ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 6

(ఒరియా నవలిక )

మూలం – హృసికేశ్ పాండా

తెనుగు సేత – స్వాతీ శ్రీపాద

          డిసెంబర్ 1998-జనవరి 1999 మధ్యలో నేనక్కడ టూర్ లో ఉన్నప్పుడు చూసిన వాటి గురించి ముందే చెప్పాను. గమడా రోడ్ లో ఖరారు చేసుకున్న వలస కూలీల రవాణా గురించి నేను గమనించినది ఇక్కడ ప్రస్తావించదగినదే.

          ఆ రాత్రి నేను కుర్తా పైజమా వేసుకుని శాలువా కప్పుకుని టౌన్ వీధుల్లో నడుస్తు న్నాను. వలస కూలీలు చిన్న, పెద్ద ట్రక్ లలో, మినీ బస్ లలో, ట్రక్కర్స్ లో, అన్ని విధాల వాహనాల్లో వచ్చి చేరుతున్నారు. ఈ కూలీల వ్యాపారం రాత్రి ఏడు నుండి పది వరకూ సాగింది. ప్రతి వాహనం వెంటా ఒకరిద్దరు యువకులై నా బళ్ళతో ఉన్నారు. కొంచం శ్రద్దగా గమనిస్తే స్పష్టంగా తెలిసినది ఆ వాహనాలు మూడు ప్రాంతాల నుండి వస్తున్నాయని. గమడా రోడ్ స్టేషన్, జలంధర్ కాంప్, జహంగీర్ కాంప్. జహంగీర్ అతి విస్తారమైన ఆస్తులను నేను చూసాను, ఎత్తైన కాంపౌండ్ వాల్ తో, విన్నదాన్ని బట్టి పది ఎకరాల స్థలంలో కాని నా అంచనా ప్రకారం అయిదెకరాలు ఉంటుంది. ఆ మొత్తం ఆస్థి రైల్వే కు సంబంధించినది. అతని ఇంటి ముందు దాదాపు పది వాహనాలు ఆగి ఉన్నాయి. వాహనాలు లోపలికి వస్తున్నాయి, బయటకు వెళ్తున్నాయి. వాటిలో స్త్రీలు, పురుషులు, పిల్లలు, అన్ని వయసుల వారు, అన్ని సైజ్ లలో ఉన్నారు.

          జలంధర్ కాంప్ దీనికన్నా కొంత చిన్నది. నాతో పాటూ తాసీల్దారు కూడా ఉన్నాడు. స్థానికుల నుండి అతను తెలుసుకున్నది జలంధర్ అన్నదమ్ములు వేరు వేరు చోట్ల వేరు వేరు వ్యాపారాల్లో ఉన్నారని. అడవి నుండి అక్రమంగా కలప సేకరించడం, కట్టెల మిల్స్ నడపడం, అన్యాయపు వడ్డీ వ్యాపారం, విలువైన రతనాలు దొంగిలించడం, వలస కూలీల అక్రమ రవాణా వేరు వేరు ప్రాంతాల్లో సాగిస్తున్నారు. ధాన్యపు మిల్లులు, వాటి నిలవ ఏజెన్సీ , బీదవారికి తిండిగింజల సరఫరా వేరు వేరు స్థలాల నుండి జరుగుతాయి.

          జలంధర్ డిపోలో వలసకూలీల అక్రమ రవాణా చురుగ్గా సాగుతోంది. జలంధర్ బానిసల గొడౌన్ లను చూసాక నేను అంచనా వేసినది కూలీలకు ఇచ్చినవి తాత్కాలిక ఇళ్ళని. వలస కూలీలు వచ్చిన వాహనాల్లోనే వెళ్తున్నారు. ఆ బానిస కూలీల గొడౌన్ లో ఏ అరగంటో ఆగారు. ఒకరకంగా చెప్పాలంటే జలంధర్ వ్యాపారానికీ జహంగీర్ వ్యాపారా నికీ స్వల్పమైన తేడా ఉంది. జహంగీర్ తాలూకు వలస కూలీలు అతని బానిస గొడౌన్ లో ఒకటి రెండు రోజులో మరికాస్త ఎక్కువో ఉంటారు. కాని జలంధర్ విధానం వెంటనే పంపించెయ్యడం. అందుకే జహంగీర్ ఇంటి ముందు ఇరవై వాహనాలుంటే జలంధర్ ఇంటి ముందు అయిదే ఉన్నాయి.

          కాని మనుషుల అక్రమ రవాణాలో ఇద్దరి వ్యాపార స్థాయి సమానమే. నా అంచనాలో జలంధర్ వ్యాపారం అతని శత్రువు దాని కన్న కాస్త పెద్దది.

          నేను గమడా రోడ్ స్తేషన్ రాత్రి పదింటికి కాబోలు చేరాను. నేనా చుట్టుపక్కలే తిరిగి రైల్వే స్టేషన్ లో గుమిగూడిన వలస కూలీల చర్చలు విన్నాను. కూలీలతో మాట్లాడే విధానాన్ని బట్టి నేను బ్రోకర్లెవరో గ్రహించాను. వారితో బ్రీఫ్ కేస్ లు తెచ్చుకున్నారు. వారి ఖరీదైన్ బ్రీఫ్ కేస్ లు , కూలీల సంచులు, మూటలు, రేకుపెట్టెల మధ్య కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో నేను గమనించినది నన్నెవరో అనుసరిస్తున్నారని. నేను ఆగి వెనక్కు తిరిగి అతని వంక చూసాను. అతని మొహం డ్రెస్ చూస్తే మోటర్ బైక్ నడిపే వారిలో ఒకడిగా కూలీల మందను రవాణా వాన్ వైపు నడిపించే వాడని అనుకు న్నాను. అతని షర్ట్ కు పాంట్స్ కు చాలా పాకెట్స్ ఉన్నాయి. అతను పొడుగ్గా , పుష్టిగా బలంగా ఉన్నాడు. ఇరవై- ముప్పై యేళ్ళు ఉంటాయి. నా వెనకాల ఎందుకు వస్తున్నా వని అతన్ని అడిగాను. ఆశ్చర్యానికే ఆశ్చర్యంలా అతను నన్ను బెదిరించలేదు, అతని కుడి చెయ్యి పాంట్ కుడి పాకెట్ లో పెట్టి చాలా కూల్ గా అతనక్కడ ఉన్నది అతని కూలీలను ఇతర బ్రోకర్లు ఎవరూ అడ్డగించకుండా చూసుకుందుకని అన్నాడు. నేనేం చేస్తున్నానన్నది తనకు అనవసరమనీ, ఒకవేళ అతని పనిలో తలదూరిస్తే చంపేస్తాననీ అన్నాడు.

          నేను శాలువా తీసేసి చలికి కొంచం వణుకుతూ నా పలచని కుర్తా పైజామా చూపించా, ” చూడు, ఇప్పుడు నేను బ్రోకర్ను కాదని నీకు తెలిసి ఉండాలి, ఇప్పుడూ నీ పాకెట్ లో ఉన్న రివాల్వర్ చూపిస్తావా?” అని అడిగాను.

          జీన్స్ , చాలా పాకెట్ లున్న జాకెట్ లో ఉన్న ఆ మనిషి , తన పాంట్ కుడి జేబు లోంచి రివాల్వర్ తీసి , ” వెంటనే వెళ్ళిపో, లేదంటే దుఃఖపడతావు.” అన్నాడు.

          నేను చిన్నగా నవ్వి, ” నేనెవరో తెలుసా?” అని అడిగా.

          ఒక్కసారి ఆ యువకుడు రివాల్వర్ జేబులోకి తోసి, రైల్వే ట్రాక్స్ దాటి పారిపో యాడు. అప్పుడు నా వాచ్ రాత్రి పదకొండు చూబిస్తోంది.

          ఆ సాయంత్రం పొలీస్ స్టేషన్ ఇంచార్జ్ ఆఫీసర్ ను పోలీస్ స్టేషన్ లో నా కోసం ఎదురు చూడమని చెప్పాను. కాని నా దర్యాప్తు గురించి ఎలాటి సమాచారం ఇవ్వలేదు.
ఇక్కడ మరో విషయం చెప్పడం సమంజసమే. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న దుకాణా ల్లో బియ్యం రెండు నుండి అయిదు రూపాయల మధ్యన అమ్మడం మామూలే. దాదాపు ముప్పై శాతం మంది కూలీలు సగం ఏడాది వలస కూలీలుగా వెళ్తారు. రికార్డలలో మాత్రం వారి వాటా బియ్యం వారికి అమ్మినట్టుగా చూపిస్తారు. ఈ విషయంలో కొన్ని ఫిర్యాదులు నాకు చేరాయి కొందరు రీటెయిలర్స్ మీద చర్య తీసుకున్నాను కూడా. గమడా రోడ్ చుట్టుపక్కల అన్ని స్టోరేజ్ ఏజన్సీలు జలంధర, జహంగీర్లవో లేదా వారి దగ్గరి వారివో. బియ్యం ఎటూ పోడం లేదు. ఉత్పత్తి తగ్గుమొహం పట్టింది. బియ్యం కొనుగోలు కేవలం పేపర్ల మీదే జరుగుతోంది. దొంగ కొనుగోళ్ళు చేసిన రసీదులు మాత్రం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బియ్యం కొని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టెమ్ కు అమ్ముతు న్నట్టూ తయారవుతున్నాయి.

          అందుకే నేను కొందరు డీలర్లు, మిల్లర్ ల కార్యకలాపాలు పరిశోధిస్తున్నాను. పొలీస్ స్టేషన్ ఇంచార్జ్ ఆఫీసర్ కు ఎలాటి పరిశోధన నా మనసులో ఉన్నది అనే విషయం ఈ రోజు వరకూ తెలియదు. రాత్రి ఏడింటికి పొలీస్ స్టేషన్ లో ఒక్క ఆఫీసర్ కూడా లేడు. నేను తాసీల్దారుతో కలిసి గమడా రోడ్ టౌన్ లో తిరుగుతున్నాను. తరువాత నాకు తెలిసి నది, ఇంచార్జ్ ఆఫీసర్ రివాల్వర్ ఉన్న బైక్ మనిషి , వలస కూలీల వెంట వచ్చిన వాడు నన్ను అనుసరిస్తున్నాడని తెలుసుకుని నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ముందు చెప్పిన మనిషి నిజానికి పొలీస్ ఆఫీసర్ ను చూసి పారిపోయాడు.

          పోలీస్ ఆఫీసర్ వచ్చి చేరాక ఒక బ్రోకర్ ను అరెస్ట్ చేశాం. నిజానికి పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేసి అతన్ని రైల్వే పోలీస్ కు అప్పగించాడు. దాదాపు అర్ధరాత్రి సమయంలో, నేను పోలీస్ స్టేషన్ లో ఉండగా ఒక మిని బస్ బిల్డింగ్ వెనకాల దాదాపు వందమంది వలస కూలీలతో ఆగింది. డ్రైవర్ సీట్ లోంచి కిందకు దిగిన వాడు రాయపూర్ , జలంధర్ తమ్ముడు. ఆఫీసర్ రాయపూర్ తో మాట్లాడటం మొదలుపెట్టాడు. వాళ్ళ సంభాషణ నేను పోలీస్ స్తేషన్ లో చీకటిగా ఉన్న మూలనుండి చాటుగా వింటున్నాను.

          రాయపూర్ ఆ రాత్రి పోలీస్ కస్టడీలో గడిపాడు. కూలీల కంట్రాక్టర్ రైల్వే పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అతని ఫిర్యాదు మేరకు జహంగీర్ కొడుకుల్లో ఒకడిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు. విషయం గమడా రోడ్ లో చుట్టుపక్కలా పెద్ద గందరగోళం సృష్టించింది. గన్ లతో ఆడుకునే కూలీ మందలు దాక్కున్నారు.

          జహంగీర్ కొడుకు, జలంధర్ తమ్ముడు ఒక రాత్రంతా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఉండటం ఎప్పుడూ జరగలేదు. ఈ విషయంలో చట్టం ఎందుకో దయగానే ఉంది. గమడా రోడ్ వదిలి నేను మరో చోటీకి వెళ్ళిన మర్నాడే వాళ్ళను వదిలేసారు.

          ప్రేమశిల ఆకలి చావు గురించి పెద్ద ఎత్తున ప్రకటించినప్పుడు రెండు కోర్ట్ కేస్ లు నడుస్తున్నాయి. వాటిలో ఒకటి రాయపూర్ మీద. ఆ సమయానికి అతనొక ఆరితేరిన లీడర్, ప్రతిపక్షాల ప్రతినిధిగా మాట్లాడేవాడు.

***

          ఇదివరకే చెప్పినట్టు 1998 జూన్ లో ప్రేమశిల , పూర్ణ గమడా గ్రామానికి తిరిగి వచ్చారు. వాళ్ళు వారి అప్పుల వాళ్ళయిన గోవిందా , భులియా, జహంగీర్ ల కంట పడకుండా దాక్కున్నారు. కాని ఆ అప్పిచ్చినవాళ్ళకి తెలుసు తిరిగి వచ్చారని. ఎందుకో గాని బాకీ తీర్చమని వాళ్ళను ఒత్తిడి చెయ్యలేదు. నిజం చెప్పాలంటే అప్పు ఇచ్చినదానికి ఎన్నో రెట్లు ఇదివరకే చెల్లిపోయింది, కాని ఈ మాట పూర్ణకు చెప్పలేదు. అందుకే అప్పుతీర్చినా పూర్ణ, ప్రేమశిల భయంగానే బ్రతికారు.

          ప్రేమశిల ఆకలి చావు వార్త ప్రచురించిన దాంట్లో మరో సంగతి కూడా వ్రాసారు. పూర్ణ బోయి మూత్ర పిండాలలో ఒకటి ఆంధ్రాలో దొంగతనం చేసారని. పూర్ణ జనవరి 2000 లో మరణించాడు. అతని శరీరాన్ని పూడ్చిపెట్టారు. కొంతమంది చెప్పిన దాని ప్రకారం అతని పొత్తికడుపులో ఒక కత్తిగాటు మచ్చ ఉందని, కాని అది ఏ విషయాన్నీ నిరూపించడమో, నిరూపించ లేకపోడమో చెయ్యదు.

          చిన్న గమడాలో ఒక అంగన్ వాడీ సెంటర్ ఉంది. అక్కడ పనివాళ్ళూ వంట మనిషీ కూడా భులియా కులం వాళ్ళే. భులియాలంటే నేతగాళ్ళు. వారు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు కాదు. అయినా కాంధులు వారు వండిన వంట తినరు. పిల్లలు ఇలాటి పట్టింపులు పాఠించరు. అందువల్ల ముసలి వారి ఆహారం బదులు వారి వాటాగా గ్రామస్థు లకు బియ్యం, పప్పులు అందజేస్తారు అంగన్ వాడీ సెంటర్ వాళ్ళు.

          ప్రేమశిల మరణం గురించి వార్త డిసెంబర్ 2000 లో ప్రచురించడానికి పదిహేను రోజుల ముందు మరో ఆకలి చావు గురించి మరో వార్త బయటకు పొక్కింది. అది గజేంద్ర గురించి. గజేండ్ర బోయి భార్య పేరు కూడా ప్రేమశిల. గజేంద్రబోయి కూడా వలస కూలీయే. అతను ప్రభుత్వ కాంట్రాక్టర్ కింద ఢిల్లీలో పనిచేసాడు. అతను ఒక చెయ్యి పోగొట్టుకుని, ఇన్ఫెక్షన్ వచ్చి , నీరు పట్టి ఉబ్బిపోయి మరణించాడు.

          గజేంద్ర ఆకలిచావు గురించి వార్త ప్రచురణ కాగానే, బ్లాక్ డెవెలప్మెంట్ ఆఫీసర్, తాసీల్దార్, పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ఆఫీసర్ , సీ డీ పీ ఓ, చిన్నపిల్లల పౌష్టికాహార అధికారిణి, చిన్న గమడా గ్రామాన్ని దర్శించారు. నవంబర్ 15, 2000 నుండి ఆ గ్రామంలో బియ్యం, పప్పుల బదులు వండిన ఆహారమే ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ గ్రామంలో ఒక స్త్రీ ని, సుచరితను,పూర్ణ చుట్టం ఎక్కడో వేలువిడిచిన పిన్నమ్మ, వంట వాళ్ళుగా తీసుకున్నారు. ప్రేమశిల, ఆమె కొడుకులు ఒక పూట సెంటర్ లో తినే వారు. హృదానంద వాటాగా ప్రేమశిల పప్పులు, బియ్యం ఇంటికి తీసుకు వెళ్ళేది.

          2000 జనవరి దరిదాపుల్లో ప్రేమశిల పూర్ణ మరణించాక అడవిలో వంట చెరుకు సేకరించి బ్రతికేది. ఆమెకు చెట్లు నరికేంత బలం లేదు. అందుకే వంట కట్టెలు మాత్రం ఒక సైజులో కొట్టి తెచ్చేది. అడవికి వెళ్ళి పచ్చి కట్టెలు కొట్టి తెచ్చి బయట ఎండబెట్టేది. మర్నాడు వాటిని మోపులుగా కట్టి గ్రామంలో రోడ్డు పక్కన పెట్టుకుని అమ్మేది. సరాసరి రెండు రోజులకు ఇరవై రూపాయలు ఆమె సంపాదన.

          నవంబర్ 20 న రెండు మోఫుల కట్టెలతో అడవి నుండి గ్రామానికి వస్తూ ప్రేమశిల కుప్పకూలిపోయింది. ఆప్పటికి చిన్నగమడా గ్రామం వండిన ఆహారం ఇవ్వడంమొదలు పెట్టి అయిదురోజులే అయింది. గ్రామస్థులు ఆమెను లేపి తెచ్చి పడక మీద ఉంచారు. ఆమెకు కాస్త గంజి తాగించారు. అంగన్ వాడీ వంట మనిషి ఆమెకు ఆహారం ఇచ్చేది. కాని ప్రేమశిల మింగలేకపోయేది. ద్రవాహారం కూడా బలవంతాన ఇచ్చినా మింగడం కష్టం గానే ఉండేది.

          అడవి నుండి గ్రామానికి వచ్చే రోడ్ క్రాసింగ్ దగ్గరే ఆమె సేకరించిన వంట చెరుకు రెండు మోపులు పడిఉన్నాయి. ఎవ్వరూ వాటిని ముట్టుకోలేదు, జలంధర్, జహంగీర్ ల కలప వ్యాపారులు కూడా. అసలు వాళ్ళు దాన్ని ముట్టుకునే ప్రశ్నే లేదు. పేరున్న కలప వ్యాపారులు వాళ్ళు- ఇహ వంట చెరుకుతో పనేముంది గనక.

          ప్రేమశిల పెద్దకొడుకు హృదానంద చిన్న గమడాలో ఒక హోటల్ లో పని చేస్తున్నాడు. సీపీడీఓ కుప్పకూలి మంచం పట్టిన ప్రేమశిల స్థితి గురించి నవంబర్ 22 న విని, ఒక మహిళా ఆరోగ్య సేవకురాలితో 23న ఆ గ్రామానికి వచ్చాడు. ఆ ఆరోగ్య సేవకు రాలు మలేరియా పరీక్ష కోసం ప్రేమశిల రక్తం సేకరించింది. ఆమె ఆరు పిల్స్ – నులి పురుగుల నివారణకు రోజుకు రెండు సార్లు, మూడురోజులు, ముప్పై అయిరన్ -ఫోలిక్ టాబ్లెట్ లు రోజుకి ఒకటి చొప్పున వేసుకోమని ప్రేమశిలకు ఇచ్చింది. ఆ ఆరోగ్య సేవకు రాలు ప్రేమశిల కేస్ తీవ్రమైన రక్తహీనతగా నిర్ధారించింది. అసలు అప్పటికి ప్రేమశిల ఏమీ తినలేని స్థితిలో ఉంది. ఆ గ్రామంలో ఉన్న ఆమె చుట్టం, అంగన్ వాడి లో వంట చేసే సుచరిత, అతి కష్టం మీద ఆమెకు రెండు ముద్దలు తినిపించేది. అందువల్ల హెల్త్ వర్కర్ ఇచ్చిన టాబ్లెట్స్ ప్రేమశిల వేసుకుందని అనుకోను. అయితే సీపీడిఓ అంగన్ వాడీ రెజిస్టర్ లో ప్రేమశిలకు ఆమె కొడుకు, కూతురికి రెండు పూటలా ఆహారం ఇమ్మని సూచించి వెళ్ళాడు.

          చిన్న గమడాలో ఒక ఆసుపత్రి కూడా ఉంది. అధికారిక భాషలో దాన్ని ఒకే డాక్టర్ ఆసుపత్రి అనేవారు. ఇదివరకు పంచాయత్ ఆఫీస్ భవనంలో రెండు గదుల్లో ఆ ఆసుపత్రి నడిచేది. పనికి ఆహరం కార్యక్రమం బాధ్యతలు వచ్చాక, తక్కువ ధరకు, ఊరికే బియ్యం వివిధ రకాల ప్రభుత్వ పధకాల కింద ఇవ్వడం పంచాయత్ బాధ్యత కాడంతో, దాని కార్యక్రమాలు విస్తరించి అక్కడ డాక్టర్ కు స్థలం మిగలలేదు. ఇదివరలో డిస్పెన్సరీ గా వాడిన గది ఆహార ధాన్యాల గోడౌన్ గా మారింది. ఆసుపత్రిలో చాలా తక్కువ పరికరాలే ఉన్నాయి. గ్రామీణ ఆరోగ్య సేవకురాలి ఇంట్లో ఉండే మందులే అక్కడా ఉంటాయి. ఓరల్ రీహైడ్రేషన్ లవణాలు, పారాసిటమాల్, నులిపురుగుల మందులు, మలేరియా మందులు, విటమిన్లు, యాంటీ బయటిక్స్. ఆసుపత్రికి ఒక మందుల సరఫరాదారు ఉన్నాడు. అతని కోరిక మేరకు పంచాయత్ భవనాన్ని ఆనుకుని, దాని ఒక గోడతో కలిపి గ్రామస్తులు ఒక చిన్న గుడిసె పెంకుల రూఫ్ తో వేసారు. అక్కడే ఆసుపత్రి నడుస్తోంది.

          ఈ ఒక డాక్టర్ ఆసుపత్రి. ఇంత అస్తవ్యస్తంగా ఉన్నా డాక్టర్ పోస్ట్ మాత్రం ఎప్పుడూ ఇంతవరకూ ఖాళీగా లేదు. ఇక్కడ ఆసుపత్రికి పోస్ట్ చేసిన డాక్టర్లు గమడా రోడ్ లో ఉంటారు. వారానికి రెండు మూడు సార్లు ఆసుపత్రికి వస్తారు. డాక్టర్ లేనప్పుడు మందులు సరఫరా చేసే అతను చూస్తుంటాడు. ఆసుపత్రిలో డాక్టర్ ఉన్నా కూడా మందుల సరఫరా పని కన్న భిన్నంగా ఉండదు అతని పని.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.