జీవితం అంచున -24 (యదార్థ గాథ)
(…Secondinnings never started)
-ఝాన్సీ కొప్పిశెట్టి
టూరిస్ట్లకు అనుమతి లేదని కేవలం ఆస్ట్రేలియా పౌరుల కోసమే రిపాట్రియేషన్ ఫ్లైట్స్… అమ్మకు వీసా వచ్చిన నాటి వార్త.
ఆస్ట్రేలియా పౌరుల వెంట తల్లి, తండ్రి, స్పౌస్ రావచ్చని మూడు రోజుల్లో మార్పు చెందిన వార్త.
ప్రయాణీకులు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకుని వుండాలన్న నిబంధన. వెంటనే అమ్మకు రెండో డోసు ఇప్పించేసాను.
అయితే రిపాట్రియేషన్ ఫ్లైట్స్ లో మాదాకా అవకాశం రావటం ఇప్ప్పట్లో జరిగేలా లేదు. మరో నెల రోజుల్లో నా ప్లేస్మెంట్ ప్రారంభం కానుంది. చేతిలో వీసా వుండి వెళ్ళే అవకాశం లేకపోవటం దుర్భరంగా వుంది.
అమ్మాయి మరీ ఆరాటపడుతూ ట్రావెల్స్ ఏజెంట్లను వాకబు చేస్తోంది. అమ్మకు సర్జరీలాంటిది గాని కనీసం ఏంజియోగ్రామ్ కూడా ఇండియాలో చేయించవద్దని ఆస్ట్రేలియాలో తను చేయిస్తానని చెప్పింది.
ఓ పక్క ఆస్ట్రేలియా వెళ్ళే దారిలేక నాకు పిచ్చెక్కుతోంటే తను ఆస్ట్రేలియాకి వచ్చే ప్రసక్తే లేదని అమ్మ ఉన్మత్త ప్రేలాపన మరో పక్క. పది రోజుల్లో ఆస్ట్రేలియా చేరలేకపోతే నానర్సింగ్ కి ఉద్వాసన పలికినట్టే…
ఇంతలో ఎమిరేట్స్ తో బహుదేశ ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకుని ఢిల్లీ నుండి ఆస్ట్రేలియాకి విమానాలు ప్రారంభమయ్యాయన్న శుభవార్త తెలిసింది. ఫ్లైట్ కెపాసిటీని నాలుగో వంతుకి కుదించి వారానికో ఫ్లైట్ చప్పున మొదలయ్యాయి. ఇంకా సింగపూర్, మలేషియా, థాయిలాండ్ ల ఎయిర్ వేస్ మొదలవకపోవటంతో ఎమిరేట్స్ దుబాయ్ మీదుగా చుట్టు తిరిగి చాలా దీర్ఘ మార్గంలో ప్రయాణిస్తుంది.
ఆకాశాన్ని అంటే టికెట్ల రేట్లు… సుదీర్ఘ మార్గం.. దారి పొడవునా కోవిడ్ పరీక్షలు… అదీ ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్ పైననే టికెట్లు.
ఏ క్షణం రూల్స్ మారతాయోనని అనుమానించిన అమ్మాయి క్షణం ఆలస్యం చేయకుండా మాకు టికెట్లు తీసేసుకుంది. హైదరాబాదు నుండి ఢిల్లీ… అక్కడ కోవిడ్ పరీక్షలు, రెండు రోజులు హోటల్ లో బస, అటు నుండి దుబాయ్, అక్కడ పరీక్షలు, హోటల్ స్టే, అక్కడి నుండి సిడ్నీ, కోవిడ్ పరీక్ష అయ్యాక మా ఫైనల్ డెస్టినేషన్ బ్రిస్బేన్…
ఇప్పటికీ ఈ ప్రయాణం తలుచుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
ప్రయాణ సన్నాహాలన్నీ జోరుగా జరిగిపోతుండగా అమ్మ ససేమిరా రానని మొరాయించింది. హైదరాబాదులో తన వాళ్ళను, తనకు కావలసిన మనుషుల్ని వదిలి రానంటే రానని భీష్మించుకుని కూర్చొంది. నా సహనానికి పెద్ద పరీక్షే పెట్టింది.
నయానా భయానా ప్రయత్నించే ప్రయత్నంలో మనసుని చంపుకుని అమ్మతో కొంత పరుషంగా మాటాడాను.
“ఆస్ట్రేలియా రాకుండా పిచ్చిదానిలా అడ్డమైన వాళ్ళ అడ్రసులు వెతుక్కుంటూ వీధులమ్మటా తిరుగుదామనుకుంటున్నావేమో… నాతో రానట్లయితే అటు పిచ్చాసుపత్రిలోనో లేదా ఇటు వృద్దాశ్రమంలోనో వుండాల్సి వస్తుంది జాగ్రత్త..”
నా మాటలు నాకే చాలా కటువుగా, అమానుషంగా అనిపించాయి. అలా అంటే బయిలుదేరుతుందేమోనన్న ఆశతో అన్నానే కాని నా మాటలకు అమ్మ మొహంలో భావం నన్ను చాలా బాధపెట్టింది. నా అల్టిమేటం కూడా ఏమీ పని చేయలేదు.
మరుసటి రోజునే ప్రయాణం. నాకు తోచిన బట్టలతో అమ్మ సూట్కేస్ సర్దాను. సూట్కేసుతో తనకేమీ సంబంధం లేనట్లున్న అమ్మను చూస్తే నేను అమ్మను తీసుకుని వెళ్ళగలనా అన్న అనుమానం రాజుకుంది నాలో.
ఆస్ట్రేలియా అమ్మాయి అమ్మతో మంచి ట్రీట్మెంట్ ఇప్పించి తిరిగి పంపేస్తానని రమ్మని ఫోనులో ఎంతగానో నచ్చచెప్పింది.
అమెరికా అమ్మాయి ఆ వయసులో అనారోగ్యంతో ఒంటరిగా వుండకూడదని శతవిధాల సముదాయించింది.
లాయరైన నా స్నేహితురాలు ఫోను చేసి ఓ గంటన్నర కౌన్సిలింగ్ చేసింది. కౌన్సిలింగ్ పని చేస్తున్నట్లు వుందని, రేపు వచ్చి దగ్గరుండి బయల్దేరేలా చేస్తానని భరోసా ఇచ్చింది. ఎందుకయినా మంచిదని అమ్మ రాని పక్షంలో నేను నా సూట్కేసుతో వెళ్లిపోయేలా మా ఇద్దరి బట్టలు వేరువేరు సూట్ కేసుల్లో సర్దుకోమని సలహా కూడా ఇచ్చింది. తన సలహాతో నా గుండెల్లో రాయి పడింది.
అమ్మను వదిలి వెళ్ళటమా… అది జరగని పని. మొత్తం ప్రయాణం మానేస్తానే తప్ప అమ్మను వదిలే ప్రసక్తే లేదు.
వదిన తను వచ్చి అమ్మ కాళ్ళు చేతులు కట్టేసయినా సరే కారు ఎక్కిస్తానని ఫోను చేసి వాగ్దానం చేసింది.
చెల్లెలు అవసరమైతే ఆ రాత్రే తను మా ఇంట్లో పడుకుని తెల్లవార్లూ అమ్మకు బ్రెయిన్ వాష్ చేస్తానంది.
అక్క ఏదోలా కారు ఎక్కించేద్దాములే కంగారు పడవద్దని అనునయించింది.
ఎవరెన్ని చెప్పినా నాకు టెన్షన్ తగ్గటం లేదు. అమ్మకు ఎవరేమి చెప్పినా ఆ కాసేపూ వినటం, ఆ తరువాత రాననటం మామూలైపోయింది.
అమ్మ రానట్లయితే నేనూ రానని అమ్మాయితో చెప్పేసాను. టికెట్లకు, ఢిల్లీ, దుబాయిల్లో హోటల్ రూములకు దాదాపు ఆరు లక్షల దాకా ఖర్చు చేసిన అమ్మాయి మారు మాటాడలేదు. ఏదీ రిఫండబుల్ కాదు. ప్రయాణం మరొక్క రోజు దాటితే నర్సింగ్ ప్రహసనం కూడా అంతటితో ముగిసిపోతుంది.
ఆ రాత్రి శివరాత్రే అయ్యింది నాకు.
*****
(సశేషం)