికి ఆనంద్ ఇచ్చిన అక్షర రూపమీ సంపుటి. దుఃఖమూ కవిత్వమూ కవలలని తాను తెలుసుకున్నాడు. అనుభవంతో తాత్విక స్థాయికెళ్ళి దుఃఖపు జీర లేకుండా ఏదయినా ఆనందమెలా అవుతుంది అని వ్యాఖనించాడు ఆనంద్. ఈ సంపుటిలో దుఃఖం కనిపించినంతగా మరే మాటా కన్పించదు.‘ధైర్యం’ అనే భావం పలికినంతగా మరే భావం పలకలేదు” అన్నాడు దర్భశయనం శ్రీనివాసాచార్య. అట్లా ఆయన ముందుమాటతో నా మనిషి లోపల సిద్దమయింది. ఈ సారి ఆవిష్కరణ హైదరబాద్ లో చేయాలనుకున్నాను. అనుకూలమయిన హాలు దొరికితే సరే అనుకు న్నాము. జింబో ఎమెస్కో బుక్స్ వారి హాలు ఏర్పాటు చేశాడు. 16 నవంబర్ 2014 న సభకు సిద్దమయ్యాము. ఆవిష్కర్త గా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు శ్రీ కె.వి.రమణా చారి గారిని, విశిష్ట అతిథులుగా మిత్రుడు అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, ఆత్మీయ అతిథిగా దర్భశయనం శ్రీనివాసాచార్య, అధ్యక్షుడుగా జింబోలను ఆహ్వానించాను. సభ నిర్వహణ భాధ్యతల్ని ఆత్మీయ మిత్రుడు వఝల శివకుమార్ కి అప్పగించాను. రెండు రోజుల ముందు నమస్తే తెలంగాణ పత్రిక నుండి కాల్. మీ పుస్తకం ముందుమాటను మాకు పంపండి ఆదివారం సంచికలో వేస్తామని. ఆ రెస్పాన్స్ ఊహించ నిది. సరే డీటీపీ పంపాను. నమస్తే తెలంగాణలో 14న రానే వచ్చింది. సభ కోసం నేనూ ఇందిరా ఉదయాన్నే బయలుదేరాం. అతిథులందరూ సమయానికి వచ్చేశారు. రమణా చారి గారు వస్తూనే ఆనంద్ నేనీ మీటింగ్ అని కాదు కేవలం మీ ఇద్దరినీ ఇందిరనూ నిన్నూ చూద్దామని వచ్చాను అన్నారు. సభకు ఆత్మీయులు నందిని సిధారెడ్డి, ప్రొఫెసర్ మనోహర్ రావు, ప్రొఫెసర్ ఉషాదేవి. నిజాం వెంకటేశం, అయోధ్యా రెడ్డి, వఝల శారద, హిమజ, పవన్, నందిగం కృష్ణారావు, మహంతి, కోడూరి విజయ్ కుమార్, నిజామాబాద్ ఫిల్మ్ క్లబ్ నుంచి పెద్దాయన రామస్వామి కవి సూర్యప్రకాశ్ ఇంకా తమ్ముడు అర్జున్, ఉష లతో సహా అనేక మంది హాజరయ్యారు. రఘోత్తమ్ రెడ్డి రాలేదు. ఏమయింది అని అడిగితే పుస్తకంలో నేనున్నాను కదా అన్నారు. సభ ఫోటోల్ని వీడియోని రేల తన కెమెరాలో బంధించింది. తర్వాత అంతా నారాయణగుడా తాజ్ లో లంచ్ అదీ పూర్తి చేసి. హమ్మయ్య అనుకుని కరీంనగర్ బయలు దేరాము. ఒకటి రెండు రోజులు అలసట తీర్చుకుని ‘మనిషి లోపల’ పుస్తకాన్ని మిత్రులకూ సమీక్షలకూ పంపించడం మొదలు పెట్టాను. క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్తూనే వున్నాను.
ఇంతలో ఒక రోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత లైబ్రరీలో సిస్టమ్ ముందు కూర్చున్నాను. ఫోన్ మోగింది. ఎవరా అనుకుంటూ లిఫ్ట్ చేశాను. ఆనంద్ అన్నారెవరో ఆపక్కనుంచి. ఏమరుపాటుగా వున్ననేమో గొంతు ఎక్కడో తగులుతోంది. దీపం వెలగలేదు. నేను వరవర రావుని అన్నారు. ఒక్కసారిగా మనసు స్విచ్ ఆఫ్ అండ్ ఆన్…ఆశ్చర్యం ఆనందం. సార్ సార్ అన్నాను. ఎట్లున్నవ్ బాగున్నావా అన్నారాయన. బాగున్నాను సర్ అన్న. ఇప్పుడే నీ మనిషి లోపల చదివి, కదిలిపోయాం ఇద్దరమూ అన్నారాయన. నేనేదో అనే లోపలే కూర్మానాథ్ తెచ్చి ఇచ్చాడు ఆయనకు పంపావట కదా అన్నారు. నా ఆనందానికి హద్దే లేదు. మరికొంత సేపు మాట్లాడారు. ఆసుపత్రి ఆపరేషన్ తదితర వివరాలడిగారు. ఎక్కడున్నావు అంటే కాలేజీలో అన్నాను. ఇందిరకు థాంక్స్ చెప్పు అని ఫోన్ పెట్టేశారు. సార్ నా కవిత్వం చదవడమే కాకుండా బాగుంది అనడం ఓహ్! నేను మళ్ళీ నా లైబ్రరీలోకి యధా స్థితిలోకి రావడానికి చాలా సమయమే పట్టింది. ఒక లెజెండరీ పొయెట్, నేను బాగా అభిమానించే వారు నన్ను పలకరించడం నా కవిత్వాన్ని గురించి మాట్లాడ్డం ఎంత ఆనందాన్నిచ్చిందో మాటల్లో చెప్పలేను. రాయడానికి భాష చాలదు. ఇంటికెళ్ళిన తర్వాత ఇందిరకు చెబితే తన సంతోషానికీ అవధుల్లేవు.
ఇదిట్లా వుంటే మర్నాడు మరో కాల్ అది కూడా వూహించనిదే. ‘ఆనంద్.. నేను నవీన్ ని’ అన్నారు ఆపక్క నుంచి, గొంతు గుర్తుపట్టాను అంపశయ్య నవీన్ గారు. నమస్తే సార్. ఆనంద్ ఎట్లా వున్నావు విషయం ఎవరూ చెప్పలేదు, నాకు తెలీదు, నీ పుస్తకం వచ్చింది. చదివేశాను మూవ్ అయ్యాను. గొప్పగా రాసావు. అంత సంక్షోభంలో అట్లా నిబ్బరంగా వుండి రాయడం నిజంగా మూవ్ అయ్యాను. దర్భశయనం ముందు మాట కర్టైన్ రైజర్. నిన్ను బాగా పట్టుకున్నాడాయన అన్నారు నవీన్.‘అంపశయ్య’ తోనూ కఫిసో స్థాపకుడిగానూ ఆయనంటే ఎంతో అభిమానం నాకు. ఈ రెండు ఫోన్ కాల్స్ నన్ను నిలువనీయలేదు.
ఇదంతా ఇట్లా వుండగానే కరీంనగర్ లో నాకు ఆత్మీయ సాహిత్య మిత్రుడు గండ్ర లక్ష్మణ రావు ఒక ప్రతిపాదన తెచ్చాడు. మనిషిలోపల పైన సభ పెడదామని. మీరు అవసరమంటే పెడదాం సార్ అన్నాను. సభ ‘సాహితి గౌతమి’ నిర్వహిస్తుంది అన్నారు. ఆయనే శ్రీ నాళేశ్వరం శంకరంని పిలిచాడు. ఉస్మానియా కాంపస్ కాలం నుంచి నాకు దగ్గరి మిత్రుడయిన శంకరం నాకే కాదు అందరికీ మిత్రుడే. అజాత శత్రువు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చారు. ఫిల్మ్ భవన్ లో సభ విజయవంతంగా జరిగింది.
ఇదంతా ఇట్లా వుండగానే నిజామాబాద్ క్లాసికల్ ఫిల్మ్ సొసైటి బాధ్యుడు మేకా రామ స్వామి గారు ఫోన్ చేశారు. ఎట్లా వున్నారు? నిజామాబాద్ 14 డిసెంబర్ నా వందేళ్ళ సినిమా పండుగ చేస్తున్నాం మీరూ ఇందిర గారు రావాలి అన్నారు. నేను సమాధానం చెప్పేలోగానే ఏ కొంచెం మీ ఆరోగ్యం తప్పకుండా రావాలి అన్నారు. అంత పెద్దాయన పిలిస్తే కాదని ఎట్లా అనడం సరే అన్నాను. ఆనాటి సభలో అమృతలత గారితో సహా పలువురు పాల్గొన్నారు. సభ సంతోషంగా జరిగింది. అందరికీ ధన్యవాదాలు చెప్పి బయలుదేరాము.
అట్లా తిరగడం పట్ల మిత్రులు వద్దంటూ అభ్యతర పెడుతూనే వున్నారు. కానీ తీరిగిన కాలు కదా నిలువలేకపోతోంది అంటూ సమాధానం చెప్పాను. వారం వారం కరీంనగర్ సందర్శించే మా డాక్టర్ గందే శ్రీధర్ గారిని క్రమం తప్పకుండా కలుస్తూనే వున్నాను.
ఇంకోవైపు మనిషి లోపల పుస్తకం పై సమీక్షలూ రావడం మొదలయ్యాయి ఆ వివరాలతో మళ్ళీ కలుస్తాను.
*****
(సశేషం)
వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. నాలుగు దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో పని చేసారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవలల్లో జ్యూరీగా వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు కమిటీలలో కూడా సభ్యుడిగా వున్నారు.
రచనలు-
లయ (కవిత్వం), మానేరు తీరం (కవిత్వం), మానేరు గలగల (సాహిత్య విమర్శ), మనిషి లోపల (కవిత్వం), మెరుపు ( సాహిత్య కారుల ఇంటర్వూలు), అక్షరాల చెలిమె (కవిత్వం), ఆకుపచ్చ కవితలు (గుల్జార్ కవిత్వానువాదం), ముక్తకాలు(చిన్న కవితలు)
అర్థవంతమయిన ‘సినిమా’ల పై పుస్తకాలు- నవ్య చిత్ర వైతాళికులు,
బాలల చిత్రాలు, సినీ సుమాలు , 24 ఫ్రేమ్స్, బంగారు తెలంగాణాలో చలన చిత్రం,
తెలంగాణ సినిమా దశ దిశ, Signature of Love(poetry), Children’s Cinema, Documentary films made-
తెలంగాణా సాహితీ మూర్తులు: ముద్దసాని రాంరెడ్డి, యాది సదాశివ,
శివపార్వతులు, Long Battle with short messages,
A Ray of Hope, KAFISO a saga of film lovers.