సస్య-4
– రావుల కిరణ్మయి
అన్వేషణ
(సస్య కిటికీలో నుండి బయటి పరిసరాలను గమనిస్తుండగా శరీరానికి చల్లగా తగిలి కెవ్వున అరిచింది.ఆ తర్వాత…)
***
ఒక్కక్షణం గుండె ఆగి కొట్టుకున్నంత అనుభూతి కలిగింది. చప్పున ఆమెకు ఇందాక గండు తుమ్మెదను గాలి సాయంతో దూరంగా నెట్టిన సెంటుమల్లె పూల చెండు సాహసం గుర్తుకు రాగా, వెనక్కి తిరుగుతూనే ఎటువంటి ఆలోచనా చేయకుండానే విసురుగా దేనినో తోసివేస్తున్నట్టుగా చేతితో తోసివేసింది.
ఊహించని ఈ హఠాత్పరిణామానికి శ్రవణ్ మరగబెట్టి తెచ్చిన వేడి వేడి పాల గ్లాసులు తో సహా క్రింద పడిపోయాడు.
పాలన్నీ అతడి మొహం పైన, శరీరం పైన ఒలికిపోగా మంటతో విలవిలలాడ సాగాడు.
సస్య తగిన శాస్తి జరిగింది. ఇతగాడికి…. అని లోలోన సంబరిపడిపోతు….
అయ్యో ! కాలిందాండీ ? నేను లేపనా? మీరే లేస్తారా ? ఇలా” “కడుపులో లేనిది కావలించుకుంటే వస్తుందాన్నట్టు” సహాయం చేయడం ఏ మాత్రం ఇష్టంలేని ప్రశ్నలు పెదాల పై నుండి పలికి బొమ్మలా నిల్చుండి పోయింది.
శ్రవణ్ మాత్రం,, . బాధ తో తల్లడిల్లుతూనే…
పరవాలేదండీ! లేవగలను. మీకేం కాలేదు గదా ! అన్నాడు. అబ్బే నాకేం కాలేదండీ. మీకే .. మీకే.. బాగా కాలినట్టుంది. పైగా పంచెకట్టు లోపల కూడా బాగా కాలి ఉంటుంది. అంటూ సానుభూతి వాక్యాలు వ్యంగ్యంగా, కసిగా మాట్లాడింది.
మీరు ఇక వెళ్ళండి. ఈ రోజుకు నేనేమి చేసే స్థితిలో లేను. అన్నాడు. ఈ మాటకే ఎదురు చూస్తున్న సస్య..
అలాగేనండి! మీరు జాగ్రత్త అని, మల్లెల బుట్టను చూపిస్తూ..
ఎంత ఆశపడి తెచ్చారో ! మల్లెలు, “వాడిపోలేదు” చూశారా! అని నవ్వుతూ… తనలోని మానవత్వాన్ని విస్మరించి, అతని పట్ల తాను కౄరంగా అతనికి పొరపాటు అనో మరేదో అనే ఎటువంటి సంజాయిషీ ఇచ్చుకోకుండా అక్కడి నుండి క్షణంలో మాయమై ఇల్లు చేరి ప్రశాంతంగా నిద్రపోయింది.
***
మరునాడు పాఠశాలకు వెళ్ళి తెలుగు క్లాస్ తీసుకుంటుండగా FLN (విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాల పెంపు)కార్యక్రమంలో భాగంగా స్టేట్ టీమ్ క్లాస్ రూం అబ్జర్వేషన్ కు వచ్చారు.
ఆ రోజు తన పాఠం ” “మనసుంటే మార్గముంటుంది” ఐదుగురు అబ్జర్వర్లు పాఠం లో లీనమయిపోగా అద్భుతంగా బోధించింది.
వారు ఎంతగానో ప్రశంసించారు. వారిలో నుండి ఒకరు. మేడమ్! పుస్తకంలో ఉన్నది కాకుండా, ఇంకా మీరు విద్యార్థులకు ఏ విధంగా ఆసక్తి కలిగిస్తారని ప్రశ్నించడంతో, తడుము కోకుండా,
పిల్లలు ఒక ఖచ్చితమైన, తమకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే విధంగా అవగాహన కల్పిస్తాను. అందుకోసం సరైన మార్గాలు అన్వేషించుకునే విధంగా ప్రోత్సహిస్తాను. అంకితభావంతో కృషి చేస్తూ నిరంతరం లక్ష్యసాధనకై తపిస్తూ నిరాశా, నిస్పృహలను వదిలివేసి విజయపథానికై పోరాటం చేస్తూ తమను తాము విజేతగా ప్రతిష్ఠించుకునే శిలను నేనయి వారికి ఊతమిస్తాను. నేనూ వారిలో ఉన్న ప్రతిభా సామర్థ్యాలకు తగిన కృత్యసాధనకై నిరంతరాన్వేషినై వారితో జతకడుతాను. “ఉపాధ్యాయుడు తోటమాలి” అన్న ప్రొబెల్ మాటకు ప్రతిబింబమవుతాను. అంటూఎంతో భావోద్వేగంతో, వృత్తి మీద తనకున్న అపారమైన అంకిత భావం, గౌరవంతో సాగుతున్న ఆమె వాగ్ధాటికి అడ్డుకట్ట వేయలేక భావం, గౌరవంతో సాగుతున్న ఆమె వాగ్ధాటికి అడ్డుకట్ట వేయలేకపోయారు.
తరువాత రివ్యూ మీటింగ్ లో
సస్యగారూ! మీరు ఇక్కడ ఉండడం కంటే పక్కనే ఉన్న హైస్కూల్లో టీచర్ రిటైర్మెంటయి ఖాళీగా ఉంది. కాబట్టి దూరమైనా ,ఇబ్బందైనా లెక్కచేయక ఇప్పుడు మీ మాటల్లోని ఉత్తేజంతో ఆ పిల్లలకూ బోధన అందిస్తే సార్థకత ఏర్పడుతుంది. మీలాంటి ప్రతిభా మూర్తులకు అదే సరైన పాఠశాల అంటూ డిప్యుటేషన్ పంపించండి అని ఓరల్ గాను, సాయంత్రానికల్లా ఆర్డర్ కాపీ వస్తుందని చెప్పి మరో అవకాశం ఇవ్వకుండా వెళ్ళి పోయారు.
సస్యతో పాటు మిగతా ఉపాధ్యాయులందరూ బాధ పడ్డారు. ప్రతిభకు తగిన గౌరవం దక్కిందనుకోవాలా? లేక పనిష్మెంట్ అనుకోవాలా? అని అర్థం కాక తలలు పట్టు కున్నారు.
ఆ పాఠశాల ఆ ఊరూ రెండూ ఇబ్బంది కరమే. తనకు తను పెనం మీద నుండి పొయిలో పడ్డట్టుగా బాధ పడుతుండగా విదుషి ఫోను,
నీతో అర్జంటుగా మాట్లాడాలి. మధ్యాహ్నం లీవ్ పెట్టి వచ్చేయ్ లేదంటే నేనే నిన్ను వెతుక్కుంటూ వస్తాను అంది చాలా కర్కశంగా.
ప్లీజ్ ! విదుషీ! నన్నర్థం చేసుకో. నేను లీవ్ పెట్టే పరిస్థితిలో లేను. సాయంత్రం సరాసరి నీ దగ్గరికే వస్తాను.
నువు రావాల్సింది. నా దగ్గరిక్కాదు. శ్రవణ్ దగ్గరికి అంది.
ఆ పేరు వినగానే గొంతులో వణుకు, అతని దగ్గరికా ?
అవును. లంచ్ టైం అవుతున్నట్టుంది. ముందు భోజనం చెయ్ తరువాత మాట్లాడు తాను అని పెట్టేసింది.
బలితీసే మేకను అందంగా ముస్తాబు చేసినట్లుగా ఒక పక్క తనను ఫణంగా పెడుతూనే బాగోగులు ఆలోచిస్తున్న విదుషీని తలచుకొని నవ్వుకుంది.
ఏపాటు తప్పినా సాపాటు తప్పదని భోజనం కానిచ్చి వరండాలో కూర్చుంది. పిల్లలందరూ గోల గోలగా ఆడుకుంటున్నారు. తన దృష్టి ఒక ఇద్దరు ఒకటవ తరగతి అమ్మాయిలు ఆడుతున్న ఆటపై పడింది.
ఇసుకలో చిన్న పుల్లను చేర్చి దోసకాయ – పుల్ల – నీకిస్త మల్ల దోచేయకుండా దాచేసి రావోయ్ అంటూ ఇసుకను మొదటి అమ్మాయి చేతిలో పోసి కళ్ళను తన రెండు చేతుల మూసి నడిపించుకుంటూ వెళ్ళి ఒక దగ్గర పోయించి, మళ్ళీ యథాస్థానానికి తీసుకువచ్చి రెండో అమ్మాయి.
దోసకాయ పుల్ల -నాకియ్యిమల్ల దాచేసినాది – ఎంకులాడి తేవోయ్ అనడంతో ఆ అమ్మాయి వెతుక్కుంటూ. కనపడిన వారినల్లా పిల్లా పిల్లా దోసకాయ పుల్ల కండ్ల వడ్డద మల్ల అని అనడం వాళ్ళు
లేదోయ్
లేదోయ్..అటెన్కలెతుకు
వెతుకు .. వెతుకు.. ఆ చెట్టు కింద
మరువకుండ ఎతుకు
అంటూ చెప్పీ చెప్పకుండానే పుల్ల ఆడ్రస్ చెప్పడం ఆమె వెతుకుతూ.. వెళ్ళడం చాలా సరదాగా అనిపిస్తుండడంతో అలాగే చూస్తుండిపోయింది.
తన కొలీగ్ సింధూరి వచ్చి, సస్య గారు ! చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నారే ? డిప్యుటేషన్ పై వెళ్తున్నందుకు అంది.
అబ్బే ! అలా ఎందుకుంటుంది ? మాయా మర్మం లేని ఈ పసి మనసుల ఆటలు, పాటలు, మాటలు మిస్సవుతున్నాననే బాధగా ఉంది.
కానీ సస్యగారు మీరు ఒక్కరు బాధ పడ్డా అక్కడ అంతమంది. పిల్లలకు ప్రయోజనం చేకూరుతుంది. చెట్టుకు కాసిన పండు చెట్టుకు ఎంతో దూరంగా పడదు అన్న చందంగా అక్కడి పిల్లలు అధికశాతం వారి తల్లిదండ్రులనీ అనుకరిస్తూ తాగుబోతులుగా తయారవు తున్నారు. అక్కడ ఉన్న ఉపాధ్యాయులకు మీ సాయం కూడా తోడైతే ఆ నడవడికను మార్చవచ్చు. దానికి ఎంతో ఓర్పు, నేర్పు మీకు ఉంది. కాబట్టే మిమ్మల్ని అక్కడికి పంపిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ అని బెల్ కావడంతో వెళ్ళిపోయింది.
తన ఓర్పు, నేర్పు ఇక్కడ పాఠశాలలోను అక్కడ విదుషి దగ్గర తనకు అన్యాయమే చేస్తున్నది అని అనుకోకుండా ఉండలే పోయింది.
***
సరాసరి సాయంకాలం విదుషీ వాళ్ళింటికి వెళ్ళింది. అప్పటికే అక్కడ తెప్పించ బడి ఉన్న చాలా ఖరీదైన చీరలను చూపించింది.
ఎలా ఉన్నాయి ?
చాలా బాగున్నాయి. నీకు అన్ని విధాలా బాగుంటాయి. అంది సుతిమెత్తగా వాటిని తాకుతూ. ముందు ఈ జ్యూస్ తాగు. అలసిపోయినట్టున్నావ్ ? అని జ్యూస్ చేతికిచ్చింది.
అదేమిటో పని వాళ్ళు ఉన్నా తనకెప్పుడూ తానే స్వయంగా అందిస్తుంది ఏదైనా.
జ్యూస్ తాగగానే, పద అలా బయటికెళదాం. నీతో మాట్లాడాలి ఇక్కడ కుదరదు. అంటూ తన కారులో ఇందాకటి చీరల ప్యాకులు పెట్టి బయల్దేరదీసింది.
వెళ్తుండగా చెప్పింది అవి నీకోసమే తీసుకున్నాను, వాటిని స్టిచ్చింగ్ కి ఇచ్చి వద్దాం అని.
నాకెందుకు ? ఇంత ఖరీదైన చీరెలు ? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అంది.
ఏం? నువ్వు ఉద్యోగం చెయ్యడం లేదా ? ఈ మాత్రం కట్టుకోకూడదా? అన్నది విదుషి.
నీకు తెలియనిది కాదు. నా కుటుంబానికి నేనే ఆధారం. ఎన్నో లెక్కలు వేసీ వేసీ నెలంతా గడుపుతాను. అటువంటిది ఇంత సడెన్గా ఇన్ని చీరెలు అని, నా మీద లేని పోని అనుమానాలు ఆరాలు మొదలుపెడతారు చూసేవాళ్ళు అన్నది సస్య.
నాకు అదంతా తెలియదు. నా ప్రియ నేస్తం ఎప్పుడూ తన అందానికి తగిన హూందాతనంతో ఉండాలి. అంతే! ఇప్పుడు చెప్పు రాత్రేం జరిగింది?
ఆ ప్రశ్నకు తడబడుతూ రాత్రా… రాత్రి ఏం జరుగలేదు. ఆయన తలనొప్పిగా ఉందంటేను, ఈ రోజు క్లాసేం వింటారని నాకు వేడి పాలు తీసుకువచ్చారు. అనుకో కుండా నా చేయి తగిలి అతగాడి పై పడ్డాయి. నేను రెస్ట్ తీసుకొమ్మని చెప్పి వచ్చేశాను. సస్య చెప్పడం పూర్తి చేసింది. కార్ ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ పార్కింగ్ లో పెట్టి ఆ పక్కనే ఉన్న పబ్లిక్ గార్డెన్ లోకి నడిపించింది.
సస్యా ! నువు చల్లగా తగలగానే విసురుగా తిరిగి పాలను తోసేవు! నిజానికి ఆ స్పర్శ చల్లని వాటర్ బాటిల్ ఒక చేత్తో పాలు మరో చేత్తో పట్టుకొని నిన్ను పిలవడానికని అతడు చేసిన ప్రయత్నంలో బాటిల్ స్పర్శకు నువ్వు అతిగా భయపడిపోయి అతనికి కాలిన గాయాలు చేశావ్. అదొక్కటేనా? అతడు లేస్తున్న క్రమంలో నేలమీద నీరు జారి మళ్ళీ పడి చేయి విరగ్గొట్టుకున్నాడు.
తెల్లవారి వాచ్మెన్ వచ్చి చూసే సరికి స్పృహ లేకుండా పడి ఉన్నాడు.
అదేమిటి? వాచ్మెన్ వస్తాడు తాళం వేసుకుంటాడని చెప్పిందిగా, అడిగింది.
నేనే అవసరం లేదన్నాను. అందుకే అతను రాలేదు.
అలాగా ! అంది మామూలుగా. రేపట్నుండి అతడు కోలుకునేంత వరకు అంటే చేతికట్టు పూర్తిగా తొలగించేంత వరకు నీవు ఉదయమే వాళ్ళింటికి వెళ్ళి అవసరాలు చూసుకోవాలి అంది ఆజ్ఞాపిస్తున్నట్టుగా.
ప్రశాంతంగా కూర్చున్న సస్య ఒక్కసారి ఆ మాటతో పైకి లేచింది.
నావల్ల కాదు. కావాలంటే అమ్మను పంపిస్తాను. డబ్బులు మాట్లాడుకొని ఇవ్వమను మాకూ ఆసరా ఉంటుంది.
అతడిని గాయపరిచి ఒక రకంగా చిన్నపాటి హత్యా ప్రయత్నం చేశావని చెప్పచ్చు. అమ్మకు ఇదంతా ఎలా చెప్తావ్? కూతురు తన దగ్గర ఏదీ దాచదని మరుస్తున్న అమ్మకు ఏమని చెప్తావ్? చెప్పిన తరువాత అమ్మ మామూలుగా ఉంటుందా? నువ్వే ఆలోచించు,
అదీ నిజమే ! అమ్మ ఇప్పటికీ హెచ్చరిస్తూనే ఉంటుంది. పేదలకు కోపమే కాక అందం కూడా శాపమేనని. అన్నిటికీ మించి ఒంటరిగా వెళ్ళానని తెలిస్తే అస్సలు కుదురుగా ఉండదు.చెల్లె తమ్ముడి పై కూడా ఈ ప్రభావం పడుతుంది. గత్యంతరం లేక ఊ..అంది.
రేపట్నుండి నువు లంచ్ బాక్స్ అక్కడ వండిందే తీసుకెళ్ళు. నేను అమ్మతో వివరంగా మాట్లాడుతాను అన్నది.
*****
(సశేషం)
రావుల కిరణ్మయి .తల్లిదండ్రులు అనసుర్య పుల్లచారి గార్లు.జననం హుజురాబాద్ ,తెలంగాణ.తెలుగు భాషోపధ్యాయిని.70 వరకు కథలు.100కు పైగా కవితలు.చైతన్య గీతాలు,బాలగేయాలు,వ్యాసాలు,వివిధ పత్రికలలో ప్రచురితాలు.ఔధార్యం కథా సంపుటి.జీవశ్వాస నవల.వివిధ సాహితి సంస్థల తో బహుమానాలు.ప్రశంసలు.సమాజాన్ని చైతన్య పరిచేవిధంగా రచనలు చేయడం పట్ల చదవడం పట్ల ఆసక్తి.