ఎలుక పిల్ల పెళ్ళి
-కందేపి రాణి ప్రసాద్
ఒక ఎలుక తన కూతురికి పెళ్ళిచేయాలి అనుకున్నది. అనుకున్నదే తడవుగా తన మిత్రులందరికీ చెప్పింది. మా పిల్లకు మంచి సంబంధాలు చూడమని అందరినీ కోరింది. అందరూ మంచి సంబంధాలు చూస్తామని మాట ఇచ్చాయి . ఎలుక తన కూతురికి బాగా అందగాడైన భర్తను తీసుకురావాలని అనుకున్నది.
ఒక రోజు నెమలి మంచి కబురు తీసుకు వచ్చింది . ” మీ పిల్లకు చాలా అందంగా ఉన్న వరుడిని చూశాను . నువ్వు వాళ్ళకు ఇచ్చి పెళ్ళి చేశావంటే ఈడూ జోడూ బాగుంటుంది. నువ్వు కోరుకున్నట్లు పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు ఎప్పుడు రమ్మని చెబుదాం! మన పిల్లని చూసి వెళితే బాగుంటుంది ” అని చెప్పింది నెమలి .
సరేనని చెప్పింది ఎలుక .
నెమలి తెచ్చిన వరుడు తన తల్లిదండ్రులతో సహా వచ్చి ఎలుక కూతురిని చూశాడు. వరుడికి ఎలుక పిల్ల నచ్చింది. సంతోషంగా పెళ్ళి చేసుకుంటానని ముందుకు వచ్చాడు. కానీ ఎలుక మాత్రం తర్వాత కబురు చేస్తానని తప్పించుకుంది. నెమలి ఆశ్చర్యపోయింది.
వరుడి తరుపు వాళ్ళు వెళ్ళిపోయాక నెమలి మెల్లగా ఎలుకను చేరి “నీకు అబ్బాయి నచ్చలేదా “? అని అడిగింది. అదేమీ లేదు అబ్బాయి అందంగా ఉన్నాడు. ఈడూ జోడూ బాగుంది కానీ లక్షల్లో జీతాలు లేని వాడు. వేలల్లోనే సంపాదిస్తాడు అని చెప్పారు కదా! నువ్వు వినలేదా! అందుకే తర్వాత చెబుతానని దాట వేశాను అన్నది ఎలుక. వరుడు మరియు వాళ్ళ కుటుంబం నచ్చినా కూడా జీతం నచ్చలేదని అర్థమయింది. నెమలి ఏమీ మాట్లడలేదు.
ఎలుక మాత్రం తన కూతురికి సంబంధాలు చూస్తూనే ఉన్నది. ఒక రోజు కోతి మంచి సంబంధ మంటూ ఒక వరుని వివరాలు చెప్పింది. ఎలుక ముందుగానే అబ్బాయి జీతమెంత అని వాకబు చేసింది. దానికి కోతి “అబ్బాయికి లక్షల్లో జీతం వస్తుంది. పెద్ద ఇల్లు, కారు కూడా ఉన్నాయి. మీ అమ్మాయి సుఖపడుతుంది” అని చాలా గొప్పగా చెప్పింది. ” సరే రమ్మని చెప్పు” అని ఎలుక కోతికి చెప్పింది.
ఒక మంచి రోజు చూసుకుని కోతి వరుని కుటుంబ సభ్యులను తీసుకువచ్చింది. పిల్లా, పిల్ల వాడు ఇద్దరూ ఒకరి నోకరు చూసుకున్నారు. కోతి తీసుకువచ్చిన వరుడు పొడవుగా ఉన్నాడు. ఎలుక పిల్ల పొట్టిగా ఉంటుంది కదా వాళ్ళు ఏమంటారో అని కోతి భయపడింది. కానీ వరుడు అమ్మాయి నచ్చిందని చెప్పడంతో కోతి ఊపిరి పీల్చుకుంది. సంతోషంగా ఎలుక వంక చూసింది. కానీ ఎలుక మొహంలో సంతోషం కన్పించలేదు. ముభావంగా కూర్చున్నది. పెళ్ళి చూపుల తతంగం ముగిశాక పెళ్ళివారు బయల్దేరు తుండగా ఎలుక “తర్వాత ఏ విషయం చెబుతామండీ” అని తప్పించుకున్నది పెళ్ళివారు వెళ్ళిపోయారు.
“పిల్లవాడు చాలా పొడవుగా ఉన్నాడు. లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయికి ఇచ్చి చెయ్యి”అని కోతి సంబరంగా అన్నది “ఆ అబ్బాయి నల్లగా ఉన్నాడు. నేను మా పిల్లను ఇవ్వను” అన్నది ఎలుక. “మీ అమ్మాయి కూడా నల్లగానే ఉన్నది గదా. పిల్లవాడు చాలా మంచివాడట. ఏ చెడు అలవాట్లూ లేవట . సరైన వరుడు” అని ఎలుకతో నిదానంగా చెప్పింది కోతి. కానీ ఎలుక ససేమిరా అన్నది. మా అమ్మాయి నల్లగా ఉన్నా కూడా పెళ్ళికోడుకు ఎర్రగా ఉంటేనే మా పిల్లనిచ్చి పెళ్ళి చేస్తాను . నేనింకేమీ చెప్పేదేమీ లేదు” అని కరాఖండీగా చెప్పింది.
కోతికేమి చేయాలో పాలుపోలేదు. సరే నాకెందుకులే అనుకుని “వస్తా మిత్రమా” అని వెళ్ళిపోయింది.
రోజులు జరుగుతున్నాయి. ఎలుక పిల్ల కోసం పెళ్ళి కొడుకులు వస్తూనే ఉన్నారు. పోతూనే ఉన్నారు. ఎలుక ప్రతి వాళ్ళకీ ఏదో వంక చెప్తూనే ఉన్నది. అడవిలో జంతువులన్నీ చాలా సంబంధాలు తీసుకువచ్చాయి. కానీ ఎలుక పెదవి విరుస్తూనే ఉన్నది. ఎవరినీ మెచ్చుకోవడం లేదు. ఎలుకకు ఎవరూ నచ్చడం లేదు .
ఒక రోజు జింక ఎలుక వద్దకు వచ్చింది. మా బంధువులబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి ఎర్రగా ఉంటాడు. పొడవుగా ఉంటాడు. కట్నకానుకలు ఏమి అడగడు. లక్షల్లో జీతం వస్తోంది. నీకు ఇంతకంటే మంచి సంబంధం దోరకదు. నేను చెప్పిన మాట విను . వాళ్ళకిచ్చి పెళ్ళి చెయ్యి బాగుపడతారు” అంటూ ఎన్నో విషయాలు చక్కగా చెప్పింది.
అన్నివిషయాలు విన్నది ఎలుక. సరే జింక మామా! అలాగే చూద్దాం కానీ పెళ్ళయ్యాక మా అమ్మాయి జీతం మాకే ఇస్తుంది. వాళ్ళకేమీ ఇవ్వదు. వాళ్ళకేమీ అభ్యంతరం లేదు కదా! అంటూ ఆశగా అడిగింది.
ఆ ! అలాంటిదేమీ లేదు. ఆడపిల్ల సంపాదన తినాలని అనుకునే వాళ్ళుకాదు. వాళ్ళు చాలా ఆస్తి పరులు. తల్లిదండ్రుల వద్ద చాలా ఆస్తి ఉన్నది. పైగా వాళ్ళు ఉద్యోగస్తులు. అందుకని వాళ్ళు మీ అమ్మాయి డబ్బును అడగకపోవచ్చు. “అన్నది జింక” అలా అయితే వాళ్ళను తీసుకురా మామా “అన్నది ఎలుక”. జింక సరేనని చెప్పి వెళ్ళింది.
ఒక మంచి రోజు చూసుకుని జింక పెళ్ళికోడుకు కుటుంబాన్ని తీసుకు వచ్చింది. ఎలుక వాళ్ళింటికి వచ్చారు. ఎలుక వాళ్ళ పిల్లను చూపించింది . ఎలుక రహస్యంగా జింకను అడిగింది- నేను చెప్పిన విషయం వాళ్ళకు చెప్పాదా? జింక నోటి మీద వేలు వేసుకుని ” గట్టిగా మాట్లాడకు. వాళ్ళు ఒప్పుకున్నారు అన్నది. ఎలుక మొహం విప్పారింది ఇక పెళ్ళి చేసేద్దాం అనుకున్నది.
*****
నేను ప్రధానంగా బాలసాహిత్యం రాస్తాను.నేను సుమారుగా 40పుస్తకాలు రచించాను. బాలసాహిత్యం_విజ్ఞానికరచనలు అంశంపై PhD చేశాను.తెలుగు విశ్విద్యాలయం వరి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్న ను.20 ప్రక్రియలలో రచనలు చేశాను.టీచింగ్ aids,memontoes, బొమ్మలు చార్టులు,చేయటం ఇష్టం. మిల్కీ museum nu నిర్వహిస్తున్నాం.sweety children library nI pillala kosam pettanu.