పనిచేస్తేనే పరమానందం!

(నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-మారోజు సూర్యప్రసాదరావు

          ఒక బహుళ అంతస్థుల అపార్ట్‌మెంట్‌లో ఐదవ అంతస్థులో వున్న డా॥నీరజ అనే నేమ్‌ప్లేటున్న రెండు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్‌ ముందు నిలబడి కాలింగ్‌బెల్‌ నొక్కాను.

          సరిగ్గా సమయం నాలుగు గంటలౌతోంది!

          ప్రధాన ముఖద్వారం తలుపు తీసుకుని ఓ మధ్యవయస్కురాలు వచ్చింది.
‘‘గుడ్‌ ఈవినింగ్‌ డాక్టర్‌ నీరజా!’’ ఆహ్లాదకర లేతరంగు చీరలో ప్రశాంతమైన వర్చస్సుతో అక్కడక్కడా నెరసిన జుట్టుతో కనిపించిన ఆమెను అప్రయత్నంగా విష్‌చేయకుండా వుండలేకపోయాను.

          ‘‘రండి! ప్రశాంతి ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌!. వెల్‌కమ్‌!’’ ఆమె ఆహ్వానించింది.

          ‘‘నేనే ప్రశాంతినని, జర్నలిస్ట్‌నని ఎలా గుర్తించారు డాక్టర్‌?’’ నా సందేహం తీర్చుకోవాలనుకోగానే చక్కని విశ్లేషణ ఇచ్చింది.

          ‘‘మీకిచ్చిన అపాయ్‌ట్‌మెంట్‌ సాయంత్రం నాలుగు గంటలకు! టంచన్‌గా నాలుగు గంటలకు కాలింగ్‌ బెల్‌ మోగగానే మీరొచ్చారని అర్థం. నిస్సందేహంగా మీరే ఆ ప్రశాంతి అని, ప్రశాంత వదనమున్న మీరే ఆమె అని ఊహించడం కష్టంకాదని’’ నీరజ వివరించింది.

          ‘‘మంచి సైకాలజిస్ట్‌ అనిపించుకున్నారని’’ అభినందించబోయాను.

          ‘‘మంచి సైకాలజిస్ట్‌ అనడం కంటే సైకాలజిస్ట్‌ అంటే బాగుంటుంది. సమయ పాలన, సమయస్ఫూర్తి, నిజాయితీ, నిబద్ధత, వృత్తిపట్ల అంకితభావం జర్నలిస్ట్‌కు, డాక్టర్లకు అత్యవసరమైనవి. రండి!. లోపలకు రండి!’’ అని డ్రాయింగ్‌ రూంలో నుండి హాల్లోకి ఆహ్వానించి, హాయిగా నన్ను కూర్చోమని సోఫా చూపించింది.

          హాల్లో గోడలు ఆహ్లాదకరమైన పెయింటింగ్స్‌తో కనువిందు చేస్తుంటే ఆపాతమధుర గీతాలు మనసును సేదతీరుస్తున్నాయి. హాల్లోంచి కనిపించే రెండు బెడ్‌రూమ్‌లు, కిచెన్‌ ఎంత పరిశుభ్రంగా ఉన్నాయో పరిచయం చేస్తున్నాయి.

          ఇంతలో రెండు కప్పుల్లో టీ తెచ్చి నాకొకటి ఇచ్చి తను కూడా సిప్‌ చేస్తూ ‘‘దిస్‌ ఈజ్‌ టైమ్‌ ఫర్‌ టీ’’ అంది.

          ‘‘నేనూ ఈ టైమ్‌లోనే టీ తాగుతాన’’ని అభినందనగా అన్నాను.

          సోఫాలో సర్దుకుంటూ ఒద్దికగా కూర్చొని టీ తాగుతుంటే నా ఇబ్బంది గమనించి ఆమె అంది…

          ‘‘రిలాక్స్‌డ్‌గా కూర్చోండి ప్రశాంతీ!. సాధారణంగా పేషంట్లను మాత్రమే డ్రాయింగ్‌ రూమ్‌లో కూర్చోబెడతాను. మీరు ఆత్మీయ సంభాషణ కోసం వచ్చిన ఆప్తులు! అందుకు హాల్లోకి తెచ్చాను. మీరు ప్రశాంతంగా ప్రశ్నిస్తే నేనూ అంతే ప్రశాంతంగా జవాబులిస్తానని’’ ఆత్మీయత కనబడిచింది.

          వెంటనే నా లాప్‌టాప్‌ ఆన్‌చేసి రికార్డింగ్‌ ప్రారంభించాను.

          ‘‘ఈ అపార్ట్‌మెంట్‌లో మీరొక్కరే వుంటున్నారా?’’ ఆమె సుమంగళి అవునో కాదో తెలుసుకోవాలని మొదటి ప్రశ్న వేశాను.

          ‘‘నేనొక్కదాన్నే కాదు. మేమిద్దరముంటాం! మా వారు న్యూరోఫిజీషియన్‌. ఉదయం తొమ్మిదింటికి హాస్పటల్‌కు వెళ్తే తిరిగి ఎప్పుడు వస్తారో తెలియదు. పొద్దున్నే పనిమనిషీ, వంట మనిషీ వస్తారు. ఉదయం తొమ్మిదిగంటలకు వారు బ్రేక్‌ఫాస్ట్‌ చేసి వెళ్లిపోతారు. లంచ్‌ క్యారియర్‌ సర్దుకుని నేను పదిగంటలకు హాస్పిటల్‌కు వెళ్లి మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చి లంచ్‌ చేస్తాను. మావారి కార్‌డ్రైవర్‌ నా దగ్గరకు వచ్చి క్యారియర్‌ తీసుకుని వెళ్లిపోతాడు. సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది వరకు హోమ్‌ క్లినిక్‌ నడుపుతాను. వీలుంటే ఇద్దరం కలిసి డిన్నర్‌ చేస్తాం. లేదంటే నేను డిన్నర్‌ చేసి చదువుకుంటాను. మా పని మనిషి దగ్గర, మా ఇద్దరి దగ్గర కీస్‌ వుంటాయి. ఎవరి పనికీ ఆటంకం రాకుండా ప్లాన్‌ చేసుకున్నాం’’ అని ఆమె వివరించింది.

          ‘‘మీకు అరవై సంవత్సరాలుంటాయా?’’ ఆమె వయసు అంచనా కట్టలేను.

          ‘‘లేదు ప్రశాంతీ! నాకు డెబ్బైరెండేళ్లు, మా వారికి డెబ్బై ఐదేళ్లు నిండాయి!’’ అని ప్రసన్నంగా జవాబిచ్చింది.

          ఆమె మాటకు ఆశ్చర్యపోయాను.

          ‘‘మిమ్మల్ని చూస్తే అలా అనిపించడం లేదే!’’ నమ్మశక్యం కాదనిపించింది. ‘‘దానికి కారణం చెబుతాను. ఉదయం ఆరుగంటల నుండి ఏడు గంటల వరకు ధ్యానం చేస్తాం. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పనిచేస్తూ వుంటాం. పని చేయడంలోనే సంతోషముందని భావిస్తాం! చురుకుగా పని చేస్తున్నంతకాలం వృద్ధాప్యం మన దరిదాపులకు రాదు. అందుకే మాకంత వయసుందని ఏనాడూ అనుకో లేదని’’ ముగించింది.

          ‘‘మీరు ఒంటరిగా వున్నారని పిల్లలెప్పుడూ అనుకోరా? తమ దగ్గరకు రావడం లేదని అనరా? ఏనాడూ పిల్లలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదని, బాగోగుల గురించి వాకబు చేయరని అనుకోరా?’’ ప్రశ్నించాను.

          ‘‘మంచి ప్రశ్న వేశారు ప్రశాంతీ! వృద్ధాప్యం శరీరానికే కానీ మనసుకు కాదుగదా! మాకు వయసైపోయిందనుకుంటే ఏమీ చేయలేము. వయసు ప్రభావం కొంత శరీరంపై పడడం సహజం. అయినా మా పిల్లలు మమ్మల్ని ఒంటరిగా వుండవద్దనే అంటారు. తమ వద్దకు రమ్మనమనే చెబుతారు. దూరదేశాల్లో వున్నవాళ్ల దగ్గర ఎలా వుంటాం. ఇక్కడున్న స్వతంత్రం అక్కడెలా వస్తుంది? అందుకే ఎప్పుడైనా అక్కడకు వెళ్లి వస్తుంటాం. మన ఇంట్లో వున్న సౌఖ్యం ఎలా వస్తుంది చెప్పండి?’’ ఎదురు ప్రశ్న వేసింది.

          నిజమే! ఇక్కడున్నంత ప్రశాంతత, స్వాతంత్య్రం పరాయివాళ్ల ఇంట్లో ఎలా వస్తాయి. కొడుకు ఇల్లైనా, కూతురు ఇల్లైనా ఒక్కటే… మన ఇల్లుకానప్పుడు!

          ‘‘కానీ చాలామంది పిల్లలు మమ్మల్ని పట్టించుకోవడంలేదని, గాలికి వదిలేశారని, అనాధల్లా వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారని బాధపడుతుంటారు. అది ఎంతవరకు సబబని భావిస్తున్నారని’’ ప్రశ్నించాను.

          ‘‘ఆ భావం రానంత సేపూ మనమెవరిమీదా ఆధారపడకుండా బతికేస్తాం! అయినా వాళ్లు మనల్ని ఎందుకు పట్టించుకోవాలి? ఎందుకు చూడాలి? వృద్ధాప్యంలో తల్లి దండ్రులను చూడాల్సిన బాధ్యత వారిది! మనల్ని వారు పట్టించుకునేలా పెంచామా లేదా అని ఆలోచించాలి. మన గురించి ఆలోచించేలా మన బాధ్యత మనం నెరవేరిస్తే వాళ్ల బాద్యత వాళ్లు చూసుకుంటారు. అంతా మన పెంపకంలో వుంటుంది. మనం మన పెద్దవాళ్ల బాధ్యత సక్రమంగా నిర్వహించినప్పుడు పిల్లలూ మన గురించి అలాగే ఆలోచిస్తారని’’ అద్భుత సందేశమిచ్చింది.

          పిల్లల పెంపకం అంతరార్ధం వివరించింది! రహస్యం విప్పి చెప్పింది! ‘‘ఎంత బాగా చెప్పారు డాక్టర్‌! మీ సంస్కారవంతమైన పెంపకంలో మీ పిల్లలు ఉన్నతంగా జీవిస్తుండా లని’’ ప్రశ్నార్ధకంగా ఆమె వైపు చూశాను.

          ‘‘మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి వున్నారు. బాబు స్వీడన్‌ స్టాక్‌హోమ్‌ సెంట్రల్‌ హాస్పటల్‌లో సర్జన్‌గా పనిచేస్తున్నాడు. కోడలు కూడా అదే యూనివర్సిటీలో మెడికల్‌ టెక్నాలజీలో యం.యస్‌. చేస్తోంది. వాడికి ఒకే అమ్మాయి! అది అక్కడే చదువుకుంటోందని’’ వివరించింది.

          అంత అత్యున్నత పదవులు నిర్వహిస్తున్న వారి గురించి ఎంత సింపుల్‌గా చెప్పింది.

          ‘‘మీ అమ్మాయి, అల్లుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారని’’ వారి వివరాలు రాబట్టుకోవాలని ఉత్సుకతతో అడిగాను.

          ‘‘మా అమ్మాయి పెన్సిల్వేనియా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్‌. మా అల్లుడు విస్కాన్‌సిన్‌ యూనివర్సిటీలో ఇంగ్లీషు ప్రొఫెసర్‌! తెలుగు అసోసియేషన్‌ సదస్సులో పరిచయమై ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వారికి ఒకబ్బాయి వున్నాడు. వాడూ అక్కడే చదువుతున్నాడని’’ చాలా నిరాడంబరంగా వివరించింది.

          డాక్టర్‌ నీరజ నిరాడంబరతకు మనసులోనే నమస్సులర్పించాను.

          ‘‘మీ పిల్లల గురించి ఎంత సింపుల్‌గా చెప్పారు డాక్టర్‌!’’ పైకే అనేశాను.

          ‘‘అవునమ్మా! మా బాధ్యత నెరవేర్చాం! వారి బాధ్యత తెలుసుకుని ఉన్నత శిఖరాలధిరోహించారు. ఇందులో మా గొప్పతనమేమీలేదు. ఈ సందర్భంలో నా పాజిటివ్‌ భావజాలానికి పునాది వేసిన డెబ్బైఏళ్ల మహిళా క్యాబ్‌డ్రైవర్‌ గురించి ప్రస్తావిస్తే బాగుంటదని’’ పిస్తోందని సందేహాస్పదంగా నావైపు చూసింది.

          ‘‘వ్వాట్‌! డెబ్పైఏళ్ల క్యాబ్‌డ్రైవరా? అందులోనూ మహిళా క్యాబ్‌ డ్రైవరా? ఇక్కడ జరిగే అవకాశం లేదు. ఎప్పుడు ఎక్కడ జరిగిందో మీరు చెబితే మీ మాటగా మా ప్రేక్షకులను చైతన్యపరుస్తానని’’ హామీ ఇచ్చాను.

          ‘‘మీరే అన్నారుగా… మన దేశంలో జరిగే ఛాన్సే లేదని! ఇది మా యూరప్‌యాత్ర స్విట్జర్లాండ్‌లో జరిగింది. మా వాడు స్టాక్‌హోమ్‌లో వుండగా మా ఇద్దరి బాధ్యతలు రెసిడెంట్‌ డాక్టర్లకు అప్పగించి నెల రోజుల యూరప్‌ ట్రిప్‌కి వెళ్లాం. ఎత్తైన ఆల్ఫ్స్‌పర్వత శిఖరాలను అధిరోహించి మూడు రోజుల బస తరువాత తిరిగి స్టాక్‌హోమ్‌కు బయలు దేరాం. అక్కడకు వెళ్లాలంటే ఏజెంట్‌బర్గ్‌కు వంద కిలోమీటర్ల దూరాన వున్న జ్యూరిచ్‌ విమానాశ్రయం నాలుగు గంటల్లో చేరుకోవాలి. అక్కడ సమయానికి ఫ్లైట్‌ అందుకుంటే స్టాక్‌హోంకి వెళతాం. మావాడు క్యాబ్‌ బుక్‌చేశాడు. ఘాట్‌రోడ్‌లో మలుపులు చూసు కుంటూ జాగ్రత్తగా కారు నడపాలి. బయలుదేరిన తర్వాత ఆ క్యాబ్‌ను నడిపే డ్రైవర్‌ మహిళ అని తెలిసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాం! నాలో ఉత్కంఠ పెరిగింది. కానీ వేగంగా అతి జాగ్రత్తగా పర్వత శ్రేణులు అంచుమీదుగా లోయలలోకి జారకుండా ఆమె డ్రైవ్‌ చేసే విధానం ముచ్చటేసింది. కావాలని పక్కనే కూర్చున నేనే ఆమెను మాటల్లోకి దింపాను.

          మా సంభాషణంతా ఇంగ్లీషులోనే సాగుతోంది.

          ‘‘మేడమ్‌! మీ వయసు ఎంత వుంటుందని’’ అడిగాను.

          ‘‘సెవెంటీ ప్లస్‌’’ అని ఏకాగ్రత చెడకుండా జవాబిచ్చింది.

          ‘‘ఈ వయసులో డ్రైవ్‌ చేస్తున్నారు. మీ పిల్లలు మీ బాగోగులు చూడరా?’’ ప్రశ్నించాను.

          ‘‘మా ఇద్దరి పిల్లలు మమ్మల్ని బాగానే చూస్తారు. మేం వారిని ప్రేమిస్తాం! కానీ ఎవరికి వారు తమ సంపాదనతోనే బతకాలి. అందరం పని చేస్తాం. సంపాదిస్తామని’’ జవాబిచ్చింది.

          ‘‘మీరంతా కలిసి వుండరా? విడిగా జీవిస్తారా?’’ మరో ప్రశ్న వేశాను.

          ‘‘అంతా కలిసే ఒకే ఇంట్లో వుంటాం! ఎవరి ఫ్యామిలీతో వారుంటాం! ఎవరి స్వాతంత్య్రం వారికుంటుంది! అలా వుంటేనే హ్యాపీగా వుంటామని’’ చక్కని సమాధాన మిచ్చింది.

          ‘‘ఈ వయసులో కూడా మీరు క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేయాలా?’’ ఆశ్చర్యంగా అడిగాను.

          ‘‘వైనాట్‌? ఎందుకు చేయకూడదు? వృద్ధాప్యం శరీరానికి కానీ మనసుకు కాదుగా! మనసు నిత్య యౌవ్వనంగా వుంటుంది’’ వృద్ధాప్య జీవన వేదం వినిపించింది.

          ‘‘మీవాళ్లు ఉద్యోగం చేయవద్దని అనరా?’’ ఓ ప్రశ్న సంధించాను.

          ‘‘ఉద్యోగం చేయకుండా మమ్మల్ని ఎవరూ ఆపరు! పని చేస్తున్నంత కాలం ఆరోగ్యంగా వుంటాం. ఆనందంగా వుంటామని మేమే ఇష్టంగా కష్టమనుకోకుండా పని చేస్తున్నామని’’ అద్భుతమైన జవాబిచ్చింది.

          ‘‘ఆస్తులేమీ లేక మీరిలా పనిచేస్తున్నారా?’’ నా ప్రశ్న నాకే వింతగా అనిపించింది!

          ‘‘మేముండే ఇల్లు మా స్వంతం! అందరం కలిసే కొన్నాం. బ్యాంక్‌ బ్యాలెన్స్‌లు వున్నాయి. వాహనాలున్నాయి. నేను నడిపే క్యాబ్‌ నా స్వంతం!’’ అని ఆనందం, ఆరోగ్య రహస్యాలు చెప్పింది.

          ‘‘ఆఖరుగా ఓ ప్రశ్న వేస్తాను. ఏమీ అనుకోరుగా?’’ సందేహంగా అని క్షణం విరామ మిచ్చాను.

          ‘‘మరి మీ వారేమి చేస్తుంటారు?’’ ఉండబట్టలేక అడిగాను.

          ‘‘మా వారు కూడా నాలాగే క్యాబ్‌ డ్రైవర్‌గా వున్నారు. జ్యూరిచ్‌ ఏంజెల్‌బర్గ్‌ ల మధ్య రవాణా కోసం అసోసియేషన్‌ వాళ్లు మాకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఎంతైనా పెద్దవాళ్లం కదా!’’ అని చిరునవ్వు నవ్వేసింది.

          నవ్వుతూ జీవన వేదాంతం వివరించింది.

          ఆమె సన్నిధిలో రెండు గంటలు సాగిన మా ప్రయాణం ‘అప్పుడే అయిపోయిందా’ అనిపించింది. ఆమెకు దిగిపోతూ ధన్యవాదాలు చెబితే… మన సంప్రదాయంలో చేతులు జోడించి నమస్తే చెప్పి మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసిందని’’ నీరజ గారు ముగించారు.

          ‘‘ఎంతగొప్ప సందేశమిచ్చారు డాక్టర్‌! మనదేశంలో ఇటువంటి సందేశాలెందుకు ఆవిర్భవించవో అర్ధం కావడంలేద’’ని సందేహంగా అన్నాను.

          ‘‘ప్రశాంతీ…! ఒకానొకప్పుడు ఇటువంటి వాతావరణమే మన జీవన విధానంలోనూ కనిపించేది. ఎక్కడకు వెళ్లాలన్నా నడిచివెళ్లేవాళ్లు. దూరమైతే ఎడ్లబండిలోనో, జట్కా బండిలోనో వెళ్లేవారు. నాడు కరెంట్‌ ఉండేది కాదు. కోడిగుడ్డు దీపాలు, లాంతర్లతో రాత్రి గడిపేవారు. రాత్రి ఎనిమిదింటికల్లా భోజనాలు ముగించి పడుకొని, తెల్లవారుజామున కోడి కూయగానే లేచేవారు. ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకుని బావిదగ్గర స్నానం చేసే సరికి సూర్యోదయమయ్యేది. దైవకార్యం ముగించుకుని చద్దిఅన్నం మూటకట్టుకుని పనిమీద బయలుదేరేవారు. దారిలో బావి దగ్గరో చెరువు దగ్గరో భోంచేసి తిరిగి రాత్రికి ఇంటికి చేరేవారు. మానసిక చైతన్యంతో బాటు శారీరక శ్రమ కలగడంతో స్నానం చేసి, భోజనం తర్వాత హాయిగా నిద్రపోయేవారు. సూర్యోదయానికి ముందే దినచర్య మొదలయ్యేది’’ అని డాక్టర్‌ నీరజ నాటి వాతావరణం కంటిముందు చూపించారు.

          ‘‘అవునండీ! అప్పుడు ఆడవారు కూడా చాలా చురుకుగా వుండేవారని, రోగాలు రొష్టులూ వుండేవి కావంటారు. నిజమేనా!’’ అని అనుమానంగా అడిగాను.

          ‘‘అవునమ్మా! ఉదయం లేచి వాకిలి ఊడ్చి కళ్లాపి చల్లిన దగ్గర నుండి ముగ్గుతో మొదలైన వారి శారీరక శ్రమ విశ్రమించేది రాత్రికే! ధాన్యం దంచడానికి రోకలీ రోలు, పిండి రుబ్బడానికి రోలూ పొత్రం, పిండి పట్టడానికి తిరగలి… ఇత్యాది బరువైన సాధన సామాగ్రి వుపయోగించి కట్టెల పొయ్యి మీద కుండల్లో, పాత్రల్లో వంట చేసేవారు. ఉదయాన్నే చద్దన్నంలోకి ఊరగాయ, మాగాయ, చింతకాయ మొదలైన అనేక పచ్చళ్లు చేసేవారు. శనివారం ఏకభుక్తం కోసం దిబ్బరొట్టె, ఉప్పుడు బియ్యం, పులిహోర లాంటి వంటలు చేసేవారు. సాయంత్రం కాగానే కోడిగుడ్డు దీపాలు, లాంతరు గ్లాసులు శుభ్రం చేసి నిండుగా కిరోసిన్‌ పోసి వెలిగించేవారు. ఆ వెలుగులో రాత్రి గడిపేవారు. నాడు కష్టించి పనిచేయడంలో సుఖముందని గ్రహించడంలో జబ్బులేవీ దరి చేరేవికావు. ఆడా మగ, పిల్లా జెల్లా అంతా కష్టపడి పనిచేసి ఫలితం సాధించేవారు. ఫలాలు అందుకునే వారని’’ ముగించింది.

          ‘‘అవును డాక్టర్‌… నాడు అన్నీ ఉమ్మడి కుటుంబాలు కావడంతో ఎవరి పనులు వారు చేసేవారు. బాధ్యతలూ, బాధలూ పంచుకునేవారు. ఒకరికి కష్టం వస్తే అందరూ కలసి నివారించేవారు. కనుక నాడు శారీరక, మానసిక రుగ్మతలు లేవు. సాంకేతిక విప్లవంతో అధునాతన సౌకర్యాలతో మైమరచిపోయి మానవ సంబంధాలకు వీడ్కోలు చెప్పేశారు. ఒంటరి జీవితాలలో ఒత్తిడిని అధిగమించలేక అర్థాంతరంగా అంతర్ధానమౌతున్నారు. కొద్దిగా మేల్కొన్నవారు నడక, వ్యాయామం, జిమ్‌ల చుట్టూ తిరుగుతూ పని చేయడం మరచిపోయినా శారీరక శ్రమ పొందుతున్నారు. మానసిక విశ్రాంతి కోసం యోగా, మెడిటేషన్‌, ప్రాణాయామాలు చేస్తూ జీవనప్రమాణం పెంచుకోవాలని తాపత్రయ పడుతున్నారని’’ సాలోచనగా అన్నాను.

          ‘‘నిజమే ప్రశాంతీ! కాలగమనంలో మాట్లాడడానికి తీరిక లేక భోజనం చేసే వ్యవధి లేక రెడీమేడ్‌ ఆహారంతో ఉరుకుల పరుగుల జీవితంలో ఇరవైకేఅరవైఏళ్లు తెచ్చుకుంటు న్నారు. ఉన్నస్థాయిని మరచిపోయి గొంతెమ్మ కోరికలతో విశాలమైన విల్లా, గ్రీన్‌కార్టు, అత్తామామ, ఆడబడుచులు, బావమరుదులు లేని సంబంధం తమ కుమార్తెకు కావాలని అనుకోవడంతో పెళ్లిళ్లు కావడంలేదు. తమ ఒక్కగానొక్క వరప్రసాదుకు కోటీశ్వర ఉద్యోగస్తురాలు భార్యగా రావాలని తపనపడడంతో ముదిరిన బెండకాయల్లా అబ్బాయిలుండిపోతున్నారు. ఈ గగన కుసుమాల ఆశలతో యాభై ఏళ్లకే మా పని అయిపోయిందని, వృద్ధాప్యం వచ్చేసిందని అనుకుంటున్నారే కానీ ఇంకా ముప్పై, నలభై ఏళ్ల జీవితం ముందుందని ఊహించరు!’’ నీరజ ముగించింది.

          ‘‘అవును డాక్టర్‌! పని చేయకుండా ఉండాలని, ఉచితంగా ఆహారం, నివాసం వైద్య సదుపాయాలు వరాలుగా ప్రభుత్వాలు అందిస్తుంటే మందులకు, మత్తు పదార్థాలకు అలవాటుపడి జీవనకాలాన్ని వారికి వారే కుదించుకుంటున్నారు. అందుకే పిల్లలు పట్టించుకోకపోవడమే సబబనిపిస్తుంది. అన్నట్లు… మీ పిల్లలెప్పుడైనా ఫోన్‌ చేసి మీ క్షేమసమాచారాలు అడుగుతుంటారా!’’ తెలుసుకోవాలనిపించింది.

          ‘‘ఫోన్‌ చేస్తుంటారు ప్రశాంతీ! ప్రతీ శనివారం వాళ్లే ఫోన్‌ చేస్తారు. అన్నట్లు… ఈ రోజు శనివారం గదా! ఫోన్‌ రావాలి’’ అని డాక్టర్‌ నీరజ అంటుండగానే టీపాయ్‌పై నున్న ఆ ఫోన్‌లో ఫ్లాష్‌ వెలుగులో స్వీడన్‌ అక్షరాలు దర్శనమిచ్చాయి.

          ‘‘మా మనుమరాలు, అబ్బాయి కూతురు ఫోన్‌ చేస్తుంది. మీకు అభ్యంతరం లేకపోతే దానిని చూపిస్తానని’’ స్పీకర్‌ ఆన్‌ చేసింది.

          ‘‘గుడ్‌ మార్నింగ్‌ గ్రాండ్‌మా! ఎలా వున్నావు? గ్రాండ్‌ పా ఎలా వున్నార’’ని చక్కని స్వచ్ఛమైన తెలుగులో పలకరిస్తోంది.

          ‘‘నేను బాగున్నానురా! అమ్మా నాన్నా ఎలా వున్నారురా! ఏం చేస్తున్నారు?’’ కుశల ప్రశ్నలడిగాను.

          ‘‘వీకెండ్‌ కదా! అందుకే ఇంకా నిద్రలేవలేదు! నాకు మెలకువ వచ్చింది. నీకు ఫోన్‌ చేయాలనిపించి చేశాను. ఏమీ డిస్టర్బ్‌ చేయలేదుగా!’’ అడిగింది.

          ‘‘లేదురా! జర్నలిస్ట్‌ ఆంటీ ఇంటర్వ్యూకని వస్తే మాట్లాడుతున్నాను. నువ్వు చూస్తావా? మాట్లాడతావా?’’ నన్ను ఫోకస్‌ చేసి అడిగింది.

          ‘‘హాయ్‌ ఆంటీ! ఎలా వున్నారు? మీతో మాట్లాడుతున్నంత సేపూ మా గ్రాండ్‌మా మాతో మాట్లాడదు. మా దగ్గరకు రమ్మనమంటే రాదు. మాతోనే ఉండమంటే ఇద్దరూ వుండరు. మేమంటే ప్రేమ లేదు. షి డోంట్‌ వాంట్‌ టు బి విత్‌ అజ్‌! మీరైనా చెప్పండి. మా దగ్గరకు రమ్మనమని’’ అంత అద్భుతంగా నానమ్మ మీద ఫిర్యాదు చేస్తుంటే ఆనందం, ఆశ్చర్యం కలిగింది.

          నేను అడగవలసిన ప్రశ్నలన్నీ ఆ పాపే అడుగుతోంది. నేను ఇబ్బందిగా కదలడం చూసి డాక్టర్‌ సెల్‌ఫోన్‌ ఫోకస్‌ మార్చారు.

          ‘‘ఏమిటే నా మీద కంప్టైంట్‌ చేస్తున్నావ్‌? నేనూ, తాతగారూ డాక్టర్లం! చూడాల్సిన పేషెంట్లుంటారు. వారిని మరో డాక్టర్‌కు అప్పజెప్పి రావాలి. వీలు చూసుకుని వస్తాంలే! అమ్మా నాన్నా లేవగానే నేను అడిగానని చెప్పమని’’ సంభాషణ తుంచేసేంతలో పాప అంది.

          ‘‘సరే గ్రాండ్‌మా. వీలున్నప్పుడు రండి. బై బై ఆంటీ!’’ నాకూ టాటా చెప్పింది.

          ‘‘సరిగ్గా శనివారం ఇదే సమయానికి మనవరాలు ఫోన్‌ చేస్తే, తరువాత మనవడు యు.ఎస్‌. నుండి మాట్లాడతాడనగానే ఆమె సెల్‌ఫోన్‌లో కాల్‌ ఫ్రం యు.ఎస్‌ అని ఫ్లాష్‌ వెలిగింది.

          ‘‘అమ్మమ్మా…! ఎలా వున్నావు? తాతగారెలా వున్నారని’’ తెలుగులోనే మనవరా లిచ్చిన కంప్లైంట్‌నే మనవడూ వినిపించాడు.

          ‘‘ఇప్పుడు వింటర్‌ గదా! సమ్మర్‌లో వస్తాంలేరా! ఫోన్‌ చేస్తామని’’ చెప్పి ఆమె సంభాషణ ముగించగానే ఆఖరి ప్రశ్న వేశాను.

          ‘‘డాక్టర్‌… వృద్ధులంతా పిల్లల పెంపకం కోసం తామంతా ఎంత జీవితం కోల్పోయా మో, ఎన్ని కష్టాలను అనుభవించామో తలచుకుని బాధపడుతుంటారు. వారికేమని సందేశమిస్తారని’’ అడిగాను.

          ‘‘అలా బాధపడవద్దని అంటాను ప్రశాంతి! రెక్కలు రాగానే పిల్ల పక్షి తల్లిని వదిలేస్తుంది. సృష్టిలో ఏ జీవీ కలకాలం తమ తల్లిదండ్రుల వద్ద వుండవు. పిల్లలు రెక్కలొచ్చి, వాళ్ల సంసార బాధ్యతలలో మునిగి వున్నారని, మన జీవితం మనదని పెద్దవాళ్లు అనుకుంటే ఏ బాధా వుండదు. వీలైనప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్లిరావచ్చు! మేం ఆ సిద్ధాంతానికి కట్టుబడి వున్నాం. ఆనందంగా, ఆరోగ్యంగా వున్నాం! ఇది నేనెరిగిన జీవితసత్యమని’’ డాక్టర్‌ నీరజ ఇంటర్వ్యూ ముగించింది.

          ఆమె ఇంటర్వ్యూ చేసిన రికార్డింగ్‌ను సేవ్‌ చేసి లాప్‌టాప్‌ మూసి, వీడ్కోలు తీసుకుం టుంటే శీర్షిక స్ఫురించింది.

‘పనిలోనే పరమానందం’ అని!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.