విముక్తి
-ఇందు చంద్రన్
మబ్బులు మోసుకెళ్తున్నాయి.
చుక్కలు పట్టుకునేలోపే తాకి వెళ్లిపోతున్నాయి.
నాకంటూ ఏదీ లేదిక్కడ !
నా స్వార్థ కుబుసం కిందనే విడిచిపెట్టొచ్చేసినట్టున్నా.
కింద ఒక్కప్పుడు నాకంటూ సృష్టించిన దార్లో
ఇప్పుడు ఎందరో తిరుగుతున్నారు.
నాకోసం కట్టుకున్న గూట్లో
ఎవరో తెలియని వాళ్లుంటున్నారు.
నే పోరాడి పోట్లాడి సాధించినవన్నీ
వేరొకరు వాడేసుకుంటున్నారు.
ఎవరూ నన్ను గుర్తు చేసుకోవట్లేదు.
వాళ్ళతో నా జ్ఞాపకాలన్నీ చెరిగిపోయినట్టున్నాయి.
నా సమాధి ఉండాల్సిన చోట బిల్డింగ్ మొలుచుకొచ్చినట్టుంది.
నా ఆనవాళ్లేవి లేవిప్పుడు !.
కింద నాలాంటి వాళ్లు చాలా మందే ఉన్నట్టున్నారు.
జీవిత చదరంగంలో పరుగులు పెడుతున్నారు.
ఎవరికీ ఏదీ సొంతం కాదని,
ఉన్నంతవరకు వాడుకుని వదిలి వెళ్లిపోవాలని తెలిసినా
ఆ స్వార్థం ఎందుకో ?
గతించిన కాలంలో పూసిన పువ్వులన్నీ వాడిపోయాయి.
కొన్ని నవ్వులని,మరికొన్ని గాయాలని మూటగట్టుకుని
అన్నిటినుండి పొందేసినట్టున్నా !
*****