పోలీసులు రక్తం చిందేలా హింసించినా రక్తంలో ఇంకిపోయిన భావజాలాన్ని వదులుకోలేదు. 1948 జూన్ 1 న బుద్ధవరంలో ఆయన్నిఎస్.పి.థామస్ అరెస్ట్ చేసి, రహస్య సమాచారం చెప్పించడానికి స్పెషల్ ఆర్మ్ డ్ పోలీస్ చేత చిత్ర హింసలు పెట్టిస్తే ” నువ్వు నాకు శత్రువు. నీకు చెప్పేదేంటి ? ” అంటూ స్పృహ కోల్పోయారు. అంతకు పూర్వం కూడా (1932 ఏప్రిల్ లో) వ్యష్టి సత్యాగ్రహం సందర్భంగా కరపత్రాలు పంచిన సందర్భంలో వైట్ సార్జెంట్( యూరోపియన్ కెప్టెన్ ) కొట్టిన దెబ్బలకు నోటివెంట నురుగూ, రక్తం కక్కుకుని చిత్రహింసలు అనుభవించారే కానీ తన మార్గాన్ని విడిచి పెట్టలేదు. ఆయనే ఆదర్శ విప్లవకారుడు శ్రీ మద్దుకూరి చంద్రశేఖరరావు. ఆంధ్రదేశంలో కమ్యూనిస్ట్ పార్టీకి పునాదులు వేసినవారిలో సుందరయ్యగారూ, కంభంపాటి సత్యనారాయణగారూ వంటి ప్రముఖులతో పాటు ఈయన కూడా ఉన్నారు.
తొలి అడుగులు : 1928లో సైమన్ కమిషన్ కు నిరసన తెలపడానికి యువకు లను సమీకరించడంతో తొలి అడుగు వేశారు. 1929లో గాంధీజీ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా ఆయన చేసిన జాతీయోద్యమ ప్రబోధంతో ఉత్తేజితులయ్యారు. 1930లో సత్యాగ్రహంలోనూ, విదేశీ వస్త్ర బహిష్కరణలోనూ పాల్గొనడం, హరిజనుల దేవాలయ ప్రవేశానికి కృషిచేయడం వంటివి గాంధీజీ ప్రభావంతో చేసిన చంద్రంగారు పుట్టింది కృష్ణా జిల్లా, గుడివాడ తాలూకా వెంట్రప్రగడలోని సామాన్య రైతు కుంటుంబంలో. చదివింది మెకానికల్ ఇంజనీరింగ్. తండ్రి సుబ్బయ్య తల్లి పూర్ణమ్మ.
దిశను మార్చిన కమ్యూనిజం: 1930-32 సం.లలో విప్లవకారుల పరిచయంతో మార్క్సిజాన్ని అధ్యయనం చేసి విడుదలైన వెంటనే రాష్ట్రంలో కమ్యూనిస్ట్ ఉద్యమస్థాపనకు నడుంకట్టారు.
సంపాదకత్వం: 1937లో ఆ నాటి పార్టీ పత్రిక ‘నవశక్తి’ ప్రారంభమైనప్పటి నుంచీ రెండవ ప్రపంచయుద్ధ కాలంలో ప్రభుత్వం నిర్బంధంగా పత్రికను మూసేసే వరకూ. 1939-42ల నాటి కమ్యూనిస్ట్ పార్టీ రహస్య పత్రిక ‘స్వతంత్ర భారత్ ‘ కీ ‘1942-45 లలో వారపత్రికగా మొదలై 1946 లో దినపత్రికగా మారేవరకూ ‘ప్రజాశక్తి’కీ 1952 నుంచి 1957 వరకూ ‘ విశాలాంధ్ర ‘ దినపత్రికకు సంపాదకత్వ బాధ్యతను నిర్వహించారు.
జైలు జీవితమూ, శిక్షలూ: ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రాజమండ్రి సెంట్రల్ జైలులో 3 నెలలు కఠినశిక్ష అనుభవించారు. ఆ తరువాత రహస్య కరపత్రాలు పంచినందుకు బుడమేరు పాయలలో వైట్ సార్జెంట్ ( యూరోపియన్ కెప్టెన్ ) చేతిలో హింసను అనుభవించి నోటి నుంచి నురుగూ రక్తమూ కక్కుకున్నారు. అనంతరం గుడివాడ డెప్ట్యూటీ కలెక్టరు విధించిన రెండేళ్ల కఠిన శిక్షను అనుభవించారు. వ్యష్టి సత్యాగ్రహంలో 2 ఏళ్ళూ , 1948 లో కొంతకాలం జైలు శిక్ష అనుభవించారు. 1939-42 మధ్య అజ్ఞాతవాసం గడిపారు.
పార్టీ నిర్మాణంలో : 1951 నుంచీ 1956 వరకూ రాష్ట్ర కమ్యూనిస్టు కమిటీ కార్యదర్శిగా 1948 నుండి 51 వరకూ అఖిల భారత పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా 1964 నుండి 76 వరకూ రాష్ట్రసమితి సభ్యులుగా, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులుగా ఉన్నారు. ఆయన సతీమణి పుణ్యావతితో కలిసి 1968 లో మంగోలియా జాతీయ దినోత్సవాలకు హాజరై , సోవియట్ యూనియన్ లో పర్యటించారు. పార్టీలో తీవ్ర అభిప్రాయభేదాలు వచ్చినపుడు ఐక్యతను కాపాడటానికి శాయశక్తులా కృషి చేశారు.
సాహితీసేవ: మార్క్సిస్టు దృక్పథంతో విమర్శ వ్యాసాలు రాయడంతోబాటు కందుకూరి, గురజాడ, చిలకమర్తి, గిడుగువంటివారి సంప్రదాయాలను కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి తీసుకురావడంలో చంద్రంగారు ప్రముఖ పాత్ర నిర్వహించారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య పదవులపట్ల అనాసక్తి: 1962లో చంద్రంగారిని రాజ్యసభకు పంపాలన్న ప్రతిపాదనను ఆయన వ్యతిరేకించారు.
పార్టీలో ముఠాతత్త్వం వచ్చాక తానేమీ చేయలేని పరిస్థితిలో కర్నూలు జిల్లాలో కొంతభూమి కొని ( తనభూమిని ఎప్పుడో పార్టీకిచ్చేశారు) వ్యవసాయం చేసుకుంటూ అక్కడే చిన్న పార్టీ యూనిట్ ని నిర్మించారు.
” నేడు మనం బూర్జువా ప్రజాస్వామ్యంలో ఉన్న పరిస్థితుల్లో ప్రతి కమ్యూనిస్ట్ కూడా చంద్రం గారి గుణగణాలను సదా దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకు ఈ బూర్జువా ప్రజాస్వామ్యంలో ఉన్న పంకిలం అంటకుండా మనం కాపాడుకోగలుగుతాం” …. “నాయకుడన్నవాడు సామాన్యపార్టీ సభ్యుడుగా ఉండటం చాలా కష్టం. కానీ చంద్రంగారు అది సాధ్యమని ఆచరణలో రుజువు చేసారు” – చండ్ర రాజేశ్వరరావుగారు.
ఈ విషయాలు “చంద్రం వ్యాసావళి” అనే పుస్తకంలోవి.
మద్దుకూరి చంద్రశేఖరం (00-00-1907—26-07-1974)గారి వర్ధంతి
*****