కలల కరపత్రం

-డా||కె.గీత

అమ్మా! ఎందుకేడుస్తున్నావు?
అప్పటిదాకా
గాలిపటం ఎగరేస్తున్న
బిడ్డడేడనా?

ప్రపంచపటమ్మీద
సరిహద్దుల కోసమో
ఆధిపత్యం కోసమో
కలల్ని కూలదోసేచోట
గాలిపటాలకు తావుందా?

రోజూ బాంబు దాడుల మధ్య
తిండీ, నిద్రా లేని
పసికందుల
భవిష్యత్తునీ
నేల రాస్తున్న చోట

ఒక్కటే మళ్ళీ మళ్ళీ మొలుస్తున్నది
యుద్ధ కుతంత్రం-

అయినా ఎగరేయాలి-
స్వేచ్ఛగా వీధుల్లో
బంతాటాడుకునే
బాల్యాలు మళ్ళీ
మొలకెత్తేవరకు
ఎగరేయాలి-

నీ బిడ్డడు
కూలిన భవంతుల కింద
దారపు ఉండ చుట్టుకున్న చెయ్యిగానో
తెగిన గాలిపటంలా చెదిరిపడ్డ మాంసపు ముద్దగానో
ఘోషిస్తుండవచ్చు
అయినా
ఎగరేయాలి-
ప్రపంచ పటం మీద
నెత్తుటి మరకలు చెరిగే వరకు
ఎగరేయాలి-

తల్లీ!
ఇది దుఃఖించాల్సిన వేళ కాదు
గుండె చిక్కబట్టుకుని
కళ్ళు విప్పాల్సిన వేళ!

***

నాన్నా!
బేలగా కూర్చున్నావెందుకు?
కరపత్రం అతికించేందుకు
వెళ్లిన అమ్మేదనా?

దేశపటమ్మీద
అధికారం కోసం
ఏలుబడి కోసం
దౌర్జన్యాలు చేసేచోట
కరపత్రాలకు విలువుందా?

మత రాజకీయ మంత్ర ఘోషల మధ్య
గూడూ, తెరువూ లేని
బతుకుల
గోడు పట్టని చోట

ఒక్కటే మళ్ళీ మళ్ళీ గెలుస్తున్నది
నియంతృత్వం-

అయినా రాయాలి-
మరుగుతున్న
నెత్తుటి అక్షరాలతో
కలలు శిఖల్లా మొలిచేవరకు
రాయాలి-

అమ్మ
బూటకాలు బలిగొన్న ప్రాణం కావొచ్చు-
ఏళ్ల తరబడి మగ్గుతున్న జైలు ఊసలు కావొచ్చు
అయినా చివ్వున రగిలే
తిరుగుబాటు నిప్పు రవ్వల కోసం
రాయాలి-

ఊహలు కనడం ఒక్కటే కాదు
కరపత్రం గాఢంగా ముద్రించుకున్న
కలల్ని నెరవేర్చుకునేవరకు
నినదించాలి!

నాన్నా!
ఇది సంబరాల వేళ కాదు!
చావూ, బతుకూ
ఎందుకిలా తగలడ్డాయో
ఆలోచించాల్సిన వేళ!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.