జాహ్నవి
जाह्नवी
హిందీ మూలం – లతా అగర్వాల్
తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు
“దయచేసి వినండి. భోపాల్ జంక్షన్ నుంచి వారణాసికి వెళ్ళవలసిన బండి కొద్దిసేపట్లోనే ప్లాట్ ఫారం నెం. ఒకటి మీదికి వస్తోంది.” రైలు నిర్వాహకుల ద్వారా ప్రకటన చేయబడింది. ప్రయాణీకుల్లో ఆత్రుత మొదలయింది. అందరూ డిస్ప్లే బోర్డు మీద తమ-తమ బోగీ నెంబరు వెతుక్కుంటూ ముందుకీ వెనక్కీ వెడుతున్నారు. అయిదు నిమిషాల్లోనే ధడధడమని ధ్వనిచేసుకుంటూ ట్రైన్ తన వేగంతో ప్లాట్ ఫారం మీదికి వచ్చి ఆగింది. నేను ఒక సెమినార్ లో పాల్గొనడానికి వారణాసికి వెడుతున్నాను. నాకు ఎస్-5 వెతుక్కోవడానికి పెద్దగా ఇబ్బంది ఏమీ కలగలేదు. నా సామాను తీసుకుని నేను జాగ్రత్తగా బండిలోపలికి ప్రవేశించాను. సీటు నెంబరు 17 లోయర్ బెర్త్ చూసుకుంటూ నేను నా సీటు దగ్గరికి వచ్చేసరికి ఒక పెద్దాయన కిటికీ దగ్గరగా ముందుగానే కూర్చుని వుండటం గమనించాను.
“ఎక్స్యూజ్ మీ, ఈ కిటికీ దగ్గరి సీటు నాదండి.” ఆ పెద్దాయన ఏదో ప్రగాఢమైన ఆలోచనలో మునిగివున్నట్లు అనిపిస్తోంది. నా మాట వినగానే ఆయన ఉలిక్కిపడి ఏదో తప్పుచేసిన భావంతో చిన్నబుచ్చుకుంటూ వెంటనే లేచి నిలబడ్డాడు.
“క్షమించాలి.”
“అబ్బే, అదేం ఫరవాలేదు. మీరు కొంచెం ఇటుపక్కకి రండి. నాకు కాస్త ఊపిరి సలపని ఇబ్బంది ఉంది. అందుకనే కిటికీ అవసరం ఉంది.” ఆయన ఇదేమీ విన్నట్లు లేదు. ఎందుకంటే, నాకు జవాబేమీ ఇవ్వకుండా సీటుకి రెండో వైపున బాగాచివరకి వెళ్ళి కూర్చున్నాడు ఎవరో ఏదో అంటే ఒక కుర్రవాడు కోపగించుకుని కూర్చున్నట్లుగా. నెమ్మదిగా కంపార్టుమెంటులో మిగిలినవాళ్ళు కూడా వచ్చారు. బండి కూతవేసి కదిలింది. ఇలా రైలుబండి కూతవెయ్యడమంటూ లేకపోతే మనకి హెచ్చరిక ఎలా ఉంటుందని నాకనిపించింది…..అలా అయితే చాలా మంది బండిలోకి ఎక్కకుండా స్టేషన్ లోనే ఉండిపోతారు… జీవితంలో కూడా అప్పుడప్పుడూ ఇలా ఎవరైనా హెచ్చరిక చేస్తూ ఉంటే ఎంత బాగుండును. మనం కూడా సమయానికి జాగ్రత్త పడతాం…. మన అవకాశాలనూ, మన మనుషులనూ మనం దూరం చేసుకోకుండా ఉంటాం.
సరే! నిజానికి నాకు స్లీపరంటేనే ఇష్టం. ఎసి నాకు పడదు. రెండోది ఆ క్లాసులో అదే పట్టణ వాతావరణం. తమలో తామే ఒదిగి ఉండే హై ప్రొఫైల్ ఉన్న వారు. ఒకాయన ఇంగ్లీషు పత్రిక తీసుకుని కూర్చుంటాడు. ఇంకోవ్యక్తి మొబైల్లో లీనమైపోయి వుంటాడు. కాబట్టి ఏం మాట్లాడకుండా కూర్చునివుండాలి. స్లీపరు కంపార్టుమెంటులో అయితే 8 సీట్లలో కనీసం ఇద్దరైతే పిచ్చాపాటీ మాట్లాడుకునేందుకు దొరుకుతారు.
అందరూ తమ సామాను జాగ్రత్తగా సీటుకింద పెట్టుకుంటున్నారు. బండి కూత కూసి మళ్ళీ ఆగింది. మిగిలిన ఒక్క సీటుకూడా నిండిపోయింది. ట్రైన్ మెల్లమెల్లగా ముందుకి సాగింది. దానితోబాటే నా మనస్సులోకూడా ఆలోచనలెన్నో కొనసాగాయి. నాకు సరిగ్గా ఎదురుగా ఉన్న సీటులో ఒక యువతి వచ్చి కూర్చుంది. మనస్సుకి కొంచెం ఊరట కలిగింది. ఇంకెవరూ లేకపోయినా కనీసం ఈ అమ్మాయైనాఉంది కాస్త మాట్లాడుకునేం దుకు. మిగిలిన మగవాళ్ళలో ఇద్దరయితే నిద్ర అనేది లేకుండా జీవితమంతా మేలుకుని ఉండి ఇప్పుడు ట్రైన్ లోకి వచ్చి కూర్చున్నట్లుగా తమకు పైన ఉన్న బెర్తు సవరించు కుని పడుకున్నారు. నా దృష్టిమాత్రం మాటిమాటికీ ఆ అమ్మాయివంకకు మళ్ళుతోంది కాస్త మాట్లాడుకునే క్రమం మొదలవుతుందేమోననే ఆశతో. కాని తనుమాత్రం చెవుల్లో బ్లూటూత్ పిన్ను పెట్టుకుని తన దగ్గరలో ఇంకెవరూ లేరన్నట్లుగా కూర్చునివుంది. తన ఈ వైఖరి చూసి నా మనస్సు ఉసూరుమంది. అప్పుడే ఒక తల్లీ-కూతురూ తమ నైపుణ్యం చూపిస్తూ అక్కడికి చేరుకున్నారు. తల్లి ఏదో వాయిద్యం వాయిస్తూ తన కంఠస్వరంలోని ప్రతిభ చూపిస్తోంది. ఇంచుమించు ఐదేళ్ళ చిన్నపిల్ల పిల్లిమొగ్గలు వేసే తన నేర్పరి తనం చూపిస్తూ ప్రయాణీకులకి కాలక్షేపం కలిగిస్తోంది. ఒక్కోసారి అయిదారు పల్టీలు కొట్టి ఒకచోటి నుంచి మరోచోటికి వెడుతోంది. ఒక్కోసారి తలక్రిందులుగా ఉండి చేతుల మీద నడుస్తూ చూపిస్తోంది. ట్రైన్ ఉండిఉండి గెంతుకుంటూ ముందుకి వెడుతోంది. మేము ఒకవేళ బాత్ రూంకి వెళ్ళినా, సీటుకి చెందిన పైపుని పట్టుకుని వెడుతున్నాం. కాని ఆ చిన్నపిల్ల ఎంతో ఆత్మవిశ్వాసంతో ఏదీ పట్టుకోకుండా తన నిపుణత్వం చూపిస్తోంది. ప్రయాణీకులని ముగ్ధులని చేస్తోంది.
“అమ్మాయీ, ఇక్కడ ఏంచేస్తున్నావు స్కూలుకి వెళ్ళకుండా?” నేనా అమ్మాయిని అడిగాను. జవాబుగా తను వాళ్ళ అమ్మవంక చూడసాగింది. తన జవాబు వాళ్ళ అమ్మ దగ్గర తాకట్టు పెట్టిందని నాకు అర్థమయింది.
“అమ్మగారూ, ఇది స్కూలుకి వెడితే ఇల్లు నడపడం ఎలా?” వాళ్ళ అమ్మ నిష్కపటం గా నా ఎదురుగా ఒక ప్రశ్న ఉంచింది. దానికి నా దగ్గర సమాధానం లేదు. నా సీటు మీద కూర్చున్న పెద్దాయన ఆ అమ్మాయిని చాలా వాత్సల్యపూరితమైన విధంగా చూస్తున్నా డు. ఆ పిల్ల ఎవరినీ లెక్కచెయ్యకుండా తన ప్రదర్శన అయిపోయిన తరువాత అందరి ముందూ చెయ్యి చాచి తన సంపాదన జాగ్రత్త పెట్టుకుంటోంది. నేను ఒక బిస్కట్ల ప్యాకెట్టు ఆమె చేతిలో పెట్టాను. ఆ పెద్దాయన కొన్ని డబ్బులు ఇచ్చాడు. నాకు ఎదురుగా ఉన్న యువతి అయిదురూపాయల నాణెం ఆ అమ్మాయి చేతిలో పెడుతూ అంది- “బాగుంది! బాగా చేశావు. బాగా కష్టపడి ప్రాక్టీసు చేసి ఇంకా బాగా నీ నేర్పు చూపించు… మంచి పేరు తెచ్చుకో.”
అప్పుడే టి.సి. వచ్చి టిక్కెట్లు చెక్ చేస్తూ ఆ తల్లీకూతుళ్ళని చూసి కసురుకు న్నాడు- “ఎంత చెప్పినా వినవా నువ్వు… ఇక్కడికి రావద్దని చెప్పానుకదా…!”.
ఇదంతా వాళ్ళకి అలవాటేనన్నట్లుగా తల్లీకూతుళ్ళు ఇద్దరూ ఒక అర్థం లేని నవ్వు నవ్వి అక్కడి నుంచి ముందుకి వెళ్ళిపోయారు.
ఇది జరిగి దాదాపు అరగంట అవుతుంది. కంపార్టుమెంటులో పూర్తిగా నిశ్శబ్దం తాండవిస్తోంది. ట్రైన్ తన వేగంతో పరుగులు తీస్తోంది. చెట్లు, కొండలు, పొలాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. బండి ఏదో బ్రిడ్జి మీద నుండి వెడుతున్న చప్పుడు విని నేను బయటికి చూశాను. నదిని చూడటం అనేది నాకు చిన్నతనం నుంచి బాగుంటుంది. నా బాల్యాన్ని నేను ఇంతవరకూ జాగ్రత్తగా ఉంచుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఆధునికతకి చెందిన ఆచ్ఛాదన ఏదీ కప్పుకోలేదు. కనీసం ఈ చెట్లు, కొండలు, పొలాలు… ఈ వంతెనలు… ఇవయినా కాస్త మాట్లాడితే ఎంత బాగుండును. నా ప్రయాణం ఆనంద దాయకంగా ఉండేది. కాని, ఇప్పుడు ఈ అమ్మాయి తప్ప నాకు వేరే ఆప్షన్ ఏదీ లేదు… ఆ పెద్దాయన తనలో తానే లీనమైపోయి ఉన్నాడు. మరి ఊరికే కూర్చునివుండి నేను మాత్రం ఏం చెయ్యగలను. మరోమార్గం లేక ఆ అమ్మాయి వ్యక్తిత్వాన్నిపరిశీలించసాగాను.
ఆమె ఆధునికత ఎందుకనో నాకు రుచించడంలేదు. నేను తన ఆలోచనలని, వ్యవహారాన్ని బేరీజు వెయ్యసాగాను. ఆధునికతని అనుసరిస్తూ, చెవుల్లో మ్యూజిక్ సాధనం పెట్టుకుని, ఆమె ఈ రోజుల్లో తమ ఆనందంలో తామే లీనమై ఉండే యువతకు ప్రతినిధిలాగా కనిపిస్తోంది. వయస్సులోని ఉత్సాహం. ఇంక ఎవరన్నా ఏం లెక్క ఉంటుంది. నేను మాత్రం పక్కనవున్న ఎవరితోనైనా మాట్లాడకపోతే తోచని మహిళల కాలానికి చెందినదాన్ని. మౌనంగా ఉంటే ఏదో తెలియని బాధ కలుగుతుంది. ఇక్కడ కిటికీలో నుంచి బయటికి చూస్తూ, నాలో నేనే ఏదో మాట్లాడుకోవడం తప్ప నాకు మరేమీ గత్యంతరం లేదు. వెనక్కి వెళ్ళిపోతున్న మైలురాళ్ళు, ముందుకి దూసుకుపోతున్న రైలుబండి… వీటిని చూస్తూవుంటే జీవితం కూడా ఇలాగే ముందుకి పరుగిడుతున్నట్లూ, మన ఎన్నో విలువైన జ్ఞాపకాలు వెనక్కి వెళ్ళిపోతున్నట్లూ అనిపిస్తోంది. కావాలనుకున్నా వాటిని మనం జాగ్రత్తపెట్టుకోలేకపోతున్నాం. కాని ట్రైను మాత్రం వీటన్నిటితో తనకి సంబంధం లేదన్నట్లుగా… ఎవరు ఎక్కడ ఎలా ప్రయాణం చేస్తున్నారన్న దాంతో తనకి నిమిత్తం లేనట్లుగా ఒక నిర్లిప్తభావంతో తన లక్ష్యాన్ని చేరుకోవడానికి తన గమ్యం వైపుకి సాగిపోతోంది. నా మనస్సు కూడా ఈ రైలుబండిలాగా ఎవరినీ లెక్కచేయకుండా తన రాగాన్నే ఆలాపిస్తూ ఉంటే ఎంత బాగుండును. కాని మరుక్షణంలోనే ఈ ఆలోచనని తనే ఖండిస్తూ నా మనస్సు హెచ్చరించింది- “ఇది ఒక ప్రాణంలేని యంత్రం. మనం మనుషులం కదా. మనం కూడా దీనిలాగా అయిపోతే మనని కూడా యంత్రాలనే అంటారు. కిటికీలోంచి బయటికి చూస్తూ బండి ఏదో సొరంగంలోకి ప్రవేశిస్తోందని గమనిం చాను. అంటే దీని అర్థం కొన్ని క్షణాలు చీకటిగా ఉంటుంది…. నాకు చిన్నతనం నుండి ఈ చీకటి అంటేనే భయం.” అందుకే నా తల లోపలికి పెట్టుకున్నాను.
ఆ అమ్మాయి రైలు లయబద్ధంగా ఊపుతున్న ఉయ్యాలలో ఊగుతూ, ముఖంలో చిరునవ్వుతో బహుశా తనకి ఇష్టమైన పాట ఏదో వింటున్నట్లుంది. ఈనాటి పిల్లలు తమలో తామే ఎలా సంతోషంగా ఉంటారు…? మనస్సులో కొంచెం ఈర్ష్య కలుగుతోంది. వీళ్ళకి బాధ్యతలేం ఉన్నాయి, తల్లిదండ్రులని తమతో కూడా ఉంచుకోవలసిన అవసరం లేదు. పెళ్ళి అయినట్లుగా అనిపించడంలేదు… ఎవరితోనైనా రిలేషన్ షిప్ లో ఉందేమో. ఇటువంటి కుత్సితమైన ఆలోచనలు నాకు ఎందుకు వస్తున్నాయో తెలియదు. ఈ అమ్మాయి వ్యక్తిత్వాన్ని ఛిద్రాన్వేషణ చెయ్యవలసిన అవసరం నాకేముం ది? బహుశా నాపట్ల ఆమె చూపిస్తున్న ఉదాసీనత నన్ను అలా ఆలోచింపజేస్తోందేమో. మనుషుల్లో ఎంత స్వార్థం ఉంది? తమగురించి కాక వేరేవాళ్ళ గురించి ఆలోచించి నప్పుడు ఎంత ప్రతికూలంగా ఆలోచిస్తారు.
చాలా సేపటి నుంచి నా చూపులు తననే గమనిస్తున్నాయని ఆమెకి తెలిసి పోయింది. ఒక్కసారి ముఖం ఎత్తి నన్ను చూసింది. ఇద్దరి చూపులూ కలుసుకున్నాయి. నా దొంగతనం పట్టుబడినట్లుగా ఒక్క క్షణం నేను కలవరపాటు చెందాను.నేను నా చూపులు తిప్పుకుంటూ ఉండగానే తను ఒక తేలికపాటి మందహాసం చేసింది. ఇంక చెప్పేదేముంది. దాహంగా ఉన్నవాడికి తృప్తితీరా నీళ్ళు దొరికినట్లుగా అనిపించింది… ఉత్సాహంతో నేను కూడా చిరునవ్వు నవ్వాను. బహుశా ఇప్పుడు ఎదురుచూస్తున్న సమయం ముగిసినట్లు, కాస్త ఏదన్నా మాట్లాడుకుంటే ఈ విసుగుదల కొంచెం తగ్గుతుందేమో… కాని ఈ అమ్మాయి మళ్ళీ తన మొబైల్ లో బిజీ అయిపోయింది. మాట కారిగా వాచాలత్వంతో ఉండే నాకు ఎవరో శిక్ష విధించినట్టుగా ఉంది. ఇంత మౌనంగా నేను ఎప్పుడూ ఉండేదాన్నికాను. ఏదయినా అల్లరి చేసినప్పుడు టీచరు నన్ను క్లాసు రూం నుంచి బయటికి పంపించినప్పుడు కూడా నేను అక్కడ తిరుగుతున్న పిల్లలతో ఏదోఒకటి ఎంతోకొంత మాట్లాడుతూ ఉండేదాన్ని. కాని ఇక్కడ ఇప్పుడు నోటికి అలీఘర్ తాళం వేసుకుని కూర్చున్నాను.
`భగవంతుడా, ఇంత కఠినమైన ప్రయాణం నేను ఎప్పుడూ చెయ్యలేదు. ఇంక సహించుకోవడం నావల్ల కాదు. ఎలా… ఏం చెయ్యాలని ఆలోచిస్తూనే నా దృష్టి ఆ పెద్దాయన వైపుకి మళ్లింది. చొక్కా-పైజామా ధరించి ఉన్నాడు. సన్నగా ఉన్న శరీరం… చామనచాయ… ఆయన ముఖం చూస్తే జీవితం ఒక పెద్ద సుత్తి తీసుకుని ఉలితో ఆయన్ని చెక్కి ఉంటుందని అనిపిస్తోంది. గడిచిన జీవితం తాలూకు కష్టాల తాపం ఆయన ముఖం మీద స్పష్టంగా తెలుస్తోంది. జీవితంలోని ఆశలన్నీ నశించిపోయినట్లు ఆయన ముఖంలోని భావాలు చెబుతున్నాయి. మనస్సులోని పరిష్కారం కాని ప్రశ్నలు సమాధానం వెతుక్కుంటూ పరిభ్రమిస్తున్నట్టు ఉన్నాయి. ఆయన ఒదిగి-ఒదిగి కూర్చు న్న పద్ధతి చూస్తే నాకు ఆయన మీద జాలి కలుగుతోంది. రైలుబండి ధ్వని లయలో కదులుతూ, చుట్టుపక్కల ఉన్న దేనితోనూ తనకేమీ సంబంధం లేదన్నట్లుగా తదేకంగా పై సీలింగుని అవలోకిస్తూ శూన్యంలో సంచరిస్తున్నాడు. నేను నా సీటు నుంచి కొంచెం తప్పుకోమని మాత్రం అన్నాను. దానికే ఆయన మొత్తం ఒక మూలకి వెళ్ళిపోయి అక్కడే ముడుచుకొని కూర్చున్నాడు. నాకేదో తప్పు చేశానని అనిపించి ఆయనతో అన్నాను-
“బాబుగారూ! మొత్తం సీటు అంతా ఖాళీగా ఉంది. మీరు అలా ఎందుకు కూర్చు న్నారు, బాగా కూర్చోండి.”నేను ఇలా అన్నానో లేదో ఆయన మంచి పిల్లవాడిలాగా సరిగా కూర్చున్నాడు. అయినా ఏమీ మాట్లాడలేదు. ఎందుకనో ఆయన ముఖం చూస్తే ఇప్పుడే ఏడ్చేస్తాడని అనిపిస్తోంది. ఆయన మనస్సులో ఏదో తెలియని బాధ చుట్టుముట్టుతోం దని స్పష్టంగా తెలుస్తోంది. ఈయనతో ఎందుకు మాట్లాడకూడదు. రైలు ప్రయాణం. అందులోనూ ఒక సహప్రయాణీకుడు దొరికినప్పుడు ఆ ప్రయాణం కాస్త తేలిక అవుతుంది.
“ఇయ్యి దీదీ…. అరే ఓ దొరబాబూ, జితేంద్రా… ఇంతేనా…. అరే నేను దీవిస్తాను నిన్ను.” నేను ఏమైనా చెప్పేలోగానే చప్పట్లు కొడుతూ హిజరా అనబడే ట్రాన్స్ జెండర్ వ్యక్తి తన డబ్బులు వసూలు చేసుకునేందుకు వచ్చింది. నాకు ఎదురుగా ఉన్న ఆ అమ్మాయి తన మొబైల్ లోనే లీనమైపోయివుంది. నేను ఆ వ్యక్తిని పట్టించుకోలేదు. ఆ పెద్దాయన వైపుకి తిరిగి ఆయన దిగులుగా వున్న ముఖం చూసి ఏమీ మాట్లాడలేక ముందుకి వెళ్ళిపోయింది.
“చాయ్…చాయ్…చాయ్…సమోసా… తాజా సమోసా…” ఈ ధ్వనులే కంపార్టుమెంటు లోని నిశ్శబ్దాన్ని భంగం చేస్తున్నాయి. అది తప్ప మిగిలినదంతా ప్రశాంతత నెలకొని వుంది. ఈలోగా ఎన్ని స్టేషన్లు వచ్చి వెళ్ళిపోయాయో, కాని ఆయన కిటికీలోంచి బయటికి తొంగి చూడలేదు. బహుశా తన గమ్యస్థానం గురించి ఆయనకి మనస్సులో ఉత్సాహం ఏమీ లేదేమో. జీవచ్ఛవంలాగా తన సీటుకి తల ఆనించుకుని కూర్చుని ఉన్నాడు. నేను మళ్ళీ ఆయన్ని పలకరించాను.
“మీ ఒంట్లో బాగుండనట్టుంది. మీరు ఒంటరిగా ప్రయాణం చెయ్యకుండా వుంటే బాగుండేది.”
“నేను బాగానే ఉన్నాను.” సంక్షిప్తంగా జవాబు చెప్పాడాయన. నాకు సంతోషం కలిగింది. మౌనవ్రతం ధరించిన మనిషి ఏదో ఒకటి మాట్లాడాడు.
“మీరు ఎక్కడికి వెడుతున్నారండి?”
“అమ్మ దగ్గరికి.”
“ఎక్కడ ఉంటుంది మీ అమ్మ?”
“జన్మనిచ్చిన తల్లి కాదు. ఆవిడ ఏనాడో మట్టిలో కలిసిపోయింది.”
“మరయితే ఏ అమ్మ దగ్గరికి వెడుతున్నారు?”
“గంగమ్మ తల్లి దగ్గరికి.”
“గంగమ్మ తల్లా?” నాకు ఆశ్చర్యం కలిగింది.
“ఈ బండి బనారస్ కి వెడుతుంది కదా….” ఆయన కొంచెం కంగారు పడుతున్నట్లు అనిపించింది.
“అవును. బనారస్ వెడుతుంది. మేము కూడా అక్కడికే వెడుతున్నాం. మీరు చెప్పేది ఏ గంగమ్మ తల్లి గురించి?”
“గంగమ్మ తల్లి ప్రవహిస్తుంది కదా, అక్కడికి.”
“మీరు గంగానది గురించి చెబుతున్నారా?” నా అవివేకానికి కాస్త తడబాటు కలిగింది..
“అక్కడ మీ బంధువులెవరైనా ఉన్నారా…?”
“లేరు. మా చుట్టాలెవరూ లేరు.”
“అలాగా. అయితే గంగానదిలో స్నానం చెయ్యడానికి వెడుతున్నారా?”
“లేదు. నేను గంగమ్మతల్లి పాదధూళిలో ఉండటానికి వెడుతున్నాను.” ఆయన ఈ మాట చెప్పగానే ఆ అమ్మాయితో బాటు 23 నెంబరు సీటులో కూర్చున్న ప్యాసెంజరు కూడా ఆయనవంక చూశాడు.
“మీకు ఎవరూ లేరా బాబుగారూ?” అప్పటివరకూ మొబైల్ లో లీనమైపోయిన అమ్మాయి ఒక్కసారిగా అడిగింది. మాటల సందర్భంలో ఆ అమ్మాయి పేరు జాహ్నవి అని తెలిసింది.
“ఉన్నారమ్మా. ఒక కొడుకున్నాడు. ఒక కూతురు ఉంది.”
“మరి మీరు గంగమ్మ పాదధూళిలో ఉండవలసిన అవసరం ఏం వచ్చింది? మీ పిల్లలు మిమ్మల్ని తమ దగ్గర ఉంచుకోమన్నారా?”
“అలాంటిదేమీ లేదు. వాళ్ళు ఇక్కడ ఉండటంలేదు.”
“అంటే?” నేను ఉండబట్టలేక అడిగాను.
“వాళ్ళు విదేశంలో ఉంటున్నారు.”
“మరి మీ ఆవిడ గారు…?”
“కాంత 35 ఏళ్ళ కిందనే దేవుడిదగ్గరికి వెళ్ళిపోయింది.”
రైలు ఆగింది. ఏదో స్టేషన్ వచ్చింది. కిటికీలోంచి వస్తున్న కోలాహలంతో మా సంభాషణ కూడా ఆగింది. కాని పెద్దాయన జీవితం ఏదో చిక్కుపడివున్నట్లు అనిపిం చింది. మనస్సులో ఎన్నో ప్రశ్నలు ఉదయించసాగాయి. ట్రైన్ మళ్ళీ వేగం పుంజుకోగానే నా ఔత్సుక్యం మళ్ళీ తల ఎత్తింది.
“అయితే ఇప్పటివరకూ మీరు ఎక్కడ ఉన్నారు?”
“అమ్మాయి దగ్గర. ఇప్పుడు తనుకూడా విదేశం వెళ్ళిపోయింది.”
“సంపాదనకి ఏమయినా మార్గం ఉందా, నేననేది మీరెక్కడైనా ఉద్యోగం చేసేవారా, లేకపోతే వ్యవసాయం ఉండేదా, మీ ఇల్లు ఎక్కడైనా ఉందా?”
“పని చేసుకునేవాడిని. నాలుగు ఎకరాల భూమి ఉండేది. ఒక ఎకరం 35 ఏళ్ళకింద టనే కాంతకి జబ్బు చేసినప్పుడు వైద్యం చేయించడం కోసం అమ్మేయవలసి వచ్చింది. అయినా జబ్బు నయం కాలేదు.”
“అయితే మరి ఇంకా మూడు ఎకరాల భూమి ఉందా మీదగ్గర?” జాహ్నవి అడిగింది.
“కాంత వెళ్ళిపోయేటప్పుడు ఇద్దరి పిల్లల తలమీద చెయ్యిపెట్టి మాట తీసుకుంది. నా యిద్దరు పిల్లల్నీ ప్రాణప్రదంగా చూసుకోమని, వాళ్ళకేమయినా ఇబ్బంది కలిగితే తన ఆత్మకి బాధ కలుగుతుందని, అశాంతితో సంచరిస్తుందని. వాళ్ళని చదివించి పెంచి పెద్దచెయ్యమని. ఆత్మ… అంటే పరమాత్మలో అంశమే కదా. మరి తన ఆత్మని నేను ఎలా అశాంతితో సంచరించనిస్తాను.”
“మాకు అర్థం కాలేదు!” మేం ముగ్గురం ఇంచుమించు ఒకే అభిప్రాయం వెలిబుచ్చాం.
“పెద్దవాడయ్యాక నాన్నా, చదువుకునేందుకు విదేశం వెడతానని కేశవ్ అన్నాడు. అందుకు ఒకటిన్నర ఎకరాలు అమ్మేసి వాడిని విదేశం పంపించాను. వాడు మళ్ళీ తిరిగి రాలేదు. అక్కడే పెళ్ళి చేసుకున్నాడు.”
“బ్లడీ హెల్.” జాహ్నవి ముఖం కోపంతో రగిలిపోయింది. నేను ఆమెని జాగ్రత్తగా గమనించాను. తనుకూడా అదే తరానికి చెందినది కదా!!
“ఇప్పుడైనా జాగ్రత్త పడండి బాబుగారూ…. ఈ లోకంలో ఎవరూ ఎవరికీ ఏమీ కారు. మిగిలిన భూమిని జాగ్రత్త పెట్టుకోండి మీరున్నంతవరకూ.”
“అది కూడా ఇచ్చేశానమ్మా.”
“ఎవరికి?”
“పోయిన వారం అమ్మాయి ఒక అబ్బాయిని తీసుకువచ్చింది. అతన్ని ప్రేమిస్తున్నా నని చెప్పింది. పెళ్ళి చేసుకుంటానంది. ఆ కుర్రాడు కట్నంగా ఇంత డబ్బు కావాలని షరతు పెట్టాడు. దాంతో విదేశం వెడతానన్నాడు.”
“అయితే మీరు అలాంటి అబ్బాయిని పెళ్ళి చేసుకోవద్దని మీ కూతురికి ఎందుకు చెప్పలేదు…?”
“చెప్పానమ్మా. కాని ఆ సమయంలో అమ్మాయి మనస్సులో ఆ అబ్బాయే ఉన్నాడు. తను ఒప్పుకోలేదు. నీకు నావంతు వాటా ఇవ్వడానికి ఇష్టం లేదంది. నాకు వచ్చే నా భాగం పొలం అమ్మేసి డబ్బు ఇచ్చెయ్యి. దానిమీద నాకు చట్టపరంగా హక్కు ఉందని అంది. ఇవాళ కాకపోయినా రేపయినా నాకు ఇవ్వవలసిందే కనుక ఎందుకు సందేహిస్తు న్నావంది. అందుకే ఆ భూమిని అమ్మేసి డబ్బు పిల్ల చేతిలో పెట్టి వచ్చాను. ఇప్పటికి తనుకూడా ఇంకో దేశానికి ఎగిరిపోయి ఉండవచ్చును.” ఇదంతా చెబుతూ ఆయన తన దృష్టిని రైలుబండిలోని పైకప్పువంక నిలిపి చూస్తూ ఉండిపోయాడు. బాధతో కూడిన శూన్యం ఆ కళ్ళలో కనిపిస్తోంది. రైలుబండి చప్పుడులో కొన్ని మాటలు స్పష్టంగా లేకపోయినా, ఆయన బాధని పంచుకోగలిగే బంధం ఒకటి ఏర్పడింది. దాన్ని అర్ధం చేసుకునేందుకు ఇబ్బంది ఏదీ కలగలేదు.
“భగవంతుడు కూడా తల్లిదండ్రులని వారిపట్ల శ్రద్ధ, గౌరవం, వారంటే విలువలేని వాళ్ళమీదనే ఆధారపడేలా చేస్తాడు. తమకి ఆశ్రయం, నీడ కోరుకునేవారికి అది లేకుండా చేస్తాడు.” జాహ్నవి అలా ఎందుకు అన్నదో అప్పుడు తెలియలేదు. రైలుబండి చేస్తున్న ఛుక్-ఛుక్ ధ్వని కూడా పెద్దాయన బాధతోకూడిన మందస్వరం ముందు బలహీనంగా కనిపిస్తోంది. దగ్గరగా కూర్చున్న మేమంతా ఇప్పుడు కిటికీలోంచి బయట కనుపిస్తున్న లోకాన్ని విడిచిపెట్టి ఆయన దిగులు గురించి ఆలోచిస్తున్నాము. సాయంత్రం కావస్తోంది. అప్పుడే “చాయ్, చాయ్… ఏలక్కాయలు, అల్లం టీ…” అంటూ క్యాంటీన్ బాయ్ వచ్చాడు. నేను రెండు చాయ్ లు ఇవ్వమని అతనితో చెప్పాను. ముందుగా ఇచ్చిన చాయ్ పెద్దాయనవైపుకి అందిస్తే ఆయన వద్దు-వద్దు అంటూనే మా కోరికని మన్నిస్తూ తీసుకు న్నాడు. కంపార్టుమెంటులో ఏదో విచిత్రమైన నిశ్శబ్దం నెలకొనివుంది. అంతా ఒకేవిధంగా పయనిస్తున్నారు. ఒక విధంగా మేము ఆయన బాధలో మా భవిష్యత్తుని చూసి భయభ్రాంతుల మవుతున్నాం. వచ్చే రోజుల్లో తల్లిదండ్రుల భవిష్యత్తు ఇలాగే ఉంటుందా…? చాయ్ తాగడం పూర్తి కాగానే నేను మళ్ళీ సంభాషణ కొనసాగించాను.
“మీ భార్యగారు కాలం చేసినప్పుడు మీకెంత వయస్సు ఉండవచ్చండి?”
“అదే 25-26 ఏళ్ళు ఉంటాయి.”
“అంతేనా! అయితే మీరు మీ గురించి ఎందుకు ఆలోచించలేదు, రెండో పెళ్ళి చేసుకోవచ్చు కదా?” సీటు నెంబరు 23లో కూర్చున్న ప్యాసెంజరు అడిగాడు.
“నా గురించి ఏమన్నా ఆలోచించుకునేందుకు ఇంత సమయం నా దగ్గర ఎక్కడుంది. కాంత వెళ్ళిపోయిందన్న బాధని కూడా ఎక్కడ బాగా నిర్వర్తించాను. తన శరీరాన్ని అగ్నికి సమర్పించి పరుగెట్టుకుంటూ ఇంటికి చేరుకున్నాను పిల్లలు ఆకలితో ఎక్కడ అలమటించిపోతున్నారోనని. వచ్చి చూస్తే పిల్ల కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. వాళ్ళ అమ్మని పిలుస్తోంది. మరోపక్క కాంత ఆత్మ కూడా అలాగే రోదిస్తూ వుంటుందని నాకనిపించింది. అందుకే స్నానం కూడా చెయ్యకుండా ముందు బిడ్డని అలా ఎత్తుకునే పాలు వేడి చేసి బాటిల్ లో పోసి పట్టాను. తర్వాత స్నానం చేశాను. ఇంక అలాగే కేశవ్, కజరీలను చూసుకుంటూ, పెంచుకుంటూ వయస్సు ఎప్పుడు గడిచిపోయిందో తెలియనే లేదు. అదీకాక, పిల్లల్ని చదివించి పెద్దవాళ్ళని చేస్తానని కాంతకి మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవడంలో నా గురించి ఆలోచనేరాలేదు.” పెద్దాయన చెబుతున్నఆయన వృత్తాంతాన్ని ఆలకించడంలో లీనమైపోయిన మాకు స్టేషన్ లో బండి ఆగగానే కిటికీ లోంచి వస్తున్న చాయ్, సమోసాలు అమ్మేవాళ్ళ ధ్వనులు ఇబ్బంది కలిగించసాగాయి. ఆ అంతరాయానికి కోపం కూడా వచ్చింది.
మనస్సు విరక్తితో నిండిపోయింది. మాకందరికీ బాధ కలిగింది. జన్మనిచ్చిన తండ్రి పట్ల వాళ్ళు కనుక్కున్న సంతానం ఏమీ తెలియకుండా, నిర్లక్ష్యంగా ఎలా ఉండగలరు? అదే ఆశ్చర్యం కలిగిస్తోంది. అరే, తన జీవితమంతా హోమం చేసిన తండ్రిని ఈ పరిస్థితి లో విడిచిపెట్టి మనస్సు కొంచెమైనా చలించలేదా…! ఈ తండ్రికి కూడా వాళ్ళంటే ఏ మాత్రం కోపం లేదా…! నిజంగా తండ్రికి కొండంత మనస్సు ఉంటుంది. మా కళ్ళు చెమ్మగిల్లాయి. కాని పెద్దాయన కళ్ళలో మాత్రం కన్నీళ్ళు పూర్తిగా ఇంకిపోయినట్లున్నా యి. ఈ దుఃఖాన్ని సహించుకుంటూ ఆయన కళ్ళు మొద్దుబారిపోయినట్లున్నాయి.
“చూడండి! మీ అబ్బాయి వెళ్ళిపోయాడంటే సరే, కాని మీ అమ్మాయికేమయింది? తనుకూడా విదేశం వెళ్ళిపోయింది? తను విదేశం వెళ్ళదలుచుకుంటే తన ప్రయత్నం తో వెళ్ళాలి కాని, మీ అమ్మాయికి మీరు నచ్చజెప్పుకోవలసింది.”
“ఎంతగానో చెప్పానమ్మా. కాని తనిప్పుడు ఎదిగింది, కాస్తోకూస్తో చదువుకుంది, చట్టం ఏమిటో తెలుసు. తనే నాకు టిక్కెట్టు కొని నా చేతిలో పెట్టింది. నాన్నా, గంగా తీరానికి వెళ్ళు.. గంగమ్మ అందరికీ ముక్తిని ఇస్తుందని అంది.”
“ ఏం కూతురండీ. తండ్రి గురించి ఏమాత్రం ఆలోచించలేదా” జాహ్నవి కోపంతో తన పిడికిలి బిగించింది. ఆమె భంగిమ మాక్కూడా ఆశ్చర్యం కలిగించింది.
“ఏమ్మా, మనిషి ఒక సమయంలో ఒక్కవిషయం గురించే ఆలోచించగలుగుతాడు కదా.”
“అంటే!”
“అంటే, ఆ సమయంలో అమ్మాయి తన కాబోయే భర్త గురించే ఆలోచించింది.” గుండెల మీద ఎంత దెబ్బని తట్టుకుని ఆయన ఈమాట అనగలుగుతున్నారన్నది ఆయన కళ్ళని చూస్తేనే తెలుస్తోంది. బాధతోకూడిన ఆ కళ్ళలో కోపం అనేది లేశమాత్రం కూడా కనిపించడంలేదు. కాని ఆ జాలిగొన్న కళ్ళు… ఆ చూపులు మా అందరి మనస్సుల్లో గుచ్చుకుంటున్నాయి.
“మరి ఇప్పుడు మీరేం చేస్తారు? మీకు జీవనాధారం..” నాకు మనస్సులో బాధ కలుగుతోంది.
“పల్లెటూళ్ళో ఒక చిన్న పూరిల్లు వుంది. దానికి 5000 రూపాయలు దొరికాయి. అదే తీసుకుని బయలుదేరాను గంగమ్మ శరణు కోరుతూ. ఆవిడ తల్లి కదా, అందరి విషయం లోనూ శ్రద్ధ తీసుకుంటుంది. నన్నుకూడా ఆదుకుంటుంది. ఏమీ ఇబ్బంది లేదు.”
నిజంగా ఏమీ చింత లేదా…? నా మనస్సు ఆక్రోశిస్తోంది. ఈ వయస్సులో ఈ ఒంటరితనం ఏమీ ఇబ్బంది కాదా…? రాత్రి భోజనం సమయం అయింది. అందరూ టిఫిన్ డబ్బాలు ఓపెన్ చేశారు. అన్నిటిలో ముందుగా కొంత పెద్దాయన కోసం తీసి పెట్టారు. ఆయన స్వాభిమానం అది తీసుకునేందుకు అంగీకరించడం లేదు. కాని అందరి పట్టుదల ముందు ఆయన చివరకు కాదనలేకపోయాడు. జాహ్నవి వయస్సులో చిన్నదయినా, ఆమె గొంతులో అమ్మలాంటి ఆత్మీయత, పట్టుదల వుంది.
“మీరెందుకు పస్తు ఉంటారు? మీ పిల్లలు ఈసమయంలో ఏదైనా బార్ లో హై క్వాలిటీ బీరు తాగుతూ ఉంటారు. మీరిక్కడ ఉపవాసం చేయాలనుకుంటున్నారు…. ఏం అక్కర్లేదు. బాధ పడవలసిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ ఎవరు లేకపోయినా ఈ లోకం అంతరించిపోదు.”
“జాహ్నవి చెబుతున్నది నిజం. ఇప్పుడు మీరు మీ గురించి శ్రద్ధ తీసుకోవాలి. చూడండి, ప్రతి స్టేషన్ లోనూ రైలు వస్తుంది. ప్రయాణీకులని తీసుకుని బయలు దేరుతుంది…. కాని ఎవరైనా ప్రయాణీకుడు వెళ్ళిపోతే స్టేషన్ లోని కళాకాంతులుతగ్గిపోవు కదా… అయినా, జనసమ్మర్దం అలాగే ఉంటుంది.” నేను ఆయనకి నచ్చజెప్పడానికి ప్రయత్నించాను.
“నిజమే, మీ జీవితంలో ఈ మజిలీ కూడా ఒక స్టేషన్ లాంటిదే. జీవితం అనే ప్లాట్ ఫారం మీద వస్తూ-వెడుతూవున్న ఉచ్ఛ్వాస-నిశ్వాసలబాహుళ్యం… మహాసందోహం. రైలుబండిలో అంతా కలుస్తారు, చుట్టరికాలు ఏర్పడతాయి, ఎవరో కొంత దూరం వరకు తోడుగా ఉంటారు. ఎవరో మధ్యలోనే ప్రయాణం పూర్తి చేసుకుని దిగి వెళ్ళిపోతారు. మీ భార్య, కేశవ్, కజరీ… వీళ్లంతా మీ జీవితం అనే రైలుబండిలోంచి దిగి వెళ్ళిపోయారు. వాళ్ళగురించిన బాధ మనస్సులోంచి తీసెయ్యండి. మిగిలిన జీవితం గురించి ఆలోచిం చండి.” సీటు నెంబరు 23లో కూర్చున్న ప్రయాణీకుడు నా మాటలని సమర్థించాడు. పెద్దాయన తన మనస్సులోని బాధని బహిర్గతంచేసి కాస్త తేలిక పడినట్లునాడు. ఆయన అందరితోబాటు భోజనం చేశాడు. అందరూ చూపించిన ఆదరణకి మొదటిసారి ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. ఆయనకళ్ళలో ఇంకా మిగిలివున్న తడి దీనికి తార్కాణం. చేతిమీద వున్న చొక్కా అంచుతో కళ్ళు తుడుచుకుంటూ ఆయన నీళ్ళసీసా తీసుకుని మంచి నీళ్ళు తాగాడు.
ట్రైన్ ఉదయం 5.00 గంటలకి వారణాసి స్టేషన్ చేరుకుంటుంది. కనుక నిద్ర అవసరం అందరికీ ఉంది. కాని పెద్దాయన అలాగే శూన్యంలోకి చూస్తూ కూర్చుని ఉన్నారు. ఆయన కళ్ళలో నిద్ర ఎక్కడా దూరదూరాల్లో కూడా కనిపించడంలేదు. ఒకటి-రెండుసార్లు నేను కూడా చెప్పాను పడుకోండి, రోజంతా కూర్చునేవున్నారని, అలిసిపోయి వుంటారని. కాని ఆయన వినలేదు. 4.30 గంటలకి అందరూ లేచిన సందడి మొదలైంది. మేము కూడా మా సామాను సర్దుకోవడం మొదలుపెట్టాం. పెద్దాయన గురించి ఆలోచిస్తేనే మనస్సు వికలమైపోతోంది. ఆయన తన చిన్న సంచి తీసుకుంటూ వుండగానే జాహ్నవి ఆత్మవిశ్వాసంతో కూడిన కంఠస్వరం మాకు వినిపించింది. రాత్రంతా మనస్సులో పడిన మథనంతో తను ఒక నిర్ణయానికి వచ్చినట్లు అనిపించింది.
“బాబుగారూ, మీరు అమ్మ దగ్గరికి వెడుతున్నారు. స్నానం కూడా చేస్తారు. కాని మీరు అక్కడ ఉండటం లేదు.” పెద్దాయనతో సహా అందరం ఆశ్చర్యంగా జాహ్నవి వంక చూశాం.
“అరే, అలా చూస్తున్నారేమిటి, మీరు నాతో నా యింటికి వస్తున్నారు. ఈ కూతురికి తండ్రి అవసరం ఉంది. బాల్యం నుండి కూడా నేను అనాథాశ్రమంలో పెరిగాను. ఒంటరిగా ఉండే బాధ ఏమిటో నాకు తెలుసు. ఎంతో కష్టపడి నన్ను నేను నా కాళ్ళమీద నేను నిలబడేలా యోగ్యురాలిగా చేసుకున్నాను. భగవంతుడి దయవల్ల నేను సంపాదించేదాంతో నా తండ్రిని జాగ్రత్తగా చూసుకోగలను.”
“కాని అమ్మా…”
“కాని-గీని ఇంకేం చెప్పకండి. నేనేమీ వినదల్చుకోలేదు. మీ సామాను ఇలా ఇవ్వండి.”
చేతులు జోడిస్తూ ఆయన జాహ్నవి పాదాల మీదకి వంగబోయారు. కాని జాహ్నవి తన రెండు చేతుల్తోనూ ఆయన్ని పట్టుకుంది.
“ఈ చేతులు నా తలపైన ఉంచండి నాన్నగారూ, నాకు మీ ఆశీస్సులు కావాలి.” నేను జాహ్నవి గురించి ఏమేమిటో ఏం ఆలోచించానని నాకు మనస్సులోనే ఎంతో సిగ్గుగా ఉంది. చివరికి తను ఎలా బహిర్గతమై ఎంత ఉన్నతంగా…ఉదాత్తంగా కనిపించింది. నన్ను నేను తనముందు ఒక అల్పురాలిగా అనుభూతి చెందుతున్నాను. మరోవంక నా అంచనాలన్నీ తలకిందులయ్యాయని సంతోషంగాకూడా ఉంది. కాశీక్షేత్రంలో నేల మీద అడుగుపెట్టగానే సాక్షాత్తు గంగమ్మ తల్లి ఈ పెద్దాయనకి ఆశ్రయం ఇచ్చిందని అనిపిం చింది. జాహ్నవి అంటే గంగకి మరోపేరే కదా అన్న విషయం జ్ఞాపకం వచ్చింది.
***
డా. లతా అగ్రవాల్ – పరిచయం
26 నవంబరు 1966 న షోలాపూర్, మహారాష్ట్రలో జన్మించిన డా. లతా అగ్రవాల్ `తులజ’ ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, విద్యావేత్త. ఎన్సిఇఆర్టీ, భోపాల్ లో లెక్చరర్ గా, వైష్ణవ యూనివర్సిటీ, ఇండోర్ లో బోర్డు మెంబరుగా, భోపాల్ యూనివర్సిటీకి అనుబంధసంస్థ అయిన మిత్తల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, భోపాల్ కి ప్రిన్సిపాల్ గా, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో కౌన్సెలర్ గా సేవలందించారు. వీరి రచనలు ఆకాశ వాణి, దూరదర్శన్ లలో ప్రసారితమయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వీరి పుస్తకాలు 16 విద్యకి సంబంధించినవి, 7 కవితాసంకలనాలు, 12 బాలసాహిత్యం, 5 కథాసంకలనాలు, 7 మినీకథాసంకలనాలు, 3 నవలలు, 4 సమీక్షాగ్రంథాలు, 20 నాటికలు, 1 ఇంటర్ వ్యూల సంకలనం ప్రచురితమయ్యాయి. హిందీ కల్చరల్ ఆర్గనైజేషన్, టోక్యో, జపాన్ నుంచి `కళాశ్రీ’ సన్మానం, మారిషస్ హిందీ సాహిత్య అకాడమీ నుంచి `హిందీ సాహిత్యరత్న’ సన్మానం తో సహా అంతర్జాతీయ స్థాయిలో 4 సన్మానాలు పొందారు. 2 సార్లు కమలేశ్వర్ స్మృతి పురస్కారంతోబాటు జాతీయస్థాయిలో ఇంచుమించు 60 కన్నా ఎక్కువగా పురస్కారాలతో సన్మానింప బడ్డారు. ఉత్తమసాహిత్యసృజనకు 14 రాష్ట్రాలనుంచి సత్కారం పొందారు. డా. లతా అగ్రవాల్ భోపాల్ వాస్తవ్యులు.
*****
బహుభాషావిదులైన డా. రావు (1948) గారి చాలా స్వీయ, అనువాదిత కథలు, వ్యాసాలు, కవితలు తెలుగు, హిందీలలో ప్రచురితమయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషుల మధ్య అనువాదంలో సుదీర్ఘ అనుభవంతో ఒక నవల, 200కి పైగా కథలు, కవితలు అనువదించారు. త్రిభాషా నిఘంటువులో సహసంపాదకత్వం చేశారు. వేరువేరు సమయాల్లో రిజర్వ్ బ్యాంక్ కి చెందిన కొన్ని పత్రికలకు సంపాదకునిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ద్వారా పండిత్ శివసేవక్ తివారీ స్మృతి పతకంతోనూ, అరసం గుంటూరు జిల్లా యూనిట్ ద్వారా శారదాంకిత స్వర్ణపతకంతోనూ సన్మానితులు. రష్యన్ కవితల అనువాదానికి ముంబయిలోని రష్యన్ ఎంబసీ ద్వారా ప్రశంసించ బడ్డారు. తెలుగు కవితలకు వేరువేరు సంస్థల ద్వారా సన్మానం పొందారు. రిజర్వ్ బ్యాంక్ లో జనరల్ మేనేజరు స్థాయిలో రిటైర్ అయ్యాక ముంబయిలో ఉంటున్నారు.
VERY NICE STORY. CONGRATULATIONS TO WRITER LATHA!
STORY CHALAABAAGUNDI. KONDARINI TAPPUGAA ANCHANAA VESTAAM. NIJAM TELISI SIGGUPADATAAM> ANTEKAADU JAHNAVI CHEYAGALA VUPAKAARAM EVAROO CHEYARU KOODAA! RACHAETRIKI ABHINANDANALU>