ఆరాధన-5 (ధారావాహిక నవల)

-కోసూరి ఉమాభారతి

          నేను టూర్ నుండి వచ్చేంత వరకు రెండు స్టూడియోలలోనూ శిక్షణ యధావిధిగా సాగింది.

          నాలుగు వారాల తరువాత బే-పోర్ట్ లోని ‘హెరిటేజ్ క్లాస్’ మొదలవగానే.. పన్నెండేళ్ళ స్టూడెంట్ తేజ వాళ్ళ అమ్మగారు లలిత ఓ ప్రతిపాదన చేసింది.

          “మేడమ్, ఈ క్లాసుల్లో మీ గురించి, మీరు ఇలా నృత్యంలో కొనసాగడం గురించి చెప్పగలిగితే బాగుంటుంది. పిల్లలకి స్పూర్తిదాయకంగా, మాకు ఆసక్తికరంగా ఉండగలదని అనుకుంటున్నాము.” అన్నది.

          ఓ నిముషం ఆలోచించాను.  “అలాగే.. నృత్య రంగంలో నా అనభవాలు, విశేషాలు మీతో పంచుకునేందుకు నేను సిద్దం.” అన్నాను. 

          “డాన్స్ విషయంగా అంటున్నారు కనుక ముందుగా..  నేను మరువలేని ఓ సంఘటన గురించి చెబుతాను.  నా మొట్టమొదటి విదేశీ పర్యటన చేసినప్పుడు నాకు ఇరవై ఏళ్లు.  నెలరోజుల పాటు సౌత్ ఆఫ్రికా, జొహనస్-బర్గ్, మారిషస్ లల్లోముప్పైకి పైగా  ప్రోగ్రాములు, టి.వి షోలుఘనంగా జరిగాయి. 

          అయితే జొహనస్-బర్గ్ టి.వి వారు.. ‘నర్తకి జీవితంలో ఓ రోజు’ అన్న డాక్యుమెంటరీ చేస్తామని అడగడంతో.. షూటింగ్ కి  డేట్స్ ఇచ్చాము.  ఆ మరునాడు పొద్దుటే నాలుగింటికి మేకప్ మొదలుబెట్టి తయారయి ఆరింటికల్లా .. డర్బన్ సముద్ర తీరాన బీచ్ ల పై తిల్లానా నృత్యం చేయగా చిత్రీకరించారు. తొలి పొద్దు వెలుగుల్లో అనందంగా నర్తించాను. 

          ఇంతకీ విశేషం ఏమంటే .. ఆ డాక్యుమెంటరీ కెమెరామెన్ ‘హెల్మట్ సిడో. ఆయన ‘గన్స్ ఆఫ్ నవరాన్’ అనే ప్రఖ్యాత సినిమాకి కెమెరామెన్ గా పనిచేశారని తెలిసి ఎంతో గొప్పగా ఉత్సాహంగా అనిపించింది. బీచ్ పై చిత్రీకరణ తరువాత నేరుగా డర్బన్ సివిక్ సెంటర్ కి వెళ్ళాము. 

          అక్కడ కొద్ది గంటలు షూటింగ్ పిదప ‘హెల్మెట్ సిడో.. మీడియాతో మాట్లాడుతూ.. ‘భారతీయ నృత్యం అంటే అవగాహన లేని తనకి, నా నృత్యం ఎంతగానో నచ్చిందని, నేను కళ్ళతో భావాలని పలికించిన తీరు అద్భుతంగా ఉందని, భారతీయ నృత్య డాక్యుమెంటరీ చేయడం అదృష్టంగా భావిస్తానని’ చెప్పినప్పుడు.. నాకెంతో గర్వంగా అనిపించింది. 

          అంటే.. అమ్మానాన్నల ప్రోత్సాహంతో పాటు కృషి, సాధన ఉంటే, ఇటువంటి సంతోషాలు సాధ్యమే అంటాను. అమ్మనాన్నల ప్రోత్సాహం అన్నాను కనుక ..  ‘అమ్మ’ అనే వ్యక్తి గురించి ఒకింత చెప్పి ముగిస్తాను. సరేనా?”  అడిగాను శిష్యులని.  

          ‘చెప్పండి’ అన్నారు కుతూహలంగా.

          “చెన్నై లో ఐదేళ్లు వెంపటి చినసత్యంగారి వద్ద శిక్షణ పొందుతున్న సమయంలో.. ఉద్యోగపరంగా మా నాన్నాగారి బదిలీ వల్ల.. వరంగల్ వెళ్ళాము. నా నృత్యాభ్యాసనకి బ్రేక్ పడ్డంతో బాగా నిరుత్సాహపడ్డాను. అమ్మావాళ్ళకి నచ్చిన డాన్స్-మాష్టారు దొరక్క పోవడంతో.. మా అమ్మ రంగంలోకి దిగింది. పాత సినిమాల్లోని క్లాసికల్ పాటలకి, జానపదాలకి తానే నృత్యాలని కూర్చి నేర్పేది. ఉత్సాహంగా నేనేమో స్కూల్ ప్రోగ్రామ్స్ లో ఆ డాన్స్ లు చేసేదాన్ని. అప్పుడు నా వయసు పదేళ్ళు. మా అమ్మతో కలిసి కొత్త కొత్త పాటలకి అడుగులు, కదలికలు కొరియోగ్రాఫ్ చేయసాగాను.  

          అలా స్కూల్ ప్రోగ్రామ్స్ కి పర్ఫామ్ చేయడం, ఇతర స్టూడెంట్స్ కి కూడా డాన్స్ నేర్పడం మొదలెట్టాను. స్కూల్ కార్యక్రమాలకి ప్రాక్టీస్ లు చేయమని, చేయించమని మా ప్రిన్సిపల్ గారు నా కోసం ప్రత్యేకంగా ఒక హాలుని  కేటాయించారు. అలా స్కూల్లో నాకెంతో ప్రాముఖ్యత ఏర్పడింది.

          ఇంకా చెప్పాలంటే నా మొట్టమొదటి డాన్స్ అవార్డు వచ్చింది మా అమ్మ డైరక్షన్ లోనే. అదీ ఇంటర్-కాలేజియేట్ డాన్స్ పోటీల్లో పాల్గొని గెలిచాను. ఆ అవార్డు కూడా సభలో ఓ గొప్ప రచయిత్రి, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారి నుండి అందుకున్నాను. 

          అంతే కాదు. మా స్కూల్లో నా నృత్యం చూసి ఓ సినిమా డైరెక్టర్ నన్ను అక్కినేని నాగేశ్వరావు గారి సుడిగుండాలు చిత్రంలో ‘భారతమాత’ గా నటించమని అడిగారు. హైదరాబాద్ వెళ్ళి ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాను. ఆ సినిమాకి బంగారు నంది అవార్డు వచ్చింది. పాపులర్ హీరో అక్కినేనిగారిని కలిశాను. నాతో పాటు మరికొందరు పిల్లలు ఆయనతో కలిసి ఆ సినిమా చూశాము.” అంటూ రెప్ప వాల్చకుండా చూస్తూ నేను చెప్పేది వింటున్న చిన్నపిల్లల వంక చూశాను.

          “అందుకే అమ్మలకి ఏమీ చేతకాదు అని అనుకోవద్దు. అమ్మే మొట్టమొదటి గురువు. అమ్మకి అన్నీ వచ్చు. మన కోసం అమ్మ ఏదైనా చేయగలదు. నిజం. మా అమ్మ నా కోసం డాన్స్ మేక్-అప్ వేయడం నేర్చుకుంది. డ్రస్ డిజైనింగ్ కూడా చేసేది. కాబట్టి అమ్మంటే గురువు కన్నా ఎక్కువే అనుకోవాలి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మరోమారు చెబుతాను. ఇవాళ్టికి ముగిస్తాను.” అన్నాను.

          మరో ఐదు నిముషాల్లో ఒక్క మియా తప్ప మిగతా అందరూ నిష్క్రమించారు. ఆమె నా వద్దకు వచ్చి, “మేడమ్, మీరు వెళ్ళే తొందరలో ఉన్నారు కనుక నేను రేపు మీ హూస్టన్ స్టూడియోకి వచ్చి కలుస్తాను. మీతో స్వయంగా మాట్లాడాలి.” అంది.  

          క్షణం ఆలోచించి, “నిజమే, ఇవాళ నేను వెళ్ళాలి. సారీ మియా. తప్పక రేపు కలుద్దాము. నీ ఆరోగ్యం ఒకేనా? తార, మీ అమ్మగారు ఒకేనా?” అని అడిగాను.

          అంతా ఒకే. ఇకపోతే, మన వైదేహి వాళ్ళింటి పరిస్థితి మెరుగయింది. సంతోషంగా ఉన్నారు. ఇంటిని, భర్తని వదిలి వెళ్ళిన ఆమె తల్లి మాలిని, మేము కలగజేసుకున్నందు వల్ల.. పెద్ద మనసుతో అర్ధం చేసుకుని.. తన కుటుంబంతో కలిసిపోయింది. ఆమె భర్తకు మా ఆఫీసులో ‘డాటా ఎంట్రీ’ జాబ్ ఇచ్చాము. అతను ఇంటి నుండే పని చేయవచ్చు.  అతని ఆరోగ్య దృష్ట్యా మా ఫౌండేషన్ నుండి కూడా ఒకింత సాయం చేయగలమని మాటిచ్చాము. వారంతా హ్యాపీ. అతని ఆరోగ్యం కూడా ఇప్పుడు ఒకింత స్థిరంగానే ఉందని తెలిసింది. రేపు ఏమవుతుందో చెప్పలేము కానీ..” అంటూ నా వెంటే బయటికి నడిచింది.

***

          ఇంటికి వెళ్ళేప్పటికి .. మురళిగారు ఫ్రిజ్ లోని వంటకాలు వేడి చేసి బల్ల మీద సర్దేశారు. భోజన సమయంలో హైదరాబాద్ నుండి నాన్న ఫోన్ చేశారు. “ఏమ్మా.. ఉమా.. చెన్నైలోని సి.వి.ఆర్ ఫౌండేషన్ వారు కళారంగంలో ‘రాజ్యలక్ష్మీ అవార్డు’కి నిన్ను నామినేట్ చేశారు. ఇంకా నెలరోజుల సమయం ఉంది. నువ్వు రావాలి. విదేశాల్లో కూడా నృత్యానికి నీవు ఎంతో కృషి చేస్తున్నావు. ఎల్.వి.ఆర్ అవార్డుని ప్రతిష్టాత్మక గుర్తింపుగా భావించాలి. మరి అల్లుడుగారికి చెప్పి, వీలుచేసుకుని రెండు వారాల కొరకు వచ్చి వెళ్ళు.” అన్నారు. 

          విషయం తెలుసుకుని.. “తప్పకుండా వెళ్ళు, మీ ఫాదర్ అలా అంటుంటే వెళ్లాల్సిందేగా. పిల్లల్ని నేను చూసుకుంటాను. అవార్డు ఈవెంట్ అటెండ్ అయి వచ్చేస్తే .. మంచిది.” అన్నారు మురళి.

***

          మరునాడు హూస్టన్ స్టూడియోలో క్లాసులు అయ్యే సమయానికి మియా రానే వచ్చింది. ఇద్దరం ఛాయ్ తీసుకుని సోఫాలలో కూర్చున్నాము. 

          “ఇది ఒక ముఖ్యమైన విషయమే మేడమ్. మా అమ్మ ఇక్కడికి వచ్చాక, తన మనమరాలు  రాగిణి పెళ్లి చేయాలన్న ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మధ్యనే అమ్మకి ఓ డాక్టర్ సంబంధం నచ్చి, మనమరాలి అభిప్రాయం అడిగినప్పుడు, రాగిణి బయటపెట్టిన తన ప్రేమ వ్యవహారం విని ఆశ్చర్య పోయాము.” అని క్షణమాగింది మియా.

          ‘ప్రేమిస్తే పెళ్లి చేసేయవచ్చుగా.. అంత  మీమాంస ఏమిటో అర్ధం కాలేదు.  అందునా ఇప్పుడు నాతో ఈ ప్రస్తావన ఎందుకో కూడా తెలియదు. అయినా ఒకింత కుతూహలంగానే ఉంది.’ అనుకున్నాను.    

          “మీరు నిర్వహించే డాన్స్ క్యాంప్లో.. మూడేళ్ళ క్రితం .. తాను కలిసిన చిన్న మాస్టర్ మాధవన్ ని ఇష్టపడుతున్నానని, తాను మళ్ళీ పెళ్లంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని అంటుంది. కానీ మేడమ్..ఓ విషయం..” అంటున్న మియాని ఆపాను.  

          “ఏమిటి? రాగిణి కి మాధవ్ పట్ల.. ఈ ప్రేమ విషయం నేను అసలు ఊహించలేదు.  ఇప్పుడే మీ నోటి వెంటే వింటున్నాను. కాక మీరు .. మళ్ళీ పెళ్లి అన్నారు? అంటే రాగిణికి గతంలో ఓ మారు పెళ్లంటూ జరిగి ఉంటే.. ఆ వివారాలు కూడా నాకు తెలిస్తే.. నేను అతనితో మాట్లాడుతాను మియా.” అన్నాను.

          “రాగిణి కి ఇప్పుడు ఇరవై ఎనిమిదేళ్లు నిండాయి మేడమ్. తాను పందొమ్మిదేళ్ల ప్పుడు తల్లితండ్రులకి ఇష్టం లేకున్నా క్లాస్-మేట్ ని పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళి పోయింది. ఏడాది తరువాత, అతికష్టం మీద కుటుంబానికి తిరిగి రాగిణితో సత్సంబం ధాలు ఏర్పడ్డాయి. అంతా బాగానే ఉంది కదా అని మేము సంతోషించాము. 

          కొన్నాళ్ళ తరువాత .. ఆమె భర్తతో కారులో ప్రయాణం చేస్తుండగా జరిగిన ఆక్సిడెంట్ లో బాగా గాయపడ్డారు. రాగిణి గర్భం పోయింది కానీ అతను తీవ్రంగా గాయపడి నడుము నుండి పాదాల వరకు కదలిక కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. 

          హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన కొన్నాళ్ళకి  రాగిణి భర్త మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో రాగిణి మానసికంగా క్రుంగిపోయింది. ఆ సమయంలోనే నేను ఆమెని ఇక్కడకి స్టూడెంట్ వీసా మీద రప్పించగలిగాను. మరి తన గతం అంతా మాధవ్ కి తెలుసా అంటే, ‘కొంత తెలుసును. ఓ మారు మాటల్లో.. పెళ్ళయిన రెండేళ్ళకి నా భర్త కారు ప్రమాదంలో చనిపోయాడని చెప్పాను.’ అని జవాబిచ్చింది రాగిణి. 

          మనం కలగచేసుకుంటే ఈ వ్యవహారం ముందుకు సాగుతుంది. మా వైపు నుండి ఎటువంటి అభ్యంతరం లేదు మేడమ్. మీకు నేను కథ సాంతం చెప్పాను.” అంది మియా. 

          నేను ఆలోచనలో పడ్డాను. ‘మాధవ్ కి తన మరదలితో వివాహం అని బాల్యంలోనే పెద్దవాళ్ళు నిర్ణయం చేశారని తెలుసును. ఆ అమ్మాయి త్వరలో పై చదువులకి అమెరికా వచ్చేందుకు మాధవ్ ప్రయత్నాలు చేస్తున్నాడని కూడా ఆ మధ్యన తానే అన్నాడు కూడా.’ అని గుర్తొచ్చింది.

          అతనితో మాట్లాడ్డం నా బాధ్యత కనుక.. “నేను మాధవ్ తో మాట్లాడి త్వరలో నిన్ను పిలుస్తాను మియా.” అన్నాను ఆమెతో.

***

          మారునాడే మాధవ్ ని స్టూడియోలో ఆఫీసు రూముకి పిలిపించాను… రాగిణి విషయంలో అతని ఆలోచన ఏమిటని అడుగుతూ… తన మరదలు గురించి ఆరా తీశాను. 

          కొద్ది క్షణాల మౌనం తరువాత.. “నా కజిన్ కాత్యాయనితో నేను మాట్లాడుతూనే ఉన్నాను మేడమ్. పెద్దవాళ్ళ నిర్ణయాలని మేము గౌరవించినా, మా మధ్య అటువంటి ప్రేమ లేదు. ముందుగా తానే నా వద్ద ఈ విషయం ప్రస్తావించింది మేడమ్. పై చదువుల కోసం కాత్యాయని  ఇక్కడికి త్వరలోనే వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ లోగా మా కుటుంబాలతో ఈ విషయంగా మాట్లాడుతానంది. నేను ఇప్పటికే మా అమ్మతో ఈ విషయం మాట్లాడాను.” అంటూ ఏకబిగిన వివరించాడు మాధవ్.

          “మరి.. రాగిణి కి నీకు మధ్య నిజంగానే ఏదైనా ఉంటే..  ఆలోచించి అడుగు వేయాలి. ఆమె విషయాలు నీకు, నీ కుటుంబ విషయాలు ఆమెకి తెలియాలి. ఇద్దరూ కూడా మనస్పూర్తిగా అన్ని వివరాలు మాట్లాడుకోవాలి. కాత్యాయని అంగీకరంతోనే తరువాయి కార్యక్రమం జరగేలా ప్లాన్ చేసుకోండి.

          ఇకపోతే, నేను రెండు వారాలు ఇండియాకి వెళుతున్నాను. ఇక్కడ బాధ్యతలు ఎప్పటిలా నీవే మరి.” అంటూ నవ్వుతూ అతన్ని సాగనంపాను. 

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.