వ్యాధితో పోరాటం-26

కనకదుర్గ

          పాప పుట్టక ముందు ఆఖరిసారి చెకప్ కి వెళ్ళినపుడు, ఇండ్యూస్ చేయాల్సి వస్తుం దేమో అంటే నాకు భయమేసింది. అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. చైతన్య పుట్టిన దాదాపు 10 ఏళ్ళ తర్వాత ఈ కాన్పు ఇపుడు. మెడిసెన్ బాగా డెవలప్ అయ్యింది, నొప్పులకు ఎపిడ్యూరల్ అనే మందు కూడా తీసుకోవచ్చని చెప్పారు. అయినా సరే నాకు అపుడయిన అనుభవం ఒక చేదు తీపి అనుభవంలా అయ్యింది. చెకప్ నుండి ఇంట్లో దిగబెట్టి శ్రీనివాస్ ఆఫీస్ కు వెళ్ళాడు. సోఫాల పైన మంచి డిజైన్ ఉన్న రగ్గులు వేసి వుంచాను. అవి ఉతికి చాలా రోజులయ్యింది. నేనది తీసుకెళ్ళి నీళ్ళల్లో నాన బెట్టి కొన్ని పిల్లో కవర్స్, కుషన్ కవర్స్ తీసుకొచ్చి అవి కూడా నాన బెట్టి కాసేపుంచి ఉతికి బాల్కనీలో ఆరేసాను.

          రాత్రి 2 గంటలకు నాకు నొప్పులు మొదలయ్యాయి. నేను లేచి బ్రష్ చేసుకుని, మెల్లిగా బట్టలు మార్చుకుంటుండగానే, కొద్ది కొద్దిగా వస్తున్న నొప్పులు ఎక్కువవ్వ సాగాయి. చైతన్య పడుకున్నాడు. మేమంతా రెడీ అయ్యాక వాడిని లేపాలని అనుకు న్నాము. నాకు కూర్చోవడానికి, నిల్చోవడానికి రావటం లేదు.

          నేను బెడ్ రెస్ట్ లో వున్నపుడు, చైతన్యకి చెల్లి పుడ్తుందని, తను అన్న అవుతున్నా డని చాలా సంతోషంగా వున్నాడు. పిల్లల సరదాకోసం “ఐ యామ్ ఏ బిగ్ బ్రదర్,” అని టీ షర్ట్ పైన ప్రింట్ చేయించి పెట్టాడు శ్రీని. చైతన్య బేబి పుట్టగానే కొన్ని రోజులు కేవలం బ్లాక్ అండ్ వైట్ లోనే అన్నీ కనిపిస్తాయని, తెల్ల కాగితాల పైన నల్ల పేయింటింగ్ తో డిజైన్స్ వేసి పెట్టాడు. అలాగే నల్ల పేపర్ల పైన తెల్ల పేయింటింగ్ తో డిజైన్స్ వేసి పాప ఎక్కడ పడుకుంటే అక్కడ పెట్టాలని ప్లాన్ చేసుకున్నాడు. పాపకు కావాల్సినవి బట్టలు, డైపర్స్, చలికాలం కాబట్టి, వెచ్చగా వుండే బట్టలు, స్వెట్టర్స్, కాప్స్, సాక్స్, పై నుండి కింది దాకా కవర్ అయ్యే బట్టలు, కొన్ని బొమ్మలు కొని పెట్టాము, అంటే శ్రీని, చైతన్య వెళ్ళి తీసుకొచ్చారు. నేనేమి చేయలేక పోయానని బాధపడ్డా, డెలివరీ అయ్యాక బయటకు వెళ్ళడానికి వస్తుంది కాబట్టి అపుడు ఇద్దరం కల్సి వెళ్ళి తెచ్చుకోవచ్చులే అని నాకు నేను సర్ధిచెప్పుకున్నాను.

          శ్రీని కూడా లేచి అన్ని సర్ధిపెట్టుకున్నబ్యాగ్ తీసి పెట్టాడు. చైతన్యకు ఆకలేస్తుం దేమో అని కొన్ని నూడుల్స్ చేస్తుండగా నా నొప్పులు మరీ ఎక్కువయ్యాయి. నేను ఇంక ఆగలేక ఆంబులెన్స్ కి కాల్ చేయమని అరవడం మొదలుపెట్టాను. చైతన్య బ్రష్ చేసుకొని బట్టలు మార్చుకుని, “ఐ యామ్ ఏ బిగ్ బ్రదర్,” అనే టీ షర్ట్ వేసుకుని రెడీ అయ్యాడు. నూడుల్స్ హాట్ ప్యాక్ లో పెట్టేసి అందరం అపార్ట్మెంట్ లాక్ చేసి కార్లో బయల్దేరాము. కూర్చోవడానికే చాలా కష్టం అయ్యింది. డాక్టర్ కి ఫోన్ చేస్తే, నన్ను ఎక్కువగా చూసిన డాక్టర్ ఆన్న్, ” ఓ, సారీ, నా డ్యూటీ అయిపోయింది, డాక్టర్ కారా బయల్దేరింది. తను వచ్చి డెలివరీ చేస్తుంది. ఆల్ ది బెస్ట్,” అని చెప్పింది. నాకేమో తనే వచ్చి డెలివరీ చేయాలని ఉండింది, ఒకే వయసు వాళ్ళం, నాతో చాలా బాగా మాట్లాడేది. మంచి ఫ్రెండ్ లా అనిపించేది. హాస్పిటల్ కి వెళ్ళేలోపల నొప్పులెక్కువయిపోయాయి. ఇంటి నుండే ఫోన్ చేసాము కాబట్టి, నర్స్ ఎమర్జెన్సీ దగ్గర వీల్ చేయిర్ పట్టుకుని నిలబడింది, అక్కడ నుండి మెటర్నిటీ వార్డ్ కి తీసుకెళ్ళింది. నాకు ఒక్కసారి అన్నీ గుర్తొచ్చాయి, 10 వారాలప్పుడు బ్లీడింగ్ అవ్వడం, తగ్గడం, 6 నెల్లప్పుడు పాన్ క్రియాటిక్ అటాక్ వచ్చి నొప్పి తగ్గడానికి మందిస్తే నొప్పులు మొదలయ్యి, వేరే హాస్పిటల్ కి వెళ్ళి అక్కడ నొప్పులు ఎక్కువవ్వకుండా 3 రోజులు ఆపకుండా ఇచ్చి, దాదాపు నెలన్నర బెడ్ రెస్ట్ పైనే ఉండి ఇప్పుడు కొన్ని నిమిషాల్లో పాప పుట్టబోతుంది. చాలా సంతోషంగా ఉంది, భయంగా వుంది, నన్ను నీడలాగ వెంటాడుతున్న పాన్ క్రియాటైటిస్ డెలివరీ తర్వాత ఎలా వుండబోతుందో, ఏ సమస్య లేకుండా తగ్గిపోతే బావుంటుంది. మెటర్నిటీ రూంలోకి తీసుకొచ్చారు, గౌన్లోకి మార్చారు, డాక్టర్ రావడానికి ఇంకో పది నిమిషాలు పడ్తుందన్నారు. నేను నొప్పికి ఎపిడ్యూరల్ మెడిసన్ ఇవ్వమన్నాను. వీపులో ఇస్తారు, నొప్పులు అంతగా తెలియవు, కానీ, మానిటర్ లో చూసి పుష్ చేయమని చెబుతుంటారు. నర్సులందరూ ఎంత బాగా చూసుకున్నారో, ఒకళ్ళు కాళ్ళు రాస్తూ, ఒకళ్ళు చేతులు రాస్తూ, భయపడ కుండా మాట్లాడుతూ ధైర్యం చెబుతూనే వున్నారు. బాగా డైలేట్ అయ్యింది, పాప ఎపుడెపుడు వచ్చేద్దామా అని తొందర పడ్తుంది. నేనింక ఆగలేను అంటున్నాను, డాక్టర్ వచ్చేసింది. అప్పటిదాక డ్యూటి డాక్టర్, మగ గైనకాలజిస్ట్ అన్ని చూస్తున్నాడు, ఆమె రాకపోతే తనే డెలివరీ చేస్తానని చెప్పాడు, ఇంతలో ఆమె వచ్చేసింది, ఐదు నిమిషాల్లో పాప పుట్టేసింది.

          శ్రీని వీడియో కెమెరా రెడీగా వుంచుకున్నాడు, పాప పుట్టగానే రికార్డ్ చేసి చైతన్యని తీసుకొచ్చాడు పాపని చూడడానికి. బయట కూర్చొని వేయిట్ చేస్తున్నాడు పాపం. ఇద్దరు పిల్లలకు తొమ్మిదిన్నరేళ్ళ తేడా వుంది. నర్సులు పాపని క్లీన్ చేసి నా గుండెలపైన పడుకోబెట్టారు. చైతన్య చూసి చాలా సంతోషించాడు. పాప చిన్న చిన్న చేతులు, కాళ్ళు ముట్టుకుని చూసి మురిసిపోయాడు. శ్రీని ఆనందానికి అవదుల్లేవు. మేము మొదటిసారే పాప పుడ్తుందనుకున్నాం, ఒక బాబు, ఒక పాప. నాకేమో ఇద్దరు పిల్లల తర్వాత ఒక పాప కానీ బాబుని కానీ అడాప్ట్ చేసుకోవాలని వుంది. ఈ పాన్ క్రియాటైటిస్ వల్ల అన్నీ తల్లక్రిందులవుతున్నాయి. ఈ రోజు నేనేమి ఆలోచించకూడదనుకున్నా. నా చిన్ని తల్లిని తృప్తిగా చూసుకుంటూ, శ్రీనితో, చైతన్యతో సమయం గడపాలి. వన్ ఆఫ్ ది హ్యాపియస్ట్ డేస్ ఆఫ్ అవర్ లైఫ్ అని అనిపించింది. చాలా మంది, ’నీకు ఒంట్లో బాగాలేనపుడు పిల్లల్ని కనకూడదు, ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నావు’? అన్నారు. కొంతమంది, ’ ఇన్నాళ్ళు ఎందుకు వేయిట్ చేసారు?’ అన్నారు. డాక్టర్లు, ’ఏం పరవాలేదు, ఒకోసారి డెలివరీ తర్వాత కొన్ని జబ్బులు తగ్గిపోతాయి,” అన్న తర్వాతే పాప కావాలి అని నిర్ణయించుకున్నాం. ఇప్పటి నుండి ఏ కష్టాలు లేకుండా ప్రశాంతంగా పిల్లల్ని చక్కగా పెంచుకుంటూ, కొన్నాళ్ళ తర్వాత అంతా సెటిల్ అయ్యాక ఇండియాకెళ్ళితే అక్కడైతే అందరుంటారు. ఇక ముందు జీవితం సాఫీగా సాగిపోవాలని అనుకుంటూ చైతన్యను, స్ఫూర్తిని దగ్గరికి తీసుకున్నాను. నా బంగారుతల్లి ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా పుట్టింది. నాకదే ఆనందంగా వుంది.

          మూడో రోజు డిశ్చార్జ్ చేసారు. కానీ ఇండియాలో కంటే ఇక్కడ కొన్ని విషయాలు వేరేగా, చాలా బాగా అనిపించాయి. డెలివరీ రూంలో నుండి మెటర్నిటీ రూంకి మార్చారు. డెలివరీ అయిన కాసేపటికే నర్సులు నన్ను లేపి సుబ్బరంగా స్నానం చేయించారు. అప్పటికి నా జుట్టు చాలా పెద్దగా వుంది. అక్కడ చాలా మంది జుట్టు కట్ చేయించు కుంటారు. నాకు తలకు పోసేవరకు నర్సులు అల్సిపోయారు. “ఎందుకమ్మా, మీకు ఇంత పెద్ద జుట్టు? నువ్వేమో ఇంత సన్నగా నీ జుట్టేమో ఇంత పెద్దగా, నీకు బరువుగా అనిపించదా?” నేనప్పటికి జుట్టు ఒక్కసారి కూడా కట్ చేసుకోలేదు. నేను స్నానం చేస్తుండగానే పిడియాట్రిషియన్ వచ్చి పాపని చెక్ చేసింది. నేను బాత్రూంలో నుండే డాక్టర్ ని పాప ఆరోగ్యంగా వుందా, ముఖ్యంగా పొట్టలో అన్నీ భాగాలు బాగున్నాయా? అని అడిగాను. ఆమె నవ్వుతూ, “పాప చాలా హెల్తీగా ఉందమ్మా! నువ్వు రిలాక్స్ అవ్వాలి ఇక!” అని చెప్పింది.

          నాకూ స్నానం చేయగానే చాలా ఫ్రెష్ గా అన్పించింది, పాప స్ఫూర్తిని క్లీన్ చేసి తనకివ్వాల్సిన వాక్సినేషన్స్ ఇచ్చి, అప్పుడే పుట్టిన పిల్లలందరిని ఒక చోట పెడ్తారు బేబీస్ వార్డ్ లో. పుట్టిన పిల్లల పేర్లు వెంటనే చెప్పాలి. నేను ఎప్పటి నుండో స్ఫూర్తి అనుకున్నాను, శ్రీనికి, చైతన్యకు కూడా చాలా నచ్చింది. ఆ రోజు నుండి మాకు పాప స్ఫూర్తియే మాకు నిజమైన స్ఫూర్తయ్యింది.

          శ్రీని, చైతన్య ఇద్దరూ వచ్చి పాపను బేబీ వార్డ్ నుండి నర్స్ తీసుకొచ్చి ఇస్తే చూసుకునేవాళ్ళు. పిల్లలు పుట్టిన తర్వాత లోపలి నుండి అంతా బయటికి వచ్చేస్తుంటే ఇండియాలో అయితే అమ్మమ్మలో, హాస్పిటల్ ఆయాలో క్లీన్ చేస్తారు. నర్స్ ఇచ్చి వెళ్ళగానే అంతా రావడం మొదలయ్యింది. నేను నర్స్ ని పిలవమన్నాను, లేదా నేను చేస్తానంటే, శ్రీని, ’’నువ్వు పడుకో, అల్సిపోయావు, నేను చూసుకుంటాను కదా!” అన్నాడు. “ఇక్కడంతా తుడవడమే కదా! అమ్మాయిలకు వేరేగా తుడవాలి,” అని ఎలా తుడవాలో చెప్పాను.

          నిజం చెప్పాలంటే నాకు లేచే ఓపిక లేదు, అస్సలు కళ్ళు తెరవకుండా పడుకో వాలని వుంది. కానీ నిద్ర పట్టడం లేదు. చైతన్య టాయిలెట్ పేపర్ తెచ్చిస్తే శ్రీని జాగ్రత్తగా అంతా క్లీన్ చేసాడు. నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను, మొగవాళ్ళని అసలు దగ్గరకే రానివ్వకుండా కాన్పు, పురుడు, ఇవ్వన్నీ ఆడవాళ్ళే చేయాలి, చేస్తారు అని అంటారు. కానీ నీట్ గా క్లీన్ చేసి పువ్వులా వున్న పాపని ఎత్తుకుని మురిసిపోతున్న తన సహనానికి, తన ప్రేమకి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోయాను. ఇంటికెళ్ళాక నేనే అంతా చూసుకుంటాను కదా! అనుకున్నాను. నర్స్ వచ్చి పాపను నా దగ్గరకు తీసుకొచ్చి పాపకి పాలివ్వడానికి ప్రయత్నం చేయమన్నది. పాలు పడడానికి టైం పడుతుంది. నాకు మొట్టమొదట వచ్చే పాలు పాప తాగితే అది చంటి పిల్లలకు చాలా మంచిదని నా ఆశ. కొద్ది కొద్దిగా వస్తున్నాయి. నర్స్ కి చెబితే ఇంటికెళ్ళాక బాగా వస్తాయని, పాలు ఇచ్చేపుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పింది.

          ఇంటికి వచ్చాక రెండు వారాల్లోనే ఆసుపత్రికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంట్లో వున్న రెండు వారాలు ఎలా గడిచాయో తల్చుకుంటే కొంత బాధగా ఉంటుంది. మా అక్కయ్య ఇండియా, హైద్రాబాద్ లో వుంటుంది. నేను ప్రెగ్నెంట్ అని చెప్పినపుడు తను డెలివరీ టైంకి వస్తానని చెప్పడంతో నాకు చాలా సంతోషంగా అనిపించింది. మేము అవసరం పడితే అడుగుదాములే అనుకున్నాం. ఎంత కష్టమైనా ఎందుకడగలేదంటే డెలివరీ తర్వాత వస్తే ఆర్నెల్లు వుంటే సాయంగా వుంటుందని. ఆ ఏడు చలి చాలా వుంది, స్నో చాలా పడింది. నాకు డెలివరీ తర్వాత విపరీతమైన నీరసం ముంచుకొచ్చింది. అలా అని మొత్తం శ్రీని మీదే వదిలేయలేను కదా! మెల్లిగా లేచి పాప బట్టలు బాత్రూం సింక్ లోనే వేడి నీళ్ళల్లో ఉతికేసే దాన్ని. క్రిబ్ ముందే తెచ్చి పెట్టాడు శ్రీని. ముందు, ముందు ఎక్కువగా లేస్తుందని నా పక్కనే పడుకో బెట్టుకునే దాన్ని. శ్రీని క్రింద పడుకునేవాడు. రూం కూడా క్లీన్ చేస్తూ ఉండే దాన్ని. మధ్యాహ్నం అపుడపుడు అలవాటవ్వడానికి క్రిబ్ లో పడుకో బెట్టే వారం. బాగానే పడుకునేది. ఆకలయినపుడే ఏడ్చేది, లేకపోతే అసలు ఏడ్చేది కాదు. నిల్చోని చేస్తే కాళ్ళు లాగేవి. నాకెందుకో ఏదో ఒంట్లో అస్సలు బాగాలేదనే ఫీలింగ్ మొదలయ్యింది. డెలివరీ టైంలో కొన్ని కుట్లు పడ్డాయి. దాంతో కూర్చుంటే చాలా నొప్పిగా వుండేది. డైపర్స్ ఎప్పటికపుడు తీసేయడం, ఇంట్లో గుడ్డ డైపర్స్ కట్టేవాళ్ళం. అందుకే బట్టలు చేత్తోనే ఉతికేసి ఆరగానే మడతలు పెట్టేసేదాన్ని. శ్రీని వంట పని, బయట పని చూసుకునేవాడు. సమయం దొరికినపుడల్లా పాప పడుకున్న పుడు నేను పడుకునేదాన్ని. నిద్ర పట్టకపోతే అపుడే పుట్టిన పాప కదలదు కాబట్టి సోఫాలో తనని పడుకోబెట్టి తననే చూస్తూ వుండేదాన్ని. చైతన్య తను చేసిన బ్లాక్ అండ్ వైట్ డ్రాయింగ్స్ పాప ఎక్కడ వుంటే అక్కడ దాని చుట్టూ పెట్టేవాడు. వాడు వచ్చి, “అమ్మ, చూడు ఎంత బుజ్జి చేతులో, ఎంత బుజ్జి కాళ్ళో కదా!” అంటు మురిసిపోయేవాడు. ఫ్రెండ్స్ అందరికి తనకి ఒక సిస్టర్ పుట్టిందని, తను చాలా ముద్దుగా వుంటుందని చెప్పుకునేవాడు. నేను హాస్పిటల్స్ కి వెళ్ళడం ఎక్కువయినపుడు మామూలు డైపర్సే వాడేవాళ్ళం. శ్రీని ఒక్కడే అన్నీ చూసుకోవాల్సి వచ్చేది, జూలీ మధ్యాహ్నం వచ్చేది. ఆఫీస్ కి వెళ్ళకపోతే ఇన్స్యూరెన్స్ ప్రాబ్లెమ్స్ వస్తాయి.

          పాప రాత్రి పూట లేస్తే మేమిద్దరం లేవాల్సి వచ్చేది, డైపర్ మార్చి, పాలు తాగించి మళ్ళీ పడుకోబెట్టి, నేను పడుకోవడానికి ప్రయత్నం చేసేదాన్ని, ఒకోసారి నిద్రలో మేలుకువ వచ్చి చూస్తే శ్రీని కూర్చొని మా ఇద్దరిని చూస్తూ ఉండేవాడు. నేను, “ఏంటి పడుకోకుండా చూస్తూ కూర్చున్నావు?,” అని మెల్లిగా అడిగేదాన్ని, గట్టిగా మాట్లాడితే పాప లేస్తుందని.

          “ఉష్.. మెల్లిగా. దాన్ని చూడు, చెయ్యి పిడికిలి చేసి బుగ్గ కింద అచ్చు నీలానే పెట్టుకుంది చూడు.” అన్నాడు. నేను చూసాను. నేనూ అలానే పెట్టుకుని పడుకుంటా ననే సంగతి నాకే తెలియదు.

          పనంతా అయిపోయాక పాప చుట్టూ ముగ్గురం కూర్చొని దాన్ని చూస్తూ, నేను పాటలు పాడడం, చైతన్య రైమ్స్ పాడడం, పాప ఏం చేసినా మాకు మురిపెమే. రెండు వారాల తర్వాత E.R.C.P. టెస్ట్ అయ్యాక బ్లడ్ టెస్ట్ చేస్తే పాన్ క్రియాటైటిస్ అని తెలిసి హాస్పిటల్ కి వెళ్ళి ఓ పది రోజులుండి రావడం, శ్రీని, చైతన్య కల్సి పాపకు స్నానం పోయడం జరిగిపోయాయి. ఆ తర్వాత ప్రతి కొద్ది రోజులకు, వారాలకు ఒకసారి పెద్ద అటాక్స్ రావడం హాస్పిటల్ లో రోజులు రోజులుండడం మామూలయిపోయింది. ఇంట్లో వున్నపుడు నేనెక్కువగా పిల్లలతో సమయం గడిపేదాన్ని. స్ఫూర్తికి స్నానం పోయడం నాకు చాలా ఇష్టమైన పని, ప్రతి పని ఇష్టంగానే చేసేదాన్ని. పాప ఒంటికి నూనె రాసి, కాసేపుంచి కిచెన్ సింక్ లో చిన్న బాత్ టబ్ పెట్టి స్నానం పోసేవాళ్ళం. వేడి నీళ్ళలో పాపని ఉంచగానే చాలా సంతోషించేది. ఒంటికి సోప్ రాసి నీళ్ళు పోసాక చైతన్య కళ్ళ దగ్గర వాడి చేతులు అడ్డు పెడితే నేను తలకి సోప్ రాసి పోసేదాన్ని. అది వాడికి చాలా ఆనందాన్నిచ్చేది, చెల్లికి నీళ్ళు పోయడానికి హెల్ప్ చేసానని అందరికీ చెప్పేవాడు. నేను హాస్పిటల్స్ లో రోజులు రోజులుంటే నన్ను మర్చిపోతుందేమోనని భయమేసేది. కానీ శ్రీని రోజు తీసుకొచ్చేవాడు, నేను ఇంటికి వెళ్ళాక నా దగ్గరే ఎక్కువ ఉండడానికి ఇష్టపడేది. దాంతో కొంచెం ధైర్యం వచ్చినా నాకు ఒకవేళ ఏమయినా అయితే ఎలా అని అన్పించేది… కానీ మళ్ళీ వెంటనే అలాంటి ఆలోచన రావడం కూడా తప్పే, నేను పిల్లల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చాను, వాళ్ళకి నా అవసరం ఉంది కాబట్టి ఎంత కష్టమైనా ఈ జబ్బుతో పోరాడి బయట పడాలి అని నాకు నేను చెప్పుకునేదాన్ని. ఇంట్లో వుంటే హాస్పిటల్ కి వెళ్ళాలని అస్సలు అన్పించేది కాదు, భరించలేని నొప్పి వస్తే మాత్రం వెళ్ళిపోవాలనిపించేది.

          ప్రతిసారి కొత్త కొత్త టెస్ట్స్ చేయడం, ఏదో ఉందనడం, అది ఎంత సైజుందని మళ్ళీ అల్ట్రా సౌండ్ టెస్ట్ చేస్తే అక్కడ ఏం కనిపించేది కాదు. ఇక్కడ నా ఫ్రెండ్ క్యాథి గురించి కొద్దిగా చెప్పాలి. క్యాథి కుటుంబం కొన్నేళ్ళు మా యింటి దగ్గరే వుండేవారు. మేము అపార్ట్మెంట్స్ లో వుండేవాళ్ళం, వాళ్ళు ఒక పెద్ద ఇంట్లో ఉండేవారు. కానీ చాలా మంచి వారు. చైతన్యని చాలా ఇష్టపడేవారు. క్యాథితో వుంటే ఎన్నో నేర్చుకోవచ్చు. మేము ఒకసారి వారి కుటుంబాన్ని డిన్నర్ కి పిలిచాము. వాళ్ళకి ఇండియన్ తిండి అంటే చాలా ఇష్టం అట. ఏ వంకలు పెట్టకుండా చాలా సంతోషంగా తిన్నారు. వాళ్ళ మూడేళ్ళ చిన్న బాబు ఆండ్రూని చూపించి, “ఏంటి, చైతన్యని ఒంటరిని చేస్తారా మీరు? వాడికి ఒక తమ్ముడో, చెల్లో అక్కర్లేదా? వీడ్ని చూడండి ఎంత ముద్దులు మూట కడ్తున్నాడో, మీకు కావాలని అనిపించటంలేదా?” అని సరదాగా టీజ్ చేసేది.

          చైతన్య, నేతన్, డానియల్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఎలిమెంటరీ స్కూల్లో. నేతన్ వాళ్ళ తల్లి క్యాథి. తనకి ఇద్దరబ్బాయిలు, నేతన్, ఆండ్రూ. వాళ్ళని తీసుకుని మా ఇంటికి వచ్చేది. మంచి ఫ్రెండ్స్ అయ్యాము. నేను డ్రైవింగ్ నేర్చుకున్నాక వాళ్ళింటికెళ్ళేదాన్ని, పిల్లలు ఆడుకుంటుంటే మేము కబుర్లు చెప్పుకునేవాళ్ళం. డానియల్ వాళ్ళ అమ్మ జూడీ, నేను హాస్పిటల్స్ లో ఉన్నపుడు బాగా క్లోజ్ అయ్యింది. నాకు చాలా సాయం కూడా చేసింది.

          చలి కాలంలో స్నో పడితే క్యాథి వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం, ఇంటి వెనక చాలా ఖాళీ జాగా ఉండేది, పిల్లలక్కడ స్నోలో ఆడుకునేవారు. లోపలికి వచ్చాక వేడి వేడి చాక్లెట్ మిల్క్ ఇచ్చేది పిల్లలకు. శ్రీని అల్కాహాల్ తీసుకోడని వాళ్ళు కూడా మాతో పాటు కాఫీ తాగేవాళ్ళు. పిల్లలకు ఒక్కరోజు సెలవొచ్చినా ఎక్కడికయినా ప్లాన్ చేసి తీసుకెళ్తుండే వాళ్ళు. వాళ్ళని చూసే మేము కూడా పిల్లలను బయట తిప్పుతుంటేనే అన్ని తెలుస్తుం టాయని తెలుసుకుని ప్రతి వీకెండ్ ఒక ప్లేస్ కి వెళ్ళేవాళ్ళం.

          ఫిలడెల్ఫియాలో మ్యూజియమ్స్, ఫ్రాంక్లిన్ ఇన్ స్టిట్యూట్ సమ్మర్ పాస్ తీసుకుని ప్రతి కొత్త షోస్ కి అక్కడ ఉండే ఇంట్రెస్టింగ్ ఎగ్జిబిట్స్ చూడడానికి వెళ్ళేవాళ్ళం. ముఖ్యంగా పార్క్స్, గార్డెన్స్, అందమైన ప్రకృతి ప్రదేశాలలకి వెళ్ళడానికి ఇష్టపడేవాడు శ్రీని, నాకూ అదే ఇష్టంగా ఉండేది. థీం పార్క్స్ బాగా కమర్షియలైజ్డ్ గా ఉంటాయి.
నేను ప్రెగ్నెంట్ అని చెబితే క్యాథి చాలా సంతోషపడింది. క్యాథి తల్లితండ్రులు గెట్టిస్బర్గ్ లో వుంటారు, వీళ్ళ ఇంటి నుండి మూడు గంటల ప్రయాణం కార్లో అయితే. అందుకే ఇక్కడ వచ్చి ఉన్నారు. తల్లి తండ్రి పెద్దవారవుతున్నారు, పిల్లలకు కూడా అమ్మమ్మ, తాత, పెద్దమ్మ, కజిన్స్ అందరూ తెలియాలని క్యాథి కోరిక. క్యాథి అక్కకి ఒవేరియన్ క్యాన్సర్.

          అపుడపుడు తను వచ్చి క్యాథి దగ్గర ఉండేది. శ్రీనివాస్ ఆఫీస్ కి వెళ్ళాక నేనొక్క దాన్ని ఉండకుండా క్యాథి వచ్చి నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళేది. అలా ఒకరోజు తీసుకెళ్ళడానికి వచ్చి పైకి వచ్చింది. నేను రెడీ అవుతున్నాను. “దుర్గా, కమ్ హియర్ ఐ వాంట్ టు టాక్ టు యు.” అని పిలిచింది.

          నేను వచ్చి, ” వాట్ హ్యాపెన్డ్?” అని అడిగా.

          ” నథింగ్, మై సిస్టర్ ఈజ్ హియర్…”

          “ఓ, ఈజ్ షి ఇన్ ద కార్, వై డింట్ యు బ్రింగ్ హర్ ఇన్సైడ్?” అన్నా.

          “నో షి ఈజ్ ఎట్ హోం. యు నో దట్ షి ఈజ్ ఏ క్యాన్సర్ పేషంట్, షీ లుక్స్ డిఫరెంట్. షి ఈజ్ హెవీ, అండ్ షి హాజ్ నో హేయిర్.”

          “సో, వై ఆర్ యు టెల్లింగ్ ఆల్ దిస్?”

          ” ఐ డోంట్ వాంట్ యు టు గెట్ స్కేర్డ్. దట్స్ వై ఐ వాంట్ టు టెల్ యు.”

          “ఇట్స్ ఓకే ఐ డోంట్ మైండ్ క్యాథి! థ్యాంక్స్ ఫర్ టెల్లింగ్. ఆర్ యు రెడీ టు గో?”

          ” యస్. లెట్స్ గో.”

          వాళ్ళింటికి వెళ్ళాక వాళ్ళ అక్క సూసన్ ని పరిచయం చేసింది. ఆమె టీచర్ గా పని చేసింది, భర్తకి ఆమెకి సరిపడక డైవోర్స్ అయిపోయింది. వారికి ఒక కూతురు. తల్లంటే ఇష్టంలేదు. తన ఫ్రెండ్స్ తో సినిమాలు, షికార్లు అంటూ తిరుగుతుందట. నాకు చాలా బాధేసింది, సూసన్ కోసం, వాళ్ళమ్మాయి కోసం. ఎందుకంటే డైవోర్స్ నుండి కోలుకోక ముందే తల్లికి క్యాన్సర్ అని తెలియడం ఆ బాధ ఎలా తెలియచేయాలో తెలియక తను ఏం చేస్తుందో తనకే తెలియటం లేదేమో పాపం. ఈమెకి ట్రీట్మెంట్ వర్క్ అయితే పర్వాలేదు కానీ పని చేయకపోతే ఆ పిల్ల గతి ఏం కాను. ఇపుడే ఇద్దరు మాట్లాడుకుని వారిద్దరి మధ్యనున్న సమస్యలు తీర్చుకుని కల్సి సమయం గడిపితే బావుండు అనిపిం చింది. ఆ రోజు క్యాథి మా ఇద్దరికీ పరిచయం చేసి వెళ్ళిపోయింది లోపల పని చేసుకోవ డానికి. మేమిద్దరం ఎప్పటి నుండో తెల్సిన స్నేహితుల్లా మాట్లాడుకున్నాము కనీసం ఓ మూడు గంటలు. చైతన్య కూడా స్కుల్ నుండి నేతన్ తో వాళ్ళింటికే వచ్చాడు. పిల్లలు హోంవర్క్ చేసుకుని ఆడుకుంటున్నారు. అమెరికన్లు 6 గంటలకే డిన్నర్ తింటారు. చైతన్యకి ఇష్టమని “మాష్ పొటేటోస్,” చేసింది. చైతన్య మాష్ పొటేటోస్, ఉడకపెట్టిన క్యారెట్స్, బటానీలు తిన్నాడు. వాళ్ళ పిల్లలు చికెన్, మిగతావి చైతన్యతో పాటు తిన్నారు.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.