‘విజయ’ కథ!
(ఒక నవలికా, ఒక పెద్ద వ్యాసమూ, 9 చిన్న వ్యాసాలూ, కలిపిన సంపుటం)
-వి.విజయకుమార్
విజయ కథ పేరుతో ఇటీవల రంగనాయకమ్మ గారు ఒక పుస్తకాన్ని వెలువరించారు. విజయకధ 22 ఏళ్ళ వయసులో రాసిన కథ అయినప్పటికీ, అప్పటికి మార్క్సిజం గురించి విని ఉండనప్పటికీ, పెళ్లి చూపుల తంతును తిరస్కరిస్తూ, – పరస్పరం కలిసి మాట్లాడుకో వడం ద్వారా, – అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా – ‘పెళ్లి’ అనే కాంటాక్ట్ లోకి రావలసిన అవసరాన్ని చెప్పిన కథ ఇది. తన సహజ శైలిలో తనలో ఉండే అభివృద్ధి నిరోధక భావాల్ని హాస్యస్ఫోరకంగా ఎండగట్టుకుంటూ, కావలసినంత వినోదాన్ని పంచిస్తూ, ఇప్పుడైతే ఈ కథ ముగింపు ఎలా ఉంటుందో రాసి ఈ సంకలనంలో చేర్చారు.
ఇటీవల కాలంలో వేరువేరు పత్రికల్లో వేరువేరు విషయాల మీద – అరవిందరావు గారూ, జయప్రకాష్ నారాయణ గారూ రాసిన వ్యాసాలపై విమర్శా, దేశాధి నేతల స్నేహ రహస్యం, నిరుద్యోగ సమస్యకి చిట్కాల పరిష్కారమా? పెట్టుబడిదారీ సమాజంలో ఇళ్ల సమస్య ఇంకా ఒకటి రెండు వ్యాసాలు కలిపి 9 చిన్న వ్యాసాలతో ఈ సంకలనాన్ని వెలువరించారు. ఇవన్నీ చాలా మంది పాఠకులను అలరించాయి.
ఈ సంకలనంలో పెట్టుబడిదారీ విధానం మీద రాసిన విలువైన పెద్ద వ్యాసం మీద విషయ ప్రాధాన్యత రీత్యా ఇందులో ప్రధానంగా సమీక్షించాను. ఈ సమీక్ష ఉద్దేశం ఏమిటంటే ఇది చదివాక ఆ వ్యాసాన్ని మీరు తప్పక చదివి తీరుతారనే!
***
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం!
ఒకరెవరైనా కొంచెం డబ్బు (పెట్టుబడి) పోగేసి, ఒక ‘స్థలం’ (భూమి) ఎంచుకొని, కొన్ని ‘ఉత్పత్తి సాధనాలు’ కొనుక్కొని, కొన్ని ‘ముడి పదార్థాలు’ తెచ్చుకొని, కొంతమంది ‘శ్రామికులకు’ ‘జీతం’ ఇచ్చి ఏదైనా సరుకు ఉత్పత్తి మొదలు పెడితే వాడు పెట్టుబడి దారుడు అవుతాడు. సరుకు తయారు అయ్యాక దాన్ని అమ్మాలి. దాన్ని అమ్మడం మొదలు పెట్టే ముందు వాడు మూడు విషయాలు ఆలోచిస్తాడు.
ఉత్పత్తి చేయడానికి కొనితెచ్చిన యంత్రాలకూ, ముడి పదార్థాలకూ పెట్టిన డబ్బులు వెనక్కి రావాలి!
శ్రామికులకు ఇచ్చిన ‘జీతాల’ డబ్బులు కూడా వెనక్కి రావాలి!
అంటే స్థూలంగా సరుకులో ఉత్పత్తి సాధనాలకు పెట్టిన ‘ఖర్చూ’ శ్రామికులకు ఇచ్చిన ‘జీతమూ’ అంతే కాదు ఎంతో ‘కష్టపడి చేసిన పనికి’ ఇంకొకటీ – అసలదే ముఖ్యం – రావాలి!
పెట్టుబడి పెట్టి సరుకు తయారు చేసి సమాజానికి ఇచ్చినందుకు పారితోషికంగా ‘లాభం’ రావాలి!
ఇది చిల్లర కొట్టు వాళ్లకు కూడా తెలిసిన విషయమే కదా? ఇది న్యాయమే కదా?
మొదటి రెండు విషయాలూ ఎవరికైనా తేలిగ్గానే అర్థం అవుతాయి!
మూడో విషయానికి వచ్చేసరికి – అంటే ‘లాభం’ విషయానికి వచ్చేసరికి – మనంద రికీ చాలా న్యాయంగా అనిపించేదీ, చాలా మామూలు విషయమే కదా అనిపించేదీ – మార్క్స్ కు అనిపించలేదు! అది చాలా అన్యాయం అనిపించింది విచిత్రంగా!
ఎంత అన్యాయంగా అనిపించిందో చెప్పటానికి ఏకంగా ‘క్యాపిటల్’ అనే మహా గ్రంధాన్ని మొదలు పెట్టాల్సి వచ్చింది!
అసలాయనకి ఈ ‘విపరీతం’ ఏదో అందర్లా తోచివుండక పోతే మనకు, ‘కాపిటల్’ గ్రంథం చదివారా? అని ఎవరన్నా మొహంలో మొహం పెట్టి అడిగితే గిల్టీగా మొహం తిప్పుకునే ప్రమాదం తప్పిపోయేది!
సరుకులో నిజంగా ‘అవసరం లేని ధర’ గా ఉన్న ఈ ‘లాభం’ సీదా సాదాగా, న్యాయంగా కనబడే ఈ లాభం ఒక భయానక వ్యవస్థను ఎలా సృష్టించిందో తెలుసుకో వడం కోసం మార్క్స్ ఏకంగా నలభయేళ్ళ జీవితాన్నే వెచ్చించాడంటే దాన్ని తెలుసుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్థం.
ఈ లాభంలో ఉండే మూడు ఆదాయాలు.
స్థలం కోసం ‘కౌలు’(రెంట్)
పెట్టుబడి మీద ‘వడ్డీ’
తను పడ్డ ‘కష్టానికి’ ‘లాభం’
మార్క్స్ గడుసు వాడు కాకపోతే ఇందులో తప్పేముంది వెతకడానికి?
కానీ ‘కౌలు’ వచ్చేది ప్రకృతి సహజాతమైన భూమ్మీద ఉండే ‘స్థలానికి’. ఇది ఎవరికో చెంది ఉండటానికి న్యాయబద్ధమైన అవకాశం ఏదీ లేదంటాడు మార్క్స్.
సాధనాల కోసం, జీతం కోసం ఖర్చును చూపి ఆ డబ్బు ‘సరుకు ధర’ నించి రాబట్టు కున్న వాడు ఆ పెట్టుబడి మీద ‘వడ్డీ’ కూడా వేసుకుంటాడు. అది కూడా న్యాయబద్ధం కాదు అంటాడు మార్క్స్!
ఇంక ‘లాభం’ –
ఆ రెండే ఒప్పుకోని మార్క్స్ ‘లాభాన్ని’ ఒప్పుకుంటాడా? ససేమిరా ఒప్పుకోలేదు.
శ్రమ చేసిన వ్యక్తికి ‘అందని విలువ’ ‘జీతం కన్నా అదనంగా’ ఉన్న ‘అదనపు విలువ’ అవుతుంది. ఇదే ‘లాభంగా’ ‘వడ్డీగా’ ‘కౌలుగా’ మూడు రూపాల్లో పెట్టుబడిదారుకు అందుతుందంటాడు మార్క్స్!
ఇదంతా శ్రామికుడు నేరుగా తన యజమానిని పోషించటం! యజమాని తన శ్రామికులకు జీతం ఇచ్చి పోషించటం కాస్తా మార్క్స్ దృష్టిలో తలకిందులైంది! హెగల్ గతితర్కం లాగా మార్క్స్ కు ఎప్పుడూ ఈ వ్యవస్థ తలకిందులుగానే కనపడింది!
సరుకు ఉత్పత్తిలో నిజమే అనుకుందాం! మరి ‘అమ్మే పని’లో కూడా ఇలానే ఉంటుందా?
ప్రధానంగా ఈ వ్యాసంలో ఇదే చర్చ కొనసాగుతూ ఉంటుంది.
‘సరుకు’ ‘అమ్మే పని’ లో కూడా ఈ మూడూ వుంటాయా? పరిశ్రమల్లో అదనపు శ్రమ చేయించుకోవడం ద్వారా అదనపు విలువను కొల్లగొట్టే పెట్టుబడిదారులాగా, వర్తక పెట్టుబడిదారు కూడా ఈ మూడూ ఎలా పొందగలుగుతాడు? కేవలం సరుకు ‘అమ్మడం’ మాత్రమే జరిగే చోట అదనపు శ్రమ ఏమీ జరగదు కదా? మరి ఇలాంటి చోట వర్తక పెట్టుబడిదారుకు ‘లాభం’ ఎలా వస్తుంది అనే ఆసక్తికర చర్చ చేస్తూ అనేక విషయాలు రాబడతారు. ఈ చర్చ విశాలాంధ్ర ‘క్యాపిటల్’ అనువాదం నుంచి ఉటంకిస్తూ చేసిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ఈ ‘అమ్మే పని’ పరిశ్రమే చేస్తే అది ‘వర్తకం పనే’ అవుతుంది.
ఈ సరుకుల్ని అందించే పనిలో కూడా రెండు ఖర్చులు తప్పవు. 1. వర్తక సాధనాల ఖర్చూ, 2. వర్తక శ్రామికుడి జీతం ఖర్చూ, – సరుకు అమ్మకం అయ్యాక ఈ రెండు ఖర్చులతో పాటూ ‘లాభం’ కూడా రావాలి.
ఇక్కడే ‘ఉత్పాదక శ్రమ’, ‘అనుత్పాదక శ్రమ’ తెలుసుకోవాలి.
అమ్మకం కోసం చేసే ‘సరుకులు’ లేదా ‘పదార్థాలు’ లేదా ‘పనులు’ ‘ఉత్పాదక శ్రమ’ కిందికి వస్తాయి.
అనుత్పాదక శ్రమ కింద ‘అమ్మకాల,’ ‘కొనుగోలు’ పనులు వస్తాయి.
ఇక్కడే రెండు విలువలు గురించి కూడా తెలుసుకోవాలి. ఉపయోగపు విలువా, మారకం విలువా
ఉపయోగించుకోవడానికి పనికి వచ్చే ‘సరుకు’ కు ‘ఉపయోగ విలువ’ ఉంటుంది. అప్పుడే దాన్ని ఎవరైనా మారకం చేసుకోవాలనుకుంటారు. ‘మారకం’ చేసినప్పుడే ‘మారకం విలువ’ వస్తుంది.
మారకం ఎవరు చేస్తారు?
వర్తకుడు అనే యజమాని దగ్గర ‘వర్తక శ్రామికుడు’ చేస్తాడు. సరుకు అమ్మి పెట్టి, వచ్చిన డబ్బుని వర్తకుడికి అందించి దానికి అతనిచ్చే కొంచెం ‘జీతం’ తీసుకుంటాడు. మరి ఇక్కడ సరుకు ఉత్పత్తి కావడం లేదు కాబట్టి అమ్మకం ద్వారా ‘విలువ’ చేరదు గదా?
అమ్మకం అనే ‘పని’ జరుగుతున్నప్పుడు ఆ పనికి ఒక ‘విలువ’ ఉండాలి కదా? ఆ ‘విలువ’ వర్తకుడికి రాదా? అనే సందేహం వ్యక్తం చేస్తారు రంగాజీ ఇదే వ్యాసంలో!
పెట్టుబడిదారుకు సరుకు అమ్మి పెట్టే వర్తకుడు కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేసుకో వడమూ, అమ్మే వర్కర్లకు (శ్రామికులకు) జీతాల కోసమూ కొంత పెట్టుబడి సమకూర్చుకో వాలి. చేసిన పనికి తనకు ‘లాభం’ రావాలి.
సాధనాల ఖర్చూ, శ్రామికులకు జీతాలూ, పెట్టుబడికి రావలసిన లాభమూ ఎటు నుంచి వస్తున్నాయి? అని అడుగుతారు.
సరుకు విషయంలో అయితే శ్రామికుల నుంచి గుంజిన అదనపు శ్రమ నుంచి వస్తుందన్నది యదార్థం.
మరి వర్తకుడి దగ్గర అమ్మి పెట్టడం అనే శ్రమ చేసే శ్రామికుల ‘అదనపు శ్రమ’ నుంచి వస్తుందా? దానికి ‘అదనపు విలువ’ ఉంటుందా? వుండదు!
‘వర్తక లాభం’ కూడా సరుకు ధరలో నుంచే వస్తుందనేది అసలు విషయం!
పెట్టుబడీ, వర్తక పెట్టుబడీ – రెండూ పెట్టుబడులే అయినా, లాభం వచ్చే విధానం వేరుగా ఉందన్నది అసలు విషయం.
ఇంతకీ ‘అమ్మకం పని’ ఎవరికోసం జరుగుతుంది?
సరుకు కొనేవాడి కోసమా? జీతం ఇచ్చి సరుకులు అమ్మమని పురమాయించిన ‘వర్తకుడి’ కోసమా?
నిజం చెప్పాలంటే ఎవరైతే అమ్మి లాభం పొందటానికి సరుకు తయారు చేయించారో వారికోసం!
అమ్మకం పనిలో జరిగే శ్రమకు ‘విలువను ఉత్పత్తి చేసే’ అవకాశం లేదు. ‘విలువను సృష్టించే’ అవకాశం లేదు. ‘సరుకులను డబ్బుగానూ, డబ్బుని సరుకులు గానూ మార్చడానికి ‘తోడ్పడే శ్రమ’ మాత్రమే. అంతేగానీ ‘విలువలను సృష్టించే శ్రమ’ కాదు అంటాడు మార్క్స్.
ఈ ‘వర్తక శ్రమ’ జరిగే సమయంలో ‘కొత్త శ్రమ’ ఏదీ జరగదు. కానీ ‘అదనపు శ్రమ’ జరుగుతుంది. దీనికి విలువ ఉండదు. పరిశ్రమలో ఉన్న ‘అదనపు విలువ’ లో నుంచి కొంత వాటాను మాత్రం తెప్పించి ఇస్తుంది.
తనకు అందిన సరుకులోనే ఇది దాగి ఉంటుంది. వర్తక పెట్టుబడితో ఏ సంబంధమూ లేదు. సరుకు తయారుచేసిన పరిశ్రమ పెట్టిన పెట్టుబడితోనే దానికి సంబంధం! సరుకుల విలువను అదనంగా జోడించడం వల్ల గానీ, తయారీ ధరని పెంచడం వల్ల గానీ వర్తక లాభం పెరగడం ఒక భ్రమ అంటాడు మార్క్స్! లాభాలు వచ్చేది ఇలాంటి మోసపు పెంపు వల్ల కాదనీ, సరుకులో ఉండే అసలు విలువలను బట్టేనని మార్క్స్ చెబుతాడు. వర్తకుడి దగ్గర పనిచేసే గుమస్తాల ‘అదనపు శ్రమ’ ‘అదనపు విలువ’ను సృష్టించకపోయినా, వేరే రీతిలో వర్తకుడికి కొన్ని అదనపు విలువల్ని సొంతం చేసుకోవడానికి ‘వీలు కల్పిస్తుంది’ అంటాడు మార్క్స్!
ఈ గుమస్తాల శ్రమకు ‘జీతం’ కట్టేటప్పుడు, ‘డబ్బు రూపంలో ఖర్చుగా’ చూస్తాడు తప్ప, – సరుకుగా ‘అదనపు విలువ’ తెచ్చేదిగా చూడడు. వర్తక పెట్టుబడిదారుడు అసలు పెట్టుబడుదారుడు దగ్గర నుంచి సరుకు తీసుకొచ్చి అమ్మేటప్పుడు ‘అసలు విలువ’ కంటే ఎక్కువ ధరకు అమ్మి ఆ ‘ఎక్కువ’ ను తన జేబులో వేసుకుంటాడని చెబుతాడు.
‘అమ్మకం శ్రమ’కు శ్రామికుడికి సరిగ్గా గిట్టుబాటు కానందుకూ, ఇది ‘వ్యర్థం, అనవసరం’ అని వదిలేసినందుకూ, దీనిమీద మార్క్స్ ఎక్కువ మనసు పెట్టనందుకూ, తను కొంచెం నిరుత్సాహపడ్డ సందర్భాన్ని చాలా సరదాగా రాస్తారు ఇందులో!
శ్రమ దోపిడీ ఎలా జరుగుతుందో వివరిస్తూ – సరుకు విలువే, సరుకు ధర అనీ – సరుకు ధరలో సాధనాల విలువా, జీతం విలువా, లాభం పేరుతో మూడు రకాల అబద్ధపు ఆదాయాలు (కౌలు, వడ్డీ, లాభం) ఎలా ఉంటాయో వాటి గురించి వివరిస్తారు.
ఇలాంటి మూర్ఖ, తప్పుడు పద్ధతుల్లో కాకుండా సమాజంలో అందరికీ పనికొచ్చే సరుకు ఉత్పత్తిని ఒక ఉత్తమ రీతిలో ఎందుకు మనం తయారు చేసుకోలేమని అడుగుతారు.
వల్గర్ ఎకనమిస్ట్ అనే వాడు వర్తక లాభానికి ఉన్న ప్రత్యేక స్వభావాన్ని చెప్పలేడనీ, – సరుకు పెట్టుబడీ, – డబ్బు పెట్టుబడీ, – వర్తక పెట్టుబడీ, – మనీ డీలింగ్ పెట్టుబడీ – లాంటి వన్నీ పెట్టుబడి దారీ ఉత్పత్తి విధానం నుంచే, దానికే ప్రత్యేకమైన – సరుకు చెలామణీ – అనే అవలక్షణం నుంచే – పుట్టుకొచ్చేవని వప్పుకోవడానికి అనేక దొంగవేషాలు వేస్తాడని మార్క్స్ ఈసడించిన విషయాన్ని ఈ సందర్భంగా ఉటంకిస్తారు.
శ్రమ దోపిడీ అనేది అమ్మకం పని వల్ల పుట్టలేదనీ, ఉత్తమ సమాజంలో అమ్మకాలు, కొనుగోలు లేకుండా వస్తువులను వాడుకోవడం ఎలా సహజమైందో చెబుతారు. కానీ పెట్టుబడిదారీ సమాజంలో సరుకు కుదురుగా కూర్చోకుండా నాలుగు వైపులా తిరిగి, ఖర్చయిన పెట్టుబడినీ, లాభాన్నీ తెచ్చి ఇవ్వాల్సిందేననీ,
ఇది పోవాలంటే ఒక ఉత్తమ సమాజం ఏర్పడాలని మార్క్స్ ఎంగెల్స్ లు ఎలా కలలు కన్నారో చెప్పే ప్రయత్నం చేస్తారు.
నిజానికి మార్క్స్ అమ్మకాలూ, కొనుగోళ్ళూ లేని సమాజాన్ని సృష్టించుకోవాలని చెప్పాడు. అమ్మకం పని లేకుండా, సరుకుల చలామణి లేకుండా వుండే సమాజాన్ని మార్క్స్ కోరాడు. అదెలా సుసాధ్యమో కూడా చెప్పాడు.
మార్క్స్ ఎంగెల్స్ లు 1871 నాటి ‘అంతర్జాతీయ కార్మిక సంస్థ’ సమావేశంలో—-
‘ఆస్తిపర వర్గాల అధికారానికి వ్యతిరేకంగా జరగవలసిన పోరాటంలో కార్మిక వర్గం, తను ఒక భిన్నమైన రాజకీయ పార్టీగా, ఆస్తిపర వర్గాలు ఏర్పరచుకున్న అన్ని పాత పార్టీలకు భిన్నమైన పార్టీగా ఏర్పడినప్పుడు మాత్రమే – అది కార్మిక వర్గ పార్టీగా పాల్గొనగలదు. కార్మిక వర్గం, ఇలా ఒక రాజకీయ పార్టీగా ఏర్పడడం అన్నది, సమాజాన్ని మార్చే విప్లవ విజయానికీ; కార్మిక వర్గపు అంతిమ లక్ష్యమైన ‘వర్గాల రద్దు’ కూ తప్పనిసరి!’
ఈ సంకలనంలోని అన్ని వ్యాసాలూ అనేక విషయాలను నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా పెట్టుబడిదారీ విధానంలోని వర్తక పెట్టుబడి గురించి చాలా సరళమైన వివరణ దొరుకుతుంది.
తప్పక చదవండి.
*****
నేను ఆంగ్ల సాహిత్యం మరియు అర్ధశాస్త్రం లో ఎం.ఏ చేశాను. అయిల సైదా చారి గారి రెండు కవితా సంపుటాలూ, అందెశ్రీ గారి కొన్ని పోయెమ్స్, దెంచె నాల గురితప్పిన పద్యం కవితా సంపుటి ఇంగ్లీష్ అనువాదాలు చేశాను. అంగార స్వప్నం లో కూడా కొన్ని అనువాదాలు చేశాను. రంగనాయకమ్మగారూ, గాంధీ గారు సంకలనం చేసిన వర్గాల గురించి పుస్తక అనువాదం ఇటీవల విడుదల అయింది. మరికొన్ని అనువాదాలు పుస్తకాలు గా వెలువడ్డాయి.నా సమీక్షలూ, కవితలూ, వ్యాసాలూ, తెలుగు పత్రికల్లో వస్తుంటాయి. సారంగ లో, కౌముదిలో ఒకటీ రెండూ వచ్చాయి. మీ పత్రికకి పంపడం ఇదే ప్రథమం. సాహిత్య ప్రపంచానికి నాది పూర్తిగా కొత్త మొహం.