సఖులూ! ఇంకొక పురాతనమైన, బహుళ ప్రచారంలో ఉన్న భైరవి రాగం గురించి ఈ నెల తెలుసుకుందామా? ఇదొక విలక్షణమైన రాగం.
దాదాపు 1500 వందల సంవత్సరాల పూర్వం 72 మేళకర్తల పథకానికి ముందే ఉన్నదీ భైరవి రాగం. సంగీత సాంప్రదాయ ప్రదర్శినిలో ఈ కింది విధంగా చెప్పబడింది.
భైరవి రాగ సంపూర్ణ స్సాయంకాలే ప్రగీయతే
పంచశృతి దైవతం క్వచిత్ స్థానే ప్రయుజ్యతే
పూర్వం ఈ రాగాన్ని కౌశికముగా పిలిచేవారు. సంగీతజ్ఞులు ఈ రాగాన్ని పరిశోధించి పాడుతున్న సమయంలో దేవీ సాక్షాత్కారం జరిగి ఉండవచ్చు. భయానక రసం కూడా ఉండటం వలన ఈ రాగానికి భైరవి అని నామకరణం చేసి ఉండొచ్చు. ఈ రాగాన్ని మాతంగ ముని శుద్ధ రాగంగా పేర్కొన్నారు. సంగీత రత్నాకరంలో కూడా ఈ రాగం గురించిన ప్రస్తావన ఉంది. ఇవి రాగం గురించిన ప్రాచీన విశేషాలు. ఇక రాగ లక్షణాలు తెలుసుకుందాము.
ఇది 20 వ మేళకర్త నఠభైరవి రాగ జన్యము. ఈ రాగంలో వింత ఏమిటంటే ఆరోహణ అవరోహణలలో సప్త స్వరాలూ కలిగిన సంపూర్ణ రాగమైనా మేళకర్తగా పరిగణించలేము. అవరోహణలో శుద్ధ దైవతం ఉన్నా ఆరోహణలో చతుశృతి దైవతం అన్య స్వరం ఉండటం వలన ఇది జన్య రాగం అయింది. ఇది ఒక అద్భుతమైన అరుదైన అంశము. ఇందులో స్వరాలు షడ్జము, చతుస్స్రుతి రిషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, చతుస్స్రుతి దైవతము(అన్య స్వరము), కైశికి నిషాదము. ఈ రాగంలో అన్నీ జీవ స్వరాలు అవటం వలన శ్రోతల వీనులకు అమృత ధార వలె ఉంటుంది. సర్వస్వరగమకవరీక రక్తి రాగము. జంట దాటు ప్రయోగాలు అత్యంత శోభనిస్తాయి. త్రిస్థాయిలలో పాడదగిన రాగము.
రాగాలాపనకు, రాగం తానం పల్లవి పాడటానికి చాలా అనువైనది. దేశమంతటా ప్రసిద్ధము. భక్తి శాంతి వీర రసాలను అద్భుతంగా పోషించగల రాగము. శ్లోకములు పద్యము పాడటానికి అనువైనది. శ్రీరామచంద్ర అనే శ్లోకాన్ని ఒక గీతంగా మలచారు. అన్ని రకములైన సంగీత రచనలూ ఈ రాగంలో కూర్చబడ్డాయి. అన్ని వేళలా పాడదగిన రాగము. 5 పెద్ద రాగాలలో ఒకటిగా భావించబడుతోంది. గంభీరమైన రాగం. ఈ రాగం నొప్పి నివారణలోనూ ప్రేమ, వీరత్వం, శాంతం వంటి భావోద్వేగాలను రేకెత్తించటంలో ఉపయోగపడుతుంది.
శ్యామా శాష్త్రి విరచిత స్వరజతి కామాక్షిని పరికించితే ఆరోహణ క్రమంలో 8 చరణా లు ఉంటాయి. మనోధర్మానికి ఉపకరించే రచన. సంగీత త్రిమూర్తులు కాక అనేక మంది వాగ్గేయకారులు ఈ రాగంలో అనేక రచనలు చేశారు.
ఈ రాగం చాలా గంభీరమైన బరువైన రాగం అవటం వలన ఎక్కువగా సినిమా, లలిత సంగీతాలలో ఉపయోగించలేదు.
ఇప్పుడు కొన్ని రచనలు పరిశీలిద్దామా?
శాస్త్రీయ సంగీతం
1. గీతం శ్రీరామాచంద్ర
2. వర్ణం విరిబోణి పచ్చిమిరియం ఆదిఅప్పయ్య
3. కీర్తన ఉపచారము త్యాగయ్య
4. కీర్తన కొలువై ఉన్నదే. త్యాగయ్య
5. కీర్తన ఏ నాటినోము ఫలమో త్యాగయ్య
6. కీర్తన శ్రీరఘువర. త్యాగయ్య
7. కీర్తన శ్రీకమలంబాయ ముత్తుస్వామి దీక్షితులు
8. కీర్తన చిన్తయమామ్ ముత్తుస్వామి దీక్షితులు
9. కీర్తన యారో ఇవార్యారో అరుణాచల కవి
కీర్తన -ఉపచారము: https://youtu.be/LvsH96pgJ5Y?si=9unUSlyZu3FSVD8o
అన్నమాచార్య కీర్తనలు
1. అమ్మమ్మ ఏమమ్మా జి బాలకృష్ణ ప్రసాద్
2. అలమేలుమంగా నేదునూరి కృష్ణ మూర్తి
అమ్మమ్మ ఏమమ్మా
https://youtu.be/pVUO27CVbm8?si=K7pWlWgQE5_PHjYR
సినిమా సంగీతం
1. నిను చేర మనసాయెరా బొబ్బిలియుద్ధం
https://youtu.be/XDmwW583_3o?si=u_Z6TEHZSz31OkHN
చూసారుగా పురాతనమైన భైరవి రాగ విశేషాలు. మీకు నచ్చాయని భావిస్తున్నాను. మరొక అందమైన రాగ విశేషాలు తదుపరి సంచికలో. అంతవరకు సెలవా మరి?
చాలా బాగుందండీ మీ భైరవి రాగ పరిచయం.
సప్తపది సినిమాలోని ‘భామనే, సత్య భామనే’ కూడా భైరవి రాగం అని నా అనుకోలు.
ధన్యవాదాలు శారద గారు. మీరు చెప్పింది కరెక్ట్. నాకు తట్టలేదు. అయినా అది నాట్యం కోసం చేసిన పురాతన రచన కాబట్టి సినిమా సంగీతంలో భాగంగా అనుకోలేదు. నేటి సినిమా సంగీత దర్శకులు ఎవరు చేసినట్టు లేదు. లలిత సంగీతం కూడా.