వెనుతిరగని వెన్నెల(భాగం-64)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి”కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్ళిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ళ అనుమతితో పెళ్ళి జరుగుతుంది. పెళ్ళయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీలో ఎమ్మే పాసయ్యి, పీ.హెచ్.డీ లో జాయినవుతుంది. శేఖర్ తో ఎన్నో రోజులు పోరాడి, చివరికి తన్మయి విడిపోతుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభుతో మళ్ళీ పెళ్ళి  జరుగుతుంది. ప్రభుతో బాటూ అతని కుటుంబం కూడా వచ్చి చేరి, హింస మొదలవు తుంది.

***

          అనుకున్నట్టే వారం రోజుల్లో పాపని డిశ్చార్జి చేసేరు. వాకిట్లో పిన్ని దిష్టి తీసి లోపలికి ఆహ్వానించింది. జ్యోతి మాటలు మనసులో పెట్టుకోకుండా మళ్ళీ వచ్చినందుకు పిన్ని పట్ల కృతజ్ఞతతో మనసు నిండిపోయింది తన్మయికి. అంతే కాదు. వస్తూ వస్తూ దాదాపు పదిహేనేళ్ళున్న అమ్మాయిని వెంట తీసుకుని వచ్చింది పిన్ని.

          “అమ్మలూ, నీకు అయిడ్రాబాదులో పిల్లల్తో ఏ కస్టవూ లేకండా ఉంటానికి ఇదుగో మా బావగారి మేనల్లుడి తమ్ముడు కూతుర్ని సమచ్చర జీతానికి మాట్లాడి తీసుకు వచ్చేను. ఈ పిల్ల నీకు నచ్చిన పన్లన్నీ సేసిపడతాది” అంది.

          జ్యోతి వెంటనే ముఖం చిట్లించి “అదేంటి, తీసుకొచ్చే ముందు అడగక్కర్లా? సంవత్సర జీతమంటే మాటలా? ఇంతకీ ఎంతకి మాట్లాడేవో” అంది.

          పిన్ని సమాధానం కోసం ఎదురుచూడకుండా తన్మయి “ఏమీ ఫర్వాలేదు. ఇలా ఎవరైనా దొరకడమే పదివేలు. మా ఇంట్లో నాకు, పిల్లలకు చేదోడు వాదోడుగా ఉండి కుదురుకుంటే చదువు కూడా నేర్పిస్తాను.” అంది తన్మయి ఆనందంగా.

          తనకి ఎప్పుడూ కష్టాలతో బాటూ వాటిని తీర్చే మార్గాలు కూడా సమకూర్చిపెట్టే అజ్ఞాత మిత్రుడు తన వెంటే ఉంటాడు. ఇప్పుడు పిన్నిలో ఉన్నాడు. అంతే.అంతలోనే ప్రభు తల్లిదండ్రులు ఈ అమ్మాయిని చూసి ఏమంటారో అన్న ఆలోచనలో పడింది. అయినా ఇందాక ప్రభు అన్నీ విన్నాడుగా. తనకి తెలిసి ప్రభుకి ఎటువంటి అభ్యంత రమూ ఉండదు. ఇక వాళ్ళ వాళ్ళ సంగతి తనకి అప్రస్తుతం.

          ఏదేమైనా కానీ, ఎవరి కోసమూ తన జీవితం తన చెయ్యి దాటిపోకూడదు. బాబుని తీసుకురావొద్దని ప్రభు తల్లిదండ్రులు అన్నారు గానీ, ప్రభు ఇంతవరకూ అనలేదు.
అయినా వాళ్ళు తమతో వచ్చి ఉన్నారు కానీ, తామెళ్ళి వాళ్ళతో ఉండడం లేదు. తమ ఇంట్లోని పరిస్థితులు వాళ్ళకు నచ్చేటట్లు ఉండాలని శాసించే హక్కు వాళ్ళకు లేదు.
బాబు ఆ ఇంట్లో ఉండకూడదనే హక్కు అస్సలు లేదు. వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళే వెళ్ళాలి కానీ, తనెందుకు బాబుని దూరం చేసుకోవాలి? అయితే ఈ విషయం వాళ్లంత తేలికగా వదిలెయ్యరు. సిద్దార్థ అన్నట్టు “చదువు లేకపోయినా ఇటువంటి తెలివితేటలు చాలా మెండుగా ఉన్న కుసంస్కారులు వాళ్ళు”. గొడవలైనా, గందరగోళమైనా వాళ్ళని ధైర్యంగా ఎదుర్కోవాలి తను. ఒక్క విషయం మాత్రం స్పష్టం. “వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాల్సింది తను కాదు- ప్రభు.”

          ఆలోచనలు ఒక కొలిక్కి రాగానే తన్మయి తేలికగా ఊపిరి పీల్చుకుంది. గుమ్మం దగ్గిర నిలబడి లోపలికి రానా, వద్దా అన్నట్టు చూస్తున్న ఆ పల్లెటూరి అమ్మాయి వైపు చూసి చిన్న నవ్వు నవ్వి “ఇలా రా, నీ పేరేంటి?” అంది తన్మయి.

          “నాగలచ్మి వొదినీ” అంది.

          “ఊ.. నిన్ను “నాగా” అని పిలుస్తాను సరేనా?” అని “అవునూ, నువ్విలా పన్లోకి వచ్చి సంవత్సరం పాటు ఉండిపోతే మీ అమ్మా, నాన్నా మీద నీకు బెంగ రాదూ” అంది.

          “నాకు అమ్మ లేదొదినీ, నే పుట్టగానే ఎటో ఎల్లిపోయిందంట. మా నాన మల్లీ పెల్లి సేసుకున్నాడు. నన్ను మా నానమ్మ పెంచింది. ఆవిడి ఈ మద్దే కాలం సేసింది.” అని పిన్ని వైపు చూస్తూ “అత్తయ్యిగోరు వొచ్చి అడిగీతలికి అందికే ఎంటనే వొచ్చీసేను. మా నాన అప్పుడప్పుడూ వొచ్చి సూస్తానన్నాడులే.” తెల్లగా, పీలగా ఉన్న ముఖమ్మీద పెద్ద కళ్ళల్లో ఏ మాత్రం బాధ లేకుండా చెప్పుకుపోతున్న ఆ పిల్ల మీద ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది తన్మయికి.

          “జన్మనిచ్చిన తల్లి చంటిపిల్లని వొదిలేసి వెళ్ళిపోయిందా? పాపం అంతటి కష్టం ఏం వచ్చీందో ఆ తల్లికి! వెళ్ళేది పిల్లని ఎందుకు తీసుకు వెళ్ళలేదో. పాపం ఈ పిల్ల ఎటూ గాకుండా కష్టాలు పడ్తూంది.”

          తన్మయికి కళ్ళు చెమర్చాయి. బట్టలు మడత పెడ్తూ వెనక్కి తిరిగి కళ్ళోత్తుకుంది.
ఆ అమ్మాయి పరిచయంగా “నే మడతెడతాలే వొదినీ, పాప లేసింది కదా పాలెట్టు” అంది ఆరిందాలా. పిల్లలకు పరిస్థితులే అన్నీ నేర్పిస్తాయనుకుంటా.

***

          మామూలుగా ఇరవై ఒకటో రోజున బిడ్డతో బాటూ బాలెంతస్నానం చెయ్యాలి. కానీ పాప ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాకపోవడంతో ఆ కార్యక్రమం అయిదోవారంలో ఇప్పటికి కుదిరింది.

          పక్కింటి పెద్ద మామ్మ చంటి బిడ్డకి నలుగు పెడదామని ఎంతో సంబరపడింది.కానీ “ఈ పిల్లకి ముట్టుకుంటే కండే లేదు. ఇంక నలుగు స్నానాలెందుకులే. అలా పై పైనే సున్నుపిండి రాసి కడిగేస్తే సరి” అంది జ్యోతి.

          అసలు కాళ్ళ మీద వేసుకుని ఎవరైనా స్నానం చేయిస్తారంటే తన్మయికి చూడడా నికే భయం పట్టుకుంది.

          “నలుగు స్నానాలొద్దులే అమ్మా! ఇంకొన్నాళ్ళు ఆగుదాం” అని తన్మయి స్టీలు బేసినులో గోరు వెచ్చని నీళ్ళు పోసి మృదువుగా ఒళ్ళు కడిగింది పాపకి. తల జాగ్రత్తగా పట్టుకుని కొత్తగా వచ్చిన బేబీ షాంపూతో రుద్దింది. స్నానం కాగానే సాంబ్రాణి పొగ వేసింది పిన్ని. అప్పటికే అలిసిపోయి నిద్రలోకి జారుకుంది పాపాయి. అర్భకంగా ఉన్న పిల్లకి వనజ తీసుకొచ్చిన చిన్న పరికిణీ, జాకెట్టు వేసేసరికి అందం వచ్చేసింది. మొదటిసారి కూడా ఆడపిల్ల కావాలని ఎంతగా కలలు కందో! ఆ కోరిక ఇప్పుటికి తీరింది. దిష్టి చుక్క పెడుతూ “నా బంగారు తల్లీ! నూరేళ్ళు వర్థిల్లు” అంటూ తన్మయి లోలోపల ఆశీర్వ దించింది.

          ఈ తతంగమంతా ఉత్సాహంగా చూడసాగేడు బాబు.

          నాగ పాపాయి పనుల్లో సాయం చెయ్యడంతో బాటూ, బాబుని తయారు చెయ్యడం, ఇంటి పనిలో జ్యోతికి సాయం చెయ్యడం వంటివి కూడా చకచకా చేసెయ్యడం చూసి సంతోష పడింది పిన్ని.

          తన్మయి ఒళ్ళంతా పసుపు రాసుకుని, నలుగు పెట్టుకుని, కుంకుడు కాయలతో, గోరు వెచ్చని నీళ్ళతో తలారా స్నానం చేసింది. “ఎక్కువ సేపు స్నానం చెయ్యకమ్మా చంటి బిడ్డకి జలుబు సేస్తాది” అంది పిన్ని. స్నానం అయ్యి కొత్త కాటన్ చీర కట్టుకుని తలకి సాంబ్రాణి పొగ వేసుకుని అద్దంలో చూసుకుంటూ పెద్ద తిలకం బొట్టు దిద్దుకుంది.

          “మా అమ్మే కుందనం బొమ్మలా ఉన్నావు, నా దిష్టే తగిలేలా ఉంది” అంటూ మెటికలు విరిచింది పిన్ని.

          పాపిట్లో సింధూరం పెట్టుకోబోతూండగా జ్యోతి వచ్చి ముఖం చిట్లించి “పూజగదిలో అమ్మమ్మకి, నాన్నగారికి దణ్ణం పెట్టుకో” అంది.

          తల్లికి ఇలా పాపిట సింధూరాలు వంటివి నచ్చవని గుర్తుకొచ్చింది తన్మయికి.
తన్మయి అగరుపొగ వెనుక పటాలుగా మారిపోయిన అమ్మమ్మకి, తండ్రికి మనసారా నమస్కరించింది. నిన్నా మొన్నటి వరకు అక్కడే తిరిగిన తండ్రి అంతలోనే ఈ ప్రపంచం నుంచి మాయమై పోయిన వైనం గుర్తుకొచ్చి దు:ఖం ముంచుకొచ్చింది తన్మయికి.

          “నాన్నా! మరి కొద్ది రోజులు మీరుండి ఉంటే పాపని చూసేవారు. ఏం చేస్తాం మాకే ప్రాప్తం లేదు.” అంటూ నిశ్శబ్దంగా తండ్రితో మాట్లాడుతున్నట్టు అక్కడే చాలా సేపు కూచుండిపోయింది.

          ఆపరేషను వల్ల కింద కూచోకూడదని ముక్కాలి పీట మీద కూచుంది తన్మయి. అయినా నడుము లాగసాగింది.

          పదిగంటల వేళ ప్రభు వచ్చేడు. వస్తూనే కాళ్ళూ, చేతులు శుభ్రంగా కడుక్కుని వచ్చి నిద్రపోతున్న పాపని గుండెలకు హత్తుకున్నాడు. పక్కనే పడుకున్న తన్మయి నుదుటి మీద ముంగురుల్ని లాలనగా సవరించేడు. ఆ క్షణాన తనకి ఏ బాధలూ లేనట్లు అనిపించి తన్మయి నిశ్చింతగా కళ్ళు మూసుకుంది.

          “రేపూ, ఎల్లుండుల్లో ఇంటికి వెళ్ళిపోదామురా. పాపని అక్కడే చూపిద్దాం. ఏమంటావ్?” అన్నాడు.

          తన్మయికి కూడా త్వరగా వెళ్ళిపోవాలనే ఉంది. ఒక పక్క బాబుకి స్కూలు కూడా పోతూంది. మూడో నెల వరకూ ఉండమని తల్లి గొడవ చేస్తుందేమో అనుకుంది. కానీ జ్యోతి మారుమాట్లాడకుండా ఒప్పుకుంది. పిన్ని మాత్రం ఉండబట్టలేనట్లు “అదేటమ్మా ఆపరేసను అయ్యింది కదా అయిదో నెల దాకా ఉండి…” అని సీరియస్ గా ఉన్న జ్యోతి ముఖం వైపు చూసి ఆగిపోయింది.

          తన్మయికి ఆశ్చర్యం వేసింది. తండ్రి పోయిన దు:ఖంతో తల్లి తల్లడిల్లి పోతుందనీ, తను తల్లి దగ్గరే ఉంటే సాంత్వనగా ఉంటుందనీ అనుకుంది. కానీ తల్లి తను ఎప్పుడు వెళ్తుందా అని చూస్తున్నట్టు అనిపించి బాధ కూడా వేసింది. మర్నాడు బయలుదేరే వేళ తన్మయికి ఎందుకో ఆ ఇంటితో బంధం తీరిపోయినట్లు అనిపించసాగింది. అయినా తమాయించుకుని “అమ్మా, నీకు ఎప్పుడు పిల్లలని చూడాలని అనిపించినా ఒక్క ఫోను చెయ్యి” అంది. అంతలోనే గొంతులోకి దు:ఖం ముంచుకొచ్చి గొంతు గరగరలాడింది.
మొదటిసారి తను తన తల్లిదండ్రుల్ని వొదిలి అత్తవారింటికి వెళ్ళినపుడు దారంతా దు:ఖపడడం జ్ఞాపకం వచ్చింది. ఎప్పుడూ తల్లిని, పుట్టిన ఇంటిని వదిలి వచ్చేటపుడు అదే దు:ఖం కలుగుతుంది తనకి. కానీ తల్లికి తనని వొదిలి కూతురు వెళ్తూందన్న బాధ కలిగినట్టే ఉండదు ఎప్పుడూ. తనకంటే తల్లి ధైర్యవంతురాలు కావడం వల్లనో, లేదా తనకున్నంత ప్రేమ లేకపోవడం వల్లనో.

***

          రాత్రంతా ప్రయాణంలో పాత జ్ఞాపకాలన్నీ తరుముకొస్తూనే ఉన్నాయి. రైలు దిగంతాల్ని చీల్చుకుపోతున్నట్లు శరవేగంగా దూసుకుపోసాగింది. అంతటా నిశీధి ఆవరించినా దిగంతాల్లో ఎక్కడో సన్నని వెలుగు చీకటి వెనక దాగున్న వెలుగు రేఖని స్పష్టం చేయసాగింది. త్రోవ పక్క ఎక్కడి నుంచో అడవి పూల ఘాటైన పరిమళం ముక్కు పుటాల్ని తాకుతూ ఏవో జ్ఞాపకాల్ని రెకెత్తించసాగింది.

          తన్మయికి వివేకానందా పాఠశాల, మురళి, వెంకట్లు హఠాత్తుగా జ్ఞాపకం వచ్చేరు.
సంధ్య వేళ ధ్యాన సమయం తర్వాత ఇలాగే దిగంతాన కనిపించే సన్నని వెలుతుర్ని చూస్తూ తన జీవితాన్ని చక్కదిద్దమని ఎన్ని సార్లు ప్రార్థన చేసేదో! తన ప్రార్థనలన్నీ ఫలించినట్లు ప్రభు తన జీవితంలోకి వచ్చేడు. ప్రభు వైపు చూసింది. కళ్ళు మూసుకుని బెర్తుకి జేరబడి చంటిదాన్ని గుండెలకు హత్తుకుని కూచుని ఉన్నాడు. బాబు ఎదుటి బెర్త్ మీద నిద్రపోతూ ఉన్నాడు. మరో బెర్త్ మీద నాగ నిద్రపోతూ ఉంది. కాస్సేపట్లోనే నడుం నొప్పిగా అనిపించడంతో తన్మయి మెల్లిగా నడుం వాల్చింది.

          తన్మయి గుండెల్లో ఒక పక్క ప్రభు తల్లిదండ్రుల గొడవలు మళ్ళీ ఎలా ఎదుర్కో వాలో అన్న బాధ, దిగులు కలగసాగేయి. అంతలోనే తమాయించుకుంది.

          అసలు వాళ్ళ మాటలకి తను విలువని ఎందుకివ్వాలి? అలా విలువనివ్వడం వల్లే తనకి ఇలా బాధ కలుగుతూంది. కానీ నిరంతరం నచ్చని వాతావరణంలో, ఇలా ఏడిపించే మనుషుల మధ్య తను ఎన్నాళ్ళు ఉండగలదు? బాబుని ఎన్నాళ్ళు కాపాడుకు రాగలదు?
పోనీ, ఇవన్నీ వదిలేసి తన మానాన తను ఉద్యోగం ఉన్న ఊర్లోనే ఇల్లు చూసుకుని వెళ్ళిపోతేనో. ఇప్పుడు పిల్లల్ని చూసిపెట్టడానికి చేదోడు, వాదోడుగా నాగ ఉండనే ఉంది.
ప్రభు తమని చూడడానికి వారానికోసారి వచ్చినా ఫర్వాలేదు. అతని కుటుంబం కూడా తను ఎంత దూరంగా ఉంటే అంత సంతోషంగా ఉంటారు ఎలాగూ. ఆలోచన రాగానే మనసు తేలికపడ్డట్టయ్యింది. ఇంటికి వెళ్ళగానే ప్రభు తల్లిదండ్రులు గొడవ చేస్తే తను ఇదే చేస్తుంది.

          తనూ, తన పిల్లలు, తన ఉద్యోగం అంటూ మనశ్శాంతిగా ఉండగలిగితే త్వరలో పీ ఎచ్ డీ కూడా పూర్తిచెయ్యగలుగుతుంది. పీ ఎచ్ డీ గురించి తల్చుకుంటే మరో బెంగ మొదలయ్యింది. ఒకదానిమీదొక సమస్యతో సుడిగుండంలా తయారైన తన జీవితంలో గొప్ప చదువు చదవాలన్న లక్ష్యాలు పక్కకు పోకుండా కాపాడుకోవడమే అతి కష్టం అయిపోతూంది.

          మొన్ననే మాస్టారి నుంచి తను రాసిన ఉత్తరానికి జవాబు వచ్చింది. పీ ఎచ్ డీ గురించి ఇప్పుడు ఆలోచనే వద్దనీ, ముందు తన ఆరోగ్యం, పాప ఆరోగ్యం కుదుటపడ నివ్వమనీ, అన్నీ సర్దుకున్నాక ఒక సంవత్సరం ఆలస్యం అయినా పీ ఎచ్ డీ సబ్మిట్ చెయ్యవచ్చనీ రాసేరు.

          ఎంత మంచివారు మాస్టారు! పీ ఎచ్ డీ కి ఆయనే గైడు కావడం జీవితంలో తనకు లభ్యమైన అరుదైన వరాల్లో ఒకటి. నిజానికి జే ఆర్ ఎఫ్ రావడం, గవర్న మెంటు ఉద్యోగం రావడం, ప్రభు లాంటి భర్త దొరకడం, బాబు, పాప …. అన్నీ అరుదైన వరాలే.

          అజ్ఞాత మిత్రమా! చాలు నాకీ జన్మకి ఈ వరాలు అని వేనోళ్ళ పొగుడుతూ నిద్రలోకి జారుకుంది.

***

          ఏ కళనుందో గానీ బేబమ్మ వాకిట్లోనే దిష్టి తీసి సాదరంగా ఆహ్వానించింది. అర్భకంగా ఉన్న చంటిదాన్ని పొత్తిళ్ళలో చుట్టి అందరికీ చూపించేడు ప్రభు. ఎత్తుకోవ డానికి వీలుపడకపోయేసరికి నిరుత్సాహపడిపోయేరు పిల్లలు. ఇంట్లో అందరి సత్ప్రవర్తన చూసి తన్మయి కాస్త స్థిమితపడింది.

          ఆ సాయంత్రమే దగ్గర్లోని పిల్లల డాక్టరుకి చూపించేరు పాపని. ఇలా ముందుగా పుట్టిన పిల్లలకు బరువు తక్కువగా ఉండడం మామూలేనని, పాప ఆరోగ్యంగానే ఉందని అన్నారు డాక్టర్. ఆ నెలలో వేయాల్సిన టీకా ఏదో వేసి పంపించేరు. టీకా వేసినప్పటి నుండి ఆపకుండా కిళ్లు పెట్టి ఏడవసాగింది పాప. రాత్రంతా ఒక్క లెక్కన ఏడుస్తూనే ఉన్న పాపని ప్రభు, తన్మయి ఒకరి తరవాత ఒకరు భుజాలు మార్చుకోసాగేరు. తండ్రిగా పాపని అత్యంత జాగ్రత్తగా చూసుకోవడం, పాపే లోకంగా బతకడం చేస్తున్న ప్రభుని చూసి ఏదేమైనా ప్రభుని వదిలి ఎప్పుడూ వెళ్ళకూడదని ప్రమాణం చేసుకుంది తన్మయి.
బాబుని ఆ మర్నాడే మళ్ళీ స్కూలులో జాయిను చేసింది.

          ప్రభు ఇంట్లో వాళ్ళతో ఏం మాట్లాడాడో గానీ తన్మయి భయపడ్డట్లు బాబు విషయం లో ఎటువంటి గొడవా చెయ్య లేదు. పగలంతా పాప తన్మయి దగ్గరే ఉన్నా ప్రభు రోజూ ఆఫీసు నించి రాగానే సరాసరి పాపని ఎత్తుకుని కిందికి వెళ్ళిపోవడం, పాలు పట్టాల్సి వచ్చినపుడే తన్మయికి ఇవ్వడం చేస్తున్నాడు. ఆ సమయంలో తన్మయి పీ ఎచ్ డీ పని ప్రారంభించింది.

          క్రమంగా ఉదయం స్నానం చేయించి, పాలు పట్టగానే కిందనే హాల్లోని ఉయ్యాలలో వెయ్యసాగింది. పాపని మధ్య మధ్యలో పాలకి మాత్రం తన్మయి దగ్గిరికి ఎవరో ఒకరు తీసుకుని వస్తూ మిగతా సమయమంతా మురిపెంగా ఆడసాగేరు.

          నాగ పాపాయి పనులతో బాటూ, ఇంట్లో పనులన్నీ చకచకా చక్కబెడుతూ చేదోడు వాదోడుగా ఉండడంతో ఇంట్లో అంతా సంతోషించినట్లే కనిపించేరు తన్మయికి.

          నాలుగో నెల రాగానే పగటి పూట పట్టుపాలు పట్టడం, సిరిలాక్ తినిపించడం వంటివి మొదలుపెట్టేరు. పాపాయి త్వరగా పుంజుకుని బొద్దుగా, ఆరోగ్యంగా తయారైంది.
తన్మయి తిరిగి ఉద్యోగంలో జాయినైంది.

          రోజంతా తన్మయి బయటికి వెళ్ళినపుడు పాపని ఇంట్లో అందరూ బాధ్యతగా చూసుకోసాగేరు. అంతా సజావుగా జరుగుతున్న తన్మయి జీవితంలో ఆ మరుసటి వారంలో మళ్ళీ ఒక సమస్య వచ్చిపడింది.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.