జన్యు బంధం

-కామరాజు సుభద్ర

          పాతరోడ్డైనా గట్టిగా ఉండడంతో పెద్దగా కుదుపులు లేకుండా సిటీవైపు వస్తోంది ట్యాక్సి. శారద వెనకసీట్లో వాలి కళ్లు మూసుకుని కూర్చుంది. పక్కనే ఉన్న కోడలు మృదుల కిటికీలోంచి బయటికి చూస్తోంది. ముందుసీట్లోవున్న కొడుకు ప్రవీణ్ రోడ్డుకేసి చూస్తున్నాడు.

          ప్రవీణ్ ఉద్యోగరీత్యా సిటీకి దూరంగా చిన్నటౌనులో ఉంటున్నారు వాళ్లు. శారదకు మూడునెలల నుంచి ఆరోగ్యం బాగలేదు. క్రితంనెలలో సిటీకి తీసుకొచ్చి ఆధునిక సౌకర్యా లున్న పెద్ద ఆసుపత్రిలో చూపిస్తే ఆపరేషన్ చేస్తే నయమైపోతుందని చెప్పారు. అందు కోసం కోసం సిటీకి వస్తున్నారు.

          “సిటీ శివార్లలోకి వచ్చేసాం” అంది మృదుల

          “సార్, యెక్కడికి తీసుకపోవాల?” అనడిగాడు డ్రైవరు.

          “మాఫ్రెండు ఇంటికి. అడ్రెసు ఫోన్లో సెట్ చేసి పెడతా” అని ఫోన్ తీశాడు ప్రవీణ్.

          “మామయ్య ఇంటి అడ్రెసు పెట్టు” అంది వెనకనుంచి శారద కళ్లు మూసుకోనే.

          “మామయ్య ఇంటికా? అమ్మా ఆలోచించే చెప్తున్నావా? ఏదో ఫంక్షన్లలో మొక్కుబడి గా పలకరించుకోవడం తప్ప మామయ్యా నువ్వు మంచిగా మాట్లాడుకొని మూడేళ్లైంది. మనకూ వాళ్లకూ రాకపోకలు లేవు. జరిగిన గొడవలు మర్చిపోయి మళ్లీ మునుపటిలా ఉందామని నువ్వు ఈమధ్య అప్పుడప్పుడూ ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే మామయ్య నుంచి సరైన స్పందనే లేదు. ఇప్పుడు, అందులో ఈస్థితిలో. వెళ్దామంటు న్నావు. అసలు ఇంట్లోకైనా తిన్నగా రానిస్తాడా?” కారులో డ్రైవరున్నాడని కూడా మర్చి పోయి ఆవేశంగా అన్నాడు ప్రవీణ్.

          “ఫరవాలేదు” అంది శారద శాంతంగా.

          “అదికాదమ్మా, నాకు సిటీలో ప్రాణమిచ్చే ఫ్రెండ్సున్నారు. వాళ్లకి డాక్టర్లుకూడా తెలుసు, మనకోసం ఎదురుచూస్తున్నారు. గౌతం కొత్త అపార్ట్మెంటు ఆస్పత్రి దగ్గరే, విశాలంగా సౌకర్యంగా ఉంటుంది”

          “అవన్నీ నిజమే. కానీ ఈసారికి ఇలా అవనీ, మళ్లీ చెకప్ కి వచ్చినప్పుదు గౌతం ఇంట్లోనే ఉందాం” అంది శారద నీరసంగా.

          “అత్తయ్య అంతగా చెప్తోందికదా” అంది మృదుల.

          “మీ యిష్టం” అని నుదుటిమీద కొట్టుకుని “దగ్గరికొస్తున్నాం, మామయ్యకు చెప్పు మరి” అన్నాడు ప్రవీణ్ అసంతృప్తిగా తనఫోన్లో శారద అన్నయ్య ఆనంద్ ఇంటి లొకేషన్ పెట్టి.

          “నువ్వే మామ్మయ్యకు చెప్పు” అంది శారద తన ఫోన్లో ఆనంద్ నెంబరు కలిపి అందిస్తూ.

          “నేనా?” అని ఆశ్చర్యపోయి ఇక తప్పదన్నట్టు ఫోన్ అందుకున్నాడు. మామా అల్లుళ్ల మధ్య ముక్తసరిగా సంభాషణ జరిగింది.

          “నేచెప్పలేదా, ఆయనేం ఆసక్తి చూపించలేదు. ఆపరేషన్ కోసం కాబట్టి విధిలేక సరే అన్నట్టుంది. ఈటైములో నీకీ మెంటల్ స్ట్రెస్ అవసరమా? ఇప్పుడైనా మించిపోయింది లేదు, గౌతం ఇంటికెళ్దాం చెప్పు”

          శారద జవాబివ్వలేదు.

          “రెండురోజులే కాబట్టి ఎలాగో సర్దుకుందాం. ఆపరేషన్ అయి డిస్చార్జి అయ్యాక వస్తామని గౌతంకి చెప్తా” అన్నాడు ప్రవీణ్ చివరికి సమాధానపడుతూ.

          శారదకు, ఆనంద్ కి మూడేళ్ల కిందట కొన్ని కుటుంబ సమస్యలు, వాళ్ల అమ్మ అనారోగ్యానికి ట్రీట్మెంట్ విషయంలోనూ భేదాభిప్రాయాలొచ్చి గొడవలయ్యాయి. అంత వరకూ స్నేహంగావున్న వాళ్ల పిల్లల మధ్యకూడా దూరం పెరిగింది. సాయంత్రం ఆరౌతుండగా టాక్సి ఆనంద్ ఇంటిముందు ఆగింది. ప్రవీణ్ వరండాలోకెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు. తలుపు తెరుచుకుని ఆనంద్ భార్య సుమిత్ర బయటికొచ్చి “రండి రండి” అంటూ శారదను, మృదులను పలకరించింది. సామాన్లు ఇంట్లోని ముందుగదిలో పెట్టించి లోపలికెళ్లింది. గది పైపైన సర్దినట్టుగా ఉంది. సుమిత్ర మొహమాటానికి పలకరించినట్టుగా అనిపించింది ప్రవీణ్ కి. తల్లివైపు కొంచెం నిరసనగా చూసాడు. శారద పట్టించుకోలేదు. పావుగంట తర్వాత సుమిత్ర టీ తీసుకొచ్చి ఇస్తూ “మీ అన్నయ్య ఏదో ఫోన్ వస్తే అర్జెంటుగా బయటికి వెళ్లాడు. లేటౌతుందేమో. మీరు స్నానాలవీ చేసి రిలాక్స్ అవండి, భోజనాలకు పిలుస్తాను” అని వెళ్లింది.

          శారద టీ తాగి మంచంమీద విశ్రాంతిగా పడుకుంది.

          “మనం ఆపద్ధర్మంగా ఎవరో తెలియనివాళ్లింటికి వచ్చినట్టుంది” అని నవ్వి ఫోనులో మునిగాడు ప్రవీణ్. మృదుల సామాన్లు సర్ది సుమిత్రకి సాయం చెయ్యడానికి లోపలి కెళ్లింది. బీటెక్ చదువుతున్న ఆనంద్ కొడుకు వరుణ్ వచ్చి మాట్లాడి వెళ్లాడు. రెండు కుటుంబాల మధ్యా ఒక కనపడని తెర ఉన్నట్టుగా అందరికీ తెలుస్తోంది.

          భోజనాలయ్యాక పడుకునేముందు వచ్చాడు ఆనంద్. గదిలోకి వచ్చి అందర్నీ పొడిపొడిగా పలకరించి, ప్రవీణ్ వైపు చూసి మరుసటిరోజు వారి కార్యక్రమం గురించి అడిగాడు.

          “రేపంతా పరీక్షలు చేస్తారు, ఎల్లుండి మంగళవారం ఫలితాలు చూసి అనుకూలంగా ఉంటే ఆపరేషన్ కోసం బుధవారం ఆస్పత్రిలో చేరాలి. లేదంటే మళ్లీ రావాలి” చెప్పాడు ప్రవీణ్.

          వెళ్లిపోబోతూ ఒకసారి మళ్లీ చెల్లెలివైపు చూశాడు. ఆమె పాలిపోయిన మొహంతో బలహీనంగా ఉండడం చూసి అతని మొహంలోని గంభీరత మాయమై విచారపు నీడ కదలాడింది. లోపలికి ఒకడుగు వేశాడు.

          “మూడునెలలుగా వొంట్లో ఇలావుంటే ఈ సాయంత్రమా చెప్పడం? ప్రయాణంలో అలసిపోయావు, బాగా నిద్రపో” అన్నాడు.

          “నువ్వేంటి అలా చిక్కిపోయావు? ” అంది శారద లేవబోతూ.

          “నేను బాగానే వున్నాను. లేవకు, రేపు మాట్లాడుకుందాం” అని ప్రవీణ్ వైపు తిరిగి “ఇంకా ఏదైనా కావాలంటే వరుణ్ ని అడుగు, పక్కరూములో ఉంటాడు” అని వెళ్ళి పోయాడు.

          ఆ రాత్రి శాన్ ఫ్రాన్సిస్కో లో ఉన్న శారద కూతురు కావ్య ఫోనుచేసి చేసి చాలాసేపు మాట్లాడింది. అమ్మను మామయ్య ఇంటికి తీసుకురావడాన్ని మొదట వ్యతిరేకించినా తరువాత ఆలోచనలో పడి ‘అదే మంచిదేమో’ అంది. ఆ రాత్రి అత్తాకోడలు మంచంమీద, ప్రవీణ్ హల్లో సోఫాలో పడుకున్నారు.

* * *

          మరుసటిరోజు పొద్దున్నే క్యాబ్లో ఆస్పత్రికి వెళ్లారు. దారిలో “ఇక్కడ తుఫాను బాధితు ల్లాగ ఉంది మనపరిస్థితి. చూశావుగా, ఇంక నీ మంకుపట్టు వదలమ్మా, రాత్రికి గౌతం ఇంటికెళ్లిపోదాం” అన్నాడు ప్రవీణ్ కొంచెం కోపంగా.

          “రేపు సాయంత్రం ఏ సంగతీ తెలుస్తుందిగా. ఎల్లుండెలాగూ ఆస్పత్రికో, మనవూరికో వెళ్తాం. రేపొక్కరోజూ ఆగు” అంది శారద నిర్లిప్తంగా.

          “రేపటివరకూ ఓపిక పట్టండి” అంది మృదుల చిన్నగా నవ్వి.

          ఆస్పత్రికి ప్రవీణ్ స్నేహితులు వచ్చి పరామర్శించి వెళ్లారు. పరీక్షలన్నీ అయి ఇంటికొచ్చేసరికి ఐదైంది. ఇంట్లో ఆ రాత్రికూడా దాదాపుగా క్రితంరోజులాగే గడిచింది.
డాక్టర్లను కలవడానికి మంగళవారం ప్రవీణ్ ఒక్కడే వెళ్లాడు. మరుసటిరోజు ఆస్పత్రిలో చేరచ్చని, ఆపరేషన్ రెండుమూడు రోజుల్లో చేస్తామని చెప్పారు. ఆ విషయం ఫోన్లో తల్లికి చెప్పి ప్రవీణ్ ఇతరపనులు చూసుకొని చీకటిపడ్డాక ఇంటికొచ్చాడు. ఇంట్లో పరిస్థితి మెరుగైందని తెలిసింది.

          ‘దాదాపు రోజంతా మేడపై గదిలో ఆఫీసుపనిలోవున్న ఆనంద్ రెండుమూడుసార్లు కిందకి వచ్చి శారద దగ్గర కాసేపు కూర్చుని వెళ్లాడని, శారద ఎక్కువగా మాట్లాడలేక పోయిందని, పాతవిషయాలేవీ పైకిరాలేదని, అన్నాచెల్లెళ్లు మాటల్లో తక్కువగ్గా నిశ్శబ్దం లో ఎక్కువగా తమ భావాలు పంచుకున్నట్టు అనిపించిందని, సుమిత్ర, వరుణ్ లతో మాత్రం శారద మెరుగ్గానే గడిపిందని, గుర్గావ్ నుంచి నందినికూడా ఫోన్లో అత్తయ్యను పలకరించిందని’ శారద గదిలో లేనప్పుడు చెప్పింది మృదుల. నందిని పెళ్ళయి గుర్గావ్ లో ఉన్న ఆనంద్ కూతురు.

          “రేప్పొద్దున వరకూ ఇలావుంటే చాలు బాబూ” ఊపిరి పీల్చుకున్నాడు ప్రవీణ్.
బుధవారం శారదను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి గౌతం తనకారు తీసుకొచ్చాడు. మళ్లీ ఆ యింటికి వచ్చే అవసరం లేకుండా ప్రవీణ్ తమ సామాన్లన్నీ సర్ది ముందుగానే కారులో పెట్టేసాడు. ఆనంద్ కుటుంబమంతా బయటికివచ్చి శుభాకాంక్షలు చెప్పింది. ‘మామయ్యా వాళ్లు కూడా రిలీఫ్ గా భావించి ఉంటారు’ అనుకున్నాడు ప్రవీణ్.
ఆపరేషన్ బాగాజరిగింది. ప్రవీణ్ స్నేహితులు వచ్చి అన్నివిధాలా సాయపడ్డారు. ఆనంద్, వరుణ్ వచ్చి వాకబుచేసి వెళ్లారు. శారద త్వరగానే తేరుకుంది. మూడోరోజు శారదను స్పెషల్ రూముకి మార్చారు. మరో నాలుగురోజులు అక్కడే ఉండాలన్నారు.
నాలుగోరోజు నుంచి ‘ఇల్లు దూరమని వద్దంటున్నా’ మధ్యాహ్నం పూటల్లో ఇంట్లో తయారు చేసిన ఆహారం, ఆపిల్ పళ్ళు తీసుకొచ్చింది సుమిత్ర. సాయంత్రాలు రాత్రి ఫలహారం తెచ్చి కాసేపు మాట్లాడి వెళ్ళేవాడు ఆనంద్. వెళ్తూ డాక్టర్లను కలిసేవాడు.
డిశ్చార్జి చేసే రోజు మధ్యాహ్నం ఆనంద్ వచ్చి చెల్లెలితో చాలాసేపు మాట్లాడుతూ కూర్చున్నాడు.

          ఆనంద్ వెళ్లగానే వచ్చిన ప్రవీణ్, తల్లి కళ్లు తుడుచుకోవడం చూసి ఆందోళనగా తల్లి చెయ్యి పట్టుకుని “ఏమైంది?” అనడిగాడు.

          ఏమీ కాలేదన్నట్టు తల అడ్డంగా ఊపింది శారద.

          “మా ఫ్రెండ్స్ సాయంతో అన్నీ సాఫీగా, సుఖంగా జరిగిపోయేవి. ఈటైంలో అనవసరంగా మీ అన్నయ్య ఇంట్లోదిగి లేనిపోని హైరానా పెట్టుకున్నావు” అన్నాడు ప్రవీణ్.

          “అతను నాకు అన్నయ్యే కాదు నీకు మేనమామ కూడా” సరిచేసింది శారద.

          “కాలం మారింది. ఇప్పుడెవరూ పాతకాలం అనవసరపు బంధాలను మొయ్యడం లేదు. ఎప్పటికీ ఉండే మంచి స్నేహితులు చదువుకునేప్పుడే ఏర్పడుతున్నారు” వాదించాడు ప్రవీణ్.

          “నిజమే. కుటుంబాలు చిన్నవైపోయిన కొద్దీ దూరాలు పెరిగి బంధుత్వాలు తగ్గి స్నేహితులు ఎక్కువ కావలసిన వాళ్లౌతున్నారు. ఈ కొత్తబంధాలు రావడం మంచిదే. కానీ ఇవున్నాయిగదా అని పాతవాటిని వదులుకోవాల్సిన అవసరం లేదుగా. వేటి విలువ వాటిదే” అనునయంగా అంది శారద.

          “అది అవతలివాళ్లకూ ఉండాలిగదా?” ప్రవీణ్ వదల్లేదు.

           “బంధువులన్నాక పొరపొచ్చాలు రావడం సహజం. ఎవరో ఒకరు చొరవతీసుకుని కోపతాపాలను ఓర్చుకుని చక్కదిద్దుకోవాలి. ఈ రోజు నేను చేయకపోతే రేపు ఆయన చేసేవాడు. అసలు మన సమాజంలో మేనమామది తండ్రి తరువాతి స్థానం. అందుకే పుట్టినప్పటి నుంచి పెళ్లిదాకా ఆయన పాత్ర ఉంటుంది. ఇది కొన్నితరాల కుటుంబ పరిణామంలో ఏర్పడింది, తక్కువగా చూడకూడదు. మీ మాటల్లో చెప్పాలంటే అక్కచెల్లెళ్ల కుటుంబాలకు మేనమామ ఒక సేఫ్టీ బ్యాకప్” అని చిన్నగా నవ్వింది శారద.

          “ఇంతకూ మామయ్య ఏమంటున్నాడు?” అన్నాడు ప్రవీణ్ చర్చ ముగిస్తున్నట్టుగా.

          “సాయంత్రం డిస్చార్జ్ అయ్యాక వాళ్లింటికే రమ్మంటున్నాడు”

          “మళ్లీనా? వద్దు. వారంరోజుల తర్వాత మళ్ళీ చెకప్ ఉంటుంది. అంతవరకూ నువ్వూ, మృదుల సౌకర్యంగా ఉండడానికి గౌతం ఇంట్లో అన్ని ఏర్పాట్లూ చేసారు. నేను మనవూరెళ్లి ఆ రోజుకు మళ్లీ సెలవుపెట్టుకుని వస్తాను”

          “పిలవనప్పుడు వెళ్లి ఇప్పుడు వెళ్లకపోతే బావుండదు. కక్ష సాధించినట్టుగా ఉంటుంది. అది నా పుట్టిల్లు, నా ఆరోగ్యం అన్నయ్యకూ బాధ్యతే. ఈసారెలా ఉంటారో అదీ చూడచ్చుగా. పైగా మృదులకూడా నాతో ఉంటుంది. అంతగా ఉండలేకపోతే మేమే గౌతం ఇంటికి వెళ్తాం” అంది శారద.

          ఆమెకు అన్నయింటికే వెళ్లాలని ఉందని గ్రహించాడు ప్రవీణ్. భోజనంచేసి మృదుల వచ్చింది.

          “సరే నీ యిష్టం. మళ్లీ చెకప్ టైముకే నేను వస్తాను ఈలోపల ఆ అవస్థలేవో మీరే పడండి” అని లేచి “డిస్చార్జి ఏర్పాట్లు చేస్తాను” అంటూ బయటికి నడిచాడు ప్రవీణ్.
ప్రవీణ్ బిల్లింగ్ కౌంటరు దగ్గరికెళ్లి ఇన్సూరెన్స్ పోగా కట్టాల్సిన డబ్బు వివరాలు అడిగాడు.

          “బిల్లు సెటిలైపోయింది సార్, ‘ఆనంద్ అని పేషంట్ అన్నయ్య’ట, ఆయన మిగిలిన డబ్బు కట్టేసాడు. మేము అన్నీ ఫైనల్ చేసి డిస్చార్జి వింగుకి పంపేసాము. అక్కడేకెళ్లి పేపర్సు తీసుకోండి” అన్నాడు కౌంటరులో ఉన్నతను కంప్యూటర్లో చూస్తూ.
“అలాగా!” ఆశ్చర్యపోతూ అన్నాడు ప్రవీణ్. ఈ వారం రోజుల్లో మామయ్యలో నిశ్శబ్దంగా అంత మార్పెలా వచ్చిందో అతనికి బోధపడలేదు.

          సాయంత్రం గౌతం కారులో శారద కుటుంబం ఆనంద్ ఇల్లుచేరగానే వరుణ్ వచ్చి సామానుదించి గదిలో పెట్టాడు. ఈసారి గది, బాత్రూమూ నీట్ గా, ఫ్రెష్ గా ఉన్నాయి. కిటికీతెరలు, దుప్పట్లు మార్చబడ్డాయి. గదిలో అదనంగా కొత్తగాకొన్న మడతమంచం, పరుపు, ఉతికిన టవళ్లు, ఆపిల్ పళ్లు, కాచిననీళ్లు పెట్టివున్నాయి. సామాన్లు పెట్టుకోవ డానికి కబ్బోర్డులు ఖాళీ చేయబడి శుభ్రంగా ఉన్నాయి. అంతేకాదు ఆనంద్, శారద కాలేజిరోజుల్లో తల్లిదండ్రులతో తీయించుకున్న ఫోటో, ఇంకా అన్నాచెల్లెళ్లిద్దరి చిన్నప్పటి ఫొటో బల్లమీద వెలిసాయి.

          ప్రవీణ్ ఇవన్నీ చూసి మరింతగా ఆశ్చర్యపోయాడు, శారద మృదులవైపు చూసి చిన్నగా నవ్వింది. రాత్రి భోజనాలు అందరూ కలసి చేసారు. తేలికపడ్డ వాతావరణంలో కాస్త ఫ్రీగా మాట్లాడుకున్నట్టు అనిపించింది అందరికీ. ప్రవీణ్ తెల్లవార్ఝామున్నే లేచి తమవూరు వెళ్లిపోయాడు. వెళ్లేముందు ‘తరచుగా ఫోన్ చేస్తూంటానని, ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా గౌతం వచ్చి తీసుకెళ్తాడని’ భరోసా ఇచ్చి వెళ్లాడు. శారద నవ్వి ఊరుకుంది.

          నాలుగురోజుల తర్వాత ప్రవీణ్ వచ్చాడు. ఆవారమంతా బాగా గడిచిందని, తేడాలు రాకముందు ఎలావుండేవారో అలావున్నారని మృదుల చెప్పింది. ఈసారి శారదను చెకప్ కి తీసుకెళ్లినప్పుడు ఆనంద్ కూడా వచ్చాడు. అక్కడ డాక్టర్లు అంతా బావుందని, నెల వరకూ రానక్కరలేదని చెప్పారు.

          ఇంటికొచ్చాక తమవూరు వెళ్లేందుకు గదిలో సామాన్లు సర్దుకుంటూండగా ఆనంద్ వచ్చి శారదని ఈసారొచ్చినప్పుడు పదిరోజులుండి వెళ్లమన్నాడు. మాట్లాడుకునేప్పుడు పూర్వం వాళ్లమధ్య ఉండిన ఆప్యాయత మళ్లీ కనిపించింది ప్రవీణ్ కి.

          “ప్రవీణ్ ఫ్రెండ్స్ చాలా సాయం చేసారు. వాళ్లదగ్గర ఉండమని అడుగుతున్నారు. ఈసారి రెండ్రోజులేగదా ఉండేది. గౌతం ఇంటికెళ్తాం” అంది శారద.

          “పోనీ ఆతర్వాత పండగకి ముగ్గురూవచ్చి నాల్రోజులుండి వెళ్లండి. నందిని పిల్లల తో వస్తోంది, అందరం సరదాగా గడుపుదాం” అన్నాడు ఆనంద్.

          “తప్పకుండా వస్తాం. మీరూ మావూరు రండి, చూడాల్సిన ప్రదేశాలున్నాయి. నీమేనల్లుడికి తొందర్లోనే బదిలీ అవచ్చు” చెప్పింది శారద.

          ట్యాక్సి నగరాన్ని వదిలేసి వెళ్తున్నప్పుడు “అమ్మా ఈ పదిరోజుల్లో నువ్వూ మామయ్యా మీ మధ్యవుండిన అభిప్రాయభేదాల గురించి మాట్లాడుకుని పరిష్కరించు కున్నట్టు లేదే. ఈ సామరస్యం ఎలా వచ్చింది?” అనడిగాడు ప్రవీణ్.

          “కమ్యూనికేషన్ అంటే కేవలం మాటలే కాదు. మాది అభిప్రాయాలు కలవడంతో ఏర్పడిన స్నేహబంధం కాదు. పుట్టుకతోనే వచ్చిన జన్యుబంధం. మాటపట్టింపుల కంటే లోతైంది. ఒకరు అహం చంపుకున్నా చాలు, రెండోవాళ్ళకి మాటలకందని భావాలు తెలుస్తాయి, లోపలి ప్రేమ, అభిమానం అవే పైకొస్తాయి. ముఖ్యంగా కష్టసమయాల్లో తేడాలు కరిగిపోయి బాధ్యతలు ముందుకొస్తాయి. అలాంటి బంధాలు ప్రకృతిలో భాగం. అందుకే శ్రమపడైనా నిలుపుకోవాలి. మనం అన్నిటికీ సిద్ధపడి మామయ్య ఇంటికి వెళ్లడమే నావైపు నుంచి మొదటి అడుగు. నీకీవూళ్ళో మంచి ఫ్రెండ్స్ ఉన్నారని అన్నయ్యకు తెలియదనుకుంటున్నవా?” అంది శారద చిన్నగా నవ్వి.

          “తమరు కోపంలో నా మీద అరచినప్పుడు నేను మౌనంగా ఉంటే ఆ తర్వాత తమరన్నీ మర్చిపోయి మామూలుగా ఐపోతారు చూడండి, అలాగన్నమాట” అంది మృదుల ప్రవీణ్ తో సరదాగా. అందరూ పెద్దగా నవ్వేసారు. కారు సాఫీరోడ్డులో వేగంగా ముందుకు సాగింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.