వ్యాధితో పోరాటం-27
–కనకదుర్గ
సాయంత్రం శ్రీని క్యాథి ఇంటికే డైరెక్ట్ గా వచ్చి సూసన్ ని కల్సి, కాసేపుండి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళాడు. క్యాథి భర్త గ్యారికి పెన్సల్వేనియాలో ఉండడం ఎక్కువగ నచ్చలేదు. ఆయనకి కొండలెక్కడం, బైకింగ్, హైకింగ్, వీటన్నిటితో పాటు మెడిటేషన్ అంటే చాలా ఇష్టం. ఆయనకు ఎక్కువగా మనుషులతో గడపడమంటే అంత ఇష్టపడేవాడు కాదు. క్యాథి అందరిలో వుండాలని కోరుకునే మనిషి. ఆమె అనుకున్నట్టు భర్తకు నచ్చితే పిల్లలతో ఇక్కడే ఉండాలనుకుంది తన కుటుంబానికి దగ్గరగా! కానీ 3 ఏళ్ళు కాగానే గ్యారీకి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని అనిపించసాగింది. నాకు 4వ నెలలోనే వాళ్ళు రినో, నెవాడాకి వెళ్తున్నారని తెల్సింది. కానీ నాకు ఒక 10 రోజుల ముందు చెప్పింది. నాకు తను పక్కన వుంటే చాలా ధైర్యంగా అన్పించేది. డెలివరీ టైంకి తనుంటే చాలు నాకు ఏదైనా ఎదుర్కోవచ్చు అనుకునేదాన్ని. నాకు పెద్ద షాక్ లా అయ్యింది. ఎలా ఇపుడు? శ్రీని కొలీగ్స్ అందరూ వెళ్ళిపోయారు, కొంత మందికి వేరే చోట్ల జాబ్స్ వస్తే వెళ్ళారు, కొంతమంది ఇండియాకి వెళ్ళిపోయారు.
అంతకు ముందు జర్మనీ నుండి వచ్చిన ఒక జంట ఎంజలీనా, హెన్రీ మేముండే అపార్ట్మెంట్స్ కాంప్లెక్స్ లో వుండడానికి వచ్చారు. ఆయన ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేయడానికి వచ్చారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. ఒక బాబు, ఒక నెలల పాపని తీసుకొని వచ్చారు. వాళ్ళు క్రిస్టియన్ మిషనరీస్, ఆఫ్రికా, యుగాండాలో పని చేసేవారు. ఎంజలీనా నాకు మంచి ఫ్రెండ్ అయ్యింది. ఆమె తను హోల్ సేల్ షాప్ కి వెళితే నన్ను తీసుకెళ్ళి చూపించేది. ఎక్కువ సరుకు కొంచెం తక్కువ ధరకు దొరుకుతాయని చూపించింది. మా ఇంటికి వస్తూ, పోతూ వుండేది. నాకు కేక్స్ చేయడం రాదు. తను నేర్పించింది. మామూలుగా అయితే మతం గురించి నేనెవరితో మాట్లాడేదాన్ని కాదు, అందులో వీళ్ళు క్రిస్టియన్ మిషనరీస్ పని చేస్తారని తెల్సినప్పట్నుండి నేనే జాగ్రత్తగా ఉండేదాన్ని. కానీ అపుడపుడు, ’’మీ మతంలో ఎంతో మంది దేవుళ్ళుంటారు, మీలో అందరూ మొక్కు కుంటారు, ఆ మొక్కు తీర్చుకోకపోతే ఆ దేవుడికి కోపం వచ్చి ఏం చేస్తాడో అని భయపడ తారు. మా మతంలో అలా కాదు, మా జీసస్ క్రైస్ట్ ప్రజల కన్నీళ్ళు తుడవడానికి తను శిలువ ఎక్కాడు. మన కష్టాలు తీర్చమని కోరితే మనం తప్పులు చేసినా క్షమించి మనని అక్కున చేర్చుకుంటాడు.” అనేది.
ఒకసారి నాకు విసుగొచ్చి, ’నాకు, శ్రీనికి ఎటువంటి నమ్మకాలు లేవు. మేము ఆ మతస్థులమని ఎపుడూ చెప్పలేదు.” అన్నాను.
“బట్ యువర్ నేమ్ ఈజ్ దుర్గా, విచ్ మీన్స్ స్కేరీ గాడెస్ రైట్?”
“యా దట్ నేమ్ ఈజ్ గివెన్ బై మై మదర్ అండ్ ఐ లైక్ మై నేమ్. వెన్ ఐ వాజ్ గెట్టింగ్ మ్యారీడ్ మై ఇన్లాస్ సైడ్ డిడ్ నాట్ లైక్ మై నేమ్ సో దే వాంటెడ్ టు చేంజ్ ఇట్ టు ఏ మూవీ యాక్ట్రెస్ నేమ్. ఐ సెడ్ నో వే.”
“వావ్ యూ ఆర్ ఏ స్ట్రాంగ్ వుమెన్ దుర్గా!”
కానీ మనిషి చాలా ఫ్రెండ్లీగా వుండేది. ఆమె రోజు వచ్చి కల్సేది, వాతావరణం బాగున్నపుడు వాళ్ళ పాప ఎలిజెబిత్ ని ప్రామ్ లో పెట్టుకుని వాక్ కి తీసుకెళ్ళేపుడు వచ్చి నన్నూ రమ్మనేది. వసంత కాలంలో, ఎండాకాలంలో సాయంత్రం పూట, ఆకురాలు కాలంలో(ఫాల్ సీజన్) ఎండ వున్నపుడు లైట్ జాకెట్స్ వేసుకుని వాక్ కి వెళ్ళేవాళ్ళం. తను జర్మనీలో తన ఫ్యామిలి గురించి, ఆఫ్రికాలో వాళ్ళు చేసిన పని, అక్కడ పరిచయం అయిన మనుషులు, వాళ్ళంటే తనకి ఎంత ఇష్టమో చెప్పేది. మంచి భార్యగా ఎలా వుండాలో కూడా చెపుతూ వుండేది. నేను ఇండియాలో కుటుంబాల గురించి, మా పెళ్ళి ఎలా జరిగింది అక్కడ కుటుంబాలు ఎలావుంటాయి, పర్యాటక ప్రదేశాల గురించిమాట్లాడే దాన్ని. మతం గురించి మళ్ళీ నా దగ్గర ఎక్కువ మాట్లాడలేదు నేను కొన్ని సార్లు గట్టిగా చెప్పాక. వాళ్ళు 2 ఏళ్ళయ్యాక హెన్రీ మాస్టర్స్ అయిపోగానే వాళ్ళు జర్మనీ వెళ్ళిపోయా రు. అక్కడ కొన్నాళ్ళు వాళ్ళ కుటుంబాలతో సమయం గడిపి ఆ తర్వాత యుగాండా వెళ్తారు. వెళ్ళేపుడు ఆఫ్రికన్ పెయింటింగ్స్ నాకిచ్చింది. నేను తనకి ఒక మంచి చుడీదార్ సెట్, పిల్లలకు కూడా ఇండియన్ బట్టలు, ఆయనకు ఒక పేయింటింగ్ ఇచ్చాము. తను వెళ్ళిపోయినపుడు చాలా బాధనిపించింది. ఇపుడు క్యాథి వెళ్ళిపోతుం దంటే అదే బాధ. అదీ కాక తను పక్కన ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. డెలివరీ అపుడు ఎలా అని భయం పట్టుకుంది.
అలాగే మైమా జోన్స్ అనే ఆఫ్రికన్ ఫ్రెండ్ పరిచయం అయ్యింది. చైతన్య క్లాస్ లో వాళ్ళమ్మాయి చదువుతుండేది. స్కూల్ లో ప్రోగ్రామ్స్ జరిగినపుడు కల్సేవాళ్ళం. మా అపార్ట్మెంట్స్ కి కొంచెం దూరంలో వుండే అపార్ట్మెంట్స్ లో వుండేవారు. ఒక ఎండా కాలంలో మైమా మా ఇంటికి వచ్చి తన ముగ్గురు కూతుళ్ళని బేబీ సిట్ చేయమని అడిగింది. ఇవన్నీ మేం వచ్చిన ఒక ఏడాది, రెండేళ్ళల్లో జరిగినవి. ముగ్గురిని పొద్దున 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు చూసుకోవాలని అడిగింది. నేను చేస్తున్న పని ఏం లేదు. అపుడు ఆదివారం ఆంధ్రజ్యోతిలో కనీసం నెలకో ఫ్రంట్ పేజ్ ఆర్టికల్ రాస్తున్నాను. ముందు చిన్న చిన్న ఆర్టికల్స్ నుండి పెద్ద ఆర్టికల్స్ రాయడం మొదలు పెట్టాను. సాయంత్రం రాసుకోవచ్చు, వారాంతంలో రాసుకోవచ్చు, ఏం పని చేయటం లేదు అన్న ఫీలింగ్ పోతుంది ఏదైనా పని చేస్తే అని ’ఓకే’ అన్నాను. శ్రీని, చైతన్య కూడా సంతోషించారు. చైతన్యకి ఆడుకోవడానికి ఇంట్లోనే ముగ్గురు ఫ్రెండ్స్ వస్తారని ఒకటే ఆనందం.
ఏదో ఒక పని చేస్తున్నానని సంతోషం నాకు. పొద్దున్నే పిల్లలు వచ్చేవరకు నా పనులన్నీ చేసుకుని, చైతన్యకి తెలుగు నేర్పించి, ఒకరోజు మ్యాథ్, ఒకరోజు ఇండియన్ సోషల్ స్టడీస్ లో ఒక పాఠం చదివి, దాని గురించి పిల్లలు వెళ్ళిపోయాక మాట్లాడే వాళ్ళం. ముగ్గురూ ఆడపిల్లలు. పెద్దమ్మాయి 11ఏళ్ళు, 9 ఏళ్ళు, 8 ఏళ్ళు. 8 ఏళ్ళ అమ్మాయి చైతన్యతో పాటు ఒకటే క్లాస్ లో చదువుతుంది. వాళ్ళ అమ్మ పిల్లలకు తినడానికి క్యాన్డ్ తిండి ఇచ్చేది, నాన్ వెజ్ సూప్, మూడు బౌల్స్ లో వేడి చేసి ఇచ్చేదాన్ని. దాంతో పాటు ఏదో ఒక పండు కూడా ఇచ్చేది. పొద్దున్నే కాసేపు ఆడుకునేవాళ్ళు, లంచ్ తిన్నాక పెద్దమ్మాయి చెల్లెళ్ళ కోసం అన్నీ సబ్జెక్ట్స్ లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ తయారు చేస్తే వాళ్ళు రోజు వాటిని చేయాలి. అవి రాత్రికి వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ చెక్ చేస్తారు. మైమా ఫ్యామిలీ ఆఫ్రికాలో లైబీరియా అనే దేశం నుండి కష్టపడి అమెరికాకి వచ్చారు, పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వటానికి. వాళ్ళ దేశంలో ఎప్పుడూ ఏదో ఒక కల్లోలం, ఏవో గొడవలు జరుగుతూనే వుంటాయి. బయటకు వెళ్ళిన మనిషి ప్రాణాలతో తిరిగి వస్తాడో లేడో తెలియని పరిస్థితి. ముందు మైమా, పిల్లలు వచ్చారు, ఆ తర్వాత కొన్నేళ్ళకు ఆమె భర్త వచ్చాడు. ఆ కొన్నేళ్ళు ఇక్కడ మైమా పిల్లలతో, అక్కడ ఆయన ఒంటరిగా ఎంత కష్ట పడ్డారో తల్చుకుంటేనే భయమేస్తుందని అనేది మైమా!
పిల్లలు ఇంటికి వెళ్ళే ముందు అందరికీ ఐస్ క్రీం ఇచ్చేదాన్ని. వాళ్ళ కోసం చిన్న చిన్న స్నాక్స్ కూడా తెచ్చి ఉంచేవాళ్ళం. మైమా చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. పిల్లలు ఏది అడిగితే అది వెంటనే ఇవ్వడం తనకిష్టం ఉండేది కాదు. అమెరికన్ పిల్లలకి తల్లితండ్రు లు వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేసేవారు (అందరూ కాదు, చాలా మటుకు). వాళ్ళెంతో కష్టపడి వచ్చారు, ఆ కష్టాలు మర్చిపోయి బ్రతకడం తనకి నచ్చేది కాదు. అందుకే నేను ఎపుడన్నా ఒకసారి ఇస్తే చాలా సంతోషపడేవారు, వాళ్ళమ్మకి చెప్పేవారు, “అమ్మ చూడు దుర్గా ఎంత మంచిదో, మాకు ఏం కావాలో అడిగి మరీ ఇస్తుంది. షీ ఈజ్ సో నైస్ అమ్మా!” అంటే మైమా,”అవునవును, దుర్గాకి పిల్లలంటే చాలా ఇష్టం. మిమ్మల్ని ఇక్కడ ఇంకొన్ని నెలలు వదిలిపెడితే తను మీకేం కావాలో అన్నీ పెట్టి తలుపుల్లో పట్టకుండా చేసేస్తుంది. ఒక మంచి విషయం ఏమిటంటే సమ్మర్ హాలీడేస్ 2 నెలలే!” అని గట్టిగా నవ్వేసేది.
నాకు చైతన్య ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇలా వివిధ దేశాల వారితో కలిసి పెరిగితే వాడి ఆలోచనాధోరణి బాగా పెరుగుతుందని సంతోషంగా ఉండేది. నేను వాడి ఫ్రెండ్స్ ని అందరిని ఇంటికి ఆడుకోవడానికి రమ్మని పిలిచేదాన్ని. ఇక్కడ పిల్లలు ఎపుడు పడితే అపుడు ఆడుకోవడానికి ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళరు. తల్లి తండ్రులు ఎవరిని పిలవాలను కుంటున్నామో వారి తల్లి తండ్రులకు ఫోన్ చేసి స్కూల్ తర్వాత మా ఇంటికి ఆడుకోవ డానికి పంపండి అంటే వాళ్ళు ఒక నోట్ రాసి పిల్లలకు ఇస్తారు, ఆ నోట్ టీచర్లకు చూపిస్తే బస్ ఎక్కించే వారు ఆ నోట్ తీసుకొని మన పిల్లలు ఎక్కే బస్ లో ఎక్కించి పంపిస్తారు. పిల్లలు ఆడుకోవడం అయ్యింతర్వాత వాళ్ళ తల్లి తండ్రులు వచ్చి తీసుకెళ్ళడమో లేదా మేమే తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దింపి రావడమో జరుగుతుంది. చైతన్యని కూడా పంపిస్తూ ఉండేదాన్ని.
క్యాథి అందరికంటే ఎక్కువ క్లోజ్ అయ్యింది. అందుకే వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే నాకు చాలా షాక్ అయ్యింది. తను చాలా సాయం చేసేది. వాళ్ళ కుటుంబం బాగా నిరాశ చెందారు తను చాలా దూరం వెళ్తుందంటే. కానీ గ్యారి, క్యాథి భర్తకి ఇక్కడ వాతావరణం, కాథలిక్ క్రిస్టియన్లంటే అస్సలు నచ్చలేదు. ఇక్కడ బైకింగ్ కి, హైకింగ్ కి ఎన్నో పార్కులు న్నా, అవి చేస్తున్నా తనకి మౌంటనీరింగ్ అంటే ఎక్కువ మక్కువ. ఇక్కడ కూడా కొన్ని కొండ ప్రదేశాలకి వెళ్ళి చేసేవాళ్ళు కానీ దూరాలు వెళ్ళాల్సి వచ్చేది, చిన్న పిల్లల్ని వేసుకుని వెళ్ళడమంటే కష్టంగా ఉండేదేమో! అదీ కాక తను చేసే జాబ్ లో మంచి ప్రమోషన్, హై పొజిషన్, సాలరీ పెంపు, ముఖ్యంగా అక్కడ ఎక్కడ పడితే అక్కడ కొండలు, తనకిష్టమైనవి అన్నీ చేసుకోవడం సులభంగా ఉంటుందని వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.
క్యాథి వెళ్ళిపోయినా మమ్మల్ని వదిలిపెట్టలేదు. వాళ్ళ తల్లితండ్రుల దగ్గరికి వచ్చినప్పుడల్లా కార్ డ్రైవింగ్ లో 3 గంటల ప్రయాణమైనా పిల్లల్ని తీసుకొని చైతన్య, నేతన్ లు హై స్కూల్ అయిపోయేదాక వస్తూనే వుంది. నేను హాస్పిటల్ లో వున్నపుడు నాకేమి తెలియదు, డాక్టర్స్ తో, నర్సులతో, టెస్ట్స్ చేసే టెక్నీషియన్స్ తో ఎలా మాట్లాడా లో తెలియదు. నేను నాలా మాట్లాడేదాన్ని కానీ డాక్టర్ వెళ్ళిపోయాక నేనడగాల్సిన ప్రశ్నలు నా మెదడులో అలాగే మిగిలిపోయేవి. అపుడే నా ప్రియమైన నేస్తం క్యాథి ప్రతి రోజు ఫోన్ చేసి మాట్లాడడం మొదలుపెట్టింది. తను కావాలనుకుంటే తన బాధ తను పడుతుందిలే అని అనుకోవచ్చు. కానీ అలా అనుకోకుండా దూరంగా వున్నా రోజూ ఫోన్ చేసి ఎలా వున్నానని కనుక్కుని, డాక్టర్లు ఏం అన్నారు, ఈ రోజు ఏం టెస్ట్స్ చేసారు, నీకేమనిపిస్తుంది, నొప్పి కంట్రోల్లో వుంటుందా వాళ్ళిచ్చే నొప్పి మందులతో అని కనుక్కునేది. అంతే కాదు, డాక్టర్స్ తో ఎలా మాట్లాడాలి, ఏం అడగాలి? మనసులో ఏ డౌటున్నా అడిగేయాలని, లేకపోతే వాళ్ళు నీకన్నీ అర్ధమయ్యాయనుకుని వెళ్ళిపోతారు అని చెప్పేది.
ఒకోసారి నేను హాస్పిటల్లో చాలా నిరాశా, నిస్పృహలతో ఉంటే తన పిల్లల అల్లరి గురించి చెప్పి నవ్వించేది. నాకు ఆరో నెలలో మొదటి సారి పాన్క్రియాటైటిస్ అటాక్ వచ్చినపుడు క్యాథి ఒకతే తల్లి తండ్రులను చూసిపోవడానికి వచ్చినపుడు నన్ను చూడడానికి వచ్చింది. వచ్చినపుడల్లా చాలా సరదగా ఉండేది, తను వస్తే మాకందరికి చాలా ధైర్యంగా, సంతోషంగా అనిపించేది. స్ఫూర్తి పుట్టగానే చిన్న, చిన్న బ్లాంకెట్స్, స్టఫ్డ్ టాయ్స్, చిన్న పాపలకు, బాబులకు చదివే పుస్తకాలు పెద్ద డబ్బాలో పంపించింది. తను వచ్చినపుడు స్ఫూర్తితో ఆడుకునేది, చిన్న చిన్న ఫ్రాక్స్ తీసుకొచ్చేది. తనున్న ఒకట్రెం డు రోజులు చాలా త్వరగా అయిపోయేవి. అప్పట్లో సెల్ ఫోన్లుండేవి కాదు. వేరే రాష్ట్రాల నుండి చేస్తే చార్జెస్ అయ్యేవి అపుడు. ఫోన్ బిల్ వచ్చేది. కొంతమంది లెక్క పెట్టుకుని మరీ ఫోన్ చేసేవారు, చాలా మంది ఇక్కడ్నుండి వెళ్ళిపోయాక అస్సలు కాల్ చేయనే లేదు. అందుకే క్యాథి అంటే నాకు చాలా ఇష్టం.
హాస్పిటల్స్ లో ఒక వారం నుండి వారాలు వారాలుండే వరకొచ్చింది. అక్కడ ఉంటే నొప్పికి డెమరాల్ అనే ఇంజెక్షన్ ఇచ్చేవారు. ప్రతి 4 గంటలకోసారి ఇచ్చేవారు. నొప్పి ఎక్కువగా ఉంటే ఎక్కువ డోస్ తక్కువగా ఉంటే కొంచెం ఇచ్చేవారు. 2-3 రోజులుంటే ఇంటికెళ్ళాక అంతగా ఏమనిపించేది కాదు, కానీ వారం పైన ఉండి ఆ ఇంజెక్షన్స్ తీసుకుంటే ఇంటికెళ్ళాక నిద్ర పట్టేది కాదు, నాకు భయం వేసేది అవి అలవాటయి పోతాయేమో అని. డెలివరీ తర్వాత హాస్పిటలైజేషన్స్ ఎక్కువయ్యాయి. రకరకాల పరీక్షలు చేయడం అందులో ఏమి తెలియకపోవడం, నొప్పి తగ్గకుంటే ఇంటికి పంపేవారు కాదు, మా ఫ్రెండ్ జూలీ పిల్లల్ని రోజు మధ్యాహ్నం నుండి రాత్రి వరకు పిల్లల్ని చూసుకునేది. తనకి ఆశ్చర్యం వేసేది, అన్ని వారాలు నన్ను డిశ్చార్జ్ చేయ కుండా హాస్పిటల్స్ లో వుంచుకుంటే, “ఇదేంటి? హార్ట్ సర్జరీలు అయినా 3- 5 రోజుల కంటే హాస్పిటల్ లో వుంచుకోరు, ఇన్స్యూరెన్స్ వాళ్ళు అస్సలు ఒప్పుకోరు అలాంటిది ఈ నొప్పి ఎంత భయంకరంగా ఉంటే, అన్ని రోజులుంచుకుంటారు? నేనెపుడు ఇలాంటి జబ్బుని చూడలేదు.”
శ్రీనిని అడిగేది, ” ఈ హాస్పిటలైజేషన్స్ కి ఇన్స్యూరెన్స్ పే చేస్తుందా,” అని.
“చాలావరకు పే చేస్తుంది, కొన్నిపెద్ద బిల్స్, కొన్ని చిన్న బిల్స్ మేం కట్టుకోవాలి.” అని శ్రీని చెప్పాడు.
“పెద్ద బిల్స్ అంటే?”
“కొన్ని టెస్ట్స్ కి ఆ ఇన్స్యూరెన్స్ వాళ్ళు పే చేయరు. అలాంటివి మేమే కట్టుకోవాలి.” అని చెప్పాడు.
నాకు మాత్రం ఎన్నిసార్లు అడిగినా హాస్పిటల్ బిల్స్ గురించి మాత్రం చెప్పేవాడు కాదు. “ఎందుకు చెప్పవు?” అని అడిగితే, “అవసరం వున్నపుడు హాస్పిటల్ కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. నీకు భయంకరమైన నొప్పి వచ్చే జబ్బు వుంది. అది ఇంట్లో తగ్గేది కాదు, దానికి కారణాలు కనుక్కొని పరిష్కారం దొరికేవరకు నీకు అటాక్స్ వచ్చినప్పు డల్లా హాస్పిటల్ కి వెళ్ళాల్సిందే.”
“నేను వెళ్ళనని అనడం లేదు కదా!”
“నువ్వు అసలే జబ్బుతో బాధ పడ్తున్నావు. నీ ఆరోగ్యం గురించి కేర్ తీసుకోవాలి. మిగతా విషయాలు అంటే ఫైనాన్షియల్ విషయాలు నేను చూసుకుంటాను.” అంటూ వెళ్ళిపోయేవాడు. ఒకోసారి తనని ఎందుకు విసిగించడం అనుకుని వూరుకునేదాన్ని. నా కష్టం తను పంచుకుంటునట్టే తనూ తన మనసులో ఏముందో చెబ్తే నేనూ వింటాను, నాకు తోచింది నేనేదైనా సలహా ఇవ్వగలనేమో, మేమేం మిలియనీర్స్ కాదు, ఒకవేళ ఇన్స్యూరెన్స్ పే చేసే దానికంటే మన చేతి నుండే ఎక్కువ పడ్తుంటే వేరే ఆప్షన్స్ వున్నాయేమో చూసుకోవచ్చు కదా! జబ్బు చేసినంత మాత్రానా నా ఆలోచనాశక్తి పోయిందని కాదు కదా! అని అన్పించేది.
వారాలు, వారాలు పిల్లల్ని వదిలేసి వుండాలంటే బాధగా వుండేది. రోజు తీసుకు వచ్చేవాడు శ్రీనివాస్. ఈ విషయంలో తనకున్న ఓపికకు, సహనం చూసి నేను ఆశ్చర్య పోయేదాన్ని, కానీ తను అలా వున్నందుకు చాలా సంతోషంగా అనిపించేది. ఇంటికెళ్ళాక రాత్రి ఫోన్ చేసి మాట్లాడి, చైతన్యతో మాట్లాడించి కానీ పడుకునేవాడు కాదు. రోజు విషయాలు చెప్పేవాడు.
హాస్పిటల్ లో వున్నపుడు నేను అందరితో మాట్లాడడానికి ప్రయత్నించేదాన్ని. రూమ్ లో ట్రాష్ తీసుకెళ్ళడం, బాత్రూం క్లీన్ చేసి, రూమ్ తుడిచి వెళ్ళేవాళ్ళు. ఒకోసారి ఒకతను, ఒకోసారి ఒకావిడ వచ్చేది. ఆమె వచ్చినపుడు నా గురించి అడిగేది, ఒకోసారి తన పిల్లల గురించి చెప్పేది. ఒకరోజు ఎవ్వరితో మాట్లాడకుండా చాలా మౌనంగా “హాయ్,” చెప్పి తన పని తను చేసుకుంటుంది. “హే రీటా! ఎందుకలా ఉన్నావు? ఏమయ్యింది? ఆర్ యూ ఓకే?” అని అడిగాను.
“ఆ ఏం లేదు, నా తలరాత ఇలా ఉంటే ఎవరేం చేస్తారు?” అని నీరసంగా అంది.
” ఏం జరిగింది?”
ముక్కు ఎగబీలుస్తూ, కళ్ళు తుడ్చుకుంది. “ఎందుకేడుస్తున్నావు రీటా?”
“నా దరిద్రపు బాయ్ ఫ్రెండ్ రాత్రి బాగా తాగి వచ్చి నన్ను పిల్లల్ని చచ్చేట్టు కొట్టాడు, తిట్టాడు,” అంటూ నా బెడ్ ప్రక్కన వచ్చి నిలబడింది కళ్ళు తుడ్చుకుంటు.
“ఈ భాయ్ ఫ్రెండ్ మూడో వాడా, నాలుగో వాడా? నీ పిల్లల్ని వాళ్ళ తండ్రి దగ్గరకు పంపించేయమంటున్నాడు అతనేనా?”
“నాలుగోవాడే, అతనికి పిల్లలంటే ఇష్టం లేదట ఈ మధ్యన మరీ ఎక్కువయ్యింది.” అంది నా బెడ్ ప్రక్కన వున్న టేబుల్ క్లీన్ చేస్తూ.
“నీతో డేట్ చేసి, కల్సి వుండేపుడు తెలీదా నీకు పిల్లలున్నారని, ఇప్పుడు పంపించే యమంటే ఎక్కడికి పంపిస్తావు? అయినా పిల్లల్నివదిలేసి నువ్వు ఉండగలవా?”
” పిల్లలున్నారని తెలుసు! అపుడేం అనలేదు. ఇపుడేమో వాళ్ళని చూస్తే వాళ్ళ తండ్రులు గుర్తొచ్చి కోపం వస్తుందట!”
“నిన్ను కొడుతున్నాడని పోలీస్ కంప్లయింట్ ఇవ్వు! పీడా వదుల్తుంది,” అని అన్నా.
“అట్లా చేస్తే మగతోడు కోసం మళ్ళీ వెతుక్కోవాలి. ఆ ముగ్గురు వెదవలు, ప్రెగ్నెంట్ చేసి పారిపోయారు. వీడయినా కొన్నాళ్ళయ్యాక మారి మమ్మల్ని బాగా చూసుకుంటే అపుడు పెళ్ళి చేసుకుని ఈ డేటింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను.” తన క్లీనింగ్ సామాను తీసుకొని,” ఐ విల్ సీ యూ టుమారో. టేక్ కేర్, హోప్ యూ ఫీల్ బెటర్,” అని ఫ్లయింగ్ కిస్ ఇస్తూ వెళ్ళిపోయింది.
ఈ హాస్పిటల్ లోనే నాకు ప్రపంచమంతా కనిపిస్తుంటుంది.
నా ప్రక్కన రాత్రి ఒక వృద్దురాలొచ్చింది. రాత్రి నొప్పి ఎక్కువగా ఉంటే నేను ఇంజెక్షన్ తీసుకొని పడుకున్నాను. ఎంత చప్పుడయినా నాకు మెలుకువ రాలేదు.
పొద్దున్నే లేచేవరకు వృద్ద జంట మాట్లాడుకుంటున్నారు.
“నువ్వు కాఫీ తాగావా? పిల్లికి,(కీకి) కుక్కకు(జాక్) తిండి పెట్టావా? జాక్ ను వాక్ కి తీసుకెళ్ళావా?” అని వరసగా ప్రశ్నలడిగింది భార్య.
“అన్ని చేసాను. నువ్వెలా వున్నావు? నీ హిప్ నొప్పి కొంచెం పర్వాలేదా? రాత్రి నొప్పికి మందిచ్చారా? ఈ రోజు సి.టి స్కాన్, ఎక్స్-రే తీస్తామన్నారు కదా! చూద్దాం ఏం చెబ్తారో?” అన్నాడు భర్త. ఇద్దరూ 80 -85 ఏళ్ళ మధ్య వుంటారేమో!
“ఇది మూడోసారి పడడం, హిప్ కి దెబ్బ తగలడం, నడవడం కష్టమైపోతుంది. ఇన్ని రోజులు ఇద్దరం ఒకరికొకరంగా బ్రతికాం. ఇపుడు నన్ను నర్సింగ్ హోంకి (ఓల్డ్ ఏజ్ హోం పంపిస్తామంటే ఏం చేద్దాం. నువ్వొక్కడివి ఎలా వుంటావు? మన కీకి, జాక్ లను ఎలా ఒక్కడివే చూసుకుంటావు? నాకు చాలా భయంగా ఉంది? ఈ సారికి ఇంటికి పంపిం చమని గట్టిగా మాట్లాడు ప్లీజ్! నెక్స్ట్ టైం అయితే ఆలోచిస్తామని చెబ్తాం, సరేనా!”
నేను లేచి బాత్రూం కెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చేపుడు భర్త నన్ను చూసి, ’గుడ్ మార్నింగ్,’ అని నవ్వుతూ పలకరించాడు.
నేను ’గుడ్ మార్నింగ్,’ చెప్పాను.
“నువ్వెన్ని రోజుల్నుండి ఇక్కడ ఉంటున్నావమ్మా!” అని ఆవిడ అడిగింది.
“మేం రాత్రి వచ్చాం, నిన్ను డిస్ట్రబ్ చేసామా?”
“అబ్బే లేదండి! నేను బాగానే పడుకున్నాను.”
“చూస్తే చిన్నదానిలాగ వున్నావు. ఇది నీ ఫస్ట్ టైమా హాస్పిటల్ కి రావడం?”
నేను నవ్వాను,”అదే నిజమయితే ఎంత బాగుండు. ఇది ఎన్నోసారో కూడా లెక్కపెట్టడం మానేసాను.”
“అయ్యో! సో సారీ అమ్మా! ఏం ప్రాబ్లమో అడగొచ్చా? టెల్ అజ్ ఓన్లీ ఇఫ్ యూ డోంట్ మైండ్,” అన్నాడాయన.
“పాన్క్రియాటైటిస్. ఐ యామ్ హావింగ్ మెనీ అటాక్స్. దే ఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ ది రీజన్.”
“వియ్ హోప్ దే ఫైండ్ అవుట్ సూన్ అండ్ యు ఫీల్ బెటర్ సూన్ డియర్!” అన్నదామె.
నాకు అడగాలనిపించింది వాళ్ళకి ఇది ఎన్నో హాస్పిటలైజేషన్ అని. అదే అడిగాను.
“ఇదే మొదటసారే అమ్మా!”
’’అవునా!” అన్నాను ఆశ్చర్యంగా.
“అవును, మాకు ముగ్గురు పిల్లలు, అందరు ఇంట్లోనే పుట్టారు. మేము కష్టపడి పని చేస్తాము, మంచి తిండి, హాయిగా నిద్రపోవడం వల్ల మాకే ఆరోగ్య సమస్యలు రాలేదు. కానీ ఈ మధ్యనే తను రెండు సార్లు పడితే మా డాక్టర్ దగ్గరకెళితే మందులిచ్చాడు, ఏమి విరగలేదు. కానీ ఈ సారి హిప్ వీక్ గా వుంది, దెబ్బ కూడా బాగా తగిలింది. ఏం చేస్తారో చూడాలి.”
“అందరూ మీ లాగ వుండగలిగితే బావుంటుంది. నేను 25 ఏళ్ళ నుండి బాధ పడ్తున్నాను. ఇప్పటికి 8 ఏళ్ళయ్యింది.”
“కానీ మాకు వయసయిపోతుంది కదమ్మా! మీరు ఇంట్లో వుంటే కేర్ తీసుకోవడం కష్టమౌతుంది, అని ఒకోసారి నర్సింగ్ హోంకి పంపిస్తారు. మాకు ఉన్నన్ని రోజులు కలిసి వుండాలని వుంది.” అన్నాడు ఆయన దిగులుగా.
“మీ పిల్లలెవ్వరూ దగ్గర్లో లేరా?”
“లేరు, వాళ్ళంతా చాలా దూరాల్లో వున్నారు. డాక్టర్లు ఏమంటారో చూసి చెబ్తాను అందరికి. ఎవరికి వీలయితే వాళ్ళు వస్తారనుకుంటున్నాం,” అని చక్కగా మాట్లాడారు.
నా డాక్టర్ రావడంతో మా సంభాషణ ఆగింది.
*****
(సశేషం)
నేను హైద్రాబాద్ లో పుట్టి పెరిగాను. గత 26 ఏళ్ళుగా అమెరికా, పెన్సల్వేనియా లో నివసిస్తున్నాము. ’90 నుండి ఫ్రీలాన్సర్ గా డెక్కన్ క్రానికల్, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సాక్షి, వార్తాపత్రికలకు, వెబ్ మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ రాస్తూనే వున్నాను. తెలుగువన్ అంతర్జాల రేడియోలో ఆర్.జే గా ’పాటలపల్లకీ,’ కార్యక్రమాన్ని 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. ’మయూరి,’ ’రచన’ మాసపత్రికలో, వివిధ వెబ్ మ్యాగజైన్స్, ’విహంగ,’ ’శిరాకదంబం,’ ’తెలుగువన్.కామ్’ లో ’ కథలు ప్రచురింపబడ్డాయి. పుస్తకాలు చదవడం, జీవితంలో చిన్నప్పట్నుండి మధ్యతరగతి జీవితాల్లో సంబంధాల గురించి గమనించడం, వాటి గురించి కథలుగా రాస్తే ఎలా వుంటుంది అని దాదాపు 13, 14 ఏళ్ళ వయసప్పట్నుండే ఆలోచించడం అలవాటయింది. ఇంకా ఎంతో చదవాలి, పుస్తకాలు, జీవితాన్ని ఇంకా ఎంతో రాయాలి అనే తపన ఉంది. శ్రీనివాస్ తో, జీవిత సహచర్యం, చైతన్య, స్ఫూర్తి(పిల్లలు) మీనా(కోడలు) ముందుకు సాగమని స్ఫూర్తినిస్తుంటారు.