దేవి చౌధురాణి
(మొదటి భాగం)
మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ
తెనుగు సేత – విద్యార్థి
“ఈ పాడుబడిన ఇంటిలోనేనా నీకు మొహిరీలు దొరికింది?” అని అడిగాడు భవానీ పాఠక్.
“అవును“
“ఎంత బంగారం దొరికింది?”
“చాలా“
“అది కాదు, నిజంగా ఎంత దొరికిందో చెప్పు. నువ్వు అబద్ధం చెపుతున్నాననుకుంటే నేను నా మనుష్యులను తీసుకువచ్చి ఇక్కడ వెతికించగలను.”
“ఇరవై జాడీల నిండా“
“ఇంత ధనాన్ని ఏం చెయ్యాలనుకుంటున్నావు?”
“నా ఇంటికి తీసుకు వెళ్దామనుకుంటున్నాను“
“నీ ఇంటిలో మాత్రం జాగ్రత్త చెయ్యగలవా?”
“ఒక వేళ మీరు సహాయం చెయ్యగలిగితే …”
“ఈ అడవిలో నా అధికారం పూర్తిగా చెల్లుతుంది. కానీ అడవి బయట నిన్ను రక్షించగల శక్తి నాకు లేదు.”
“అలా అయితే నేను ఈ అడవిలోనే వుంటాను. మీరు నన్ను రక్షించగలరా?”
“రక్షిస్తాను, కానీ ఇంత ధనాన్ని ఏం చెయ్యాలనుకుంటున్నావు?”
“లోకులు ధనముంటే అనుభవిస్తారు కదా“
“అనుభవిస్తారా!?”
“నేను కూడా అనుభవిస్తాను, తప్పేమిటి?”
భవానీ ఠాకూర్ ఈ మాట విని పగలబడి నవ్వసాగాడు. ప్రఫుల్ల కొంత సిగ్గుపడింది.” మాతా, చిన్నపిల్లల లాగా నువ్వు మాట్లాడుతుంటే నాకు నవ్వు వచ్చింది. నీ పరిస్థితి చూస్తుంటే నీకు ‘నా‘ అన్నవాళ్లెవరూ ఎవరూ లేరని అర్థమవుతున్నది. మరి నువ్వు ఎవరితో కలసి ఈ ధనాన్ని అనుభవిస్తావు?” అని అడిగాడు భవాని.
ప్రఫుల్ల కొంచెంగా తల వంచుకుంది.
“మాతా, ఐశ్వర్యముంటే కొంత మంది భోగంతో అనుభవిస్తారు. కొంత మంది పుణ్య కార్యాలు చేస్తారు. కొంతమంది నరకానికి దారి వెతుక్కుంటారు. భోగంగా బ్రతకటానికి నీకు ఎవరు లేరు. అయితే పుణ్య కార్యమన్నా చెయ్యాలి లేకపోతే నరకాన్నన్నా వెతుక్కోవాలి. నీకు ఏది ఇష్టమో చెప్పు” అన్నాడు భవాని.
“మీరు మాట్లాడే మాటలు బందిపోటుల నాయకుడు మాట్లాడే తీరుగా లేవు” అన్నది ప్రఫుల్ల.
“అవును, నేను కేవలం బందిపోటుల నాయకుడిని మాత్రమే కాదు. నేను నిన్ను ‘మాతా‘ అని సంబోధించాను కదా. ఈ క్షణంలో నీకు ఏది శ్రేయమో, ఆ ఉద్దేశ్యంతోనే మాట్లాడుతాను. నువ్వా ఒంటరిదానివి. ఈ దశలో ఉన్న నువ్వు, ఈ ధనంతో పాపం చెయ్యటమో పుణ్యం చెయ్యటమో అనేది నువ్వే నిర్ణయించుకోవాలి.”
“ఒక వేళ నేను పాపమే చేద్దామనుకుంటే?”
“వెంటనే నా మనుష్యలనిచ్చి నిన్ను నీ ధనంతో సహా ఈ అడవి నుండి బయటకు పంపించివేస్తాను. నువ్వు ఈ వనంలో వుంటే నా అనుచరులే కొంత మంది నీతో పాటు పాపాలు చెయ్యటానికి పూనుకోవచ్చు. నువ్వు పాప మార్గంలోనే వెళ్లాలనుకుంటే నేను నీకు ఇప్పుడే వీడ్కోలు పలుకుతాను. ఈ ధనం మీద నాకు ఏ ఆశా లేదు.”
“నాతో పాటు నా ధనాన్ని కూడా తీసుకువెళ్లితే అందులో పాపమేముంది?”
“నువ్వు ఈ ధనాన్ని కాపాడుకోగలవా? నువ్వు యువతివి, రూపవతివి కూడా. దొంగలు నిన్ను వదిలిపెడతారనుకుంటున్నావా? పాపానికి లాలసత్వం ఎక్కువ. ఆ వ్యామోహాలు తీరక ముందే ధనం ఖర్చు అయిపోతుంది. ఎంత ధనమున్నా ఎవరిదగ్గరా నిలవదు. ధనం కరిగిపోవటానికి ఎంతో కాలం పట్టదు. మరి ఆ తరువాత?”
“ఆ తరువాత, ఏమిటి?”
“నరకానికి దారి సుగమం అవుతుంది. లాలసత్వం అలాగే మిగిలిపోతుంది కానీ దాన్ని తృప్తి చెయ్యటానికి సాధనాలేమి వుండవు. అదే నరకానికి మార్గం. పోనీ, పుణ్యాన్ని పోగు చేసుకుంటావా?”
“అవును. నేను సంప్రదాయ కుటుంబం నుండి వచ్చాను. పాపకార్యం అంటే ఏమిటో కూడా నాకు సరిగ్గా తెలియదు. నేను భోగాలు అనుభవిస్తూ పాపం ఎందుకు చేస్తాను? నేను ఒక బీదరాలను. నాకు తినటానికి, కట్టుబట్టలకీ సరిపడా ఇచ్చి మిగిలిన ధనాన్ని మీరే తీసుకోండి“
భవానీ పాఠక్‌కు ఈ అమ్మాయి ధోరణి నచ్చింది. అతను కొంచెం ఆలోచించి “ఈ ధనం నీదే, నేను ముట్టుకోను” అన్నాడు.
ఆ మాటకు ప్రఫుల్ల ఆశ్చర్యపోయింది. భవానీ పాఠక్ చెప్పటం కొనసాగించాడు “ఈ సమయంలో నీ ఆలోచనలను నేను పసిగట్టగలను. నేను బందిపోటును, చేసేది దోపిడీ లు దొంగతనాలూ, ఈ కపటనాటకాన్ని అడ్డుకోవటానికి పై ఎత్తు ఏమిటని ఆలోచిస్తు న్నావా? ఒక వేళ నేను పాపం చెయ్యటానికే పూనుకుంటే, ఇంత సమయం పట్టేదికాదు. భయపడమాకు, విషయాలన్నీ తరువాత వివరించుతాను. ఇంకొక సారి అడుగు తున్నాను, ఈ ధనంతో ఏమి చేద్దామనుకుంటున్నావు?”
“మీరు అన్నీ తెలిసినవారు అని అర్థమవుతున్నది. మీరే చెప్పండి ఏమి చెయ్యాలో?” అన్నది ప్రఫుల్ల.
“నీకు ఉపదేశం చేసి పూర్తి శిక్షణ ఇవ్వటానికి ఐదేడు సంవత్సరాలు పట్టవచ్చు. శిక్షణ సమయంలో నీ అన్నపానాలు, కట్టుబట్టలూ మొదలైన నిత్యావసరాల బాధ్యత అంతా నాదే. శిక్షణ సమయంలో నేను చెప్పినట్లు వుండాలి. నువ్వు ఈ ధనాన్ని కూడా ముట్టుకోరాదు. ఈ షరతు నీకు అంగీకారమా?”
“నేను ఎక్కడ వుండాలి? నా నివాస స్థానం?”
“ఇక్కడే, ఈ ఇంటిలోనే. మరమత్తులు చేయిస్తాను.”
“ఇక్కడ ఒంటరిగానే వుండాలా?”
“లేదు, ఇంకొక ఇద్దరు స్త్రీలను ఇక్కడికి పంపిస్తాను, వాళ్లు నీకు తోడుగా వుంటారు. వాళ్లూ నా మనుష్యులే, నీకు భయముండదు. నేను ఈ అడవికి యజమానిని, నేను ఉన్నంతవరకూ నీకు ఏ భయమూ వుండదు.”
“మీ శిక్షణ ఎలాంటిది?”
“నీకు చదవటం రాయటం వచ్చా?”
“లేదు.”
“అయితే ముందు చదవటం రాయటం నేర్పుతాను.”
ప్రఫుల్ల రాజీ పడి ఆ అడవిలోనే ఉండటానికి నిశ్చయించుకుంది. తనకి కొంత ఆధారం దొరికిందని సంతోషించింది.
భవానీ పాఠక్ బయల్దేరుతుంటే అతనితోబాటు ఇంటి బయటకు వచ్చింది ప్రఫుల్ల. అక్కడ ఒక బలవంతుడు భవానీ కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు. “రంగరాజు, నువ్వు ఇక్కడకి ఎందుకు వచ్చావు” అని ప్రశ్నించాడు భవాని.
“మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను, మీరు ఏ పని మీద ఇటు వచ్చారు?” అని అడిగాడు రంగరాజు.
“ఇన్నాళ్లు ఏమి వెతుకుతున్నానో, నాకు అది దొరికింది” అన్నాడు భవాని.
“రాజు?”
“కాదు, రాణి“
“రాజూరాణీల కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఇంగ్లీషు వాళ్లు కలకత్తాలో Warren Hastings అనే వాడిని రాజుగా చేస్తున్నారంట.”
“నేనేమి వెతుకుతున్నానో నీకు అర్థం కాదు.”
“అయితే వెతుకుతున్నది దొరికిందా?”
“అది దొరికే వస్తువు కాదు. ఈశ్వరుడు ఉక్కుని మాత్రమే ఇస్తాడు. కానీ, ఆ ఉక్కుని ఐదేడు ఏళ్లు సాన పెట్టి పదునైన కత్తిని చేసే బాధ్యత మనది. ఈ ఇంటిలోకి నేను తప్ప ఎవరూ రావటానికి వీలు లేదు. లోపల ఒక అందమైన యువతి వున్నది.”
“మీ ఆజ్ఞ. రంగాపురం దగ్గర పన్ను వసూలీదారులని లూటీ చేశాము. ఆ విషయం గురించే మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను.”
“మంచిది. మరి ఆ పన్ను వసూలీదారుల దగ్గర లూటీ చేసిన డబ్బుని గ్రామ ప్రజలకు పంచగలవా?”
“పంచుతాను.”
*****
(సశేషం)
విద్యార్థి నా కలం పేరు. నేను పుట్టింది, పెరిగింది, విద్యాబుద్ధులు నేర్చుకున్నది విజయవాడలో. రైతు కుటుంబం. గత 30 సంవత్సరాలుగా కాలిఫోర్నియాలో కంప్యూటర్ ఇంజినీరుగా వృత్తి. ప్రవృత్తి ఫలసాయం. మూఢ నమ్మకాలు, స్త్రీ విజయం, నిజ జీవిత పోరటం సాగించే నాయికానాయుకలు మొదలైన సమకాలీన సామాజిక అంశాల గురించి అప్పుడప్పుడూ కథలు వ్రాస్తుంటాను.