కాదేదీ కథకనర్హం-10

అమ్మాయిలూ తొందరపడకండి !

-డి.కామేశ్వరి 

          ఓ చేతిలో ఏణార్ధం పాప, రెండో చేత్తో బరువయిన ప్లాస్టిక్ బ్యాగు, భుజానికి నిండుగా వున్నా హ్యాండు బ్యాగుతో బస్సు కోసం ఎదురు చూస్తూ అసహనంగా నిల్చుంది భారతి. ఎండాకాలం ఏమో ఉదయం ఎనిమిదన్నరకే ఎండ చుర్రుమంటోంది. ఉక్క చెమట, చీదరతో చేతిలో పాప చిరాగ్గా ఏడుస్తోంది. చేతిలో బరువు, దానికి తోడు పాప ఏడుపు . రాని బస్సు కోసం ఎదురు చూపుతో నీరసం వస్తోంది భారతికి. పిల్లని నేలమీద కూలేసి కింద కూలబడాలన్నంత చిరాగ్గా వుంది ఆమెకి. ఏమున్నా ఏం లేకపోయినా మధ్యతరగతి మధ్య సంస్కారం వుంది కనక అంత పనీ చెయ్యలేక చేతిలో పిల్ల వైపు గుడ్లురుమి చూసి భయపేడ్తూ , గొణుక్కుంది.

          “భారతీ ……నువ్వేనా ….దూరం నుంచి చూసి నువ్వా కాదా అనుకున్నాను…. యిదేమిటే యిలా అయిపోయావు?” గొంతు విని చటుక్కున తపతిప్పి చూసింది. భారతి ——సునయన! —పేరులాగే పెద్దకళ్ళతో అందంగా వున్న సునయన. బి.ఏ లో క్లాస్ మేట్ —–ఏమిటలా చూస్తున్నావు . గుర్తుపట్టలేదా? సునయన నవ్వుతూ అంది. వూర్లోనే వుంటున్నావా? పెళ్ళయిందా/ లేక వుద్యోగమా? భారతి ప్రశ్నలు కురిపించింది. ఆరోగ్యంతో మిసమిసలాడుతూ , ఖరీదయిన బట్టల్లో అందంగా మెరిసిపోతున్న ఆమెని చూసి భారతి మనసు కృంగిపోయింది.

          “పెళ్ళయింది . మావారు యింజనీరు —–క్రంప్టన్ గ్రీవ్స్ లో పని. పెద్ద కంపెనీ కదా మంచి జీతం, యిల్లు, కారు అవన్నీ యిచ్చారులే. నువ్వేమిటి యిలా వున్నావు …..కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని యిలా నల్లగా పుల్లలా అయిపోయావేమిటి? మీ ఆయనేం చేస్తున్నారు. యీ పాప నీ పాపా ఎన్నాళ్ళయిందేమి పెళ్ళయి?’ సునయన కుతూహలంగా అడిగింది. భారతి ముఖం ముడుచుకుంది. జవాబు చెప్పడానికి తడబడింది. ఆమెని అవస్థ నించి తప్పిస్తున్నట్టు బస్సు వచ్చి ఆగింది —–‘ సారీ సునయనా….ఈ బస్సు మిస్సయ్యానంటే మరో అరగంట వరకూ దొరకదు — బి.హెచ్. యి.ఎల్ స్కూల్లో పనిచేస్తున్నాను . యింకోసారి కలుద్దాం. మీ యిల్లేక్కడో చెప్పు’ అంటూ గాభరాగా బస్సేక్కేసింది–సునయన యింటి గుర్తులు ఏవో చెప్పింది. అవి భారతి చెవికి ఎక్కనే లేదు. బస్సు కదిలింది —-ఏదో ప్రమాదం తప్పినట్టు ఊపిరి పీల్చుకుంది భారతి.
ఎవరన్నా తెల్సినవారు కనిపిస్తే ఏదో తప్పు చేసినదానిలా తప్పించుకుని పారిపోవాలని పిస్తుంది . ఛా ……వెధవ బతుకయిపోయింది. అనుక్షణం తనను తాను నిందించు కుంటూ చావలేక బతికే బతుకు యిది. భారతికి ఉక్రోషంతో ఏడుపు వచ్చినట్లయింది. విసుగంతా చేతిలో గిజగిజలాడుతున్న పిల్ల మీద చూపించి ఒక్కటేసింది. పిల్ల ఏడుపు లంకించుకుంది. ఏడుస్తున్న పాపని చచ్చినట్లు సముదాయించాల్సి వచ్చింది. మొదటి స్టాపు లో దిగి రెండు సందులు నడిచి అక్కడ బేబి కేర్ సెంటర్లో పాపని, పాప సామానుని ఆయా చేతికిచ్చి మళ్ళీ వచ్చి బస్సు స్టాపులో నిల్చుని బి.హెచ్.యీ.ఎల్ వెళ్ళే బస్సు కోసం ఎదురు చూడసాగింది భారతి. జీవితంలో సగం భాగం యీ బస్సుల కోసం ఎదురు చూడం ప్రయాణించడంతోటే సరిపోతోంది అనుకుంది. మళ్ళీ సాయంత్రం వచ్చి బస్సు దిగి పాపని పికప్ చేసుకుని మళ్ళీ బస్సెక్కి ఇల్లు చేరి యిన్నీ టీ నీళ్ళు తాగి ట్యూషన్ కి వచ్చిన పిల్లలకి ఏడున్నర వరకు పాఠాలు చెప్పి , ఉదయం ఐదు గంటలకి వండుకున్న చల్లని మేకుల్లాంటి అన్నం యింత పచ్చడి చారు వేసుకుని తిని, వళ్ళేరగకుండా నిద్రపోయి – మళ్ళీ తెలవారి లేచి వంట ఆరంభించి, యిన్ని చపాతీలు చేసుకుని టిఫిను బాక్సులో పెట్టుకుని, పాప కోసం పాలు , అన్నం బిస్కట్లు వగైరాలు ప్లాస్టిక్ బ్యాగులో సర్ది పాప, తను స్నానం చేసి యిల్లు సర్దుకుని మళ్ళీ పరిగెత్తి బస్సులు ఎక్కడం —– యిదీ తన జీవితం! యిదా తను కలలు కన్న జీవితం! ఉదయం లేచింది మొదలు పొట్టకూటి కోసం అరక్షణం విశ్రాంతి లేకుండా పరిగెత్తే జీవితమా తను కోరుకున్నది ! ఏ ప్రేమ కోసం తపించి తప్పటడుగు వేసిందో ఆ ప్రేమ, అనురాగం అన్నీ ఎండమావులు, దూరపు కొండలు అని అర్ధం అయ్యేటప్పటికి , మెడకి గుదిబండలా ఓ పాప , ఆ పాప కోసం జీవచ్చవంలా బతికే తను మిగిలారు! బతుకు మమత, తీపి , కోరిక అన్నీ చచ్చిపోయినా ఏదో కసితో తనని తను శిక్షించుకోడాని కన్నట్లు బతుకీడుస్తోంది. పాత జీవితాన్ని గుర్తు చేసే ఏ మనషులు కన్పించినా, ఏదన్నా సంఘటన జరిగినా ఆ రోజంతా భారతి మనసు వికలమయిపోతుంది. బండబారిన గుండెలో బతుకీడ్చే ఆ గుండెపై సమ్మెట పోట్లు తగుల్తాయి —- అప్పుడప్పుడు పాత పరిచయస్తుల్ని చూసి నప్పుడు.

          సునయన…..ఎంత అద్రుష్టావంతురాలు! చక్కటి భర్త, హోదా, అందం, అనందం, ఆరోగ్యం ——ఐశ్వర్యం …అన్నింటినీ గుత్తకి తీసుకున్నట్లు ఎంత హాయిగా వుంది! ఆ హాయి ఆ అనందం తనకి దక్కకుండా చేసుకున్నది తనేగా! కావాల్సిందే ఈ శాస్తి తనకి! భారతికి ఉక్రోషం, ఆవేదనతో కన్నీళ్ళు జారాయి. తనూ ఓ ఇంజనీరుకి భార్య అయి వుండేదే! ఈనాటి సునయనలా తనూ అందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో మిసమిసలాడుతూ కారులో తిరిగేది! చేతులారా అన్నింటిని దూరం చేసుకుంది తనేగా! యిప్పుడు తనేవరిని బ్లేం చెయ్యగలదు! ‘ఇడియట్ ….యూ డిజర్విట్ కసిగా తనని తాను , మరోసారి తిట్టుకుంది!…హు….ప్రేమట! ప్రేమ!….యీ బ్లడీ ఫూల్ ….ప్రేమ! ….లవ్!,,,, అవన్నీ అందనంత వరకే అందంగా కన్పించి ఊరిస్తాయి….పెద్ద ప్రేమికులుగా చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోయిన రోమియో జూలియట్ , దేవదాసు పార్వతి , సలీం అనార్కలి ….వీళ్ళందరి ప్రేమసఫలం కాలేదు కనక అమర ప్రేమికులుగా నిలచిపోయారు! అదే వీళ్ళందరి ప్రేమ పెళ్ళిగా మారితే అప్పుడు తెలిసేది వీళ్ళంతా ఎంతటి అమర ప్రేమికులో….. అప్పుడు వీళ్ళ ప్రేమలు, పేర్లు నామరూపాలు లేకుండా పోయేవి! ప్రేమ! పిటీ….పూర్ పిటీ ….ఈ ప్రేమల గురించి గొప్పగా రాసే రచయితలందరినీ సూట్ చేసి పారేయాలి!…..ప్రేమలు, త్యాగాలు చూపించి ఆడపిల్లల్ని వెర్రెక్కించేట్లు చేసే ఈ రచనలన్నీ తగలబెట్టాలి! ప్రేమ కధలుగా సినిమాలు తీసి ప్రేక్షకులని మోసం చేసి డబ్బులు సంచులు నింపుకునే నిర్మాతలను క్షమించకూడదు! తెలిసీ తెలియని వయసులో పుస్తకాలు చదివి, సినిమాలు చూసి ప్రలోభంలో పడి, ఉచితానుచితాలు మర్చిపోయేట్టు మైమరుపులో, భ్రమలో పడేసే ఈ రాతలన్నీ తగలబెట్టాలి! ‘ప్రేమంటే దూరంగా వున్నప్పుడే దాని మజా, అందగానే అదీ అతి మామూలు అయిపోతుంది. వెర్రి మొహాల్లారా……అంచేత ప్రేమ మెరుగులు ఎండమావులని తెల్సుకోండి. ఎండమావి ఊరిస్తుంది తప్ప దాహం తీర్చదు . పిచ్చి నాయనల్లారా, యీ పుస్తకాలు కావలిస్తే సరదాగా చదువుకోండి కాలక్షేపానికి , అంతేగాని ఆచరణలో పెట్టకండి అని ఓ హెచ్చరిక ఏ రచయితలూ రాయరేం —సిగరెట్టూ పెట్టె మీద సిగరెట్లు ఆరోగ్యానికి హానికరం అన్న హెచ్చరికలా యీ ప్రేమకధలూ మీ భవిష్యత్తుకి హానికరం అన్న కాషన్ చివర్న ఈ రచయితలు చేర్చరేం! ప్రేమ అన్నది అందమైన ఊహ మాత్రమే—-ఊహాగా ఉన్నంత వరకే అందులో తీపి! అంతకంటే ప్రేమ నుంచి ఏమి ఆశించకండి! ఏవెధవా ఏ త్యాగాలూ చెయ్యడు ప్రేమ కోసం….. అమ్మాయిలూ జాగ్రత్త! ప్రేమని గురించి చదవండి, ఊహల్లో ఆనందించండి! కలల్లో తెలిపొండి! — కాని ప్రేమలో పడకండి! పడినా అది పెళ్లి దాకా రానీయకండి! రానిచ్చారా బస్, ఆనాటితో మీ జీవితం అధోగతే అని నమ్మండి. అని అరిచి అందరికీ చెప్పాలని వుంటుంది భారతికి! అలా అరవలేదు కనక, తెల్సిన ప్రతీ టీనేజ్ పిల్లకి, స్కూలు తెరిచి కొత్త సంవత్సరం , కొత్త క్లాసు తీసిన మొదటి రోజు మొదటి పాఠం ప్రేమ గురించే చెప్తుంది భారతి!…..తన జీవితం కధగా మలిచి ——

          ‘అమ్మాయిలూ మీరంతా వికసిస్తున్న మొగ్గలు. ఆ మొగ్గ రేకు విప్పి పరిమళాలు వెదజల్లకముందే నేలరాలిపోయే దుర్గతికి లోనుకాకండి. ప్రేమ అన్న పదమే ట్రాష్ —–నమ్మకండి. మోసపోకండి. ఆడపిల్లలూ మీ అక్కలాంటి దాన్ని …మీరు చదువుకోడానికి  వచ్చారు కానీ ప్రేమ పాఠాలు వినడానికి రాలేదని నాకు తెలుసు. బడిలో చదువుకునే పాఠాలు ఎలాగూ నేర్చుకుంటారు. జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం యిది. ఈ వయసులో ప్రతిదీ రంగుల మయంగా అందంగా కన్పించి ఊరిస్తుంది. మధువు గ్రోలాలని ఆరాటంగా భ్రమరం దరిచేరితే . పువ్వు తన రంగులని మరింత అందంగా కన్పించేట్టు చేసి ఆకర్షించాలని తాపత్రయ పడ్తుంది తప్ప ‘ఆ భ్రమరం మకరందం కోసం మాత్రమే తన దరిచేరుతుంది. తరువాత వేరే పూవు దరి చేరుతుంది’ అని గ్రహించ లేదు. అలా అమాయకపు విరిసీ విరియని ఆ లేత మొగ్గ భ్రమరాకర్షణకి లోనయిపోతుంది. అమ్మాయిలూ……ఆ టీనేజ్ లో ‘ప్రతి అబ్బాయి తన అందానికి సంమోహితుడై పోయాడని, తనని మనసారా వాంచించి ప్రేమిస్తున్నాడని, ఆ ప్రేమ, ఆ మధురానుభూతి తనకి మాత్రమే దక్కిన వరం’ అని ప్రతి అమ్మాయి నమ్ముతుంది! ఆ ఆకర్షణకి లోను గాకుండా నిగ్రహించుకొగల్గిన అమ్మాయిలూ అదృష్టవంతురాలు! ఆ ఆకర్షణకి లోనయిన అమ్మాయి పతనానికి ‘ఆనాడే పునాది పడ్తుంది’ అని గ్రహించండి —–మీ ప్రేమకి తల్లితండ్రుల ఆశీర్వాదం వుండి, అది పెళ్ళి వరకు దారితీస్తే కొంతలో కొంత నయం! పెళ్ళితో ప్రేమ చచ్చినా ఆ వివాహబంధానికి కట్టుబడి నూటికి తొంభై మంది భార్య భర్తల్లో ఏ స్పందనా లేకపోయినా బతుకీడ్చవచ్చు. ఏం జరిగినా యిటు అటు పెద్దవారు అండగా వుంటారు. మీ ప్రేమకి పెద్దల అనుమతి లేకపోతే మాత్రం మూర్ఖంగా ఆ ప్రేమని నమ్ముకుని మోసపోకండి. ఆ ప్రేమ మిమ్మల్ని దరి చేర్చదు! నిశ్చయంగా నట్టేట ముంచుతుంది. నూటికి ఏ ఒక్కరో ప్రేమకి కట్టుబడి నమ్మినదాన్ని అన్యాయం చేయని పుణ్య పురుషులు వుంటారు! అలాంటి పుణ్య పురుషుడ్ని వరించిన స్త్రీ నిజంగా అదృష్టవంతురాలే అవుతుంది! ‘ఆ నూటికి ఒక్కరు మీరే” అని నమ్మకండి గుడ్డిగా, “మీ మేలు కోరే పెద్దల మాట వినడం మీకు, మీ భవిష్యత్తు కు క్షేమం” అని మొదటి పాఠం ప్రతి సంవత్సరం రెండేళ్ళుగా ప్రతి క్లాసు ఆడపిల్లలకి చెపుతుంటుంది భారతి. ఆ పిల్లలకి ఎందుకు చెప్తుందో అర్ధం అవదు! అర్ధం కాలేదని గ్రహిస్తే భారతి అది తన కధ అని నిర్మొహమాటంగా చెప్తుంది — చేసిన తప్పు దాచుకోనని ఆమె నిజాయితీని నమ్మి భారతి టీచర్ అంటే పిల్లలు ప్రాణం పెడ్తారు ఆ స్కూల్లో ! ఇన్ని తమకు చెప్పే ఆ టీచరు , యింత తెల్సిన ఆ టీచరు ఎందుకిలా తప్పటడుగు వేసింది? అన్న సందేహం మాత్రం వదలదు ఆ పిల్లలని —- దానికీ భారతి జవాబు రడీగానే వుంటుంది ——“నా అనుభవం నేర్పిన పాఠం యిది. ఆ అనుభవం మీకు కలగకూడదనేగా యిది చెప్తుంది. అంత లోతుగా ఆలోచించే విచక్షణ, పెద్దలు మంచి కోసమే చేస్తారన్నదీ గుర్తించలేని వయసు తెచ్చిన ఆవేశం, తమ ప్రేమ అమర ప్రేమ అన్న గుడ్డి నమ్మకం, ఏం జరిగినా ఎదుర్కొం టాను అనే మొండి ధైర్యం, జీవితం అంటే ప్రేమ ఒక్కటే కాదు అని తెలియని అవివేకం, నే చూసినది, అనుభవించినది జీవితంలో పదోవంతు మాత్రమేనని యింకా తొంబై శాతం గురించి పెద్దలు అలోచించి చెప్తున్నరన్నది గ్రహించలేని మూర్ఖపు పట్టుదల…..యివన్నీ అప్పుడు నా కళ్ళు కప్పాయి. దిగాక గాని లోతు తెలియదు. దిగిన తర్వాత ఆ లోతు దిగలాగుతుంటే బయటిపడడం అతికష్టం. అందుచేత దిగేముందు లోతు చూసుకోవా లంటారు పెద్దలు. నే చెప్పే యీ మాటలూ నా పెద్దలూ చెప్పారు. వయసు పొంగులో, ప్రేమ మైకంలో అవి పెడచెవిన పెట్టిన ఫలితం ఈనాడు మీ ముందు నిల్చుంది. ‘అమ్మాయిలూ తొందరపడకండి” అని చెప్పే నా మాటలు మీలో పదిమందిలో నన్న ఆలోచన రేపితే నా ధ్యేయం నెరవేరినట్టే” అని పాఠం చెపుతుంది —-భారతి కన్పించిన ఆడపిల్ల లందరికీ.

          “ఇంత లోతుగా రెండేళ్ళముందే అలోచించి వుండి వుంటే” అనుకుంది భారతి ఆ రాత్రి…’ భారతీ నీవు చిన్నపిల్లవి నీకింకా లోకజ్ఞానం లేదు, ఏదో ప్రేమ అనుకుంటున్నావు , యీ ప్రేమలు కూడు పెట్టవు. నా మాట వినమ్మా” అని తల్లి నచ్చచెప్పింది , బతిమా లింది, ఏడ్చింది , తిట్టింది.

          “ఏం చూసి అంత మోజుపడ్తున్నావు—-వాడి బి.ఎస్సీ తో ఏం ఉద్యోగం వస్తుంది? ప్రేమ తిని ఇద్దరూ ఎన్నాళ్ళు బ్రతుకుతారు? నువ్వు కొన్ని సౌకర్యాలకు అలవాటు పడ్డావు. అవన్నీ లేకపోయేసరికి ఏ ప్రేమా అలాంటి చోట నిలవదు. నా మాట విను భారతీ, ఆ ఇంజనీరు అబ్బాయిని చేసుకో, నీ మంచి కోరే వాళ్ళం, నీకంటే లోకానుభవం వున్నా వాళ్ళం. మా మాట వినకపోతే నష్టపోయేది నువ్వే, కన్నవాళ్ళం కనక యింతగా చెప్తున్నాం —-” చెప్పి చెప్పి విసిగిపోయిన తండ్రి కోపంగా అన్నారు.

          ‘ఇద్దరూ ఉద్యోగాలు చేస్తారుట. వీళ్ళిద్దరికీ పిల్చి వేలకు వేలు యిస్తారు అనుకుం టుంది. ఈవిడ బి.ఏ కి అతని బి.ఎస్సీకి అంతగా యిస్తే చెరో వెయ్యి యిస్తారు గాబోలు. ఎంత చెప్పినా నీ బుర్ర కేక్కదేమిటే ——–ఆస్తి వుందా అంతస్తుందా దేనికోసం మోహించావు? మేం తెచ్చిన సంబంధం ముందు ఈ అబ్బాయి అతని కాలి గోటికి ఏ విషయంలోనూ సరిపోడు. నీ కళ్ళకి ఏం పొరలు కమ్మాయే-” నచ్చచెప్పలేక తల్లి తల బాదుకుంది.

          “ప్రేమ పొరలు కమ్మాయే దానికి, ఆ పొరల మధ్య నించి దానికి వాడు తప్ప యింకేం కనపడడం లేదు. ఆడుతూ పాడుతూ పనిచేసుకుని కలోగంజో సినిమాల్లో మాదిరి తాగితే చాలనుకుంటుంది. యీ వేడిలో , జీవితం సినిమా కాదని దానికి యిప్పుడు మనం చెప్పినా అర్ధం కాదు. ఆ పొరలు విడిపోయాక అప్పుడు ఏడుస్తుందిలే —-” కూతుర్ని వప్పించలేని నిస్సహాయత మధ్య కసిగా అన్నాడు తండ్రి . ‘ఆ వెధవని పోలీసులకి అప్పచెపుతాను. ప్రేమ గీమ వదలగొడతారు—- చదువుకు రావే అని కాలేజీకి పంపితే, చేసుకొచ్చిన నిర్వాకం యిది. ఇవాళ్టి నించి ఇల్లు కదులు, కాళ్ళు విరగ్గోడతాను. గదిలో పడేసి తాళం వేసి మూడు ముళ్ళు వేయిస్తాను.’ తల్లి ఆఖరి అస్త్రం విడిచింది.

          ‘అసలు పొరపాటు మనది. ఆడపిల్ల ముందు పుట్టిందని గారాబం చేశాం. యివ్వవలసిన దానికంటే ఎక్కువ స్వేచ్చ యిచ్చాం — వుండు , వాళ్ళింటికి వెళ్ళి వాడికి, వాడి తండ్రికి అందరి ముందు గడ్డి పెడ్తాను. అంత సుళువుగా వదలను ఆ వెధవని. ఆడపిల్లలని వలలో వేసుకుని మాయమాటలు చెప్పి ప్రేమలు వల్లించి హీరో అనుకుంటున్నాడెమో —నలుగురు రౌడీలని పెట్టి తన్నిస్తాను — కాళ్ళు చేతులు విరగొట్టిస్తాను –” తండ్రి బెదిరింపు.

          అప్పుడు తన మేలు కోరిన తల్లిదండ్రులు రాక్షసుల్లా కనిపించారు. కన్నకూతురి మనసు అర్ధం చేసికొని, ప్రేమికుల బాధ పట్టించుకోలేని వీళ్ళు ఏం మనుషులు! ఛీ….ఛీ….. యీ పెద్దవాళ్ళకి ఎప్పుడు బుద్ది వస్తుంది—- జనరేషన్ గాప్…….వాళ్ళ ఆలోచనలు అంతకంటే ఎదగవు……..అనుకుని మనసులో శపించుకుంది. తల్లితండ్రులని ——కొంపదీసి నిజంగా వీళ్ళు చంద్రని తన్నించరు గదా! వెళ్ళి వాళ్ళతో కల్సి మంతనాలు జరిపి తమని విడదీయరు గదా—- తనని నమ్మించి మోసం చేసి ఎవరికో కట్టపెడితే తను నిజంగా చచ్చిపోతుంది గాని వాడితో కాపురం చెయ్యదు. చంద్రని జాగ్రత్తగా వుండమనాలి పెళ్ళి అయ్యేవరకు. ఎందుకన్నా మంచిది …….పెళ్ళి అయ్యే వరకు తమ ప్లాను వీళ్ళకి తెలీకుండా జాగ్రత్తపడాలి —” “భారతీ ఎందుకన్నా మంచిది మీ వాళ్ళని ఎదిరించి మాట్లాడకు—-వాళ్ళు అన్న వాటికి వప్పుకున్నట్టు నటించు. వాళ్ళు చేసుకోమన్న అబ్బాయిని చేసుకోడానికి ఆఖరికి వప్పుకున్నట్లు, నీవు దారికి వచ్చావని వాళ్ళని నమ్మించు——యివతల మన ప్లాను మనం వేసుకుందాం ——మీ వాళ్ళక్కడ నిర్ణయించిన ముహూర్తానికి ముందే మనం సింహాచలం వెళ్ళి పెళ్లి చేసేసుకుని రోగం కుదురుద్దాం—- మన ప్రేమ ఆషామాషీ కాదని నిరూపించాలి. ఈ నెల్లాళ్ళు కాస్త జాగ్రత్తగా వాళ్ళకి అనుమానం రాకుండా ప్రవర్తించు” అని చంద్ర యిచ్చిన సలహా తు.చ తప్పకుండా పాటించింది.

          పిచ్చి అమ్మ, నాన్న ….ఎంత సంబరపడిపోయారు —— కూతురు ఆఖరికి దారికి వచ్చిందని, మొండితనం మాని తమ మాటల్లో నిజం గుర్తించిందని సంతోషపడి పోయారు. ఆ సంతోషంతో యింకాస్త ఎక్కువ ఖరీదు పెట్టి పెళ్ళి చీరలు కొనుక్కో మన్నారు. స్నేహితులందరికీ వేరే డిన్నరిచ్చుకొమన్నారు. శుభలేఖలు వేయించారు. తమ తాహతుని మించి ఘనంగా పెళ్ళి ఏర్పాట్లు చేశారు. నిజంగా తనను దురదృష్టం వెంటాడుతుందని ఆనాడు గుర్తించలేక ఆ అదృష్టాన్ని ఆనందాన్ని కాలదన్నుకుంది ……యెంత మోసం చేసింది తల్లి తండ్రులని. ఎంత బాధకి, అవమానానికి , రంపపు కోతకి గురి చేసింది కన్నవాళ్ళని. వాళ్ళ శాపమే తగిలి తనీనాడు యిలా అనుభవిస్తోంది. తన మేలుకోరి , తనని సుఖంగా ఆనందంగా చూడాలన్న వాళ్ళ తాపత్రయాన్ని నిర్లక్ష్యంగా నవ్వుకొని, నిర్దయగా లోకానికి మొహం చూపలేనట్లు చేసిన తనకి యీనాటి ఈ శిక్ష సరి అయిందే! పెళ్ళికి వారం వుందనగా స్నేహితులకి శుభలేఖలు పంచి వస్తానని చెప్పి, చేయించిన నగలు బ్యాగులో పెట్టుకుని పెళ్ళి ఖర్చుల కోసం ఉంచిన డబ్బులో రెండు వేలు పట్టుకుని ఇల్లు దాటింది!

          ఆనాటితోనే తనకి సుఖద్వారాలు మూసుకుపోయి నరకద్వారాలు తెరవబడ్డాయి. ——-అని గుర్తించలేక -మహా తెలివిగా తనెంత చలాకీగా తప్పించుకు వచ్చిందో టాక్సీలో వెడుతూ చంద్రకి చెప్పి నవ్వుకున్నారు. దేముడి సమక్షంలో భార్య భర్తలయి హోటలు రూములో రాత్రి ఆనందపు శిఖరాలు అందుకున్న వేళ తనేదో ఘనకార్యం సాధించినట్టు సంబరపడిపోయింది. “హు…..వాళ్ళకేం తెలుసు, ఈ ప్రేమలో దొరికే దివ్యానుభూతి —–పిచ్చివాళ్ళు …..వాళ్ళు చూసేది ఎంతసేపు చదువు, ఉద్యోగం, తప్ప రెండు హృదయాలు కలవాలన్నది వాళ్ళకి అర్ధంకాదు — ‘అనుకుంది. ఈ పాటికి తనకోసం ఆరాటపడ్తూ వెతు క్కుంటారని , పెళ్ళి వారం వుందనగా పెళ్ళి కూతురి మాయం అయితే వాల్లెదుర్కో వలసిన అవమానం తలచుకుని అరక్షణం బాధపడ్డా —— నేచేపితే వినకపోతే నా తప్పా, నా ప్రేమని అర్ధం చేసుకుని ఆశీర్వదిస్తే యిలా జరిగెదా? నా తప్పేం వుంది? వాళ్ళకి ముందే చెప్పాను’ అనుకుంది. మరే ఆలోచనలు మనసులో జొరబడకుండా రాత్రికి పగలుకి తేడా తెలియకుండా ఉప్పెనలా చుట్టూ ముట్టిన చంద్ర ప్రేమలో ముంచి తేల్చాడు. హు….అది ప్రేమా! …..రబ్బిష్…..జస్ట్ లాస్ట్….నధింగ్ ఎల్స్…..తనలాంటి పూల్స్ –మోహాన్ని ప్రేమ అనుకుంటారు!…. ఆ తెలివి తక్కువ తనానికి తను సరి అయిన మూల్యమే చెల్లించింది….అప్పటికి ఈ రెండేళ్ళలో ఓ వందసార్లన్నా తనని తాను తిట్టుకున్నట్లే ఆ రాత్రి నిద్ర ముంచెత్తే వరకు తిట్టుకుంది భారతి. అన్ని భాధలను మరిపించే నిద్రాదేవత ఆఖరికి కరుణించేవరకూ గతం తలచుకుంటూనే నిద్రలోకి జారింది.

* * * 

          ‘అంటీ…..ఎలా వున్నారు? ఈ మధ్య మీ భారతీ మావూళ్ళో బస్సు స్టాపులో కన్పించింది. మాట్లాడే లోపల బస్సు వచ్చేసింది. అలా అయిపోయిందేమిటి? పుల్లలా, కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని వుంది. చంటిపిల్ల , ఆ ఉద్యోగంతో అలా అయిపోయిందా? వాళ్ళ ఆయనేం చేస్తున్నారు? ఇది అంత కష్టపడి వుద్యోగం చేయక పోతేనేం? వాళ్ళ అయన ఇంజనీరేమోకదా!” — సునయన పుట్టింటికి వచ్చి బజార్లో భారతి తల్లి కనిపిస్తే పలకరించింది. భానుమతి మొహం మ్లానమయింది. ఈ పిల్ల తెల్సి వేళాకోళంగా అడుగు తుందా లేక అరా తీయడానికి అడుగుతుందా , లేక అసలు విషయం తెలియదా? ఆవిడ సునయన వంక చూసి విషాదంగా నవ్వింది. “దాని ఖర్మ అమ్మా అంతా. దానిరాత అలా తగలడితే యింకేం చేస్తుంది? దాని రంగంతా పోయింది. కట్టే పెడులా వంట్లో మాంసం లేనట్టు ఎండిపోయింది. రాతమ్మా రాత” ఆవిడ కళ్ళల్లో నీరు తిరుగుతుండగా యింకేం చెప్పలేని స్థితిలో వెళ్ళిపోయింది. సునయనకు ఏమీ అర్ధం కాక తెల్లబోయింది. యింటి కెళ్ళాక తల్లిని అడిగింది.

          “అయ్యో నీకు తెలియదా ఆ భారతి సంగతి — అవును నువ్వు ఇండియాలో లేవుగా …..ఆ పిల్ల ఎంతకీ తెగిన్చిందో తెలుసా , తల్లిదండ్రులు నిక్షేపం లాంటి సంబంధం కుదిరిస్తే ఎవడినో ప్రేమించానని ఓ తలామాసినవాడితో యింట్లోంచి పారిపోయి పెళ్ళి చేసుకుంది. పాపం యింకా పెళ్ళి వారం రోజులుండగా కూతురు యీ పని చేసినందుకు ఎవరికీ మొహం చూపలేక ఆ తల్లీ తండ్రి కుమిలిపోయారు. తండ్రికయితే మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చింది. కూతురు అలా చేసిందన్న బాధతో, కోపంతో “యింక అది చచ్చినదాని కిందే మాకు లెక్క” అనుకున్నారు వాళ్ళు…. తరువాత సంగతులు నాకంత బాగా తెలియవు కాని యిప్పుడా అమ్మాయి వాడితో కల్సి వుండడం లేదట —- ఓ పిల్ల పుట్టిందట , యిటు తల్లి తండ్రికి కాక అటు ప్రేమించినవాడికి కాక ఆ పిల్లతో అష్టకష్టాలు పడుతూ ఏదో ఉద్యోగం చూసుకుని బతుకుతుందని విన్నాను. ఇలాంటివి డైరక్టుగా ఎలా అడుగుతాం, ఈనోటా ఆనోట విన్నవి తప్ప. అసలు సంగతి నాకు తెలియదు –” అందావిడ.

          ‘అంటే వాడు భారతిని వదిలేసిపోయాడేమిటి ? యిద్దరూ పెళ్ళి చేసుకోలేదా? అయ్యోపాపం భారతి ఎంత స్మార్టుగా చలాకీగా వుండేది, యిలా అయిందా దానికి “—— సునయన విచారంగా అంది.

          “తల్లితండ్రి పిల్లని కన్నారు గాని దాని రాతని కనలేదు —- ఎంతో ముద్దుగా అన్నీ చెయ్యాలనుకున్నా దాని ఖర్మ అలావుంటే ఇంకోలా ఎందుకు జరుగుతుంది.

          సునయనకి భారతి గురించి తెలుసుకోవాలన్న ఆరాటం నిలవనీయలేదు.

          “వాళ్ళమ్మగారిని అడిగివస్తాను” అంటూ, తల్లి ‘బావుండదే” అంటున్నా వినకుండా భారతి యింటికి బయలుదేరింది.

          “రా అమ్మా…..ఆరోజు బజార్లో నువ్వు భారతి సంగతి చెప్పగానే నా మనసు తల్లడిల్లి పోయింది . యింకేం మాట్లాడలేకపోయాను. దాని మాట విన్నా, తల్చుకున్నా , గుండెలు చెదిరిపోతాయి. దాని ఖర్మ…..ఏనాడో పాపం చేసింది — అనుభవిస్తుందినాడు.”

          ‘అంటీ, యిలా ఎందుకయింది? ఎందుకిలా చేసింది భారతి? వాళ్ళిద్దరూ అసలు పెళ్ళి చేసుకోలేదా, అతను దీన్ని వదిలేసి వెళ్ళిపోయాడా అంటీ —–” సునయన బాధగా అంది.

          “ఏం చెప్పనమ్మా….. యిలా ఎందుకయిందంటే ……దాని ఖర్మ అనడం మినహా ఏం చెప్పను? ఆ త్రాష్టుడు దాని జీవితానికి నిప్పు పెట్టాడమ్మా—ప్రేమ కబుర్లు చెప్పి దీన్ని వలలో వేసుకుని నమ్మించి, దేముడి గుడిలో మూడుముళ్ళు వేసి మోజు తీరేవరకు ఆరునెలలు కాపురం చేసి , యింకోదాని మోజులోపడి దీని ఖర్మానికి దీన్ని వదిలి వెళ్ళాడు. గుడిలో దేముడు సాక్ష్యం చెప్పడానికి రాలేదు అప్పుడు. ఇంత చదివి లోక జ్ఞానం లేని మూర్ఖురాలిలా ఓ రిజిష్టర్ పెళ్లన్నా చేసుకున్నాది కాదు. ఆరునెలలు కాపురం చేసి ఐదు నెలల గర్బిణిగా వున్నదాన్ని వదిలి, తనదారి తను చూసుకున్నాడు. యిది తెచ్చిన నగలు, డబ్బు అయిపోగానే దాటుకున్నాడు దీన్ని నట్టేటముంచి.”

          “భారతి ఏం చేసింది మరి…..ఇంటికి వచ్చేసిందా మళ్ళీ ….”

          ‘అలా వచ్చినా బాగుండేది ….ఎంత తిట్టినా, కొట్టినా మొహం చూడమని శపధాలు చేసినా కన్నవాళ్ళం కనక కరిగి దానికి ఆశ్రయం యిచ్చేవాళ్ళం. లేదమ్మా —-ఆ దెబ్బతో దాని మనసు విరిగిపోయింది. దాని నమ్మకాలని, దాని ప్రేమని నేల రాసి వాడు వెళ్ళాక ఆ అవమానంతో తనింక మొహం చూపిస్తే అందరూ హేళన చేస్తారని గాబోలు —నేచేసిన తప్పుకి శిక్ష నేనే అనుభవించాలి —-నా తొందరాపాటుకి ఈ శాస్తి సరి అయిందే అంటూ తనని తాను శిక్షించుకోడానికి అది ఎన్ని యిక్కట్లు పడినా, ఎన్ని కష్టాలు పడినా సహిస్తూ బతుకుతుంది గాని మా గుమ్మం లోకి రాలేదమ్మా—దానికి స్వాభిమానం , పంతం చిన్నప్పటి నుంచి ఎక్కువే.”

          “మరి మీకు దాని సంగతి, అదే, యిలా జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది.”

          “అది యిల్లు వదిలాక యిలా పెళ్ళి చేసుకున్నాం అని ఉత్తరం రాసి పడేసింది. వారం తరువాత . అంతే! ఆ వుత్తరం చూసి మా వారు ఓ రోజంతా గదిలో వుండి కటిక ఉపవాసం చేసి ఎవరితో మాట్లాడలేదు—గది నుంచి వచ్చాక “యింత అది నాకు చచ్చిన దానితో సమానం. దాని పేరు గాని, దాని సంగతి కాని యీ యింట్లో వినపడకూడదు ” అని చెప్పేశారు అయన మగవారు కనక. కన్నతల్లిని నేను లోలోపల ఎంత బాధపడ్డా ఆయనకి జడిసి నోరెత్తలేదు. సరే ఎక్కడో దానికి కావాల్సినవాడితో సుఖంగా బతుకుతుందిలే అని సంతోషపడ్డాను. అదింట్లోంచి వెళ్ళిన పదినేలలకి కాబోలు మా ఆడపడుచు కూతురు ఉత్తరం రాసింది —‘ భారతి మా వూళ్ళో వుంది. ఆస్పత్రిలో పురుడు పోసుకుంది. ఆడపిల్ల —–నేను ఆస్పత్రిలో పురిటికి వెళ్తే అక్కడ కన్పించింది . అతనేమయ్యాడో ? అది ఒక్కర్తే దిక్కుమొక్కు లేకుండా పడుంది . కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని వుంది. దాని ఆరోగ్యం అసలు బాగోలేదు. ఎంతడిగినా ఏం చెప్పలేదు ఏడవడం తప్ప. నాకీ శిక్ష కావాల్సిందే అన్న ముక్క తప్ప భారతి ఏం మాట్లాడలేదు. ఇంతమంది వుండీ దిక్కులేని దానిలా ఆ రోజున బిడ్డని ఎత్తుకుని ఆస్పత్రిలోంచి వెళ్తుంటే చూడలేకపోయాను . బలవంతంగా అడిగితే ఎడ్రసు యిచ్చింది. అయన వెళ్ళి చూసి వచ్చారు. చిన్న గదిలో పిల్లని పెట్టుకుని అతి బీదగా తినీ తినక కాలం గడుపుతుంది. అత్తా మీరు ఓసారి చూడండి. భారతి స్థితి బాగోలేదు” అని రాసింది. ఆ వుత్తరం చూసి విల్లవిల్లాడపోయాను. అయన ఉత్తరం చదివి శిలలా వుండిపోయారు. నేను ఆయనతో దెబ్బలాడి, ఏడ్చి, అయన వారిస్తున్నా మాట వినను అని మొండికేసి బయలుదేరి వెళ్లాను. అక్కడ దాని దైన్యస్థితి చూసి నా గుండెలు తరుక్కుపోయాయి. పదిహేను రోజుల తోలిచూలు పురటాలు —- ఉదయం వండుకున్న ఎండు మెతుకులు పచ్చడితో మింగుతోంది. చంటి పిల్లకి పరపడానికి పాత గుడ్డలు కూడా కరువయిన దాని దీనస్థితికి గుండెలవిసిపోయేలా ఏడ్చాను. యిద్దరం ఒకరిని ఒకరు వాటేసుకుని ఏడ్చాం. అడగ్గా అడగ్గా అది ఒక్కక్క విషయం చెప్పింది అతి కష్టం మీద. యిద్దరూ పారిపోయి సింహాచలం వెళ్ళి పెళ్ళి చేసుకుని తరవాత హైదరాబాదు వెళ్ళారట. చవకరకం లాడ్జింగులో రూము తీసుకున్నా రట. యిద్దరూ ఓ రెండు నెలలు శుభ్రంగా తిని తిరిగారు. ఈలోగా అతను ఏవేవో ఉద్యోగ ప్రయత్నాలు చేశాడట. నెల నెల గడుస్తుంటే చేతిలో డబ్బు, నగలు అయిపోతున్నా ఉద్యోగం దొరకలేదు. నాల్గునెలలకి అతనికి దొరకలేదు కాని దీనికి ఏదో చిన్న ప్రయివేటు స్కూల్లో టీచరుగా రెండు వందల యాభైకి ఉద్యోగం దొరికిందట. అప్పటికే దీనికి మూడోనెల. ఆయనగారికి చేతిలో డబ్బు లేకపోవడం, ఉద్యోగం దొరక్కపోవడంతో విసుగులు, చిరాకులు, కసుర్లు, దెబ్బలాటలు ఆరంభమయ్యాయి. ఊరంతా బలాదూరు తిరిగి రాత్రి, భోజనానికి వచ్చేవాడట. దీనిమీద మోజు తగ్గిపోగానే …..’ఛా…..నీవల్లే నాకీ కష్టాలు లేకపోతె హాయిగా యీ పాటికీ ఏ ఎమ్మెస్సీలోనో చేరి చదువుకునేవాడిని. ప్రేమ అనుకుని గోతిలోకి దిగాను” అంటూ సాధించి తిట్టిపోసేవాడట. అరునేలలకి ఏదో ఆఫీసు లో గుమస్తా ఉద్యోగం దొరికిందట. అప్పటినించి అసలు యింటి పట్టున వుండకుండా తెచ్చుకున్నది తింటూ తిరిగేవాడుట. ఒక్కోసారి రెండు మూడు రోజులకీ వచ్చేవాడు కాదుట. అడిగితె “నాయిష్టం నోర్మూసుకో” అనేవాడట. యింకా నిలేస్తే “నువ్వేం నా పెళ్ళానివా అడగడానికి ‘ అన్నాడట. యిది నిర్ఘాంతపోయి “నీ భార్యని కానా?” అంటే “ఏదీ సాక్ష్యం చూపించు . ఆ దేముడు వచ్చి సాక్ష్యం చెపుతాడా” అని వికటంగా నవ్వే వాడట. ఆ తరువాత ఎన్నోసార్లు వాళ్ళ ఆఫీసులో టైపిస్టుతో తిరుగుతూ కన్పించాడట. ఆఖరికి ఎనిమిది నెలలకి, దీనికి అరునేలలప్పుడు యిది స్కూలుకి వెళ్ళగా చూసి, యింట్లోంచి తన పెట్టె బేడా పట్టుకు పోయాడుట.

          “రాస్కెల్, ఎంత పనిచేశాడు, యిది ఎలా వూరుకుంది, పోలీసులకి రిపోర్టు యివ్వా ల్సింది.’

          “ఎమనిస్తుంది —-వాడు దీని భర్త అనడానికి సాక్ష్యం ఏముంది? అప్పటికే ఆరునెలలు, అబార్షన్ చేయించుకుందామన్నా కుదరక చచ్చినట్టు వాడి పాపాన్ని మోసి కనింది. అప్పటివరకు అది పడ్డపాట్లు వింటే కసాయి గుండెన్నా చెదిరిపోతుంది. రెండువందల ఏభైలో ఎనభై రూపాయలు గది అద్దె పోగా, మిగిలిన దాంతో ఒక పూట తిని, ఒక పూట తినక నీరసంతో , తొమ్మిదో నెల వచ్చేవరకు ఉద్యోగం చేసింది. పురుడు అదీ అయి వచ్చేవరకు ఖాళీగా వుంచం అని వాళ్ళు యింకో టీచరుని వేసుకున్నారట! ఈ నెలరోజులుగా చేతిలో దమ్మిడీ లేక , ధర్మాసుపత్రిలో పురుడు పోసుకుని, వాళ్ళిచ్చిన బ్రెడ్ ముక్కలు తిని ఆరు రోజులు గడిపి, యింటికి వచ్చాక అదీ లేకుండా పడివుంటే మా ఆడపడుచు కూతురు తిట్టి ఐదొందలు ఇచ్చిందట. అప్పుగా తీసుకుంటానని తీసుకుం దిట. యిప్పుడు యింకో వుద్యోగం దొరికే వరకు అదే ఆధారం అమ్మా” అంది శుష్కహాసం చేస్తూ.

          “మేం చచ్చేమనుకున్నావే. నీకింత పంతం ఏమిటే. యిలా దిక్కులేని దానిలా పడుంటావా” అని తిట్టాను. ఏడ్చాను వెంటనే యింటికి పదమన్నాను. అది ససేమిరా రానంది. “ఏం మొహం పెట్టుకుని రాను . వద్దమ్మా నా తప్పుకి నేను శిక్ష అనుభవించాలి. నా తప్పు నేనేవరినెత్తినైనా రుద్ది వాళ్ళకి భారం అవను. నాలాంటి ఆడపిల్ల లందరూ నా కధ వల్ల నీతి నేర్చుకోవాలి. మిమ్మల్ని పెట్టిన ఉసురికి నాకీ శిక్ష తప్పదు. అనుక్షణం నా తప్పు నాకు తెలిసి వచ్చేట్టు నేనిలా నరకయాతన పడుతూనే వుండాలి. నా తప్పుకి, నా పాపానికి ఫలితంగా యీ బిడ్డని కన్నాను అంతే. చచ్చినట్టు దీన్ని పెంచి పోషించాల్సిన బాధ్యత నాది. నా పాపం మీరూ పంచుకోవద్దు — వద్దు నన్ను వదిలిపో అమ్మా- నాన్న నా మొహం చూడడు. నేనక్కడికి వచ్చి మిగతా పిల్లల పెళ్ళి పేరంటాలకి ఓ అసమస్యగా అడ్డురాను” అంటూ ఎంత చెప్పినా ససేమిరా రానంది —బలవంతంగా ఓ ఐదువందలు చేతిలో పెట్టి పిల్లకి కావాల్సిన బట్టలు, దుప్పట్లు, పాలడబ్బా, దానికి మందులు అవీ కొన్నాను. మొదటి కాన్పు ఖర్చు మాది. పెళ్ళయితే పురుడు పోయమా, అందుకే నేనేం చేసినా మాట్లాడకూడదు ” అని తిట్టాను. “సరే, ఆడపిల్ల పెళ్లియ్యాక పుట్టింటి నుంచి ఎంత వరకు ఏం పొందవచ్చో అంతకంటే ఎక్కువ నాకొద్దు — అంతకంటే ఏం యిచ్చినా పుచ్చుకొను” అంది. మా ఆడపడుచు కూతురికి మధ్యమధ్య వెళ్ళి చూడమని చెప్పి గుండె రాయి చేసుకుని వచ్చాను. యింటికి వచ్చాక జరిగింది చెపితే అంత కఠినంగా మారిపోయిన అయన ఆ రోజంతా తలుపులు బిగించుకుని ఏడ్చారు. తరువాత ఆయన రాసినా, నేను రాసినా అది రాలేదు. ఆఖరికి ఆయనకి తెలిసిన ఫ్రెండు ద్వారా, బి.హెచ్.యీ.ఎల్ గర్ల్స్ స్కూల్లో ఆరువందల ఏబై రూపాయల ఉద్యోగం యిప్పించారు. కాస్త దాని బతుకు తెరువు ఏర్పడిందని సంతృప్తి పడడం కంటే యింకే చేయ్యమమ్మా? యిప్పుడు పుట్టింటి నుంచి నేను పంపే పచ్చళ్ళు, అవీ వద్దనదు. పండక్కి రమ్మని అయన రాస్తే ఏడాదికి ఒకసారి రెండుసార్లు వచ్చి నాల్గురోజులుండి వెడుతుంది. చీర యిస్తే పుచ్చుకుంటుంది. అంతకు మించి దమ్మిడీ పుచ్చుకోదు. అలా ఒంటరిగా ఆ పిల్లతో ఉద్యోగం చేసుకుంటూ బతుకీడుస్తుంది”

          ‘మళ్ళీ అతని కబురు తెలియలేదా, అలా వదిలేయడ,మేనా ఆ రాస్కెల్ ని”

          ‘ఆయనా నేనూ అదే అంటాం. వాడి పేరెత్తడానికి వీలు కాదంటుంది. వాడి నీడ కూడా నా మీద నా కూతురి మీద పడకూడదంటుంది. మరి జన్మలో మగవాడి అండ దండలు కోరను, పది జన్మలకి మగవాళ్ళని నమ్మను అంటుంది కసిగా, అయిందేదో అయిపొయింది ఈరోజుల్లో రెండో పెళ్ళి తప్పుకాదు, పిల్లని నేను చూసుకుంటాను. కాస్తో కూస్తో డబ్బు పారేసి ఎవరికన్నా యిచ్చి పెళ్ళి చేద్దాం అన్నా అది అసలు వింటుందా? ఉరిమి చూస్తుంది. “పెళ్లి – ఇంకా మగవాడ్ని నమ్ముతానా” అంటుంది హేళనగా, దాని కసి అంతా దాని మీదే చూపించుకుంటూ, దాన్ని అదే శిక్షించుకుంటూ అష్టకష్టాలు పడుతూ బతుకుతోంది.

          భానుమతి కళ్ళు తుడుచుకుంది. సునయన మనసు వికలమాయిపోయింది.

          ఎలాంటి భారతికి ఎలాంటి దుర్గతి? భారతి లాంటి దురదృష్టవంతుల కధలు మరింత మంది భారతుల్ని అలాంటి దుర్గతినించి కాపాడగలిగితే ఆమె ఆశయం నెరవేరుతుంది! కాని అది జరిగెదా? “ప్రేమలో పడకండి అమ్మాయిలూ జాగ్రత్త” అంటే చెప్పిన వాళ్ళని చూసి హేళనగా నవ్వుకుంటారు —– తప్పటడుగు వేస్తారు —-ఊబిలో కూరుకుపోతారు —-ఎలా వీళ్ళని రక్షించడం!

          దారి పొడవునా సునయన అలా ఆలోచిస్తూనే వుంది!

(వనిత)

*****

( సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.