కథా మధురం
ఆ‘పాత’ కథామృతం-23
నందగిరి ఇందిరాదేవి
-డా. సిహెచ్. సుశీల
ఆడపిల్లలు బడికి వెళ్ళి చదువుకునే సంప్రదాయం లేని రోజుల్లో, కనీసం అక్షర జ్ఞానం లేని రోజుల్లో కూడా వారు ఇంట్లో అమ్మమ్మలు నానమ్మల ద్వారా విని నేర్చుకున్న పాటల్ని పాడుకునే వారు. శ్రామిక స్త్రీలు కూడా పొలం పనుల్లో వరినాట్లు లోనో, కలుపు తీస్తూనో, శ్రమ తెలియకుండా, అలుపు రాకుండా పాటలు పాడుకునేవారు. దంపుళ్ళ పాటలు, తిరగలి పాటలు, కవ్వం పాటలు నుండి పెళ్ళిసంబరాలకి సంబంధించిన పాటలు, పేరంటాలలో మంగళహారతి పాటలు హాయిగా పాడుకునేవారు. వేదిక ఎక్కి కచేరీలు చేయకపోయినా కొందరు వయోలిన్, వీణ వంటి వాయిద్యాలను ఆడపిల్లలకు నేర్పించి, ” ఏదో చాకలి పద్దుల వరకు రాయగలదు, ఇంట్లో ఊరికే ఉండడం ఎందుకని కాలక్షేపం కొరకు వీణ నేర్చుకుంది” అని పెళ్ళిచూపుల్లో తల్లిదండ్రులు ‘వినయం గా’ విన్నవించుకునే వారు. అలానే అత్తారింటికి వెళ్ళాక పనులు చక్కబెట్టుకుంటూ, చాలా చక్కగా ” ఇల్లలుకుతూ…” తమ పేరునే మర్చిపోయిన ఇల్లాళ్ళు ఎందరో !
కానీ ఆరోజుల్లో కూడా సరదాకి, కాలక్షేపానికి కాకుండా “ఇష్టంగా” ఏదైనా వాయిద్యం నేర్చుకోవాలనుకునే ఆడపిల్లలు ఉండేవారు. వారి ఆసక్తి, ఆశ తీరే అవకాశం అంతగా ఉండేది కాదు. మంచి గురువు దగ్గర బాగా నేర్పించాలని అనుకునే తల్లిదండ్రులు ఉండరు. పెళ్ళయ్యాక భార్య శాస్త్రీయంగా పాడడానికి, వాయిద్యం నేర్చుకోడానికి “అనుమతి” నిచ్చే భర్తా ఉండడు. అదంత తేలికగా సంభవించే తరుణం లేదు. రంగస్థలం పై స్త్రీ పాత్రలను స్త్రీలు ధరించే పరిస్థితి లేకపోవడం చేతనే పురుషులు ధరించేవారు కదా! ఇక పక్క వాయిద్యాలు కూడా పురుషులే నిర్వహించేవారు. నాట్యం, సంగీతం, వాయిద్యాలు వంటివి నేర్చుకోవడం, ప్రదర్శించడం “కొందరు” స్త్రీల వంతే అనుకోవడం ఎంత దుర్మార్గం! ఇంటిపట్టున ఉండే పతివ్రతలు, పవిత్రాత్ములు కళలకు అర్హులు కారు అనుకోవడం ఎంత అవివేకం!
కానీ స్త్రీలకు మనసు ఉంటుంది, ఆ మనసుకు నచ్చిన కళను నేర్చుకోవాలనే సరదా, ఆసక్తి, తపన ఉంటుంది కదా! అది తీరే అవకాశం సమాజంలో కానీ కుటుంబం లో కానీ ఎంతవరకు ఉంటుంది అనే అంశంతో శ్రీమతి నందగిరి ఇందిరాదేవి ” వాయిద్యం సరదా” కథ రాసారు. ఇది ఒక అస్తిత్వ పోరాట గాధ, ఆరాటం తీరని వ్యధ.
“వాయిద్యం సరదా”
గృహలక్ష్మి మాసపత్రిక మే, 1941
ఆడపిల్ల ఏదైనా వాయిద్యాన్ని నేర్చుకోవాలంటే ఎంత పట్టుదల వుండాలో, చివరికి ఆ చిన్న కోరిక కూడా తీర్చుకోలేక ఎంత ఆవేదన ను అనుభవించిందో తెలియజేసే కథ. ఈ కథలో భర్త పురుషస్వామ్య ఆధిపత్య ధోరణి వల్ల స్త్రీ గా మీనాక్షికి మాత్రమే ఆశాభంగం కాదు… ఏడేళ్ల కొడుకు చిట్టిబాబుకి కూడా. నరసింహంలోని పురుషాధిపత్యంకి తోడు పనిచేస్తున్న ‘పోలీసు అమీను’ ఉద్యోగం మరింత జత చేరింది. అతని ఆకారం కూడా ఈడుకు మించిన ఒళ్లు, పెద్ద పెద్ద మీసాలు, ఖాకీ డ్రెస్సు చూసి మీనాక్షి కాపురానికి వచ్చిన కొత్తలో జడుసుకునేది.
మీనాక్షికి చిన్నప్పడు హార్మోనియం నేర్పించారు తల్లిదండ్రులు. తనతో దానినీ అత్తవారింటికి ప్రేమతో తెచ్చుకుంది కానీ ” సంసారులు పాడడం మహా పాపం” అనే గట్టి నమ్మకం గల నరసింహం ఆమె చూస్తుండగానే ఎవరికో పది రూపాయలకు అమ్మేసాడు.
” నరసింహం ఇంటినీ పోలీసు స్టేషన్నీ ఒకే దృష్టితో” చూసేవాడు. ఇంకా చిత్రం ఏమిటంటే – మీనాక్షి భర్తను ‘అయ్యవారు’ అని పిలిచేది.
కొడుకు చిట్టిబాబు పుట్టాక భర్త పట్ల భయభక్తులు తగ్గలేదు కానీ పిల్లవాడి ఆలనా పాలనా చూసుకుంటూ, నవ్వుతూ, పాటలు పాడుకుంటూ కొంత హాయిగానే కాలం గడిపేది.
చేతిలో లాఠీతో, నోట్లో పెద్ద చుట్టతో ఇంట్లో కి వస్తున్న తండ్రిని చూస్తుంటే ఏడేళ్లొచ్చినా బాబుకి భయమే. ఆయన ఇంట్లో లేకుంటేనే వీళ్ళిద్దరు స్వేచ్చ గా ఊపిరి పీల్చుకునేది.
నరసింహం అనుమతితో శనివారంనాడు ఇద్దరూ చక్కగా గుడికి వెళ్ళి ఆ ప్రశాంతమైన వాతావరణంలో భజన చేస్తూ తన్మయులయ్యేవారు.
ఒకసారి రామమందిరంలో వారం రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు జరిగాయి. ‘అనుమతి’ కోసం చాలా జంకుతూ మీనాక్షి అడడగా ‘అనుజ్ఞ’ ఇచ్చాడు నరసింహం. వారంరోజులు హరికథలు, పాట కచేరీలు, హార్మోనియం, ఫిడేలు, వీణ మేళవింపుతో అద్భుతంగా జరిగాయి.
తల్లి వారసత్వం వచ్చిందేమో చిట్టిబాబుకి హార్మోనియం నేర్చుకోవాలని కోరిక పుట్టింది. మర్నాడు దాన్ని ముట్టుకున్నాడు. వేళ్ళు కదిలించాడు. వాడి ముచ్చట చూసి మీనాక్షి ‘అలా కాదు ‘ అంటూ హార్మోనియం పట్టుకుని మనసారా పాడింది. “హృదయం లోని బరువంతా కరిగిపోయింది. హార్మోనియంలేని జీవితం దండగ” అనిపించింది. ఇన్నాళ్లు అణిచిపెట్టిన కోరిక “కావాలి, కావాలి” అంటూ పెరిగిపోసాగింది. ఎలాగైనా కొనాలి అనుకున్నారు తల్లీ కొడుకులు. ఇంటి ఖర్చులో కాస్త కాస్త తగ్గించుకుని, కూడబెట్టుకుని ఒకరోజు ఇద్దరూ దుకాణానికి వెళ్లి, సెకండ్ హ్యాండ్ లో చూసినా హార్మోనియం కొనే డబ్బు లేకపోయింది. వీళ్ళ ముచ్చట చూసిన గుమాస్తా కొత్తగా వచ్చిన “బుల్ బుల్ తరంగ్” కూడా బాగానే ఉంటుందని వాయించి చూపాడు. నాలుగు రూపాయలు ఇచ్చి కొనుక్కుని ఇంటికి వచ్చి తనకు వచ్చిన పాటలు వాయించి చూపింది మీనాక్షి. చిట్టిబాబు ఆనందానికి అవధులు లేవు.
అంతలో నరసింహం రావడం, వాయిద్యాన్ని చూడడం, కోపంతో అరవడం జరిగిపోయింది. చిట్టిబాబుకి లోపల భయంగా ఉన్నా ” ఒక్కసారి వాయించి చూపితే” ఒప్పుకుంటాడేమో నన్న చిన్న ఆశ ఉంది. “ఎవరు తెచ్చారిది” అన్న అరుపుకి “నేనే” అని అంది మీనాక్షి ధైర్యం చిక్కబట్టుకుంటూ.
“వాపసు ఇచ్చెయ్” కానిస్టేబుల్స్ కి వేసినట్టు “ఆర్డర్” వేసాడు. అతనికి డిస్టర్బెన్స్ లేకుండా అతను లేనప్పుడు పాడుకుంటామని బ్రతిమిలాడుకుంది. నరసింహం ఒప్పుకోలేదు. చిట్టిబాబు ఏడ్చి ఏడ్చి అన్నం కూడా తినలేదు.
మర్నాడు అతను వెళ్ళిపోయాక చార్మినార్ సెంటర్ లోని దుకాణానికి ఇద్దరూ బరువెక్కిన మనసుతో దానిని తీసుకుని వెళ్ళారు. అతను డబ్బులు వాపసు ఇవ్వడని తెలుసు. ” మా ఆయన ఒప్పుకోలేదు” అని చెప్పడానికి సిగ్గుపడింది ఈమె. లోపలికి వెళ్ళడానికి, వారికి చెప్పి, వాపసు ఇవ్వడానికి చిన్నతనంగా తోచింది. గేటు తీసి, తలుపు దగ్గర దానిని పెట్టేసి, వెనుదిరిగి వచ్చేసారు… బహుశా తమ ప్రాణాలనూ దానితోపాటే ఉంచేసి యేమో!
పురుషాధిక్య సమాజానికి, “భర్త” అనే అహంకారానికి మీనాక్షి గురైతే, కుటుంబ పెద్ద అనే యాజమాన్య ఆధిపత్యానికి చిన్నారి చిట్టిబాబు మనోవేదన పాలయ్యాడు. పాట పాడుకోవడానికి, ఒక చిన్న వాయిద్యం సరదా తీర్చుకోడానికి అవకాశం లేకపోయింది. ఈ కథకి శీర్షిక ” వాయిద్యం సరదా” కానీ నిజానికి అది సరదా మాత్రమే కాదు. వారి ప్రాణం. వారి ఆశ. వారి కోరిక. కళ పట్ల ఒక తృష్ణ .
వాయిద్యాన్ని గుమ్మం దగ్గర నిశ్శబ్దంగా వదిలిపెట్టి, తలుపు దగ్గరకు వేసి వచ్చేసిన తర్వాత – ముగింపుగా రచయిత్రి అంటారు “గేటు ఇవతలికి వచ్చి ఆ రెండు ప్రాణాలు త్వరలో అదృశ్యం అయ్యాయి” అని.
కాబట్టి అది కేవలం సరదా కాదు. ప్రాణాధిక్యం.
నందగిరి ఇందిరా దేవి కథలను గురించి చెప్పేటప్పుడు చాలామంది “పందెం” కథని చెబుతారు. కథా సంకలనాలలోనూ పందెం కథ కనిపిస్తుంది. కానీ కథానిలయంలో లభ్యమయ్యే కథల్లో “వాయిద్యం సరదా” కథ మేలి ముత్యం వంటిది. స్త్రీ మనసులోని చిన్న కోరిక తీరక పోవడం, కన్నకొడుకు కోరుకున్న చిన్న కోరికను తీర్చలేకపోవడం ఎంత మానసిక క్షోభ! పాట పట్ల “అనురక్తి” ఒక అహంకారపు పురుషాధిక్య ఆజ్ఞ కింద ఎలా నలిగిపోయిందో ప్రతిభావంతంగా చెప్పారు ఇందిరాదేవి. చాలా వరకు ఇలా సమాజ పరమైన, కుటుంబ పరమైన, మానసిక విశ్లేషణాత్మక కథలను చిత్రించారామె.
తెలంగాణ తొలి తరం కథయిత్రులలో ప్రముఖ స్థానంలో నిలిచారు శ్రీమతి నందగిరి ఇందిరాదేవి. ఆమె భర్త నందగిరి వెంకటరావు వృత్తి రీత్యా న్యాయవాది అయినా తొలి తరం తెలంగాణ కథకుల్లో ముఖ్యులు. ఆంగ్ల తెలుగు ఉర్దూ భాషల్లో యాభై కి పైగా కథలు రాసారు.
ఇందిరాదేవి గారిని తెలుగు విశ్వవిద్యాలయం “ధర్మనిధి” పురస్కారానికి ఎంపిక చేసింది.
దాదాపు ఆరు దశాబ్దాలు తాను చేసిన రేడియో ప్రసంగాల్లో ప్రముఖమైన వాటిని ఎంపిక చేసి “మసక మాటున మంచి ముత్యాలు” పేరుతో 1995 లో ఆమె అచ్చువేసారు.
1998 నుండి అమెరికాలో తన కుమారుల దగ్గర ఉన్న ఇందిరాదేవి 22, జనవరి 2007 న కన్నుమూసారు.
22 సెప్టెంబర్ 1919 లో హన్మకొండలో జన్మించిన వడ్లకొండ ఇందిరాదేవి నారాయణగూడ బాలికల పాఠశాలలో చదివి, తర్వాత ముంబైలోని శ్రీమతి నాతీబాయి దామోదర్ థాకర్సే మహిళా విశ్వవిద్యాలయంలో బి.ఎ. పట్టబద్ధురాలైనారు. పాఠశాల స్థాయిలోనే సాహిత్య సంచికల్ని వెలువరించడమే కాక, నిజాం పాలనాకాలంలో హైదరాబాద్ రేడియోలో ప్రసారమైన నషర్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. సామాజిక సాంస్కృతిక ఉద్యమాల్లో పాల్గొనడం, సాంఘిక సంస్కరణోద్యమాలను స్వయంగా నడిపించారు. “ఆంధ్రయువతి మండలి” వ్యవస్థాపకుల్లో ఆమె ఒకరు. రేడియో కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడంతో పాటు, సామాజిక సమస్యల్ని, స్త్రీ పురుష సంబంధా లను, మనస్తత్వాలను ప్రతిబింబించే కథలను ప్రముఖ పత్రికలు భారతి, గృహలక్ష్మి, ఆంధ్రజ్యోతి, చిత్రగుప్త, ఆంధ్రకేసరి, ప్రజామిత్ర, శోభ, వనితా జ్యోతి లలో పాతిక కథల పైన రచించారు. ఇందిరాదేవి తన ఆధ్యక్షతన 1940 లో హైదరాబాద్ అఖిలాంధ్ర క గాథకుల సమావేశాన్ని నిర్వహించి, చిన్న కథ పై విస్తృతంగా చర్చించారు. సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక రంగాల్లో నిరంతరం కృషి చేసిన శ్రీమతి నందగిరి ఇందిరాదేవి తెలంగాణ తొలి తరం కవయిత్రులలో ప్రముఖులు.
*****
వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం