ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 5
(ఒరియా నవలిక )
మూలం – హృసికేశ్ పాండా
తెనుగు సేత – స్వాతీ శ్రీపాద
1999 లో ఆకలి చావుల కమీషనర్ గా నేను ఆ ప్రాంతం లో తిరిగాను. ఆ సమయానికి గ్రామ జనాభాలో పెద్ద సంఖ్యలో జనం అప్పుల వలలో ఇరుక్కుపోయారు.
అంతకు మునుపు దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం, ఆ ప్రాంతంలో ఒక ఏడాది పాటు పనిచేసాను. ఆ సమయంలో ఆ ఆర్ధిక స్థాయి జనాలలో చాలా మంది ఇలా అప్పులలో లేరు, కనీసం ఈ స్థాయిలో. అడవులు కూడా ఇంతగా తరిగిపోలేదు. జలంధర్ కి అప్పట్లో కూడా కలప అక్రమ వ్యాపారి అని అపవాదు ఉండేదనుకోండి, కాని అతనికి ఇంత సువిశాలమైన ఆర్ధిక సామ్రాజ్యం ఉండేది కాదు. జహంగీర్ రైల్వే కూలీలకు కాంట్రాక్టర్ గా ఉండేవాడు. వారిమీద అడవుల నుండి కలప అక్రమ రవాణా, రైల్వే దొంగతనాలు , కోర్ట్ కేస్ లు ఉండేవి- వారు వారి సోదరులు, కొడుకులు కొందరు విడతల వారీగా జైలుకు వెళ్ళేవారు.
1999 వచ్చేసరికి ఈ ప్రాంతపు ఆర్ధిక స్థితిగతులు మారిపోయాయి. వార్తాపత్రికలు మాటిమాటికీ కరువు, ఆకలి చావులు, పెద్ద సంఖ్యలో జనం వలస కూలీలుగా వెళ్ళడం గురించి ప్రస్తావించేవి. దానితో పాటు తప్పక వరిపంట అమ్ముకోడం వార్తలు కూడా వచ్చేవి.
గమడా రోడ్ పెద్ద టౌన్ గా రూపొందింది. ఆ ప్రాంతం చుట్టుపట్ల దాదాపు ఇరవై అయిదు రైస్ మిల్స్ ఉండేవి. కనీసం పదిహేను జలంధర్, జహంగీర్ వారి సోదరులకు చెందినవి. ఆ గ్రామాలలో సంచరించిన సమయంలో నా దృష్టికి వచ్చినది, దాదాపు ముప్పై శాతం మగవారు వలస కూలీలుగా ఇళ్ళు వదిలిన వారే. ఎన్నో భవనాలను నిర్మించారు. కొన్ని హోటల్స్, లాడ్జింగ్స్ కూడా వస్తున్నాయి.
కొంతమంది యువకులు తప్ప మిగతా మగవారంతా వలస కూలీల నుండి ఖరారునామా వలస కూలీలుగా మారిపోయారు. ఒక సాధారణమైన కాంట్రాక్టర్ కూలీ ముందు ఎక్కువ వడ్డితో అప్పు తీసుకుని దాన్ని తిరిగి చెల్లించలేక తన భూమిని తనఖా పెట్టేవాడు. 1999 కి ఇలా తనఖా పెట్టిన భూములను జలంధర్, జహంగీర్ వంటివాళ్ళు నిర్వహించలేక వాటి రికార్డ్ లను అనుసరించలేకపోవడం వల్ల తమ ఉద్యోగులలో భగర్తి వంటి బండి వాళ్ళను, గోవింద భులియా వంటి వారిని చేర్చుకున్నారు. ముందు భూమిని తనఖా పెట్టిన యజమానికి సాగుచేసుకుందుకు ఇస్తారు. దున్నుకునే వాడు సంతోషపడి ఏదో ఒక రోజున భూమి మీద హక్కులు వస్తాయన్న ఆశతో మనసా వాచా వ్యవసాయానికి అంకితమైపోతాడు. కాని సగం పంట దిగుబడి ఇచ్చుకున్నాక ఇహ వ్యవసాయం సాగించ డం అసాధ్యం. చివరికి భూములు అమ్ముకోడం, లేదా బీడు భూములుగా వదిలెయ్యడం, వలసకూలీలుగా వెళ్ళడం జరిగేది. మొదట ఒంటరిగా , తరువాత మొత్తం కుటుంబం వెళ్ళేవారు. పూర్ణ, ప్రేమశిల ఖరారుచేసిన వలస కూలీలుగా వెళ్ళే కథనం పైన చెప్పిన దానికి భిన్నం కాదు.
ఏ వలస కూలీ కూడా జలంధర్, జహంగీర్ ల అనుమతి లేకుండా ఒరిస్సా దాట గలిగేవారు కాదు. రాష్ట్రం బయట నుండి ఏ ఒక్క బ్రోకర్ కూడా వీరిద్దరి అనుమతి లేకుండా ఏ హోటల్ లేదా లాడ్జింగ్ లో ఉండలేకపోయేవారు. ఆ మొత్తం ప్రాంతమంతా మూలమూలలా ఏ బ్రోకర్ కూ ఇలాటి అనుమతి లేకుండా ప్రవేశం లేదు. జహంగీర్ లీగల్ కౌన్సిల్ సభ్యునిగా ప్రతిపక్ష ప్రతినిధి, జలంధర్ మున్సిపాలిటీ చెయిర్మెన్ గా రూలింగ్ పార్టీ ప్రతినిధి. ఇద్దరి మధ్యా రాజకీయ వైరం ఉన్నా వ్యాపార ఏర్పాట్లు ఉండనే ఉన్నాయి.
జహంగీర్ కు రైల్వేలో ఉన్న పలుకుబడి వల్ల రైల్వే కూలీలకు అప్పులివ్వడంలో, కూలీలను సమకూర్చడానికి కాంట్రాక్ట్ ఇవ్వడంలో అతనిదే ఏకచ్చత్రాధిపత్యం, జలంధర్ ను రైల్వేల ఆస్థులకు దూరంగా పెట్టాడు. నాలుగు వేలమంది రైల్వే గాంగ్మెన్ పాస్ బుక్స్ తన అధీనంలో పెట్టుకున్నాడు జహంగీర్. ట్రెయిన్ లలో అక్రమ కలప రవాణా కూడా చూసుకునేవాడు. రైల్వే స్థలాల్లో ఇళ్ళుకట్టి తన బ్రోకర్స్ కి ఇచ్చేవాడు. కొంత రైల్వే భూమిని అమ్మాడు కూడా. తన పనుల్లో కొన్ని కొడుకులకు , సోదరులకు పంచాడు. జహంగీర్ వరి మిల్లులు , కలప డిపోలకు బాధ్యత వహించేవాడు. అతని తమ్ముడు అలంఘీర్ కలప అక్రమ రవాణా, గాంగ్ కూలీలకు అప్పులివ్వడం చూసుకునే వాడు. కొడుకు ఔరంగజేబ్ భూమి తనఖా, సారాయి వ్యాపారాలు, మరోకొడుకు బాబర్ వలస కూలీలను పంపడం , వారి నుండి అప్పు వసూళ్ళు చూసుకునేవారు.
అలాగే జలంధర్ వరి మిల్లులు, కలప డిపోలను, అతని సోదరుడు శచీందర్ సారాయి, కలప అక్రమ రవాణా వ్యాపారాలు, మరో తమ్ముడు మహీందర్ భూమి తనఖా వరి దిగుమతి, వలస కూలీలను పంపడం చూసుకునే వారు. అతను రాయపూర్ రోడ్ కాంట్రాక్ట్ పని కూడా చూసుకునే వాడు.
జలంధర్ , జహంగీర్ లకు వలస కూలీల వ్యాపారం లో ఒకరి పట్ల ఒకరికి స్పష్టమైన అవగాహన ఉంది. ఇద్దరూ కూడా ఎదుటి వారి ట్రక్ ను ఆపరు. ఎదుటి వారి ఒప్పందపు వలస కూలీని ఇద్దరిలో ఎవరూ ఆదుకోరు. ఏ గొడవైనా తరువాత సామరస్యం గా పరిష్కరించుకుందుకు ఒప్పుకున్నారు. ట్రక్ లలో ఏ గొడవైనా ఆపడానికి లేదా వలస కూలీలను దారిలో ఆపకుండా ఉండడానికి వారి సంకేత పదాలు- నేను జహంగీర్ మనిషిని లేదా నేను జలంధర్ మనిషిని.
ఆ సమయంలో గమడా రోడ్ చుట్టుపక్కల గ్రామాల్లో విలువైన రాళ్ళు బయట పడ్డాయి. వజ్రాలు , పచ్చలు, కెంపులు, నీలమణులు, వైడూర్యాలు, మరకతాలు, బంగారపు ముద్దలతో బాటు వెండి వస్తువులు. అడవులలో పాత చెట్లను కొట్టేసినప్పుడు, స్థానిక జనాలు చెట్ల పెద్ద పెద్ద వేర్లను వంట చెరుకు కోసం తవ్వుకున్నప్పుడు ఈ రతనాల రాళ్ళు బయటపడ్డాయి. జలంధర్, జహంగీర్ ల కుటుంబాలు ఈ వ్యాపారం కూడా తమ నియంత్రణలో ఉంచుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఇంత సులభంగా ధనం సంపాదించగల వ్యాపారం పొందినా వాళ్ళు మాత్రం తమ మామూలు వలసకూలీల రవణా, ఏ మాత్రం ఆపలేదు.
*****
(సశేషం)
స్వాతీ శ్రీపాద పుట్టి పెరిగినది నిజామాబాద్. కధ, కవిత, నవల ఒకఎత్తైతే , అనువాదం మరొక ఎత్తు. వెరసి మొత్తానికి అక్షరాలే ప్రపంచం. రాసినది చాలానే అయినా ప్రచురించినది 8 కవితా సంపుటాలు, 7 కధా సంపుటాలు, 4 నవలలు మరెన్నో డిజిటల్ పుస్తకాలు. అనువాదాలు 32 తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారం , ప్రతిభా పురస్కారం, వంశీ -తెన్నెటి లత కధా పురస్కారం , వాసిరెడ్డి సీతాదేవి సాహితీ పురస్కారం , రచనకు అనువాదానికి మహాత్మా ఫూలే అవార్డ్ , మొదలైనవి ఎన్నో…