యాదోంకి బారాత్-24

-వారాల ఆనంద్

 

ఎందుకయినా మంచిది/ కనురెప్పలు తెరిచే వుంచాలి/ ప్రకృతి ఏ అందమయిన దృశ్యాన్నో\ నీ కంటిలో వేసి పోవచ్చు/పోతూ పోతూ ఓ తుంటరి మబ్బు తునక/ఇంధ్రధనుస్సుని సాక్షాత్కరింప చేయొచ్చు

          ఎందుకయినా మంచిది/ పిడికిలి తెరిచే వుంచాలి/ఎవరయినా చేతిలో చెయ్యేసి/
స్నేహ హస్తం కలిపేసి పోవచ్చు/ నడుస్తూ నడుస్తూ మనిషనేవాడు/ఓ ఆలింగనం ఇచ్చి పోవచ్చు

          ఎందుకయినా మంచిది/ హృదయం తెరిచే వుంచాలి/ మనసుగల ఏ మనిషో/ తలుపు తట్టకుండానే పలకరిచి పోవచ్చు/ కదుల్తూ కదుల్తూ ఆత్మగలవాడు/ ప్రేమ సంతకం చేసిపోవచ్చు

***

          ఈ కవిత నా ‘మనిషి లోపల’ కవితా సంకలనంలో రాసుకున్నాను. అవును ఎవరమయినా మనసు ఆంటెన్నాను తెరిచి వుంచితే మంచిది. కానీ ఇవ్వాళ ఆన్టెన్నాల కాలం పోయింది. ఇప్పుడంతా చుట్టూరా అలుముకుని పరుచుకున్న ‘వై ఫై’. దానికి కూడా మన లోపలి రిసీవర్ సిద్దంగా వుండాలి. అప్పుడే దేన్ననయినా స్వీకరించేందుకు మనం సిద్దంగా వుంటాం. ఓపెన్ నెస్ ని అందిపుచ్చుకుని ఈ మొత్తం సాంకేతికత సంక్లిష్టతల నేపధ్యంలో నేను నా రొటీన్ కార్యక్రమాలల్లో చేరిపోయాను. కాలేజీలో ఆక్టివ్ గా వుంటూనే సినిమాల మీద ముఖ్యంగా తెలంగాణ సినిమాల మీద వ్యాసాలు రాయడం విస్తృత పరిచాను. నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో రాస్తూ పోయాను. ఇక నా ఆరోగ్యం కొంత మెరుగు పడింది. అయినప్పటికీ ఎప్పటికప్పుడు క్రెయాటిన్ లాంటి అనేక పరీక్షలు చేయించుకుంటూనే నెఫ్రాలజిస్ట్ ను కలవడం తప్పలేదు. నా మట్టుకు నాకు డాక్టర్ గందే శ్రీధర్ హైదరాబాద్ నుండి ప్రతి బుధవారం కరీంనగర్ కు విజిటింగ్ రావడం ఎంతో ఉపయోగపడింది. లేకుంటే ప్రతి సారీ హైదరబాద్ వెళ్లాల్సిన పని బడేది. డాక్టర్ శ్రీధర్ సివిల్ ఆసుపత్రి రోడ్డులోని న్యూ శ్రీనివాస మెడికల్స్ ఆవరణలోని క్లినిక్ కి వస్తాడు. జిల్లాలోని అనేక మందికి ఆయన సేవలు ఎంతో ఉపయోగకరంగా వుంటాయి. ఇక కరీంనగర్లో వైద్య సదుపాయాల పరిస్తితి చూస్తే అప్పటిదాకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఫిజిషియన్స్, సర్జన్స్ అందుబాటులో వుండేవాళ్లు. కానీ ఎప్పుడయితే ‘ప్రతిమ’,’ చలిమెడ ఆనందరావు’ పేర్లతో రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయో అప్పటి నుండి అత్యున్నత స్థాయి డీ.ఎం. లు అందుబాటులోకి వచ్చారు. దాదాపు అన్నీ విభాగాల్లో యువ వైద్యులు వచ్చారు. కొంత ఖర్చయినా ఉత్తమ వైద్య సేవలు లభించ డంతో ఒకరకంగా మంచే జరిగింది.

          అట్లా నేను వారం వారం వైద్య పరీక్షలు నెలకో సారి డాక్టర్ విజిట్ కి వెళ్ళడం సాగుతూనే వుంది. పరిస్తితి మెరుగ్గా వుండడంతో రాయడం, కార్యక్రమాల నిర్వహణ కొనసాగిస్తూనే వచ్చాను. కాలేజీలో ప్రిన్సిపాల్ డాక్టర్ మధుసూధన్ రెడ్డి కూడా ఆక్టివ్ గా వుండడంతో అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. అందులో నాకు గుర్తున్నంత వరకు తెలంగాణ సినిమా ఎదగాలని, అది తన స్వీయ గొంతుకతో పలకాలని తపిస్తూ అనేక సూచనలు చేస్తూ వ్యాసాలు రాశాను. అదే సమయంలో కాలేజీలో 26 మే 2015 రోజున ‘తెలంగాణ సినిమా దశ దిశ’ పేర సదస్సు నిర్వహించాను. దానికి మేయర్ శ్రీ రవీందర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. విద్యార్థుల్లో సినిమా చైతన్యం పెరిగేందుకు దోహదం చేసింది. ఆ తర్వాతి కాలంలో ‘తెలంగాణ సినిమా-దశ దిశ’ పేర పూర్తి స్థాయి పుస్తకమే తెచ్చాను. ఇక మా కాలేజీలోనే ‘తెలంగాణ కళ-పేరిణి నృత్యం’ మీద పక్షం రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహించాము. దానికి మా కొలీగ్ శ్రీమతి ఎలిజబెత్ రాణి పూర్తిగా సహకరించారు. విద్యార్థినీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పేరిణి మీద మా అబ్బాయి అన్వేష్ మంచి ఫోటో షూట్ చేశాడు. డాక్యుమెంటరీ కూడా ప్లాన్ చేశాం కానీ పేరిణిలో ప్రముఖుడయిన ఓ కళాకారుడి అభ్యంతరాలు వాద వివాదాల నడుమ ఆ డాక్యుమెంటరీ ప్రయత్నం నిలిచిపోయింది. నేనూ అన్వేష్ బాగా నిరుత్సాహపడ్డాం. ఇట్లా పలు కార్యక్రమాల్లో బిజీ వుంటూ అత్యంత మామూలుగా వున్నాను. అప్పుడే ప్రముఖ తెలంగాణ సినీ కథానాయకుడు టి.ఎల్. కాంతారావు జయంతి ఉత్సవాన్ని16 నవంబర్ 2015 రోజున శ్రీ సి.వి.ఎల్.నరసింహా రావు నిర్వహిస్తే హైదరాబాద్ వెళ్ళి వచ్చాం. సభ బాగా జరిగింది. సీవీల్ గారి దీక్ష చాలా గొప్పది.

***

          ఇదంతా ఇట్లా జరుగుతుండగానే మళ్ళీ ఒకసారి అనారోగ్య బాంబు పేలింది. ఒక ఆదివారం రోజున నా పెదవి కింద కట్ అయిన విషయం గమనించిన ఇందిర అదేమిటి అంది. ఏదో షేవింగ్ లో కట్ అయివుంటుంది అని తేలిగ్గా తీసేశాను. అది కాస్తా మర్నాటికి ముక్కు పక్కకు చేరింది. ఇందిర కంగారు పడింది. నీకన్నీ అనుమానాలే అంటూ బుధ వారం డాక్టర్ దగ్గరికి వెళ్దాం లే అన్నాను. అనుకున్నట్టుగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఏమిటి ఆనంద్ ఎట్లా వున్నారు అని ఆయన అడుగుతూ వుండగానే ఇందిర కట్ అయిన విషయం చెప్పింది. ఆయన అదేమీ వినకుండానే సీరియస్ గా ఫేస్ మాస్క్ తీయించి మొత్తం ముక్కు పక్కనుంచి ముఖమంతా పరిశీలించారు. ఆనంద్ మీరు వెంటనే హైదరాబాద్ బయలుదేరండి. నేను హాస్పిటల్ కి ఫోన్ చేస్తాను వెంటనే అడ్మిట్ కండి అన్నాడు. నాకేటూ పాలు పోలేదు. ఏమయింది సార్ అన్నాను. నేను చెబుతున్నాను కదా వెంటనే బయలుదేరండి అన్నారాయన. మేము బయటకొచ్చి అప్పటికి సాయంత్రం ఆరు దాటుతున్నది అప్పటికప్పుడు వెల్లడమెట్లా అనుకున్నాం. మెడికల్ షాప్ ముందు కూర్చుని కొంత సేపు తర్జన భర్జన పడ్డాం. ఇందిరకు ఒకటే కంగారు ఆందోళన. మళ్ళీ లోనికి వెళ్ళి డాక్టర్ణి కలిసి రేపుదయం వస్తామన్నాము. అదేమీ నాకు తెలీదు మీరు రేపుదయం 5 గంటలక్ల్లా అడ్మిట్ కావాలి మరి అన్నాడు. ఇంటికి వచ్చి ఏవో కొన్ని సర్దు కుని అర్ధరాత్రి బయలుదేరాము. గ్లోబల్ లో అడ్మిట్ అయ్యాను. వెంట వెంటనే రక్త పరీక్షలు అవీ చేశారు. అడిగితే బ్లడ్ బాంబే పంపిస్తున్నాం. రిపోర్ట్ రావడానికి రెండు రోజులు పట్టొచ్చు అన్నాడు టెక్నీసియన్. కొంత సేపటికి డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రమా శంకర్, డాక్టర్ రఘు అంతా వచ్చేశారు. ఆనంద్ రిపోర్ట్ రావడం లేట్ అవుతుంది ట్రీట్మెంట్ మొదలు పెడుతున్నాం అన్నారు. అసలు ఇంతకూ ఏమయింది సార్ అని అడిగాను. ఏమీ లేదు సీరియస్ వైరల్ ఇన్ఫెక్షన్ వుంది. అయిదు రోజుల పాటు అయిదు ఇంజెక్షన్స్ ఇస్తాం. ఒక్కొక్కటి డ్రాప్ బై డ్రాప్ 7 గంటలు తీసుకుంటుంది. ఒక్కో ఇంజెక్షన్ ముప్పై అయిదు వేలు వుంటుంది అన్నారు. డబ్బు సరే విషయం అంత ప్రమాదకరమా అన్నాను. అవును అన్నారు. రిపోర్ట్ కోసం వేచి చూసే సమయం కూడా లేదు ట్రీట్ మెంట్ మొదలు పెడుతున్నాం అన్నారు శ్రీధర్. నేను బదులిచ్చే లోపలే మీరేట్లా అనుకుంటే అట్లా చేయండి సర్ అంది ఇందిర. ఐవీ ఇంజెక్షన్ మొదలయింది. ఐసీయు లో వుంచారు. టోటల్ కంటోల్డ్ వాతావరణం. అప్పుడు డాక్టర్ రమాశంకర్ వచ్చి పక్కన కూర్చుని ఆనంద్ గారు ఇది మీ ట్రాన్స్ ప్లాంట్ కంటే సీరియస్ స్థితి. బయటకేమీ కనిపిం చదు కానీ ప్రమాదం. మీరు వెంటనే కరీంనగర్ లో శ్రీధర్ ని కలవడం మంచిది అయింది. ఆయన కూడా వెంటనే స్పందించాడు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వుండాలి. అయిదు ఇంజెక్షన్స్ తర్వాత మీ ఇమ్యూనిటీ, ఎనర్జీ మొత్తం జీరోకి వస్తుంది. కొద్ది రోజులు కదలడం కూడా కష్టం అవుతుంది. మీకు మీరు కప్ పట్టుకుని టీ తాగలేరు, షర్ట్ కూడా వేసుకోలేరు. ఆ స్థితిలో చాలా జాగ్రత్తగా వుండాలి. ప్రోటీస్ డోస్, సప్లిమెంట్స్ ఇస్తాం కానీ సమయం పడుతుంది అన్నారు. అప్పటికి కానీ మాకు అసలు స్థితి అర్థం కాలేదు. ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ అప్పుడు కూడా ఇందిర కళ్ళల్లో నీళ్ళు చూడలేదు. కానీ ఇప్పుడు కళ్ళు వొత్తుకోవడం గమనించాను. ఏమీ కాదు లేవోయి అంటున్నాను నేను. బాంబే రిపోర్ట్ శ్రీధర్ గారు వూహించినట్టే వచ్చింది. అప్పటికే ట్రీట్మెంట్ మొదలయింది. మూడో రోజుకి మెడిసినల్ ప్రభావం మొదలయింది. నాలో బలహీనత పుంజుకుంది. క్రమంగా సత్తువ కోల్పోసాగాను. మాట బాగానే వుంది. ఇందిరనే తినిపించడంతో సహా అన్నీ పనుల్లో సాయం చేయసాగింది. బాప్ రే. హింస అంటే ఇది కదా అనిపించింది. నా పరిస్తితి గమనించిన ఇందిర డాక్టర్ శ్రీధర్ తో మాట్లాడుతూ ఇంకా ఎవరయినా సీనియర్. మీ ప్రొఫెసర్స్ ని సంప్రదించండి అంది. మీరెక్కడికయినా వెళ్ళండి నేను మాట్లాడతాను అన్నారు శ్రీధర్. లేదు లేదు మిమ్మల్నే నమ్ముకున్నాను, నాకట్లా అనిపించింది అంది ఇందిర. మర్నాడుదయమే ఓ సీనియర్ నేప్రాలజీ ప్రొఫెసర్ ని పిలిపించారు. ఆయన చూసి ఎవ్రీ థింగ్ ఇస్ ఆన్ గుడ్ లైన్స్ అని వెళ్లారు. ఇన్ని ట్రాన్స్ ప్లాంట్స్ చూసాము మీది పెక్యులియర్ అన్నారు. అవును మరి ఆనంద్ అంటే మజాకా పెక్యులియరే మరి అని నేనూ ఇందిరా నవ్వుకున్నాము. డాక్టర్స్ చర్చించుకుని ఏవో నిర్ణయాలు తీసు కున్నారు.

          హైదరబాద్ ఆసుపత్రిలో వుండడం ఏదో ఒకరోజు మాత్రమే అనుకున్నాం. వెంట బట్టలు అవీ ఏమీ లేవు. ఖైరతాబాద్ లో మంజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇందిర వాషింగ్ పని ముగించుకు వచ్చింది. అయిదు రోజుల మెడికల్ డోసేజీ అయిపోయాక డాక్టర్స్ అన్ని పరీక్షలు చేసి ఒకే కరీంనగర్ వెళ్లమన్నారు. కానీ మూడు నెలలు సెలవు పెట్టండి. ఇంట్లోంచి బయటకు పోవద్దు. సాధ్యమయినంత మేర ఎవరినీ దగ్గరకు రానివ్వవద్దు అన్నారు. క్రమంగా కోలుకుంటారు అని కూడా అన్నారు. దాదాపు స్టేచ్చర్ పైననే బయటకు వచ్చి కారులో కరీంనగర్ చేరుకున్నాం. ఏముందిక 100 శాతం రెస్ట్. కదలడం కష్టం. ఆ కాలం ఎట్లా గడిచిందో ఇప్పుడు వూహించుకుంటే భయమేస్తుంది. న్యూస్ పేపర్ చదవలేను, స్వంతంగా స్నానం చేయలేను, నా కిష్టమయిన టీ నాకు నేను తాగలేను అబ్బో అదంతా పెద్ద నరకం. భరించాం తప్పదు కదా. మొత్తం మీద ఆ ఇన్ఫెక్షన్ ఎట్లా సోకిందో తెలీదు కానీ సరయిన సమయానికి శ్రీధర్ గారిని కలవడం ఆయన వెంటనే స్పందించి, రోగ నిర్ధారణ చేయడంతో బయటపడ్డాను.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.