వెనుతిరగని వెన్నెల(భాగం-65)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి”కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ల అనుమతితో పెళ్లిజరుగుతుంది. పెళ్లయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయటపడు తుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీలో ఎమ్మే పాసయ్యి, పీ.హెచ్.డీ లో జాయినవుతుంది. శేఖర్ తో ఎన్నో రోజులు పోరాడి, చివరికి తన్మయి విడిపోతుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభుతో మళ్లీ పెళ్లి జరుగుతుంది. ప్రభుతో బాటూ అతని కుటుంబం కూడా వచ్చి చేరి, హింస మొదలవుతుంది.

***

          సాయంత్రం కాలేజీ నుంచి వస్తూ దార్లో బాబుని పికప్ చేసుకోవడానికి ట్యూషను దగ్గిరికి వెళ్లింది తన్మయి.

          స్కూలు కాగానే ఆటో సరాసరి ఇక్కడే దించేస్తుంది బాబుని. ఇక్కడే హోం వర్కులు పూర్తి చేసుకుని, చదువుకుంటూ ఉంటాడు. ట్యూషను టీచరే పిల్లాడికి  కాసిన్ని పాలు కలిపిచ్చేలా మాట్లాడింది తన్మయి. అందుకుగాను విడిగా డబ్బులు కట్టసాగింది.

          పొద్దుననగా తన్మయి కాలేజీకెళ్లి, సాయంత్రం వచ్చే వరకు పాపని నాగ సాయంతో ఇంట్లో వాళ్లంతా బానే చూసుకోసాగేరు.

          ప్రభు అక్క మనవరాలు బుజ్జిని కూడా దగ్గరలోని స్కూల్లో వేసేరు. పాప తల్లి రాణిని దగ్గర్లోని కుట్టు మిషను ట్రైనింగు సెంటర్లో జాయిను చేసింది తన్మయి. అమ్మాయి వచ్చేటపుడు స్కూలు నించి వాళ్ల పాపని తీసుకొచ్చుకుంటుంది. ప్రభు అక్క కొడుకు దాసుతో ఓపెన్ యూనివర్శిటీలో బి. కి కట్టించి ట్యూషను పెట్టించింది. ఇక భర్త లేని ప్రభు అక్క  మంగ ఎప్పుడు చూసినా హాల్లో టీవీకి అతుక్కుపోయి ఉండే తల్లికి, తండ్రికి అన్నీ అందిస్తూ చేదోడు వాదోడుగా ఉండి, ఇంటిల్లపాది పనీ చక్కబెట్టసాగింది.
ఇంటి పన్లకీ, బయటి పన్లకీ నాగ అందరికీ సాయం చెయ్యసాగింది.

          ఇంటద్దె, వెచ్చాలు, కరెంటు బిల్లు వంటి ఇంటి ఖర్చులు కాక ఇంత మందికీ అన్ని అవసరాలూ తీర్చగలిగే రెండు రెక్కలు ప్రభు, తను. నెల జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసినంతసేపు ఉండడం లేదు. బాకీలు తీర్చడానికే సరిపోసాగేయి.

          “మనకి జీతాలు ఎంత వస్తున్నాయో, ఎంత ఖర్చు అవుతూందో వంటి కష్టాలేవీ ఇంట్లో ఎవరికి తెలియనివ్వద్దుఅన్నాడు ప్రభు తన్మయితో.

          తన్మయికి ప్రభుని చూస్తే ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది. అసలు తనకి భవిష్యత్తు గురించిన భయం ఉన్నట్టే కనబడడు. సేవింగ్స్ అంటూ లేకుండా నెలకానెలే గడుస్తూన్నా ఖర్చుకి వెనకాడడు. ఇంటిల్లపాదినీ తీసుకునే సినిమాకైనా, షికారుకైనా వెళ్లాలి.

          తను కష్టాలు అనుభవిస్తూన్నా తన వాళ్లకి   కష్టమూ తెలియనివ్వకూడదనుకునే మంచి కొడుకుని కన్నందుకు వాళ్లు ఎంతో అదృష్టం చేసుకున్నారు. వీళ్లంతా వచ్చిన దగ్గిరనించి “తామిద్దరూ, తమఅనే పదాలు ప్రభు మర్చిపోయేడు.

          తన్మయి కూడా మర్చిపోవడానికి ప్రయత్నం చెయ్యసాగింది. కాలేజీ నుంచి వచ్చేటపుడు బస్టాండులో అమ్మే జామకాయలు, మొక్కజొన్నలు, మల్లెపూలుఏవైనా సరే ఇంట్లో అందరికీ తేవడం మొదలుపెట్టింది. వస్తూనే పాపనెత్తుకుని కిందే కాస్సేపు కూర్చుని, వాళ్లిచ్చే టీ తాగి,  వాళ్లతోబాటూ కాస్సేపు టీవీ చూసి ప్రభులాగే గడపసాగింది.
ప్రభు ఆనందానికి అవధులు లేవు.

***

          అంతా ప్రశాంతంగా గడుస్తున్న సమయంలో వారంలో గవర్నమెంటు జీవో 610 అమలులోకి వస్తుందన్న వార్త వచ్చింది. దాని ప్రకారం ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణా ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులు తిరిగి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లిపోవాలనేది సారాంశం. కాలేజీలో రోజంతా ఇదే చర్చనీయాంశమయ్యింది.

          “అయితే ప్రాంతీయ నియామక స్థానంలో అర్హులైన స్థానికులని కాదని స్థానికేతరు లకు అవకాశం ఇచ్చి ఉంటేనే జీవో వర్తిస్తుందని, లేకపోయినా స్వచ్ఛందంగా వెనక్కి వెళ్లాలనుకునే వారికి ఖాళీలను బట్టి వారి జిల్లాల్లో కోరుకున్న చోట నియామకం ఇస్తామనీ అంటున్నారుఅన్నాడు సిద్దార్థ.

          “అంటే నేను మా జిల్లాలో ఖాళీ చూసుకుని వెళ్లిపోవలసిందేనాఅంది దిగులుగా తన్మయి.

          “ఎందుకైనా మంచిది మీ నియామకం కాగితాలు ఒకసారి మళ్లీ చూడండి. మీ నియామకం వల్ల మరెవరి ఉద్యోగమూ మీకు ఇవ్వబడలేదన్న స్పష్టత ఉంటే బహుశా: మీరు ఇక్కడే ఉండొచ్చు. మా మిసెస్ కు హైదరాబాదు సెక్రటేరియట్ లో ఉద్యోగం రావడం వల్ల నేను జోనల్ ట్రాన్స్ ఫర్  చేయించుకుని వచ్చాను. నిజానికి జీవో ప్రకారం వెనక్కి వెళ్లిపోవాల్సి వస్తే మొదట నేనే వెళ్లాల్సి ఉండొచ్చుఅన్నాడు.

          “అయ్యో, అదెలాఅంది తన్మయి.

          “ఎలా ఏం ఉంది చెప్పండి, మళ్లీ మామూలే. మా జిల్లాలోనే ఉద్యోగం చేసుకోవడమే. ఇందువల్ల ఆమే, నేనూ అటూ ఇటూ తిరగాల్సి రావొచ్చు. గుడ్డిలో మెల్ల ఏవిటంటే ఇంకా మాకు పిల్లలు లేరుఅని చిర్నవ్వు నవ్వేడు వాతావరణాన్ని తేలిక చేస్తూ.

          అప్పటికే ఎకనామిక్సు మేడం దు:ఖపడ్తూ బయటికి వెళ్లడం గమనించింది తన్మయి.

          “తన నియామకం ప్రకారం వెళ్లాల్సి వస్తే పిల్లలతో తనెక్కడికి వెళ్లాలి? పుట్టిన ఊరుకి దగ్గర్లో ఉన్న కాలేజీలో జాయినయ్యి, తల్లి దగ్గిరే ఉండి రోజూ వెళ్లి వద్దామంటే  కుదిరేటట్టు లేదు.

          అసలే వచ్చే ముందు బాబుని చూసుకోవడమే భారమన్నట్టు మాట్లాడింది తల్లి. బాబుని చూడడమే కష్టమైతే, చంటిపాపని చూసుకోవడం అసాధ్యం. అయినా నాగ ఉంది కాబట్టి ఒప్పుకుంటుందేమోఅప్పుడేదో విసుగులో అలా అని ఉంటుంది. మరోసారి అడిగి చూస్తే పోయేదేం ఉంది?

          ఒకవేళ తనకి తమ ఊరికి దగ్గర్లో కాలేజీ దొరకక పోతే తన తర్వాతి ఆప్షన్  విశాఖపట్నమే

          కానీ తల్లి తన కూడా వస్తేనే తప్ప తనొక్కతీ పిల్లలతో సతమతమవ్వడం కోరి కష్టాలు తెచ్చుకోవడమే. నిజానికి విశాఖపట్నంలో ఉండడం వల్ల తన పీ.ఎచ్.డీ ఒక కొలిక్కి వస్తుంది కూడా. తన చిరకాల కోరిక నెరవేరుతుంది.

          ఇక ప్రభుకి హైటెక్ సిటీలో ఉద్యోగం కావడం వల్ల తనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ తన కూడా ఎక్కడికీ రాడు. తమ ఇద్దరి పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది.

          ప్రభు ఇక్కడా, తనెక్కడో. ఇద్దరూ వారానికో, రెండు వారాలకో కలుసుకోవాలి.
ముహూర్తాన తాము పెళ్లి చేసుకున్నారో గానీ పట్టుమని పదిరోజులు హాయిగా కలిసి ఉండే అవకాశం రావడం లేదు. ఇక రెండు చోట్లలో రెండు సంసారాలు, రాకపోకలంటే ఉన్న జీతాలతో ఎలా నెట్టుకురావాలో కూడా లెక్క వేసుకోవాలి.”

          తన్మయి తనలో తనే సుదీర్ఘమైన ఆలోచనల్లో మునిగిపోయింది. అన్నిటినీ మించి ప్రభుని వదిలి ఉండడానికి బాగా బెంగ వేసి దు:ఖం రాసాగింది. ప్రభు ఆలనాపాలనలతో నే ముందు తన జీవితంలో అనుభవించిన కష్టాలన్నీ సులభంగా మరిచిపోగలిగింది.
అతని తల్లిదండ్రుల ద్వారా మానసిక వేదన కలుగుతూన్నా తట్టుకోగలిగే శక్తిని తమ మధ్య ప్రేమే ఇస్తూంది.  

          ప్రభుతో జీవనం ప్రారంభించినప్పటి నుండి ప్రపంచం ఎటు తిరగబడినా  ప్రభు తనతో  ఉంటే చాలునన్న బేలతనం తనని ఆవరించడానికి ఎంతో సమయం పట్టలేదు తనకి. అతనిమీద ఒక్కోసారి ఎంత కోపం వచ్చినా లాలనగా అతని గొంతులోం చి పిలుపు వినబడేసరికి   కోపమంతా ఇట్టే కరిగిపోతుంది. అతనెప్పుడు వచ్చి తల నిమురుతాడా అని ఆశగా ఎదురు చూస్తుంది. అంతటి ప్రేమ పొందగలగడం తన అదృష్టం అనే అనిపిస్తుంది.

          బస్సు దిగి నడుస్తూ కళ్లు తుడుచుకుంది. జీవితం ఎంత విచిత్రమైందో కదా!
నిన్నా మొన్నటి వరకు బాబు విషయంలో ప్రభు తల్లీతండ్రీ గొడవ భరించలేక తనే విడిగా వెళ్లిపోవాలనుకుంది. ఇప్పుడు అదే అవకాశం తనకి రాబోతూంటే బాధపడ్తూంది.
షరా మామూలుగా అజ్ఞాత మిత్రుడినే వేడుకుంది.

          తన మొర ఆలకిస్తున్నట్టు ఆకాశంలోంచి మొదటి చినుకొచ్చి సరిగ్గా తన్మయి తల మీద పడింది. స్టాండులోని బండి తీస్తుండగానే కుండ పోతగా వాన మొదలయ్యింది.
వర్షాకాలపు తొలి వానే ఇంత ఉధృతంగా కురవడం గొప్ప ఆహ్లాదంగా అనిపించడంతో ఎక్కడా ఆగకుండా రాసాగింది.

          సరిగ్గా జంక్షనులో నుంచి దాటి చిన్న రోడ్డు మలుపు తిరిగిందో లేదో వెనకే కీచుమన్న బ్రేకుల చప్పుడు, బస్సు ఢీకొట్టి ఏదో బండి పల్టీలు కొట్టిన శబ్దం వినిపించింది తన్మయికి.

          ఒక్క నిమిషం మెదడు మొద్దుబారిపోయింది తన్మయికి.

          తనకి ప్రమాదం తృటిలో తప్పింది. పాపం తన వెనకే వస్తున్న ఎవరికో ప్రమాదం జరిగింది. బండి పక్కకు తీసి స్టాండు వేసి గభాలున చుట్టూ ఒకరిద్దరితో బాటూ అటు పరిగెత్తింది.

          బస్సు ఢీ కొట్టిన వ్యక్తి మరో పక్కకి పడడంతో అదృష్టం కొద్దీ పెద్ద గాయాలేవీ తగల కుండానే బయటపడ్డాడు, కానీ బండి మాత్రం చక్రాల కిందికి వెళ్లి పనికిరాకుండా అయిపోయినట్లుంది.

          ఇంటీకొచ్చినా వణుకు తగ్గలేదు తన్మయికి.

          ఆ స్థానంలో తనని ఊహించుకోవడానికే భయం వేసింది.

          “అమ్మో తనకేమైనా అయితే తన పిల్లలు…” అనే ఆలోచనే భయంకరమై బెదురు పట్టుకుంది. ప్రభు ఇంటికి వచ్చేంత వరకూ ఫోను మీద ఫోను చేస్తూనే ఉంది.జాగ్రత్తగా  మెల్లగా రమ్మని పదే పదే చెప్పింది.

          ప్రభు మేడమీదికి రాగానే గబుక్కున అల్లుకుని చిన్నపిల్లలా రోదించసాగింది.  

          “నీకెప్పుడూ ఏవీ కాదు. అంతలోకే ఇలా భయపడితే ఎలారాఅని తలా నిమరసాగేడు ప్రభు

          రాత్రంతా కరెంటుపోయి ఉరుములూ, మెరుపులతో వర్షం కురుస్తూనే ఉంది

          తెల్లారగట్ల మెలకువ వచ్చి ప్రభుని, పాపని మార్చి మార్చి చూస్తూమన బంగారం నాన్నని వదిలి మనం ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లొద్దురా పాపాయీఅని పాప చెవిలో గొణిగింది.

***

          మరో నెల రోజులు గడిచిపోయినా 610 జీవోకి సంబంధించి నోటీసులేవీ రానందున అంతా ఊపిరి పీల్చుకున్నారు

          స్వచ్ఛందంగా వెళ్లాలనుకునే వారు మాత్రం అప్లికేషన్లు  పెట్టుకున్నారు. రోజూ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకూ ఎలా గడుస్తుందో తెలియని ఉరుకుల పరుగుల జీవితమయ్యింది తన్మయికి.

          కాలేజీలో ఉన్నంతసేపూ కాలేజీ పిల్లలే లోకమైనా, ఇంటికి రాగానే తన పిల్లలే జీవితంగా గడపసాగింది. అడపా దడపా ప్రభు తల్లిదండ్రుల అసంతృప్తి ఏదో విధంగా బయట పడ్తూ ఉన్నా ప్రభు తన జీతం మొత్తం వాళ్ల చేతుల్లో పెడ్తూ ఉండడం వల్ల ఎక్కడికక్కడ సమాధానపడ్తున్నట్టే కనబడసాగేరు.

          కానీ పాప పట్ల ప్రభు తరఫు వాళ్లంతా కురిపిస్తున్న ప్రేమ మాట అటుంచితే,  బాబు పట్ల అంతా చూపించే వివక్ష స్పష్టం కాసాగింది రోజురోజూకీ

          అంత మంది మధ్యా తన చిన్ని ప్రాణానికి తల్లే లోకంగా పెరుగుతున్న బాబు అందరిలో ఒంటరిగా పెరుగుతున్నట్టే అనిపించసాగింది తన్మయికి. వాడు కూడా ఎక్కడా బయట పడకుండా లోపల్లోపల మధనపడుతున్నాడని అనిపించినా ఏమీ చేయలేక చూసీ చూడనట్లు మౌనం వహించసాగింది.

          పాపాయి మొదటిపుట్టినరోజు నాడు అదంతా స్పష్టం అయ్యింది

          ఇంటి బయట అంతా లైటింగ్ సెట్లు పెట్టించి, కాలనీలోని వాళ్లందర్నీ పిలిచి పెద్ద ఎత్తున చెయ్యాలన్న బేబమ్మ ప్రతిపాదనకి ప్రభు ఆమోదం తోడవ్వడంతో అంతా ఉత్సాహంగా పనులు చెయ్యసాగేరు

          ఇంటి పట్టునే ఉండడంతో కాలనీ వాళ్ళందరికీ బేబమ్మ, మంగ, రాణి పరిచయస్తు లయ్యి, మంచి స్నేహితులయ్యినట్టు మొదటిసారి గమనించింది తన్మయి.

          అంతా కొత్త బట్టలు వేసుకుని, బ్యూటీ పార్లర్లకి వెళ్లి మరీ తయారయ్యి వచ్చేరు

          మొదటిరోజు పీచుముడి వేసుకుని , ముతక చీర కట్టుకుని వచ్చిన బేబమ్మకి, ఇప్పటి బేబమ్మకి పోలికే లేదు.

          కొత్తగా వస్తున్న చిప్సు కుట్టిన షిఫాను చీర కట్టుకుని, జుట్టు భుజాల వరకు కత్తిరించుకుని ఇరవయ్యేళ్ళ చిన్నదానిలా తయారయ్యింది

          ఆ మాటకొస్తే ఆవిడ కూతురైన మంగే వయసుకి తగ్గట్టుగా అంచు జరీ చీరొకటి  కట్టుకుంది. ఇక రాణి, దాసు, బుజ్జిలకి అదో పెద్ద పండగే అయ్యింది

          వీళ్లంతా ఇంత ప్లాన్డ్ గా ప్రిపేర్ అయ్యారన్న సంగతి  తన్మయికి  రోజు మధ్యాహ్నం వరకూ తెలియలేదు

          లక్కీగా చంటిదానితో పాటూ బాబుకీ కొత్తబట్టలు కొంది కాబట్టి సరిపోయింది. లేక పోతే వాడు వీళ్లందరినీ చూసి తనకి కొనలేదని బాధపడేవాడు అనుకుంది తన్మయి

          తన్మయి, ప్రభు తమ పెళ్లి బట్టలు వేసుకున్నారు

          ప్రభు మధ్యే కొన్న కొత్త కెమెరాతో ఇంటిల్లపాదికీ ఫోటోలు తియ్యడంలో నిమగ్న మయ్యేడు

          నిమిషానికోసారి ఏదో పనున్నట్టు బేబమ్మ బాబుని పక్కకి పిలిచి వచ్చిన వాళ్లకి కూల్ డ్రింకులు, ప్లేట్లు  అందించే పన్లు అప్పగించసాగింది

          రాణి, దాసుతో సహా అంతా వచ్చిన కాలనీ బాటూ వాళ్లతో కుర్చీలలో కూర్చున్నారు

          నాగతో బాటూ బాబొక్కడే  పన్లన్నీ చేస్తుండడం లేటుగా గమనించింది తన్మయి.

          పొద్దుట్నించీ బాబు ఎక్కడ ఏది ముట్టుకోబోయినా ప్రభు తల్లీతండ్రీ “అది  పాడు చెయ్యొద్దు , ఇది పాడుచెయ్యొద్దుఅని  మందలించి ఇప్పుడు పనులన్నీ వీడితో  చేయించడం చూసి మనసు చివుక్కుమంది తన్మయికి

          పోనీ ఇంట్లో అంతా తలోటీ అందిస్తూ బాబుకి కూడా చిన్నపనేదో చెప్తే అది వేరే సంగతి.  

          కేకు కత్తిరించే సమయానికి బాబుని అవన్నీ పక్కకి పెట్టి రమ్మని తీసుకొచ్చి పాప దగ్గిరే కూచోబెట్టింది తన్మయి.  

          వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ బిజీగా ఉన్నా “నాన్నా , ఏమైనా తిన్నావాఅంటూ మధ్య మధ్య బాబు గురించి పట్టించుకుంటూ ఉంది

          అయినా వాడిపోయిన వాడి ముఖాన్ని చూసి ఏమైందమ్మా అంది అంతా వెళ్లి పోయేక

          “అమ్మా! నన్ను వెళ్ళిపోమంటున్నారుఅన్నాడు దుఃఖం నిండిన కళ్లతో

          తన్మయికి చివాలున రక్తం కళ్ళలోకి వచ్చినంత కోపం వచ్చింది

          “ఎవరమ్మా?” అంది వాణ్ణి గుండెలకు హత్తుకుంటూ

          “కింద… ” అంటూ చూపించిపోరా మీ నాన్న దగ్గిరికి పో.. నీ వల్ల నా కొడుక్కిమాకు మనశ్శాంతి లేదుఅన్నారమ్మా అన్నాడు

          చటుక్కున పిల్లాడి రెక్క పుచ్చుకుని కిందికి తీసుకొచ్చింది తన్మయి.

          “ఎవరు పిల్లాణ్ణి వెళ్లిపొమ్మని అంటున్నదిఅని ఒక్క అరుపు అరిచింది.

          అంతా టీవీ ముందు కూచుని సీరియల్లో నిమగ్నమైపోయి ఉన్నవాళ్లు కాస్తా ఒక్క ఉదుటున ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్ళిపోయేరు.

          ప్రభు, అతని తల్లి తండ్రీ మాత్రం మిగిలేరు

          తన్మయి బాబుని పాప దగ్గిరికి పైకి తీసుకెళ్లమని నాగకి అప్పగించి అలాగే ఉరిమి చూసింది.

          “నేనేఏంటంటఅన్నాడు ప్రభు తండ్రి గారపళ్లు కొరుకుతూ

          “మీకు ఆఖరుసారి చెప్తున్నాను, మరోసారి పిల్లాడితో ఇలాంటి మాటలు మాట్లాడితే ఒప్పుకునేది లేదుఅని విసవిసా పైకి వచ్చేసింది తన్మయి

          అక్కడే మౌనంగా కూచున్న ప్రభు మీద ఇద్దరూ అరవడం వినిపిస్తూనే ఉంది.

          “నా మనవరాలితో సమానంగా కూకోనాకి పిల్లోడు ఎవడూ అంట” 

          “ఏం ఇంట్లో సిన్న పని సేస్తే అరిగిపోతాడా ఆడు నీ పెళ్ళాం ఆణ్ని  మద్దిలో లాక్కెల్లి  పోతాదా?” 

          “వొచ్చినోల్లందరికీ ఆడు మా మనవడు కాదని సెప్పుకోలేక సచ్చేం.”

          “ఈ వొయసులో మాకీ  బాదలేటీ అంట” 

          “……………………………………………….” 

          ప్రభు యథావిధిగా అక్కడంతా మారు మాట్లాడకుండా ఉండి  మేడ పైకి రాగానేనీకెన్ని సార్లు చెప్పాలి మా వాళ్ళ మీద నువ్వు అరవకూడదనిఅన్నాడు గట్టిగా కింది వాళ్లకు వినబడేటట్లు.  

          తన్మయి రెండు చేతులూ జోడించి నమస్కారం పెట్టి  హాల్లో ఒక్కడే నిద్రపోతున్న బాబు దగ్గిరికి వెళ్లి పడుకుంది

          వెనకే తలుపు మూసుకున్నాడు ప్రభు.  

          తన్మయి వెచ్చని కన్నీటితో బాబు తల తడవసాగింది

          ఆదమరిచి నిద్రపోతున్న వాడి తల నిమురుతూ “నన్ను క్షమించు నాన్నా! నీకు ఇంతకంటే గొప్ప జీవితాన్ని ఇవ్వలేని తల్లిని క్షమించుఅంది

***

          ఆ మర్నాడు తన్మయి కాలేజీలో ఉండగా జ్యోతి నుంచి ఫోను వచ్చింది.

          “పాపాయి పుట్టినరోజుకి పిలవలేదని బాధపడి ఉంటుందా?” అని ఆలోచిస్తూ  స్టాఫు రూము లోంచి బయటికొచ్చింది తన్మయి

          అయినా తనకే మర్యాదలేని ఇంటికి తల్లిని పిలవడం అంత తప్పుపని ఇంకొకటి లేదు. అదే చెపుదామని నిర్ణయించుకుంది.  

          అట్నించి జ్యోతితన్మయీ!” అని గట్టిగా అంది.

          ఆ గొంతులో గాభరాని ఇట్టే పసిగట్టింది తన్మయి.

          “ఏవిటమ్మా ఏమయ్యింది? నీకు ఆరోగ్యం బానే ఉందా?” అంది కంగారుగా ఇట్నించి.

          “నా ఆరోగ్యం బాగా ఎలా ఉంటాదమ్మా ముదనష్టపు మూక పాలబడ్డాకఅంది ఏడుపు గొంతుతో జ్యోతి

          పక్క నుంచి దేవి గట్టిగాఏమ్మా, నీ కూతురు మళ్లీ పెళ్లి చేసుకుని పిల్లా పాపల్తో సంతోషంగా కులుకుతా ఉంటే, మేం మా మనవణ్ణి ఎక్కడికెళ్లి చూసుకోవాలీ అంట, మా మనవణ్ణి మాకు ఇచ్చెయ్యమను……” అని అరవసాగింది.

          “ఇదిగో తల్లీ, ఈవిడికి నువ్వే సమాధానం చెప్పు. మీరందరూ కలిసి నన్ను ఎప్పటికీ ప్రశాంతంగా బతకనివ్వరన్న మాటఅని తన్మయితో ఈసడింపుగా అంది జ్యోతి.

          తన్మయికి అరికాలి నుంచి కోపం తలకెక్కింది

          “అమ్మా, ఆవిడ అసలెందుకొచ్చింది? నువ్వెందుకు రానిచ్చేవు? అయినా ఆవిడకి దేనికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదని, బాబుని ఇవ్వడం ఎట్టి పరిస్థితు ల్లోనూ కుదరదని చెప్పుఅంతే విసురుగా అంది తన్మయి.

          “ఆహాఅలాగైతే  ఎల్లి ఆళ్లింటి కాణ్ణే తేల్చుకుంటాం. పిల్లోణ్ణి  ఎప్పుడంటే అప్పుడెళ్లి చూసుకునే హక్కు మాకు ఉంటాది”  అని అవతలి నించి రంకెలు వెయ్య సాగింది దేవి.

          జ్యోతి గట్టిగాఅమ్మా తల్లీ! నీ కొడుకుని తీసుకెళ్లి హాస్టల్లోనో అంట వెయ్యిఈవిడగారి కొడుక్కి అప్పుడప్పుడూ కొడుకు మీద ప్రేమ ఒచ్చి పడతా ఉంటది. నెలకి పంపాల్సిన ముష్టి మూడొందలు కూడా ఏనాడో మానేసేడు గానీ, సిగ్గులేని బతుక్కి పిల్లోడు కావలసి వచ్చేడుఅని అంటిచ్చింది.

          దేవి పక్కనే శేఖర్ ఉన్నాడన్న సంగతి అప్పుడు అర్థమయ్యింది తన్మయికి. 

          హఠాత్తుగా తలపోటు వచ్చెయ్యసాగింది

          మరో  పక్క దు:ఖమూ, బాధా, ఉక్రోషమూ కలగాపులగంగా ముంచెత్తసాగేయి.

          దేవి అన్నంత పనీ చేసి వాళ్లు ఇంట్లో ప్రత్యక్షం అయ్యేరంటే ఇంక ఇంట్లో జరిగే గొడవ ఊహించుకోవడం కూడా ఇష్టం లేదు తన్మయికి

          పోనీ ప్రభుతో చెప్దామంటే, తను మొదటే చెప్పేడు ఇలాంటివేవీ తనకి చెప్పొద్దని. పైగా బాబు విషయాలంటే అసలేవీ పట్టవు ప్రభుకి. కానీ ఇంట్లో గొడవ జరిగితే మాత్రం తిరిగి తనమీదే గందరగోళం చేస్తాడు

          తన్మయికి ఎందుకో సిద్దార్థకి కూడా ఏవీ చెప్పాలని అనిపించడం లేదు. అస్తమాటూ తన కష్టాలని అతనికి చెప్పి ఆతనినీ బాధ పెట్టడం బాగా అనిపించడం లేదు

          ఎవరికీ చెప్పుకోలేని సమస్యని దాటడం ఎలా?

          ఎన్నో కష్టాలు అనుభవిస్తూన్నా తను, తన పిల్లలు కలిసి ఒక్క చోట ఉన్నామన్న ఆనందంతోనే జీవితం మాత్రమైనా ఆనందంగా గడుస్తూ ఉంది.

          ఇప్పుడు మళ్ళీ ఇదొక సమస్య లేవనెత్తుతున్నారు శేఖర్, అతని తల్లి కలిసి.

          తనని ఇన్ని కష్టాలు పెట్టేటంత తప్పు తనేం చేసింది?

          ఫోను పెట్టేసేక కూడా గుండె పట్టేసినట్లు బాధ కలగసాగింది తన్మయికి.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.