అనుసృజన

సాహిర్

హిందీ మూలం: సాహిర్ లుధియానవి

అనుసృజన: ఆర్ శాంతసుందరి

‘లోగ్ ఔరత్ కో ఫకత్ జిస్మ్ సమఝ్ లేతే హై
రూహ్ భీ హోతీ హై ఇస్ మే యె కహా( సోచతె హై’
 
అందరూ స్త్రీ అంటే శరీరమనే అనుకుంటారు
ఆమెలో ఆత్మ కూడా ఉంటుందని ఆలోచించరు.
 
          ఇది రాసింది సాహిర్ లుధియానవి. హిందీ సినిమా పాటలు ఇష్టపడే వాళ్ళకి సాహిర్ పేరు సుపరిచితమే. కానీ ఆ పాటలలో స్త్రీవాదాన్ని వినిపించిన ఏకైక సినీ కవి సాహిర్ అని రాధా రాజధ్యక్ష ( టైమ్స్ ఆఫ్ ఇండియా పాత్రికేయులు)అభిప్రాయం.
 
ఆయన పాటల్లో స్త్రీ ప్రస్తావనకి కొన్ని ఉదాహరణలు ః
‘ప్యాసా’ లో వేశ్యాగృహంలో హీరో పాడే పాటలో- ‘జిన్హే నాజ్ హై హింద్ పర్ వో కహా( హై’- ఆయన రాసిన పంక్తులు హృదయాన్ని కలచి వేస్తాయి –
‘యహా( పీర్ భీ ఆ చుకే హై జవా( భీ
తన్ ఓ మంద్ బేటే భీ అబ్బా మియా భీ
యె బీవీ భీ హై ఔర్ బహన్ హై యె మా భీ’
 
ఇక్కడికి వయోవృద్ధులూ వచ్చారు, యువకులూ వచ్చారు.
కామంతో కోరిక తీర్చుకునేందుకు కొడుకులూ, తండ్రులూ వచ్చారు
ఆమె భార్య కావచ్చు, సోదరి కావచ్చు, తల్లి కూడా అవచ్చు!
 
          అలాగే ‘సాధనా’ అనే సినిమాలో ‘ఔరత్ నే జనమ్ దియా మరదో( కో…’అనే పాటలో పరిస్థితుల ప్రభావానికిలోనై వేశ్యగా మారిన ఒక యువతి హృదయ వేదనని తనే ఆస్థితిలో ఉన్నంత స్పష్టంగా మన కళ్ళ ముందుంచాడు-
 
‘మరదో నే బనాయీ జో రసమే ఉనకో హక్ కా ఫరమాన్ కహా
ఔరత్ కె జిందా జలనే కో కుర్బానీ ఔర్ బలిదాన్ కహా
ఇస్మత్ కే బదలే రోటీ దీ ఔర్ ఉసకో భీ ఎహసాన్ కహా’
 
మగవాళ్ళు తాము తయారుచేసిన ఆచారాలన్నిటినీ తమ హక్కులనీ, తాము విధించే ఆజ్ఞలనీ అన్నారు
స్త్రీ సజీవంగా దహనమవటం త్యాగమనీ, ఆత్మసమర్పణమనీ అన్నారు
శీలానికి మారుగా తినేందుకు తిండి పెట్టి అది కూడా దయాధర్మమని అన్నారు.
 
‘త్రిశూల్’ సినిమాలో ఒక తల్లి ఇంకా పుట్టని తన శిశువుతో అనే మాటలు –
‘మై తుఝే రహమ్ కే సాయే మె న పలనే దూంగీ
జిందగానీ కీ కడీ ధూప్ మె జలనే దూంగీ
తాకి తప్ తపకె తూ ఫౌలాద్ బనే
మా కీ ఔలాద్ బనే మా కీ హీ ఔలాద్ బనే
తూ మేరే సాథ్ రహేగా మున్నే !’
 
ఇతరుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడుతూ నువ్వు బతకకూడదు
జీవితంలోని ఎండలలో నువ్వు మండిపోవాలి
అప్పుడే ఆ కొలిమిలో కాలి నువ్వు ఉక్కులా గట్టిపడతావు
తల్లి పేరు నిలబెట్టే కొడుకుగా, నా కుమారుడిగా రూపొందుతావు
 
‘జఖ్మ్ సీనే మె లియే ఖూన్ నిగాహో మె లియే
మేరా హర్ దర్ద్ తుఝే దిల్ మె బసానా హోగా
మైం తేరీ మా హూ మేరా హర్ కర్జ్ చుకానా హోగా’
 
హృదయంలో గాయాలూ, కళ్ళలో రక్తపు జీరలూ నింపుకుని
నా బాధలన్నిటినీ నీ మనసులో నిలుపుకోవాలి నువ్వు
నేను నీ తల్లిని, నా రుణం తీర్చుకోవాలి నువ్వు.
 
          పురుషుడి చేతిలో మోసపోయిన స్త్రీ దుఃఖంలో కూరుకు పోకుండా నిబ్బరంగా ఎలా నిలబడిందో తెలియజేసే పాట ఇది. సాహిర్ ఇలాంటి ఆవేశంతో నిండిన పాటల్లోనే స్త్రీవాదం ప్రదర్శించలేదు. ఆయన రాసిన ప్రేమ గీతాల్లో సైతం – స్త్రీకి బలమైన వ్యక్తిత్వం ఉందనీ, ఉండాలనీ అన్నాడు.
 
‘పోంఛకర్ అశ్క్ అపనీ ఆంఖోం సే ముస్కురావో తో కోయి బాత్ బనే
సిర్ ఝుకానే సే కుఛ్ నహీం హోగా సిర్ ఉఠాఓ తో కోఈ బాత్ బనే’
 
కళ్ళలో ఉబికిన కన్నీళ్ళని తుడుచుకుని
చిరునవ్వు నవ్వితేనే దేన్నైనా సాధించగలవు
తల వంచుకుంటే ఏమీ లాభం లేదు
తలెత్తుకుని నిలబడితేనే ఏమైనా చెయ్యగలవు
 
‘నయా రాస్తా’ లో పాట ఇలా సాగుతుంది:.
 
          ‘వాసనా’ అనే సినిమాలో ‘ఇతనీ నాజుక్ న బనో ‘ అనే పాటలో కూడా స్త్రీని బలమైన వ్యక్తిత్వం అలవరచుకోమన్న సందేశం ఉంది-
 
‘యే న సమఝో కి హరెక్ రాహ్ మే కలియా హోంగీ
రాహ్ చలనీ హై తో కాంటో పె భీ చలనా హోగా
యే నయా దౌర్ హై ఇస్ దౌర్ మె జీనే కేలియే
హుస్న్ కో హుస్న్ కా అందాజ్ బదలనా హోగా’
 
అన్ని దారుల్లోనూ పూలే ఉంటాయని అనుకోవద్దు
ముందుకి సాగాలనుకుంటే ముళ్ళమీద కూడా నడవాల్సిందే
ఇది కొత్త యుగం – ఈ యుగంలో బతకాలంటే
అందం తన ధోరణి మార్చుకోవలసిందే.
 
          ‘ధుంధ్’ సినిమాకి ‘జుబనా సే చునరియా ఖిసక్ గయో రే'(నా యౌవనాన్ని కప్పిన పైట జారిపోయింది) అనే పల్లవితో పాట రాయమంటే సాహిర్ కోపంతో మండిపడ్డాడట, రాయనన్నాడట.అప్పుడు ఆ పాట ఇంకెవరిచేతో రాయించుకున్నాడు నిర్మాత చోప్రా.చోప్రాతో ఎంత సన్నిహిత సంబంధం, స్నేహం ఉన్నా, తన మనసుకి విరుద్ధమైన పని చేయలేకపోయాడు సాహిర్.
 
          ఆయన ఎన్నో సినిమాలలో వేశ్యల నోట తన పాటలు పలికించినా ఎక్కడా అశ్లీలం కాని , స్త్రీని అవమాన పరిచే విధంగా కాని రాయలేదు. అది ఆయన సున్నిత మనస్తత్వా నికి తార్కాణం.
 
          ‘చిత్రలేఖ’ సినిమా చాలా విలక్షణమైనది. ఒక వేశ్య, రాజు, సన్యాసి పాత్రలతో నడుస్తుంది కథ. అందులో మీనాకుమారి కథానాయిక. ఆమెకి రాసిన పాటలన్నీ చాలా గొప్పగా ఉంటాయి.
 
సన్యాసి(అశోక్ కుమార్) తో ఆమె వాదిస్తూ పాడే పాట చూద్దాం-
‘యే భోగ్ భీ ఏక్ తపస్యా హై , తుమ్ త్యాగ్ కే మారే క్యా జానో
అపమాన్ రచేతా కా హోగా , రచనా కో అగర్ ఠుకరావోగే
సంసార్ సే భాగే ఫిరతే హో, భగవాన్ కో తుమ్ క్యా పావోగే’
 
ఈ భోగం కూడా ఒక తపస్సు లాంటిదే – ‘త్యాగం త్యాగం’ అనే నీకు ఇదేమిటో ఏం తెలుసు
ఈ సృజనని కాలదన్నితే ఆ సృష్టికర్తని అవమానించినట్టే కదా
ఈలోకం నుంచి పరిగెత్తి పారిపోతున్నావు, నువ్విక ఆ భగవంతుణ్ణి ఎలా పొందగలవు?
 
          చివరిగా ఒక మాట- సాహిర్ లైంగికతను కాదనలేదు.’ఛూ లేనే దో నాజుక్ హోంఠోంకో’ (కాజల్),” పిఘలే బదన్ తేరీ తపతీ నిగాహోం సే,( కభీ కభీ), లాంటి పాటలు కూడా రాశాడు, కానీ ఎక్కడా అవి వెగటనిపించవు. ప్రియురాలి సమ్మతితోనే తను ముందుకి వెళ్తానని సూచించే పాటలు కూడా రాశాడు. 
 
సాహిర్ పాటలు విలక్షణమైనవి , అసమానమైనవి!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.