సస్య-3
– రావుల కిరణ్మయి
అనుమానం
(పదివారాల చిరు నవల మూడవ పదం)
(సస్య, విదుషి ప్రాణ స్నేహితులు. సస్య కు వృత్తి రీత్యా లలిత నామమాత్రంగా నైనా నేర్చుకోవలసిన అవసరం ఏర్పడింది. అందుకోసం విదుషి శ్రవణ్ అనే టీచర్ ని మాట్లాడి తమ తోటలో ఏర్పాటుచేసింది. సస్య బలవంతం గానే అక్కడికి చేరుకుంది. ఆ తరువాత)
***
ఏడుకొండల స్వామి మెట్లకు మల్లే ఉన్న పెద్ద మెట్లను ఒక్కొక్కటి ఎక్కడం మొదలు పెట్టింది. కనీసం యాభైకి పైనే ఉంటాయేమో. అవి. ఎప్పుడు లెక్కబెట్టిందని తను.
ఊ… చిన్నప్పుడు ఇక్కడికి రావడానికి చాలా చాలా ఇష్టపడేది. విదుషీ వాళ్ళ పెద్దవాళ్ళు ఒకింత భయపడే వారు. పంపడానికి ఇష్టపడే వారు కాదు. పురుగూ పుట్రా పాములు గట్రా ఉంటాయని ఒప్పుకునేవారు కాదు. తనే వారికి ధైర్యం చెప్పి బలవం తంగా తీసుకువచ్చేది.
వేసవిలో వసంతం గ్రీష్మాలు, నింగిలో సూర్యుడు నిప్పులు చెరిగే కాలం. మండుటెండల ధాటికి తమ ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఆ తాపోశమనా- నికైనా, నోరూరించే మామిడి పండ్లు విరివిగా తినాలన్నా, మల్లెలు తురుముకొని పూల జడ వేసుకో వాలన్నా ఆ మాధుర్యం,పరిమళం దక్కించుకోవడానికైనా ఇక్కడికి ఎంతో ఉత్సాహంగా వచ్చేది. విదుషీ కూడా సంబర పడి పోయేది. నీవల్లే తను పంజరం లాంటి ఇంటిని వదిలి ప్రకృతిలోకి సీతాకోక చిలుకనై ఎగురుతూ ఆనందపు పతంగిని అవుతున్నానని అనేది. అప్పట్లో తోటమాలిగా శేషం బాబాయి ఉండేవాడు. ఆయనకు ఒక కొడుకు. అప్పట్లో ఏదో పెద్ద చదువు చదువుతుంటాడని. చెప్పేవాడు. ఆ అన్నయ్య కూడా మా తోడుండి మమ్మల్ని కనిపెట్టేవాడు. ఆయనకు తెలుగు సాహిత్యం పట్ల బహు ప్రీతి.
మల్లెలు తెంపి మాల కట్టడమో, బొండు మల్లెల ఆకులను తుంచి నీరు పెడుతుండడమో చేస్తున్నప్పుడు అలవోకగా మీరిది విన్నారా ? అంటూ శ్రీకృష్ణదేవ రాయలు బొండు మల్లెలను గూర్చి “ఆముక్తమాల్యద”లో “మెండు మీఱిన పతగ బీఱెండ దాకి
…………………………
………………………..
బొడమ మొగ్గలగము లగ్గిబొబ్బట్లు ..
అంటూ తన కావ్యం లో వర్ణించాడని,
ఇక పోతనామాత్యుడు
“నల్లని వాడు పద్మ నయనమ్ముల వాడు
…………………..
…………………..
మల్లియలార మీ పొదల మాటున వాడు లేడు గదమ్మ! చెప్పరే!
అంటూ నల్లనయ్య జాడ కోసం గోపికలు ఆరా తీశారని మల్లెలను బ్రతిమాలుకున్నాయని చక్కని గానంతో విడమరిచి చెపుతు నేర్చుకోవాలనే ఆరాటం ఆ పసితనంలో కలిగి మాటి మాటికి రావడానికి ఉవ్విళ్ళూరుతుండేది. అప్పుడు.. ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన తోను, ఇష్టంతోనూ తనకు తానుగా వచ్చిన తోట ఇప్పుడు కూడా నేర్చుకోవడానికే వస్తున్నా తెలియని భయం ఆవరించి మనసును ఆందోళన పెడుతున్నది. ఇలా ఆలోచిస్తూనే మెట్లు ఎక్కుతున్నది.
ఒక దగ్గర నల్లని తుమ్మెద ఝంకారం వినబడి అటువైపు చూసింది. సాయంత్రం విప్పుకున్న సెంటుమల్లెల గుచ్ఛం చుట్టూ తిరుగుతూ ఆ సువాసనను ఆస్వాదిస్తున్నది. ఆ పక్కనే చెట్టు కొమ్మ మీద చిన్న తొండ.
ఆ దృశ్యం సరిగ్గా తనకు సరిపోయేలా ఉందని అనిపించింది. ఆ పుష్ప గుచ్ఛం తానైతే నల్లతుమ్మెద శ్రవణ్ అయితే చూస్తున్నది విదుషిలా అనిపించి నవ్వొచ్చింది.
ఇంతలోనే చిత్రం జరిగింది. – బలం గా వీచిన గాలికి పుష్పగుచ్చం ఒక్కసారిగా ఊగి తుమ్మెదను దూరంగా నెట్టివేయగలిగింది.
అబ్బ! తను కూడా అలాగ శ్రవణ్ ఏదైనా తలపెడితే నెట్టివేయగలిగితే ఎంత బాగుండు ?. అనుకుంటూ మెట్టన్నీ ఎక్కి ఒక్కసారి తిరిగి చూసింది. ఎవరైనా ఒక్కో మెట్టు ఎక్కి అభివృద్ధిలోకి వస్తారు. లేదా ఒక్కో మెట్టు దిగి పతనానికి దిగజారుతారు. మరి… తను.
దిగజారిపోవడానికే ఇన్ని మెట్లు ఎక్కిందా ? ” సహనం అనేది చేదుగా ఉంటుంది కాని దాని ఫలం ఎంతో తీపిగా ఉంటుంది” అన్న అరిస్టాటిల్ మాటలే నిజమయితే తను విదుషి పట్ల చూపిస్తున్న సహనఫలం ఎలా ఉండబోతున్నది?
అనుమానమే లేదు. చేదుగానే ఉండబోతున్నది. “ముంజేతి కంకణానికి అద్దమెందు కని” కంటికి కనిపిస్తున్నది అదేగా. అని నిర్లిప్తంగా మొదటి గదిలో అడుగుపెట్టింది. గదిలో ఓ మూలన కుంపటిలో గుగ్గిలం వాసన మానసిక ప్రశాంతతను ,ఆహ్లాదాన్ని కలిగిస్తున్నది. విశాలమైన గదులలో బార్లా తెరిచి ఉన్న కిటికీలు చల్లని గాలిని లోనికి ఆహ్వానిస్తు న్నాయి.
ఏంటిది? తను ఇలా ఈ వాతావరణానికి దాసోహం అవుతున్నట్టుగా ఇందాకటి అలజడికి తెరదించుతున్నాను. కొంపదీసి ఈ సాంబ్రాణి, గుగ్గిలం ధూపంలో ఏమైనా వేసి తనను వశం చేసుకునే ఆ అదృశ్య కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయా?
అదృశ్య కార్యకలాపాలు ఇదేం పదం ? విచిత్రంగా మనసులో చొరబడింది. ఈ పదం కనుక భాషా పండితులు వింటే దుష్ట సమాసం అంటారేమో? నేనెందుకు ఇంత పిచ్చి దాన్నవుతున్నాను? అమ్మ చెప్పినట్టుగా ఈ తోట వాస్తుకు లేదా ? లేక అతీంద్రియ శక్తులేమైనా ఉన్నాయా ? లేక మానసిక రోగులు ఎవరైనా ఉన్నారా? ఇవేవైనా ఉంటే ధూపం వేస్తే ఉపశమనం కలుగుతుందని అమ్మ చెప్పిన మాట ఇప్పుడు గుర్తుకు వస్తోంది.
అనుమానం అనే పెనుభూతం ఆవరించిన మది సాంబ్రాణి ప్రశాంతను మేలును కలిగిస్తుంది అనే మంచిని గుర్తు చేసుకోలేక పోయింది.
అలా నెమ్మదిగా ఆ గదిలో అడుగుపెట్టింది.
అది ఆ భవనంలో ప్రధానమైన గది. నైరుతి దిక్కున ఉన్న పడకగది. ఈ గదిలో విదుషి తాతగారు వాస్తు, ప్రధానంగా నమ్మి కట్టించుకున్నారని తనకు ఆ గది చాలా ఇష్టమని విదుషి ఎన్నోసార్లు చెప్పిన గుర్తు. అక్కడ అతను కనిపించలేదు.
చుట్టూ చూసింది.
గది గోడలపై అందంగా వేలాడదీయబడిన తైల వర్ణచిత్రాలు. అన్నీ ఏకాంతాన్ని, అవ్యాజ్యమైన ప్రేమను సంకేతంగా చూపిస్తున్న చిత్రాలే. నిజంగా ఆ గది ప్రేమికులకు, ప్రేయసీ ప్రియులకు, దంపతులకు భూతలస్వర్గం లాంటిది.
మరి తను, అతను ఎవరికి ఎవరం ఏమీ కాకున్నా ఎలా ఇక్కడ బంధించబడ్డాం.
బంధించబడడం కరెక్ట్ కాదేమో ! అతను నా కోసమే వచ్చాడు. నేనూ అతని కోసమే వచ్చాను. ఒక్కటే తేడా. అతను ఇష్టంతో వచ్చాడు. నేను స్నేహం కోసం వచ్చాను. గదిలో అలికిడి వినిపించి ఆలోచనల్లోంచి బయటపడి చూసింది.
“అరవింద మశోకంచ చూతంచ నవమల్లికా
నీలోత్పలం పంచైతే, పంచబాణస్య నాయక ః !
అనే శ్లోకం వల్లిస్తూ చేతిలో మరుమల్లెలతో అతను.
అరెరె ! అమ్మాయి గారు వచ్చి చాలా సేపయ్యిందా? నా ఆలస్యానికి మన్నింపులు.
తెల్లని పంచెకట్టుతో వెన్నెలంతా అతని మొహంలో పుచ్చపువ్వులా విప్పుకున్నంత అందం, తేజస్సు కనిపించాయి.అతన్ని చూడడం ఇదే మొదటిసారి కాదు, కానీ ఇలా ప్రత్యేకంగా చూడడం మాత్రం తొలిసారే.
నిజంగా తనకు ఇవ్వాల మూడింది, అని మౌనంగా తలదించుకుంది,
ఏంటో! దీర్ఘాలోచన. అమ్మాయిగారు…! ఈ లోకంలోనే ఉన్నారా? లేకుంటే అప్పుడే మరో కొత్త లోకంలోకి అడుగుపెట్టారా?
ఆ… అబ్బే.. అదేం లేదు. ఇందాక చదివిన శ్లోకం అర్ధం…..
ఓ అదా ! మన్మథుని ఐదు పూల బాణాలలో మరుమల్లెలు కూడా ఒకటి. అని అన్నాడు. జాగ్రత్తగా ఆ బుట్టను ఆమె చేతికందిస్తూ. అక్కడ పెట్టండి. వీటితో చాలా పనుంది. అన్నాడు. నవ్వుతూ. ” మల్లికా కుసుమైరేవం వసంతే గరుడ ధ్వజమ్యోర్చయే పరమా భక్త్యా దహేత్ పాపం త్రిధార్జితమ్” అని చింతామణి… అనగానే తలెత్తి చూసింది.
అదే నండీ ! పుష్ప చింతామణి చెబుతోంది. మీరు సమయానికి వస్తే ఈ శ్లోకం చదువుదామనుకున్నాను . కానీ..
ప్లీజ్..! ఈ శ్లోకాల గొడవ ఆపండి. నాకు చాలా తలనొప్పిగా అనిపిస్తున్నది.
అయ్యయ్యో ! మీకు తలనొప్పి తెప్పించడం నా ఉద్దేశం కాదండి. శ్రీ మహావిష్ణువుకు మల్లెలు చాలా ప్రీతి పాత్రమైనవనీ, వానితో పూజిస్తే పాపాలన్నీ నశిస్తాయట. మీ చేత చేయించుదామనుకున్న అంతే.
హమ్మయ్య ! నేననుకున్నది కాదు. నా కోసం మేలు కోరి తెచ్చారట. అపార్థం చేసు కున్నాను. అని మనసులోనే అనుకొని స్థిమితపడింది.
ఇక మొదలు పెడదామా ? అన్నది.
మీరు చాలా ఆత్రంగా ఉన్నట్టున్నారు. మీ జడలోని మల్లెలు వాడిపోతాయని భయంగా ఉందా ? అన్నాడు. వాడడం ఏమిటి ? అంది కంగారుగా.
అబ్బా ! మీకు కొంచెం కూడా సృజనాత్మకత తెలియదండీ. నా ఉద్దేశ్యంలో మల్లెలు వాడడమంటే ఆలస్యమవుతుందని తొందర పడుతున్నారా ? అని. -.. ఓ….అలాగా ! ఇక సంగీత పాఠం మొదలుపెట్టండి.
తలనొప్పిగా ఉన్నప్పుడు పాఠం తలకేమి ఎక్కుతుంది. ఇవ్వాల్టికి పాఠం వద్దు ఏమి వద్దు గానీ… మీరిలా కూర్చొండి పాలు వేడి- చేసుకొని తీసుకువస్తాను. అన్నాడు. వద్దండీ ! నేనింటికి వెళ్ళిపోతాను. దయచేసి వదిలివేయండి.
బ్రతిమిలాడడం ఏమిటండీ ? కాసేపు మీ ప్రాణ స్నేహితురాలు విదుషిలాగే నన్నూ ఒకమంచి స్నేహితుడిని అనుకొని కాసేపు సరదాగా గడపచ్చుగా.
అది కాదండీ…..!
మీరింకేం మాట్లాడకండి . నేనిప్పుడే పాలు తెస్తాను. అంటూ జవాబు కోసం వేచి చూడకుండా వెళ్ళిపోయాడు. అతడిని తానే అనుమానిస్తూ తలనొప్పి తెచ్చుకుంటున్న దేమో!
ఏదైతేనేం ఈ ప్రశాంతత మనసుకు రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తున్నది. అనుకుంటూ. కిటికీ పరదాలను తెరిచింది. అచ్చంగా తన మనసును కమ్మేసిన అనుమానపు పరదాలను తొలగించుకుంటున్నట్టుగా. అవతల వైపు నిద్రకు ఉపక్రమిస్తున్న చెట్లు, వాటిపై గూళ్ళను చేరుతున్న పక్షులు, ఆహారం కోసం పిల్ల పక్షుల గారాబపు అరుపులు వింటూ చూస్తుండగా, చల్లగా శరీరానికి ఏదో తగిలి ఒళ్ళు జలదరించి అప్రయత్నంగానే కెవ్వుమని అరిచింది.
*****
(సశేషం)
రావుల కిరణ్మయి .తల్లిదండ్రులు అనసుర్య పుల్లచారి గార్లు.జననం హుజురాబాద్ ,తెలంగాణ.తెలుగు భాషోపధ్యాయిని.70 వరకు కథలు.100కు పైగా కవితలు.చైతన్య గీతాలు,బాలగేయాలు,వ్యాసాలు,వివిధ పత్రికలలో ప్రచురితాలు.ఔధార్యం కథా సంపుటి.జీవశ్వాస నవల.వివిధ సాహితి సంస్థల తో బహుమానాలు.ప్రశంసలు.సమాజాన్ని చైతన్య పరిచేవిధంగా రచనలు చేయడం పట్ల చదవడం పట్ల ఆసక్తి.