ఆరాధన-6 (ధారావాహిక నవల)
-కోసూరి ఉమాభారతి
నేను హైదరాబాద్ చేరిన రెండో రోజునే ఎల్.వి.ఆర్ ఫౌండేషన్ వారి అవార్డు ఈవెంట్ కి తోబుట్టువులతో సహా చెన్నైకి బయలుదేరాను. ఫ్లయిట్ దిగుతూనే మమ్మల్ని ఎల్.వి. రామయ్యగారి మనుషులు నేరుగా వారి గృహానికి తీసుకుని వెళ్లారు. ఆయన సతీమణి మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించారు. దగ్గరుండి స్వయంగా వడ్డన చేయగా మేము ఆరగించిన షడ్రుచుల విందు ఎన్నటికీ మరువలేము. విందు తరువాత రామయ్యగారు మరునాటి ఈవెంట్ గురించి చెప్పారు.
వారి సంస్థ నుండి అవార్డ్స్ అందుకునే వారు వివిధ రంగాలలో జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొంది తమ తమ రంగాలలో సేవలందిస్తున్న నిష్ణాతులని చెబుతూ.. నిరుడు జరిగిన అవార్డు కార్యక్రమం హైలైట్స్ వీడియో చూపించారు. విదేశాల్లో నృత్యకళ వ్యాప్తికి కృషి చేస్తున్న కళాకారిణిగా నన్ను గుర్తించి సన్మానించుకోడం వారికి ఆనందంగా ఉందని.. నాతోపాటు ఓ మేటి సైంటిస్ట్, ఓ గణిత శాస్త్రవేత్త, ఓ సంఘ సంస్కర్త, ఓ వైద్య నిపుణుడు కూడా ఫౌండేషన్ వారి అవార్డులు అందుకోబోతున్నారని వివరించారు.
నాకు దక్కిన అరుదైన ఆ గౌరవానికి గర్వంగా అనిపించింది.
***
మరునాడు సాయంత్రం ఆరు గంటల సమయంలో కిక్కిరిసిన సభాప్రాంగణంలో వేద పఠనంతో మొదలయిన కార్యక్రమం ఆద్యంతం వైభవంగా జరిగింది. వేదిక పై హేమాహేమీలతో ఆశీనురాలనయినప్పుడు, గవర్నర్ నుండి అవార్డు అందుకున్న ప్పుడు.. మా అమ్మానాన్నల కళ్ళల్లో ఆనందాలని చూశాను. జన్మ తరించనట్టే అనిపిం చింది.
మరునాడు పొద్దుటే తెలుగు, తమిళ, ఆంగ్ల మీడియా మాధ్యమాల్లో అవార్డు కార్యక్రమం తిలకించి తరించాను. రామయ్యగారింట మరో మారు అల్పాహార విందు ఆరగించి, వారికి ధన్యవాదాలు తెలిపి.. తిరిగి హైదరాబాద్ కి పయనమయ్యాము.
***
నేను అవార్డు అందుకున్న వార్త ఎలాగూ హైదరాబాద్ వరకు చేరింది. మరోమారు సందడి. సత్కారాలు, సన్మానాలతో గౌరవాభిమానాలలో ముంచెత్తాయి నన్ను సాంస్కృతి క సంఘాలు.
అదే వారంలో హైదరాబాద్ లోని త్యాగరాజ గానసభలో ‘కన్య’ నృత్యనాటిక ప్రదర్శించాము. అమెరికా నుండి సెలవలకి వచ్చిన మా అమ్మాయి, శిష్యురాళ్ళు పాల్గొన్నారు.
గౌరవనీయులు డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిధిగా వచ్చారు. ప్రదర్శన, సభ ముగిశాక, నాతో మా నృత్యనాటిక ‘కన్య’ గురించి ముచ్చటించారు. కాన్సెప్ట్ బాగా వచ్చిందని, అక్కడితో వదిలేయకుండా మరింత విస్తృతంగాప్రదర్శనలు చేయ మని ప్రోత్సహించారు. వారి సూచనలు చాలా ప్రోత్సాహకరంగా అనిపించాయి.
శిష్యుల నృత్యాలకి వచ్చిన మెప్పు అద్భుతం అనిపించింది. విదేశీ గడ్డపై పుట్టి పెరిగిన బిడ్డలు.. తెలుగు భాషా, భావం అంతగా తెలియని చిన్నారులని చక్కని నర్తకు లుగా తీర్చిదిద్దుతున్న నా ప్రావీణ్యతని కొనియాడుతూ పలు పత్రికలు ప్రచురించాయి. ఆ విస్తృత స్పందన.. నాలో టెలీ-ఫిల్మ్ ఆలోచనకి బీజం వేసింది.
ఫిల్మ్ నిర్మాణం విషయంగా అవసరమయిన సాంకేతిక నిపుణులని కలిసాను. కథ రాయమని వోలేటి పార్వతీశం గారిని, సంప్రదాయ సంగీతం సమకూర్చేందుకు రాధ-గోపిలని .. కలిసాను.
మరో వారం రోజులు పాటు కుటుంబంతో.. గడిపి అమెరికా తిరుగు ప్రయాణం అయ్యాము.
***
ఇల్లు చేరిన మారునాడే తెలిసింది …. మాధవ్, రాగిణిలు ఒకరి గురించి మరొకరు పూర్తిగా అర్ధం చేసుకుని పెళ్లి పీటలెక్కబోతారని, అదీ కాత్యాయనీ ఆమోదంతోనే అని. విని ‘హమ్మయ్య’ అనుకున్నాను. పెళ్లి తేదీ విషయంగా.. నాతో సంప్రదించేందుకే కాక.. కాత్యాయనీ అమెరికా రాక సమాచారం కోసం కూడా వేచి ఉన్నారని చెప్పాడు మాధవ్.
తన తల్లి విమలమ్మ సమక్షంలోనే తమ వివాహం జరగాలని ఆశించిన మాధవ్ ఆమెని కాత్యాయనీతో పాటే అమెరికా రప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టుకున్నాడు. ఈ లోగా ‘మాతృ దినోత్సవం’ వేడుక జరుపుకునేందుకు బే-పోర్ట్ ఆసియన్ సొసైటీ వారు పెద్ద ఎత్తున సన్నాహాలు మొదలుపెట్టారు.
***
ఈవెంట్ కమిటీ సభ్యురాలనవడంతో కాస్త ముందుగానే బే-పోర్ట్ కి బయలుదేరాను.
ఎప్పటిలా కార్ స్టార్ట్ చేస్తూనే..నా పాతపాటల సి.డి పెట్టాను.
మొదటి పాట
….ధరణికి గిరి భారమా? గిరికి తరువు భారమా? తరువుకు కాయ భారమా? కనిపెంచే తల్లికి పిల్ల భారమా…
నాకిష్టమైన ఈ పాత పాట తరచుగా వింటూనే ఉంటాను. చిన్నప్పుడు మా అమ్మని అర్ధం అడిగితే..ఓ తల్లికి… తన బిడ్డ పట్ల ఉన్న భావనని సముద్రాలగారి రచనలో చక్కగా గుప్పించారంది!
ఆడపిల్ల జీవితం .. ఒక్కో మలుపులో ఒక్కో ప్రాధాన్యతని, ఒక్కో రకమైన అనుభూతి ని, ఒక్కో రకమైన స్పందనని తెలియజేస్తుందని వివరించింది అమ్మ.
***
పాటలు వింటూ కమ్యూనిటి సెంటర్ చేరాను. మా వేడుకలు మొదలయ్యాయి. ప్రప్రధమంగా ఇండోనేషియా నుండి వచ్చిన మియా తల్లి వాసుదేవి గారిని, ఇండియా నుండి వచ్చిన మరో ఇద్దరు మాతృమూర్తులని సన్మానించుకుని, వారి చేత ‘మదర్స్ డే’ కేక్ కోయించాము. వారిచేత సరదా ఆటలు ఆడించి.. పాటలు పాడించాము.
పసిబిడ్డని వీపున మోస్తూ… టీ ఎస్టేట్ లో పని చేస్తున్న ఓ తల్లి చిత్రం కవరుగా వేయించిన.. పర్సనల్ డైరీలు కానుకగా ఇచ్చుకున్నాము. ఆ చక్కని చిత్రం కింద ‘అమ్మతనం అద్భుత వరం’ అని బంగారు అక్షరాల్లోరాయించాము కూడా.
ఇక కార్యక్రమమంలో తరువాతి అంశం షడ్రుచుల విందు. భోజన సమయంలో ఇండియా నుండి వచ్చిన లక్ష్మీకాంతమ్మ గారి పక్కన కూర్చుని మాట కలిపాను. ఆవిడ పేరున్న నవలా రచయిత్రి, మాటకారి. ఏ విషయం గురించైనా చక్కగా ప్రసంగిస్తారని పేరు. కాసేపటికి మిగతా వారు కూడా ఆమె చుట్టూ చేరారు. తలో ప్రశ్న వేస్తూ.. అమె రాస్తున్న నవల గురించి చెప్పమని అడిగాము.
“ఏముందమ్మా, ఇదే విషయం….. ఓ తల్లి, ఆమె ఐదుగురు సంతానం గురించే. నలుగురు కడుపున పుట్టినవాళ్ళు. ఒకరు పెంచుకున్న బిడ్డ. వారి కథనే నవలగా రాస్తున్నాను. నవల పేరు ‘అమ్మ ఐదువేళ్ళ సిద్దాంతం’” అన్నారామె.
“టైటిల్ బాగుందండీ… అభ్యంతరం లేకపోతే.. కొంచెం వివరిస్తారా?” అని అడిగాను….
“అభ్యంతరం ఏమీ లేదు..కథలోని ఆ తల్లి నమ్మిన సిద్దాంతమే ‘ఐదు వేళ్ళ సిద్దాంతం. చేతికున్న ఐదు వేళ్ళు సమానం కాకపోయినా.. ఆ చేతికి మాత్రం అన్ని వేళ్ళు సమానమేఅని, అలాగే బిడ్డల్లో ఎవరెలాంటి వారైనా, ఎలా ఉన్నా …బిడ్డలందరూ ఆ తల్లికి సమానమే’ అన్నది ఆమె నమ్మిన విధానం.
అలాగే అమ్మని ప్రేమించి ఆదరించే పిల్లలున్నట్టే, అశాంతికి గురిచేస్తూ.. బాధ పెట్టే వారూ ఉంటారు. కావాలని కాదు సుమా. అయినా సరే, అమ్మ … మాత్రం అందరినీ ఒకేలా ఆదరిస్తుంది. ఆ భావన చుట్టూతే తిరుగుతుంది నవల ఇతివృత్తం.” అంటూ ముగించారామె.
ఆమె వివరణ విని .. మా అమ్మ కూడా ,,,,ఇలాటి తన ఆలోచనని రెండేళ్ల క్రితం,,,, మాతో పంచుకోవడం గుర్తొచ్చి ఒకింత ఆశ్చర్యపోయాను.
***
మరి కాసేపటికి, కార్యక్రమం ముగిసాక, అందరివద్దా సెలవు తీసుకుని ఇంటి దారి పట్టాను.
లక్ష్మీకాంతమ్మగారు వివరించిన ‘అమ్మ ఐదువేళ్ళ సిద్దాంతం’ నాలో మరిన్ని భావాలని వెలికి తీసినట్టయింది. చిన్నప్పుడు .. అంటే పెళ్ళికి ముందు వరకు కూడా ఒక్కోప్పుడు మా అమ్మ వైఖరీ నచ్చేది కాదు అని గుర్తు చేసుకున్నాను.
“అమ్మే అసలైన పక్షపాతి…పూటకో పద్ధతి అవలంబిస్తుంది. పిల్లకో న్యాయం అంటుందని అనుకునేదాన్ని. ఒకరిని బలవంత పెట్టి మరీ… తినిపించి కడుపులో చల్ల కదలకుండా కూర్చోమంటుంది. మరొకరిని కాస్త కడుపు మాడ్చి..వ్యాయామం చేయమం టుంది. ఒకరిని చదువుకోమని అదిలిస్తుంది, మరొకరిని సంగీతం వంటబట్టించుకోమని ఆజ్ఞాపిస్తుంది. ఒకరి ప్రేమవివాహానికి సుముఖత చూపుతుంది. మరొకరిది ఒత్తుత్తి ఆకర్షణ అని కొట్టిపారేస్తుంది.
“ఎలా వేగడం అమ్మతో?” అనుకుని కోపగించుకునేదాన్ని, తిట్టుకునేదాన్ని.‘ఎన్నో రంగులు పులుముకున్న అమ్మ ప్రేమ ఒక్కోమారు అర్ధం కాక ..అసలు అమ్మ ఎందుకిలా చేస్తుందో’ అని నీరస పడిపోయేదాన్ని.
కానైతే, రెండేళ్ళ క్రితం నాన్న గారి షష్టిపూర్తి వేడుకల్లో, అమ్మని ప్రశ్నించే అవకాశం దొరికింది.అడిగేసాను. అమ్మంటే భక్తి, ప్రేమ అలాగే ఉన్నా… భయం తగ్గిందిగా. అందుకే అడిగేశాను. బాల్యం నుండీ నాకు తేడాలుగా అనిపించిన …సందర్భాల్ని వల్లెవేస్తూ తరచితరచి అడిగేశాను. నా సొదంతా విన్న అమ్మ గుంభనంగా నవ్వింది.
ఆమె సంతతి మేము నలుగరమూ .. అమ్మ ఏం చెబుతుందోనని ఆసక్తిగా ఉన్నాము. ఆమె మాత్రం ప్రశాంతంగా మా అందరి వంకా చూసాక, నాన్న వంక చూసింది. నాన్న ముసిముసిగా నవ్వుతూ ‘జవాబు చెప్పు మరి’ అన్నట్టుగా.
చేతులకున్న గాజులు ఓ మారు సవరించుకుని.. కుడి చేయి పైకెత్తి ఐదువేళ్ళు చాచి చూపించిది అమ్మ. “చూడండి. అరచేయి అమ్మైతే, చేతికున్న ఐదువేళ్ళు సంతానం.” అంది. “ఈ చేతికున్న ఐదువేళ్ళు సమానంగా ఉన్నాయా? అని మమ్మల్ని ప్రశ్నించింది.“ఒక తల్లి ….పిల్లలే అయినా అందరూ ఒకే మాదిరిగా ఉండరు. ఒక్కోరు ఒక్కోరకంగా ఉంటారు. వారి అవసరాలు కూడా ఒక్కోరకంగా ఉంటాయి. కన్నతల్లికి మాత్రమే తెలుసు ఆ వ్యత్యాసాలు. కాబట్టి ఒకొక్కరి అవసరాలకి అనుగుణంగా తన పెంపకాన్ని మలుచుకుంటుంది కన్నతల్లి.” అని వివరించింది అమ్మ.
‘అంటే.. మమ్మలనందరినీ, అన్నింటినీ సమన్వయ పరుచుకుంటూ…ఎవరి పరిధిలో వారిని ఎదగనిస్తూనే తన నలుగురు పిల్లల్ని శ్రద్దగా పెంచిందన్నమాట.’ అన్న గ్రహింపుతో నా హృదయం అమ్మ ప్రేమకి నీరాజనాలు పట్టింది.
రెండేళ్ళ క్రిందటే ‘అమ్మ ఐదువేళ్ళ సిద్దాంతం’ నాకు అర్ధమయింది. ఆ సిద్దాంతం ఎంత సరయినదో మరో మారు లక్ష్మీకాంతమ్మ గారి ద్వారా గుర్తించాను ఇవాళ.
***
కాస్త రద్దీగా ఉండడంతో ఇల్లు చేరడానికి..మామూలు కంటే పది నిముషాలు ఎక్కువ పట్టింది. కార్ పార్క్ చేసి, లోనికెళ్ళేప్పటికి మా వారు నా కోసం ‘మదర్స్ డే కేక్, పూల గుచ్చం టేబల్ పై సర్ది, నా రాక కోసమే వేచి ఉన్నారు.
*****
(సశేషం)
నా పేరు ఉమాభారతి… నేను ఓ కళాకారిణి. కూచిపూడి నాట్యకారిణి.. నృత్య గురువు… రచయిత్రి. చలన చిత్రాల్లో నటించాను : సుడిగుండాల్లో బాలనటిగా, చిల్లరదేవుళ్ళులో కధానాయికగా, యమగోలలో ఊర్వశిగా. జెమినీ TV పై “ఆలయ నాదాలు” అనే సీరియల్ కి, సింగపూర్, జోహనాస్బర్గ్ TV లకి నృత్య సంబంధిత చిత్రాలకి, కూచిపూడి నృత్య డాక్యుమెంటరీలు మరియు నృత్యాభ్యాసన వీడియో చిత్రాలకి నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలని నిర్వహించాను. USA లోని హ్యూస్టన్ మహా నగరంలో ‘అర్చన ఫైన్_ఆర్ట్స్ అకాడెమీ’ స్థాపించి మూడు దశాబ్దాలు దాటింది. రచయిత్రిగా మూడు నవలలు, రెండు కధా సంపుటాలు, ఒక వ్యాసా సంపుటి వెలువడ్డాయి. మా తల్లితండ్రుల పేరిట “శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ’ (సాహిత్య-సాంస్కృతిక-సామాజిక సేవా సంస్థ) స్థాపించి మూడు సంవత్సరాలుగా .. ‘కధా-కార్టూన్-కవిత’ల పోటీలు కాక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మూగాజీవాల సంక్షేమార్ధం నిత్యం కృషి చేస్తుంటాను. యోగాభ్యాసన నా అభిరుచి. నృత్యమే జీవితంగా, సాహిత్యం ఊపిరిగా, మూగజీవుల సంరక్షణ నా జీవితాశయంగా మనుగడ సాగిస్తున్నాను. నేను B.A Economics M.A Political Science చేసాను. USA కి 1980 లో వచ్చాను… నాకు ఓ కొడుకు, ఓ కూతురు. నా భర్త తో సహా వారు కూడా Health care workers..