ఆమె
-గిరి ప్రసాద్ చెలమల్లు
ఆమెకి ఓ సాంత్వన నివ్వు చేతనైతే
ఆమె మౌనంలో ఎన్ని ఘోషలు దాగివున్నాయో
వెతికే ప్రయత్నం చేసావా?!
ఆమె గుండె దిటవు కావటం వెనుక
ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలయ్యాయో
ఏనాడైనా గాంచావా!
ఆమె చేయని నేరానికి
ఆమెను పొడుచుకు తింటానికి
కథంతా కాకపోయినా కాస్తంతైనా తెలియకుండానే
ఒంటికాలిపై ఎగిరే ఎందరో తామేంటో తెలుసుకునే
ప్రయత్నం చేసారా!
ప్రేమ అనే రెండక్షరాల పదం
పుట్టుక మర్మం ఎరుగక ముందు
ఆమె మోములో ఎన్నో దీపాల కాంతి
నేడు చీకట్లో నిశ్శబ్దంగా ప్రేమ తాలూకు జ్ఞాపకాలు
తొలుస్తుంటే
ఆశించిన భరోసా ఇక అందదని
నేల రాలుతున్న పారిజాతాలను తొక్కుకుంటూ
మరో ప్రపంచం వైపు అడుగులు మరిచే దిశగా
ఎన్ని కలలు కళ్ళలో నిక్షిప్తమై వుంటేనో
సుడులు తిరుగుతున్న కన్నీటిని రెప్పల మాటున
దాచి వుంచగలదో ఊహించావా !
ఆమె ఆమెలానే జీవించాలనే కృత నిశ్చయం
ఈ సమాజానికి ఓ చెప్పు దెబ్బ!
ఆమె దారిలో ఆమెకో ఆసరా దొరకక మానదు లే!
దొర్లుతున్న కాలచక్రంలో ఇరుసు బలంగా
భావి తరాలకు ఓ మార్గం!
*****