వేతన వెతలు

(నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-కె.విజయ ప్రసాద్

          వసంతకు కొంత అలసటగా ఉంది. నడుం వాలుద్దామనుకుంది. కానీ సునందకు
తనిచ్చిన వాగ్దానం గుర్తుకొచ్చింది. వాళ్ళబ్బాయి రమేష్‌ పుట్టినరోజు పండుగకు తప్ప కుండా వస్తానని వాగ్దానం చేసింది. వసంత, సునందల స్నేహం ఈనాటిది కాదు. రెండు దశాబ్దాల నుంచి ఫ్రండ్సు. 

          భర్త మనోజు యింకా రాలేదు. అతను నలభై కిలోమీటర్ల దూరంలోని ఒక
పల్లెటూరులో టీచరుగా అఘోరిస్తున్నాడు. అతనితో పోలిస్తే తన ఉద్యోగమే కొంచెం దగ్గరలో, అంటే ఒక ముప్పయి కిలోమీటర్ల దూరంలో ఉంది. తను పని చేసే ఊరుకు బస్సు సౌకర్యం బాగా ఉంది. కాబట్టి బస్సులో ప్రయాణం పెద్ద అలసట అనిపించదు. కానీ మనోజు చాలా యిబ్బంది పడవలసి వస్తుంది. ఆటోలో పోయి ఒక వూరులో దిగాలి. అక్కడ తను పార్కు చేసిన మోటరు సైకిలు మీద తను పనిచేసే కుగ్రామంకు పోవాలి! ఆ కుగ్రామం దాకా అతని టైముకు ఆటోలు దొరకవు. రోడ్లు బావుండవు గనుక ఒక్కోసారి ప్రయాణంకు రాను రెండు గంటలు, పోను రెండుగంటలు పడుతుంది. ఇద్దరూ టీచర్లే కాబట్టి సెలవులు వారి పాలిట వరం.

          స్నానం చేసి బట్టలు మార్చుకుంది. మనోజు వస్తే అతడిని తీసుకువెళ్ళాలి. పిల్లలు ట్యూషనుకు వెళ్ళి రాత్రి ఎనిమిది తరువాత కాని రారు. కిట్టు చదువుతున్నది ఏడవ క్లాసు, బుజ్జి చదువుతున్నది ఆరు. కానీ పిల్లలకు యిప్పట్నించే కఠినమైన క్రమశిక్షణ అలవర్చక పోతే పెద్దయిన తరువాత ఈ పోటీ ప్రపంచంలో మంచి ఉద్యోగాలు సంపాదిం చుకోలేరు. తమలాగా అప్‌ అండ్‌ డౌనులు చేస్తూ నిస్సారంగా జీవించాలి. అందుకే వారి చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, బాగా ఖర్చు పెడుతున్నారు.

          ఇంతలో వుస్సూరంటూ మనోజు లోపలికి వచ్చాడు అలసటతో. కాఫీ కలిపి యిచ్చింది వేడిగా. ప్లేటులో పోసి కొన్ని స్నాక్సు యిచ్చింది. ‘‘ఎక్కడికో  తయారైనట్లు న్నావు?’’ వసంత డ్రస్సు చూసి అడిగాడు మనోజు.

          ‘‘మరే మీకు గుర్తు లేదా, సునంద వాళ్ళబ్బాయి రమేష్‌ పుట్టినరోజు మనల్ని తప్ప కుండా రమ్మంది. మీదే ఆలశ్యం. మీరు తయారైతే వెళ్ళి రావచ్చు. గిఫ్టు దారిలో కొనాలి!’’ చెప్పింది వసంత.

          మనోజు విసుగ్గా చూశాడు. స్కూల్లో ఇవ్వాళ పని ఎక్కువైంది. ఆటో దొరకడం కూడా ఆలశ్యం అయింది. ఆ సెవెన్‌ సీటరు ఆటోలో పుష్పకవిమానంలోకి ఎక్కించినట్లు మనుషుల్ని ఎక్కిస్తూనే ఉంటాడు అటోవాలా. దాంతో ఒళ్ళు నుజ్జు నుజ్జు అవుతుంది. ‘‘సారీ! నాకు అంత ఓపిక లేదు. నువ్వొక్కదానివి పోయిరా చాలు’’ చెప్పాడు మనోజు కాఫీ చప్పరిస్తూ.

          ‘‘మీరొస్తే బాగుంటుంది!’’ దీనంగా అడిగింది కొంచెం డిజప్పాయింటు అయి.

          ‘‘నీకు నేను చెప్పింది అర్థం కావడం లేదా? నా వల్ల కాదు. ఆటోలో వెళ్ళి ఆటోలో వచ్చెయ్యి. నా తరపున శుభాకాంక్షలు చెప్పెయ్యి!’’ అంటూ దివానీకాట్‌కు అడ్డం పడ్డాడు మనోజు ఒళ్ళు హూనం కావడంతో. అర్థం చేసుకుని వసంత ఒక్కతే బయలు దేరింది సునంద యింటికి. అరగంటలో ఆమె యిల్లు చేరుకుంది చిన్న గిఫ్టుతో. సునంద ఎదురొచ్చింది.

          ‘‘అరే మీ సారు రాలేదా? ఆటోలో వచ్చావు!’’ సునంద అడిగింది.

          ‘‘ఆయనకేదో అర్జెంటు పనిపడింది. వద్దామనుకున్నా రాలేని పరిస్థితి! రమేష్‌కు శుభాకాంక్షలు చెప్పమన్నాడు.’’ అంటూ లోపలికి నడిచింది వసంత.

          హాల్లో రమేషు, అతని మిత్రులు వున్నారు. పెద్ద వాళ్ళెవరూ రాలేదు.

          ‘‘వసంతా! ఈ సంవత్సరం బాబు బర్త్‌డేను గ్రాండుగా చెయ్యడం లేదు. కరోనా
భయం ఉందిగా. అందుకే వాడి స్నేహితులను పిల్చుకున్నాడు. నేను మీ ఫ్యామిలీ
ఒక్కరినే పిలిచాను. వచ్చిందానికి థ్యాంక్సు! వాడు యిందాకటి నుండి కేకు కట్‌
చెయ్యడానికి ఉరుకులాడుతున్నాడు.’’ చెప్పింది సునంద.

          ‘‘మనోజు రాలేదా! థ్యాంక్‌ గాడ్‌! మీ రన్నా వచ్చారు.’’ సునంద భర్త హరి
పలకరించాడు, చాటంత మొహం చేసుకుని.

          కాసేపటికి రమేష్‌ కేకు కట్‌ చేసి, తల్లిదండ్రుల నోటికి కేకు పీసులు అందించాడు. ఆంటీకి కూడా ఒటిచ్చాడు. అందరూ చప్పట్లు కొట్టి హ్యాపీ బర్తుడే సాంగ్‌ పాడారు. బెలూన్లు ఎగరవేశారు. వచ్చిన అందరికి ప్లేట్లలో స్వీటు, కారా అందించింది సునంద.
ఆ తర్వాత వసంత, సునంద డాబాపైకి వచ్చారు. చల్లటి గాలికి వెన్నెల్లో కబుర్లు చెప్పుకుందామని. రెండు కుర్చీల్లో కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు.

          ‘‘అన్నట్లు నీ స్కూలు ఎలా ఉంది?’’ అడిగింది వసంత.

          ‘‘స్కూలు ఎలా ఉంటుంది? ప్రయివేటు స్కూలు కదా! టీచర్లని చావగొడుతుంటారు
పని ఒత్తిళ్ళతో. ఆఖరికి సెలవుల్లో కూడా ఏవో చిన్న పన్లు చెప్పి స్కూలుకు పిలిపిస్తూ ఉంటారు. ప్రతిరోజూ ఏడుగంటల పైన పని. లీజరు పీరియడు అన్నది టైము టేబుల్లో ఉంటుంది. కానీ ఆ టైములో కూడా చచ్చేంత గొడ్డు చాకిరీ చేయిస్తూ ఉంటారు.’’ సునంద చెప్పింది విచారంగా.

          ‘‘అయితే ఇంకా వాళ్ళు టీచర్లని మనుషుల్లాగా చూడ్డం లేదన్నమాట.’’ బాధగా
అన్నది వసంత.

          ‘‘సరేలే, మొన్నయితే సరోజమ్మని పెద్దావిడ పాఠం చెప్పి నిల్చోలేక ఒక పది నిమిషాలు కూర్చుంది. ఆమె దురదృష్టం అదే టైముకు మేడం రౌండ్సుకు వచ్చింది. ఇంకేముంది కళ్ళల్లో నిప్పులు పోసుకుని ఆ కుర్చీని ఒక్క తన్ను తన్నింది. అది పోయి వరండాలో పడింది. పాపం! పాతికేళ్ళు సర్వీసున్న సరోజమ్మ ఖంగుతినింది. అంతటితో వూరుకోకుండా మరునాటి నుండి అన్ని సెక్షన్లల్లో కుర్చీలు తీయించి పారేసింది. టీచర్లు నిలబడే పాఠాలు చెప్పాలి! పాఠం అయిపోయినా, పిల్లలు పరీక్షలు రాస్తున్నా, చచ్చినట్లు
నిల్చునే ఉండాలి టీచర్లు. అదేం ఖర్మో ప్రయివేటు టీచరు అయినదానికి నిల్చుని నిల్చుని చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు తెచ్చుకోవలసి వస్తున్నది. నువ్వు అదృష్టవంతురాలివి కనుక నీకు గవర్నమెంటు టీచరు పోస్టు దొరికింది.’’ సునంద ఊపిరి పీల్చుకోవడానికి ఆగింది, ఈర్ష్యను దాచుకుంటూ.

          ‘‘దీని మీద ఎవరన్నా కోర్టుకు పోతే బాగుంటుంది! ప్రయివేటు స్కూళ్ళ యాజమాన్యం చేసే దౌర్జన్యాలపైన గళం ఎత్తి ఆందోళన చెయ్యాలి.’’ వసంత.

          ‘‘నీ మొహం వసంతా! మా ఉద్యోగాలు తుమ్మితే ఊడే ముక్కులు! ఎన్ని
సంవత్సరాలు పని చేసినా పర్మనెంటు అనే మాట ఉండదు. ఒక నెల కిందట, మన
సీనియరు టీచరు సీతారాంను తొలగించారు తెల్సా! ఇంతకీ అతను చేసిన తప్పేమిటం టే అమ్మాయిలను ఆట పట్టిస్తున్న ఒక పోకిరీని కొట్టడం, వాడి తల్లిదండ్రులు దాన్ని సీరియస్సుగా తీసుకొని కేసు పెట్టారు. దాంతో అంత మంచి టీచరును నిర్దాక్షిణ్యంగా డిస్‌మిస్‌ చేశారు.’’ సునంద.

          ‘‘ఇంతకీ జీతాలు సక్రమంగా యిస్తున్నారా?’’ అడిగింది వసంత అనుమానంగా.
‘‘నీకు తెలియనిది ఏముంది, నెలంతా కష్టపడి పని చేసినా ముష్ఠి విదిలించినట్లు ఓ
పది రోజుల తర్వాత ఏడ్చుకుంటూ యిస్తారు. మొన్న కరోనా కాలంలో అయితే
మాకు సగం జీతాలే యిచ్చారు. ఇంకా జూనియర్లనైతే యింటికి పంపించారు. ఏమంటే
లాసు వచ్చింది అంటారు కరోనా పీరియడులో. పిల్లల నుంచి ఫీజులు మటుకు ఠంచ నుగా వసూలు చేశారు, మరి లాసు ఎక్కడ వచ్చిందో అర్థం కాదు. మేనేజిమెంటుకు
సలాములు కొడుతూ నా లాంటి వాళ్ళు బండి లాగిస్తూ ఉంటారు.’’ సునంద ఆక్రందన
అది.

          ‘‘అడక్కూడదు కానీ నీ కిప్పుడు ఎంతిస్తున్నారు?’’ వసంత అడిగింది.

          ‘‘గొర్రె తోక మా జీతాలకంటే పొడవుగా ఉంటుంది. చెప్పుకుంటే సిగ్గు చేటు నాకు పన్నెండు వేలు యిస్తున్నారు యింత సర్వీసు చేస్తే! ఇండియాలో చీపెస్టు లేబరు ఎవరంటే టీచర్లేగా! మా కంటే కూలీలు నయం! నువ్వు అదృష్టవంతురాలివి కాబట్టి ఈ నరకం నుండి బయట పడి గవర్నమెంటు టీచరయ్యావు. ఈ మధ్య మీ జీతాలు బాగా పెరిగాయి కదూ!’’ సునంద అడిగింది.

          ‘‘యం.ఏ., యం.పడ్‌ చేసిన నీకు, అదీ దాదాపు పదిహేను సంవత్సరాల సర్వీసు వున్న నీకు పన్నెండు వేలా యిస్తున్నాది?’’ బాధగా అడిగింది. ‘‘స్కూలు సరిగ్గా నడవడం
లేదా?’’

          ‘‘ఎందుకు నడవడం లేదు, సంఖ్య బాగా పెరిగింది. బ్రాంచీలు కూడా పెడు తున్నారు. బిల్డింగులపైన బిల్డింగులు కట్టిస్తున్నారు. కానీ టీచర్ల జీతాలు పెంచమని
అడిగితే మటుకు తీసుకున్న అప్పులకే వడ్డీలు కట్టలేక పోతున్నాం. మీకు జీతాలు
పెంచాలా? పని చేస్తే చెయ్యండి లేకపోతే మానుకోండి అంటారు.’’ సునంద
నీరసంగా అంది.

          ‘‘ఏం లోకం గొడ్డుపోయిందా! అందరూ మానేస్తే వాళ్ళ తిక్క కుదురుతుంది.’’
వసంత ఆవేశంగా అంది.

          ‘‘భలే దానివే! కుదిరేది వాళ్ళ తిక్క కాదు, మాది. మళ్ళీ మాకు కొత్తగా ఉద్యోగాలు ఎవరిస్తారు? ఇచ్చినా యింత ఎందుకిస్తారు. ఏ అయిదో, ఆరో యిస్తామని బేరాలు పెడతారు. మాకంటే బయట కూలీ చేసుకు బతికే డైలీ వర్కర్లు బాగా సంపాదిస్తున్నారు. వారికి వున్న స్వేచ్ఛ స్వాతంత్య్రాలు కూడా మాకుండవు.’’ జీరగొంతుతో చెప్పింది సునంద.

          ‘‘అయితే నువ్వు చెప్పినట్లు నిజంగా నే అదృష్టవంతురాలిని, పర్మనెంటు జాబు,
బాసిజం లేని జాబు. పాఠాలు చెప్పినా చెప్పకపోయినా అడగరు.’’ ‘‘అంతే కాదు రెగ్యులర్‌గా స్కూలుకు పోకపోయినా అడగరు. కొన్ని రోజులు ఎగ్గొట్టి, అటెండెన్సు రిజిస్టరులో సంతకాలు పెట్టినా చూసే వాడు లేడు.’’ 

          సునంద అలా అనే సరికి వసంత ముఖం కొంచెం నల్లబడింది.

          ‘‘ఏంటి జీతాలు పెంచమని ఆందోళన చేస్తున్నారట. కొత్త పీఆర్‌సీలో మీకు
భారీగా నష్టం వాటిల్లిందట, నిజమా?’’ సునంద అడిగింది.

          ‘‘అవును, కొన్నింట్లో కోతలు పడ్డాయి. ప్రతి పే రివిజనులో జీతాలు భారీగా
పెరుగుతాయని ఎదురుచూస్తూ ఉంటాం! కానీ ఈ సారి మటుకు సారీ ఎదురైంది.’’

          ‘‘ఇప్పుడు నీకెంత వస్తున్నది?’’ కుతూహలంగా అడిగింది సునంద.

          ‘‘అరవై వేలపైన వస్తుంది.’’ గర్వంగా చెప్పింది వసంత.

          ‘‘మరి కొత్త జీతం ఎంత?

          ‘‘బహుశ: డెబ్బై పైన రావచ్చుట!’’

          ‘‘అంటే పదివేలు పెరిగింది కదా! అయినా చాలదు కదూ!’’

          ‘‘నీ మొహం నీకేం తెలుసు మా లెక్కలు! మేము పడే కష్టానికి ఎంతిచ్చినా చాలదు.
మాకు యూజిసీ స్కేల్సు ఉంటే బాగుంటుంది.’’ చెప్పింది వసంత.

          సడెన్‌గా వారి ముందుకు వచ్చి హరి రెండు కూల్‌డ్రిరకు బాటిల్సు అందించాడు.
ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ‘‘మీకెందుకు శ్రమ?’’ వసంత.

          ‘‘వసంతగారు! మీ సంభాషణ కొంత విన్నాను. భారతదేశంలో పరిస్థితులు ఎలా
వున్నాయంటే బిటెక్కు చదివి, యంబిఏ చేసిన చాలా మందికి సరైన ఉద్యోగాలు దొరకడం లేదు. వారిలో చాలా మంది పదివేల రూపాయల వేతనానికి రాత్రిం బగళ్ళు పని చేస్తున్నారు. మీ కంటే బాగా చదువుకున్న వాళ్ళు కూడా నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్ళు అయిదువేలకైనా పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నో  విద్యార్హతలున్న వాళ్ళు కూడా ప్రయివేటు స్కూళ్ళల్లో అయిదు వేలకు కూడా పని చేస్తున్నారు. అలాంట ప్పుడు ప్రభుత్వం మీ ఉద్యోగులందరికి యిచ్చే జీతాలు మంచిగా లేవా?’’ హరి ప్రశ్న.

          ‘‘ఏవనుకోవాకు వసంతా! మా వారు హరి కేవలం పదివేలకు ఒక ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయనకు సెలవలంటూ ఉండవు. ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో వున్నట్లే వుంటుంది. ఆ కడుపు మంటతో అలా అంటున్నారు. ఏమీ అనుకోవద్దు! మీరు

          ఊరుకోండి సారు!’’ మందలించింది సునంద.

          ‘‘నిజమే! వీరి జీతాలు పెరగాలి! కాని అందుకు తగ్గట్టుగా సామాన్య మానవునికి
ఆర్థిక పెరుగుదల ఉందా! ఆరుగాలం కష్టపడుతున్నా రైతులు గిట్టుబాటు ధరలు
లేక, ఆదుకునేవాళ్ళు లేక, అప్పుల భారం మొయ్యలేక ఆత్మహత్యలు చేసుకుంటు న్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలీ చాలని జీతాలతో చిరుద్యోగులు తమ జీవితాలను నరకం చేసుకుంటున్నారు. మీకు వీరి పట్ల సానుభూతి లేదా!’’

          హరి ప్రశ్నకు ఒళ్ళు మండిపోయింది వసంతకు. ‘‘అయితే మేమేం చెయ్యాలి? ఎవరి అదృష్టం వారిది. ప్రజల తలరాతలు మార్చేది నేతలు! రాజకీయ నాయకులు నడుంబిగిస్తే పేదల బతుకులు బాగుంటాయి. ఎవరికో లేదని మా జీతాలు తగ్గించుకో వాలా! మేము అడుగుతున్నది మా శ్రమకు ప్రతిఫలం! ఇతరులతో మమ్మల్ని పోల్చ వద్దు. అలా అనుకుంటే అమెరికాలోని టీచర్లకు జీతాలు చాలా ఎక్కువ.’’

          ‘‘హరి! మీకు లేనిపోని జోక్యాలు ఎందుకు? మీరేమన్నా మీ జేబులోంచి తీసి వారికి
జీతాలు యిస్తున్నారా?’’ కోప్పడింది సునంద.

          ‘‘నేను కాకపోయినా నాలాంటి ప్రజలు కట్టిన పన్నులవలనే ప్రభుత్వం నడుస్తుంది. మేము కట్టిన పన్నులలోంచే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తారు. కనుకనే మా బాధ! ఇలా జీతాలు పెంచుకుంటూ పోతే సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగు తాయి.’’ హరి చెప్పాడు.

          ‘‘అయితే మీరెప్పుడూ మీ యాజమాన్యాన్ని జీతాలు పెంచమని అడగలేదా? వాళ్ళు యిచ్చినంత తీసుకుని సలాములు కొడతారా?’’ వసంత అడిగింది.

          ‘‘అవును, మేము గులాములము కాబట్టి సలాములు కొట్టవలసిందే! ఎక్కువ జీతాలు
అడిగితే బయటకు నెట్టి వేస్తారు.’’ చెప్పాడు హరి నిస్సహాయంగా.

          ‘‘వసంతా! నీకు ఇంకో సంగతి తెల్సా! నేడు పెద్ద పెద్ద స్కూళ్ళు చేస్తున్న పని, సీనియర్లను తొలగిస్తున్నాయి. ఎందుకో తెల్సా! వారికి జీతాలు ఎక్కువ యివ్వాల్సి వస్తుంది కాబట్టి. అదే అతని స్థానంలో యిద్దరు జూనియర్లకు జీతాలు యివ్వవచ్చు. అలా డబ్బులు ఆదా చేసుకునేందుకు మేనేజిమెంటు క్రూర చర్యలకు సీనియర్లు బలై పోతున్నారు.’’ సునంద చెప్పింది వసంత భుజం మీద చెయ్యి వేసి.

          ‘‘నే వస్తాను, బాగా ఆలశ్యమైంది’’ వసంత అంది.

          ‘‘ఫర్వాలేదు కూర్చో! రాకరాక వచ్చావు. అప్పుడు మనం కలిసి పనిచేసే రోజుల్లో
రోజూ ఎంత చక్కగా గడిపేవాళ్ళం! ఆ రోజులే వేరు!’’ సునంద చెప్పింది.

          ‘‘సారీ వసంతా! ఈ దేశంలోని వేతన అసమానతలు నన్ను బాధిస్తాయి. వారానికి ఒక
గంట కూడా క్లాసు తీసుకోని ప్రొఫెసర్లకు లక్షల లక్షల జీతాలు యిస్తారు. చెమటోడ్చి రాత్రింబగళ్ళు చెప్పే ప్రయివేటు ఉపాధ్యాయులకు తిండి గింజలకు కూడా చాలినంత జీతాలు యివ్వరు.’’ హరి నొచ్చుకుంటూ అన్నాడు.

          ‘‘హరిగారు! మా గురించి మీరు యిలా ఆలోచిస్తున్నారు కానీ మనది ప్రజాస్వామ్యం. రాజరికం పోయింది కదా! కానీ మన నేతలు అనుభవిస్తున్న సౌకర్యాలు రాజుల సౌఖ్యాల కంటే తక్కువ లేవు. ఎక్కడికి పోవాలన్నా హెలికాప్టర్లు, విమానాలు వాడతారు. ఫైవ్‌స్టార్‌ హోటళ్ళలో బస! ఫుల్‌ సెక్యూరిటీ! జీతాలు, భత్యాలు చాలా ఎక్కువ! కేవలం అయిదేళ్ళు ప్రజాసేవ చేసినా జీవితాంతం అద్భుతమైన పెన్షన్లు! ఇలా చెప్పుకుంటూ పోతే మన నాయకులు పొందుతున్న సౌకర్యాలతో పేద ప్రజల తలరాతలను మార్చ వచ్చు.’’

          వసంత రోషంగా కౌంటరు యిచ్చింది హరికి.

          ‘‘పూర్వకాలం నాటి దేశభక్తి ఏమైంది? అందరికీ పైసాలోనే ముక్తి కావాలి! తనపొట్ట, తన స్వార్థం, తన కుటుంబీకుల బాగోగులు తప్పించి ప్రజల కష్టసుఖాలు ఎవరికి కనపడుతున్నాయి? అన్నీ ఓట్ల రాజకీయాలు, దానివలన నిజమైన ప్రగతి లభిస్తున్నా దా? దేశం ఏమైతే నాకేం పది తరాలు తిన్నా తరగని ఆస్తులు సంపాదించుకుని విదేశాల్లో స్థిరపడాలి అని చాలా మంది ఆలోచిస్తున్నారు! అక్రమమా, సక్రమమా కాదు ముఖ్యం, సంపాదన ముఖ్యం!’’ సునంద కూడా ఆవేదనతో చెప్పింది.

          వసంత ఎర్రబడ్డ మొహంతో లేచింది. హరి అంటే మండిపోతున్నది.

          ‘‘ఒక్క నిమిషం వసంతా! జీతాలు పెరగాలని కోరుకుంటారు, ఆందోళన చేస్తారు కానీ
మీ పని మనుషులకు మీరు జీతం ఎంత పెంచుతున్నారు? మీకు ఆరునెలలకొకసారి డిఏ పెరుగుతుంది, సంవత్సరానికి యింక్రిమెంటు వస్తుంది, అయిదేళ్ళకొకసారి
పిఆర్‌సీ వలన కనీసం ఇరవై శాతం జీతాలు పెరుగుతాయి. కానీ ఎప్పుడైనా మీ పని
మనుషులకు అయిదు వందలు పెంచారా?’’ హరి బాధగా అడిగాడు. 

          ఆ ప్రశ్నకు వసంత కంగు తిని చరా చరా కిందకు దిగి బయలు దేరింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.