“నెచ్చెలి”మాట 

ఒరులేయవి యొనరించి

-డా|| కె.గీత 

ఒరులేయవి యొనరించిన
యప్రియము తన మనంబున కగు
తానొరులకు నవి సేయకునికి ……

అంటే
దెబ్బకు దెబ్బ
చెల్లుకు చెల్లు
టిట్ ఫర్ టాట్
అన్నీ
గంగలో కలిపి
ఎవరేం చేసినా
తిరిగి
ఏమీ చెయ్యకూడదన్నమాట!

అంటే
గాంధీ గారిలా
ఓ చెంప మీద
ఎవరైనా కొడితే
మరో చెంప కూడా
వాయగొట్టమని
చూపించడమన్నమాట!
సరే-
చెప్పడానికి
నీతులు బానే ఉన్నాయండీ-

కానీ
మళ్ళీ మళ్ళీ
లోకువకట్టే వాళ్ళనీ
మళ్ళీ మళ్ళీ
చెంప వాయగొట్టేవాళ్ళనీ
ఏమనాలి?
ఏం చెయ్యాలి?

అయ్యో 
మీరు సరిగా 
విన్నట్టు లేరు 
ఎప్పుడో 
కవిత్రయం వారి కాలం 
ఇప్పుడు కూడా 
ఉందంటే 
ఎట్లా?!

ఇప్పటి
నీతి
న్యాయం
పద్ధతీ
ఏవిటంటే

ఒరులేయవి యొనరించిన
యప్రియము తన మనంబున కగు
తానొరులకు నవే సేయువానికి ……

అంటే
దెబ్బకు దెబ్బ
చెల్లుకు చెల్లు
టిట్ ఫర్ టాట్
…….
…….
అంటే
ఎవరేం చేసినా
తిరిగి వారికే
అదే చేయుటన్నమాట!

బాగు బాగు-

ఆగండాగండి…
కానీ
మనమేం
చెయ్యకపోయినా
మళ్ళీ మళ్ళీ
లోకువకట్టే వాళ్ళనీ
మళ్ళీ మళ్ళీ
చెంప వాయగొట్టేవాళ్ళనీ
మళ్ళీ మళ్ళీ
వాడుకునేవాళ్ళనీ

ఏమనాలి?
ఏం చెయ్యాలి?

అయినా
పిచ్చిగా ఎవరినైనా
నమ్మడం కాకపోతే

దేనినైనా
ఎవరినైనా
మార్చగలిగింది
ఉందా?

మనల్ని మనం
మార్చుకోవడం తప్ప!!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి”లో  వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

నవంబరు,  2024 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు:  గోపరాజు వెంకట సూర్యనారాయణ

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: గంజాయి వనం-కథ (నెల్లుట్ల రమాదేవి)

 ఇరువురికీ  అభినందనలు!

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.