నా అంతరంగ తరంగాలు-22
-మన్నెం శారద
1986 లో అనుకుంటాను… నేను మయూరి వారపత్రిక తరపున కొంతమంది రచయితల్ని ఇంటర్వ్యూ చేసాను.
సహజంగా చాలామంది తాము ఇంటర్యూ చేయడం తక్కువగా భావించి ఒప్పుకోరు.
నిజానికి ఇంటర్వ్యూ చేసేవారు ఇంటర్వ్యూ చేయబడుతున్న వ్యక్తులు గురించి సమగ్రంగా తెలిసిన వారయి ఉండాలి.
లేకుంటే మన టీవీ ఏంకర్స్ లా జుట్టు సవరించుకుంటూ, కళ్ళు మెరపించు కుంటూ దిక్కులు చూడాలి.
మొత్తానికి పత్రిక యాజమాన్యం ఎవరెవర్నో సంప్రదించి వారు కాదనడంతో నా దాకా వచ్చారు.
నేను ఓకే చెప్పడంతో వారు నాకు ఒక లిస్ట్ ఇచ్చారు. దాని ప్రకారం వారి ఫోటోగ్రాఫర్ ని తీసుకుని సదరు రచయితల్ని ఇంటర్వ్యూ చేసాను.
ఒకరిద్దరు ఆఁ లిస్ట్ లో లేనివారు ఎడిటర్ ని బ్రతిమాలి బామాడి నన్ను ఇబ్బంది పెట్టి ఇంటర్వ్యూ చేయించుకున్నవారూ వున్నారు.
ఎప్పుడయితే ఆఁ ఇంటర్వ్యూ లు సక్సెస్ అయి మయూరి పత్రికకు మంచి గుర్తింపు వచ్చిందో సంపాదకులకు ఉత్సాహం రెట్టింపయి విజయవాడలో కూడా కొన్ని ఇంటర్వ్యూ లు చేయమని నన్నురిక్వెస్ట్ చేశారు.
అందులో పురాణం గారు, లత గారూ, కొమ్మూరి వేణుగోపాల రావు గారు ఉండడం నాకు ఎనలేని సంతోషంకలిగించి నేను అంగీకరించాను.
అక్కడ మా అక్కా వాళ్ళు ఉండడం వలన ఎక్కడ వుండాలీ అనే ఇబ్బంది కూడా లేదు.
అయితే లత (తేన్నేటి హేమలత )గార్ని ఇంటర్వ్యూ చేసాకా ఆమె నన్ను వదలలేదు. వారితో బాగా చనువు ఏర్పడింది.
కొమ్మూరి గారింటికి కలిసే వెళ్లాం.
మర్నాడు పురాణం గారిని నవభారత్ ప్రకాశరావు గారి (పబ్లిషర్ )ఆఫీస్ లోనే ఇంటర్వ్యూ చేసాను. మరి కొన్ని ఇంటర్వ్యూ లు అయ్యాక పురాణం గారు అకస్మాత్తుగా నన్ను సమరంగారిని ఇంటర్వ్యూ చేయమని అడిగారు.
నేను నిజం గానే కొంత ఇబ్బంది పడ్డాను. కారణంవారు సాహిత్యానికి సంబంధించిన వ్యక్తి కారు. వారు సెక్స్ కు సంబంధించిన పరిజ్ఞానం గురించి వివరించే డాక్టర్ గారు.
నేనేం అడగాలి. వయసురీత్యా కూడా నేనంత పెద్దదాన్ని కాదు.
చాలా ఇరకాటంలోపడ్డాను. పురాణంగారు కాకపోతే నేను ‘నో ‘చెప్పేదాన్నే. అప్పటికీ ఆ రోజు ప్రొద్దుటే కృష్ణా ఎక్సప్రెస్ కి నాకు టికెట్ వుంది అని చెప్పాను.
“నేను మార్పిస్తాను ” అన్నారు ప్రకాశరావు గారు. ఆయన పెద్దవారు, కాదనలేక పోయాను.
ఇక తప్పేది లేదనుకుని బాగా ఆలోచించి కొంత హుందాగా, శాస్త్రీయపరమైన ప్రశ్నల్ని తయారు చేసుకుని ఆయన్ని ఇంటర్వ్యూ చేసాను. సమరంగారు చాలా మంచి వ్యక్తి. గౌరవనీయులు. ఆయనా అంతే హుందాగా, చాలా చక్కగా జవాబులిచ్చారు.
ఇప్పుడు నా అసలు సమస్య మొదలయ్యింది.
ప్రకాశరావుగారు నాకు గోల్కొండ ఎక్సప్రెస్ కి టికెట్ తీసి నా చేతిలో పెట్టారు. నేను తెల్లబోయాను.
“ఇదేంటీ సర్, ఇది ఎవరన్నా గట్టిగా పిలిస్తే ఆగి పోతుంది. ఏ అర్ధరాత్రో సికింద్రాబాద్ చేరుతుంది. నన్ను రెసివ్ చేసుకోడానికి ఎవరూ లేరు” అన్నాను.
అప్పట్లో సెల్ ఫోన్స్ లేవుకదా.. ఇంట్లో Bsnl వారి ఫోన్ కూడా లేదు. అప్పట్లో దానికి చాలా డిమాండ్.
అంతకుముందే నా థ్రిల్లర్ నవల “పిలుపు నీ కోసమే ‘ కు బహుమతి వచ్చింది.
దానికి ప్రకాశరావు గారు నవ్వుతూ ‘థ్రిల్లర్ నవలా రచయిత్రికి భయమా?” అన్నారు.
గత్యంతరం లేక నేను గోల్కొండ కే బయలుదేరాను.
అసలే ఈ ట్రైన్ ఎప్పుడు చేరుతుందా దేవుడా అనుకుంటున్న నన్ను నా ఎదురుగా కూర్చున్న ఒక పల్లెటూరి స్త్రీ తన యక్ష ప్రశ్నలతో నా ప్రాణం తినడం మొదలెట్టింది
అయినా మొగమాటస్తురాలినేమో పరధ్యాన్నంగా జవాబులు చెబుతూనే వున్నా.
“మీ ఇంటికొస్తా నన్ను తీసుకెళ్ళు” అని పోరడం ప్రారంభించింది.
కన్నీళ్లు లేకుండా ఏడవడం ఎలానో తెలిసింది నాకు.
సరిగ్గా నేను అనుకున్నట్లుగానే ట్రైన్ 12.30 ప్రాంతంలో సికింద్రాబాద్ స్టేషన్ కి చేరింది.
నేను కంగారుగా దిగీదిగగానే ఒక ఆటో డ్రైవర్ నా దగ్గర గా వచ్చాడు, “ఎక్కడకి వెళ్లాలి “అని ఉర్డులో అడుగుతూ.
నా బుర్ర అసలు పనిచేసే స్థితిలో లేదు.
ఆటో డ్రైవర్ ట్రైన్ దగ్గరకే వచ్చేడేంటి అని ఏమాత్రం సందేహించకుండానే ఎర్రమంజిల్ కాలనీ అని చెప్పాను.
అతను ఏ బేరసారాలు ఆడకుండానే నా సూట్కేస్ అందుకుని ముందుకు నడిచాడు. నేను అతన్ని అనుసరించాను.
బేగంపేట్ మీదుగా వెళ్తే నిర్మానుష్యంగా ఉంటుందని ట్యాంక్ బండ్ మీదుగా వెళ్ళమన్నాను.’ అచ్చీ బాత్’ అని డ్రైవర్ ఆటో అటు మళ్ళించాడు.
కొద్దిసేపటికి నా ఆటోవెనుక ఒక ఫియట్ కారు లైట్ల కాంతి పడుతుండడం గమనించి వెనక్కు తిరిగిచూసాను.
ఆఁ కారు ఎంతకూ ముందుకి సాగడం లేదు. ఒకవేళ వెళ్లినా ఒక పక్కకు ఆగి తిరిగి మరలా నా ఆటోని ఫాలోకావడం మొదలుపెట్టింది.
ఆటో అతను చూస్తుంటే అతిమెల్లిగా నడుపుతున్నాడు.
“కొంచెం వేగంగా పోనివ్వు” అని రిక్వెస్ట్ చేసినా అతనలానే నడుపుతున్నాడు.
నా గుండె వేగంగా కొట్టుకుంటున్నది.
ఏడుపొస్తుంది. దిక్కుతోచడంలేదు.
లుంబిని పార్క్ సైడ్ వెళ్తే మరీ చీకటిగా ఉంటుందని లకడీకాపూల్ వైపు వెళ్ళమన్నాను.
ఆఁ కారు అలానే ఫాలో అవుతున్నది.
ఒకదశలో పోలీస్ స్టేషన్ దగ్గర ఆపమందామనుకుని మళ్ళీ ఆఁ టైం లో స్టేషన్ కి వెళ్లడం ఇష్టంలేక ఊరుకున్నాను.
ఆటో AC guards వైపు తిరిగి ఖైరతాబాద్ కు కనెక్ట్ అయ్యే రోడ్డులోకి వచ్చింది. ఆఁ రోడ్డు దాదాపుగా పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుంది.
ఎక్కువగా కేన్ ఫర్నిచర్ షాపులు, ఫన్షన్ హాల్స్ ఉంటాయి ఆఁ రోడ్డులో.
ఆఁ కారు కూడా నా ఆటో వెంటే మలుపు తిరిగింది.
ఆటో అతను ఎంత చెప్పినా స్లోగానే నడుపుతున్నాడు.
ఆఁ రోడ్డులో దిగి పారిపోయిన ఉపయోగం వుండదు. అరచినా ఎవరూ పలకరు.
అయినా అవసరమైతే దూకేయడానికి అటో చివరగా కూర్చుని అందరి దేవుళ్ళకి మొక్కుతున్నాను.
ఆఁ కారు దాదాపు నా ఆటో పక్క పక్కనే అలానే నడుస్తున్నది.
ఖైరతాబాద్ లోకి ఎంటర్ అయ్యాక బాగా లైట్లు వున్నాయి.
ఈనాడు ఆఫీస్, మా ఎర్రమంజిల్ బిల్డింగ్ దాటి ఎట్టకేలకు మా కాలనీ గేట్ లోకి ప్రవేశించింది ఆటో.
ఆఁ కారు కూడ కాలనీలోకి ప్రవేశించింది.
నేను మా క్వార్టర్స్ రాగానే ఒక్క ఉదుట్న ఆటోలోంచి జంప్ చేసి ఇంటి తలుపులు దబదబా బాదేను.
నేను చూస్తుండగానే ఆఁ కారు మా ఇంటి అవతలగా వుండే సర్కిల్ ని రౌండప్ చేసుకుని నా ముందుగానే తిరిగి గేట్లోంచి బయటకు వెళ్ళిపోయింది.
దాంతో ఖచ్చితంగా ఆఁ కారు నన్ను ఫాలో చేసిందని అర్ధమయిపొయింది.
వాళ్లెవరో నన్ను భయపెట్టాలని చేసిన పని అది!
అంత అవసరం దేనికి?
ఎవరికంత క్రిమినల్ బ్రెయిన్ వుంది?
చాలా ఏళ్ళు నాకది ఎంతకూ అర్థం కాలేదు. నేను గోల్కొండలో వస్తున్నట్లు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నది రూఢీ అయ్యాక నాకు అలా కారులో వెంబడించింది ఎవరో అర్ధమయ్యి చాలా జుగుప్స కలిగింది.
కానీ ఎన్ని తెలిసినా అలాంటి వారికే ఆరాధకులుంటారు.
అందులో ఎక్కువగా స్త్రీలు ఉండడం మరీ శోచనీయం!
ఇది నేను ఎప్పటికి మరచి పోలేని నా బిట్టర్ ఎక్స్పీరియన్స్!
*****
(సశేషం)
నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.