యాత్రాగీతం
హవాయి దీవులు – మావీ ద్వీపం (భాగం-3)
రోజు -3
-డా||కె.గీత
మూడవ రోజు మావీలో ప్రసిద్ధి గాంచిన చారిత్రాత్మక ప్రదేశమైన “లహైనా” లో రకరకాల యాక్టివిటీస్ కోసం ఉదయానే బయలుదేరాం. ఉదయం అల్పాహారం కోసం కూడా లహైనాకే వెళ్లాలని నిర్ణయించుకున్నాం. 9గం.ల ప్రాంతంలో డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ సందర్శన, జిప్ లైన్, ఆక్వా బాల్ వంటి సాహసాలు బుక్ చేసుకున్నందున 8 గం.లకే రిసార్టులో బయలుదేరాం. అయితే ఆ రోజు అనుకోకుండా జరిగిన ఓ సంఘటన మొత్తం ఆ ప్రయాణాన్నే అస్థిమితం చేసింది.
సరిగ్గా బయలుదేరే ముందు నేను వంగి సూట్ కేసులో నుంచి ఏదో తియ్యబో యాను. ఒక్కసారిగా నడుము ఎముకల్లో నుంచి ఒక వేడి బెలూన్ పగిలినట్లు అనిపిం చింది.
అంతే, ఇక అడుగు తీసి అడుగు వెయ్యలేక పోయాను. ఏమైందో అర్థమయ్యేలోగా షార్ప్ పెయిన్ ప్రారంభమైంది. అక్కణ్ణించి ఆ ప్రయాణమంతా జీవితంలో ఎప్పుడూ పడని కష్టంపడ్డాను.
పావుగంట దాటినా నా పరిస్థితి మెరుగు పడకపోవడంతో, “ఆ రోజు ప్రోగ్రాం మొత్తం మానేద్దామా?” అని అంతా ఆలోచించసాగేరు. పోనీ “నేను ఒక్కదాన్నీ రిసార్టులో ఉండి పోదామా” అని నేను ఆలోచించసాగేను. ,మొత్తం ప్రోగ్రాం మానేసినా, నేను వాళ్ళతో వెళ్లకపోయినా అంతా నిరుత్సాహపడి పోతారు. ఎంతో ఉత్సాహంగా హవాయి యాత్రకి వచ్చిన కుటుంబసభ్యుల్ని నిరుత్సాహపరచడం ఇష్టం లేక, ఇక నేనే అందరికీ ధైర్యం చెప్పి మందులేవో వేసుకుంటే తగ్గిపోతుందని ధీమాగా బయలుదేరదీశాను. అన్నానే గానీ అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతున్నాను. రూము నించి అతిమెల్లగా నొప్పి ఉగ్గబట్టుకుని, అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి కారులో కూర్చునేసరికే చాలా ప్రయాసపడ్డాను.
మా రిసార్టు చుట్టుపక్కల మందుల దుకాణాలు ఏవీ లేవు. మేం టూరు బుక్ చేసుకున్న లహైనా ఊళ్ళో వాల్ గ్రీన్స్ మందుల దుకాణంలో తప్పకుండా పెయిన్ కిల్లర్స్, నడుము బెల్టు వంటివి దొరుకుతాయి కాబట్టి నేను రావడమే మంచిదని అంతా సమాధానపడ్డారు.
అందరం మెడికల్ షాపుకి వెళ్లొచ్చి, బ్రేక్ ఫాస్టు చేసేందుకు సమయం లేక, ముందు పిల్లల్ని బ్రేక్ ఫాస్టు కోసం కనబడ్డ మొదటి దుకాణం దగ్గిర దించి, సత్య, నేను వాల్ గ్రీన్స్ కి వెళ్ళొచ్చాము. అక్కడా అదే పరిస్థితి. సత్య చెయ్యి పట్టుకుంటే మెల్లిగా అడుగు తీసి అడుగు వేస్తూ కావాల్సినవి కొని తెచ్చుకున్నాం. నేను బిస్కెట్ల వంటివేవో కాస్త తిని, టాబ్లెట్లు వేసుకుని, నడుముకి కొనుక్కున్న గట్టి పట్టీ వేసుకున్నాను.
అక్కణ్ణించి తిన్నగా నిర్ణీత సమయానికి “డ్రాగన్ ఫ్రూట్ ఫామ్” కి వెళ్లాం. దాదాపు రెండు మూడు ఎకరాల్లో కొండ పాదమ్మీద ఉంది ఆ ఫామ్. ఎంట్రెన్సులో కారు పార్కింగ్ నించి ఫామ్ అంతా నడిచి తిరగాల్సి ఉంది. ఇంతలో మా అందరికీ ఫామ్ చూపించడానికి గైడు వచ్చాడు. ఇక అందరినీ అతనితో ముందు నడవమని, టాబ్లెట్లు వేసుకున్నా కదా అని ధీమాగా, మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నడిచాను అంత షార్ప్ పెయిన్ తోనూ.
కానీ రెండు మలుపులు తిరగగానే ఇక ఫామ్ మొత్తం తిరిగి చూడలేకపోయాను. ఇక అక్కణ్ణించి ఏమీ చెయ్యకుండా కూర్చోక తప్పింది కాదు. ఆ ఫామ్ మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలట.
వీళ్లంతా ఫామ్ అంతా తిరిగి చూసేక జిప్ లైన్, ఆక్వా బాల్ సాహసాలు చెయ్య సాగేరు. ఇవన్నీ కనబడే చోట నాకొక కుర్చీ వేశారు. అదృష్టం కొద్దీ కదలకుండా ఉన్నంతసేపు బానే ఉంది. ఇక నాతో బాటూ ఏ యాక్టివిటీస్ చేయనని పేచీ పెట్టి సిరి కూడా ఉండిపోయింది.
జిప్ లైన్ అనేది ఫామ్ లో ఆ చివరి నించి ఈ చివరి వరకూ గాల్లో తీగెకి వేళ్ళాడుతూ ప్రయాణించడం అన్నమాట. సత్య, కోమల్, వరు ఇటువంటివి హాయిగా చెయ్యగలరు.
ఇక ఆక్వా బాల్ అనేది ఒక పెద్ద బంతిలో మనిషి నిలబడి ఎత్తు ప్రదేశం నించి కిందికి దొర్లడం అన్నమాట. బంతి లోపలి పొరలో మనిషి నిలబడితే, బయట పొరలో కాసిన్ని నీళ్లుంటాయి. ఆరడుగుల ఎత్తున పారదర్శకంగా ఉన్న బంతి కావడం వల్ల బయటి నించి లోపలికి, లోపలి నించి బయటికి కనిపిస్తూ ఉంటుంది. అందులో మొదట నిలబడే ఉన్నా బంతి దొర్లేటపుడు పల్టీలు కొడతారు.
మొదటగా కోమల్ వెళ్ళగానే మెడలు నొప్పిచేస్తాయేమోనని భలే భయపడ్డాను. కానీ వాడు తిరిగొచ్చి అంతా బానే ఉందని చెప్పడంతో స్థిమితపడ్డాను. ఇక కొండ మీదినించి బంతిలో దొర్లి కిందనెక్కడో ఆగిన వీళ్ళని చిన్న గోల్ఫ్ కార్టులో తిరిగి తీసుకుని వచ్చి దించుతున్నారు. టిక్కెట్టులో ఒక్కొక్కళ్ళకి రెండేసి సార్లు వెళ్లే అవకాశం ఉంది. ఇది చాలా పెద్ద సాహసమే. అయినా ఏవీ కాకుండా చక్కగా చేసేసారు వీళ్ళు.
అయితే ఆ రోజు పొద్దున్నే మాది ఫస్ట్ బాచ్ కావడం వల్లనో ఏమో, పెద్దగా జనం లేరు. జిప్ లైన్ దగ్గిర కూడా మా బాచ్ తో పాటూ, మరొక ఇద్దరు ముగ్గురు తప్ప వేరే వాళ్ళెవరూ లేకపోవడం వల్ల త్వరగానే పూర్తి చేసుకుని వచ్చారు వీళ్లు.
సాహస కార్యక్రమాలు అన్నీ అయ్యేక డ్రాగన్ ఫ్రూట్లు, బొప్పాయి, మామిడి, పైన్ ఆపిల్ మొ.న పళ్ళ ముక్కలు చిన్న ప్లేట్లతో తినడానికి ఇచ్చారు. అలాగే కొబ్బరి బొండాలు తాగడానికి ఇచ్చారు.
అయితే ఇది బాగా ఖరీదైన టూరు. జిప్ లైన్, ఆక్వా బాల్ కాంబో టూరుకి, ఫ్రూట్ టేస్టింగుకి కలిపి మనిషికి రెండు వందల డాలర్లు. కేవలం ఫామ్ టూరు, ఫ్రూట్ టేస్టిం గులకి పెద్దవాళ్ళకి $65, పిల్లలకి $55. ఇలాంటి వెకేషన్లంటేనే డబ్బుతో కూడుకున్నవి. కానీ పిల్లల అలవికాని సంతోషం చూస్తే పెట్టిన డబ్బులకి ఫలితం వచ్చినట్టనిపించింది.
ఆ చుట్టు పక్కల అంతా పల్లపు భూమిలా ఉండడం వల్ల, పైగా ఫామ్ ఎత్తులో ఉండడం వల్ల అక్కణ్ణించి సముద్ర తీరం దూరంగా, స్పష్టంగా కనిపిస్తూ ఉంది.
అక్కడ కూర్చుని ఉన్నంతసేపూ ఆకాశం, సముద్రం కలిసే ఆ అందమైన దృశ్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాను.
పన్నెండు గంటల వేళ అక్కణ్ణించి పదినిమిషాల వ్యవధిలో ఉన్న లహైనా డౌన్ టౌన్ కి వెళ్ళేం. డౌన్ టౌన్ తీరంలో ఉంది. అక్కడి చారిత్రాత్మక మర్రి వృక్షాన్ని సందర్శించి, ఏవైనా కొని తెచ్చుకుని, మధ్యాహ్న భోజనాలు అక్కడే చేద్దామని నిర్ణయించుకున్నాం.
తీరంలో ఉన్న ఈ చారిత్రాత్మక మర్రి వృక్షపు పెద్ద కాండం, ఊడలతో కలిపి ఒక పెద్ద పార్కులో విస్తరించి ఉంది. ఇది అరవై అడుగుల ఎత్తున బ్లాకు మొత్తం వ్యాపించిన అతిపెద్ద వృక్షం. 1873లో విలియం ఒవేన్ స్మిత్ అనే పోలీసు ఈ వృక్షాన్ని అప్పటి క్రిస్టియన్ మిషనరీ 50వ వార్షికోత్సవ సందర్భంగా నాటాడట. ఇది ఇలా శతాబ్దాల పాటూ అలరారుతుందని అతనప్పుడు ఊహించి ఉండడు.
నేను చెట్టు కింద ఉన్న మొదటి బెంచీ దగ్గిరే ఆగిపోయాను. ఇక అందరం అక్కడే చుట్టూ బెంచీల మీద కూర్చుని భోజనాలు కానిచ్చాము. పిల్లలు త్వరగా వెళ్లి అవీ, ఇవీ చూసొస్తామని నాలుగైదు దుకాణాలు చూసొచ్చారు. నేను ఇక కదల్లేక అక్కడే చెట్టుని చూస్తూ ఉండిపోయాను. సిరి నాకు తోడుగా ఉందెలాగూ.
ఆ చెట్టుని చూడగానే నాకు కలకత్తాలోని అతిపెద్ద ఊడల మర్రి చెట్టు జ్ఞాపకం వచ్చింది.
లహైనాలో ఆ మిట్ట మధ్యాహ్నం అక్కడక్కడా సూర్య కాంతి ప్రసరిస్తూ జ్ఞాపకాల్ని మోసుకొచ్చిన ఈ మర్రిచెట్టు, తీరంలో ఉన్న ఈ డౌన్ టౌన్ మేం హవాయి నించి వెనక్కి వెళ్లిన సంవత్సరం తరువాత, అంటే 2023లో జరిగిన ఘోరమైన కార్చిచ్చు ప్రమాదంలో బూడిదయ్యాయట. ఎంతో ప్రాణనష్టం, ఆస్తి నష్టం కూడా కలిగించిన ఆ అగ్ని ప్రమాద దృశ్యాలు న్యూసులో చూసినప్పుడు భలే బాధగా అనిపించింది.
1802లో అప్పటి హవాయీ మహారాజు కమేహమహా ఈ ‘లహైనా’ ప్రధాన కేంద్రంగా పరిపాలించాడు. ఇక్కడే ఇటుకలతో రాజ భవనాల్ని, పరిపాలక కట్టడాల్ని నిర్మించాడు. ఆ తర్వాత దాదాపు 50 సం.రాల పాటు ‘లహైనా’ ప్రధాన కేంద్రంగా కొనసాగింది.
ప్రస్తుతం ‘లహైనా’లో ఉన్న అత్యంత ప్రాచీన కట్టడం 1834లో కట్టబడిన “బాల్డ్విన్ హోమ్”. ఒకప్పుడు మిషనరీ కాంపౌండ్ గా పిలవబడిన ఈ కట్టడం రెవరెండ్ బాల్డ్విన్ నివాసంగా మారిన తరువాత ఆయన పేరుతోనే పిలవబడింది. ఇది ప్రస్తుతం “బాల్డ్విన్ హోమ్ మ్యూజియం” గా మారింది. ఈ కట్టడం కూడా 2023 కార్చిచ్చు ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యిందట.
నాకు నడిచే పరిస్థితి లేకపోవడం వల్ల ఇవేవీ అప్పుడు చూడలేకపోయాను. అయితే అదే రోజు సాయంత్రం లహైనా తీరం నించి డిన్నర్ క్రూజ్ బుక్ చేసుకున్నందున ఎక్కువ సమయం కూడా లేదు మాకు.
మధ్యాహ్న భోజనాలు కాగానే అక్కణ్ణించి అరగంట వ్యవధిలో ఉన్న మా బసకు వెళ్లి స్నానాలు కానిచ్చి, డిన్నర్ గౌనులు వేసుకుని తయారై తిరిగి రావాలి.
ఎక్కడికక్కడ పరుగులు పెట్టాల్సిన రోజది. ఇక నాకేమో అడుగు వేస్తే అడుగు వెయ్యలేని పరిస్థితి. అయినా బాధని పళ్లబిగువున ఆపుకుంటూ, అవకాశం దొరికినప్పు డల్లా కూర్చుంటూ ఏదోలా ఒక్కొక్కటీ పూర్తి చేయసాగేను. ఆ ప్రయాణంలో తీసిన ఏ ఫోటోలోనూ నా ముఖంలో బాధ ఎక్కడా కనబడకపోవడం ఇప్పుడు చూసుకున్నా నాకే ఆశ్చర్యం వేస్తుంది.
సాయంత్రం క్రూజ్ ఎక్కే సమయంలో తీరంలో ఎదురుగా ఉన్న 1898 నాటి పాత కోర్టు హౌస్ ని పునర్నిర్మించిన కట్టడాన్ని మాత్రం బయటి నించి చూడగలిగేం.
ఈ ‘లహైనా’లో పాత కాలపు జైలు, మొట్టమొదటి షుగర్ మిల్లు మొ.న చారిత్రాత్మక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. అయితే అగ్నిప్రమాదంలో ఆహుతైన వీటన్నిటినీ ఇప్పుడు పునర్నిర్మిస్తున్నారట.
దాదాపు మూడు గంటల ప్రాంతంలో అరగంట వ్యవధిలో ఉన్న రిసార్టుకి తిరిగి వెళ్ళేం. గబగబా అందరం రెడీ అయ్యి కారులో కూర్చుని తిరిగి అయిదున్నర గంటలకల్లా ‘లహైనా’ కి చేరుకున్నాం. ఆరు గంటలకి మేం బుక్ చేసుకున్న క్రూజ్ షికారు. అందులో సంధ్యా సమయాన్ని వీక్షించడం, రాత్రి భోజనాన్ని సేవించడం భాగాలు. టిక్కెట్టు పెద్దవాళ్లకి $120 డాలర్లు, పిల్లలకి $90 డాలర్లు. భోజనంలో సలాడ్, చికెన్ లేదా రొయ్యల తో బాటూ, చాకొలేట్ కేక్ వడ్డించారు. పెట్టిన డబ్బుకి తిరిగి పొందేవి చూస్తే అమెరికాలో మిగతా ప్రాంతాలన్నిటిలోనూ హవాయిలో ప్రతి దానికీ చాలా ఖరీదు పెట్టాల్సిఉంటుంది.
వెచ్చని సముద్రమ్మీద దాదాపు మూడు గంటల ప్రయాణం పొద్దల్లా అలసిన మాకు కాస్త విశ్రాంతినిచ్చింది. ముందురోజు అనంతాకాశంలో నించి సూర్యాస్తమయాన్ని చూస్తే ఇప్పుడు సాగర కెరటాల మీద నుంచి సూర్యాస్తమయం. అయినా దేనికవే అత్యంత అందమైన క్షణాలు.
ఒకవైపు ఆకాశంలో మిరుమిట్లు గొలుపుతూ వెలిగిపోతున్న సూరీడు, మరోవైపు తీరాన కొండల మీద తెల్లని, నల్లని మబ్బులు దోబూచులాడుతున్న మావీ ద్వీపం.
అంతలోనే తీరాన వాన కురిసి మాయమై ఆ క్షణంలో అత్యద్భుతమైన అందాల హరివిల్లు ప్రత్యక్షమైంది.
క్రమంగా వెలుతురు మాయమవుతున్న ఆకాశంలో నారింజ రంగు మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. సంధ్యా సమయాంతంలో లేత పసుపు రంగు దాల్చిన ఆకాశాన్ని చూసి తీరవల్సిందే. పడవ మీద అటూ ఇటూ పిల్లలు సందడిగా తిరగ సాగేరు. కూర్చున్న చోటి నించి కదల్లేని నేను ఆ సుందర దృశ్య పారవశ్యంలో మంత్ర ముగ్ధురాలిలా మునిగిపోయి ఉండిపోయాను.
ఇలా చీకటి కాగానే అలా ప్రత్యక్షమైన తారల్తో పోటీ పడుతూ మావీ ద్వీప తీరంలోని ధగద్ధగలు!
అలా ఆ సాయంత్రపు ఆహ్లాద పర్యటన ముగిసి దాదాపు ఎనిమిది గంటల ప్రాతంలో మా పడవ తీరానికి చేరింది. తిరిగి రిసార్టుకి తొమ్మిదిన్నర ప్రాంతంలో చేరుకున్నాం. రిసార్టు మలుపులో చెట్లకి లాంతర్లు వేలాడ దీసినట్టు ద్వీపకాంతుల అమరిక మరొక అందమైన దృశ్యం.
*****
(సశేషం)