‘ఇంతకూ ఎందుకప్పా ఇట్లా వచ్చినావు?’ అయ్యగారు కాఫీ స్టీల్ కప్పు తీసుకోగానే తానూ కప్పు చేతిలోకి తీసుకుని కింద పెట్టి గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేశాడా శిష్య పరమాణువు.
‘అదే స్వామీ! మా స్కూల్ లో లైబ్రరీకి తీసుకోవాలసిన పుస్తకాలు, విద్యార్థులకు ఉపకరించేవి మీకు ఆ లిస్ట్ చూపించి వెంకట్రామా అండ్ కోలో కొందామని వచ్చినాను.’
‘బాగుందిరా! ప్రతిసారీ యీ విధంగా నా సలహా కావాలంటే కష్టం. నేను ఊరిలో ఉండవలె! పైగా ఒక సందేహం. నా సలహా మీద కొంటున్నందుకు నా సలహాకు విలువ కట్టి నీ నుండి నేను లాభపడుతున్నానేమోనని, మీ స్కూల్ వాళ్ళకు అనుమానం వచ్చే ప్రమాదం ఉంది.’ భళ్ళున నవ్వారాయన!
‘ఎంత మాట స్వామీ! మీకామాట రానిస్తానా? ఐనా మీరీ విధంగా అడిగినారంటే నమ్మే వాళ్ళెవరైనా ఉంటారా అసలు? ఒక కవిగా మీకెంత గౌరవముందో, లౌక్యం తెలియని అమాయకులుగా కూడా మీకంతే పేరుంది. ఆ సంగతి వాళ్ళకూ తెలుసు.’ నొచ్చుకుంటూ అన్నాడు రఘూత్తమ రావు.
శిష్యుడన్న మాటకు నవ్వు వచ్చింది పుట్టపర్తికి. ‘సరేలే! ఇంతకూ నీ ఉద్యోగం, సంసారం ఎట్లున్నాయి? జపమూ తపమూ కొనసాగుతున్నాయా?’
‘ఏదో బండి నడుస్తున్నదిట్లా స్వామీ!! సంసారంలో ఎప్పుడూ ఏవో ఇబ్బందులు! నా ఉద్యోగం అక్కడ! సంసారమిక్కడ! నా ఆధ్యాత్మిక ప్రయాణానికి రెండూ ఆటంకాలే! ఖర్మ ఫలం అనుభవించక తప్పదని సరస్వతీపుత్రులు, అనుభవజ్ఞులు మీరే అన్నారు. ఇంక నేనేమనేది? నాకు విముక్తి ఎప్పుడోననిపిస్తుంది స్వామీ!’
‘ఒరే! నేనూ ఆవేశంగా ఒకప్పుడు హిమలయాలకు పారిపోయినవాణ్ణే జీవితంలో అపజయాల వల్ల విరక్తి పుట్టి! కానీ ఆ శివానంద సరస్వతులవారే నన్ను మళ్ళీ యీ త్రోవలోకి పంపినారు. సంచిత ఖర్మలు ముగిసేవరకూ యీ జీవన్మరణ చక్రంలో తిరుగక తప్పదు. అంతే! మన చేతిలో ఉన్న ఈ జన్మను జాగ్రత్తగా మలచుకుంటే కనీసం రాబోయే జన్మలలో యీ సంచిత ఖర్మల భారమూ, శాతమూ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇంతకూ నీ జ్యోతిష్య విద్య ఎంతవరకూ వచ్చింది?
‘జ్యోతిష్యం కూడా..నత్తనడకే స్వామీ! ఆ చిన్న ఊరిలో దీన్ని గురించి ఆసక్తి ఎవరికీ లేదు. స్థానికంగా గుడుల్లో పూజారులే వాళ్ళకు మార్గదర్శకులు. మూఢ నమ్మకాలూ ఎక్కువే! నా స్టడీస్ నావి! ఒక విధంగా మేలే! నామీద నేనే ప్రయోగాలు చేసుకునే అవకాశం ఉంటుంది.’
రఘోత్తమ రావు చిన్నగా నవ్వుతూ అన్నమాటలకు పుట్టపర్తి ఫెళ్ళున బదులిచ్చి అన్నారు,’ఒరే! జ్యోతిష్యము దైవ విద్య. దానికి ఉపాసనా బలం కూడా కావలె! వివిధ గ్రహాలు, వాటి చలనాలూ, గ్రహ దృష్టి, గ్రహ మైత్రి, గ్రహ శత్రుత్వం, తాత్కాలిక సహవాసాలవల్ల క్షణిక లాభాలూ, దీర్ఘకాలిక లాభాలు..ఇవన్నీ ఎంతో జాగ్రత్తగా స్టడీ చేయవలసి ఉంటుంది. మా రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ పిన్నయ్య వాళ్ళ పెద్దన్న రాళ్ళపల్లి గోపాల కృష్ణమాచార్యులవారిది యీ రంగంలో చాలా గొప్ప పేరు. వారి ఆంగ్ల వ్యాసాలు అనేకం, అనేక ఆంగ్ల పత్రికలలో కూడా ప్రచురితమౌతూ ఉంటాయి.
వీటన్నిటితోడు, గణిత జ్ఞానము అత్యావశ్యకం. గ్రహ చలనాల గణన విషయంలో చాలా జాగ్రత్త కావలె! (చిన్న నవ్వు) అది నా దగ్గర హుళక్కి. లెక్కలంటే వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తిపోతానప్పా! అందుకే నాకు జ్యోతిష్యమంటే ఎంత పిచ్చి ఉన్నా, ఆ శాస్త్రమంటే అంత భయమూ కద్దు, ఏదో భూతాన్నో దయ్యాన్నో చూసినట్టు! ఈ జన్మకింతే అని సరిపెట్టుకుందామనుకుంటే, వదలదే! భవిష్యత్తు తెలుసుకోవాలనే తృష్ణ ఇదిగో నీ మాదిరి శిష్యులను పట్టుకుని ఏదో ఒకటి తెలుసుకుందామనే పరిగెత్తిస్తుంది. ఇదొక ఆకర్షణ కదా! ఇదిగో, యీ బీడీ మాదిరిగానే! దురలవాటే, ఐనా..!’మాట అర్ధాంతరంగా ఆపి, చాపమీద బీడి కోసం వెదుక్కుంటున్న గురువుగారికి కాస్త దూరంగా ఉన్న బీడీ అగ్గిపెట్టె అందించి, నమస్కారం చేస్తున్న రఘోత్తమ రావును చూసి, పెద్ద పెట్టున నిండుగా నవ్వారు పుట్టపర్తి.
***
రామకృష్ణా హై స్కూల్ లో తోటలో ఒక బండ మీద కూర్చుని తాను ఇంటి నుంచీ తెచ్చుకున్న కీట్స్ సాహిత్యం ఏకాగ్రతతో చదువుకుంటూ ఉన్న సమయంలో, ‘నమస్కారం స్వామీ!’ అన్న పిలుపు హఠాత్తుగా విని ఉలిక్కి పడి అటుకేసి చూశారు పుట్టపర్తి. వారు ఉలికిపడటం చూసి, నొచ్చుకుంటూ, సంస్కృతం, తెలుగు బోధించే చెంచుసుబ్బయ్య చాలా నొచ్చుకుంటూ, ‘క్షమించండి స్వామీ!’ అని పాదాలవైపు వంగబోతుంటే, ఆపేశారు పుట్టపర్తి.
‘భలే వాడివిరా సుబ్బయ్యా! నేనెప్పుడూ ఇంతే! ఇంట్లో కూడా! పుస్తకాల్లో తల దూర్చినానంటే, ఇంక నా మనస్సూ, బుద్ధీ అన్నీ ఆ అక్షర లోకంలో విహరించడం మొదలైపోతుంది. నాకిది మామూలే! ఇంతకూ ఏమి సంగతి?’ అడిగారు.
చెంచుసుబ్బయ్య కింద కూర్చున్నాడు. అతనితో పాటు ఇంకో ఇద్దరబ్బాయిలు న్నారు. వాళ్ళిద్దరూ పుట్టపర్తికి నమస్కరించి అలాగే నిల్చుని ఉన్నారు చేతులు కట్టుకుని!
‘నీవెక్కడికైనా పోతున్నావా? వీళ్ళిద్దరికీ క్లాస్ తీసుకోవాలా? ..సరేలే, పొయిరా! ఇక్కడే కూర్చుని చెబుతాను. సరేనా?’
‘లేదు స్వామీ! అది కాదు.’
‘మరింకెందుకు ఇక్కడికొచ్చిందప్పా నువ్వు?’
అక్కడ నిలబడి వున్న ఇద్దరబ్బాయిలను చూపిస్తూ అన్నాడాయన,’వీళ్ళిద్దరూ బీద బ్రాహ్మణ విద్యార్థులు. వారాలు చేసుకుంటూ చదువుకుంటున్నారు స్వామీ! డిగ్రీ తెలుగు చదువుతున్నారు ఇక్కడ కాలేజ్ లో! మా ఇంట్లో వారంలో రెండు రోజులు భోజనం. ఈ లోపల రెండిళ్ళవాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయినారంట! నాదగ్గర మొర పెట్టుకున్నారు. రామేశ్వర శర్మ వాళ్ళింట్లో ఒక పూట కుదిర్చి వస్తున్నాను. దయ చేసి, యీ బీద విద్యార్థు లకు ఒక పూట మీ ద్వారా అమ్మగారి చేతి అమృతాన్నం దొరికితే, వీళ్ళ భవిష్యత్తుకు ఢోకా ఉండదని…’ మాట ఆపేశాడాయన!
‘దానికింత చెప్పాల్నారా? వారంలో వాళ్ళకెప్పుడు అవసరమో నేను చెప్పినానని, వాళ్ళమ్మకు చెప్పమను ఇంటికి పోయి! మనకున్నది పెడతాం. పంచ భక్ష్య పరమాన్నా లు కాకపోయినా, పచ్చడి మెతుకులైనా మీ అమ్మ కనకమ్మ చేతి వంట నిజంగా అమృతమే! ఇంకా ఏమైనా కావాలా?’
చెంచు సుబ్బయ్య సంతోషంగా లేచి నిలబడి నమస్కారాం చేసి, ‘ మహద్భాగ్యం! ఇంకేమీ లేదు స్వామీ! క్లాస్ కు టైమయ్యింది. వస్తాను.’ అంటూ వెనుదిరిగడం చూసి, మళ్ళీ పుస్తకంలోకి తల దూర్చారు పుట్టపర్తి.
చెంచు సుబ్బయ్య చాలా సౌమ్యుడు. చక్కగా చదువుకున్నవాడు.అంటే డొక్క శుద్ధి ఉన్నవాడన్న మాట! వినయ సంపన్నుడు. పిల్లలకు అతని క్లాసంటే చాలా ఇష్టం. పుట్టపర్తికీ అతనంటే అంతే ఇష్టం.
***
కనకవల్లి ఆరోగ్యం కుదుటబడేలోగా కూతురు తులజ వ్రాతలో పుట్టపర్తి రచనా వ్యాసంగం చురుకుగానే సాగిపోతున్నది. ఆమెకింకా 13 సంవత్సరాలే! కానీ హిందీ ప్రేమీ మండలి వారి పరీక్షలన్నీ చకచకా పూర్తి చేస్తూ ఉంది ఎంతో వేగంగా! అవే కాక, తెలుగు సాహిత్య గ్రంధాలు కూడా చదివేస్తూ ఉంటుందట! కనక అన్న మాట ఇది. తన హిందీ సాహిత్యంలో సూరదాస్ కు ధీటుగా పోతన ఎట్లా భాగవతాన్ని వ్రాశాడని అడిగిందట ఆమెనెప్పుడో! ఫరవాలేదు, పెళ్ళైన కరుణ, తరులతలకు సంగీతం మీదే మక్కువ ఎక్కువ అని వాళ్ళిద్దరి పాటకచ్చేరీల్లో తెలిసింది. ఇక ఈమెకు సంగీతం కన్నా సాహిత్యం ప్రాణమనిపిస్తూ ఉంది. ఈలోపు తనకు రాతకోతల్లో కూడా బాగానే శ్రద్ధతో సహకరిస్తూ ఉంది. దైవ నిర్ణయం ఏమయి ఉంటుందో!
మళయాల భాషా సారస్వత చరిత్ర, నంది తిమ్మన గురించి ఇంకో వ్యాసం, ప్రాకృత భాషా సారస్వతాలు గురించిన వ్యాసం, ఎడుత్తచ్చెన్ (మళయాళ సాహిత్యకరుడు) గుండర్టు డాక్తర్, తిరువళ్ళువర్- ఇవన్నీ విజ్ఞాన సర్వస్వం రాబోయే సంపుటాల కోసం తులజమ్మ వ్రాతలోనే రెండునెల్ల కిందటే పంపడమైంది. రేపో మాపో ప్రింటయి వస్తాయి.
ఇటీవల ఆళ్ళగడ్డ రాజశేఖరా బుక్ డిపో ప్రింటర్ పరిచయమైనాడు. ఇంటికొచ్చి మరీ అడిగినాడు, ‘మీకు విజయనగర చరిత్రతో మంచి అనుబంధం ఉంది కదా! దాన్ని గురించి చారిత్రక నవల వ్రాయండి స్వామీ! మీరు బాగా పరిశోధన చేసినారు కదా! తాతాచార్యుల వంశస్తులు కూడా! మీరు వ్రాస్తే, ప్రింటు చేసేందుకు నేను రెడీ!’ అన్నాడు. తనకూ ఆ ప్రతిపాదన నచ్చింది. సరేనన్న తరువాత విచికిత్స. విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఎన్నెన్నో ఉత్కంఠభరితమైన కథలున్నయి. అసలు ఆ రాజ వంశాల మధ్య వైరుధ్యాల వల్లే పరాయి పాలకుల చొరబాటు వీలయిందనిపిస్తుంది. స్థాపన కాలం నుంచీ, నేలమట్టమయ్యేవరకూ ఎన్నెన్ని మలుపులు, కన్నీటి గాధలూ, త్యాగ చరితలూ! వాటిలో ఏది తన నవలకు పనికి వస్తుందో ఒక పట్టాన తేలటం లేదు. కిం కర్తవ్యం?
*****
(సశేషం)