ప్రియ మిత్రులందరికీ వందనం, అభివందనం. శివ పార్వతుల తనయుడు కుమార స్వామి. తలితండ్రుల రూపాలను పుణికి పుచ్చుకొని అత్యంత సుందరాకారునిగా పేరు పొందాడు. అతనికి 6 ముఖములు ఉన్న కారణంగా షణ్ముఖడు, ఆర్ముగం అని కూడా పిలుస్తారు. ఆ షణ్ముఖ సుబ్రమణ్య స్వామికి ప్రీతి పాత్రంగా పేర్కొనే షణ్ముఖ ప్రియ రాగ విశేషాలు ఈ నెల తెలుసుకుందాము.
ముందుగా రాగ లక్షణాలు తెలుసుకుందామా? కటపయాది సూత్రాన్ని అనుసరించి ఈ రాగం 56 వ మేళకర్త. మేళకర్త రాగం కనుక ఆరోహణ అవరోహణలలో అన్ని స్వరాలు కలిగి సంపూర్ణ రాగం అయింది. ఇందులోని స్వర స్థానాలు షడ్జమ్, చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మద్యమం, పంచమం, శుద్ధ దైవతం, కైసికి నిషాదం. ప్రసిద్ధ ప్రతి మధ్యమ రాగం. సర్వ స్వర గమక వరీక రక్తి రాగం. రసభరితమైన రాగాంగ రాగము. ఈ రాగానికి శుద్ధ మధ్యమ రాగం నఠ భైరవి రాగం. విస్త్రతమైన, భావయుక్తమైన రాగము. త్రిస్థాయిలలో రాణించగల రాగము. జంట స్వరాలు శోభను కలిగిస్తాయి. రాగం, తానం, పల్లవి, రాగమాలికలు, శ్లోకములకు అనువైనది. పౌరాణికులు, హరిదాసులు కథా కాలక్షేపా లలో విస్తృతంగా వాడే రాగము. మూర్చనాకారక మేళము. ఘన రాగాలలోనిది కాక పోయినా తానం ఎంతో అందాన్ని కూర్చగలదు.
దీక్షితుల వారి సాంప్రదాయంలో ఈ రాగాన్ని చామరముగా పేర్కొన్నారు. ఈ పేరు కూడా కటపయాది సూత్రం ప్రకారం 56 వ సంఖ్యనే సూచిస్తుంది. చామరము అంటే వీవెన, విసనకర్ర.శ్రోతల హృదయాలను చల్లని భావంతో నింపుతుంది కనుక ఆ పేరు పెట్టి ఉండవచ్చు. దీక్షితుల వారు “సిద్ధి వినాయకం”, “మహాసురం కేతుమహం” అనే తమ కీర్తనలలో చామరం రాగ ముద్రను అద్భుతముగా ప్రయోగించారు.
ముందు చెప్పుకున్నట్టు ఈ రాగ దేవత షణ్ముఖునిగా పిలువబడే కుమారస్వామి. పరమ శివుని మీద, కుమార స్వామి మీద అనేక కీర్తనలు, హారతులు రచింపబడ్డాయి.
దైవత్వాన్ని ప్రేరేపించే రాగము. కచెరీలలో ప్రముఖంగా వినిపించే రాగం. మంగళకర రాగం కనుక పెళ్లిళ్లలో తప్పనిసరిగా నాదస్వరములో వినిపిస్తుంది.
కర్ణాటక సంగీతము నుండి హిందూస్తాని సంగీతములో కూడా ప్రవేశించినట్లు సంగీతకారులు భావిస్తారు. పాశ్చాత్య సంగీతములో ఈ రాగానికి సమమైనది హంగేరియన్ జిప్సీగా పిలువబడుతుంది.
భక్తి, శృంగార, కరుణ, అద్భుత, హాస్య, వీర రసాలు ఆరు కిరణాలుగా ఈ రాగం నుండి ప్రసరించి షణ్ముఖుని ఆరు శిరస్సులుగా భాసిల్లుతాయి.
షణ్ముఖ ప్రియ రాగం గాత్ర సౌలభ్యానికి, గాత్ర పరిశ్రమకి ఎంతో ఉపకరిస్తుంది. దైవత్వాన్ని ప్రేరేపించటానికి, శారీరక, మానసిక దృఢత్వానికి ఎంతో ఉపయోగించ గలదు. త్యాగరాజ స్వామి ఈ రాగంలో “వద్దనేవారు” అనే కృతి మాత్రమే రచించారు.
ఇప్పుడు కొన్ని రచనలు పరిశీలిద్దామా?
శాస్త్రీయ సంగీతము
- లక్ష్యగీతం శ్రీరఘురామ ప్రభు వెంకటమఖీ
- కీర్తన వద్దనేవారు త్యాగయ్య
- కీర్తన సిద్ధి వినాయకం దీక్షితులు
- కీర్తన మహాసురం కేతుమహం దీక్షితులు
- కీర్తన మరివేరె దిక్కు పట్నంసుబ్రమణ్య అయ్యరు
- కీర్తన వల్లీ నాయక ముత్తయ్య భాగవతార్
- కీర్తన శరవణ భవ పాపనాశన శివన్
- కీర్తన శ్రీ కార్తికేయం మహాసురం N. C. మూర్తి
వల్లీ నాయక https://youtu.be/gmLe8iaP71U?si=a3GOKwEHYpoOnEYV
లలిత సంగీతం
- ప్రతి శ్రావణము రఘునాథ్ కుల్కర్ణి B భాస్కరరెడ్డి
- రావేమిరా శశి దాశరధి పాలగుమ్మి విశ్వనాధమ్
- వల్లీ దేవసేనాపతే చిత్తరంజన్ చిత్తరంజన్
ప్రతి శ్రావణము https://youtu.be/rVMD13z7GjA?si=wzj4eAA2rrWVxGb1
సినిమా సంగీతం
- దేవి శ్రీదేవి సంతానం ఘంటసాల
- గానమేకళలందు అందం కోసం పందెం సుశీల జానకి
- మున్నీట పవళించు భూకైలాస్ ML వసంతకుమారి
- రంగా కావేటి రంగా విప్రనారాయణ A M రాజా
దేవి శ్రీదేవి https://youtu.be/3kFtDkq3EEQ?si=zxWEbI3EJmKaGHUa
చూశారుగా మిత్రులారా! షణ్ముఖనికి ప్రీతి పాత్రమై, కచే్రీలలో అలాగే పెళ్లి భజన్త్రీలలో కూడా తప్పక వినిపించే షణ్ముఖప్రియ రాగవిశేషాలు ఇవేనండి. వచ్చే సంచికలో మరొక అందమైన రాగాన్ని పరిచయం చేసుకుందాము. అంతవరకు సెలవా మరి?
వాణిగారూ,
మరొక చక్కని రాగాన్ని ఎన్నుకున్నారు. మరింత చక్కగా వివరించారు. రచనల వివరాలు కూడా బాగున్నాయి. ప్రతిరచనకూ తత్సంబంధిత లంకెలను ఇవ్వడానికి ప్రయత్నిచండి.
షణ్ముఖప్రియరాగంలో ప్రాచుర్యం పొందిన ఒక మంచి అన్నమాచార్య కీర్తన “అణురేణు పరిపూర్ణమైన రూపము…”
ఆసక్తిగలవారు ఇక్కడ వినండి.