కాదేదీ కథకనర్హం-9
గుర్రపు కళ్ళెం
-డి.కామేశ్వరి
రాజాధిరాజ……రాజమార్తాండతేజ…..వంది మాగధులు స్తోత్రం చేసే రాజాధిరాజు కాకపోయినా రంగాపురం జమిందారు రాజా రావుబహుద్దూర్ రంగరాజు గారి దివాణం …… రాణివాసంతో, దాసదాసీ జనంతో , విందులు, విలాసాలు , నాట్యాలు, అతిధి అభ్యాగతులతో కళకళలాడేది — ఆయనగారి ముఖ్య హాబీ గుర్రపు స్వారీ. ఎంత ఖర్చయినా సరే మంచి గుర్రం కనిపిస్తే కొనకుండా వదిలే వారుకారు. అరడజనుకి తక్కువ కాకుండా నల్లగా, ఎత్తుగా, బలంగా నిగ నిగలాడే గుర్రాలు సాలలో యెప్పుడూ వుండేవి. వాటి సంరక్షణ, మాలిష్ కి ప్రత్యేక మనుషులు. రోజూ ఉదయం, సాయంత్రం గంట స్వారీ చేసేవారాయన. తెల్ల దొరలు అతిధులుగా వచ్చినపుడు గుర్రపు పందేలుం డేవి. అయన కుటుంబంలో ప్రతి ఒక్కరు ఆడమగ అందరూ ఐదో ఏట నించి గుర్రపు స్వారీ నేర్చుకోవాల్సిందే. రేసుల సీజనులో సిటీకి వెళ్ళి రేసులలో పాల్గొనడం ఆయన కున్న వ్యసనాలలో ఒకటి. గుర్రాలకయితేనేం వాటి పోషణ కైతేనేం , రేసుల కైతేనేం , సాలీనా వేలకి వేలు ఖర్చు పెట్టేవాడాయన.
ఈ కధంతా ఈనాటిది కాదు. ఆ రంగరాజుగారు పోయి ఏభై ఏళ్ళు అయింది. ఆయన కొడుకు వేంకటపతిరాజాగారూ కాలధర్మం చేసి పదేళ్లయింది. వెంకటపతి రాజాగారి సుపుత్రుడు రమేష్ చంద్రుడు. రమేష్ చంద్ర రాజా కాదు, ఉత్తి రమేష్ చంద్రుడే అతను. వెంకటపతిరాజాగారి హయాములోనే జమీందారీలు పోయాయి. భరణాలు ఏర్పడ్డాయి. రంగారాజుగారితోటే సగం జమీ అయన వ్యసనాలకీ, సరదాలకి, విలాసాలకి తరిగి పోయింది. అయన కొడుకు వెంకటపతిరాజా మిగిలినది కర్పూరంలా వెలిగించాడు. ఇప్పుడు ఆ దివాణం కళకళలాడడం లేదు. ఆ దాసదాసీ జనం లేరు. విందులు, వినోదాలు లేవు. దివాణం సున్నానికైనా నోచుకోకుండా పాడుపడినట్లయిపోయింది. ఆ గుర్రపుశాలలో గుర్రాలన్నీ పోగా ఒకే ఒక గుర్రం మిగిలింది. అది రమేష్ చంద్రగారి గుర్రం. అది ఏమయినా సరే అమ్మడానికి వీలులేదని పట్టు పట్టగా తోడులేనిదానిలా ఒకే గుర్రం మిగిలింది.
రమేష్ చంద్ర ఈ దేశంలో చదువు నచ్చక (వంటబట్టక ) విదేశంలో బిజినెస్ మేనేజ్ మెంట్ కోర్సు చదవడానికి వెళ్ళి పదిహేను రోజుల కిత్రమే స్వదేశం స్వగ్రామం తిరిగి వచ్చాడు. రావడం పెద్ద ప్లానుతోనే వచ్చాడు. ఆ గ్రామంలో భూములు, ఆస్తులు అన్నీ అమ్ముకుని సిటీ వెళ్ళి ఓ రీరోలింగ్ ఫ్యాక్టరీ స్థాపించాలని, ఆ విధంగా చదివిన చదువుని సార్ధకపరచుకోవాలని అనుకున్నాడు. విదేశాలలో వుండి వచ్చాక డర్టీ ఇండియాలో అందునా డర్టీ విలేజీలో వుండాలంటే అతనికి ముళ్ళ మీద వున్నట్టుంది. లంకంత కొంపకి ముసలి తల్లి సుభద్రా దేవి —ఇద్దరు దాసీలు, ఇద్దరు నౌకర్లు….వూర్లో ఎటు చూసినా పచ్చని పొలాలు , చుట్టూ కొండలు – రైతులు, ఆవులు, గేదెలు – తప్ప సివిలైజ్ డ్ ఎట్ మాస్ ఫియర్ లేని ఆ డర్టీ వూర్లో దినమొక యుగంలా వుంది . ఆస్తులు అమ్ముకు వెళ్ళిపోయే ఆ కొద్దిపాటి వ్యవధి కూడా భరించలేనిదిగా వుందతనికి. ఎంతకని పుస్తకాలు చదవడం , ఎంతకని రెడియోగ్రాం వినడం! ఉదయం గంట, సాయంత్రం గంట గుర్రపు స్వారీ రాత్రి డ్రింక్స్ …..రికార్డ్సు – పుస్తకాలు తిండి- నిద్ర – పదిరోజులకే యీ జీవితం విసుగెత్తి ఎప్పుడూ పోదామా అని వుంది. ఫారిన్ లో అలవాటయిన మదిరతో పాటు మగువ కోసం అతనికి శరీరం తపిస్తుంది. ఇదే ఏ సిటీలోనో అయితే పర్సు బరువుని బట్టి టెస్టు బట్టి, కావాల్సినవారిని ఎన్నుకోవచ్చు. ఈ డర్టీ విలేజ్ లో పేడ పిసుక్కునే వాళ్ళు తప్ప ఎవరున్నారు? సాయంత్రం గుర్రపు స్వారీతో వంటి నిండా చెమట పట్టాక, వేడినీళ్ళ టబ్ బాత్ తరువాత వెచ్చవెచ్చని విస్కీ — తరువాత అతనికి యింకా వెచ్చని దేదో కావాలనిపించిచేది, కావాల్సింది దొరక్క —–నిద్రపట్టక ….. పక్క మీద దొర్లి…. తన మత్తులో నిద్రలోకి జారేవాడు. గత పదిహేను రోజులుగా అదే రొటీన్ తో విసుగెత్తిపోయిన అతనికి…..
ఆ తెల్లారి….. అంటే అతని సంభాషణలో…..ఉదయం తోమ్మిందింటికీ లేవగానే …. కిటికీ లోంచి …..ఓ జవ్వని దర్శన మిచ్చింది. బంతిపువు రంగు చీరకి ఎర్రంచు , పచ్చ జాకెట్టు – జడలో చామంతులు ….నెత్తిన పచ్చ గడ్డి మోపుతో వయ్యారంగా గుర్రాలశాల వైపు వెడుతుంది. గుర్రాలశాలలో రంగడు గుర్రానికి మాలిష్ చేస్తున్నాడు. దూరం నించే చూసినా రమేష్ కళ్ళలో కాంతి వచ్చింది ఆమెని చూడగానే. యిన్నాళ్ళకి తను వెతుకుతున్నదేదో దొరికిందనిపించింది . బ్రష్ నోట్లో పెట్టుకునే చకచక మేడదిగి గుర్రాల శాలవైపు వెళ్ళాడు. గడ్డిమోపు కింద పడేసి వంగుని గడ్డి విప్పి గుర్రం ముందు వేస్తుంది. వంగున్న ఆమె వంపు సొంపులు చూసేసరికి రమేష్ రక్తం వేడెక్కింది. చామనచాయ అయితేనేం ఆమె మోహంలో మంచి కళ వుంది. పెద్ద పెద్ద కళ్ళు – తీర్చినట్లున్న కను బొమ్మలు ముక్కున ఒంటి తెల్లరాయి ముక్కు పుడక, వంకుల జుత్తు లొంగక చెల్లాచెదరై నుదుటిని పడుతుంది. ఏదో నవ్వుతూ రంగడితో మాట్లాడుతుంటే తెల్లటి పలువరుస తళుక్కుమంది.పెదాలు కాస్త నల్లగా వుంటేనేం ఆ పెదాలలో, కళ్ళలోనే ఏదో ఆకర్షణ వుందనిపించింది రమేష్ కి. ఆ ఎత్తు , లావు, నడుం, అబ్బ ఏం ఫిగర్ ….అందగత్తె కాదు….. కాని ఆమెలో ఏదో ఆకర్షణ ….దీన్నే గాబోలు యింగ్లీషులో స్మార్ట్ నెస్ అంటారు. ఉత్తి స్మార్ట్ నెస్ కాదు సెక్సీగా వుంది. ఈ లలనామణి హఠాత్తుగా ఎక్కడనించి వచ్చి పడింది. అసలేవరు? ఇన్నాళ్ళు తన కళ్ళు ఎలా మూసుకుపోయాయి? వాటే లక్కీ డే…..ఓహో ఆ పల్లెటూరి డ్రస్సు లోనే యింత ఆకర్షణీయంగా వుంది. కాస్త నాజూకు డ్రసింగ్ అవుతే …..ఆమె వలువల్ని, తలపుల్లో వలచి చూసి ఆనందిస్తున్నాడు. ఆశగా, ఆబగా …..అలికిడికి తలెత్తి చూసిన రంగడు యజమానిని చూసి తడబిడ పడ్డాడు. రంగడు నిశ్శబ్దం అయిపోగానే తలెత్తిన సీతాలు…..రమేష్ ని చూసి సిగ్గుతో మెలికలు తిరిగి ఒక్క గెంతులో రంగడి వెనక్కి పరిగెత్తింది.
“రంగా……ఎవర్రా….” అన్నాడు రమేష్ కళ్ళేగరేసి సీతాలుని చూపిస్తూ.
“మా ఆడదండి …” రంగడు సిగ్గుపడ్తూ అన్నాడు.
“ఓహో…..పెళ్ళాడావా…..యెప్పుడు….?”
“మొన్నే నండి, ఆర్నెల్లయిందండి ….”
“అలాగా…..మరిన్నాళ్ళూ ….ఎప్పుడూ చూడలేదే….” సీతాలునే మింగేసేటట్టు చూస్తూ అన్నాడు రమేష్.
‘అల్లమ్మకి వల్లు బాగునేదంటే కన్నోరింటికెళ్ళి నిన్నే వచ్చిందండి…”
“అదా సంగతి ….ఒరేయ్ నీ పెళ్ళాం బాగుందిరా….మంచి పెళ్లాన్నే సంపాదించావు. పేరెంటిరా?…..’ చనువుగా అడిగాడు.
“సీతాలచ్చండి… సీతా అంటానండి….’ యజమాని భార్యని పోగిడినందుకు సంబరంగా, గర్వంగా సీతాలు వంక చూశాడు రంగడు.
సీతాలు సిగ్గుల మొగ్గ అయింది. కళ్ళ చివర్ల నించి చిన్నదొర మిసమిసలాడే రంగుని, వేసుకున్న ఖరీదయిన నైట్ సూట్, మెరిసే నల్ల చెప్పుల మధ్య మల్లె పూవు లాంటి కాళ్ళని , నిగనిగలాడే వంకీల క్రాపుని , చేతికున్న ఖరీదయిన వాచిని …..అన్నీ చూసి అబ్బో చిన్నదొర ఎంత బాగున్నాడనుకుంది సీతాలు.
“వరేయ్ రంగా, మీ సీతాలే కనక సిటీలో వుంటే సినిమా స్టార్ ని మించి పోయేది ….. కాస్త షోగ్గా డ్రస్సయిందంటే ….మరి చూసుకో….మంచి ఫోటో జేనిక్ ఫేస్ రా….అనక ఎండ తగ్గేలోపల ఫోటోలు తీస్తాను యిద్దరూ ముస్తాబయి రండిరా ….సీతాలు మంచి చీర కట్టుకురా…. రంగా …నీవూ ……ఆ వేషం తీసి శుభ్రంగా రా….’ అన్నాడు.
చిన్నదొర ఆదరభిమానాలకి పొంగిపోతూ ఫోటో తీస్తానన్నందుకు ఆనందంతో తబ్బిబ్బ అయిపోతూ యిద్దరూ దండాలు పెట్టారు. మొదటిసారే యింకా చూస్తె బాగుండదన్నట్టు రమేష్ అయిష్టంగానే అక్కడ నించి కదిలి లోపలికి వెళ్ళాడు.
***
మధ్యాహ్నం రంగడు సీతాలు యిద్దరూ అతి వుత్సాహంగా ముస్తాబయి ఫొటోలకి వచ్చారు. సీతాలు అమ్మగారు తనకిచ్చిన గులాబీ నైలక్స్ చీర కట్టి గులాబి రంగు జాకెట్టు తొడిగి, తోటలో గులాబీలు తలలో పెట్టుకొని నీటుగా కాటుక, బొట్టు పెట్టి తయారైంది. రంగడు రమేష్ యిచ్చిన పాత ప్యాంట్ షర్టు తొడుక్కుని సంబరంగా సీతాలు పక్కన నిలబడ్డాడు. గులాబీ చీరలో ఉదయం కంటే ఆకర్షణీయంగా వున్న సీతాలుని చూసి గుటకలు మింగాడు రమేష్. అతని మెదడు చురుకుగా ఆలోచిస్తుంది. ఫోటోలు తీసే నెపంతో ….’అరె ….అలా మొహం వంచకూడదు , ‘ అలా కాదు యిటు చూడాలి -‘ ‘ఇలా నవ్వాలి ‘ ……’ఇలా దగ్గిరగా నిలబడు ‘ అంటూ గడ్డం ఎత్తి – భుజాలు పట్టుకుని….. అనేక రకాల ఫోజుల్లో నిలబెట్టాడు ఆమెని తాకుతూ ….సీతాలు చిన్న దొరగారి స్పర్శకు ముడుచుకుపోతుంటే – ‘ ఏటే అలా మెలికలు తిరగ తండవు. దొర చెప్పినట్టు చూడు ” అన్నాడు రంగడు. ఫోటోల కార్యక్రమం అయ్యాక —” వరేయ్ రంగ మేడమీదకి రండిరా పాటలు విందురు గాని, రా సీతాలు నా దగ్గర అంత సిగ్గేమిటి “
అయ్యగారి యీ ఆకస్మిక ఆదరణ అర్ధం కాక ఆనందంతో తికమకలయి పోయాడు రంగడు . “రావే….పాట అంటే నీ కిష్టం కాదే యిందాం రా” సిగ్గుపడుతున్న సీతాలుని లాక్కెళ్ళినట్టే చేయి పట్టి తీసికెళ్ళాడు రంగడు. రేడియో గ్రాములో తెలుగు రికార్డులు పెట్టాడు రమేష్. తన కిష్టమైన తెలుగు పాట వింటూ రికార్డు ప్లేయర్ తిరగడం ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తూ, చిన్న బాబుగారి గదిలో మెత్తని పక్క, ఖరీదయిన దుప్పటి, డ్రస్సింగ్ టేబిల్ వగైరాలని గమనిస్తుంది సీతాలు. రమేష్ జేబులోంచి సిగరెట్ పెట్టె తీసి ఖాళీగా వుండడం చూసి విసిరేస్తూ ‘రంగా , ఓ సిగరెట్ పాకెట్ పట్రా బజారు కెళ్ళి ….’ అన్నాడు ఐదు రూపాయలు అందిస్తూ. రంగడు పాట మధ్యలో వెళ్ళడం ఇష్టం లేక యిబ్బందిగా కదిలాడు. సీతాలు లేచి వెళ్ళబోయింది. ‘అరే, నీవెందుకు వెళ్ళిపోతావు, కూర్చుని పాట విను, సిగరెట్ పాకెట్ తీసుకుని యిప్పుడేగా వచ్చేస్తాడు.’ అన్నాడు రమేష్. రంగడు ఏమనలేక వెళ్ళిపోయాడు. సీతాలు యిబ్బందిగా సిగ్గుగా కూర్చుంది. రమేష్ డ్రస్సింగ్ టేబిల్ మీద నించి సెంట్ స్ప్రే తీసి సీతాలు మీద స్ప్రే చేస్తూ నవ్వి ….’వాసన బాగుందా చూసుకో ఎంత మంచివాసన వేస్తున్నావో , నీకు కావాలా’ అన్నాడు స్ప్రే చూపిస్తూ. సీతాలు ఆ సువాసనని అఘ్రానిస్తూ సిగ్గుగా నవ్వి తల అడ్డంగా ఆడించింది.
‘సీతాలు నీకీ చీర ఎంత బాగుందో తెలుసా….మంచి తెల్ల చీర కట్టుకుంటే యింకా మిలమిల మెరిసిపోతావు. నేను డబ్బిస్తానే వొక చీర కొనుక్కో, అదేమిటలా సిగ్గుపడతావు. చూడు నావైపు . అరే…..అరే నీవలా సిగ్గు పడ్తుంటే ఎంత బాగున్నావో తెలుసా ‘ ఆమె గడ్డం ఎత్తిపట్టి కళ్ళలోకి కొంటెగా చూసాడు రమేష్ . సీతాలు నిలువెల్లా పులకరించింది. చినబాబు గారి సువాసన తలనూనె వంటికి రాసుకున్న పౌడరు వాసన, బట్టలని ఫారిన్ సెంటు అన్ని సువాసనల మధ్య ఆ మెరిసిపోతున్న రంగు, మాటల్లో చూపుల్లో కొంటె తనం , చినబాబు తన మీద చూపించే శ్రద్దా – అతని పొగడ్తలు అన్నీ కలిసి సీతాలుని వివశురాలీని చేసేసాయి. కళ్ళెత్తి రమేష్ మొహంలోకి చూడలేకపోయింది. “సీతాలు ఇదిగో యిటు చూడు. నేనంటే నీకు యిష్టమేనా. నేను బాగున్నానా లేదా చెప్పాలి. మరి నీ రంగడి కన్నా బాగున్నానా లేదా. ఇదిగో యీ నూరు రూపాయలు తీసికెళ్ళి మంచి తెల్ల జరీ చీర కొనుక్కో” అంటూ చేతిలో కుక్కాడు నోటు. “అమ్మో వద్దండి మావేటంటాడో—-” భయంగా అంది.
“ఏమనడు – నేనిచ్చానని చెపుతాలే ……చూడు – రాత్రి రంగడు పడుకున్నాక మెల్లిగా యీ గదిలోకి రా. తలుపు తీసి వుంచుతా, ముందు వైపు నించి కాక వెనక వైపు తలుపు తీసి వుంచుతా. మెట్లెక్కిరా. ఎవరూ చూడరు. పదకొండు దాటాక —- యిటు చూడు యీ కిటికీ లోంచి బ్యాటరీ లైటు యిలా వెలిగిస్తా …..రంగడు నిద్రపోయాడో లేదో చూసి వచ్చేయ్….’ మెల్లిగా ఆమె భుజం మీద చెయ్యి వేసి నొక్కి తమకంగా చూస్తూ అన్నాడు. సీతాలు అర్ధం కానట్టు తెల్లపోతూ చూసింది. “ఏమిటలా చూస్తావు –అర్ధం కాలేదా ….సీతాలు పొద్దుట నిన్ను చూసిం దగ్గిరనించి నా మనసు మనసులో లేదు …. సీతాలు నీవెంత బాగున్నావో తెలుసా….’ అంటూ చటుక్కున సీతాలు పెదాల మీద ముద్దు పెట్టుకుని “అదిగో రంగడోచ్చేస్తాడు . రాత్రికి మరిచిపోకు” అంటూ బుగ్గలు వేలితో రాసి చిటికే వేసి వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు. చిన్నదొర లాంటి పెద్దింటి బిడ్డ …. అంత గొప్పవాడు తన అందాన్ని మెచ్చి, తనని కోరాడు…..ఆ పెదాల మీద ఆ ముద్దు అతని మాటలు, చేష్టలు, ఆ డబ్బు ఆ అందం, ఆ హోదా అన్నీ కలిసి సీతాలు మతి పోగొట్టేశాయి. బహ్యస్మృతి కోల్పోయిన దానిలా మంత్ర ముగ్ధలా అలా వుండిపోయింది.
***
వారం రోజులు గడిచాయి. ఆరోజు ఉదయం రంగడు గుర్రానికి మాలిష్ చేస్తున్నా డన్న మాటేగాని మనసు మనసులో లేదు. వాడి మనసులో రగిలే ఉద్రేకం చేతుల్లో చూపిస్తూ గుర్రాన్ని జోరుగా బరబర మాలిష్ చేస్తున్నాడు. వాడి మనసు, శరీరం ఉక్రోషంతో, అవమానంతో, కోపంతో ఉడికిపోతోంది. రాత్రి నించి ఏదో చేయ్యాలి, ఏదో చేసి కసి తీర్చుకోవాలన్న కక్ష నిలవనీయడం లేదు. నిన్న రాత్రి …..గురించి తలచుకున్న కొద్దీ వాడి వళ్ళు సలసల కాగిపోతుంది. నిన్న రాత్రి చటుక్కున ఎందుకో మెలకువ వచ్చింది. పక్కన సీతాలు లేదు. పెరట్లో కెళ్ళిందేమో వచ్చేస్తుందేమోనని కాసేపు అలా నిద్రమత్తులోనే చూశాడు. అరగంట దాటినా రాలేదు. రంగడు చటుక్కున లేచి చూశాడు — తలుపు చేరేసి వుంది. పెరట్లో చూశాడు లేదు. సీతాలు అని పిలిచాడు పలకలేదు. రంగడిలో ఏదో అనుమానం చోటు చేసుకుంది. వారం రోజుల నించి సీతాలు ప్రవర్తన వింతగా వుంది. మనిషి ఏదో పరధ్యానంగా వుంటుంది. ఇదివరకులా నవ్వుతూ సరదాగా మాట్లాడడం లేదు. పిలిస్తే విసుక్కుంటుంది. దగ్గిర కొస్తే చీదరించుకుంటుంది. ఏమడి గినా ఏం లేదంటుంది. ఎంతసేపూ చిన్న బాబుగారిచ్చిన పౌడరు, స్నోలు , సెంట్లు పూసుకుని ముస్తాబయి అద్దంలో చూసుకుని మురిసిపోతుంది. సాయంత్రం అయ్యేసరికి ఇదివరకు లేనిది కొత్తగా స్నానం చేసి బజార్లో కొన్న తెల్ల చీర కట్టుకు ముస్తాబవడం చూసి మొదటిరోజు సంతోషించాడు. తీరా ఆ ముస్తాబు తన కోసం కాదన్నట్టు సీతాలు రంగడిని దగ్గరికి రానీయకుండా తల నొప్పంటూ మూలుగుతూ పడుకుంది. వారం నించీ రోజూ ఏదో వంక …..మూడు రోజులు స్నానం కాలేదంది…ఏదో చెపుతుంది. ఓరాత్రి సీతాలు పక్కలో లేదు. లేచి చూసేవేళకి బయట నించి తలుపు తీసుకు వచ్చి పడు కుంది. ఎక్కడి కెళ్లావంటే బయట ఏదో చప్పుడయితే చూసానంది. సీతాలు వ్యవహారం, అవతల చిన్న దొర వ్యవహారం…..ఎప్పుడూ సీతాలేది అని అడగడం రికార్డులు పెట్టి వినమనడం, స్నోలు పౌడర్లు నీ పెళ్ళానికీ కీయరా అని ఉదారంగా యీయడం , అడక్కుండానే పాత ప్యాంట్లు షర్టులు ఇచ్చాడు. సీతాలుతో ఎంతో చనువుగా మాట్లాడు తాడు. ఇద్దరూ తన ఎదురుగానే నవ్వుకుంటారు…..ఏదో అనుమానం తొంగి చూసినా చిన్న దొర ఉదారం ముందు అణగారిపోయింది. నిన్న రాత్రి సీతాలు ఎంతకీ రాకపోతే, ఆ అనుమానం బలపడింది…..అలా నడిచి భవంతి ముందు వైపు వచ్చాడు. చిన్న దొర గది కింద నిలబడ్డాడు. చిన్నగా ఏదో మాటలు నవ్వులు వినబడ్డాయి. అలా చీకట్లో దెయ్యంలా నిలబడ్డాడు రంగడు….. ఓ రెండు గంటల తరవాత సీతాలు కిందకు వచ్చి గుడిసె వైపు వెళ్ళింది. రంగడు ఒక్క ఉరుకున సీతాలు జుట్టు పట్టుకు బరబర గుడిసెలోకి యీడ్చుకు వెళ్ళి శక్తి వున్నంత వరకు బాదాడు. సీతాలు కుక్కిరి బిక్కిరి మనకుండా ఏడ్చింది. సీతాలుని కొట్టి అలిసిపోయిన రంగడు – కొట్టాల్సింది సీతాలుని కాదని, సీతాలుని మభ్య పెట్టి వల విసిరిన చిన్న దొరనని గ్రహించాడు. ఇంత ద్రోహమా – యింత అన్యాయమా – ఇంత ఘోరమా ….వాళ్ళ కాళ్ళ కింద బతికే వాళ్ళమని యింత అలుసా…..ఉడికిపోయాడు తనకింత ద్రోహం చేసిన చిన్న దొరని వదలకూడదు —–వదలడు!- పరపర గుర్రానికి మాలిష్ చేస్తున్న రంగడి మెదడులో ఆలోచన మెరిసింది.
చకచక పరిగెత్తినట్టే పొలాలకి అడ్డం పడి కొండల వైపు వెళ్ళి తనక్కావలసిన ఆకులూ కొన్ని తుంపి తీసుకువచ్చాడు. గడ్డితో కలిపి గుర్రానికి దగ్గిరుంది తినిపించాడు. గుర్రాపు కళ్ళెం తీశాడు. గుర్రం లాగే ఆ కళ్ళెమూ పాతబడింది, తోలు పటకా చాలాచోట్ల పాతబడి , నలిగి ముడతలు పడి తెగిపోవడానికి సిద్దంగా వుంది. గడ్డి కోసే కత్తి తీసి తెగిపోవడానికి సిద్దంగా వున్న ఆ గాట్లని మరింత కోశాడు కాస్త పట్టు వదలి…..గుర్రానికి జీను వేసి రెడీ చేశాడు.
రమేష్ యధాప్రకారం నిద్రలేచి బెడ్ కాఫీ సేవించి గుర్రపుస్వారీకి బయలుదేరాడు ఉత్సాహంగా. ఈవారంగా రమేష్ ఉత్సాహంగా వుంటున్నాడు. కాస్త విసుగు తగ్గి కులాసాగా వున్నాడు …..పనులన్నీ చకచక పూర్తీ చేస్తున్నాడు. యింక నాలుగైదు రోజులతో పూర్తి కావచ్చు. ఈలోగా కాలక్షేపానికి సీతాలు బాగా పనికొచ్చింది. ఆ ఉత్సాహంతో గుర్రాన్ని అదిలించాడు . గుర్రం సకిలించింది….. కదలడానికి ఎందుకో మొరాయించింది . గొంజుకుంది. “ఏంరా , ఏం వచ్చింది దీనికివాళ -‘ రంగడిని అడిగాడు!
“ఏం లేదు దొరా, యిన్నాళ్ళూ బద్ధకం బలిసి యిప్పుడు పరిగెత్తాలంటే వళ్ళు వంగడం లేదు. రెండు తగిలించండి -” అన్నాడు. రమేష్ కాలితో గుర్రం డొక్కలో తన్ని కళ్ళెంతో అదిలించాడు. డొక్క పోటూ తిన్న గుర్రం పౌరుషంగా ముందు కురికింది. తిన్న ఆకుల పసరు పనిచేయడం ఆరంభించి పిచ్చి పట్టిన దానిలా పరుగు లంకించుకుంది. ఆ పరుగు …..అసహజంగా వుందనిపించినా చాలా రోజుల తర్వాత గుర్రం మీద యింత జోరుగా సవారి చెయ్యడం ఉత్సాహమనిపించి కళ్ళెంతో యింకాస్త అదిలించాడు. గుర్రం వెర్రి ఆవేశంతో పొలాలు, గట్లు దాటి కొండవాలు మీదకి పరిగెత్తింది. రాళ్ళు, రప్పలు, చెట్లు చేమలు దాటి దుముకుతూ…..ఎంతో వేగంగా పరిగెత్తుతున్న ఆ వేగానికి మొదటి సారిగా రమేష్ భయపడి కళ్ళాలు బిగించి లాగాడు. గుర్రం ఆగలేదు. శివం ఎత్తిన దానిలా ఆ పరుగు ఆ జోరు చూసి రమేష్ కి చమటలు పట్టాయి. భయంతో గుర్రాన్ని అదుపులో పెట్టాడానికి కళ్ళెం మరింత జోరుగా బిగించి లాగాడు. పటుక్కున కళ్ళెం తెగి తోలు పటకా చేతిలోకి వచ్చేసింది —–రమేష్ బిత్తరపోయాడు. కళ్ళెం వదులయిపోవడంతో మరింత అడ్డు అదుపు లేనట్టు పిచ్చిగా పరిగెత్తసాగింది గుర్రం – ఆ వేగానికి తట్టుకోలేక బోర్లా గుర్రాన్ని కరుచుకు పోయి పిచ్చిగా గుర్రాన్ని ఆపాలని వ్యర్ధ ప్రయత్నాలు చేస్తూ కేకలు పెట్టసాగాడు. ఆ కేకలకి హడలిపోయిన దానిలా గుర్రం ఎటు వెడుతున్నది తెలీకుండా గుట్టలు, రాళ్ళు దుమికేస్తుంది — కొండ ఎక్కేసింది. అవతల కొండ వాలులోకి దిగడం ఆరంభించి పల్లంలోకి మరింత వేగంగా జారిపోతూ పరిగెడ్తుంది …..రమేష్ పై ప్రాణాలు పైనే పోయాయి….. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. గుర్రం కాలు ఓ కొండ రాయి మీద మడత పడి జారిపడి వేగంగా కిందకి దొర్లుకుంటూ పడిపోసాగింది —-గుర్రంతో పాటు రమేష్ అతి ఘోరంగా కొండరాళ్ళ వెంట దొర్లి దొర్లి కింద లోయలోకి విసిరేయబడ్డాడు. అతని ఆర్తనాదం కొండల్లో ప్రతిధ్వనించింది.
“గుర్రపు కళ్ళెం “- అదుపు లేకుండా పరిగెత్తే గుర్రాన్ని బంధించడానికే కాదు, — ముడిపడ్డ బంధాలని తెంచడానికి పనికొస్తుంది .
(జ్యోతి (దీపావళి సంచిక) సౌజన్యంతో )
*****
( సశేషం)
డి.కామేశ్వరి కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి సుపరిచితులు. 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, ఒక కవితా సంపుటి ప్రచురితాలు. కొత్తమలుపు నవల ‘న్యాయం కావాలి’ సినిమాగా, కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.