నడక దారిలో-48

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ:-
       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజు గారికి కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం. మా జీవన గీతానికి పల్లవి చేరింది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, మా బాబు అనారోగ్యంతో చనిపోయాడు. ఆంధ్ర మహిళాసభలో బియ్యీడీ పూర్తిచేసి, ఆర్టీసి హైస్కూల్ లో చేరాను. వీర్రాజుగారు స్వచ్ఛంద విరమణ చేసారు. కొంత అనారోగ్యం. విజయవంతంగా నా ఎమ్మెస్సీ పూర్తిచేసాను. అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్ జరగటం, Y2K సంచలనం. కవయిత్రుల సంకలనం ‘ముద్ర ‘ సంపాదకత్వం. పల్లవికి పాప జన్మించటంతో మా అమెరికా ప్రయాణం, నా ప్రమోషన్ ప్రహసనం. తర్వాత—)

***

          మర్నాడు స్కూల్ ఉంది కనుక చీకట్లోనే లేచి హడావుడిగా బాత్రూమ్ లో దూరాను. ముఖం కడుక్కోటానికి బ్రెష్ మీద పేస్ట్ వేసుకొని పళ్ళు తోముకుని బ్రష్ నోట్లో వుంచుకునే టంగ్ క్లీనర్ షెల్ఫ్ లోంచి తీయబోయాను. బ్రష్ నోట్లోంచి జారిపోయింది.పెదాలతో పట్టి వుంచినా జారిపోయింది ఏమిటని ఆశ్చర్యపోయినా ఆలోచించే సమయం లేక పని పూర్తిచేసుకుని వంటింట్లోకి వంట చేయటానికి వెళ్ళాను. ముందుగా అలవాటు ప్రకారం గ్లాసు నిండా నీళ్ళు తీసుకుని తాగబోతే పెదాల చివర నుండి కారిపోతున్నాయి. నాకు ఏమీ అర్థం కాలేదు. ఆలోచించే సమయం లేదు. పని పూర్తి చేసుకుని బాక్స్ సర్దుకుని , కొంచెం టిఫిన్ హడావుడిగానే తినేసి బయట పడ్డాను. ఆటో ఎక్కి స్కూల్ కి వెళ్ళిపోయాను.
 
          ఎప్పటిలాగే రిజిస్టర్ తీసుకుని పదో తరగతి కి వెళ్ళాను.
 
          పాఠం చెప్తున్నప్పుడు పెదాలు రెండూ కలిపి వుచ్ఛరించే పఫబభమ అక్షరాలు పలకలేక పోవటం గమనించాను. పిల్లలకు అభ్యాసంలోని లెక్కలు చేయమన్నాను.
అంతలో ఇంటర్వెల్ కావటం, టీ వచ్చిందని స్టాఫ్ రూంకి వెళ్ళాను. మళ్ళా టీ తాగుతూంటే పెదాలు చివర కారిపోవడంతో ఆగిపోయి. పక్కనున్న ఉమని, ఎదురుగా వున్న బాలమణిని అడిగాను. వాళ్ళు నా ముఖాన్ని పరిశీలించి పెదాలు పారలైజ్ అయినట్లుంది అన్నారు.
 
          వెంటనే హెచ్చెమ్ దగ్గరకు వెళ్ళి వారం రోజులు సెలవు పెడుతున్నట్లు చెప్పాను.” నీ సిఎల్స్ అయిపోయాయి. స్పెషల్ లీవు కరెస్పాండెంట్ గారు సేంక్షన్ చేయాలి.” అంది. ‘తనకి నచ్చినవారికి నెలకి మూడునాలుగు రోజులుసెలవు ఎలా సేంక్షన్ చేస్తుంది ‘ మనసులోకి ఆలోచన వచ్చింది. కానీ ఆలోచించాలనిపించలేదు.
 
          లీవు లెటర్ రాసి ఇచ్చి మరో లెటర్ రాసి బేగ్ తగిలించుకుని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీసుకు వెళ్ళి మా కరెస్పాండెంట్ రామారావుగారిని కలిసి విషయం చెప్తే ” ఈ మాత్రం దానికి నా దగ్గరకు ఎందుకమ్మా రావటం అటెండర్ని పంపకపోయావా? రెస్ట్ తీసుకో ” అని లెటర్ మీద సంతకం పెట్టి ఇచ్చారు. దానిని నాతో వచ్చిన అటెండర్ కి ఇచ్చి పంపించి ఆటొ ఎక్కి ఇంటికి వెళ్ళాను.
 
          వీర్రాజు గారికి విషయం చెప్తే పొనుగోటి కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పారు. సాయంత్రం సైదాబాద్ పోస్టాఫీసు దగ్గర ఒక న్యూరో డాక్టర్ క్లినిక్ వుంది. అక్కడకు వెళ్ళాము.
 
          బీపీ ఎక్కువగా వుండటం వలనా, చెవిలోకి చల్లగాలి ప్రవేసించటం వలన ముఖ పక్షవాతం వస్తుందనీ డాక్టర్ చెప్పారు. స్టెరాయిడ్స్ టాబ్లెట్స్ రాసి ఒక్కో వారం డోసు తగ్గిస్తూ మూడు వారాలు వాడమన్నారు.పెదాలకూ, ముఖానికి చెందిన వ్యాయామం చెప్పారు. ఒకవారం తర్వాత ఎలావుంటుందో చెప్పమన్నారు.
 
          అదే విధంగా ఫేషియల్ ఎక్సర్సైజ్ చేస్తూ మందులు వాడే సరికి ఒక వారానికే చాలా వరకూ తగ్గింది.
 
          వారాంతానికి పల్లవి వాళ్ళు తిరుపతి నుండి వచ్చారు. నా అనారోగ్యం తెలిసి పల్లవి బాధపడింది. పర్వాలేదు తగ్గిందని చెప్పాను.
 
          తిరిగి పల్లవి కుటుంబం అమెరికా వెళ్ళిపోయారు. మళ్ళా మేము మా కార్యక్రమాలు యథావిధిగా షరామామూలే.
 
          వారం అయ్యాక నేనూ స్కూల్ కి వెళ్ళిపోయాను. నాకు స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ రావటం హెచ్చెమ్ జీర్ణించుకోలేక స్కూల్ లో అన్యాపదేశంగా ఏవైనా విసుర్లు అంటున్నా నేను పట్టించుకోవటం మానేసాను. టైముకు వెళ్ళి నా పని నేను చేసుకుంటు న్నాను.
 
          మరో రెండు నెలలు గడిచాయి.
 
          ఆ రోజు అజయ్ పుట్టినరోజు అని సాయంత్రం స్కూల్ నుండి వచ్చాక వీర్రాజు గారూ నేనూ కంప్యూటర్ సెంటర్ నుండి ఇంటర్నేషనల్ కాల్ చేయటానికి వెళ్ళాము. పల్లవి తీసింది. మేము విషెస్ చెప్పాలని ఫోన్ చేసినట్లు చెప్పాను. అయితే పల్లవి “అజయ్ లేడు . బిజీగా వున్నాం . తర్వాత ఫోన్ చేస్తానని పెట్టేసింది.
 
          ఎవరినో భోజనాలకు పిలిచారేమోలే అనుకున్నాము.
 
          మర్నాడు సాయంత్రం పల్లవి మామగారు ఫోన్ చేసి అజయ్ కి బాగులేదని హాస్పిటల్ లో చేర్చారని చెప్పారు. మా ఇద్దరికీ ఏమిటో అర్థం కాలేదు. పుట్టినరోజు భోజనం వలన ఏమైనా ఇబ్బంది ఏమో అనుకున్నాం. పల్లవి నుండీ ఫోన్ లేదు. ఆ మర్నాడు ఫోన్ చేసి ” అజయ్ కి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారని, అయితే సక్సెస్ కావచ్చు, లేదా జీవితాంతం డిజేబుల్ కావచ్చు అన్నారని ” చెప్పింది.” మీరేమీ కంగారు పడకండి ” అని తిరిగి మాకే ధైర్యం చెప్పింది.
 
          మా ఇద్దరికీ కాళ్ళూ చేతులు ఆడలేదు. రాత్రంతా కంటిమీద కునుకు లేదు. ఆపరేషన్ అయిందా? ఏమయింది? ఇదే ఆలోచన.
 
          మర్నాడు ఉదయం యథావిధిగా లేచి వంటకి అన్నీ సర్దుకుని. ఉప్మాకోసం రవ్వ వేయిస్తున్నాను. ఉషకి, ఉమకి ఫోన్ చేసి స్కూలుకు సెలవు పెడుతున్నట్లు చెప్పాను. ఇంట్లో వుంటే మరీ బెంగగా వుంటుందేమో స్కూల్ కి వచ్చేయ్ రాదా అంది ఉమ. కానీ వీర్రాజుగారు ఒక్కరే వుంటారు కదా అని చెప్పాను. ఆ ఫోన్ పెట్టేసిన మరో నిమిషానికి మళ్ళా రింగయ్యింది.
 
          చిన్నన్నయ్య ఫోన్ చేసి అజయ్ చనిపోయాడని, అతని తండ్రి ఫోన్ చేసాడని చెప్పాడు. అంతే కుప్ప కూలిపోయాను. అంతలోనే మా కన్నా ముందే వార్త అందిన చిన్న మరిది, తోటికోడలు వచ్చారు.
 
          ఇద్దరు పిల్లలు దూరమైనా మా ప్రాణాలు పల్లవి మీదే పెట్టుకుని బతుకుతున్నా ము. ఆ పిల్ల సప్తసముద్రాలకవతల తెలియని చోట ఎలా వుందో? మాకు కాళ్ళు చేతులు ఆడలేదు. పొనుగోటి కృష్ణారెడ్డి, నాళేశ్వరం శంకరం మొదలైన ఆత్మీయ మిత్రులు వచ్చారు.
 
          ఆ రోజంతా స్మశాన నిశ్శబ్దం. అమెరికా నుండి ఫోన్ వచ్చింది. కాని పల్లవి కాదు అజయ్ చెల్లెలి భర్త విషయం చెప్పాడు. పల్లవికి ఒకసారి ఫోన్ ఇవ్వమంటే నిద్ర పోతోంది. అన్నాడు.
 
          మేము అమెరికా వెళ్ళాలా? వాళ్ళే వస్తున్నారా ఏమీ తోచని తనం.
 
          మర్నాటికి మళ్ళా ఫోన్- అక్కడే అన్ని కార్యక్రమాలు చేసేస్తున్నామని. అప్పుడు కూడా పల్లవికి ఫోన్ ఇవ్వలేదు. పల్లవి ఎలా వుంది అంటే పడుకోనుంది అని చెప్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు.
 
          ఆ తర్వాతి రోజు కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత పల్లవి మాట్లాడింది. కాని వెంటనే కట్ చేసారు. నాకు అంతా అయోమయంగా అయిపోయింది.
 
          పల్లవి ఆడబడుచు భర్త ఫోన్లో మాట్లాడుతూ అక్కడ పల్లవి వాళ్ళు ఇల్లు ఖాళీచేసి వాళ్ళంతా బయలుదేరి విజయనగరం వస్తున్నారని, మధ్యలో హైదరాబాద్ లో ఒక మూడు గంటలు వెయిటింగ్ ఉందని, అక్కడ పల్లవి సూట్కెసులన్నీ ఎవరైనా వచ్చి కలెక్ట్ చేసుకోవాలని చెప్పాడు.
 
          వాళ్ళు విజయనగరం వచ్చే రోజుకు చేరేలా మేమిద్దరం, చిన్న మరిది, వీర్రాజు గారి మిత్రుడు సత్యనారాయణ, హైమా విజయనగరంకి బయలుదేరాం. పల్లవి సామాను ఎయిర్ పోర్ట్ కి వెళ్ళి పొనుగోటి కృష్ణారెడ్డి, నాళేశ్వరం శంకరం కలెక్ట్ చేసుకొని ఇంటికి చేర్చడమే కాక వాటికి కాపలాగా మేము వచ్చేవరకూ మా ఇంట్లోనే పడుకుంటామన్నారు.
 
          విజయనగరంలో స్టేషన్ కు దగ్గరగా హొటల్ లో మూడూ రూములు బుక్ చేయ మన్నాము. దారిలో రాజమండ్రిలో వీర్రాజుగారి బాల్య మిత్రుడు ప్రకాశరావు కూడా కలిసి మాతో వచ్చాడు.
 
          హొటల్ లో ఫ్రెష్ అప్ అయ్యి పల్లవి మామగారు రామారావు గారింటికి వెళ్ళాము. నన్ను చూడగానే దగ్గరకు వచ్చి “మీకు అన్యాయం చేసాను క్షమించండి” అన్నాడు కళ్ళనీళ్ళు పెట్టుకుని. క్షమించడం ఏమిటో అర్థం కాలేదు కానీ నేను దుఃఖంలో పట్టించు కోలేదు. తిరిగి హొటలుకు వచ్చేసాము. అక్కడకే అక్కలు ఇద్దరూ, వాళ్ళ పిల్లలూ, పెద్దన్నయ్య వచ్చి కలిసారు. 
 
          మర్నాడు ఉదయం స్నానాలు, టిఫిన్స్ ముగించి , మధ్యాహ్నం కూడా కాస్తంత తిని తర్వాత రామారావు గారింటికి మేమంతా వెళ్ళాము.
 
          మధ్యాహ్నానికి పల్లవీ, ఆషీ, పల్లవి ఆడబడుచు, ఆమె భర్తా వచ్చారు.
 
          పల్లవిని చూడగానే దుఃఖం పొంగి వచ్చింది. పల్లవిని దగ్గరకు తీసుకున్నాను.”
 
          అమ్మా ఆషీ ఎదురుగా ఏడవకమ్మా” అన్న పల్లవి మాటకి నిశ్చలనమైపోయాను. పల్లవిని చూస్తే దుఃఖం గడ్డకట్టి నిలువెల్లా శిలగా మారినట్లుకనిపించింది. అంతే నేనూ శిలనైపోయి ఆషీని ఎత్తుకున్నాను.
 
          తర్వాత రెండు రోజులకే చిన్నన్నయ్య కొడుకు భారవి పెళ్ళి విజయవాడలో జరుగు తుంది. అందుకని చిన్నక్క , పిల్లలూ వాళ్ళ కుటుంబాలు,పెద్దన్నయ్య కుటుంబం మర్నాడు విజయవాడకి బయలుదేరిపోయారు. నా మరిది కూడా  హైదరాబాద్ కి బయలుదేరి పోయాడు. ఆ తర్వాత కుటుంబంతో పెళ్ళికి విజయవాడ వెళ్తామన్నాడు. నాకు సాయంగా వుండటానికి పెద్దక్క పెళ్ళికి వెళ్ళనంది.పెద్దక్క కూతురు శ్రీదేవీ, ఆమె భర్త పల్లవికి సాయంగా వున్నారు.
 
          మర్నాడు దినాలకోసం అందరికీ పనులు పురమాయిస్తున్న రామారావుగారితో “రేపు మీ పూజలేవో మీరు చేసుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పల్లవికి ఏమీ చేయటానికి ప్రయత్నించవద్దు “అని ప్రకాశరావుగారి చేత చెప్పించాను. ఆయన సరేనన్నారు.
 
          ఆ రాత్రికి రామారావు గారింట్లోనే మేమూ, హైమా వుండిపోయాము. ఆ రాత్రి పడుకున్న సమయంలో రామారావుగారి తమ్ముడి భార్య వచ్చి నన్ను లేపి పల్లవి ఫొటో, జాతకం కాగితం నాకు ఇచ్చింది. ఇంత జరిగాక ఆ సమయంలో ఆవిడ అవి ఇవ్వటం ఎంత దుఃఖం వచ్చిందో అంత కోపం కూడా వచ్చింది. ఎప్పటిలాగే అన్నీ దిగమింగి అవి తీసుకుని బేగ్ లో పెట్టుకున్నాను. నిజానికి వాళ్ళే అవి చింపుతే చింపినా పర్వాలేదు కానీ ఇలా ఇవ్వటంలో అర్థమేమిటి. పల్లవి దురదృష్టజాతకురాలని ఎత్తిపొడవటమా? కళ్ళలో పొంగిన నీరు కళ్ళతోనే ఇగిరి పోయాయి.
 
          నాకు ఈ దశదినకర్మలు చేయటం నచ్చదు. మమ్మల్ని వాళ్ళు పాల్గొనేలా చేయ కుండా వాళ్ళే చేసుకున్నారు. పల్లవి లోపల బెడ్ రూములో వుంది ,పెద్దక్క కూతుళ్ళు ఇద్దరూ తన దగ్గరే వున్నారు. మౌనంగా ఆషీని ఒడిలో కూర్చోబెట్టుకొని శూన్య హృదయం తో ఆ కార్యక్రమం చూసాను. వీర్రాజుగారి మనసులో ఏముందో కూడా తెలియదు.
 
          ఆ సాయంత్రం ఆషీని, పల్లవిని మాతో హొటలుకు తీసుకెళ్తామని, అటు నుంచి అలాగే హైదరాబాద్ ఆ మర్నాడు వెళ్తామన్నాము.
 
          అక్కయ్య ఓసారి పల్లవిని గుడికి తీసుకువెళ్ళి అటు నుంచి వాళ్ళింటికి రమ్మని చెప్పింది. అలాగే పల్లవీ, ఆషీ, నేనూ , వీర్రాజుగారు కలిసి అమ్మవారి గుడికి వెళ్ళి పెద్దక్క ఇంటికి వెళ్ళి తిరిగి హొటలుకి వచ్చేసాము. మరిది వెళ్ళిపోయాడు కనుక వీర్రాజుగారు, ప్రకాశరావుగారు ఒక రూము షేర్ చేసుకున్నారు. పల్లవీ, ఆషీ నేను ఒక రూములో పడుకు న్నాము. ఆషీ ఈ హడావుడులకు అలసిపోయి తొందరగా నిద్రపోయింది.
 
          అప్పుడు పల్లవి ఒక్కొక్క విషయమే గుండెల్లోంచి తీసి చెప్తూ వుంటే నేను స్తంభించి మూగదానిలా అలా వుండిపోయాను.
 
          అజయ్ బాత్ రూమ్ లో ఆ రాత్రి పెద్ద రక్తపు వాంతి చేసుకుని పల్లవిని లేపి అంతకు ముందు జరిగిన ఆపరేషన్ ఫైల్ ఎక్కడుందో చెప్పి అంబులెన్స్ ను పిలవమని చెప్పాడట. హాస్పటల్లో డాక్టర్లు పల్లవిని పిలిచి అంతకుముందు చేసిన ఆపరేషన్ గురించి చెప్పి అది వన్ టైమ్ ఆపరేషన్ అనీ పదేళ్ళే లైఫ్ పిరియడ్ అనీ రెండవసారి ఆపరేషన్ చేసినా లాభం లేదని చెప్పారట. అంతే కాక ఈ విషయం నీకు ముందు తెలుసా తెలియదా అని అడిగారట.
 
          ” అమ్మా నీ పెంపకం వల్లే ఆ సమయంలో తట్టుకొని నిలబడగలిగాను” అని చెప్తుంటే నాకు గుండె పట్టేసినట్లు అయిపోయింది.
 
          పల్లవి పెళ్ళి అయిన మొదటిరాత్రి అయ్యాక నాతో “అజయ్ కి భుజం మీదుగా ఆపరేషన్ అయిన గుర్తు వుంది ” అని చెప్పినది గుర్తు వచ్చింది. అయితే సాధారణంగా పడిపోయి చర్మం చిట్లి ఏవో కుట్లుపడి ఉంటాయి అనుకున్నాను. కాని ఇంత జరిగింద నేది వూహించలేదు.
 
          రెండురోజుల క్రితం రామారావు నన్ను చూడగానే ” మీకు అన్యాయం చేసాను ” అంటూ క్షమాపణలు ఎందుకు కోరాడో అర్థం అయింది.
 
          తర్వాత పెద్దన్నయ్య కలిసి ” విషయం తెలియగానే రామారావు ఇంటికి వెళ్ళాను. అప్పుడే వచ్చిన ఎవరితోనో అజయ్ పన్నెండేళ్ళన్నా బతుకుతాడనుకున్నాను. కానీ డాక్టరు అన్నట్లు పదేళ్ళే బతికాడు అని చెప్తుంటే విన్నాను. మీకు పెళ్ళికి ముందు చెప్పలేదా ” అని అన్నాడు.
 
          అమెరికాలో అయితే మళ్ళా ఆపరేషన్ జరిగినా బతుకుతాడేమోననే వాళ్ళని బలవంతంగా అమెరికా పంపించి వుంటారనిపించింది.
 
          మాకు ఒక్కగానొక్క పిల్లని తెలిసీ, వాళ్ళకి అంతా తెలిసీ ఎంత మోసం చేసారు. అంతగా పెళ్ళి చేయాలనుకుంటే ఏ అనాధ పిల్లనో తెచ్చి చేసి ఇంట్లో పెట్టుకోవచ్చు కదా!
 
          నాకు పల్లవిని ఎలా ఓదార్చాలో కూడా తెలియలేదు. అయినా రాతి శిల్పంలా మారి పోయిన ఆ పిల్లని నేను ఓదార్చేదేమిటి? నేనుకూడా శిలనైపోవటమేతప్పా.          
 
          చిన్నన్నయ్య తన స్నేహితుడు, రామారావు గారి బంధువు అయిన సూర్యప్రకాశ రావు ద్వారా వచ్చిన సంబంధం ఇది. మరి ఈ విషయం చిన్నన్నయ్యకి తెలుసా?ఇప్పుడు చిన్నన్నయ్యకీ, నాకూ దూరం ఏర్పడింది. సమాధానం తెలుసుకో వీలులేని ప్రశ్న.
 
          అయితే నాకు ఒక సంశయం గుండెని కలత పెడుతూనేవుంది. దాంపత్యం అనేది ఇద్దరి మధ్య నమ్మకం అనే పునాది మీద నిలుస్తుంది. అజయ్ ఈ విషయం పల్లవికి ముందు వివరంగా చెప్పాడా, లేదా ? పల్లవిని అడగలేని ప్రశ్న.
 
          నాకు మనసు అంతా గందరగోళంగా అయిపోయింది. తర్వాత ఏమిటి అనేది తోచలేదు. కోర్టుకు వేస్తేనో అని ఒకసారి అనిపించింది. కానీ పిల్ల జీవితాన్ని రచ్చ చేసుకోవటం నాకు నచ్చలేదు. అలాగే కలత నిద్రతోనే రాత్రి గడిచి పోయింది.
 
          మర్నాడు మధ్యాహ్నం ట్రైనుకి హైదరాబాద్ బయలుదేరాము. కాని మేము చేరేది మంగళవారం అనీ, ఆ రోజుకి హొటల్ లో దిగి మర్నాడు ఇంటికి వెళ్ళమని చాలా మంది చెప్పారు. మాకు అటువంటి నమ్మకాలు లేకపోయినా ఆ పరిస్థితిలో ఏమీ ఆలోచించేలా లేము. అందుకని హైదరాబాద్ చేరాక అప్పటికే కృష్ణారెడ్డిగారూ, శంకరంగారూ కోఠీలోని హరిద్వార్ హొటల్ లో తీసుకున్న రూములలో దిగాము.
 
          కృష్ణారెడ్డి, నాళేశ్వరం శంకరం హొటలుకి వచ్చి కలిసారు. మర్నాడు ఇంటికి చేరాము. ఒక నాలుగురోజులు సెలవు పెట్టాను. బాగా దగ్గరవాళ్ళని తప్పితే కొంతమంది పరామర్శకి వస్తానని ఫోన్ చేస్తే ఈ విషయం ప్రస్తావించకుండా అయితేనేం రమ్మని నేను చాలా ఖచ్చితంగా చెప్పేసాను.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.