వస్తున్నా

(నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

– నీరజ వింజామరం

అనంత చైతన్య తరంగాన్ని నేను
శ్రమించకుండా విశ్రమించానేం ?
ఎన్నటికీ వాడని నిత్య వసంతాన్ని నేను
నవ్వుల పువ్వులు పూయకుండా వాడిపోయానేం?
అంతులేని ఆశల కిరణాన్ని నేను
నిరాశను చీల్చకుండా నిల్చుండి పోయానేం?
లోతు కొలవరాని అనురాగ సంద్రాన్ని నేను
కెరటంలా ఎగిసి పడక అలనై ఆగి పోయానేం?
ఎందరి మనసుల్లోనో వెలిగిన నమ్మకాన్ని నేను
వెలుగులు విరజిమ్మకుండా ఆరిపోయానేం ?
వేల ఘోషలు ఒక్కటై వినిపించిన గొంతుక నేను
స్వరతంత్రులను మీటకుండా మూగబోయానేం ?

ఏమో …?
నాకున్న విలువల కన్నా నా ఒంటి మీది వలువల
గురించి చర్చించే సమాజాన్ని చూసి నివ్వెర పోయానా ?
శతాబ్దాల అసమానత్వాన్ని దశాబ్దాల పోరాటంతో
పెకిలించలేక ఓడిపోయానా?
అన్ని పాత్రలకు అనాయాసంగా న్యాయం చేసి
నాకు జరిగిన అన్యాయానికి ప్రేక్షక పాత్ర వహిస్తున్నానా ?
ఆకాశంలో సగం నాదని నినదించి
ఏ కాస్తో చాలని రాజీ పడ్డానా ?
నా ప్రతి కదలికని శల్య పరీక్ష చేసే
చూపుల తూపులతో గాయపడ్డానా ?

ఔను నిజమే!
ఇంకెంత కాలం ఇంతుల చింతలని చింతిస్తున్నా
నన్నుగా గుర్తించే కాలం ఎప్పుడని ఆలోచిస్తున్నా
లేదు కాదనే భావ దారిద్యం నుండి వీరికెపుడు విముక్తని యోచిస్తున్నా

అయినా….
అలసిన అడుగులను గమ్యం చేర్చేలా
కొత్త దారులు అన్వేషిస్తున్నా
అరచి ఎండిన గొంతులలో సప్తస్వరాలు నిండేలా
మండుటెండలో గండు కోయిలనై కూస్తున్నా
గగనంలో సగం కాదు పూర్తి పుడమి నాదేనని
ముందు తరాలను నిద్ర లేపి చెరగని ముద్ర వేస్తున్నా
ప్రకృతికి లేని పక్షపాతం మీకెందుకంటూ
వివక్ష వాదుల నిరక్షరాస్యతను నిలదీస్తున్నా
సరి పోము, సరికామనే బేసి గణాంకాలను చెరిపేసి
సమానత్వ సమీకరణాన్ని సరిచేసి తిరిగి రాస్తున్నా

వస్తున్నా…..

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.