ఈ తరం నడక – 9

అన్ బ్యాలెన్స్డ్ ఎమోషనల్స్ – పూర్ణిమ తమ్మిరెడ్డి

-రూపరుక్మిణి. కె

 

          మనిషై పుట్టాక ఏదో ఒక ఎమోషన్ క్యారీ చేయక తప్పనిసరి. పసితనంలో మొదలైన ఆలోచనలలో ఎవరి ఆలోచన ఎక్కడ ఆగిపోతుందో..? ఎవరి ఆలోచన ఎక్కడ మొదలవుతుందో మనకి తెలియదు.

          ఇలా కొన్ని కథలు చదువుతుంటే ఇన్ని ఎమోషన్స్ ఎలా క్యారీ చేస్తున్నారు ఈ కథల్లో… అన్నప్పుడు ఖచ్చితంగా ఆ రైటర్ని ప్రశంసించి తీరాలి. అలాంటి ఓ రచయితని గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాము. ఆ రచయిత పేరు పూర్ణిమ తమ్మిరెడ్డి.

          “ప్రేమ, పాశం, విరహం, దుఃఖం ఇలాంటి వాటి గురించి మనకు తెలిసిన అర్థాలను, ఉన్న అనుభవాలను సవాలు చేసే కథాంశాలు ఇవి. తెలుగులోనే రాసినా, తెలుగు సాహిత్యానికి అలవాటు లేని శైలి, వ్యక్తీకరణ ఉన్న కథలివి. అర్బన్ జీవితాల్లో కనీకనిపించకుండా దాచే విషయాల గురించిన కథలివి. ఇవి అందరికీ నచ్చే కథలు కావు. అందుకని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఈ పుస్తకాన్ని కొనండి. అంతరంగాల్లోకి తొంగి చూసే ఓపిక, తీరిక ఉన్నప్పుడే వీటిని చదవండి. ఇలా ఓ రచయిత తన అంతరంగాన్ని వెల్లడించినప్పుడు రీడర్నీ కల్లోలంలోకి వదిలేస్తుంది. నాకు మాత్రం ఈ అక్షరాలే పుస్తకంలోకి ప్రవేశించేలా చేసింది.

          ఈ కథలన్నీ మన చుట్టూ ఉండే మనుషుల అంతర్గత అంతరంగాన్ని వినిపిస్తాయి.
మొదటి కథ చదవడానికి ఓ కథ చచ్చిపోయింది అంటూ మొదలెడతారు. ఒక మనిషి ఎంత దూరం పరిగెత్తినా అందుకోలేని ఎమోషన్స్ ని ఈ కథలో మన బుర్రను వేధిస్తుంది..
” అక్కడ దాచుకున్న జ్ఞాపకాన్ని తుడిచివేయగల శక్తి ఉంటే బాగుండు” అన్నప్పుడు కూడా ఇలా ప్రతీ ఒక్కరి అంతరంగమే కదా! అనిపిస్తుంది.

          ఒకరి జీవితం నుంచి, జీవితాలలోని అనుబంధాలకు ముగింపు పలకడం అంత తేలిక కాదు.

          మాట – మనసు రెండు వేరు వేరు. ఈ రెండు కలిసి మనుషుల్ని మనుషులుగా నిలబెట్టిన సందర్భం ఒకటైతే, మనిషిని పిచ్చి వాళ్ళని చేసి జనసంద్రంలో సంబంధం లేకుండా చేస్తుంది ఇంకొకటి. ఇలా కొందరి జీవితాల్లో ప్రేమాంతరంగం వేల పూలు పూస్తే, కొందరికి ముళ్లలాంటి జ్ఞాపకాలు బదిలీ చేస్తుంది. ప్రేమలో చిగురించడం ఎంత తేలికగా ఉంటుందో, విడిపోవడంలోని అంత కష్టాన్ని వివరించగలిగిన కథలు, మనుషులు కలవలేని స్థితిలో కూడా మనసులు మాత్రమే కలిసి ప్రయాణించే మనసు కథలు, అంతరంగాల ఆందోళనలు సముద్ర ఘోషలా వినిపిస్తాయి. మనసుకు నచ్చిన మనిషి వెంట నడవ లేనప్పుడు జీవితాలు ఎలా దారి తప్పి పడిపోతాయో ఈ కథలు చెప్తాయి.

          ఈ కథల్లో ఏ పాత్రా మనతో మాట్లాడదు. ఏ పాత్రా మనల్ని సంతోషపరచదు అలా అని ఇందులోని పాత్రలన్నీ కూడా మనల్ని వదిలిపెట్టవు. ఒక్కో కథ ఆసాంతం చదివేశాక.. ఇలా జరిగి ఉండకూడదే, అలా జరిగి ఉండుంటే, ఇంకోలా జరిగితే, మరోలా జరిగితే బాగుంటుంది కదా అన్న ఆలోచనక్కూడా అవకాశం ఇవ్వవు ఈ కథలు.

          అందుకు ఈ పుస్తకం పేరుగా పెట్టిన ఎమోషనల్ ప్రెగ్నెన్సీ గురించే మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీ అనగానే గర్భం ధరించడం అనుకునే వారే ఎక్కువ, ప్రేమించుకున్న వారు లేదా ఒకరిపై మనం ఎమోషనల్ గా ఆధారపడినప్పుడు కూడా మనసు ఎలా స్పందిస్తుందో తెలిపే ప్రయత్నం ఈ కథ. తల్లి కాబోతున్న ఓ స్త్రీలో ఎలాంటి హార్మోన్స్ మార్పులకు గురవుతుందో అలాగే ఓ వ్యక్తి ఎమోషనల్ గా కనెక్ట్ అయినప్పుడు కూడా అలాగే ఆ వ్యక్తిలోని హార్మోన్లలో మార్పులు తప్పనిసరిగా వస్తాయని, అది సైన్స్ అని, అలా వచ్చినప్పుడు మనిషి ఆరోగ్యం కూడా మార్పుకు గురవుతుందనే వాస్తవాన్ని ఎంతో ఎమోషనల్ గా వివరించి చెప్పే కథే ఈ ఎమోషనల్ ప్రెగ్నెన్సీ కథ.

          ఈ పుస్తకం నిండా అనేక మనసుల అంతరంగాల ఆవిష్కరణ జరుగుతుంది. సమాజంలో ఉన్న అనేక మార్పులతో మనుషుల మధ్య మరియు మనసులకి ఇచ్చే ప్రాధాన్యతని, అలాగే వారి మధ్య జరిగే సంఘర్షణల సమాహారమే ఈ పుస్తకం.

          అయినా ఈ కథలు రీడర్ కి కథని అంత తొందరగా పట్టించే విధంగా ఉండవు. ఏం చెబుతున్నారనే విషయం ఎంతో నిదానంగా మనకు అందుతుంది. ఎందుకంటే ఈ కథల్లో ఏ శిల్ప శైలి ఉండదు. అదే సమయంలో ఓ ప్రత్యేక శైలి మనకు కనబడకుండానే కనబడుతుంది. ఇక్కడ ఏ కథ పాత్రను అనుసరించే విధంగా ఉండదు. మనసుని, దాని అంతరంగాన్ని విని స్పందించే క్షణాలని బట్టి మార్పు జరిగే కాలాన్ని క్యాప్చర్ చేయడంలో ఈ రచయిత సక్సెస్ అయ్యారు. ఈ కథలు అంతగా రీడర్ కు చేరడంలో చాలా బ్రేకులు పడతాయి అయినా అర్థవంతమైన ఎమోషన్స్ ని పంచుతాయి. కొత్త కథాశిల్పంతో నిండి ఉన్న కథలు ఇవి. మీ మనసుల్ని తప్పకుండా ఆకర్షించే కొత్త తరంలోని కొత్త కథాశైలి ఈ పుస్తకం.

అభినందనలు పూర్ణిమా తమ్మిరెడ్డి!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.